శ్రీ గజానన విజయం
పద్దెనిమిదవ అధ్యాయం

 

శ్రీ గణేశాయ నమః. జయ జయ శ్రీ చిద్విలాసా! హే గోవిందా! శ్రీనివాసా! హే ఆనందకంద పరేశా! పాహిమాం! దీనబంధో! హే! కేశవా! కేశిమర్దనా! హే మాధవా! మధుసూదనా! హే పూతనాసంహారా! హే పాండురంగా! రుక్మిణీపతే! హే చక్రపాణీ! నా మనసులోనిది నీ వెరుగుదువు కదా! హే! పద్మనాభా! నీ వెరిగినది మళ్ళీ వల్లించటం ఎందుకు? ఏమిలాభం? హే శ్రీహరీ! భక్తులు కోరినదిచ్చి వారిని తృప్తి పరుస్తావు! ఇలాటి స్తుతి పురాణాల్లో అనేక చోట్ల ఎన్నిమారులో వస్తుంది! హే పండరినాథా! నా కోరికను తీర్చు నీ మనసులోని కాఠిన్యాన్ని వదలివేయి! 'దాసగణూ' నీవాడే కదా! అస్తు! ‘అకోట'కు దగ్గరనే వున్న 'ముడ్ గావ్' అనే నగరంలో 'బాయజా' అనే ఒక స్త్రీ వుంది. ఆమె స్వామీజీ భక్తురాలు. 'హళదీ మాలీ' వంశంలో ఆమె జన్మించింది. ఆమె తండ్రి శివరాం, తల్లి భులాబాయి. బాయజ వివాహం చిన్నతనంలోనే అయింది. విధాత ఫాలభాగాన వ్రాసినట్లే మానవుడు. తన జీవితాన్ని గడపవల్సి వస్తుంది. బాయజ తరుణ వయస్కురాలైంది. కాబట్టి గర్భాధాన కార్యక్రమానికై తండ్రి ఆమెను అత్తవారింటికి తీసుకొని వెళ్ళాడు. కానీ జామాత నపుంసకుడని తెలిసింది. అందువలన తల్లిదండ్రులు ఎంతో దుఃఖితులయ్యారు. 'బాయజ' దుస్థితి గుర్తుకురాగానే ఆమె తల్లి ఎంతో ఏడ్చింది. ఆమె పతికారణంగా బాయజ బ్రతుకు వ్యర్ధమై పోతుందని దుఃఖించింది తల్లి. భులాబాయి పతి శివరాంతో "ఇంక ఇక్కడ బాయజాని వుంచటం మంచిదికాదు. దీనికి పునర్వివాహం మరోచోట చేద్దాం!" అంది. దాని మీదట శివరాం "ఇప్పుడే కంగారుపడటం మంచిదికాదు.

ఒక్కొక్కరికి పురుషత్వం రావటం కొంచెం ఆలస్యం అవుతుంది. కాబట్టి కొద్దిరోజులు వేచి చూద్దాం! బాయజాని కొన్నాళ్ళు అత్తింటిలోనే వుంచుదాం. నపుంసకత్వం ఏ కారాణామైనావస్తే మందులవల్ల దాన్ని దూరం చేయవచ్చు. కొన్నాళ్ళు చూద్దాం! అన్నాడు. ఇలా ఇద్దరూ ఆలోచించుకొని బాయజాని అత్తింటిలో విడిచిపెట్టి ముడ్ గాం వెళ్ళిపోయారు. అప్పటికి బాయజా పదిహేను పదహారు సంవత్సరాల వయసు గలది. ఆమె రంగు నలుపే. తారుణ్యం వలన ఆమె శరీరం అందంగా వుంది. కనుముక్కు తీరు చక్కనిది. శరీరం నాజూకుగా సన్నగా పొడవుగా వుండి చూచినవాణెవరినైనా మోహింపజేసేదిగా వుండేది. ఆమెను చూడగానే ఆమె పెద్దబావగారికి ఆమెను పొందాలన్న కోరిక కలిగింది. తన కోరిక తీర్చుకునేందుకు ఆ దృష్టితో అనేక ప్రయత్నాలు చేశాడు. అతడు ఆమెతో "నీ భర్త కారణంగా వ్యధ చెందకు. నేనే నీ పతిస్థానంలో వున్నాను. బ్రతికున్నంత కాలం నిన్ను చక్కగా చూసుకుంటాను. విషణ్ణవదనవు కాకు. సంతోషంగా జీవించటానికి ప్రయత్నించు. నేటినుంచి నన్నే నీ భర్తగా చూసుకో! అని ప్రలోభ వాక్యాలు పలుకుతూ, ఏవో సంజ్ఞలు చేస్తూ, ఏవో వస్తువులు యిచ్చే మిషతో ఆమెను తన వలలో వేసుకోవటానికి ప్రయత్నిస్తూ వుండేవాడు. కానీ, బాయజా మంచి వంశం, సంస్కారం వున్న కుటుంబంనుంచి వచ్చిన పిల్ల కాబట్టి అతని ఆటలు సాగలేదు! బావగారి యీ దుష్ప్రవర్తనను చూసి భగవంతుణ్ణి ప్రార్ధించేది? "హే! నారాయణా! నన్నెందుకిలాటి ఆపదలో పడేశావు? హే! భగవాన్! చిన్నప్పటినుంచీ నీ చరణాల్నే నమ్ముకున్నానే! దానికిదే ప్రతిఫలమా? నాకో తోడు దొరికాడు. అతడు నపుంసకుడు. ఈ విషయాన్ని తెలుసుకున్న నేను నాకు శారీరక సుఖం అనుభవించే అదృష్టం లేదని నిశ్చయించుకొని నా మనస్సునెంతో నిగ్రహించుకొనటానికి ప్రయత్నిస్తున్నాను. జరిగిందేదో నా ప్రారబ్ధాన్ననుసరించి జరిగిందే! ఐతే ఓ! శేషశాయీ! పరపురుషుని నా మనస్సులోనికి రానివ్వద్దనీ, నీ యెడనే నా చిత్తం లగ్నమై ఉండాలనీ నిన్ను ప్రార్ధిస్తున్నాను." అని ప్రార్ధిస్తూ వుండేది. ఒకరోజు రాత్రి పెద్ద బావగారు బాయజా దగ్గరకు వచ్చి తన మనసులోని చెడ్డమాట చెప్పాడు. బావగారి మాటల్ని విని బాయజా అతణ్ణి తిరస్కరిస్తూ "ఇలాటి మాటలు అడగటానికి మీకు సిగ్గులేదూ? సిగ్గూ బిడియం వదిలేశారా? పెద్ద బావగారు తండ్రితో సమానం బాంధవ్యంలో! కాబట్టి యీ చెడు ఆలోచనల్ని కట్టిపెట్టి కామాంధులవకండి!" అన్నా అతడు వింటేనా? విషయవాసన అతణ్ణి కామాంధుణ్ణి చేసింది మరి! విషయలోలుడైనవాడు.

కామవాసన ప్రజ్వలితమైనపుడు ధర్మం, నీతి అన్నీ మర్చిపోతాడు. వాడు ఆ కామవాసనతో మరదలి భుజం మీద చెయ్యి వేయబోయాడు. అదే సమయంలో అతని కొడుకు మెట్లమీంచి పడిపోయాడు. పడటంవల్ల ముఖానికి దెబ్బతగిలింది. బాయజా పరిగెత్తిపోయి ఆ పాపణ్ణి తన ఒళ్ళోకి తీసుకొని మందు రాసింది. తరువాత బాయజా "పరస్త్రీని కోరటం చాలా తప్పు!" అంది అతనితో. కుర్రవాడు పడిపోవటం వలన అతడు భయపడిపోయాడు. తన చెడు బుద్ధికి పశ్చాత్తాపం కలిగిందతనికి. తర్వాతెప్పుడూ అతడు తన మరదల్ని సతాయించలేదు. కొన్నాళ్ళ తర్వాత శివరాం తన కూతుర్ని అత్తవారింటినుండి 'ముడ్ గాం' తీసుకొని వచ్చాడు. భులాబాయి తన పతితో 'మన అమ్మాయిని తీసుకొని శేగాంవ్ వెళ్ళి, స్వామిని దీని భవిష్యత్తును గురించి అడుగుదాం! అంది. పత్ని అన్నది బాగానే వుందనిపించింది పతికి. ముగ్గురూ కలిసి శేగాంవ్ మఠానికి వెళ్లారు. అమ్మాయి స్వామికి సాష్టాంగ ప్రణామం చేసినపుడు శివరాం "స్వామీ నా బిడ్డని కనికరించండి! దీనికి పుత్రపౌత్రులు కలిగేలా ఆశీర్వదించండి!' అన్నాడు. శివారాం మనసునెరిగిన స్వామీజీ నవ్వుతూ 'అరె! శివరాం! దీని అదృష్టంలో పుత్రుడు కలుగుతాడని విధాత వ్రాయలేదు. ఈ లోకంలో వున్న పురుషులంతా యీమెకు తండ్రిసమానులే! దీనివలన యీమెకు పునర్వివాహం చేసే ప్రయత్నం చేయకండి అన్నారు. ఇది విని శివరాం ఎంతో బాధపడ్డాడు. బాయజాని వెంటబెట్టుకొని ముడ్ గావ్ తిరిగి వచ్చేశాడు. తల్లిదండ్రులైతే స్వామీజీ పలుకులు విని చాలా బాధపడ్డారు కానీ కూతురు మాత్రం చాలా సంతోషించింది. ఈ నాటినుండి బాయజాకు శ్రీ గజాననస్వామి యెడల వున్న భక్తి పెరగసాగింది. పుండలీకుడనే స్వామి భక్తుడు ముడ్ గావ్ లో వుండేవాడు. అతనితో కలిసి శ్రీస్వామి దర్శనానికి శేగాంవ్ వస్తూవుండేది. మొదట్లో తల్లిదండ్రులు బాయజా పుండలీకునితో శేగాంవ్ వెళ్ళటానికి అభ్యంతరమేమీ చెప్పలేదు. తల్లిదండ్రులు కూతురు స్వామి చరణాలనే నమ్ముకుంది అనుకున్నారు. స్వామియే దయతలచి ఆమెను దయజూస్తారు! జామాతకు పురుషత్వాన్ని ప్రసాదించవచ్చు! సిద్ధయోగులేమైనా చేయగల సమర్థులు కదా! అందుచేత పుండలీకునితో శేగాంవ్ వెళ్ళటానికి అభ్యంతరం కలగలేదు. ఆమెను వారించనూ లేదు. కానీ యీ విషయం ఆనోట ఆనోట అందరికీ తెలిసిపోయింది. నానా మాటలూ అనసాగారు. ఇద్దరూ కలిసి శేగాంవ్ యాత్ర వెళ్లటం ఒక నిమిత్తం అనుకోసాగారు. యువావస్థలో వున్నవానికి పారమార్ధిక చింతనంలో మనస్సు లగ్నమౌతుందా?

అని. బాయజా తరుణావస్థలో వుంది. అటు పుండలీకుడు యువకుడే మరి! కాబట్టి యీ కారణాలే వారి విషయవాంఛలకు దారితీయవచ్చు! వారిద్దరూ ప్రేమించుకున్నారేమో! అందువల్ల విషయభోగాల ఆనందం అనుభవించటానికి శేగాంవ్ యాత్రను ఒక మిషగా పెట్టుకున్నారేమో! పుండలీకుడు 'మావి' జాతివాడై వుండినట్లైతే తరుణావస్థలో వున్న యిద్దరి మనసులు కలిసినా ఫర్వాలేకపోయేది. కానీ పుండలీకుడు 'మరాఠా' జాతివాడు. బాయజా 'మాలి' జాతిది అవటంవలన వారిద్దరినీ వేరుచేస్తేనే మంచిదని లేకుంటే పాపాచరణ జరుగుతుందేమోనని జనం అనుకుంటూ వుండేవారు. పైకి అనేవారు కూడా! లోకులు ఏమనుకున్నా వారిద్దరిలో నున్న పవిత్ర భావనల వలన వాళ్ళ మనస్సుల్లో కొంచెం కూడా కామవికారం కలగలేదు! కానీ యీ పవిత్రభావాన్ని వారి తల్లిదండ్రులూ, లోకులూ సమ్మతిస్తే కదా! భులాబాయి క్రోధంతో 'అరె! పాపిష్టిదానా! నువు పుండలీకుని యింటికి మాటిమాటికీ ఎందుకు వెడుతున్నావో అర్ధం కాకుండా వుంది. ఇలాటి నీ (యువావస్థలో) యౌవనంలో నీ బొంద! పరమార్ధమా ఇంకేమన్నానా? చెఱకు పొలాల్లోకి చొరబడిన నక్కలు చెఱకు రుచిచూడకుండా వట్టిగా వస్తాయా? ఈ పచ్చని చొప్పచూసి యీ ఎడ్లు తినకుండా వదిలేస్తాయా? ముందుకు నడుస్తాయా? ఓసి నల్లముఖందానా? నీ చాకచక్యంతో మా ముఖాన్న పేడనీళ్ళు కొట్టించకే!' అని నానా దుర్భాషలాడింది. కూతుర్ని. 'ఓ నాథా! దీన్నిలా వుండనీయకండి ఇంకో 'మావీ' జాతివాణ్ణి చూసి దీనికి కట్టబెట్టండి. ఇది ఆ పుండలీకుని ఇంటికి మాటిమాటికీ పోతుంది. వాడితో మాట్లాడుతూ వుంటుంది. ఇందులో ఏదో రహస్యం వున్నట్లుగానే తోస్తుంది. ఇప్పుడే శేగాంవ్ వెళ్ళి దీని పనులన్నీ స్వామికి చెప్పండి. సిద్ధయోగులు అన్నీ తెలిసిన వారేకదా! వారు భక్తుల పవిత్ర ఆచరణనే కాంక్షిస్తారు. గంధంనుంచి చెడు వాసనెప్పుడూ రాదు మరి! అని పతితో అన్నది.. చివరికి భూలాబాయి, శివరాం, బాయజాబాయి, పుండలీక భోకరా వీరు నలుగురూ శ్రీస్వామి గజాననుల దర్శనార్ధం శేగాంవ్ వచ్చారు. పుండలీకుణ్ణి చూడగానే స్వామి 'అరె! పుండలీకా! క్రిందటి జన్మలో యీ 'బాయజా' నీ సోదరి. లోకులు ఎలాటి మాటలన్నా సరే నీ చెల్లెలికి కష్టం కలిగించవద్దు. దూరం చేయవద్దు యీమెని. ఇద్దరూ కలిసే ఆ సచ్చిదానందుడైన హరికి భక్తిప్రపత్తులు చేయండి" అని తరువాత భులాబాయితో నీ కూతురిపైన నీకే నమ్మకంలేదా! ఆమె పైన లేనిపోని దోషాలు ఆరోపించకు. వెనుకటి జన్మలో వీరిద్దరూ అన్నాచెల్లెళ్ళే! ఆమెకు భర్త లభిస్తాడన్న విషయం మర్చిపో!

ఈమె సంసార సుఖాలు అనుభవించటానికి పుట్టలేదు మరి! పండరిపురంలోని 'జనాబాయి లాగానే యీమె ఆజన్మ బ్రహ్మచారిణిగానే వుండిపోతుంది. జనాబాయి నామదేవుల శిష్యురాలు. నీ కూతురు నన్ను శరణన్నది. కాబట్టి యీమె కేవిధమైన కష్టనష్టాలు కలుగవు!" అన్నారు స్వామి. స్వామి యీ అమృత వాక్కులు విని భులాబాయి, శివరాంలు గద్గదులయ్యారు. నోటివెంట మాటే పెగల్లేదు. తరువాత శివరాం తన కూతురుతో ముడ్ గాం తిరిగి వచ్చేశాడు. ఈ సంఘటన తరువాత శివరాం భాయజాని పుండలీకునితో కలిసి శేగాంవ్ వెళ్ళటానికెప్పుడూ అడ్డుచెప్పలేదు. స్వామి తన భక్తులనెట్లా కాపాడుతారో వినండి. 'భావూరాజారాం కబర్' అనే ఒక డాక్టరు ఖాంగాం అసుపత్రికి అధికారి. అతడు స్వామికి భక్తుడు. ఒకసారి అతనికొక పెద్ద ' గడ్డ' లేచింది. దాన్ని నయం చేయటానికి పెద్ద పెద్ద డాక్టర్లు ఖాంగాం రప్పించబడ్డారు. బుల్ ధానా, అకోలా, అమరావతి మొదలైన చోట్లనుంచి పెద్ద పెద్ద డాక్టర్లు శస్త్రచికిత్స చేయటానికి ఖాంగాం వచ్చారు. రకరకాలైన మందులిచ్చారు. గడ్డమీద పట్టీలు వేశారు. చివరికి శస్త్రచికిత్స కూడా చేశారు. ఐనా ఏమీ లాభంలేకపోయింది. గడ్డ తగ్గుముఖం పట్టడానికి బదులు పెద్దదవసాగింది. భావూ పెద్ద అన్న యిది చూసి చాలా బాధపడ్డాడు. భావూ భరించరాని వేదనతో మంచంమీద మూలుగుతున్నాడు. చివరికి స్వామిని శరణనటం తప్ప మరో వుపాయం లేదని అనుకున్నాడు. సద్గురు శరణమే అంతిమ ఉపాయం అనుకున్నాడు. మంచంమీద పడుకొనే చేతులు జోడించి "హే! సద్గురునాధా! ఇక త్వరపడండి. ఈ బాలుణ్ణి ఇంక ఉపేక్షించకండి. ఇక దయచూపండి" అని ప్రార్ధిస్తూ ప్రభు నామోచ్చారణతో ఆ రాత్రంతా గడిపాడు. రాత్రి ఒంటిగంట సమయం. చీకటి భయంకరంగా వుంది. అంతా నిశ్శబ్దంగా వుంది. అడవుల్లో ఎక్కడో నక్కల అరుపులు మాత్రం వినిపిస్తున్నాయి. ఇంతలో గూడున్న ఎద్దుల బండి (ధమణి) ఆసుపత్రివైపు వస్తూ కనిపించింది. బండికి దిట్టమైన ఎడ్లు కట్టబడి వున్నాయి. వాటి మెళ్ళో గజ్జెలు కట్టబడివున్నాయి. వాటి మధుర స్వరాలు వినిపిస్తున్నాయి. ఆ బండి ఆసుపత్రి దగ్గర ఆగింది. ఇదంతా డాక్టర్ భావూ మంచంమీదనుండే చూస్తూవున్నాడు. ఆ బండిలోంచి ఒక బ్రాహ్మణుడు. దిగి బంగళా దర్వాజాని తట్టసాగాడు. డాక్టరు బంధువొకరు తలుపు తెరిచి 'ఎవరు? ఎక్కడినుంచి వచ్చారు' అని అడుగుతున్నాడు. దాని మీదట ఆ బ్రాహ్మణుడు 'నా పేరు 'గజా' నేను తీర్థం,విభూతిని తీసుకొని శేగాంవ్ నుంచి వస్తున్నాను. డాక్టర్ భావూకబర్ కి లేచిన గడ్డమీద యీ విభూతి రాయి.

ఈ తీర్థం త్రాగటానికి యివ్వబడింది. ఇది మీరు తీసుకోండి. ఇక నేను వెడతాను. నేను తొందరగా తిరిగి వెళ్ళాల్సివుంది' అని తీర్ధమూ, విభూతి యిచ్చి ఆ మనిషి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. అతణ్ణి వెతకమని ఒక మనిషిని పంపాడు భావూ! కానీ బండిగానీ, ఆ మనిషిగానీ ఎక్కడా కనపడలేదు. భావు' మనసులో ఎంతో ఆలోచించాడు కానీ లాభంలేకపోయింది! గడ్డపైన విభూతి రాయటంతోనే అది చితికి క్షణంలో అందులోని చీము కారిపోయింది! ఆ తర్వాత భావూకి చక్కని నిద్రపట్టింది. భావూ ఆ తీర్ధం, విభూతితోనే పూర్తిగా వ్యాధిముక్తుడయ్యాడు. క్రమంగా భావూ ముందటి ఆరోగ్యాన్ని పొందాడు. ఆరోగ్యం కుదుటపడ్డాక భావూ స్వామిని దర్శించుకొనటానికి శేగాంవ్ వచ్చాడు. అతణ్ణి చూసి “ఏమోయ్! ఆరోజు నా బండి ఎడ్లకు మేత, నీళ్ళ సంగతన్నా అడగలేదు?" అన్నారు స్వామి. స్వామియొక్క యీ సాంకేతిక భాషని విన్న భావూ అర్ధంచేసుకొని గద్గదుడయ్యాడు. ఆ రోజున వచ్చిన బ్రాహ్మణుడు తప్పకుండా శ్రీ గజాననులే ఐవుండాలి! నా కోసం ఖాంగాం వచ్చారు అనుకున్నాడు. తరువాత వ్యాధి శమనార్ధం భావూకబర్ అన్నదానం చేశాడు. సిద్ధయోగి శ్రీ గజాననులు అంతరజ్ఞాసులే అన్న సత్యం భావుకు మరోసారి రుజువైంది. అస్తు! ఒకసారి పండరిపురంలోని చంద్రభాగానది. ఒడ్డున వేంచేసిన శ్రీ విర్ధలస్వామి దర్శనానికి బయలు దేరారు స్వామి. కూడా కొందరు భక్తులు వున్నారు. ప్రయాణం చేసేరోజు నిశ్చయమైంది. అంతా ప్రత్యేకమైన బండిలో బయలుదేరారు. జగూ, ఆబాపాటిల్, హరి, బావూనా ఆదిభక్తులు శేగాంవ్ ని విడిచి 'నాగఝరి' వచ్చారు. ఆ వూరిబయట ఒకచోట 'గోమాజీ' అనే సాధువు భూమిలో సమాధి అయ్యారు. అక్కడొక గుండం కూడా వుంది. దాన్లోకి ఎప్పుడూ అఖండంగా 'గోముఖనది' నుంచి నీరు వస్తూనే వుంటుంది. చుట్టుపక్కల చిన్న చిన్న సెలయేళ్ళు కూడా వున్నాయి. అందుచేత ఆ గ్రామానికి 'నాగఝరి' అనే పేరు వచ్చింది. 'గోమాజీ' సాధువునుంచి మొదటిసారిగా 'మహదాజీ పాటిల్' అనే వ్యక్తికి ఇక్కడే కృప, ఆశీస్సులు లభించాయి. తరువాత శేగాంవ్ లోని పాటిల్ కుటుంబంవారు కూడా గోమాజీ సాధువునుంచే గురూపదేశాన్ని పొందారు. అందుచేత పాటిల్ వంశంవారు మొదట 'గోమాజీ'ని దర్శించిన తరువాతనే పండరిపూర్ వెడతారు. ఈ ఆచారం ఇప్పటికీ వుంది. ఈ ఆచారం ప్రకారం జగూ, ఆబాపాటిల్ మొదలైన భక్తులు 'నాగఝరి' వచ్చారు. గోమాజీ సాధువుని దర్శించుకొని తరువాత రైలుబండిలో 'సబార్' మీదగా 'పండరిపూర్ 'కి బయలు దేరారు. హరిపాటిల్ తో కూడా స్వామీజీ, బాపునాకాళే మొదలైన భక్తులు ఒక ఏభైమంది దాకా వుంటారు. ఆషాడశుద్ధ నవమినుంచీ పండరిపూర్లో 'వార్కరీ' పోగవటం మొదలైంది.

ఓ శ్రోతలారా! ఆనాడు ఆకాశం మేఘావృతమైంది. కొద్దిగా వర్షంకూడా పడసాగింది. భూలోక వైకుంఠమైన ఆ పండరిపూర్ అంతా భక్తులతో నిండిపోయింది. అది చూడటానికి సముద్రానికి 'ఆటు' వచ్చిందా అన్నట్లుంది. ప్రదక్షిణలు చేసే మార్గంలో భక్తులు వాయించే కరతాళ ధ్వనులూ, జయజయ రామకృష్ణ హరి అనే నామసంకీర్తనం రెండూ మిన్నుముట్టుతున్నాయి! ఒకరి మాట ఒకరికి వినిపించటము లేదు. వారంతా ఎంత ఆనందంలో మునిగిపోయారో ఎంతని వర్ణించడం? ఏకనాథులు, జ్ఞానదేవులు, సాంవతా, గోరాకుమార్, తుకారాం స్వామి, సోపానులు, ముక్తాబాయి, జనార్దనులు మొదలైన సిద్ధయోగుల పల్లకీలు అక్కడికి వచ్చిచేరాయి. భక్తులు బుక్కా చల్లి, ఆకులూ పూలతో తయారైన జెండాలను పాతారు. అని చూడటానికి ఆకాశంలో నలుపూ ఎరుపు రంగుల చాందినీ కట్టినట్టుగా వుంది. ఎక్కడ చూసినా మంచి సువాసనలు వెదజల్లుతున్నాయి. ఇక తులసిదళాలూ, పువ్వులైతే వర్షిస్తున్నట్లు వున్నాయి. ఇలాటి సమయంలో శ్రీస్వామీజీ పండరిపూర్ చేరి, కుకాజీపాటిల్ ఇంట విడిదిచేశారు. ఈ యిల్లు ప్రదక్షిణమార్గంలో వుంది. మందిరానికిరువైపులా దర్శనార్ధుల సంఖ్య అసంఖ్యాకంగా వుంది. ఒక్కొక్క చేతి దూరంలో చక్కని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయబడింది. 'వార్కరీ' (భజనపరులు) తల్లీనులై భజనలు గానం చేస్తున్నారు. ఏకాదశి రోజున 'బావూనాకాలే'ని విడిచిపెట్టి హరిపాటిల్ మరికొందరూ కలిసి 'విఠ్ఠలు'ని దర్శనం కోసం వెళ్ళారు. బావూనాకాలే చంద్రభాగానదిలో స్నానానికి వెళ్ళటం వలన వెనకబడిపోయాడు. అతడు రావటం ఆలస్యం అయింది. అందుచేత యితర భక్తులు దర్శనంకోసం మందిరంవైపు వెళ్ళారు. స్నానం చేసి వచ్చిన తరువాత చూస్తే, అంతా 'విఠ్ఠల' దర్శనానికి వెళ్ళినట్లు తెలిసింది. తరువాత అతడు కూడా దర్శనంకోసం మందిరంవైపు పరిగెత్తాడు. మందిరానికి రెండు వైపులా భక్తులు ఎంతోమంది వున్నారు గుంపులుగా. ఆ జనసమూహంలో ఒక్క చీమకూడా దూరే సందులేకుండా వుంది. అలాంటప్పుడు బావునాకు ప్రవేశం ఎలా లభిస్తుంది? పైగా అతడు దరిద్రుడు కూడా! దానితో లంచం యిచ్చి మందిరంలోకి ప్రవేశించటం కూడా అతనికి అసంభవమే! వివశుడై అతడు మనస్సులో ప్రార్ధించసాగాడు. "హే! విఠలా! హృషీకేశా! నాకు దర్శనమివ్వటానికింత కఠినుడవయ్యావేమయ్యా! నీవు 'భక్తసావతమాలికి' అరుణగాంలోని వాడింటికి వెళ్ళి దర్శనమిచ్చావే! మరి నేనీ మందిరం దగ్గరకొచ్చినా దర్శనమీయలేవా? అరుణగాం ఎనిమిది కోసులు దూరంగా వుంది. మరి నేను

నీ మందిరం దగ్గరే నిలబడ్డానే! భక్తులు నిన్ను అనాథనాథుడవంటారు మరి నా విషయంలో యీ ఉపేక్ష ఎందుకు స్వామీ"! అని మనస్ఫూర్తిగా తన మనస్సులోనే ప్రార్ధించాడు. ప్రభు దర్శనానికై సాయంత్రం వరకూ వేచివుండి చివరికి నిరాశుడై ఇంటికి వచ్చేశాడు. అతని ముఖం వాడిపోయింది. రోజంతా వుపవాసమే చేశాడు. ఐనా అతని మనసు విళల దర్శనంకోసం తపిస్తోంది. అతని శరీరమైతే యింట్లో వుందిగానీ, మనసు మాత్రం మందిరంలోనే వుంది! దీన్నే 'ధ్యాన' మంటారు. బావునా యొక్క యీ స్థితిని చూసి అతని తోటివాళ్ళు నవ్వుతూ వేళాకోళాం చేశారు. "చూడు! వీడెంత దౌర్భాగ్యుడో! వీడు శేగాంవ్ నుంచి పండరిపూర్ కి విర్థలదర్శనంకోసం వచ్చాడు. కానీ యిక్కడకు వచ్చి అక్కడా, ఇక్కడా తిరిగాడు. వీడి భక్తి దాంభికం. (కపటం) కాబట్టి వీనికి విఠ్ఠల దర్శనం ఎలా ఔతుంది? అసలైన సమయంలో ఎటో పోయాడు" అన్నారు. వీడు వేదాంతి కదా! మందిరంలో కెందుకెడతాడు! ప్రతివాని మనస్సులోనూ భగవంతుడుంటాడనేది వేదాంత తత్త్వం! అందుచేత రాతిలో భగవంతుడెందుకు కనిపిస్తాడు? మనం పిచ్చివాళ్ళం కాబట్టి మందిరంలోనికి వెళ్ళాం. బాపూనా నారాయణుడు అన్నిచోట్లా వున్నాడు అన్నాడింకొక భక్తుడు. దానిమీదట 'మరిక్కడికెందుకొచ్చాడు? అన్ని చోట్లా నారాయణుడే వుంటే శగాంవ్ లోనే వుండి నారాయణ దర్శనం చేసుకోవచ్చును కదా! అన్నాడొక భక్తుడు. మూడోవాడు వేదాంతులు జనానికి జ్ఞానాన్ని బోధిస్తారు కానీ వారికి సానుభూతి ఏమీ వుండదు. సగుణోపాసన చేస్తేనే జ్ఞానం లభిస్తుంది. బాలావస్థను సరిగా గడిపితేనే యువావస్థ వచ్చేది! ప్రతిదీ క్రమబద్ధంగా రావాలి! అన్నాడు. ఇలా అతని తోటివారంతా బాపూనాను ఎగతాళి పట్టించారు. పాపం! ఒక్కడే ఏమిఎదుర్కొంటాడు. వారిని? ఒకవైపు దినమంతా వుపోసం వుండినా కూడా విఠ్ఠల దర్శనం కాలేదే అనే బాధ. మరోవైపు తోటివారి సూటీపోటీ మాటలు. తల క్రిందికి దించుకొని ఒకమూల కూర్చుండిపోయాడు. అతని స్థితిని తోటివారి దుష్టప్రవర్తననీ స్వామి చూస్తునే వున్నారు. సాధువులే దీనుల దుఃఖాన్ని తెలుసుకోగలిగినవారు. సాధుసత్సంగం లభించినవానిని (భాగ్యవంతుడంటారు) అదృష్ట వంతుడంటారు. తరువాత స్వామీజీ బాపూనాతో "ఆరే! దుఃఖించకు. నీకు రుక్మిణీరమణుని దర్శనం చేయిస్తాను. అలా అని శ్రీస్వామీజీ నిలబడ్డారు. రెండు కాళ్ళూ కలిపి నిలబడి, రెండు చేతులనూ నడుంపై వుంచి దర్శనం చేసుకోమన్నారు. బావూనా దర్శనం చేయసాగాడు సరిగ్గా ఆ విఠ్ఠల భగవానుని మూర్తే! మెడలో తులసిపూవుల మాలలు! మూర్తి

 

నల్లగానే వుంది! అతడు రెప్పవేయకుండా చూడసాగాడు. వెంటనే లేచి చరణాలు స్పృశించాడు. విఠ్ఠల దర్శనానంతరం తిరిగి స్వామీజీ మూర్తియే. ఈ విచిత్రాన్ని చూసి బాపూనా మనస్సులో ఎంతో ఆనందించాడు. ఇంట్లో చూసిన ఆ విఠ్ఠలుని మూర్తినే మందిరంలో జనం అంతా గుమికూడి చూస్తారు. బాపూనా తోటివాళ్ళు "స్వామీ! మాకు కూడా విఠ్ఠల దర్శనం చేయించండి!" అన్నారు స్వామితో, దానిమీదట స్వామి "బాపూనా లాంటి నిర్మలమూ, పవిత్రమూ ఐన మనస్సును పొందండి ముందు. చిత్తం విశుద్దమైనపుడే భగవంతుని దర్శనం లభిస్తుంది. భగవంతుని దర్శనం బజారులో దొరికే మామూలు వస్తువనుకుంటున్నారా? కాబట్టి ముందు మనస్సుని పవిత్రమైనదిగా చేసుకొనటానికి ప్రయత్నించండి"! అన్నారు. హే ! శ్రోతలారా! స్వామీజీ తన లీలతో బాపూనాకు యింటవుండే భగవద్దర్శనం చేయించారు. సిద్ధయోగులు పని ఇంద్రజాలకుని పనివంటిదా? సిధ్ధయోగి భగవంతుడు. వీరిద్దరూ అద్వైతులే! బెల్లం - దానిలోని తీపిదనం ఈ రెంటినీ వేరుచేయలేము కదా! కాళే దగ్గర ప్రసాదం గ్రహించి స్వామీజీ తన భక్తులతో శేగాంవ్ తిరిగి వచ్చేశారు. స్వామి చేయించిన విఠ్ఠల దర్శనం బాపూనా హృదయంలో చెఱగని ముద్ర వేసింది. స్వామి కృపాశీస్సుల వలన బాపూనాకి ఒక పుత్రుడు కలిగాడు. అతడు ముందుముందు చతురపండితుడయ్యాడు. ఎవరో అన్నట్లుగా సిద్ధయోగుల సేవ వ్యర్ధంకాదు మరి! విఠ్ఠల కృపవలన కలిగిన పుత్రునికి 'నామదేవు'డని పేరు పెట్టారు. వర్షాడ ప్రాంతంలోని 'కవరేబహా దూరీ అనే పేరుగల 'వారీకర్' (నాథసంప్రదాయ భక్తుడు మాలాధారి' కుకాజీ ఇంటికి అదే సమయంలో పైన చెప్పిన భక్తులతో కూడా వచ్చి వున్నాడు. పండరిపూర్ లో ఆషాడ ద్వాదశి నాటికి కలరా అంటువ్యాధి. వ్యాపించింది. ఇక చెప్పాల్సిందేముంటుంది? డాక్టరు సలహా మీద పోలీసులు జనాన్ని ఇంటి బయటికి పంపటం మొదలు పెట్టారు. ఇది అంటువ్యాధి అవటంవల్ల పోలీసులు యీ 'వారీకర్' భక్తులను ఇంటినుంచి బయటికి తీసుకువచ్చి బండిమీద తీసుకువెళ్ళి చంద్రభాగా నది ఆవలి ఒడ్డునున్న 'కుర్దువాడే' అనే రైల్వేస్టేషనువైపు వదలి వచ్చేవారు. ఈ 'కపరే'కి కూడా కలరా వ్యాధి రావటం వలన అతనికి విరేచనాలు వాంతులూ ప్రారంభమైనాయి. కాళ్ళూ చేతులు బరువనిపించసాగాయి. ఇది అంటువ్యాధి కావటం వలన ఎవ్వరూ అతని సేవచేయటానికే కాక, దగ్గరకు కూడా వచ్చేవారు కాదు భయంవల్ల! ఏమైనా గొడవవుతుందేమోనని భయపడి పోలీసులకు యీ సంగతి తెలియనీయలేదు. రోగిని అక్కడే వదిలేసి శేగాంవ్ నివాసులు తిరిగి వెళ్ళిపోసాగారు. పాపం! యితడు తప్ప మిగతా వారంతా వెళ్ళిపోవటానికి సిద్ధమౌతున్నారు. ఆపదలో ఆదుకునే వారెవరూ వుండరని

ఎవరో అన్నారు కదా! సంపదలున్నపుడంతా చేరతారు. కానీ ఆపదలొచ్చినపుడే ముఖం కూడా చూపించరు. ఇదే లోకరీతి! కానీ ఇలాటి సమయంలోనే సిద్ధయోగులో, భగవంతుడో వారికి సాయపడతారు. ఇది చూసిన శ్రీస్వామీజీ యితణ్ణి మనతో కూడా తీసుకొని వెడదాం అన్నారు. ఇది విని ఒకరు 'స్వామీ! ఇతడు చనిపోయాడేమో! ఇతణ్ణి కూడా తీసుకొని వెళ్లినట్లైతే ఆపద కొనితెచ్చుకోవలసి వస్తుంది! మనతో కూడా ఏభైమందిదాకా వున్నారు. ఈ కలరా భయంకరంగా వ్యాపించిపోయింది మరి. అందుచేత మనం వెంటనే చంద్రభాగా నదికి ఆవలి తీరానికి వెళ్ళటమే శ్రేయస్కరం అన్నారు. దాని మీదట స్వామీజీ కోపంగా “నువ్వు మాట్లాడేదేమిటి? మన ఊరి బంధువును యిలాంటి చెడు స్థితిలో వదలి వెళ్ళటం న్యాయమా? మనిషైన వాడికిది సిగ్గుచేటు! అని స్వామి రోగి దగ్గరగా వెళ్ళారు. చేతినిచ్చి లేవదీసి 'అరె! లే ఇంక మనం మన వర్హడ‌ ప్రాంతానికెడతాం' అన్నారు. దాని మీదట అతడు నిరాశగా వర్హడ ఇంకెక్కడిది నాకు. నాకు చావు మూడిందనిపిస్తోంది. నా కెవరూ ఆప్తులు కూడా లేరు' అన్నాడు స్వామితో. స్వామీజీ వానికి ధైర్యంచెపుతూ "అరె! భయపడాల్సిన అవుసరం లేదు. నీ గండం గడిచిపోయింది ఇక!" అని అతని శిరస్సున తమ చేతిని వుంచారు. క్షణంలో విరేచనాలూ వాంతులూ కట్టినాయి. స్వామి కృపవలన అతడికి శక్తివచ్చింది. లేచినిలబడ్డాడు. యోగులు తమ ఆశ్రయాన్ని ప్రసాదిస్తే వాణ్ణి యముడు కూడా తీసుకొని వెళ్ళలేడట. తరువాత అతడు స్వామితో కలిసి చంద్రభాగా నది ఆవలితీరానికి వెళ్ళాడు. స్వామీజీ వలన యీ కృప ఆశీర్వాదాలు పొంది అతడెంతో ఆనందభరితుడయ్యాడు. శ్రీస్వామి చరణాలు పట్టుకొని "స్వామీ! మీరు నన్ను మృత్యుముఖంనుండి కాపాడారు" అన్నాడు. ఈ చమత్కారాన్ని చూసిన అందరూ స్వామికి జయ జయ ధ్వానాలు పలికారు. తరువాత వారంతా 'కుర్దువాడీ' స్టేషనుకి నిశ్చింతగా వచ్చారు. పండరి 'వారీకర్' లు కూడా అంతా స్వామీజీతో కలిసి అనుకున్న సమయానికి శేగాంవ్ కి వచ్చి చేరారు. నిష్ఠా గరిష్ఠుడైన బ్రాహ్మణుడొకడు స్వామి దర్శనార్ధం శేగాంవ్ వచ్చాడు. అతడు స్వామిని గురించి ఎంతోమంది చెప్పగా విన్నాడట అందుచేత ఎంతో దూరంనుంచి ప్రయాణంచేసి వచ్చాడిక్కడికి. అతడు మధ్య సాంప్రదాయాల్ని అవలంబించిన వాడవటం వలన అస్పృశ్యత, పవిత్రాపవిత్రాలను గురించి జాగ్రత్తపడేవాడు. కానీ స్వామి దగ్గర అటువంటివేమీ కనపడని కారణంగా మనస్సులో కోపగించుకున్నాడు. 'ఇక్కడికి నేను వృధాగా వచ్చాను. ఈ స్వామి భ్రష్టాచార సార్వభౌముడూ, శిరోమణివలె కనిపిస్తున్నాడు. అంటరాని తనానికిక్కడేమీ ప్రతిబంధకం లేనట్టుంది! ఇలాటి పిచ్చి వాణ్ణి ప్రజలంతా నెత్తినెక్కించుకున్నట్లుగా వుందే!

అనుకున్నాడు. మఠాని కెదురుగ నల్లకుక్క చచ్చిపడివుంది. అది దారిలో అడ్డంగా వుండటం వల్ల మఠానికి రావటానికి పోవటానికి ఇబ్బంది కలగటం చూశాడు. ఇతడు ఆ కుక్క మార్గమధ్యంలో పడివుండటాన్ని చూసి మనస్సులో బాధపడ్డాడు. ఇలాటి స్థితిలో నీళ్ళెలా తెస్తారు ఎవరైనా? దీన్ని దారిలోంచి తీసివేసే ఆలోచన ఎవరికీ లేదు. సరికదా! అంతా 'గంజా' పీల్చిన మత్తులో యీ పిచ్చి వాణ్ణి 'మహత్మా మహరాజ్' అంటున్నారు. ఇలాటి సాధుత్వం తిరస్కరించ తగినది. ఇలాటివాని దర్శనార్ధం నేనంత దూరం నుంచి ఇంతదూరం ఎందుకొచ్చానో అర్ధం కావటంలేదు" అనుకున్నాడు. సాక్షాత్తూ భగవద్దర్శనాన్ని యిచ్చే శ్రీస్వామి అతని మనసులోని వ్యధని తెలుసుకున్నారు. అతని దగ్గరకొచ్చి "మీరు పూజ చెయ్యండి! ఈ కుక్క మరణించలేదు. మనస్సులో అనుమానం వుంచుకోవద్దు" అన్నారు. స్వామి మాటలు విని ఆ బ్రాహ్మణుడు మండిపడ్డాడు. 'అరె! పిచ్చివాడా! నేను నీలాటి పిచ్చి వాణ్ణి కాదు సుమా! ఈ కుక్క యిక్కడ చచ్చిపడి ఒక ఝాము అయిందిప్పటికి. దీన్ని దారినుంచి తొలగిద్దామన్న ధ్యాస ఒక్కడికీ లేదాయె ! ' అన్నాడు. విప్రుని మాట విని స్వామి "మేము భ్రష్టులమే మరి! మీకున్నంత జ్ఞానం మాకెక్కడిది? ఐనా చింతించకండి. ఓ విప్రవర్యా! నీటికోసం కలశాన్ని తీసుకొని నావెనుకనే రండి!" అని చెప్పి స్వామి కుక్క దగ్గరగా వచ్చి దాని పైన చేత్తో నిమిరారు. వెంటనే కుక్క లేచి నిలబడింది. ఈ చమత్కారాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ విప్రుడు విస్మయ చకితుడైపోయాడు. మనసులోనే యీయన నిజంగా అధికార పురుషుడే! భగవత్ సమానుడే! ఈయన్ని నిందించాను. వీరి మహత్తును తెలుసుకోలేకపోయాను అనుకున్నాడు. వెంటనే స్వామి చరణాలపై పడ్డాడు. 'ఓ గురురాజా! నా అపరాధాన్ని క్షమించండి. నా తలపై మీ కృపాహస్తాన్నుంచండి. చివరికి తమరే యీ లోకంలో పరమ పవిత్రులు! ఇది నిజం! జనసామాన్యుల నుద్ధరించటానికే ఆ పరమాత్ముడు మిమ్మల్ని యీ లోకానికి పంపాడు!' అని ప్రాధేయపడ్డాడు. హే శ్రోతలారా! అదేరోజు ఆ విప్రుడు 'సమారాధన'ను పూర్తిచేశాడు. అతని మనసులో వున్న సంశయాలన్నీ తీరిపోవటం వలన ఆ విప్రుడు శ్రీస్వామి చరణాలపై ఒరిగిపోయాడు. ప్రసాదాన్ని స్వీకరించి తన గ్రామానికి వెళ్ళిపోయాడు. శ్రీస్వామీజీ ప్రత్యక్ష భగవానుడే అన్నది రుజువైంది. స్వస్తిశ్రీ దాసగణూచే విరచితమైన యీ శ్రీ గజానన విజయమనే పేరు గల గ్రంథము శ్రద్ధాభక్తులు కలవారికి సత్పథాన్ని చూపించు గాక! అని దాసగణూకోరిక.

 

॥ శుభం భవతు ॥

|| శ్రీహరి హరార్పణమస్తు॥

॥ ఇది అష్టాదశాధ్యాయము సమాప్తము ॥


యే మనుష్యః మాం ఆశ్రతః!

తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!