సర్వం శ్రీసాయి

శ్రీ గజనన విజయం

ఎనిమిదవ అధ్యాయం  click here for pdf

 

శ్రీగణేశాయ నమః. ఓ వసుదేవ దేవకీ నందనా! ఓ గోపగోపీ మనోరంజునా! హే దుష్ట దానవ మర్దవా! శ్రీహరి! నాపై ప్రసన్నుడవు కావయ్యా! మీకృపాకటాక్షాలు కలగటానికి ఆధ్యాత్మిక సాధన, కర్మయోగం, పరాభక్తి మొదలైనవి చేయటానికి అయోగ్యుణ్ణి. మరి జ్ఞాన యోగం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుదామనుకుంటే ఆ శాస్త్రాలన్నీ సంస్కృతంలో వున్నాయయ్యే ! ఆ సంస్కృతభాష నేను మందబుద్ధి నవటంవల్ల వాకుండయ్యె!వికసించిన కమలంలోని మకరందాన్ని మండూక మేరీతి గ్రోలగలదు! అది క్రిమికీటకాదులతోనే తృప్తి చెందుతుంది. అన్నదానం చేయటం ద్వారా నిన్ను పొందుదామా అంటే దరిద్రుణ్ణవటం వలన ధనహీనుణ్ణి. ధనం లేనివాడు తన కోరికలను తీర్చుకోలేడు. పోనీ తీర్థయాత్రలు చేసి పుణ్యం - సంపాదిద్దామనుకుంటే వృద్ధాప్యం పై బడింది. దాంతో చూపుకూడా సన్నగిల్లిందాయె! ఓ చక్రపాణీ! నేను అన్ని విధాలా ఆపదలో పడిపోయాను.. ధనహీనుడి వాంఛలన్ని ఎలావున్నవలానే వుండిపోతాయి. లౌకికంగా చూస్తే ఇవన్నీ నిజాలే ఐనా నీ కృపాపాత్రులైనవారి కష్టాలూ, ఆపదలూ ఇట్టే గట్టెక్కుతాయి. నీ కృపామహిమ ఎంతో గొప్పది! మేఘాలు వర్షించగా వచ్చిన నీటికి వెల నివ్వక్కరలేదు. మేఘాలు తలుచుకుంటే నదులూ, చెరువులూ, నూతులూ అన్నింటినీ నింపేస్తాయి! ఇంతెందుకు? రాళ్ళే కరిగి ప్రవహిస్తాయి. అలాటి కృపాసాగరుడవు నీవు మరి! అన్న పానాదులు లేని 'దాసగణు' నీవైపే తదేకదృష్టి సారించి వున్నాడు. హే! భగవాన్! దయజూపి వాని నోటిలో ముద్ద అందించు! ఒకే ఒక ముద్దతో నేను సంతుష్టుడనౌతాను. దాంతోనే నాకన్నీ లభిస్తాయి. ఒక్క అమృతబిందువు లభిస్తేనే యీ భవసాగరాన్నుంచి ముక్తి లభిస్తుందికదా! అదే కావాలి!

 

క్రిందటి ఆధ్యాయంలో దేశముఖ్ పాటిల్ ల మధ్య అంతఃకలహాలు చెలరేగుతున్న విషయం పాఠకులు గమనించినదే! ఎక్కడెక్కడ ఇలాటి కలహాలు చెలరేగుతాయో అక్కడ సుఖశాంతులు కరువౌతాయి. క్షయరోగం శరీరాన్ని, అంతః కలహాలు సమాజాన్నీ యమసదనానికి దారిచూపిస్తాయి. పైపై చేసే ప్రయత్నాలు ఫలించవు! 'మత్యామహార్' అనేవాడికి ఖండూపాటిల్ ఒక పని చెప్పాడు. కానీ వాడు దాన్ని చేయనన్నాడు. పాటిల్ గ్రామాధికారి కదా! అతనితో గ్రామవాసులందరికీ పని పడుతుంది. మత్యామహార్ పని చేయననటంతో పాటిల్ మండిపడ్డాడు. మత్యామహార్ దేశముఖ్ పక్షానికి -చెందిన వాడవటంవల్ల పాటిల్ చెప్పిన పనిని చేయనన్నాడు. పాటిల్ వాడిని మందలించాడు. పేదవాడు పెద్దలమాట కాదనరాదన్నాడు. కాదు కూడదనే అధికారం పాటిల్ దేశముఖ్ లకుంటుంది గానీ నీబోటివాడికి కాదన్నాడు. ఐనా వాడు వింటేనా? అంతే కాకుండా పాటిల్ ని వేళాకోళం చేయటం ప్రారంభించాడు. ఇది పాటిల్ సహించలేకపోయాడు. పోట్లాటకి కారణం చాలా చిన్నదే! అకోలా తహసిల్ కచేరీలో ఇవ్వటానికై కొన్ని కాగితాలు మత్యామహర్ కిద్దామనుకున్నాడు పాటిల్ ఈ పని నావల్ల కాదన్నాడు. మహర్! నేను దేశముఖ్ ని ఆశ్రయించి బ్రతుకుతున్నవాడిని నాచేత పని చేయించుకునే అధికారం నీకు లేదన్నాడు వాడు. ఏమైనా సరే నేనీ పని చేయనని మొండికేశాడు. నువ్వనేవన్నీ హాలీ'కి తిట్టే తిట్లనుకుంటాను. ఇది అందరికీ దండోరా కూడా వేస్తానని బెదరించాడు. " మహార్! ఇది విన్న పాటిల్ ఒళ్ళుమండి చేతనున్న కర్రతో వాణ్ణి కొట్టాడు. బలవంతంగా కొట్టటం వలన మహార్ చెయ్యి విరిగి తెలివితప్పి పడిపోయాడు. తరువాత ఆ పనిని మరెవరో మాదిగవాడు చేసిపెట్టాడు. మరి ఇక్కడేమయిందో ఆ కథ వినండి!

 

తెలివితప్పి పడిపోయిన మాదిగవాణ్ణి వారి ఆప్తులు దేశముఖ్ ఇంటికి చేర్చారు. మాదిగవారి విరిగిన చెయ్యి చూసి దేశముఖ్ లోలోపల చాలా సంతోషించాడు. అందొచ్చిన అవకాశాన్ని జారవిడవ తలుచుకోలేదు దేశముఖ్. ఇతడికి పాటిల్ తో ప్రత్యక్ష కలహానికి ఒక చక్కని అవకాశం లభించింది. వెంటనే దేశముఖ్ మాదిగవాణ్ణి పోలీస్ స్టేషనుకు తీసుకువెళ్ళి ఉన్నవీ లేనివీ ఏవో చెప్పి రిపోర్టు వ్రాయించాడు. రెండు పక్షాల మధ్య ఏ కొంచెం మాట పట్టింపోచ్చినా ఆదో పెద్ద రాద్ధాంతం అవటం పరిపాటి ఇక్కడ. మహర్ చేసిన రిపోర్టు ఆధారంగా పాటిల్ని నిర్బంధంలోకి తీసుకోమని ఆజ్ఞಲು జారీ అయినాయి. ఈ విషయం నిమిషంలో శేగాంవ్ అంతా పాకిపోయింది. 'ఖండూపాటిల్ చేతికి బేడీలు పడతాయట' అని ప్రజలంతా అనుకోసాగారు. ఇది విన్న ఖండూపాటిల్ చాలా భయపడ్డారు. చింతాక్రాంతుడయ్యాడు. 'ఎక్కడైతే సింహంలా బ్రతికానో అక్కడేనాకు సంకెళ్ళు పడతాయా భగవాన్ అని వాపోయాడు. గౌరవ మర్యాదలతో జీవించే వ్యక్తికి ఏపాటి అవమానం జరిగినా అది మృత్యువుకంటే భయంకర మైనదే మరి! బంధువులు అంతా భయపడ్డారు. స్వామీజీయే దీనికో వుపాయం చెప్పాలి. మొత్తం విదర్భదేశంలో స్వామిని మించిన రక్షకుడెవరున్నారు? లౌకిక ప్రయత్నాలు చేయటానికి అతను అకోలా వచ్చారు. పాటిల్ ఆ రాత్రే స్వామిని చేరుకున్నాడు. రాగానే ప్రణామంచేసి కూర్చొని వినమ్రుడై మహరాజ్ నాకో ఆపద వచ్చిపడింది. కార్యాలయం పనుల్లో ఒక పనిని చేయటానికి మత్యామహార్ నిరాకరించాడు. వాణ్ణి నా చేతికర్రతో కొంచెం బలంగా కొట్టాను. వాడి చెయ్యి విరిగింది.దాంతో నామీద పగబట్టిన దేశముఖ్ యిది ఆసరాగా తీసుకొని రిపోర్టు వ్రాయించాడు. రేపు నాకు సంకెళ్ళు పడతాయి! స్వామీ! నా గౌరవ మర్యాదలు మీ చేతిలోనే వున్నాయి. మీరు తప్ప నన్ను రక్షించే నాధుడెవరు? రేపు రాజధూతలు యిక్కడికి వస్తారట. వాడు సంకెళ్ళు వేసి తీసుకెడతారట! కాబట్టి.. స్వామి! ఇదిగో యీ కత్తి తీసుకొని నన్ను చంపేయండి. గృహస్థులకు అవమానంకంటే మించిన మృత్యువు లేదు. నా అపరాధం ఏమంత పెద్దది కాకపోయినా గోరింతది కొండంతైంది! స్వామీ! నా ప్రతిష్ట మీ చేతుల్లోనే వుంది. రణరంగంలో అభిమన్యుడు చంపబడ్డప్పుడు, అర్జునుడు జయద్రథుముని చంపలేక పోయినచో తాను చితి రగుల్చుకొని భస్మమైపోవుదునని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు స్వామీ మీరే అతణ్ణి రక్షించారు ప్రభూ ద్రౌపదీపతిని రక్షించినవారూ మీరే! నా మానమర్యాదలనే పాంచాలిని దేశముఖ్ అనే కౌరవులు యీ సభలో మానహాని చేయటానికి నిశ్చయించుకున్నారు. ఇప్పుడు మీరే నన్ను రక్షించే సమర్థులు, అని పాటిల్ ఒకవైపు చెపుతూనే కన్నీరు కార్చటం మొదలు పెట్టాడు. పాటిల్ కుటుంబం వారంతా పాపం ముందునుంచే శోకమగ్నులై వున్నారు. అది అవర్ణనీయం. ఖండూపాటిల్ యొక్క దీనస్థితిని చూసి స్వామి అతణ్ణి తన హృదయానికి హత్తుకున్నారు. అతని వీపుపైన తన చేత్తో నిమురుతూ కొంత సాంత్వన కలిగించారు.  తరువాత "ఆరె! కర్మనిష్టులపై యిలాటి సంకటాలు వస్తూనే వుంటాయి. అటువంటప్పుడు ధైర్యంగా వుండాలి మరి! బాధపడకు. స్వార్ధప్రవృత్తులు వుదయించినప్పుడు ఇటువంటి కష్టాలు తప్పకుండా వస్తూ వుంటాయి! స్వార్ధ ప్రవృత్తి అసలైన తత్వాన్ని తెలుసుకోలేదు. పాటిల్, దేశముఖ్ లు ఇద్దరూ ఒకే జాతివారే! సంపన్నులే! ఐనప్పటికీ అంతఃకలహాల వలన ఒకరికొకరు ఆహితాన్నే కొరుకుంటున్నారు ఇది ఎంతో అనిష్టమైంది. కౌరవ పాండవుల అంతఃకలహమే వారిని యుద్ధరంగాని కీడ్చింది. ఐనా పాండవులున్న దర్మపక్షమే విజయాన్ని సాధించింది. ఎందుకో తెలుసా? భగవంతుడెప్పుడూ ధర్మ పక్షానికే సహాయపడతాడు! ఆధర్మపక్షాన వున్న కౌరవులందరిని భగవంతుడు నాశనం చేశాడు అని పాటిల్ తో "ఇక నువ్వు నిశ్చింతగా వుండు, వెళ్ళు దేశముఖ్ ఎంత గింజుకున్నా నీకు సంకెళ్ళు పడవు!" అన్నారు. చివరికి అదేనిజమైంది. పాటిల్ నిర్దోషిగా నిరూపించబడ్డాడు! అతనిపై ఏ విధమైన చర్యా తీసుకోబడలేదు. యోగి నోటి నుంచి వచ్చిన మాటలేవీ అసత్యాలు. కావెప్పుడూ! ఈ సంఘటన తర్వాత పాటిల్ కుటుంబంవారు స్వామికి మనసా వాచా' సేవచేయసాగారు. నిజమే! అమృతపానం ఎవడు చేయడు.

 

మరి! ఖండూపాటిల్ స్వామిని తన యింటికి సాదరంగా ఆహ్వానించాడు! స్వామి పాటిల్ యింటిలో విడిది చేశారు. ఆ సమయంలో ఒక పదిమంది తెలుగు బ్రాహ్మణులు ఒకేసారి వచ్చారు. అక్కడికి బ్రాహ్మణులు వేదవండితులే కాక విద్వాంసులు కూడా. ఐనా ధనప్రలోభం కలవారు. కాస్తా కూస్తో ధనం సంపాదించవచ్చనే ఆశతో పాటిల్ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో కంబళ్ కప్పుకొని స్వామి పడుకొని వున్నారు. వారిని లేపాలనే వుద్దేశ్యంతో బ్రాహ్మణులు పెద్దగా వేదమంత్ర పఠనం ప్రారంభించారు. స్వరయుక్తంగా మంత్రపఠనం సాగుతోంది. మంత్రపరనంలో పొరపాటు జరిగినా దాన్ని పట్టించుకోలేదు. వెంటనే స్వామిలేచి ఆసనం మీద కూర్చొన్నారు. వారు ఆ వైదిక బ్రాహ్మణులతో "మీరు వైదికులెందుకయ్యారు? మంత్రాలు తప్పుగా చదివి వేదవిద్యకు హాని కలిగించకండి! పొట్టపోసుకోవటం కోసం వేద విద్యను ఆలంబనం చేసుకోకండి! ఇది మోక్షాన్ని ప్రసాదించే విద్య, ఈ కప్పుకున్న శాలువయొక్క విలువైనా కాపాడండి!" అని "నే నెలా చెపుతానో అలానే మీరూ చెప్పండి! చెప్పేటప్పుడు సరియైన ఉచ్చారణ, స్వరంపై ధ్యాస అమాయకులైన భక్తుల్ని భ్రాంతిలో పడేయకండి " అంటూ ఏ వేదమంత్రాలైతే బ్రాహ్మణులు పఠిస్తున్నారో వాటినే స్వామి ఆగకుండా పఠించటం ప్రారంభించారు. అందులో తృటి ఏమిలేదు సరికదా వాక్కు ఎంతో సుస్పష్టంగా వుంది! నిజానికి సాక్షాత్తూ ఆ వసిష్ఠమహర్షి వేదమంత్రం గానం చేస్తున్నట్టుగా వుంది! స్వామి వేద ఋక్కులను గానం చేస్తున్నప్పుడు, వారి వాకుృద్ధికి,విలక్షణ స్మరణశక్తికీ ఆ తెలుగు బ్రాహ్మణులు ఆశ్చర్యపడి తలలు వంచి వూరకుండిపోయారు. ఆ బ్రాహ్మణులకు స్వామి కేసి చూడటానికి కూడా ధైర్యం లేకపోయింది! నిజమే మరి! సూర్యుడు వుదయించిన తరువాత దీపాల నెవడు పొగుడుతాడు? చీకట్లను పారద్రోల టానికే కదా వెలుగు కావాలి మరి "వీరిని మనం పిచ్చివాడనుకున్నాం కానీ వీరు మహాజ్ఞానులు! నాలుగు వేదాలు వీరికి కంఠస్థం అయినట్లు తోస్తుంది! వీరు నిజంగా విధాతలే అనిపిస్తోంది! ఇందులో ఏమాత్రం సందేహం లేదు. వీరు బ్రాహ్మణులే కావచ్చు. పరమహంసలైన కారణంగా బంధముక్తులయ్యారు. జీవన్ముక్త సిద్ధయోగులయ్యారు. మన పూర్వజన్మ సంచితంవల్ల విరి దర్శనభాగ్యం కలిగింది. వీరిని 'వామదేవుడని' పిలిస్తే యధోచిత గౌరవంగా వుంటుంది" అని ఆ తెలుగు బ్రాహ్మణులు మనసులో అనుకున్నారు.

సరే! స్వామి ఖండూపాటిల్ చేత వారందరినీ సాదరంగా ఆహ్వానింపజేసి ఒక్కొక్క రూపాయి దక్షిణ ఇప్పించారు. బ్రాహ్మణులు సంతుషులై మరోచోటికి వెళ్ళిపోయాడు. స్వామి కూడా యీ గ్రామప్రజల ఝంఝాటంతో విసిగిపోయారు. ఓ శ్రోతలారా! అసలైన మహాత్ములు ప్రజలు సతాయించటంవల్లనే విసిగిపాతారు! కానీ కపటయోగులు దీన్నే గౌరవం అనుకుంటారు. శేగాంవ్ కి ఉత్తరాన ఒక సుందర వనం వుంది. అందులో ఎన్నో కూరగాయలు పండేవి. ఒక మూల శివాలయం కూడా వుంది. వేపచెట్ల కారణంగా చక్కని గాలి, నీడలకు ఏమాత్రం కొదువ లేదు. ఇది కృష్ణాజీ పాటిల్ ది. ఇతడు ఖండూ పాటిల్ కి ఆఖరి తమ్ముడు. ఒక రోజు ఇక్కడికి వచ్చి శివాలయం దగ్గరి అరుగుమీద వేపచెట్ల నీడలో కూర్చున్నారు స్వామి ఈ నీలకంఠుని దేవాలయంలో కొన్నాళ్ళుందామని వుంది నాకు. ఈ భోలానాథుడు, కర్పూరగౌరుడు, నీలకంఠుడు, పార్వతీవరుడు. అందరి దేవతలలోనూ రాజరాజేశ్వరుడు. ఈయన ఈ వనంలో లీనమైపోయాడు. అందుకే నేను కొన్నాళ్ళు యిక్కడ వుండటానికి నిశ్చయించుకున్నాను. నాకుండటానికొ చిన్న నీడ ఏర్పాటు చెయ్యి అన్నారు. ఇది విన్న కృష్ణాజీ ఆనందంతో పులకించిపోయాడు. వెంటనే ఆకులు మొదలైనవి తెచ్చి ఆ అరుగుమీద పందిరలాంటిది ఏర్పాటు చేసాడు. స్వామి అక్కడుండటం ప్రారంభించిన తరువాత ఆదొక పుణ్య క్షేత్రమే అయింది. రాజెక్కడుంటే అక్కడే అతని రాజదానీ వుంటుంది కదా! స్వామితోపాటు సేవ చేయటానికి భాస్కర్ పాటిల్ కూడా వచ్చాడు. తోడుగా తుకారాం కోకట్యా కూడా వున్నాడు. భోజనాదుల ఏర్పాటు కృష్ణాజీ స్వయంగా చూస్తూ వుండేవాడు. స్వామి భోజనానంతరం ప్రసాదం తీసుకొనేవాడు. ఇది ఇలా వుండగా ఒక రోజు ఒక విచిత్రం జరిగింది. అదే తోటకు పది పదిహేను మంది సన్యాసులు వారి మార్గమధ్యంలో విడిది చేశారు. స్వామిని గురించి ముందే విని వుండటంవలన వాళ్ళు అక్కడకే వచ్చి విడిదిచేశారు. "మేము తీర్ధయాత్రలు చేస్తూ భాగీరథి (గోదావరి) జలాన్ని తీసుకొని రామేశ్వరం వెడుతున్నాం. గంగొత్తరి, జమునోత్తరి, కేదారం, హింగళాజ్ మాత, గిరినార్,డాకోర్ ఆది పుణ్య క్షేత్రాలను పాదయాత్రతోనే దర్శించాము. స్వామి బ్రహ్మగిరిజీ శిష్యులం, గురుదేవులు కూడా మాతోనే విచ్చేశారు! వీరి పరిచయం ఎట్టిదంటే భగవంతుణ్ణి తమ నౌకరుగా చేసుకున్న మహానుభావులు! అట్టి మహామహులు. నీ అదృష్టం కొద్దీ నీ గడప తొక్కారు. కాబట్టి హల్వా పూరీల భోజనం సమర్పించి పుణ్యం ఆర్జించుకో! మరి కొద్దిగా మేం 'గంజాయిని కూడా సేవిస్తాం. కాబట్టి అది కూడా సమర్పించు! మూడు రోజులు మాత్రమే మేమిక్కడ విడిది చేసేది. నాల్గవరోజు యిక్కడనుండి బయలుదేరుతాం! పాటిల్! నీకు ఈపమెందుకు? ఇలాటి అవకాశం అదృష్టం వల్లనే వస్తుంది. నిజం చెప్పాలంటే ఒక పిచ్చి దిగంబర స్వామిని పోషించేవాడిని మాకు భోజనం పెట్టడాని కెందుకంత ఆగ్రహపడుతున్నావు? గాడిదను పెంచుతూ గోమాతను కాళ్ళతో తన్న బోతున్నావు సుమా! ఈ నీ ప్రవర్తన మంచిదో కాదో నీవే ఆలోచించుకో! మేము అజాతశత్రు సంపన్నులమైన మహాత్ములం. వేదవిద్యా విభూషితులం! ఇక మీరంతా కోరుకున్నట్లయితే కథా కాలక్షేపానికి రండి! అన్నారా స్వాములు. ఇదంతా వినిన పాటిల్ "మీకు కావలసిన హల్వా పూరీలు రేపు వడ్డిస్తాను. ఇవాళ జొన్నరొట్టెలు సిద్ధంగా వున్నాయి కాబట్టి వాటితోనే సంతోషపడండి! గంజాయి మాటంటారా? సరే తెప్పిస్తాను. ఇక్కడకు నీలకంఠ దేవులు దగ్గరే వున్నారు కదా"! అన్నాడు. మధ్యాహ్నం శనగపిండి కూర (బేసన్), జొన్నరొట్టెలూ తిని తమ ఆకలిని తీర్చుకున్నారు ఆ సన్యాసులు, శ్రీగజాననుల ఎదుటనే వారు తమ నివాసం ఏర్పాటు చేసుకున్నారు వారిలోని బ్రహ్మగిరి అనే స్వామి అనాటి సాయంత్రం భగవద్గీతా ప్రవచనం ప్రారంభించారు. వారి శిష్యులతోబాటుగా కొంతమంది గ్రామవాసులు కూడా ప్రవచనం వినటానికి వచ్చారు. "వైనం ఛిందంతి శస్త్రాణి, వైనం దహతి పావకః" అనే గీతా శ్లోకం ఎన్నుకుని దానిపై ప్రవచనం సాగించారు. ఈ బ్రహ్మగిరి వట్టి మోసగాడు. సాధకుడైనప్పటికీ సాధించిందేమీ లేనివాడే! ప్రవచనం వినవచ్చినవారంతా 'యిందులో సరుకేమీ లేదు. వర్ధి శబ్దజాలం తప్ప అనుభవశూన్యుడే!' అని చెవులు కొరుక్కోసాగారు! ప్రవచనంలో కొంతభాగం విని ప్రజలు అక్కడినుండి లేచి శ్రీగజానన స్వామి ఎదుట కూర్చోవటం ప్రారంభించారు. 'శబ్దజాలం అక్కడుంటే సాక్షాత్తూ స్వానుభవం ఇక్కడుంది' అనుకోసాగారు భక్తులంతా! అక్కడ కధ విన్నారు. ఇక్కడ సత్యసంఘటన చూశారు. ప్రజల యీ నడవడిని చూసి బ్రహ్మగిరి మండిపడ్డాడు. సన్యాసులంతా ఆ గంజాయి త్రాగి ఒళ్ళు తెలియకుండా వున్నారు. వారు గంజాయినే సర్వస్వం అనుకున్నట్లుగా వుంది! శ్రీ గజాననులు ఒక మంచం మీద కూర్చొని గంజా (చిలుము) త్రాగుతున్నారు. గంజా వేసి వెలిగించే పనిని భాస్కర పాటిల్ చేస్తున్నాడు. అనుకోకుండా ఒక నిప్పురవ్వ మంచంమీద పడింది. ఆదెవ్వరూ గమనించలేదు! కొంత సేపటికి ఆ మంచం నలువైపుల అంటుకొని మండటం ప్రారంభమైంది. ఇది గమనించిన భాస్కర్ పాటిల్ "స్వామీ! మంచం అంటుకుంది. దిగి క్రిందికి రండి! ఇది టేకు మంచం, నీటితోగానీ దీన్ని ఆర్చలేము" అన్నాడు. అది విన్న స్వామి "ఈ మంటలని ఆర్పటానికి ప్రయత్నించవద్దు దానికోసం నీళ్ళుకూడా తేవద్దు" అని ఆ బ్రహ్మగిరి స్వామివైపు తిరిగి, "ఓ బ్రహ్మగిరి స్వామీ! రండి! యీ మంచం పైన కూర్చోండి! మీరు భగవద్గీతను చక్కగా తెలుసుకున్నారు. కదా! మీరు ప్రజలకు చెప్పేది రుజువు చేయటానికి భగవంతుడే చక్కని అవకాశాన్నిచ్చాడు! 'బ్రహ్మని అగ్ని కాల్చదు' అని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించి చూపండి! "నైనం ఛిందంతి" అనే శ్లోకార్థాన్ని ఒక గంట సేపటినుంచీ ప్రవచిస్తున్నారే? మరి యీ మండే మంచంమీద కూర్చొవటానికి వెనకా ముందూ ఆడుతున్నారేం? అంటూ స్వామి పాటిల్ని, బ్రహ్మగిరిని పట్టి యీ మంచం మీద పడేయమన్నారు. స్వామి ఆజ్ఞ అవగానే బాస్కరుడు. బ్రహ్మగిరి చెయ్యి పట్టుకొని అతణ్ణి మండుతున్న మంచం వైపు తీసుకొని వెళ్ళసాగాడు. భాస్కరుని బలంముందు బ్రహ్మగిరి ఏమీ చేయలేని వాడయ్యాడు. నాలుగు వైపులా మండుతున్న ఆ మంచం మధ్యలో స్థిరాసనం వేసుకొని శ్రీగజాననులు నిజానందంలో నిమగ్నులై వుండటం బ్రహ్మగిరి చూశాడు. పొగలు సెగలు కక్కుతున్న నూనెలో హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుణ్ణి కూర్చోబెట్టినట్లు శ్రీ వ్యాసభగవానులు పురాణంలో వర్ణించారు. ఆపురాణ కథనాన్ని శ్రీగజాననస్వామి యీ కృష్ణాజీ పాటిల్ తోటలో ప్రత్యక్షంగా భక్తులందరికీ రుజువు చేసి చూపించారు! అది చూసి భయపడిన బ్రహ్మగిరి మండే మంచం దగ్గరకు తన్ను తీసుకొనిపోవద్దని పాటిల్ ని ప్రార్ధించాడు. "నేను స్వామి మహిమను తెలుసుకోలేక పోయాను. అన్నాడు. అతని మాటలు వినకుండానే బ్రహ్మగిరిని యీడ్చుకొని పోయి శ్రీగజాననుల ఎదుట నిలబెట్టారు భాస్కర పాటిల్, నైనం దహతి పావకః ఇది సత్యమని నిరూపించవయ్యా! అన్నారు శ్రీ గజాననస్వామి. అది వినగానే బ్రహ్మగిరి మరింత భయపడ్డారు. నోటినుండి మాటలు రాక తడబడుతూ "నేను స్వార్ధపరుణ్ణి హల్వా పూరీలు తినటానికే యీ సన్యాసి వేషం వేసింది. హే! శాంతిధామా! నేనెన్నో అపరాధాలు చేశాను. వాటికై క్షమాయాచన చేస్తున్నా. భగవద్గీతను కంఠస్థమే చేశాను కానీ అందులో ఇమిడివున్న నిరంతర సత్యాన్ని అన్వేషించటానికెన్నడూ ప్రయత్నించలేదు. నేను మిమ్ములను పిచ్చివానిగా ఎంచాను. ఇప్పుడు మీ మహత్తు తెలుసుకున్నాను. నాకు పశ్చాత్తాపం కలిగింది. చేసిన అపరాధాలన్నింటికీ కిమ్మనకుండా క్షమించమని కోరుతున్నాను. శరణన్న వానిని ప్రభూ! రక్షించండి" అని వేడుకున్నాడు. శేగాంవ్ ప్రజలంతా "స్వామీ! అగ్నివల్ల మీకేమీ భయం లేదు కానీ మాకు మాత్రం భయమే! కాబట్టి తమరు మంచం దిగి క్రిందకు రండి!" అని ప్రార్ధించారు. బ్రహ్మగిరి సిగ్గుపడి తలదించుకొని క్రింద కూర్చుండిపోయాడు.

 

ప్రజల ప్రార్ధనను మన్నించి శ్రీగజాననులు మంచందిగి వచ్చారు. వారు దిగటమే తడవుగా ఆ మంచం క్షణంలో విరిగిపోయింది. మంచం అంతా కాలిపోయింది. మిగిలిన భాగాలను ప్రజలు నీటితో ఆర్పేశారు. బ్రహ్మగిరి శ్రీగజాననులకు సాష్టాంగపడ్డాడు. అతని గర్వం తుత్తునియలైంది. గంగాజలం స్పర్శతగిలితే ఇక మురికి (పాపం) ఎక్కడుంటుంది? అర్ధరాత్రి ఆ బ్రహ్మగిరికి శ్రీస్వామి ఉపదేశం చేశారు. నేటినుండి ప్రజలను మోసగించవద్దు. ఒంటికి విభూతి పూసుకునేవాడు సన్మానాదులనుండి దూరంగా వుండాలి. అనుభవం లేని జ్ఞానాన్ని ఇతరులకు బోధించరాదు. ఈనాడు శబ్దపాండిత్యం ఎక్కువ ప్రచారంలో వుంది. దీని వలన సంస్కృతి పతనమౌతోంది. మహానుభావులైన మచ్చింద్రుడూ, జాలంధరుడూ. గోరఖుడూ, గహినీ, జ్ఞానేశ్వరుల మహిమను ఎవరెరుగగలరు? శ్రీ శంకరాచార్యులు స్వానుభవ (సిద్ధయతులు) యతులుగా చెప్పబడతారు. సంసారం చేస్తూనే ఏకనాథులు బ్రహ్మస్థితిని సాక్షాత్తూ అనుభవించి తెలుసుకోగలిగారు. సమర్థ రామదాసులు బ్రహ్మచర్యాన్ని పాటించి బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందారు. అలాటివారు ఎంతోమంది యీ భూమిమీద జన్మించారు. వారి పుణ్య చరిత్రలు ఎంతని గానం చేయగలం? హల్వా పూరీలు తిని వ్యర్ధంగా కాలక్షేపం చెయ్యకు. ఏమీ సాధించలేని జీవితం వృధాయైపోతుంది" అని ఉపదేశించారు. శ్రీగజానన మహామహుల యీ బోధను విన్న బ్రహ్మగిరికి నిజంగానే నిరక్తత కలిగింది. ఉదయం కాగానే ఎవరికీ చెప్పకుండా బ్రహ్మగిరి ఎటో వెళ్ళిపోయాడు. రెండో రోజు యీ సమాచారం వాయువేగంగా ఊరంతా వ్యాపించింది. ఊళ్ళో వారంతా తోటలోని కాలిన మంచాన్ని చూడటానికి పరుగులెత్తారు. ఈ దానగుణూ విరచితమైన శ్రీగజానన విజయమనే గ్రంధం భావుకులైన వారందరినీ భవసాగరాన్నుంచి తరింపజేయడంలో సహాయపడాలని దాసగణూ కోరిక!

 

|| శుభం భవతు || శ్రీ హరి హరార్పణమస్తు ॥

౹౹ఇది అష్టమాధ్యాయము సమాప్తము౹౹


యే మనుష్యః మాం ఆశ్రతః!

తాన్ సర్వేస్యః కర్మ వినాశనః