శ్రీ గజానన విజయం
ఇరవైయోకట అధ్యాయం
 

శ్రీ గణేశాయ నమః. జయ జయ హే! అనంత వేషా! జయ జయ అవినాశా! జయజయ హే! పరేశా! బ్రహ్మాండాధీశా నమః  హే భగవాన్! నీకు పతితపావనుడనే నామధేయం వుందన్న విషయాన్ని గుర్తుంచుకోవయ్యా! పావులూ, పాఠకుల పైన నీకు అపారమైన ప్రేమ వుంటుంది కదా! పాపుల వలననే యీ లోకంలో నీ మహిమ ఉన్నత శిఖరాల నందుకొన్నది? కాబట్టి హే హృషికేశా! నా పాపాలను గుర్తు చేసుకోవయ్యా! మాసిన బట్ట నీటితోనే శుభ్రపడుతుంది కదా! కాబట్టి లీలావినోదా! యీ పతితులతో విసిగిపోవద్దు మరి? ఇలాటివారితో విసిగి భూమాత ముఖం త్రిప్పుకుంటుందటయ్యా పతితపావనుడు, పుణ్య పావనుడు అనే బిరుదులను మించినవాడవు? అంధకారాన్ని తొలగించటానికి సూర్యుడు. కష్టపడవలసి వస్తుందటయ్యా? దాని కోసం అతడేమీ చేయనక్కర్లేదుకదా? అంధకారం సూర్యుని కలవటానికి వచ్చినపుడు అది స్వయంప్రకాశమై ప్రకాశిస్తుంది. అలానే నారాయణుని సాన్నిధ్యం వలన తమోంధకారతత్వం నష్టమైపోతుందికదా! హే! నారాయణా! పాప పుణ్యాల వాదనలను నీవు మనుష్యులలో కలిగిస్తావు. నీ గొప్పతనం ఎప్పటిలాగా వుండాలనే మనుష్యులచేత పాపాలు చేయిస్తావు మరి! ఏదిఏమైనా సరే! నన్ను స్వీకరించి, అంతరహితుణ్ణి చేయమని యీ దాసగణూ నిన్ను ప్రార్ధిస్తున్నాడు. హే! పాండురంగా! విశ్వమంతా నీ పిడికిట్లో వుంది. నీవు తప్ప నన్ను తరింపచేసే వారెవరూ లేరు నాకు.. శ్రోతలారా! కలశాధ్యాయాన్ని (చివరిది) ఏకాగ్రచిత్తులై ఆలకించండి. మీరు సిద్ధయోగుల (మహాత్ముల) చరిత్ర వింటున్నారు. ఇది మహద్భాగ్యమైన విషయం. శ్రీ గజాననుల పాదపద్మాలయందు ఎవరైతే దృఢమైన నిష్ఠను కలిగివుంటారో వారి దుఃఖ సంకటాలన్నీ... పటాపంచలై పోతాయి! అస్తు! మందిర నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నప్పుడు పని చేస్తూ చేస్తూ ఒక కూలివాడు శిఖరం మీదికి వెళ్ళాడు. అతడు. మేస్ట్రీకి రాళ్ళు అందిస్తున్నాడు. ఒకసారి రాయి అందిస్తూ కాలు జారటం వలన ముప్ప్ఫై అడుగుల పైనుంచి క్రింద పడ్డాడు. చూసిన వాళ్ళంతా అతడు. మరణించాడనుకున్నారు. అంతెత్తు నుంచి పడితే చాలా పెద్దదెబ్బ తగలటం స్వాభావికమే, కానీ జరిగింది మరొకటి జనం అంతా వాడి దగ్గర చూస్తే వాడికి మాత్రం దెబ్బ తగలలేదని తెలిసింది. బంతిని పట్టుకున్నట్టుగా ఎవరో వాణ్ణి చేతుల్తో పట్టుకొని క్రిందికి దింపారట! గొలుసు సాయంతో క్రిందికొచ్చినట్లుగా కూలివాడు క్షేమంగా క్రిందపడ్డాడు. ఏం జరిగిందో చెపుతూ కూలివాడు నా కాలు జారినప్పుడు నన్నెవరో పట్టుకొని క్రిందికి దింపారు అన్నాడు. తెలివి వచ్చి చూస్తే ఎదుట ఎవరూ లేనేలేరు అన్నాడు. యీ వృత్తాంతాన్ని విని అంతా అనందించారు. మఠం నిర్మించటంలో యీ కూలివాడు. చనిపోయాడు అనే మాటని శ్రీస్వామి తనపైకి రానీయకుండా తానే యితణ్ణి రక్షించారు అనుకున్నారంతా! 'నువ్వు పడటం కేవలం నిమిత్తమాత్రమే అయింది. కానీ శ్రీస్వామీజీ చెయ్యి నీవంటికి తగిలిందికదా! ఎంతటి అదృష్టవంతుడివి నువ్వు! ఇలాటి భాగ్యశాలి. యింకెవ్వరున్నారు? అన్నారు. అస్తు! ఒకరోజు ఒకరాజపుత్ స్త్రీ' రాజస్తాన్ నుంచి శేగాంవ్ వచ్చింది. ఆమెను భూతం పట్టుకుంది. ఆమెకు దత్తాత్రేయ స్వామి ద్వారా రామనవమి నాటికి శేగాంవ్ కు చేరుకోమని ఆజ్ఞ అయింది. 'అక్కడ శ్రీగజానన సద్గురువులు చిరంతన వాసం చేస్తూ వుంటారు. వారు నీ భూతాన్ని పారద్రోలి ఆభూతానికి ముక్తి కలిగిస్తారు, అని దత్తాత్రేయులు స్వప్నంలో సెలవిచ్చారు. ఇది స్వప్నంలో విని మహిళ తన యిద్దరు పిల్లలతో రామనవమి నాటికి శేగాంవ్ వచ్చింది. పాడ్యమి నుండే ఉత్సవాలు ప్రారంభ మౌతాయి. రామనవమి రోజుకు అక్కడ చాలామంది చేరారు. సమయంలో మండప నిర్మాణం జరుగుతోంది. మండపానికి ఆధార స్తంభాలుగా ఒకటిన్నర అడుగు వెడల్పూ, ఐదు అడుగుల పొడుగూ వున్న రాతి స్తంభాల్ని నిలబెట్టారు. ఉత్సవం కోసమని పని నాపుచేశారు. కానీ ఆస్తంభాలు అలానే వుండిపోయాయి. సమయానికి శ్రీరామజనన ఉత్సవం పూర్తయింది. ప్రసాదం కోసం ప్రోగైన భక్తులు ఎంతమంది వున్నారో వర్ణించటం కష్టం! రాజపుత్ర మహిళ కూడా జనంలోనే వుంది. జనాన్ని తట్టుకోలేక ఒక స్తంభానికి ఆనుకొని నిలబడింది. ఆనుకొనటమే తడవుగా స్తంభం ఒక్కసారిగా పడిపోయింది. ఆమె దానికింద ఇరుక్కుపోయింది. స్తంభం క్రిందపడ్డ మహిళ మరణించిందనుకున్నారందరూ! ఈమె ఎవరు? ఎక్కడిదీమె? ఈమెతో ఇద్దరు పిల్లలు కూడా వున్నారే! అనుకుని పది పదిహేను మంది  స్తంభాన్ని లేవనెత్తి, ఆమె నోట్లో నీళ్లుపోశారు. తరువాత డాక్టరు 'లోబో' దగ్గరకామెను పంపించారు. డాక్టర్ లోబో శాస్త్రవిద్య నిపుణురాలు ఈమె క్రిస్టియన్ మతానికి చెందినది. ఏసుక్రీస్తుభక్తురాలు ఆమె మహిళకు వైద్యం చేసింది. 'ఈమెకు లోపలకానీ, బయటకాని రవ్వంతైనా తగల్లేదు' అంది. స్తంభం చాలా బరువైనదీ, రాతిదీ! అది పడినా యీమెకు మాత్రం దెబ్బ ఎలా తగల్లేదు? అని ఆశ్చర్యపోయింది. చమత్కా చూసినవారంతా ఆశ్చర్యచకితులయ్యారు. కానీ ఆమె మాత్రం తనకొచ్చిన ఆపదనుంచి ముక్తురాలైంది! సంఘటనకు కార్యకారణ సంబంధం కూడా వుండవచ్చు కదా! స్తంభం పడటం ఆమెకు పట్టిన భూతాన్ని వదిలించటానికే కాని ఆమెకు దెబ్బ తగలటానికి కాదేమో! మహిళ ఆరోగ్యాన్ని పుంజుకుని తరువాత జయపూర్ వెళ్ళిపోయింది. ఆనందంగా జీవితం గడపసాగింది. సమాధిస్టులైనా శ్రీస్వామి గజాననులు యిట్టి మహిమలెన్నో చూపించేవారు. ఒకసారి మందిరంలో ఒక ఉత్సవం జరుగుతోంది. ఉత్సవం పూర్తయిన తరువాత 'నాయిక నీవర్యా' అనే పేరుగల వాడొకడు.. మండపానికి కట్టిన త్రాళ్లూ మొదలైనవి విప్పుతూవుంటే, ఒక చెక్క కందుకం ఎక్కడినుంచో పైనుంచి అతని తలమీద పడింది. కానీ స్వామీజీ కృప వలన అతనికేమాత్రం ప్రమాదం కలగలేదు. శేగాంవ్ లో కృష్ణాజీపాటిల్ కొడుకు 'రామచంద్రుడు' స్వామి యొక్క పరమభక్తుడు ఒకరోజు మధ్యాహ్నం స్వామి, సాధువు గోసాయీ వేషంలో అతని యింటికి వచ్చారు. బయటి నుంచే రామచంద్రుని పిలిచి నాకు ఆకలిగా వుందన్నారు. తినటానికేమైనా భోజనం దొరుకుతుందా? అన్నారు. పాటిల్ అత్యంత శ్రద్ధాభక్తులు కలవాడు. సాధువు పిలుపు విని అతడు గుమ్మంలోకి వచ్చాడు. అతడు జాగ్రత్తగా పరిశీలించి సాధువును చూడగానే సాధువు వేషంలో వున్నది పుణ్యరాశియైన శ్రీ గజాననులే! అని గ్రహించాడు! అతడు సాధువును చేతితో పట్టుకొని లోపలికి తీసుకొచ్చాడు. కూర్చుంటానికి పీటవేసి పాదపూజ చేశాడు. సాధువు అతనితో " రోజు నీకో విశేషం చెప్పటానికొచ్చాను. జాగ్రత్తగా విను. నీకున్న ఋణం త్వరలో తీరిపోతుందిలే! దాన్ని గురించి ఆలోచించకు! అరె! గ్రీష్మఋతువులో గోదావరి ఎండిపోదా? యిది మామూలు విషయమే! శ్రీహరి కరుణిస్తే ధనానికి కొదవవేమిటి? చోట నా ఎంగిలి (ప్రసాదం) పడుతుందో అక్కడ దేనికీ కొదవ వుండదుసుమా! అందుచేత

భోజనం చేయటానికి పళ్ళెం తీసుకొనిరా! మనసు పడ్డట్టయితే కప్పుకుంటానికో దుప్పటి కూడా యివ్వు! అరె! పూజ, అన్నం దక్షిణలతో యాచకుడు ప్రసన్నుడైతే ఇక గృహస్థుని భగవంతుడు కరుణించినట్లే! దీన్ని గుర్తుంచుకోవాలి! కానీ, యాచకుడు కూడా స్వయం విశుద్ధ అంతఃకరణ కలవాడైతేనే, దాని ఫలితం కలుగుతుంది" అన్నాడు. పాటిల్ భోజనం వడ్డించిన పళ్ళాన్ని తెచ్చి ముందుంచాడు. సాధువు ఎంతో ఆనందంతో భుజించాడు. పాటిల్ దక్షిణ రూపంలో ఐదు రూపాయలు యిచ్చాడు. ఐదు రూపాయలూ తిరిగి యిచ్చేస్తూ 'వీటి అవసరం నాకు లేదుగా! కానీ, నువ్వు శ్రీ గజాననస్వామి మఠాన్ని జాగ్రత్తగా చూడమని నా కోరిక! ఇదే నాకు కావలసిన దక్షిణ! దీన్ని స్వీకరించటానికే నేనిక్కడికి వచ్చాను. యివాళ నా దక్షిణను నాకివ్వు నీకెప్పుడూ శుభమే కలుగుతుంది. సమర్ధ సేవా దక్షిణనిచ్చి నన్ను సంతుష్టుణ్ణి చెయ్యి నీలాటి మరొక భక్తుడెవరూ యీ పనిని నిర్వహించతగినవాడు నాకు తోచడు! నీ పత్ని మాటి మాటికీ అనారోగ్యానికి గురియౌతూ వుంటుంది కదా! ఆమెకు కూడా యీ దక్షిణ తోనే శుభం కలుగుతుంది! ఇక నీ పుత్రుణ్ణిటు పిలు. వాడి మెడలో యీ 'తాబీజు' కడతాను. ఇక వాడికి భూత ప్రేత పిశాచాల బాధ ఎప్పుడూ రాకుండా పోతుంది! ఎందుకంటే 'గ్రామాధికారి'గా వుండటం చాలా కష్టమైనపని! ఇది నిప్పుతో చెలగాటం వంటిది. రామచంద్రా! గ్రామాధికారికుండే బరువు బాధ్యతలు అబద్దపు అధికారాన్ని చెలాయించటమే! ఐనా అధికారాన్ని అనవసరంగా (స్వలాభానికి) వుపయోగించుకోగూడదు. మనస్సులో ఎవరిపైనా ద్వేషం ఉంచుకోకూడదు. నీతిని వదలకూడదు. రాజుకి ఎదురు చెప్పకూడదు. వీటన్నింటినీ మించినవాడవైతేనే, శ్రీనివాసుడు నీకు ఋణపడి వుంటాడు. నా యీ వచనాలు సత్యాలుగా నమ్మి ఎప్పుడూ గుర్తుంచుకో! ఆదాయాన్ని బట్టి ఖర్చు చెయ్యి. ఆడంబరాలకు అతీతుడవుగా వుండు! సాధువులు, యోగులూ నీ యింటికి వచ్చినప్పుడు వారిని తిరస్కరించవద్దు. యోగి పురుషుల్ని అవమానించినట్లయితే ఈశ్వరుడు అప్రసన్నుడూ కుపితుడూ ఔతాడు. కాబట్టి యోగుల పాదపద్మాల యందు ఎప్పుడూ భక్తిశ్రద్ధలు కలిగివుండు. మన వంశంవారి నెప్పుడూ నాశనం చేయకూడదు బంధువులందరినీ సమయానుసారం గౌరవ మర్యాదలతో చూడాలి! ఇతరులతో పని చేయించాల్సి వచ్చినపుడు పైకి కఠినంగా వుండు కానీ లోపల మాత్రం దయతోను, ప్రేమతోను వుండు. పనసపండుకు పైన ముళ్ళలాటివి వున్నా లోపలుండే తొనలు ఎంత మృదువుగానూ,

తీయగాను వుంటాయో తెలుసా? అలానే వుండాలి మనస్సు నేనేప్పుడూ నిన్ను కాపాడుతూనే వుంటానన్న సత్యాన్ని మరువకు"! అని కొడుకు చేతికి తాబీజు కట్టి సాధువు బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెడుతూనే అతడు అంతర్ధానమయ్యాడు, యీ రామచంద్రపాటిల్ రోజంతా ఆలోచిస్తూనే వున్నాడు. సాధువెవరో మరొకడిలా వున్నాడు అనుకున్నాడు. చివరికి శ్రీ గజాననులే సాధువు రూపంతో వచ్చి వుండవచ్చు అనే అనుమానం కలిగిందతనికి. రాత్రి వచ్చిన కలలో అతని అనుమానం పోయింది. ఇలాటిదే శ్రీస్వామిగజాననులు భక్తవత్సలత, మరి శ్రీగజానన చరిత్ర పరమ పవిత్రమూ, తారకమూ అన్నది నిజమే! కాని వారి భక్తులకు కూడా వారియందు అలాటి ధృఢమైన శ్రద్ధాభక్తులు వుండాలి. తప్పదు మరి. నేనిక యీ చరిత్ర గ్రంథం యొక్క కధను చెపుతాను. సావధాన చిత్తులై ఆలకించండి. ఒక మంచి పని చేయటంలో ఆలస్యం చేయకండి. ప్రథమాధ్యాయంలో మంగళాచరణంచేసి, దేవ, గురువులకు వందనం చేశాను. తరువాత గజానన స్వామి యొక్క పూర్వ చరిత్రను చెప్పాను. మాఘమాసంలోని సప్తమినాడు 'సమర్ధులు' శేగాంవ్ లోని 'దేవిదాస్' సదనం దగ్గర మొట్టమొదటగా కనిపించారు. బంకట్ లాల్, దామోదరులు యిద్దరూ తెలివిగల వాళ్ళవటం వలన శ్రీ గజాననులను గుర్తించారు. ద్వితీయా ధ్యాయంలోని కధ ఇలా వుంది. గోవిందబువా కీర్తన వినటానికి స్వామి వచ్చి కూర్చున్నారు. ' 'పీతాంబర దర్జీ'కి దారిలోనే తమ చమత్కారాన్ని చూపించారు. తరువాత శ్రీస్వామి బంకట్ లాల్ యింటికి వెళ్ళారు. సజ్జనులారా! తృతీయాధ్యాయంలో సాధుపు సమర్ధలకు గంజాయి త్రాగిస్తానని మొక్కుకున్నాడు. స్వామి వాని కోరికను మన్నించారు. అప్పటినుండే శేగాంవ్ మఠంలో 'గంజాయి' త్రాగే ఆచారం ప్రారంభమయింది. స్వామి తమ చరణామృతాన్ని ప్రసాదించి 'జనారావు దేశముఖ్' ని గండాంతరం నుంచి తప్పించారు. మృత్యువు ఎన్ని రకాలుగా ఉంటుందో దాన్ని సవిస్తరంగా వివరించాను. స్వామి చేత కపట 'విఠోబా' చితకకొట్టబడ్డాడు. చతుర్థాధ్యాయంలోని కథ యిలావుంది. 'జానకిరాం' కంసాలి, స్వామి 'చిలుము'కై అగ్ని నివ్వనిరాకరించాడు. అందుచేత వండిన 'చించావణి'లో పురుగులు పడి వంటకం వ్యర్ధమైంది. తరువాత జానకిరాం జరిగిన తప్పును క్షమించమని క్షమాయాచన చేశాడు. స్వామీజీ జానకిరాంను క్షమించి 'చించావణి' యథా ప్రకారం ఉండేలా చేశారు. ఆనాటినుంచి జానకీరాం స్వామికి భక్తుడయ్యాడు. కుండల్లో దాచినవే రెండు కజ్జికాయలను తినటానికి తెమ్మని 'చందూ ముకిందా'ని స్వామి కోరారు. 'చింకోలీ' గ్రామనివాసి మాధవునికి యమలోకాన్ని చూపించి, స్వామి అతణ్ణి జనన మరణాల నుంచి ముక్తుణ్ణి చేశారు. శిష్యులతో వసంతపూజను చేయించారు. పంచమాధ్యాయంలో స్వామి 'పింపల' గ్రామం వెళ్ళి అక్కడి శివమందిరంలో పద్మాసనులై కూర్చుండిపోయారు. గొడ్లకాపరులు మందిరంలో స్వామిని పూజించి, రెండవరోజు గ్రామ ప్రజలంతా స్వామిని పింపల గ్రామంలోకి తీసుకొని వెళ్లారు. ఇది విన్న బంకట్ లాల్ స్వామిని శేగాంవ్ తిరిగి తీసుకొని రావటానికి పింపల్ గ్రామం వెళ్ళాడు. 'సమర్ధులను' తనతో తీసుకొని వచ్చాడు శేగాంవ్ కి. అక్కడ కొన్నాళ్ళుండి స్వామి భాస్కరుని ఉద్ధరించటానికి 'అకోలా' వెళ్ళారు. ఎన్నో ఏండ్లనుంచి ఎండిపడి ఉన్న నూతిని క్షణంలో నీటితో నింపేశారు. స్వామిని గురించి ఉన్న దురభిప్రాయం స్వామి చూపిన యీ లీలతో భాస్కరుని నుంచి తొలగిపోయింది. భాస్కరుడు స్వామి భక్తుడయ్యాడు. వారితో శేగాంవ్ వచ్చాడు. ఇది పంచమాధ్యాయంలోని కథ. షష్టాధ్యాయంలోని కథ యిది. బంకల్ లాల్ మొక్కజొన్న కంకులు తినటానికై స్వామిని తన పొలంలోకి తీసుకొని వెళ్ళాడు. పొగ రావటంవల్ల చింతచెట్టు మీదున్న తేనెటీగలన్నీ క్రింద కూర్చున్న వారిపై దాడి చేశాయి. భయపడి అందరూ అటూ ఇటూ పరిగెత్తారు. కానీ తేనెటీగలు స్వామినేమీ బాధించలేదు. ప్రసంగంతో బంకట్ లాల్ శిష్యత్వాన్ని పరీక్షించారు స్వామి. నరసింగ్ జీని కలుసుకోవటానికి స్వామి అకోట్ వెళ్ళారు, 'కోత్ షా అల్లీ కాకా' నరసింగ్ జీ శిష్యుడు. కొన్ని రోజులు ఆకోట్ లో ఉండి తమ గురుబంధువు నరసింగ్ జీ తో రహస్యాలు. మాట్లాడుకున్నారు. చంద్రభాగా నది ఒడ్డునున్న 'శివార్' గ్రామానికి వెళ్ళి ప్రజభూషణుని పై కృప చేశారు. శ్రావణ మాసంలో, మారుతీ మందిరంలోని ఉత్సవానికోసం అక్కడుందామని వచ్చారు. దీనితో షష్ఠాధ్యాయం సమాప్తమౌతుంది. శేగాంవ్ లో పాటిల్ బంధువులు బలవంతులవటం వలన స్వామిని సతాయించేవారు. హరిపాటిల్ తో స్వామి మల్లయుద్ధంచేసి మల్లయుద్ధమంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపించారు అందరికీ. చెఱకుగడ చమత్కారం చూపించి పాటిల్ బంధువుల గర్వాన్నణచివేశారు. 'భిక్యా' అనే పేరుగల పుత్రుణ్ణి కండూ కడతాజీ పాటిల్ కి ప్రసాదించి, ప్రతి సంవత్సరం -బ్రాహ్మణులకు ఆమ్ర ఫలాలతో భోజనం చేయిస్తానని అతనిచే వాగ్దానం చేయించారు. విధంగా సప్తమాధ్యాయంలో కథని చెప్పాను. పాటిల్ బంధువులకు శ్రీస్వామియందు భక్తి శ్రద్ధలు కలిగినాయి. అష్టమాధ్యాయంలో ఇక యిలాటి కథలున్నాయి పాటిల్ దేశముఖిల మధ్యవైరం వుండేది.

 

పాటిల్ కి విరుద్ధంగా ఒక మాలవాడు దేశముఖ్ చెప్పటం వల్ల కోర్టులో దావా వేశాడు. ఖండూపాటిల్ మీద దోషారోపణ చేయబడింది. అది సమర్ధ కృపచేత దావా గెలిచాడు. నిర్దోషి కావించబడ్డాడు. తెలుగు బ్రాహ్మణులకు వేదగానం వినిపించి తమ మహత్తు నిట్టే చూపించారు స్వామి. కృష్ణాజీపాటిల్ తోటలోనికి వచ్చి అక్కడున్న శివమందిరం దగ్గర ఆచ్ఛాదన వేయించుకొని అక్కడే ఉండిపోయారు. 'నైనం చిందంతి' అనే శ్లోకానుభూతితో బ్రహ్మగిరి గోసాయి అహంకారాన్ని తుత్తునియలు చేశారు. మండుతున్న మంచంమీద స్థిరచిత్తంతో కూర్చుని నిజమైన సిద్ధయోగులను వైశ్వానరుడు కాల్చడని నిరూపించారు. నవమాధ్యాయంలోని కధలు యిలా వున్నాయి. టాకలీకర్ యొక్క దుష్ట ప్రవృత్తిగల గుఱ్ఱాన్ని అదుపులోకి తెచ్చారు. బాలాపూర్ సజ్జనులిద్దరికీ గంజాయి మొక్కను గురించి జ్ఞాపకం చేశారు. దాసనవమి ఉత్సవానికి సరియైన సమయంలో బాలాపూర్ కి వచ్చి శిష్యుడైన బాలకృష్ణుని చేతిని తమ చేతిలోనికి తీసుకొని ఇంటిలోకి వచ్చారు. బాలకృష్ణునికి సమర్ధ రామదాస స్వామి యొక్క దర్శనాన్ని కలిగించి, అతనిలో వున్న అనుమానాన్ని తొలగించారు. దశమాధ్యాయంలోని కథ ఎంతో అందమైనది. ఇక్కడ బాళాభావుకు ఉపరతి కలిగింది. గణేశ్ అప్పా చంద్రాబాయి పతిపత్ను లిద్దరూ తమ సంపదనంతా స్వామి చరణాల కర్పించారు. 'గణేష్ దాదా ఖాపర్దేకు' స్వామి తమ కృప ఆశీర్వాదాలు ప్రసాదించారు. బాళాభావుని చితకబాది అతన్ని పరీక్షించారు. 'సుఖలాల్' యొక్క దుష్టస్వభావియైన గోవు స్వామి కృపాదృష్టి పడగానే మహాసాధువైంది. 'ఘుడే' యొక్క డాంభికభక్తిని బయట పెట్టేశారు. ఇక ఏకాదశాధ్యాయంలో బాస్కరుని కుక్క కరిచింది. అతణ్ణి కూడా తీసుకొని త్ర్యంబకేశ్వరంలోని 'గోపాల్ దాస్ జీ'ని కలుసుకున్నారు. 'ఝ్యామాసింగ్' ప్రార్ధించటం వలన 'ఆడ్ గాం' వెళ్లారు. సమయం రాగానే భాస్కరుడు వైకుంఠాన్ని చేరుకున్నాడు. అతని కళేబరం ద్వారకేశ్వర సమీపాన వున్న సతీబాయికి దగ్గరగా వుంచి దానిపైన సమాధికట్టారు. కాకులకు యిక్కడకు రావద్దని ఆజ్ఞయిచ్చారు స్వామి. 'గణూజబర్యా'ని 'సురంగం' నుంచి రక్షించారు. ద్వాదశా ధ్యాయంలో 'సేర్ బచ్చులాల్ వృత్తాంతం వుంది. స్వామి విరక్త జీవనమూర్తి. నిమ్నజాతివాడైన పీతాంబరుడు స్వామి యిచ్చిన వస్త్రాన్ని ధరించి తన కోరిక ప్రకారమే 'కంథోలీ' గ్రామాన్ని చేరుకున్నాడు. 'బలిరాం' పొలంలో నున్న వర్ణమాన ఆమ్రవృక్షానికి ఆకులు చిగురింపజేసి స్వామి యొక్క కృపచేత తన చమత్కారం చూపించాడు. తరువాత జనం కోరిక మీదనే అతడు కాండోలీ లో ఉండి తరువాత సమాధిగ్రస్తుడయ్యాడు అక్కడే. స్వామి కోరిక ననుసరించి నూతన మతస్థాపన జరిగింది. స్వామి పురాతన మఠాన్నుంచి బయలుదేరి ఇసుక బండిలో కూర్చుని నూతన మఠం ఉన్న చోటుకి వచ్చారు. 'ఝ్యామాసింగ్' గజాననులను 'ముడ్ గాం' తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఆకస్మికంగా మేఘాలు కురియటం వల్ల 'భండారా'కు విఘ్నం కలిగింది. ఝ్యామాసింగ్ తనకున్న ఆస్తినంతా స్వామి చరణారవిందాలకు ఆర్పించేశాడు! శ్రీవారి కృపవలన పుండలీకుని ప్లేగు వ్యాధి నయమయింది. పదమూడవ ఆధ్యాయంలో కథాభాగం వుంది. స్వామి గంగా భారతీ గోసాయీకున్న మహారోగం (కుష్ఠు) కుదిర్చారు. సమర్ధుల కృపవలన బండూతాత్యా భాగ్యం పండింది. పొలంలో ధనం దొరికింది. దాంతో వాడు ఋణముక్తుడయ్యాడు. సోమవతీ పర్వాన స్వామి భక్తులంత నర్మదాస్నానానికి వెళ్ళారు. నావకు రంధ్రం పడి నావ మునిగి పోవటం ప్రారంభించగా 'నర్మదామాత' స్వయంగా రక్షించింది. మాధవనాధుని శిష్యునితో తాంబూలాన్ని అతనికి పంపించారు. కథ పద్నాల్గవ అధ్యాయంలో వర్ణించబడింది. ఇక పదిహేనవ అధ్యాయంలో 'శివజయంతి' మహోత్సవ వర్ణన ఉంది. కారణంగా లోకమాన్య బాలగంగాధర తిలక్ అకోలా వచ్చారు. 'జొన్నరొట్టెని' ప్రసాదంగా కోల్హాట్ కరజీ ద్వారా స్వామి లోకమాన్య తిలక్ కిమ్మని బొంబాయికి పంపారు. 'శ్రీధర గోవిందకాళే'కి యితర దేశాలు వెళ్ళవద్దని అంతా యిక్కడే ఉందనీ, బోధించారు. పదహారో ఆధ్యాయంలో పుండలీకునికి స్వప్నంలో 'అంజన గ్రామం' వెళ్ళవద్దని ఆజ్ఞ యివ్వబడింది. ఝ్యామాసింగ్ ద్వారా నిజపాదుకలు పుండలీకునికి పంపబడ్డాయి. 'భావూకబర్' సమర్పించిన 'రొట్టె కూరలు' ప్రసన్నులై భుజించి అతని కోరికను తీర్చారు. తుకారాం చెవినుండి 'ఇనుపగోలీ' బయటికొచ్చిన ఉదంతం కూడా యీ పదహారో అధ్యాయంలోనే ఉంది. పదిహేడో ఆధ్యాయంలో రసభరితమైన కధలున్నాయి. మార్ కర్కాపూర్ లోని 'విష్ణుసా' ఇంటికి వెళ్ళటానికై స్వామి రైలుబండిలో బయలుదేరారు. వారు దిగంబరులుగా తిరుగుతారనే నేరం మీద వారిపైన పోలీసులు కేసుపెట్టారు. దీని వెనుక నున్నది సత్పురుషులను సతాయించటమే ముఖ్యమైన కారణం. హిందూ యవనుల (తురకలు)ను గురించి సరియైన ఉపదేశాన్నిచ్చి 'మహతాబ్ షా సాయీ'ని పంజాబ్ పంపేశారు. బాపూరావు పత్నికి పట్టిన భానుమతి పీడను వదిలించారు. అకోట్ గ్రామంలోని నూతిలో గంగ, భాగీరధీ జలాలు రప్పించి వాటితో స్నానం చేశారు. పద్దెనిమిదో ఆధ్యాయంలో 'బాయజా మాలినీ' కధ ఉంది. 'కబర్' డాక్టరు యొక్క గడ్డని నయం చేసిన వృత్తాంతం కూడా ఉంది. 'కవఠేబహాదూర్ వారికర్' ప్లేగు రోగంతో బాధపడ్డాడు. అతని బాధని నిమిషంలో స్వామి తగ్గించేశారు. చచ్చి పడివున్న కుక్కను బ్రతికించి, ఒక కర్మనిష్ఠుడైన బ్రాహ్మణుని కర్మాభిమానాన్ని తొలగించారు. పందొమ్మిదవ ఆధ్యాయంలో స్వామి మహదానందభరితులై 'కాశీనాధ్ పంత్'ని ఆశీర్వదించారు. 'గోవింద్ ముకుంద్ బూటీ' స్వామిని నాగపూర్ కి ఆహ్వానించి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. స్వామిని తమ యింటనే ఉంచుకోవాలని అతని కోరిక! కానీ హరిపాటిల్ స్వామిని శేగాంవ్ తీసుకొని వచ్చాడు. 'ధార్ కల్యాణ్ నివాసి రంగనాథ్ సాధువు, స్వామిని కలియటానికి శేగాంవ్ వచ్చాడు. ఇలా ఎంతమందో వచ్చి పోతూ వుండేవారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి కర్మయోగి శేగాంవ్ వచ్చినపుడు ఇద్దరి దృష్టి కలియటంతోనే వారిద్దరూ ఎంతో ఆనందించారు. బాళాభావూకి మనస్సులో సంశయం కలిగినపుడు స్వామీజీ తమ ఉపదేశం ద్వారా దాన్ని దూరం చేశారు. గాడిదల నుంచి జొన్నచేను రక్షించారు. సమర్ధులను (స్వామీ గజాననులను) కొట్టటం వలన నారాయణ హవల్దారు చనిపోయాడు. గజాననుల కృప కాగానే జాకడ్యాకు వివాహమైంది. కపిలధారలో నిమోణ్ కర్ కు స్వామి దర్శనమిచ్చారు. తుకారాం తన పుత్రుణ్ణి నారాయణుని మఠంలో సేవ చేయటానికి స్వామికి అర్పించేశాడు. పండరిపురం వెళ్లి పాండురంగని ఆజ్ఞను పొంది స్వామి శేగాంవ్ వచ్చేశారు. ముందు భాద్రపదమాసంలోని ఋషిపంచమి శుభదినాన ఆధునిక యుగంలో ఋషి శేగాంవ్ లో సమాధిస్థులయ్యారు. ఇరవయ్యో అధ్యాయంలో శ్రీస్వామి యొక్క శరీరం వెళ్ళిపోయినప్పటికీ, శ్రీ సమాధిస్థులవటం వలన జరిగిన చమత్కారాలు వర్ణనలు ఉన్నాయి. వారి చైతన్యం నిరంతరం శేగాంవ్ లోనే వుంది. దీని అనుభూతి నేటికీ భక్తులకు కలుగుతూంటుంది! స్వామి యందు అత్యంత భక్తి శ్రద్ధలు కల భక్తులకు నేడు కూడా వారు దర్శనం యిస్తుంటారు. అంతేకాక వారి మనోవాంఛితాలను కూడా తీరుస్తూ వుంటారు. ఇక ఇరవై యొకటవ అధ్యాయం అన్ని అధ్యాయాల కలశము అంటే అన్ని కథల యొక్క సారమూ లేక సారాంశము. ప్రతి అధ్యాయంలోనూ వర్ణించిన సంఘటనలు నేటికి కూడా నమ్మకాన్ని కలిగిస్తాయి. అందువల్లనే యీ అధ్యాయానికి అన్నింటి సారాంశము అన్నది. ప్రజలు ఆర్ధికంగా సాయంచేయటంవల్లనే యీ సమాధి మందిరాల భవ్యవాస్తు సాకారమైంది. చందాలు జమచేయటం భక్తులు తమ మనస్ఫూర్తిగా చేశారు. ఇలాటి సుందర మందిరం భవ్యమందిరం మరెక్కడా కనిపించదు. మందిరానికి యిరుప్రక్కలా ధర్మశాలను నిర్మించటం వలన భక్తుల కెంతో సదుపాయంగా వుంది. భవ్యమందిరం నిలబడటానికి అనంతమైన హస్తాలు సాయపడినాయి! వారందరి పేర్లు వ్రాసినట్లైతే గ్రంధం చాలా పెద్దదై పోతుంది!వారిలోని ప్రముఖులు కుకాజీ కుమారుడు 'హరిపాటిల్' నామధేయుడు. సామగవీ గ్రామపు బనాజీ, ఉమరీ గ్రామపు గణాజీ, బట్వాడీ నివాసి మేసాజీ, లాడేగాం నివాసి గంగారాం, భాగూ నందూ, గుజాబాయి, అకోలా నివాసి బగూనాబాయీ (సుకదేవ్ పాటిల్ తల్లి) యీ భక్తులంతా వేలకొద్దీ రూపాయలిచ్చారు. పాటిల్ రామచంద్ర కృష్ణాజీ, దత్తు భికాజీ, పళసఖేడ్ నివాసి సుఖదేవ్ జీ, శేగంవ్ నివాసి మార్తాండ్ గణపతి, బాలచంద్ ని రతన్ లాల్, పంచగన్హన్, యొక్క దత్తూలాల్, గ్రామం నివాసే కిషన్ లాల్, టాకలి నివాసి అంబర్ సింగ్, కిషన్ బేలకుండళేకర్, విఠోబాపాటిల్, చావరేకర్, హసనాపూర్ నివాసి గంగారాం, వీరంతా స్వామియందు అత్యంత భక్తిశ్రద్ధలు కలవారవటం వలన ముక్తహస్తాలతో దానాలిచ్చారు. దీనితోటే మఠము, సమాధి మందిరమూ నిర్మించబడ్డాయి! ధాన్యపుకోటు (కోఠీఘర్), కచేరీ (కచహరీ) చావిడి, వంటశాలలకోసం సమాధికి ఇరువైపులా స్థలం వుంది. ప్రజలనుంచి వసూలైన చందా అంతా వీటి నిర్మాణానికి ఖర్చైపోయింది. ఇంకా చాలా పని మిగిలివుంది. అందుచేత చందా వసూలు చేయడానికో వుపాయం ఆలోచించబడింది. అది ఇది, రైతులదగ్గరనుంచి భూమి శిస్తులో రూపాయి ఒక్కటికీ, ఒక అణాచొప్పున వసూలు చేయబడేది. దీన్ని ధార్మికకార్యాలకే వుపయోగించేవారు. కాబట్టి యిది యివ్వటంలో రైతులకెట్టి అభ్యంతరమూ వుండేదికాదు. రైతులు బళ్ళమీద వేనినైతే అమ్మకానికి తీసుకొని వెడతారో వారినుంచి బండికొక్కటికి అర్ధణాచొప్పున వసూలుచేసేవారు. అందరికీ, సమర్ధ స్వామిపై అత్యంత భక్తిశ్రద్ధలుండటం వలన రైతులు ఆనందంగా చందాలిచ్చేవారు! సమాధి ఎదుట ఎన్నో స్వాహాకారాలైనాయి (హోమాలు). అవి చేయించిన వారిలో నలుగురు సర్వశ్రుతులు. 'కిషన్ లాల్ సఠేజీ', 'బ్రాహ్మణోద్ధారా శతచండీ ' అనుష్ఠానాన్ని చేయించాడు. శతచండీ అనుష్ఠానవిధి చాలా కష్టతరమైంది. జగదంబ కాళీమాత యీ అనుష్టానంలో పొరపాట్లు జరిగితే సహించదు! విధి విధానంలో ఏదైనా లోపం జరిగినట్లైతే దాని పరిణామం విపరీతమే 'అవుతుంది! ఎందుకంటే 'కామ్య అనుష్ఠానాల'లో ఇదే భయం ఎప్పుడూ వుంటుంది. కిషన్ లాల్ తండ్రి బంకట్ లాల్. ఇతడు మొదటినుంచీ స్వామి యొక్క ఏకనిష్ఠభక్తుడు. 'శతచండీ అనుష్ఠాన పూర్ణాహుతి' రోజున బంకటాల్ వ్యాధిగ్రస్తుడయ్యాడు. అతడు చివరిశ్వాస పీలుస్తున్నాడు. సంఘటన్ని చూసి, అతడూ అతడి కుటుంబం వారంతా భయపడిపోయారు. 'శతచండీ అనుష్టానం చేసే సమయంలో యీ విఘ్నం ఎందుకొచ్చింది? అని ఆలోచించసాగారు. కాని బంకట్ లాల్ కొడుక్కి ధైర్యం చెపుతూ 'నన్ను గురించి విచారించకు. నన్ను తరింపచేసేవారు సమాధిలోనే కూర్చుని వున్నారు! ఆయనే నన్ను రక్షిస్తారు. మీరేమీ బాధపడకండి! పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా కానీయండి! స్వామీ గజాననులు యిలాటి శుభకార్యంలో విఘ్నం ఎప్పటికీ రానీయరు! దీనిమీద విశ్వాస ముంచు. భక్తులను రక్షించటానికే స్వామీజీ యిక్కడ కూర్చున్నది అన్నాడు. బంకట్ లాల్ అన్నది అక్షరాలా నిజమయింది. అతడు కొద్ది దినాల్లో వ్యాధిముక్తుడయ్యాడు. శతచండీ అనుష్టానం వలన ఒక స్త్రీకి భూతబాధ తొలగిపోయింది. బనాజీ తిడకే సాంగ్వీకర్ కూడా యజ్ఞం చేయించాడు. కసుర్యాలో నివసించే గుజాయి అనే మహిళ, చాపడ్ గాం నివాసి శ్యామరావు పుత్రుడు వామన్ మొదలైన యిద్దరూ స్వామి సమాధికి ఎదుట ఒక యజ్ఞాన్ని చేయించారు. ఇలాటి ధార్మికకార్యాలెన్నో ఆసమాధి కెదురుగా చేయబడ్డాయి. నిజంగానే శ్రీగజాననస్వామి సిద్ధులైన యోగిరాజులే! జనం నిషావంతులుగా వున్నంతకాలం వర్హాడ ప్రాంతమంతా సుభిక్షంగా వుండేది. కానీ, ప్రజల్లో భగవంతునియందు శ్రద్ధాభక్తులు సన్నగిల్లటం వలన వర్షాడ ప్రాంతానికి విపన్నావస్థ వచ్చిపడింది. అంటే దుర్దైవం వర్హడ ప్రాంతం మెడలో దారిద్ర్యపుమాలను వేసిందేమో అన్నట్లుగా వుంది. భూదేవి ఎక్కువపంటలు పండించటం మానేసింది. వర్హడ ప్రాంతం అంతా కఱువు వచ్చేసింది. వర్హాడ దీనస్థితిని చూసి స్వామీజీ సహించలేకపోయారు. అందుచేత వారు జలబంధనంలో వుండిపోయారు. ముప్పై అడుగులు తవ్వితేనే నీరు కనిపించేది. దీన్నిబట్టే స్వామి కోపించినట్టు కనబడసాగింది. చుట్టుప్రక్కలంతా నీటిమయం చేసేశారు. వర్హడ ప్రాంత వాసులు సుఖశాంతులు కావాలని కోరుకునేటట్లయితే ఇదివరకులానే శ్రీ గజాననస్వామిపై అత్యంత భక్తి శ్రద్ధలు కలిగివుండాలి అంతా! అప్పుడే హాయిగా నిద్రించగలిగేది! ఒకవేళ వారలా చేయనట్లైతే వర్హాడ ప్రాంతం అంతా యింతకంటే దుర్దశపాలౌతుంది! విషయాన్ని గురించి ప్రజలు ఆలోచించాలి. కాబట్టి. శ్రీ గజాననుని పాదపద్మాలయందు ధృఢతరమైన భక్తిశ్రద్ధలనుంచి సుఖాన్ని అనుభవించండి! విషయంలో ఎవరూ ఎట్టి అనుమానమూ

పెట్టుకోకూడదు! గజానన రూపమైన భూమిలో ఎన్నిగింజలు నాటితే, అన్నిటికీ రెట్టింపై అవి మీ దగ్గరికే వస్తాయి. రాతి మీద గింజలువేస్తే మొలవదని గుర్తుంచుకోవాలి. ప్రాంతంలో (భూభాగంలో) సిద్ధయోగుల (మహాత్ముల) యెడల అవహేళన, అరుచి కలుగుతుందో అక్కడ. నిశ్చయంగా కఱువు వచ్చి తీరుతుంది! ఇది గుర్తుంచు కోవలసిన విషయం సుమా! మనస్సనే సముద్రంలోంచి ధర్మరూపమైన శ్రద్ధ (భక్తి) బయటికి పోయినట్లైతే, దుర్వాసన అనే నక్క అక్కడికి తప్పకుండా వచ్చి తిష్ఠవేస్తుంది! భక్తి శుచిర్భూతమైన అంగన (స్త్రీ) అయితే అభక్తి (భక్తి లేకుండుట) వారాంగన (వేశ్య) అవుతుంది. అభక్తి వెంటబడినవాడి కెవరికైనా నేటి వరకూ మంచి జరిగిందా? కాబట్టి నన్నీతి చేతినే గట్టిగా పట్టుకొని వుండాలి. ధర్మభావనను వదలకుండానూ వుండాలి! ఎవరినీ శత్రువనుకోకుండా, అందరూ మిత్రులే అనే భావంతో అందరితోనూ సద్వదనం చెయ్యాలి! అప్పుడు శక్తి వృద్ధి ఔతుంది. ప్రజలు యీ విధంగా శుద్ధ ఆచరణను అవలంభించినట్లయితే, మళ్ళీ వర్హాడ ప్రాంతానికి మంచిరోజులొస్తాయి! విషయాన్ని మాత్రం మరువకూడదు! కనీసం సంవత్సరానికొక్కసారయినా స్వామి దర్శనానికై శేగాంవ్ కి రావాలి! సంవత్సరానికి ఒక్కసారి శ్రీ గజాననుల చరిత్రను పారాయణం చేయాలి! ఇరవైయొక్క ఆధ్యాయాలు కలిగిన యీ శ్రీగజానన విజయమనే గ్రంథరూపమైన 'మోదకాలు' తయారుచేసి శ్రీస్వామి.. గజాననుల పాదపద్మాలకు సమర్పించండి. సద్భావమే చతుర్థి తిథి. ఆనాడు ప్రేమరూపమైన చంద్రుడు ఉదయిస్తాడు. సజ్జనులారా! గ్రంధంలోని ఒక్కొక్క అక్షరమూ 'దుర్వాంకురము', శబ్దార్ధము 'మోదకమూ' అని భావించండి. అది శ్రీగజాననస్వామికి అర్పించి, పారాయణ రూపమైన ప్రసాదాన్ని స్వీకరించండి. శుభకార్యానికి విలంబన మెందుకు? గ్రంథము ఏకల్పితకథో లేక నవలో అని అనుకోవద్దు! ఇది శ్రీస్వామీజీ స్వయంలీలలే! దీన్ని గురించి ఎవరికైనా సందేహం కలిగినట్లయితే, వాడు తప్పక నాశనమౌతాడు. గజాననుల చరిత్రను నియమంగా ప్రతిరోజూ ఎవరైతే పఠిస్తారో వారి మనోవాంఛితం తప్పక తీరుతుంది! గజానన చరిత్ర భాగీరథీ, యిందులోని కథలు నీరు, మరి 'ఓశీలు' (ఓనియం పద్యాలు) నీటిపై అలలు అని తెలుసుకోండి. లేకుంటే స్వామి చరిత్ర కల్పవృక్షమే! అధ్యాయాలు దాని శాఖలు, పద్యరచన యీ వృక్షానికి పల్లవాలు (చిగుళ్ళు). గ్రంథం పైన దృఢవిశ్వాసం, శ్రద్ధా వుంచిన వారిపై శ్రీస్వామి ఎప్పుడూ ప్రసన్నులుగానే వుంటారు. అంతేకాక ఆపదలో వారికి సహాయపడతారుకూడా! గ్రంథాన్ని చింతామణిగా తలచు దీనివలన కోరుకున్నది నిస్సంశయంగా లభిస్తుంది. దీనిపై నితాంతభక్తి వుండాలి. గజానన చరిత్ర ఎక్కడైతే పారాయణ చేయబడుతుందో అక్కడ లక్ష్మీదేవి చిరకాల నివాసం చేస్తుంది. దరిద్రునికి ధనం లభిస్తుంది. రోగి నిరోగి అవుతాడు. నిపుత్రులకు పుత్రులు కలుగుతారు. నిష్కపటమైన మిత్రుడు లభిస్తాడు. గ్రంథాన్ని పఠించేవాడు ఎల్లప్పుడూ చింతారహితుడై వుంటాడు. దశమి, ఏకాదశీ తిథులలో దీనిని పారాయణ చేసినట్లయితే అతడు గజాననుల కృపకు పాత్రుడై భాగ్యవంతుడౌతాడు. గురుపుష్య పవిత్రదినాన శుచిర్భూతుడై ఒకేచోట కూర్చుని ఎవరైతే పఠిస్తాడో, వాని అభీష్టాలు ఏవైనాసరే తప్పక తీరుతాయి! గ్రంథం ఎక్కడైతే పూజింప బడుతుందో, అక్కడ భూత బాధలూ, బ్రహ్మసంబంధమైన కష్టాలూ వుండవు. శ్రద్ధాళువులైనవారికి దీని అనుభవం తప్పక కలుగుతుంది. కుటిలుడు, దుర్జనుడు అయినవాడికి యీ అనుభూతి కలగదు. మానస సరోవరం రాజహంసకోసమేకదా! అలానే యీ స్వామి గజాననుల చరిత్ర, సిద్ధయోగులు సజ్జనులకు మానససరోవరం వంటిది! పూర్వకాలంలో జ్ఞానేశ్వరులూ, మీరా, నరసీమెహతా, కబీరు, నామదేవుడు, సావంతామాలి, చోఖామహార్, గోరాకుమార్, బోధలా. రామాపంత్ , ఉబర్ భేట్, ఏకనాధులు, అమళనేర్ లోని సఖారాం, దేవామాదర్, యశవంత్, మాణిక్ ప్రభూ మొదలైన వారందరూ ఎట్టివారో అలానే వర్హడ ప్రాంతంలో సద్గురునాధులు శ్రీ గజాననులూ అట్టివారే. వీరందరిలో తేడా ఏమీ లేదు. శ్రీ గజాననుల పాదపద్మాలందు ఎప్పుడూ ప్రీతి మందండి అని శ్రద్ధాళువులు ప్రార్ధింపబడుతున్నారు. అలాచేసినట్లైతే జన్మ మృత్యువుల చక్రంనుంచి తప్పించుకోవచ్చు. మీరు భవసాగరాన్నీ దాటిపోతారనేది సత్యమని నమ్మండి! ఇక హే! స్వామీ దయాఘనా! దాసగణూని దయచూడవయ్యా! ఇతణ్ణి బాధలనుంచి, ఆపదలనుంచి రక్షించు! నేను నీకు భట్రాజునే అయ్యాను. నాకు సరియైన మార్గాన్ని చూపు. నా చిత్తాన్నుంచి దుర్వాసనలను గెంటివెయ్యి. నేనున్నంతకాలమూ నీ ఆధారం ఉండుగాక ! యోగుల చరణాలందు ప్రేమకలుగుగాక! శ్రీగోదావరి తీరాన అక్షయవాసమగుగాక! నాకు యాచించేస్థితి రానీకుండా దయజూడవయ్యా! హే! సమ! దాసగణూలో ఆత్మీయతనే ఉండనీ! నేనే మహాత్ములందరి పాదధూళిని, నన్ను మీవాడినిగా తలచండి! అని దాసగణూ జోలెపట్టి ప్రార్దిస్తున్నాడు. "హే గజాననస్వామీ! మనస్సులో ప్రేరణ కలిగిన విధంగా నేనీ చరిత్రము గానంచేశాను. శేగాంవ్ లోని మఠంలో కొన్ని కాగితాలూ...

 

పత్రాలూ ఉన్నాయి. వాటిని నాకు 'రతన్ సా ' తెచ్చియిచ్చాడు. వాటి ఆధారంగానే యీ చరిత్ర వ్రాయబడింది. ఇందులో కల్పితమేమీ లేదు. ఇందులో ఎట్టివైనా ఎక్కువ పొరపాటు జరిగి ఉన్నట్లైతే దానికి నేను బాధ్యుణ్ణి కాదు! ఐనా ఇందులో పొరపాట్లున్నట్లయితే, హే గజానన స్వామీ! నన్ను క్షమించగలందులకు ప్రార్ధన! శక సంవత్సరం పద్దెనిమిది వందల అరవై ఒకటిలో, ప్రమాదినామ సంవత్సరంలోని చైత్రమాసంలోని వర్షప్రతిపద (ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి) నాడు శేగాంవ్ లో శ్రీగజాననస్వామి నాచే యీ గ్రంథాన్ని కలశాన్ని అధిరోహించే విధంగా పూర్తి చేయించారు. స్వస్తి శ్రీదాసగణూచే విరచితమైన శ్రీ గజానన విజయమనే యీ గ్రంథం శ్రద్ధాళువులకు భవసింధువును దాటటంలో నౌక యగుగాత!

 

సంపూర్ణం....
 
శుభం భవతు
|| శ్రీ హరిహరార్పణమస్తు
ఇది ఏకవింశాధ్యాయము సమాప్తము
 
పుండలీకవరద హరివిఠల
|| సీతాకాంత స్మరణ జయ జయరాం
పార్వతీ పతే హర హర మహాదేవ