శ్రీ గజనన విజయం

నాల్గవ అధ్యాయం click for pdf

శ్రీ గణేశాయ నమః, 'హే సర్వసాక్షి సర్వేశ్వరా ! నీలకంఠ గంగాధరా ! మహాకాల త్ర్యంబకేశ్వరా ! శ్రీ ఓంకారా! త్వరగా దయజూడు. నీవూ రుక్మిణిశుడూ అభిన్నులు, నీటిని జలము, తోయము అని పిలిస్తే దాని గుణధర్మంలో మార్పేమీ వుండదు కదా! అలానే మీరిద్దరూ ఒక్కటే. తమ తమ మనోవృత్తుల్ని బట్టి తమ ఆరాధ్యదైవాన్ని ఎన్నుకొని భక్తుడు భక్తిచేస్తాడు. అన్యథా శరణం నాస్తి' అన్నప్పుడు మీరు వానిపై కృపచేస్తారు. తల్లి. తన పాపడిమీద కినుక వహించదు. మరి నేను మీ అబోధ బాల కుణ్ణేకదా! నాపై దయజూడు. మీరు సాక్షాత్తు కల్పతరువు కల్పతరువు ప్రతివారి అభీష్టాన్ని తీరుస్తుంది. బంకట్ లాల్ ఇంటవున్నప్పుడీ అద్భుత సంఘటన జరిగింది. వైశాఖ శుద్ధతిధి అక్షయ తృతీయనాడు సీతరులకు శ్రద్ధతో -ఉదకకుంభం సమర్పించే అలవాటు 'వర్హాడా' ప్రాంతంలో ఈరోజును అతిపవిత్రంగా నమ్ముతారు. ప్రజలు యీ రోజున పండుగ చేసుకుంటారు. ఆరోజేమైందో అలకించండి. స్వామి బంకట్ లాల్ ఇంటిముందు పిల్లలతో ముచ్చటిస్తున్నారు. ఆకస్మాత్తుగా వాళ్ళకు ఒక 'లీల' ను చూపిద్దామనే కోరిక కలిగింది. వారు హుక్కాలో పొగాకు వేసి నిప్పంటించమని పిల్లలతో అన్నారు. ప్రొద్దుటినుంచీ హుక్కా త్రాగలేదు. అందుచే ఎలాగోవుంది చిలం నింపండి' అన్నారు. పిల్లలు స్వామి ఆజ్ఞనెలా తిరస్కరిస్తారు? ఆనందంగా వాళ్ళంతా 'చిలం' నింపే ప్రయత్నం చేస్తున్నారు. 'చిలం' ఐతే నింపారు. కాని నిప్పులేకుండా ఎలా అంటుకుంటుంది? ఇంట్లోకి వెళ్ళి చూస్తే నిప్పు ఇంకా రాజుకోలేదు. 'చిలం' అంటించటానికి నిప్పు కావాలి. ఎలా ఇప్పుడు" అని చింతించ సాగారు పిల్లలు. చింతితులైన పిల్లల్ని చూసి బంకట్ లాల్ అరే! నిప్పుకోసం ఎందుకలా కంగారు పడుతున్నారు? మనవీధిలో కంసాలి జానకీరాం వున్నాడు కదా. అతని ఇంటి దగ్గర్నుంచి తీసుకురండి" అన్నాడు. కంసాలి కుంపటి (బాగేసరీ)లో నిప్పు పడందే వాడి పని ప్రారంభంకాదు.కుంపట్లో అంటుకున్న నిప్పుకు నమస్కరించిన తర్వాతనే అతనిరోజు ప్రారంభమౌతుంది. ఇది వింటూనే పిల్లలు జానకీరాం ఇంటికి పరిగెత్తి కొంచెం నిప్పివ్వమని ప్రార్ధించారు. నిప్పుమాట వింటూనే జానకీరాం మండిపడ్డాడు. అక్షయ తృతీయా శుభదినం వాడెవరికి నిప్పు ఇవ్వను అన్నాడు. అది విన్న పిల్లలు చేతులు జోడించి నిప్పుస్వామి వారి 'చిలం' లో వేయటానికి కావాలన్నారు. స్వామిదేవోత్తములని మీకుతెలుసుకదా! వారికోసమే నిప్పు కావాలి. సాధువులు, యోగులూ కోరింది ఇచ్చుకుంటే ఆనాడు ఎంత ఆశుభదినమైనా మంగళప్రదమౌతుంది. వ్యావహారికంలో వున్న మాటలు మాకు చెప్పకు మేము నీకంటే చాలా చిన్నవాళ్ళం. మీరు మాకంటే పెద్దలై వుండి కూడ ఈ విషయం అర్ధం చేసుకోరేం? మీరిచ్చే నిప్పుతో స్వామి చిలం వెలిగిస్తే స్వామి ప్రసన్నులౌతారు. దాంతో మీ ధనధాన్యాలు వృద్ధిచెందుతాయి. ఇంత విన్నాకూడా జానకీరాం ఏమాత్రం తనపట్టు విడవలేదు. అవహేళనగా మాట్లాడసాగాడు. మతిభ్రష్టుడు నీటిలో మునిగిపోయే టప్పుడు లోతుకే పోతాడని ఎవరో అన్నారు మరి. మీ గజాననుని గొప్పతనం నాకు తెలుసు. ఎప్పుడూ చిలం' త్రాగేవాణ్ణి సాధువంటారేం?
వాడెప్పుడూ పొగాకు, గంజాయి త్రాగుతుంటాడు. గుడ్డలిప్పుకొని తిరుగుతాడు. వెఱ్ఱి వేషాలు వేస్తుంటాడు. మురికినీళ్ళు త్రాగుతాడు. వాడికి జాతీ గీతీ ఏమీలేదు. అలాంటి పిచ్చివాణ్ణి నేనసలు సాధువుగా ఒప్పుకోను. బంకట్ లాల్ ఒక మూర్ఖుడు కాబట్టి వాడుచేసే భజనలు చేస్తుంటాడు. నేనేమైనాసరే వాడి 'చిలం' కోసం నిప్పు ఇవ్వనే ఇవ్వను. ఆరే! తాను సాక్షాత్కారపురుషుడైతే వాడికి నిప్పు తేవలసిన అవుసరమేముంది? తన దైవ శక్తివల్ల నిప్పును పుట్టించలేడూ? జలంధరస్వామి కూడా 'చిలం' త్రాగేవాడు. ఐనా నిప్పుకోసం ఇంటింటికి ఆడుక్కునేవాడు కాదు.
కాబట్టి మీరు తిరిగి పొండి, నానుండి మీకు నిప్పురవ్వ కూడా దొరకదుగాక దొరకదు. నాదృష్టిలో ఆపిచ్చివాడికేమీ విలువలేదు అన్నాడు. పాపం! పిల్లలు ఖాళీ చేతులతో తిరిగివచ్చి జరిగిందంతా స్వామికి వివరించారు. స్వామి ఒక మందహాసం చేశారు. ఇప్పుడు నిప్పు అక్కర్లేదన్నారు. తర్వాత 'చిలం'ని తన చేతిలోకి తీసుకొని బంకట్ లాల్ ని ఒక పుల్లను దానిపై వుంచమని సంజ్ఞ చేశారు. "కొంచెం ఆగండి నిప్పుపుల్లతో నిప్పంటిస్తాను" అన్నాడు బంకట్ లాల్ అలా చేయక్కరలేదన్నారు స్వామి. నేచెప్పిందే చెయ్యి అన్నారు. స్వామి ఆజ్ఞను శిరసావహించాడు బంకట్ లాల్ ఆశ్చర్యంగా అగ్గి పుల్ల సాయం లేకుండానే వైశ్వానరుడు ప్రకటమయ్యాడు. స్వామి 'చిలం' పనిపూర్తయింది. ఇదంతా స్వామి వారి శక్తిని ప్రకటింపచేసే పనే. పుల్ల ఎలావున్న దలానే వుంది కానీ 'చిలం' మాత్రం అంటుకుంది. అసలైన సాధుత్వానికి బయటి భౌతిక వస్తువులు అనవసరం. స్వామి చూపిన యీచమత్కారమే సాధుత్వం అంటాం. ఈ సాధువు సామాన్యుడూ కాదు. పాఖండుడూ కాదు మరి! ఇక్కడ కంసాలి ఇంటిలో అనర్ధం జరిగింది. అక్షయ తృతీయ రోజున 'చించవణి' అనే పదార్థాన్ని చింతపండు, బెల్లం మొదలైన వాటితో తయారు చేస్తారు. ఉగాదినాడు వేపాకు, వేపపువ్వులకు ఎంత ప్రాధాన్యమో అలాగే అక్షయ తృతీయనాడు యీ 'చించవణికి' కూడా అలాటి ప్రాధాన్యంవుంది జానకీరాం ఇంట్లో ఆనాడు చించవణి తయారైంది. భోజనాలకు చాలామందిని పిలిచారు. అంతా భోజనాలకు కూర్చున్నారు. అన్నింటితోపాటూ ఆకుదొన్నెలో చించవణిని వడ్డించారు. ఆదొన్నె నిండా వందల కొద్దీ పురుగులున్నట్లు అంతా చూశారు. దాంతో అందరికీ అసహ్యం వేసి భోజనాలు విడిచి పెట్టి అంతా వెళ్ళి పోయారు. ఇలా ఎందుకైందో అర్ధంకాక జానకీరాం విచారిస్తూ తలదించుకొని కూర్చున్నాడు.చించవణి పాడైన కారణంగా మొత్తం భోజనాలు పాడైనాయి. దీనికి కారణం తానే అని తెలుసుకోవటానికి అట్టేసేపు పట్టలేదు. నేను సాధువుకు అగ్ని ఇవ్వకపోగా నానామాటలూ అన్నాను. దాని ఫలితాన్ని చూస్తున్నాను. ఇది నిశ్చయంగా శ్రీగజానన స్వామి 'లీలయే' ఐవుంటుంది. గజాననులు జాహ్నవి జలమువంటి వారు. కానీ నేను మురికినీళ్లనుకున్నాను. ఆయన రాజరాజేశ్వరులు. కానీ నేను వారిని బిచ్చగాడనుకున్నాను. చింతామణివంటి గజాననులను గాజు ముక్కనుకున్నాను. కైవల్యపదాన్నిచ్చే గజానన మహారాజును దొంగ సాధువనుకున్నాను. నాదౌర్భాగ్యమే నన్నిడ్చి కొట్టింది. స్వామికి సేవచేసే మహద్భాగ్యం లభించినా నాదురదృష్టంవల్ల పోగొట్టుకోవల్సి వచ్చింది. నాయీ పశుతుల్య జీవితం మీద అసహ్యం వేస్తోంది. పుట్టి భూమికి భారంగావున్న నేను ద్విపాద పశువుగానే రుజువయ్యాను నేడు తనంతన తానై నడిచివచ్చిన నాభాగ్యదేవతని బుద్ధిభ్రష్టుడనై తిట్టి తిరగగొట్టాను. నా అదృష్టం పండే అవకాశం వచ్చినపుడు నేనసలు అటు చూడనేలేదు. అయిందేదో అయిపోయింది. నేను స్వామిని చేరి, వారి కాళ్ళు పట్టుకొని మనస్ఫూర్తిగా క్షమాయాచన చేస్తాను. అని ఆలోచించుకొని జానకీరాం 'చించవణిని' తీసుకొని బంకట్ లాల్ ఇంటికి వెళ్ళి జరిగినదంతా సవిస్తరంగా చెప్పి తనకు నేడు పెద్ద దెబ్బ తగిలిందన్నాడు. ఈ 'చించవణి' లో పురుగులు పడటంతో అందరూ భోజనం చేయకుండా వెళ్ళి పోయారు. ఆకారణంగా పితరులకు అన్నార్పణం కాక శ్రాద్ధకర్మకు ఆఘాతం కలిగింది. అసలు ఆదుర్ఘటనకు కారణం నేనే. ఈ రోజు ఉదయం స్వామి 'చిలం' కోసం నిప్పు అడిగారు. కానీ నేనివ్వలేదు. నేనివ్వనన్న దానికి ఫలితం ఇది. అంతా విన్న బంకట్ లాల్ 'చింతపండు మంచిది కాదేమో', అన్నాడు. అలాంటి అనుమానం ఏమీలేదు లెండి. చింతపండు క్రొత్తదే, దాన్ని మీరుకూడా చూడవచ్చు. సేఠ్ జీ! నాదొకటే ప్రార్ధన, నన్ను స్వామి దగ్గరకు తీసుకువెళ్ళండి. నేను వారిని మనస్పూర్తిగా క్షమించమని వేడుకుంటాను. సాధువులు దయాసాగరులు కదా! చివరికి భయపడుతూ జానకీరాం స్వామి దగ్గర చేరి క్రిందపడి దొర్లుతూ దుఃఖిస్తూ హే! దయాఘనా నన్ను దయతలచండి. మీ యెడల నేప్రవర్తించిన రీతికి సిగ్గుపడి క్షమాయాచన చేస్తున్నాను. తమరు స్వయంగా ఉమానాథులే శేగాంవ్ లో వేంచేసి వున్నప్పటికీ నాదౌర్భాగ్యంవల్ల మీ మహిమనూ, మిమ్ములనూ తెలుసుకోలేక పోయాను. మీదయా, ఆశీర్వాద రూపమైన అగ్నిలో నా ఆపరాధరూపమైన గడ్డిపోచను కాల్చి పారెయ్యండి స్వామీ! నేటి నుండి మిమ్మల్ని దూషణ చేయను.నా పాపకర్మకు మీరు వేసిన శిక్షచాలు మీరు అనాదనాధులు, నన్ను చూచి ముఖం త్రిప్పుకోకండి అన్నాడు. అబద్ధం ఆడకు చించవణి ఏమాత్రం పాడవలేదు. నువ్వు బాగా చూడు, అన్నారు. గజాననులు, జానకిరాం, అక్కడున్న సజ్జనులూ అందరూ చూడగా చించవణిలో ఏ మాత్రం లోపం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. స్వామి చూపిన యీ చమత్కార విషయం క్షణంలో నలుదెసలా పాకిపోయింది.కస్తూరి యొక్క సుగంధం దాచినా దాగదు కదా!
'చందుముకన్' అనే ఒక సజ్జనుడు శేగాంవ్ కాపురస్తుడూ స్వామి వారికి ప్రియభక్తుడు శ్రోతలారా! అతని కథ నోకదానిని వినండి. జ్యేష్ఠమాసంలో స్వామివారి కిరువైపులా భక్తులు చేతులు జోడించి వారి చరణారవిందాలవైపు చూస్తూ కూర్చున్నారు. భక్తులలో కొందరు మామిడి పండును కోసి స్వామికి ఇచ్చేవారు. కొందరు వీవనలు వీచేవాళ్ళు. కొందరు యితరులకు ప్రసాదం పంచేవారు. కొందరు స్వామి మెళ్ళో హారాలు వేస్తే, మరి కొందరు స్వామి శరీరానికి చందనలేపనం చేసేవారు. ఇంతలో మామిడి పండు తనకొద్దని స్వామి చందూతో అని, అక్షయ తృతీయనాడు చేసి దాచి పెట్టిన రెండు 'కజ్జికాయలూ' (గుఝియా) తెచ్చి పెట్టమని అడిగారు. ఈ విషయం చందూకి తెలియనే తెలీదు! అందుచేత 'స్వామీ! ఆ 'కజ్జికాయలు' యిప్పుడెలా సమర్పించేది? తమరు అనుజ్ఞ యిచ్చినట్లయితే తాజాగా తయారు చేయించి తెస్తాను' అన్నాడు చందూ. 'నాకు తాజావి అక్కరలేదు. ఆ కుండలో దాచిపెట్టినవే కావాలి. గురువు ఎదుట అబద్ధం చెప్పకూడదు! ఇంకేమీ మాట్లాడక, పోయి అవి తీసుకొచ్చి ఇవ్వు! అన్నారు. అక్కడున్న భక్తులు కూడా స్వామి చేసిన సంకేతంలో ఏదో రహస్యం యిమిడి వుంటుందన్నారు. చందూ ఇంటికి వెళ్ళి కుండలో దాచివుంచిన కజ్జి కాయలే స్వామి కావాలన్నారని చెప్పాడు. కజ్జికాయలు చేసి ఒక నెలదాటిపోయింది. ఇప్పుడవి ఎక్కణ్ణుంచి తీసుకురాను? స్వామీ, అక్షయ తృతీయ నాడు వాటిని చేశాను. అవి ఆనాడే అయిపోయాయి. మీరు కావాలంటే యిప్పుడు స్వామి కోసం తయారు చేసిస్తాను. చూడండి మూకుడు పోయ్యి మీదే వుంది! ఇంట్లో కావలసిన వన్నీ వున్నాయి. మీరో క్షణం ఆగండి ! అంది అతని భార్య. భార్య మాటల్ని మధ్యలోనే ఆపుచేస్తూ ఇప్పుడు చేసేవి స్వామికి అక్కర్లేదట! లోపల కుండల్లో దాచిన కజ్జికాయలే కావాలట! జ్ఞాపకం చేసుకో ఎక్కడన్నా దాచావేమో! అన్నాడు. పతి మాటలు విన్న భార్య ఒక్క క్షణం ఆలోచిస్తూ వుండి పోయింది. "స్వామి చెప్పిన దాంట్లో నిజం వుండవచ్చు' అంది.భర్తతో ఆమె కుండలు వెతకసాగింది. ఒక కుండలో నిజంగానే రెండు కజ్జి కాయలు కనిపించాయి! -"నే నందులో వుంచి వాటి విషయమే మరచిపోయాను అంది పతిని చూస్తూ. కజ్జి కాయలు నెల క్రితం చేసినదైనా ఇవ్వుడు తినే యోగ్యంగానే వున్నాయి! సిద్ధయోగుల వచనాలు అసత్యాలు కావుమరి కజ్జికాయల్ని చూసిన భార్యాభర్తలు ఆనందభరితులై గజాననులకు మనస్సులోనే ప్రణమిల్లారు! మహాసమర్ధులు సిద్ధయోగులకు జయమగుగాక! అనుకున్నారు!

చందూ ఆ కజ్జికాయల్ని తీసుకొని స్వామి దగ్గరకు పరిగెత్తి వాటిని సమర్పించాడు. స్వామి వచనాలు నిజమవటం చూసిన అక్కడున్న సజ్జనులంతా ఆశ్చర్య చకితులయ్యారు! శ్రీ గజానన మహానుభావులు నిజంగా త్రికాలజ్ఞులే! కూర్చున్నచోటు నుండే భూత భవిష్యద్వర్తమాన కాలాలను తెలుసుకోగలిగిన సమర్థులు!" అని అనుకోసాగారు. శబరి యిచ్చిన పండ్లను శ్రీరాముడు ఎంతో ఆనందంగా భుజించాడు. అలానే చందూ సమర్పించిన కజ్జికాయలను స్వామి స్వీకరించారు.

శేగాంవ్ కి దక్షిణంగా 'చించావ' అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతని పేరు మాధవుడు. అతని వయస్సు అరవై సంవత్సరాలకు పైబడే వుంటుంది. శరీరం అంతా క్షీణించిపోయింది. యవ్వనంలో అతనికి తన కుటుంబమే సర్వస్వంగా వుండేది. కాలగతి ముందు అంతా తలవంచాల్సిందే! విధాత వ్రాసిన విధి విదాన్నాననుసరించి అంతా తమ జీవితాల్ని వెళ్ళ తీసుకోవలసిందే! విధి లిఖించినట్టు కాంతా పుత్రులు మరణించారు. మాధవుడు ఒంటిగాడయ్యాడు! దీంతో వచ్చిన వైరాగ్యాన్ని స్మశాన వైరాగ్యం అంటారు. ఇంట్లో వున్న వన్నీ అమ్మి కొన్నాళ్లు గడిపాడు. ఇక గతిలేక భగవంతుణ్ణి ప్రార్ధించసాగాడు. 'హే ప్రభూ! నేనే కావాలి ? ప్రపంచాన్నే పరమార్ధంగా తలచి అది పోగొట్టుకున్నాను. హేదీనబంధూ ! నెనెప్పుడూ ఒక్క క్షణం కూడా తలచలేదు. ఇప్పుడు నాకు దిక్కేది? నువ్వు తప్ప నాకెవరూ లేరు! నాయీ అరణ్యరోదనం నువ్వు తప్ప ఎవరు వింటారు? అని ప్రార్ధిస్తూ చివరికి వికల మనస్కుడై శేగాంవ్ వచ్చి స్వామి కాళ్లు పట్టుకొని మొండిగా కూర్చున్నాడు. మాధవుడు అన్నపానాదులు మాని భగవంతుని నామ స్మరణం అదే పనిగా అఖండంగా చేయసాగాడు. ఇలా ఒక రోజు గడిచింది కానీ ఆ చోట నుండి లేవలేదు! అతని మొండి పట్టు చూసి 'ఇలా మొండిగా వుండటం మంచిది కాదు. ఇప్పటి వరకూ గుర్తురాని దేవుణ్ణి ఇప్పుడు ప్రార్ధిస్తున్నావా? ప్రాణం పోయేముందు వైద్యుణ్ణి పిలిచినందువల్ల ఏం లాభం? ఇది యౌవనంలో బ్రహ్మచారిగా వుండి ముసలివాడైన తర్వాత పెండ్లి చేసుకొని శారీరకసుఖం పొందినట్లుంది. కానీ జీవితంలో ప్రతి పని తగిన సమయంలోనే చేయాలి. ఇప్పుడివాళ ఇంటికి నిప్పంటుకుంటే నుయ్యి త్రవ్వటానికి వెడుతున్నావు? ఏ దారాపుత్రులకైతే నీ సర్వస్వం వెచ్చించావో వాళ్ళు నిన్నొదిలి పోతే పాయారు. క్షణ భంగురమూ వినాశమయ్యేదానిని కౌగిలించుకొని, శాశ్వతమైనదాన్ని చూడనేలేదు! ఇప్పుడిదంతా నిరర్ధకం. నీకర్మ ఫలాన్ని నువ్వనుభవించక తప్పదు. లేకుంటే నీకు ముక్తిలేదు! అందుకని మొండిపట్టు వదలి వివేకం తెచ్చుకోవటం నేర్చుకో అని స్వామి చెప్పినా అతడే మాత్రం చలించలేదు. అక్కడున్నవారే కాక ఆవూరి కరణంగారు భోజనం చెయ్యమని ప్రార్ధించినా వినక స్వామి దగ్గరే భగవన్నామ స్మరణ చేస్తూ కూర్చున్నాడు. అర్ధ రాత్రి దాటిపోయింది. గాఢాంధకారంలో అంతా నిశ్శబ్దం అలుముకుంది. దగ్గరలో ఎవరూలేరని తెలుసుకొని స్వామి తన 'వల' ను చూపించారు. స్వామి యమునిలా భయంకర రూపాన్ని దాల్చి, గర్జిస్తూ మాధవునిపై బడ్డారు. సాక్షాత్తు యముడే తనని తీసుకుపోవటానికి వచ్చాడని భయపడ్డాడు మాధవుడు. నోటి వెంట ఒక్క మాట కూడా పెగల్లేదు! లేచి పారిపోసాగాడు. వాడి పరిస్థితి చూసి స్వామి సౌమ్యరూపాన్ని ధరించి వానితో ఏరా? యిదేనా నీ ధైర్యం ! నువ్వేం చేసినా కాలపురుషుడు నిన్ను మ్రింగక మానడు! కాబోయే దేమిటో కొద్దిగా నీకు చూపాను. యమలోకం నుంచి ఎలా తప్పించుకు తిరుగుతావు? అన్నారు.

మాధవుడు వినమ్రుడై మహారాజ్ చాలు. ఇక యమలోకం సంగతి చెప్పకండి! నన్ను యమలోకానికి కాక వైకుంఠానికి పంపండని చివరి సారిగా అర్ధిస్తున్నాను. యమలోకంలో ఏం జరగబోతుందో మీరు కాస్త రుచి చూపించారు. నేను పసిగట్టాను. నేను మహా పాపిని, నాపాపాల్ని మీరే క్షాళనం చెయ్యగలరు. నా పూర్వ జన్మ సుకృతం వల్ల మీపాద పద్మాలను చేరుకునే భాగ్యం కలిగింది. యోగుల సహవాసం, సేవ చేసే భాగ్యం ఎవరికి కలుగుతుందో వారు యమలోకానికి పోరు! అని ప్రార్ధించాడు. హృదయాంతర్గతం నుంచి వచ్చిన మాధవుని మాటలు విని స్వామి మందహాసం చేశారు. మహాపాతకులను సిద్ధయోగులూ, సాధువులే పాపవిముక్తుల్ని చేసి పావనం చేస్తారు! స్వామి వానిని శ్రీమన్నారాయణ, నారాయణ, అనే ప్రభుమంత్రాన్ని జపించమన్నారు. నీకు మృత్యువు దగ్గర పడింది. ఇప్పుడు జాగ్రత్తగా వుండు. ఇంకా కొంత కాలం జీవించ తలిస్తే చెప్పు దాని ఏర్పాటు కూడా చేస్తాను. ఏ మంటావు? అన్నారు.మాధవుడు వినమ్రుడై 'స్వామీ! నా కింకా ఆయుర్దాయం వద్దు! ఈ ప్రాపంచిక మాయ చాలా చెడ్డది. ఇక మాయామోహంలో పడదలచుకోలేదు అన్నాడు. మహారాజ్ తథాస్తు' అని అతని శిరస్సున తమ చేతినుంచి "నీ కోరికను నే మన్నిస్తున్నాను. ఇక నీవు జనన మరణాల నుంచి ముక్తుడవౌతావు' అని దీవించారు. ఈ రహస్య సంభాషణ వారిద్దరి మధ్యనే జరింగింది. కాబట్టి దీనిని వర్ణించటానికి నేనసమర్ధుణ్ణి. అదే సమయంలో మాధవుడు మరణించాడు. అసలు విషయం తెలియని వారు మాధవుని మృత్యుకారణాన్ని తమ తమ బుద్ధిని బట్టి అంచనా వేయసాగారు. అది వర్ణించటం వ్యర్ధం కూడా. మాధవుని మృత్యువు సమర్ధ స్వామి సాన్నిధ్యంలో జరిగింది. గజానన మహారాజు యొక్క దయవలన అతనికి జనన మరణాల నుండి విముక్తి కలిగింది.

ఒక సారి స్వామి మనసులోని తమ కోరికను భక్తులకు వినిపించారు. వైదిక బ్రాహ్మణులచేత 'మంత్రజాగరణ' కార్యక్రమం నిర్వహించమన్నారు. మంత్రజాగరణం (వేదఘోష) వలన భగవంతుడు ప్రసన్నుడౌతాడు. తాంబూలం ప్రసాదంతో పాటుగా ఒకొక్క రూపాయి దక్షిణను ఘనాపారులైన (వేద విద్వాంసులైన) బ్రాహ్మణులకు ఇచ్చే ఏర్పాటు చెయ్యండి. ఇది విన్న భక్తులు శేగాంవ్ లో వేద పాఠకులు ఎక్కడున్నారు? మిగతావన్నీ ఏర్పాటౌతాయిగానీ? "అని తమ అసమర్థతను వెలిబుచ్చారు. 'అన్ని ఏర్పాట్లు చెయ్యండి ముందు వసంత పూజకోసం దేవుడు బ్రాహ్మణులని తానే పంపుతాడు అన్నారు స్వామి. స్వామి యొక్క యీ అభయ ప్రదానంతో ఆనందించి కావలసిన ఏర్పాట్లలో మునిగి పోయారు. ప్రజలు నూరురూపాయలు పోగుచేశారు. సామాన్లు తెచ్చారు. కేసర కలిపి 'గంధం' తయారు చేశారు. బ్రాహ్మణుల కోసం ఎదురు చూడసాగారు. మధ్యాహ్నానికి శాస్త్ర బద్ధంగా వేద ఋక్కులను చదవటంలో సిద్ధహస్తులైన బ్రాహ్మణులు శేగాంవ్ కి వచ్చారు. బ్రహ్మాండంగా 'వసంతపూజ' పూర్తయింది. వైదిక బ్రాహ్మణులు చాలా సంతోషించి ప్రసాదం, దక్షిణలు తీసుకొని మరోగ్రామానికి వెళ్ళి పోయారు. యోగుల మనో భీష్టాలను ఆ రమానాథుడు స్వయంగా తానే తీరుస్తాడు. ఎందుకంటే యోగుల ప్రభావం భగవంతునిపైన అలానే వుంటుంది మరి! 'వసంత పూజావ్రతం, బంకట్ లాల్ ఇంట్లో ఆనాడు ప్రారంభమైంది. అతని పుత్రులు,పౌత్రులు నేటి వరకు ఆచారంగా పాటిస్తునే వున్నారు.ఈ 'దాసగణు' విరచిత మైన శ్రీ గజనన విజయమనే గ్రంథం సాధకుని హరిభక్తికై ప్రేరేపించును గాక.....

"శ్రీహరి హరార్పణ మస్తు "

"శుభం భవతు"

"ఇది చతుర్దాధ్యాయము సమాప్తము" 

యే మనుష్యః మాం ఆశ్రతః!
తాన్ సర్వేస్యః కర్మ వినాశనః

అయిదవ అధ్యాయము