సర్వం శ్రీసాయి

శ్రీ గజనన విజయం - ఐదవ అధ్యాయం click here for pdf

 శ్రీ గణేశాయ నమః. 'హే అజా! అజితా! అద్వయా! సచ్చిదానంద కరుణాలయా! శరణాగతుడైన 'దాసగణూ'కు అభయమివ్వబడి! హే ప్రభో! నేను హీనుణ్ణి, దీనుణ్ణి కాకుండా పాతకుడను కూడా! నా కెట్టి అధికారమూ లేదు. పరిస్థితులు ప్రతికూలించటం వలన ఏమీ చేయలేనివాడను, హీన దీనులపైనే మీ కృపాహస్తము ఎల్లప్పుడూ అభయ ప్రదానం చేస్తుంది. శంకర భగవానుడు తన శరీరంనిండా విభూతి పులుముకున్నాడు. హీనులు లోటుపాటులు పెద్దల మానహానికి కారణాలు కావు. ఈ విషయాన్ని గుర్తించుకొని హే నారాయణా! దాసగణుని నీ దగ్గరుంచుకోవయ్యా! తల్లి పిల్లవాని ప్రతికోరికను తీరుస్తుంది. దాసగణుని భారం నీ భుజస్కంధాలపైనే వుంది. మీరేంచేసినా సరే కానీ అతణ్ణి చూసి ముఖం త్రిప్పుకోకండి! మీ ఆసరా చూచుకొనే దాసగణూ గంతు చేస్తున్నాడు.

శేగాంవ్ లో శ్రీ స్వామి దర్శనార్ధం బంకట్ లాల్ ఇంటిదగ్గర వేలకొద్దీ జనం పోగవుతున్నారు. అది అవర్ణనీయం. ఈ పరిస్థితినుండి తప్పుకోవటానికై స్వామి అడవిలో తిరగనాంరంభించారు. ఒక నెలంతా పూర్తిగా అడవిలో వుండేవారు. ఆయనెక్కడుండేవారో ఎవ్వరికి తెలిసేది కాదు. ఎవరికీ చెప్పకుండా స్వామి పింపల గ్రామం వచ్చారు. అక్కడేమయిందో ఇప్పుడు వినండి పెంపలగ్రామం' పోలి మేరల్లోని అడవిలో ఒక ప్రాచీన శివాలయం వుంది. ఆ ఆలయంలోనికి శ్రీస్వామి ప్రవేశించి పద్మాసనంలో ధ్యాననిమగ్నులయ్యారు. ఆ వూరి పశువుల కాపర్లు సాయంత్రం వారి గోవుల్ని తోలుకుంటూ తిరిగి వూళ్ళోకి వస్తున్నారు. ఆలయం దగ్గర చిన్న కాలవలాటిది వుంది. గోవులకు నీరు పెట్టటానికి పశువుల కాపర్లు అక్కడికి వచ్చారు ఎవరో ఒక కాపరి ఆలయంలోని శంకరుల దర్శనం కోసం వెళ్ళి శ్రీస్వామిని అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. అతడితవరకూ ఆ ఆలయంలో ఏ క్రొత్తవ్యక్తిని చూడలేదు. లోపలున్నవారిని బయటవున్న తమ తోటివారిని లోపలికి పిలిచి స్వామి చుట్టూ చేరారు. స్వామి సమాధి అవస్థలో వుండటం వలన ఏమాత్రం విచలితు లవలేదు. వారేమీ మాట్లాడేవారు కాదు. కళ్ళు తెరిచేవారు. కాదు. దీని కారణం కాపరులకు తెలియలేదు. "స్వామి అలసిపోయారనుకుంటా! ఆకలేస్తుందేమో! అందుకే మాట్లాడే శక్తి లేదు" అన్నారెవరో. స్వామి ఆకలితో వున్నారనుకొని రొట్టె పెట్టసాగారు. స్వామి నోటి దగ్గరకు రొట్టెముక్కను తెచ్చి వారిని లేపటానికి ప్రయత్నించారు. ఇంత చేసినా స్వామి కళ్ళు తెరవనూ లేదు,మాట్లాడనూలేదు. దాంతో పశువుల కాపరులకు చాలా ఆశ్చర్యం కలిగింది. స్వామిని గురించి 'ఇదమిత్థంగా నిశ్చయించటం.... అసంభవం. ఎందుకంటే చనిపోయారేమో  ఊపిరి ఆడుతూనే వుంది పైగా కూర్చొని వున్నారాయె! శరీరం వేడిగానూ వుంది! అందుచేత వీరు బ్రతికే వున్నారనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇదేదైనా మాయావీభూతమేమో! అన్నారెవరో. 'శంకరుని ఆలయం లోకి భూతమెలా ప్రవేశించగలదు? అన్నారెవరో. దానికి జవాబుగా 'ఈయన దేవుడే. మన సద్భాగ్యంకొద్దీ ఇక్కడికొచ్చారు. అన్నారు మరెవరో, మనమంతా కలిసి వీరిని పూజిద్దాం. ఎవరో కాలువనుండి తెచ్చిన నీటితో స్వామి పాదాలు కడిగారు. ఇంకెవరో తెచ్చిన వనపుష్పాలతో మాల కట్టి వారి మెడలో చేశారు. మరెవరో ఒక ఆకులో ఒక రొట్టె, ఒక ఉల్లి పాయను వుంచి స్వామి ఎదుట ఉంచారు స్వామికి సాష్టాంగపడ్డారు. ఎదుట కూర్చొని సంకీర్తనం చేయసాగారు. ఈ విధంగా ఆనందోత్సాహాలతో భజనలు పాడుతూ సంకీర్తనంలో నిమగ్నులై పోయారు.

ఇంతలో ఒక కాపరి 'ఇంక సాయంత్రం అయింది కాబట్టి మనం యిళ్ళకు పోవాలి. సూర్యాస్తమయం అయిన ఆగోవుల్ని తీసుకొని రాకపోతే అంతా కంగారుపడతారు. మనల్ని వెతకటానికి అడవికి వస్తారు. గోవులకోసం ఆవుదూడలు కూడా ఎదురుచూస్తూ వుంటాయి.ఆత్రుతగా! స్వామిని గురించి మన ఇళ్ళల్లో చెపుదాం! ఏంచేయాలో వారే ఆలోచిస్తారు' అన్నాడు. ఈ మాటలు అందరికీ నచ్చాయి. అందరూ యిళ్ళకు వెళ్ళిపోయారు. ఇంటికి వస్తూనే స్వామి వృత్తాంతాన్నంతా చెప్పారు. ఇంటివాళ్ళతో తెల్లవారగానే గ్రామ ప్రజలంతా కాపరులతో బయలుదేరి స్వామి దర్శనార్ధం శివాలయానికి వచ్చారు. ఆలయంలోనికి వెళ్ళి చూస్తే స్వామిచారు నిన్నటిలాగానే కూర్చొని వున్నారు. సాయంత్రం గోపాలకులు పెట్టిన రొట్టె ఇప్పటికీ అలానే పడివుంది. శివాలయంలో కూర్చొనివున్నవాడు. నిజంగానే ఎవరో సిద్ధయోగి అయివుంటాడు' అన్నా డెవరో...  సాక్షాత్తూ శంకర భగవానుడే మనకు దర్శనమివ్వటానికిలా బయటకు వచ్చి కూర్చున్నాడు. వారి సమాధి వీడినప్పుడే ఏదైనా మాట్లాడవచ్చు. అంతవరకూ వారిని బాధించరాదు. బెంగాల్ లోని జాలంధరస్వామికూడా 12 సంవత్సరాలు సమాధిస్థితులై వుండిపోయారు అన్నారింకెవరో. చివరికి ఒక పల్లకిలో స్వామిని ఊళ్ళోకి తీసుకొని వెళ్ళటానికి నిశ్చయించారు. ఒక పల్లకి తెచ్చి స్వామిని అంత కలిసి ఎత్తి పల్లకీలో కూర్చోబెట్టి ఊళ్ళోకి తీసుకొని వెళ్ళసాగారు. గ్రామంలోని స్త్రీ పురుషులంతా ఆ పల్లకీతోనే వున్నారు. బాజాలు మ్రోగుతున్నాయి. 'శహనాయి' (సన్నాయిలాటిది) వాద్యం మ్రోగుతూవుంటే ప్రజల వుత్సాహానికి అంతులేకుండా ఎలావుందో అది వర్ణన చేయటం.....

చాలా కష్టం. స్త్రీ పురుషులు మధ్య మధ్యలో తులసి దళాలూ, బుక్కాగువాలు మొదలైనవి వేస్తూ వుండేవారు. 'గులాల్' వలన స్వామివారి శరీరం అంతా ఎర్ర బడింది. గంటలూ మొదలైనవి వాయించేవారు. 'జయజయ యోగిరాజ' అనే కీర్తన సాగుతోంది. వీటి ధ్వనులన్నీ ఆకాశాన్నంటి మారు మ్రోగసాగాయి. ఆ బ్రహ్మాండమైన ఊరేగింపు మారుతి మందిరాన్ని చేరింది. ఆంజనేయస్వామి కోవెలలో సగౌరవంగా మందిరంలోని ఒక పెద్ద పీటమీద స్వామిని కూర్చుండబెట్టారు. ఆ రోజు కూడా స్వామి సమాధి వీడలేదు. అప్పుడు వారంతా అన్న పానాలు మానేసి స్వామి సన్నిధిలోనే వారి స్తవనం చేద్దామనుకున్నారు. అలా చేద్దామనుకుంటూ వుండగనే స్వామి గజాననుల సమాధి వీగిపోయింది. శ్రీ సద్గురువులు యోగులకు మకుటమణి అయిన శ్రీ గజాననులు సామాన్య స్థితికి వచ్చారు.

 ఇంకేముంది! ప్రజలంతా సంతోషంతో గంతులేయ సాగారు. అమితానందంలో వాళ్ళు వెర్రివాళ్ళే. అయ్యారు. ప్రతి ఒక్కరూ స్వామి పాదాలు తాకి వారి ఆశీస్సులు కోరుకోసాగారు. స్వామికి నైవేద్యం సమర్పించటానికై ఒకరితో ఒకరు పోటీపడసాగారు. ప్రతి ఒక్కరూ పళ్ళెరంలో తమ అంతస్తుకొద్దీ పదార్థాలు వుంచుకొని ఆంజనేయస్వామి కోవెలవైపు పరిగెత్తసాగారు. స్వామి అన్ని పళ్ళాలనుండి కొద్దికొద్దిగా స్వీకరించి అందరి మనోభీష్టాన్ని పూర్తిచేశారు. ఇంటిలో వారంతా భక్తిశ్రద్ధలతో ప్రసాదం స్వీకరించి ధన్యులయ్యా మనుకున్నారు. ఈ మంగళప్రదమైన వార్త వాయువేగంతో నలుదిశలా వ్యాపించిపోయింది! ఆ తరువాతి మంగళవారం 'పింపల' గ్రామంనుంచి కొందరు 'శేగాంవ్' సంతకి వెళ్ళారు. మాటల సందర్భంలో వారు మా వూరికి కూడా ఒక వెర్రివానిలాంటి వాడొచ్చాడన్నారు. ఆయన సిద్ధుడులా వున్నారు. నిజంగా శ్రీహర వచ్చినట్లుగా వుంది. గ్రామంలో వారి పాదధూళిచేత మా గ్రామం ధన్యమైంది. ఆయన్ని మేమింక ఎక్కడికీ వెళ్ళనివ్వం, చేతికి దొరికిన ధనాన్నెనము జారవిడుస్తాడు? అన్నారు. 'శేగాంవ్' బజారులలో అంతా ఇదే విషయం పాకిపోయింది. ఇది బంకట్ లాల్ కు కూడా తెలిసింది. బంకట్ లాల్ తన భార్యతో బయలు దేరి పింపబగ్రామం చేరి స్వామి ఎదుట చేతులు జోడించి 'స్వామీ ! ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళి యీ వాటికి పదిహేను దినాలయింది. ఇప్పటికి మీ దర్శనం అయింది! స్వామీ! మీరు లేని కారణంగా మా ఇల్లేకాక శేగంవ్ అంతా చిన్నబోయింది. విచారంగా వుంది గ్రామం.తమకోసం బండి తెచ్చాను. ఓ జ్ఞానిరాజా! ఇక శేగాంవ్ తిరిగి పదండి. తల్లీ పిల్ల ఒకరినుండి ఒకరు విడిపోవటం మంచిదికాదు. ప్రతినిత్యం మీదర్శనం.......   చేసుకొనే భక్తులు శేగాంవ్ లో అన్నపానాదులు మానేశారు.తమరు శేగాంవ్ తిరిగి రాకపోయినట్లయితే నేను దేహత్యాగం చేయటానికి నిశ్చయించుకున్నాను. హే గురుదేవా! చివరికి మా ప్రార్ధన మీరుగాక ఎవరు ఆలకిస్తారు?' వినమ్రుడై ప్రార్ధించాడు. బంకట్ లాల్ నిశ్చయాన్ని వినిన శ్రీస్వామి శేగాంవ్ వేళ్లటానికి బండినెక్కారు. స్వామి వారిని శేగాంవ్ కు తీసుకొని వెళ్ళటానికి వచ్చిన బంకట్ లాల్  పెంపల గ్రామవాసులకు కృష్ణుని సఖుడైన ఆక్రూరునివంటి క్రూరుడుగా కనిపించాడు. స్వామి వెళ్ళిపోతున్నారని కోపగించిన ప్రజలకు బంకట్ లాల్ 'స్వామి శేగాంవ్ లోనే వుంటారు. మీరు దుఃఖించకండి. ఎప్పుడు కావాలంటే అప్పుడే దర్శనం చేసుకోవచ్చు. ఎక్కడుండే వస్తువు అక్కడుంటేనే బాగుంటుంది!' అని సముదాయించాడు. పింపల గ్రామస్థులు బంకట్ లాల్ షాపుకారు దగ్గర అప్పు తీసుకొనేవారు. అందుచేత అతని ముందేమీ మాట్లాడలేకపోయారు. బండినెక్కి వెడుతున్న స్వామీజీని చూస్తూవారేమీ చేయలేక పోయారు. బండిలో వెడుతూ వెడుతూ 'షాహుకార్ల పద్దతి నాకేం అర్ధంకాలే' దన్నారు. మీ ఇంటికి రావాలంటే నాకు భీతి కలుగుతోంది. ఎందుకంటే లోకమాత, మహాశక్తిసంపన్నురాలైన విష్ణు ధర్మపత్నియైన లక్ష్మీదేవినే నీ ఇంటిలో ఖైదుచేసి పెట్టావు! ఆమె స్థితినే అలా చేసినవాడిముందు నా గతి ఏమౌతుందో! అనే భయంతోనే నీ ఇంటినుంచి పారిపోయాను అన్నారు. అది విన్న బంకట్ లాల్ నవ్వుతూ. వినయంగా ఏమన్నాడో ఏకాగ్రచిత్తులై వినండి. 'స్వామీ! లక్ష్మినా యింట నివసించటానికి మరో కారణం కూడా కావచ్చును. మీ నివాసం నా ఇంటనే కదా! అందుచేతనే లక్ష్మి నా ఇంటనే వుంది! పాపడున్నచోట తల్లి వుండక తప్పదుకదా! నాలాటి సామాన్యుడు లక్ష్మినెలా బంధించగలడు? అని చివరికి తన మనసులోని మాట చెప్పాడు.

మహరాజ్ మీ ముందు నా ఆస్తంతా తృణప్రాయం. మీరే నా సర్వస్వమూను! కాబట్టి నాదంతా మీదే! నేనిప్పుడు. నిష్కించనుడను. మీరే నా యజమాని. నేను మీ సేవకుడను. ఇక మీ క్లిష్టమైనట్లు ముక్తసంచారం చేయండి! కానీ శేగాంవ్ మాత్రం ముఖ్యకేంద్రంగా వుండనీయండి! పగలు ఆవు అడవికి పోతుందే కానీ సాయంత్రం దాని దూడకోసం ఇంటికి తిరిగివస్తుందికదా? అలాగే మీరు లోకకళ్యాణంకోసం దేశంలో ఏమూలకైనా వెళ్ళండి. కానీ అప్పుడప్పుడూ శేగాంవ్ కి దయచేయమని మా ప్రార్ధన అన్నాడు. బంకట్ లాల్ వెంట స్వామి తిరిగి శేగాంవ్ కొచ్చారు. శేగాంవ్ లో కొన్నాళ్ళుండి మళ్ళీ ఎటో వెళ్ళిపోయాడు స్వామి. ఎక్కడికెళ్లారో చెప్తానిప్పుడు. వర్షాడ ప్రాంతంలో ఆడ్గాం అనే గ్రామం వుంది.

శేగాంవ్ వారితో చెప్పకుండా ఆ వూరికి బయలుదేరారు స్వామీజీ. స్వామి వాయువేగంతో వెడుతున్నారు. అంజనీ పుత్రుడు ఆంజనేయుడే మళ్ళీ అవతారం దాల్చాడా అన్నట్లు వుంది. అవి వైశాఖమాసంలోని రోజులు. మండుటెండలో ఆ చుట్టుపట్లంతా అట్టుడికిపోతోంది. సూర్యుడు. నడినెత్తిమీదికొచ్చేసరికి స్వామీజీ ఆ గ్రామం దగ్గరకొచ్చారు. వారికెంతో దాహం వేసింది. చుట్టు ప్రక్కలెక్కడా ఒక్క చుకైనా నీరున్నట్లు గోచరించలేదు. శరీరం అంతా చమట పట్టింది. స్వామి దాహంతో విలవిల్లాడుతున్నారు. నీరులేక నోరెండిపోయింది. అలాటి స్థితిలో భాస్కరుడనే ఒక రైతు పొలంలో పనిచేస్తున్నాడు. రైతు ప్రొద్దంతా కష్టపడితేనే మిగతావాళ్ళు సుఖంగా తింటారు మరి! అందుచేతనే రైతుని అన్న ధాత అంటారు. స్వయం అన్నదాతై వుండికూడా శ్రమించాల్సి వస్తుంది. ఎండా, వాన చలి వీటిని సహించాల్సిందే! 'అకోలా' పరిసర ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడింది. అడిగితే. నెయ్యయినా దొరికేది కానీ ఒక్క నీటిచుక్క మాత్రం దొరికేది కాదు! తను త్రాగటానికై భాస్కరుడు ఒక కుండతో నీరు తెచ్చుకొనేవాడు. మధ్యాహ్నం తినటానికి రొట్టె, నెత్తిన నీటితో నిండిన కుండ పెట్టుకొని పొలానికి వెళ్ళాల్సివస్తుంది. భాస్కరుడు నీటికుండ నొక చెట్టు క్రింద ఉంచాడు. స్వామి ఆకుండదగ్గర నిలబడి భాస్కరునితో "నేను చాలా దాహంగా వున్నాను. నాకు కాసిని నీళ్ళివ్వు, నీళ్ళిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. నీరు లేకుంటే ప్రాణాలు నిలవటం అసంభవం. ఉన్న వాళ్ళు మార్గమధ్యంలో చలివేంద్రాలు ఎందుకేర్పాటు చేస్తారో గమనించు!' అన్నారు. భాస్కరునికి కోపం వచ్చింది. నువ్వుగుడ్డలిప్పుకొని ఊరంతా తిరుగుతూంటావు. ఊరికే ఏదైనా వస్తే తిని తిరుగుతావు. ఏ పనీపాటా చెయ్యని నీకు నీళ్ళిస్తే ఏం పుణ్యం వస్తుంది? అనాధలకో,అంగవిహీనులకో, అసమర్ధులకో లేక సమాజ కళ్యాణం కోసం పాటుపడేవాళ్ళకో సాయంచేస్తే పుణ్యం వస్తుందని శాస్త్రవచనాలున్నాయి. కానీ నీలాటి పాఖండునికి సాయంచేస్తే పాపం తెచ్చుకోవటమే తప్ప పుణ్యం ఎక్కడినుంచి వస్తుంది? భూతదయ అని సర్పాన్ని ఎవరైనా పెంచాడా? దొంగలూ, గజదొంగలకు ఇంట్లో చోటిస్తారా? నువ్వు అడుక్కుతిని శరీరాన్ని మాత్రం బాగా పెంచావు. నీ కర్మవల్లనే నువ్వు భూమికి భారంగా తయారయ్యావు. ఉదయం వచ్చే సమయంలో నాకోసం నీరు తెచ్చుకున్నాను. పరుల సంపాదన పైపడి తినేవాడివి నీకేమాత్రం నీరివ్వను. ఏమైనాసరే! ఇక ఇక్కణ్ణుంచి ఫో! అవతలికి! ఒరే! ఛండాలుడా! పోరా నీ ముఖం నాకు చూపించకు. నీలాంటి పనీపాటా లేనివాడు మా మధ్య పుట్టబట్టే మాకు....... కరువొచ్చిపడింది! అన్నాడు. భాస్కరుని యీ మాటలు వింటూనే స్వామి మందహాసం చేసి అక్కడినుంచి వెళ్ళిపోయారు. దగ్గరే ఒక అంధకారబంధురంగా వున్న ఎండిపోయిన ఒక నుయ్యి వుంది. స్వామి ఆ నూతివైపు వెళ్ళ సాగారు. స్వామి అటువైపు వెళ్ళటం చూసిన భాస్కర్ పటేల్ ఒరేయ్ మూర్ఖుడా! అటెందుకు వెడుతున్నావు? ఆ నుయ్యి ఎన్నేళ్ళుగానో ఎండిపోయింది. నుయ్యి అయితే వుందిగానీ అందు ఒక క్రోసు లోతుకి పోయినా ఒక్క నీటిబొట్టు కూడా లభించదు! అని అరిచాడు. అది విని 'నూతిలో నీరు లేనిమాట నిజమే! ఐనా ప్రయత్నించి చూస్తాను. ఎప్పుడూ కష్టపడే నీలాటి వానికి నీరు లేకుంటే కష్టమే! ఇది చూస్తూనే నేను ఏమీ ప్రయత్నం చెయ్యకపోతే లోకానికి హితం చెయ్యనివాణ్ణి అవుతాను. పవిత్రభావంతో ప్రయత్నించేవారికి భగవంతుడెప్పుడూ తప్పక సాయపడతాడు. అని స్వామి నూతిని సమీపించారు. నిజంగానే నూతిలో ఒక్క నీటి బొట్టు కూడా కనిపించలేదు. స్వామి హతాశులై చెట్టు క్రింద కూర్చుండిపోయారు. కళ్ళు మూసుకొని సచ్చిదానందుడు, దయాళువు, దీనోద్ధారకుడు, జగద్గురువూయైన నారాయణుని స్మరించసాగారు. "హే వామనా! వాసుదేవా! ప్రద్యుమ్నా! రాఘవా! విఠ్ఠలా! నరహరి! హే ప్రభూ! ఈ అకోలా గ్రామం నీరులేక అల్లాడి పాతోంది. నూతిలో ఒక్క చుక్క నీటిబొట్టు కూడా కనపడటంలేదు. మానవ ప్రయత్నాలన్నీ వ్యర్ధమయ్యాయి. అందుచేత యీ నూతిలో నీళ్ళు పడాలని ప్రార్థిస్తున్నాను మీ దయవుంటే ఏ పని కాకుండా వుంటుంది? ఓ పాండురంగా! నీవు నిప్పునుంచి పిల్లుల్ని కాపాడావు కదా! భక్త ప్రహ్లాదునికై నీవు స్తంభంనుంచి బయటకొచ్చావే! హే మురారీ! చిటికిన వ్రేలితో గోవర్ధనధారణం చేసి ప్రజలను రక్షించావే! ఈ జగత్తులో కృష్ణాసాగరుడవు నీవే! దామాజీ సంతకై నీవు మాదిగవాని వయ్యావు! 'చోఖాభా'కై మోటతోలావు 'సావతామాలి'ని పొలం పిట్టల బెడదనుంచి రక్షించావు. ఉపమన్యుడికి క్షీరసముద్రాన్ని లభింపచేశావు 'నామదేవునికి నీరు త్రాగించాలనేమిషతో 'మార్వాడ' ప్రాంతాన్ని జలసమృద్ధం చేశావు!'అని స్వామి ఒక ప్రక్క భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ వుంటే మరో ప్రక్క కొద్దిక్షణాల్లోనే నూతిలో నీళ్ళు నిండసాగాయి. భగవంతుని సాయం లభించినవాడు ఏ పని చెయ్యలేడు? ఈశ్వరశక్తి అగమ్యం. ఆ శక్తి వలన అసంభవమైనది కూడా సంభవమౌతుంది! స్వామి నీరు త్రాగి దప్పిక తీర్చుకున్నారు. ఇదంతా భాస్కరుడు రెప్పవేయకుండా ఆశ్చర్యచకితుడై చూస్తూ వుండిపోయాడు. 'గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ నూతిలో ఒక్క చుక్కన్నా నీరు లేదే కానీ యీ...... పిచ్చివానివల్ల క్షణంలో నుయ్యి నిండిపోయింది! ఈ పిచ్చివారు నిజంగా సాక్షాత్కారం పొందినవానిలా వున్నాడు. ప్రజలుంనుచి తప్పించుకోవటానికి వెర్రివాడిలా కనిపిస్తున్నట్లుంది అని అనుకుంటూ భాస్కరుడు పొలంపని మాని స్వామి దగ్గరకు పరిగెత్తి వారి పాదాలమీదపడి స్తుతించసాగాడు.

 'ఓ మానవ శరీరధారణ చేసిన పరమేశ్వరా! హే దయాసాగరా ! నేను మీ బిడ్డడిని నన్ను దయ జూడండి! మీ మహిమ తెలుసుకోలేక నోటికి వచ్చినట్లు దుర్భాషలాడి మిమ్ములను నిందించాను. అవమానించాను. నాకిప్పుడు పశ్చాత్తాపం కలిగింది. మిమ్మల్ని, నన్ను క్షమించమని వేడుకుంటున్నాను.. గోకులంలో వున్న స్త్రీలంతా మిమ్మల్ని చూపిస్తే మీరు వారికి వరద హస్తాన్నే ప్రసాదించారు. హే దయాఘనుడవైన ప్రభూ! మీ బాహ్య రూపాన్ని చూసి తప్పుగా భావించాను. మీ మహిమ చూపించి నాతప్పుడు భావనను మార్చేశారు. భగవంతుని యదార్ధరూపాన్ని మీ మహిమద్వారా చూపించి నాకళ్ళు తెరిపించారు. పాడుబడిన బావిలో నీటిని పుట్టించి మీ శ్రేష్ఠత్వాన్ని చూపించి కళ్ళకు దివ్యాంజనం పెట్టారు. స్వామీ! నావల్ల తప్పైపోయింది. హే సద్గురువారా! ఇక మీ దివ్యచరణాల నుండి వేరు కాలేను. తల్లిని వీడిన బిడ్డడు దూరంగా ఎలా వుండగలడు? ఈ ప్రపంచం అంతా మిధ్య అని వారు యీనాడు చక్కగా తెలిసింది. ఇక ఈ హీనుడు, ధీనుడు అయిన యీ బాలుడిని మీ చరణాలనుంచి వేరుచేయబోకండి అని వేడుకున్నాడు. భాస్కరుని ఆంతరిక అంతర్గత భావాన్ని గ్రహించి స్వామి ఇక నీవు దుఃఖించవలసిన అవసరం ఏ మాత్రం లేదు. నెత్తిన కండతో నీరు తెచ్చుకోవలసిన అవసరమూలేదు. నీ కోసం యీ నూతిలో ఎప్పుడూ నీరు వుండే ఏర్పాటు చేశాను. కాబట్టి నీవు ఏ విషయానికి బాధపడవలసిన అవసరంలేదు. మరి ' సంసారాన్ని ప్రపంచాన్ని ఎందుకు విడుద్దామనుకుంటున్నావు? నీరు వచ్చింది కదా! అన్నారు. అది విన్న భాస్కరుడు "గురు దేవా! నాకిక అసత్య ప్రలోభనం చూపకండి. నాది యీ యెండిపోయిన నుయ్యే అనుకోండి. నేటి వరకూ ఎండిన యీ భావికి సాక్షాత్కారం అనే సొరంగం త్రవ్వి భక్తిభావన' అనే ఉదకాన్ని ప్రసాదించారు. ఇక భక్తిమార్గం అనే అందమైన తోటవేస్తాను. 'నిజవృత్తి' (సహజవృత్తి) అనే మట్టిని తయారుచేసి, అందులో 'సన్నుతి' మొక్కలు నాటుతాను. ఇక ఈ లౌకిక జీవనం అంటే విరక్తి కలిగింది అన్నాడు.

ఓ శ్రోతలారా! భాస్కరునికి కొద్దిపాటి సత్సంగం లభించటంతోనే. అతనిలో ఎంత పరివర్తనం కలిగింది? సిద్ధయోగుల దర్శనం సాధనామార్గం కంటే భిన్నమైనది. మహాత్ముల పాదధూళి యొక్క మహిమ గురించి 'తుకారామ్' తన కీర్తనలో (అభంగే) చక్కగా వివరించాడు. మన మంచి కోసం మనకు శుభం కలుగుతుందనే భావనతో వారి కీర్తననే పాడి, దాని

లోని రసాన్ని ఆస్వాదించి అనుభవిద్దాం. భావిలో నీరు పడటం వినగానే పూరివారంతా స్వామిని దర్శించుకొనే నిమిత్తం పరిగెత్తసాగారు. మధువును

చూచిన తేనెటీగలవలె వారంతా పరుగిడసాగారు. అక్కడ ప్రజలంతా గుంపుగా పొగయ్యారు. ప్రతి ఒక్కరూ నూతిలోని నీటిని త్రాగి తృప్తిపడుతున్నారు.

  ఆ నిర్మల శీతలజలం అమృతంకంటే తియ్యగా వున్నట్లుంది వారికి అంతా ఒక్కుమ్మడిగా శ్రీగజనన మహరాజులకు జయము జయము' అనే

జయజయధ్వానాలు ఆకాశంలో మారుమ్రోగే విధంగా చేయసాగారు. తరువాత స్వామీజీ 'అర్లాం' లో వుండకుండా భాస్కరునితో సహా షెగాంవ్ కి వేంచేశారు. శ్రీగజాననులు సిద్ధయోగులు మరి!

 

స్వస్తిశ్రీ, దానగు ద్వారా విరచితమైన యీ 'గజానన విజయ' మనే గ్రంధము సిద్ధయోగుల

-మహిమను తెలిపే దివ్యమైన ఆదర్శ గ్రంథముగా రుజువగుగాక!

 

॥ శుభం భవతు ॥

 

॥ శ్రీ హరి హరార్పణమస్తు ॥ 

 ఇది పంచమాధ్యాయము సమాప్తము

 

యే మనుష్యః మాం ఆశ్రతః!

తాన్ సర్వేస్యః కర్మ వినాశనః