సర్వం శ్రీసాయి

శ్రీ గజానన విజయం

పదిహేడవ అధ్యాయం

శ్రీ గణేశాయ నమః. జయ జయ మహామంగళా! జయ జయ భక్తపాలా! జయ జయ నీలశరీరా ఓ పతిత పావన నరహర! హిరణ్యకశిపుడనే మహాక్రూరుడు సజ్జనులకు మహాశత్రువయ్యాడు. కడుపు చీల్చి అతణ్ణి యమసదనానికి పంపావు. భక్తప్రహ్లాదుని రక్షించటానికై అనుపమరూపంతో స్తంభంనుంచి ప్రకటనమయ్యావు. ఆ భయంకరమైన పళ్ళూ దంతాలూ మెడపైజూలూ, బ్రహ్మాండాన్నే కాల్చేలా కనిపించే అగ్ని గోళాల్లాంటి కళ్ళతోకూడి ఆ భయంకరరూపాన్ని చూసి భక్తులు భయం చెందరు! ఆడుపులి పిల్లలు తన తల్లికి భయపడక దాని చెంతనే వున్నట్లుగానే వుంటారు! నీ యీ భయంకర రూపాన్ని తిలకించిన లక్ష్మీదేవి కూడా నీదగ్గర చేరటానికి భయపడి నిన్ను చేరకూడదనుకుందిట! కానీ, హే నరహరీ! నీ ప్రియభక్తుడు నీదర్శనార్ధం నీ యెదటే నిలబడ్డాడు! ఓ లక్ష్మీకాంతా! నీవు భక్తవత్సలుడవనే సాధువులు, యోగులు ధృఢంగా విశ్వసిస్తారు. వారు భక్తుల కోరికలను ఎప్పుడూ తీరుస్తూనే ఉంటారు. వాటిని నీవు కూడా కాదనవుకదా! హే హృషీకేశా! అదే ప్రతిజ్ఞతోవుండు ఎప్పుడూ! హే పాండురంగా! నీ దగ్గరకువచ్చిన యీ 'దాసగణూ'ని నిర్భయునిగా చెయ్యి! అస్తు! శ్రీ గజాననుల భక్తులు కొందరు అకోలాలో వున్నారు. వారిళ్ళకు స్వామి వచ్చి వెడుతూ వుండేవారు. వారిలో కొందరి పేర్లు యివి! బాపడగాంవ్ లోని బావూకృష్ణ, ఖటావూసేల్ కుటుంబమూ, గోండులాల్ కొడుకు బచ్చులాల్, జీజీబాయీ పండిత్ మొదలైన భక్తుల పేర్లు ఎన్నని చెప్పను! ఒకసారి గజాననులు అకోలావచ్చి 'ఖటావూజీ' మిల్లులో విడిదిచేశారు? విష్ణుసా అనే భక్తుడు
మల్కాపూర్ నివాసి అతడు ఈ సారి స్వామిని తప్పకుండా మల్కాపూర్ తీసుకొనివెడదామని నిశ్చయించు కున్నాడు. అందుచేత అతడు భాస్కర్ పాటిల్ ద్వారా స్వామికి ఆహ్వానం పంపాడు. ఈ భాస్కరుడే శేగాంవ్ లో సమాధి పొందిన విషయం పాఠకులకు తెలిసినదే కదా! భాస్కరపాటిల్ స్వామి దగ్గరుండి వారికి సేవలు చేస్తూ వుండేవాడు. భాస్కరుని మాటలు స్వామి మన్నిస్తారని 'విష్ణుసా'కు అత్యంత నమ్మకం. భాస్కరుడు స్వామితో 'మనం మల్కాపూర్ వెడదాం! మీ భక్తుడు విష్ణుసా ఆహ్వానించి తీసుకొని వెళ్ళటానికి వచ్చాడు. అకోలాలోని భక్తుల మనోవాంఛితాలను పూర్తిచేశారు కదా! ఇప్పుడు మల్కాపూర్లోని మీ భక్తులు మీ రాకకై ఎదురుచూస్తున్నారు అన్నాడు. దాని మీదట స్వామి "ఇప్పుడు నేను మల్కాపూర్ వెళ్ళను. అక్కడికి తీసుకొని వెళ్ళాలని ప్రయత్నించవద్దు. వెళ్ళాల్సిందేనని పట్టుబట్టినట్లైతే తరువాత నువ్వు పశ్చాత్తాప పడాల్సివస్తుంది! ముందు వెనకలాలోచించకుండా నేనేమిచెప్పను. త్రాటిని బలంగా లాగినట్లైతే మధ్యలోనే తెగుతుందికదా! అనే విషయాన్ని గమనించు. నేనిప్పుడిక్కడినుండి ఎక్కడికీ వెళ్ళేదిలేదు. తీసుకొని వెళ్ళే వ్యర్ధ ప్రయత్నంచేయకు!" అన్నారు భాస్కరునితో. ఐనా భాస్కరుడు “ఓ గురుదేవా! మీరక్కడికి రావాల్సిందేనని ప్రార్ధిస్తున్నాను. నేను మీకు ప్రియ భక్తుణ్ణి కదా! అనే వుద్దేశ్యంతో విష్ణుసాకి మిమ్మల్ని మల్కాపూర్ తీసుకొనివస్తానని మాటిచ్చాను. నేనిచ్చినమాట నిలబెట్టడానికి మీరు అక్కడికి రావల్సివుంటుంది! ఇకపదండి రైలుబండిలో వెడదాం!" అని ప్రార్ధించి స్వామిని మాల్కాపూర్ తీసుకొనివెళ్ళే నిమిత్తం స్టేషనుకు తీసుకొనివచ్చాడు. భాస్కరుడు స్టేషను మాష్టరుతో మాట్లాడి పన్నెండు మందికోసం ఒక బోగీని సురక్షితం (రిజర్వు) చేశాడు. బండి బయలుదేరేంతవరకూ స్వామి అకోలా స్టేషనులో ఒకేచోట కూర్చుండిపోయారు. వారు ఎవరితో మాట్లాడనూ లేదు. ఎటూ తిరగనూలేదు. బండి కదిలే సమయానికి భాస్కరునికి తెలియకుండా ఒక విచిత్రంచేశారు. సురక్షితం చేయబడిన బోగీలోకాక ఆడవాళ్ళడబ్బాలో ఎక్కి కూర్చున్నారు స్వామి. యీ దిగంబర వేషాన్ని చూసిన ఆడవాళ్ళు భయపడి పోలీసులతో చెప్పారు. పోలీసు అధికారి అక్కడికొచ్చి స్వామిని బయటికిలాగుతూ "అరె! పిచ్చివాడా! దిగంబరుడా! నీకేమీ బుద్ధిలేదా? ఇది ఆడవాళ్ళ పెట్టె. అందులో కెందుకెక్కావు?" అన్నదే తడవుగా స్వామి అతణ్ణోక తోపుతోసి చెయ్యి విడిపించుకొని అక్కడే కూర్చున్నారు. వారికి పోలీసు అధికారి అంటే భయమా? తరువాత అతడు స్టేషన్ మాస్టరు దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి అతణ్ణి ఆ పెట్టె దగ్గరకు రమ్మని కోరాడు. ఇద్దరూ అక్కడికి వచ్చిన తరువాత స్టేషన్ మాస్టరు శ్రీ గజాననులు ఆపెట్టెలో కూర్చొనివుండటం చూశాడు. స్టేషను మాస్టరు శ్రీగజాననులను తెలిసినవాడే! అందుచేత వీరిని యిదే పెట్టెలో వెళ్ళనీయి! అన్నాడు అధికారితో. వారు మహాయోగులు, లోకంలో తిరుగాడే పరమేశ్వరులే అనుకో! వీరివలన స్త్రీలకేమీ అపకారం జరగదు" అన్నాడు. కానీ పోలీసు అధికారి నాపై వాళ్ళకు యిది టెలిగ్రాం ద్వారా తెలియజేశాను. ఇక నాచేతిలో ఏమీలేదు! ఇక మీ కేది మంచిదని తోస్తే అలానే చేయండి. అన్నాడు. స్టేషన్ మాస్టరు తన టోపీని తలమీదినుండి తీసి, సాదరంగా స్వామికి విన్నవించాడు. స్వామీ! దయచేసి క్రిందికి దిగిరండి! నియమాన్ని ఉల్లంఘించకండి! అన్నాడు. ఇది వినిన స్వామి క్రిందికి దిగి వచ్చారు. స్వామి పైన దావావేశారు. 'జఠార్ సాహెబ్' గారి కోర్టులో దావా మొదలైంది. దావాకు తేదీ కూడా నిశ్చయమైంది. 'ఎనైక్వైరీ' శేగాంవ్ లో మొదలైంది. 'బాపూసాహెబ్ జఠార్' ఎన్క్వెరీ కోసం వచ్చి శేగాంవ్ లోని ప్రభుత్వ బంగళా (టి.బి.)లో దిగారు. అకోలా నివాసి వెంకటరావు దేశాయి ఏదో పనిమీద శేగాంవ్ వచ్చారు. దావా విషయం అందరికీ తెలిసిపోయింది. అందుచేత టి.బి. వైపు జనం పోగవ్వసాగారు. ఏమౌతుందో తెలియక దేశాయి జఠార్ సాహెబ్ ని ఆనాటి దావా ఎలాంటి అంతమందెందుకు ఇక్కడకు వచ్చారు? అని ప్రశ్నించారు. జఠార్ సాహెబ్ ఆశ్చర్యచకితుడై ఏమిటీ మీకేమీ తెలియనే తెలీదా? మీ గజాననస్వామి దిగంబరంగా తిరుగుతారుకదా! వారిపైన పోలీసులు దావా వేశారు. ఇవాళ దాని తీర్పుచెప్పేరోజు కాబట్టి యింతమంది యిక్కడికి వచ్చి వుండవచ్చు!" అన్నారు. ఇది విన్న వెంకటరావు వ్యధితుడయ్యారు. చేతులు జోడించి దయచేసి యీ దావాని త్రిప్పేయండి! శ్రీ గజాననస్వామి మహిమ తెలియని వారెవరు? వారు సాక్షాత్తూ పరమేశ్వరులే! వారు విదేహులైన కారణంగా ముక్తులు. బంధనరహితులూ అయ్యారు. వీరిపై దావాను వేయటం అనుచితం. దీన్ని ఆపివేయటమే మంచిది!" అన్నాడు జఠారాసాహెబ్. మీరు నియమాలు తెలిసినవారే కదా! ఈ విషయాన్ని పోలీసువారే ముందుగా ఆలోచించి వుండాల్సింది" అని గుమాస్తాతో ఎవర్నైనా పంపి గజాననస్వామిని యిక్కడికి పిలిపించు అన్నారు. గుమాస్తా ఒక పోలీసు జవానుకి యీ పని నప్పగించాడు. అపోలీసు వస్తూనే 'మిమ్మల్ని దొరగారు కచేరీకి తీసుకొని రమ్మన్నారు. మీరు బలవంతంచేయకుండా రండి. లేకుంటే మిమ్మల్ని యీడ్చుకొని వెళ్ళాల్సివస్తుంది!" అన్నాడు స్వామితో'. అతని అమర్యాద ప్రవర్తనకి స్వామి నేనిక్కడినుండి కదలనే కదలను. ఏదీ నీ కెంత బలంవుందో చూడనీ కొంచెం. నీ చేతిని విడిపించుకో చూద్దాం! అని వాడి చెయ్యి స్వామి పట్టుకోగానే వాడు విడిపించుకోలేకపోయాడు సరికదా చెయ్యి గట్టిగా పట్టుకోవటంవలన రక్త ప్రసరణం ఆగిపోయి వాడిగుండె దడదడలాడటం ప్రారంభించింది. వాడు భయపడిపోయాడు. స్వామిని తీసుకొనిరావడానికి వెళ్ళిన పోలీసు రావటం ఆలస్యమైంది. అందుచేత వారిని తీసుకొని రావటానికి 'జఠార్ సాహెబ్ వెంకటరావ్ దేశముఖ్ ని పంపుతూ 'స్వామిని మీరే తీసుకురండి' ఇది చాలా జాగ్రత్తగా చేయవలసిన పని. వారు వచ్చే సమయంలో బంగాళాకు ఇరువైపుల జనం పోగవకూడదు సుమా! అన్నారు. ఇంతలో స్వామి తన 'లీల' చేత పోలీసు చెయ్యిపట్టుకొని ఒక మూల కూర్చోబెట్టారని వర్తమానం అందింది. తరువాత దేశాయి మఠానికివచ్చి 'స్వామికి పంచకట్టండి' అని భక్తులతో అన్నాడు. అదివిన్న భక్తులు స్వామికి పంచె కట్టబెట్టారు. కానీ ధారిమధ్యలోనే దాన్ని విప్పి పారేశారు స్వామి. చివరికి కచేరీలోకి వెళ్ళే సమయానికి స్వామి ఎప్పటిలాగా దిగంబరులే! ఆయనతో భాస్కరుడున్నాడు. స్వామిని చూస్తూనే 'జఠారో' వారిని కూర్చోమని ఒక కుర్చీయిచ్చారు. వినయంతో 'స్వామీ! దయచేయండి, మీరు గ్రామంలో దిగంబరంగా తిరగటం మంచిదికాదు. న్యాయశాస్త్ర నిబంధనల ప్రకారం దిగంబరులై తిరగటం నేరం. కాబట్టి దిగంబరత్వాన్ని విడిచి పెట్టండని ప్రార్ధిస్తున్నాను' అన్నారు. 'జఠార్ సాహెబ్' యొక్క యీ పలుకులు స్వామి శాంతంగా విని నవ్వి దానికి జవాబుగా యిలా అన్నారు. 'నేను దిగంబరునిగా వుంటే మీకేమీ అభ్యంతరం! వృధా మాటలు కట్టిపెట్టి త్వరగా 'చిలుము' నింపి యివ్వండి! ఇక మిగిలినవన్నీ నా దృష్టిలో నిరర్ధకాలే!' స్వామి అన్న యీ మాటలు విని జఠారో' కరిగిపోయారు. స్వామి సిద్ధయోగులవటం మూలంగా లౌకిక విషయాలు వారికి పట్టవు! ఈయన భాగవతంలోని వృషభదేవులో, శంకరాచార్యులో లేక యోగి నామదేవుల యొక్క మరో అవతారమో అయివుండాలి! జీవన్ముక్తులవటంవలన ఎల్లప్పుడూ నిజానందం (ఆత్మానందం)లో నిమగ్నులై వుంటారు. అందువల్ల వీరిపైన ఎలాటి కళంకం ఆపాదించినా అది వ్యర్ధమే! అగ్ని వేడిని తననుంచెప్పుడైనా వేరుచేస్తుందా? కాబట్టి అగ్నిహోత్రులకు అగ్నిని కుండంలోనే వుంచాల్సివస్తుంది. కుండంలో వుంచకున్నట్లయితే సదనమంతా దగ్ధమై పోతుంది కదా! ఎదురుగా వచ్చినదాన్ని కాల్చటమే అగ్ని స్వభావం! దానిలో అగ్ని దోషమేముంది? అగ్ని యొక్క స్వభావధర్మం వంటిదే శ్రీస్వామిగజాననుల యీ దిగంబరతత్వమునూ. ఇది స్వయం సిద్ధమైనదే! కాబట్టి యిందులో దోషులు వారి శిష్యులే! వీరి శిష్యులు స్వామి యొక్క యీ దిగంబరత్వాన్ని వస్త్రరూపకుండంలో వుంచినట్లైతే అందరికీ మంచిదే అయ్యేది!" అని విచారించిన మీదట ఆయన ఒక ఆజ్ఞను జారీచేశాడు. "స్వామీజీ జీవన్ముత్తులైన సిద్ధయోగులు! వీరిని లౌకిక దృష్టిలో సరిగా వుంచవలసిన బాధ్యత వీరి శిష్యుడైన భాస్కరునిది. తన కర్తవ్యాన్ని సరిగా నిర్వహించనందుకు ఇతనికి ఐదురూపాయలు జరిమానా విధిస్తున్నాను.” అని శేగాంవ్ లో దావా తీర్పునిలా చెప్పారు జఠారో!. తరువాత స్వామి భాస్కరునితో "చూశావా మొండిపట్టుకు ఫలితం ఏంలభించిందో! నీ అంత నువ్వే కించపరచుకున్నావు ఔనా!" అని ప్రశ్నించారు. స్వామి ప్రశ్నకు భాస్కరుడు బదులు పలకలేకపోయాడు. మౌనంగా వుండిపోయాడు. ఈ సంఘటనతో అందరూ ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నారు. 'స్వామిని యిక ముందు కూడా రైలుబండిలో ప్రయాణం చేయనీయవద్దు మీ చేతులతో మీరే ఆపదలు కొనితెచ్చుకోవద్దు!' తరువాత స్వామి ఎడ్లబండిమీదనే ప్రయాణించే వారు. ఇది చాలాకాలంవరకూ జరుగుతూ వచ్చింది. అస్తు! ఒకనాడు ఎడ్లబండి ఎక్కి స్వామి అకోలాలో వున్న బాపూరావు ఇంటికి వెళ్ళారు. మూర్తిజాపూర్ కి దగ్గర 'కురుకు' అనే గ్రామం వుంది. అక్కడ 'మహతాబ్' అనే తురకసాధువు వుండేవాడు. ఆయన యీసారెప్పుడైనా స్వామీజీ అకోలా వస్తే తెలియజేయమన్నారు. దాని ప్రకారం ఆ సాధువుకు స్వామిరాకను తెలియజేయటానికి ఒక మనిషిని 'కురుం' పంపాడు. అదే సమయంలో 'మహతాబా' అకోలాకు బయలుదేరి వస్తున్నాడు. వీరిద్దరూ దారిలో కలుసుకున్నారు. ఆ మనిషి బాపూరావు సందేశాన్ని వారికిచ్చాడు. ఇక నువ్వు 'కురం' వెళ్ళవలసిన అవసరంలేదు. పద మనం బండిలో స్టేషనుకు వెడదాం అన్నారు. మహతాబ్షా సిద్ధ యోగులు త్రికాలజ్ఞులవటంవలన వారికి కూర్చున్నచోటనే అన్ని విషయాలూ తెలుస్తాయి. మహతాబ్షాతో మరికొందరు తురకభక్తులు వున్నారు. అనుకున్న సమయానికి అంతా బాపూరావు యింటికి వచ్చారు. రెండవరోజు ప్రాతఃకాలాన మహతాబ్ వున్న చోటుకు స్వామీజీ వచ్చారు. వస్తూనే అతని జుట్టు పట్టుకొని తన్నటం ప్రారంభించారు. దాని అర్థమేమంటే తురకజాతిలో పుట్టి ఏ పనీ చేయలేదు. కాని ఉద్దండుడవై నావు! నీ ఉద్దండతవలన ధార్మికతత్వాలు నాశనమైనాయి. అందువలన మర్త్యలోక ప్రాణులు చింతగ్రస్తులౌతాయి! నీ పేరైతే మహతాబ్ (చంద్రుడు) కనీసం ఆ పేరునైనా గుర్తుంచుకో!
దోషమైన తమోగుణాన్ని పెరగనీయవద్దు! ఈ ద్వేషాంధకారము (తమోగుణం) రోజురోజుకీ పెరిగిపోతోంది! దీన్ని నీకు తెలుపటానికే నిన్ను తన్నింది. తెలుసా?" అన్నారు. స్వామియొక్క సంకేతం పొందిన మహతాబ్షా సత్యాన్ని గ్రహించాడు. లోలోపలే ఆనందించాడు. సాధువే సాధువు యొక్క అంతరంగాన్ని తెలుసుకోగలుగుతాడు! మహతాబ్ ని తన్నుతున్నపుడు కూడా వచ్చినవారంతా అది చూసి భయపడిపోయారు. "ఇక మీరిక్కడ వుండకండి. కురుం తిరిగిపొండి. అదే మంచిది" అన్నాడు మహతాబ్షా వారితో షేఖ్ కడూ తప్ప మిగిలిన నలుగురు తురకలూ (యవనులు) వెళ్ళి పోయారు. ఇంతలో బచ్చూలాల్ ఆహ్వానించటాని కక్కడికి వచ్చాడు. అతడు వినమ్రుడై స్వామితో "హే దయాఘనా! రేపటి రోజు యీ దాసునింటికి ప్రసాదానికై దయచేసి నన్ను కృతార్ధుణ్ణి చేయమని ప్రార్ధన” అన్నాడు. రెండవరోజు స్వామిని టాంగాలో కూర్చుండబెట్టి ఎంతో వైభవంగా తన యింటికి తీసుకొని వచ్చాడు. కాని స్వామి మాత్రం టాంగాలోనుండి క్రిందికి దిగటానికి ఇష్టపడలేదు. దీనికి కారణమేమిటో ఎవరూ తెలుసుకోలేక పోయారు. చివరికి టాంగా బాపూరావు ఇంటివరకు తిరిగి వెళ్ళిపోయింది. స్వామి అలా ఎందుకు చేశారో జనానికి అర్ధంకాలేదు. నిన్నటి ఆహ్వానానికి సమ్మతించి యీనాడు ఇంటికి రావటానికి ఎందుకు అసమ్మతిని తెలుపుతున్నారు? ప్రతివారు ఇదే ఆలోచనలో పడ్డారు. అక్కడున్నవారిలో ఒక తెలివైన సజ్జనుడొకడున్నాడు. నా దృష్టిలో దీనికి కారణం ఇదేయై వుండవచ్చు " మహతాబ్షా తురకవాడవటంవలన ఆయనను ఆహ్వానించలేదు. అందువల్ల స్వామీజీ క్రిందికి దిగివుండకపోవచ్చు! ఆయననెందుకు ఆహ్వానించలేదు? ఇప్పుడు ఇద్దరినీ ఒకే టాంగాలో తీసుకొనివద్దాం! అప్పుడు స్వామి తప్పకుండా వస్తారు" అన్నాడు. చివరికి అతని మాటే నిజమైంది. తరువాత వారిద్దరినీ వైభవంగా తీసుకొని వచ్చారు. మందిరం దగ్గరలో 'థియేటర్' ఉంది. అందులో మహతాబ్షాని వుంచారు. శ్రీరామ మందిరంలో శ్రీస్వామీజీని వుంచటానికి ఏర్పాట్లు జరిగాయి. తరువాత స్వామీజీ కూడా 'థియేటర్ కి వచ్చారు. అంతా కలిసి భోజనం చేశారు. మహతాబ్షా "నాకు పంజాబ్ వెళ్ళటానికి టిక్కెట్టు కొనిపెట్టండి" అన్నాడు. దానిమీదట "కురంలోని మసీదుని సగంలోనే విడిచి ఎందుకు వెడుతున్నారు? ఆ మసీదు పూర్తయిన తర్వాత మీరు వెళ్ళగలరు. మసీదు పని సగంలో విడిచి వెళ్ళటం మంచిదికాదు" అన్నాడు షేఖ్ కడూ. అప్పుడు "ఇంక నన్ను యిక్కడ వుండమని బలవంతం చేయకు! గజాననస్వామి నన్ను పంజాబ్
వెళ్ళమని ఆదేశించారు. అంచేత నేనొక్క క్షణం కూడా యిక్కడ వుండజాలను. స్వామి కృపవలన మసీదు పని తప్పక పూర్తవుతుంది. ఈ నా సత్యవాక్కులు వ్యర్ధంకావు. సిద్ధయోగులలో ధర్మవిషయాలకు ద్వైతభావం వుండనే వుండదు. వారు మతాలన్నీ ఒకటిగానే తలుస్తారు. మసీదు విషయంగా నన్నిక్కడ వుంచే ప్రయత్నం చేయకండి. అలా చేసినట్లైతే మీకూ నాకూ కూడా మంచిది కాదు. మసీదు మందిరం కట్టడానికి ఒకే రకమైన సామాన్లు పనికి వస్తాయి! వాటి నిర్మాణంలోనే వారివారి మతసాంప్రదాయాన్ననుసరించి తేడాలుంటాయి! ఈ నిజాన్ని తెలుసుకుని ఒకరితో నొకరు కలహించుకోకుండా వుండాలి! యవనులు (తురకలు) 'ఖుదా' (దేవుని) మనుషులూ, హిందువులూ భూతానికి చెందినవారు అవుతారా! మనుష్యత్వం ప్రతివారిలోనూ అభిన్నంగానే వుంటుంది. దీని విషయం ఆలోచించటంలోనే మనందరి మంచీ వుంది. హిందువులూ, ముస్లీములూ ఒకే భగవంతుని నుంచి పుట్టారు! కాని ప్రతివారికీ వారి దేశాన్ననుసరించి వారి మతాలు ప్రాణంకంటే ఎక్కువగానే వుంటాయి! వుండాలి కూడా! ఐనా ఇతర దేశ మతాలంటే మనస్ఫూర్తిగా ప్రేమ వుండాల్సిందే! ఈ విషయం ఎప్పుడైతే వుండదో అప్పటివరకూ సుఖశాంతులు ఆమడ దూరంలో వుంటాయి అనే సత్యాన్ని మరచిపోకూడదు. శ్రీగజాననుల కృపవలన మసీదు తప్పకుండా పూర్తవుతుంది. ఇక నిశ్చింతగా తిరిగి వెళ్ళు! అని మహతాబ్షా షేఖ్ కడూతో ప్రేమగా అన్నాడు. మహతాబ్షా పంజాబ్ వెళ్ళాడు. మరి తిరిగి రాలేదు. ఈ విషయాన్ని గురించి హిందూ-ముస్లిములు ఆలోచించాలి. మననం చేసుకోవాలి! మహతాబ్షాని తన్నటమైతే తన్నారుగానీ శ్రీ గజాననులకు అతని మీద ద్వేషం ఏమాత్రం లేక మనస్సులో ఎంతో ప్రేమవుంది సుమా! మహతాబ్ వంటి తురకవాణ్ణి స్వామి సరసన కూర్చోబెట్టుకొని భోజనం చేశారు. ఈ విషయాన్ని గురించి లోతుగా ఆలోచించాల్సిందే మరి ! అస్తు బాపూరావు భార్యని 'భానుమతి' పీడించసాగింది. దాని ప్రభావంవలన క్షణంలో నుదుటిమీద సింధూరం వచ్చేది. ఒకప్పుడు కంఠం బిగుసుకుపోయేది. ఒంటి మీద వస్త్రాలు కాలిపోసాగేవి. మరొకప్పుడు జీడి కాల్చిన బొబ్బలు కనిపించేవి! ఈ భానుమతి పీడించటం బాపూరావు భార్య ఎండిపోయింది! అన్న పానాదులు అసలే లేవు. భార్య బాధని తగ్గించటానికి అకోలానుంచి మాంత్రికుడు పిలవబడ్డాడు. కానీ మాంత్రికుడు ఓడిపోయాడు! వైద్యానికి ఎంతో డబ్బు ఖర్చయినా ఏమీ లాభంలేకపోయింది. చివరికి అతడు స్వామిని శరణుజొచ్చాడు. అతడు స్వామితో "ఓ స్వామీ! నా భార్యకు 'భానుమతి' పట్టుకుంది. దానితో ఆమెకెంతో కష్టంగా వుంది. మందులూ తీసుకుంది. యంత్రాలు కట్టుకుంది. మంత్రతంత్రాలూ అయినాయి కాని అన్నీ వట్టివే అయినాయి. నేనిప్పుడు చాలా విసిగిపోయాను. ఇప్పుడు మీ శ్రీచరణాలు నాయింట పడ్డాయి. ఇక్కడ ఆ భానుమతి వుండగలుగుతుందా? సింహం వున్న చోట నక్క తన తెలివినేం ప్రదర్శిస్తుంది? హే గురురాజా! కస్తూరి సుగంధం వున్నచోట భానుమతీ దుర్గంధం రాగలదా!" అని బాపూరావు స్వామీజీని ప్రార్ధించాడు. స్వామీజీ బాపూరావు భార్యవైపు ఒకసారి తమ కృపాదృష్టిని సారించారు! అంతే, క్షణంలో భానుమతి పీడ ఇట్టే విరగడైంది! నిజమే! సింహం ఎదుట కోతి మర్కటలీల లెంతవరకూ సాగుతాయి! అస్తు! ఒకసారి భ్రమణం చేస్తూ స్వామీజీ 'నరసింహజీ' బంధువును చూడటానికి 'అకోట్' వచ్చారు. వారి మఠం దగ్గరొక నుయ్యి వుంది. స్వామీజీ అక్కడికి వెళ్ళారు. ఆ నూతి గట్టుమీద కూర్చొని కాళ్ళు నూతిలోకి వదిలి లోపలి నీరెంతలోతుందో చూడసాగారు. అక్కడున్న వారంతా స్వామీజీ యీ చేష్టను కుతూహలంతో గమనించసాగారు. నరసింహజీ స్వామీజీతో "అరె! బంధూ! ఏంచేస్తున్నావు?" అన్నారు. దానిమీదట "గోదా, యమునా, భాగీరథీ తీర్ధాలు మీకోసం ఇక్కడే వున్నాయి ఇంకా ఏ తీర్ధజలాలైనా వున్నాయేమోనని పరికిస్తున్నాను. మీరైతే యీ పవిత్రజలాలతో రోజూ స్నానంచేస్తూ వుంటారు కదా! మరి నేనెందుకు వంచితుణ్ణి కావాలి? ఈ తీర్ధాలు నన్నీరోజు స్నానంచేయించాలి మరి! స్నానం అయ్యేంతవరకూ నేనిక్కడనుంచి కదిలేది లేదు! అన్నారు -స్వామీజీ! అక్కడున్నవారు యిది విని "ఈయన నిజంగానే పిచ్చివానిలా వున్నాడు. ఆ శేగాంవ్ ప్రజలు యీయన వెనకెందుకు పడ్డారో తెలీకుండా వుంది! కొంచెంసేపాగి చూద్దాం! ఈయనేం చేస్తాడో మరి! అనుకున్నారు. ఇంతలోనే శ్రీస్వామి లీలా విశేషంచేత నూతిలోని నీరు పైకి రాసాగింది. క్షణంలో నుయ్యి నిండిపోయింది. అసంఖ్యాకమైన నీటిబుగ్గల్లోంచి నీరు చిమ్మసాగింది. శ్రీస్వామిపైన వర్షించసాగాయి. శ్రీస్వామి అక్కడున్న జనంతో "గ్రామవాసులందరూ ఆనందంతో స్నానాలు చెయ్యండి! ఇప్పుడు స్నానానికి నూతిలోకి దిగనక్కరలేదు. గంగా, యమునా, గోదావరీ నదులు పైకివచ్చాయి. ఈ పుణ్యనదుల స్నానఫలం చేజేతులా పోగొట్టుకోకండి! శ్రద్ధాభక్తులు కలవారు స్నానాలు చేశారు. నిందితులు సిగ్గుతో తలలు దించుకున్నారు. సిద్ధయోగులు మనస్సులో అనుకున్నదానిని ఆ చక్రపాణి తప్పక నెరవేరుస్తాడు. వారి వాక్కుల్ని ఆ పరమాత్మ మిథ్యలు కానీయడు!కస్నానాలు పూర్తయిన తరువాత నీటిబుగ్గలు ఆగిపోయినాయి. నూతిలోని నీరు యధావిధిగా వుండిపోయింది. శ్రీ నరసింగస్వామిని కలుసుకొని మనోవేగరూపమైన అశ్వాన్నిక్కి శేగాంవ్ వెళ్ళిపోయారు. స్వస్తిశ్రీ దాసగణూచే విరచితమైన శ్రీ గజానన విజయమను యీ గ్రంథము శ్రద్దకలిగిన భక్తులకు భవాబ్దిని దాటటానికి తారకమగుగాక!

||శుభం భవతు ||

|| శ్రీ హరిహరార్పణమస్తు. ||

||ఇది సప్తదశాధ్యాయము సమాప్తము||