సర్వం శ్రీసాయి

శ్రీ గజానన విజయం

పదహారవ అధ్యాయం

శ్రీ గణేశాయ నమః. జయ జయ శ్రీ పరశుధరా! జమదగ్ని కుమారా! పరశురామ పరమేశ్వరా! నన్ను మరువకు. నీవు సహస్రార్జునుని దండించి ద్విజులను రక్షించావు! నీవు బ్రాహ్మణుల అవమానాన్ని సహించలేకపోయావు మరి! కానీ యిప్పుడు ఆ బ్రాహ్మణుల వైపే చూడటంలేదేమీ? ఇప్పుడింత గాఢమైన నిద్ర ఎలా ముంచుకొచ్చింది? హే! హరీ! పై ప్రసంగమే యిదీను. కాబట్టి కళ్ళు తెరచి కొంచెం సాయం చెయ్యి! నీ కృప లేకున్నట్లయితే మా ప్రయత్నాలన్నీ వ్యర్ధమే! నీవు తప్ప యీ ఆర్యసంస్కృతిని ఎవరు రక్షించగలరు? శ్రీగజాననుల కృప అఘటితమైనది! దానిని సామాన్యులు తెలుసుకోలేరు! 'ముడ్ గాంవ్'లో పుండలీకుడనేవాడు శ్రీస్వామికి భక్తుడు. అతడు నియమం తప్పకుండా శేగాంవ్ వచ్చేవాడు. స్వామి యెడల అతనికి అచంచల భక్తివిశ్వాసాలుండేవి. అతడు ఏకాగ్రచిత్తుడై స్వామిని అహర్నిశలూ ధ్యానించేవాడు. అదే గ్రామంలో 'భాగాబాయి' అనే ఒక మోసగత్తె వుండేది. ఆమె ని ఒకచోట స్థిరంగా వుండేది కాదు! ఆమె దాంభికురాలు! ఇలా దాంభిక పూజలెన్నో చేసి పురుషుల్నీ, స్త్రీలనూ మోసగిస్తూ వుండేది! ఇదే ఆమె వ్యాపారంగా వుండేది! ఒకసారి పుండలీకునితో నీ జన్మ వ్యర్ధమైపోయింది. నువ్వెవరినీ గురువుగా ఎంచుకొనలేదు! ఎన్నోసార్లు గజాననుల దగ్గరకు వెళ్ళావు. వారిని సద్గురువుగా నమ్మావు. కానీ ఆయన నిన్ను పిలిచి గురుమంత్రాన్ని ఉపదేశించారా? అధికారియైన గురువుచేత గురుమంత్రం పొందితేనే గురువుని ఎంచుకున్నట్లవుతుంది. శేగాంవ్ లోని ఆ గజాననుడు ఒక పిచ్చివాడు. నీ జ్వరం తగ్గిందని ఆయనకు భక్తుడవై కూర్చున్నావు! అరె! ఇది కాకతాళీయంగా జరిగిందే! దీన్ని నమ్మకు. 'గిణ గిణ బోతే' అనే కీర్తన, పిచ్చివానిలాగా ప్రవర్తన, ఎవరిచ్చినా తినటం లాంటివి మతిభ్రమ లక్షణాలే! అందుచేత మనం 'అంజనగాం' వెడదాం. అక్కడున్న 'కోజాజీ యోగి' శిష్యుల్ని మనం గురువులుగా ఎంచుకుందాం. రేపు వారి సంకీర్తనం 'అంజనగాం' లో వుంది. అది వినటానికి రేపు వుదయం బయలుదేరి వెడదాం! అరె! గురువు మహాజ్ఞాని, చతురుడు, శాస్త్ర చింతామణి అయి వుండాలి. గురువంటే అలాటి గుణఖనియై వుండాలి. భక్తుల్ని ఋజుమార్గంలో నడిపించే వారుగా వుండాలి. పైన చెప్పిన సద్గురు లక్షణాలేవీ గజానన స్వామిలో లేవు! అందుచేత ఆలస్యం చేయకుండా అంజనగాం పద!' అంది. పాపం! 'పుండలీక భోకరే' శ్రద్ధాభక్తులు కలిగిన అంతఃకరణ కలవాడు. భాగాబాయి తన మంచిమాటలతో అతనిలో వికల్పాన్ని సృష్టించింది. తరువాత అతడు మరునాటి సంకీర్తనం వినటానికి నిశ్చయించుకున్నాడు. తర్వాత విషయం ఆలోచిద్దామనుకున్నాడు. అందుచేత భాగాబాయితో "నేను నీతో కూడా అంజనగాం వస్తాను" అని అన్నాడు. ఇద్దరు వెడదామని నిచ్చయించు కున్నరు. పుండలీకుడు ఆ రాత్రి హాయిగా నిద్రించాడు. మూడో ఝాము రాత్రి ఇలా జరిగింది. పుండలీకునికి కలలో ఒక దిగంబరుడు కనిపించాడు. అతడు స్వామి గజాననులవలెనే వున్నాడు. అతడు అరె! పుండలీక అంజనగాం ఎందుకు వెడుతున్నట్లు? భాగాబాయి చెప్పినట్లు గురువును ఎంచుకుంటానికా? అక్కడికి వెళ్ళటానికే నిశ్చయించుకున్నావు కాబట్టి వెళ్ళు! అతని పేరు 'కాశీనాథ్'! కానీ పిచ్చివాడా! అక్కడికి వెళ్ళగానే నీ భ్రాంతి తొలగిపోతుందిలే! చెవిలో మంత్రం చెప్పటం చేతనే గురువౌతాడా? రోజంతా ఎంతోమంది ఒకరికొకరు చెవుల్లో మాటలు చెపుతూ వుంటారు కదా! మరి వారంతా ఆ ఒకరికొకరు గురువులౌతారా? అరె! పుండరీకా! ఈ మోసానికి వశపడకు! నీకు మంత్రం చెవిలో చెప్పేదే కావాలంటే, ఏదీ నీ చెవినిలా దగ్గర చెయ్యి! నేను మంత్రం ఉపదేశిస్తాను. 'గణ, గణ' అంటూ ఒక్కసారిగా స్తబ్ధులయ్యారు. తరువాత 'యింకేం కావాలో అది కూడా కోరుకో అవన్నీ యిస్తాను' అన్నారు. అది విన్న పుండలీకుడు ఎంతో సంతోషించాడు. ఆ మనిషిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అతడెవరో కాదు సాక్షాత్తూ శేగాంవ్ స్వామి శ్రీగజాననులే అని గుర్తుపట్టాడు. దాంతో పుండలీకుడు 'ఓ గురురాజా! నిత్యమూ పూజించటానికి మీ పాదుక లివ్వండి! ఇంతకంటే ఏమీ వద్దు! అన్నాడు. 'పాదుకలివిగో తీసుకో! రేపు మధ్యాహ్నం వీటిని పూజించు' అన్నారు స్వామి. పుండలీకుడు పాదుక లందుకొనటానికి లేచి కూర్చున్నాడు. మెలకువ వచ్చింది. నాల్గువైపులా చూడసాగాడు కానీ స్వామి లేరు, పాదుకలూ లేవు! అతడు సందిగ్ధావస్థలో పడ్డాడు. మనసులోని యీ స్థితితో అశాంతి కలిగింది. "నేటివరకూ స్వామి మాటలు వృథా కాలేదు. స్వామి కలలో దర్శనమిచ్చి భాగాబాయి ఎట్టి మోసగత్తెయో సెలవిచ్చారు. అలానే పాదుకల పూజను రేపు మధ్యాహ్నం చేయమన్నారు. దాని అర్ధమేమై వుంటుంది? క్రొత్త పాదుకలు తెచ్చి పూజించనా? కానీ నేను వారి పాదాలకున్న పాదుకలనే కోరాను. వారిచ్చారు. మరి క్రొత్తపాదుక లెందుకు తేవటం? ఇలా మనస్సులో తర్కవితర్కం చేసుకుంటూ వుండగా తెల్లవారిపోయింది. ఇంతలో భాగాబాయి పిలవటానికొచ్చింది. వస్తూనే 'అరుణోదయ మవుతోంది. ఇక మనం గురూదేశానికి అంజనగాంవ్ వెడదాం!' అంది. అది విన్న పుండలీకుడు 'బాగాబాయీ! నేను అంజనగాంవ్ కి రాను. నువ్వెళ్ళదలచుకుంటే చక్కగా వెళ్ళు, నేను శ్రీగజానన మహరాజుల్ని మనస్సులోనే .....

గురువులుగా భావించుకున్నాను. వారిని విడిచి నేవెక్కడికీ పోను. ఇదే నా చివరి నిర్ణయం' అన్నాడు. ఇది విన్న భాగాబాయి అంజనగాంవ్ వెళ్ళింది. ఇక 'ముడ్ గాంవ్'లో ఏంజరిగిందో వినండి. ఝ్యామసింగ్ రాజపుత్రుడు, స్వామి దర్శనార్ధం రెండురోజుల ముందే శేగాంవ్ వచ్చాడు. అతడు 'ముడిగాంవ్' తిరిగి వెడుతున్నపుడు స్వామి భాలాభావూతో ''ఈ పాదుకల్ని పుండలీకునికిమ్మని ఝ్యామసింగ్ కి యివ్వు' అన్నారు. సమర్థులు చెప్పిన ప్రకారం భాలాభావూ సరిగ్గా అలానే చేశాడు. పాదుకలిచ్చే సమయంలో భాలాభావు' 'పుండలీక లోకరే అనే సజ్జనుడొకడు మీ పూరిలో వున్నాడు. అతనికి యీ పాదుకలు పూజించటానికి యివ్వు' అన్నాడు ఝ్యామసింగ్ తో . ఝ్యామసింగ్ అంతావిని ఆ పాదుకలని తీసుకున్నాడు. ఝ్యామసింగ్ 'మెడ్ గాంవ్' వచ్చారు. పుండలీకుడు దారిలోనే కలిసి స్వామి యోగక్షేమాలడిగాడు. 'నాకోసం స్వామి ఏదైనా వస్తువు పంపారా? అని అడిగాడు ఇది విన్న ఝార్యమసింగ్ కి మహదాశ్చర్యం కలిగింది. అతడు పుండలీకుణ్ణి వెంటబెట్టుకొని యింటికి తీసుకొనివచ్చి మరీ మరీ అడిగాడు. అతడు తన్నెందుకిలా ప్రశ్నించాడో తెలుసుకుందామని. అప్పుడు పుండలీకుడు తన స్వప్న వృత్తాంతమంతా వివరించాడు. అప్పుడుకానీ ఝ్యామసింగ్ లోని సంశయం తీరలేదు! ఝ్యామసింగ్ పాదుకలు తీసి పుండలీకునికిచ్చాడు. అవే పాదుకలు నేటికీ వాని యింటిలో వున్నాయి! తరువాత పుండలీకుడు. ప్రసాదరూపమైన ఆ పాదుకల్ని గ్రహించి వాటిని మనస్పూర్తిగా విధి విధానంగా పూజించాడు. ఓ శ్రోతలారా! యోగులు తామిచ్చిన మాటనిలా నిలబెట్టుకుంటారు మరి! అంతేకాక తమ భక్తులు తప్పుదారి పట్టకుండా కాపాడుతూ వుంటారు కూడా! తమ భక్తుల మనోవాంఛితాల నెలా యోగులు తలుస్తారో యీ కథ వలన తేటతెల్లమౌతుంది. ఆస్తు! అకోలా పట్టణంలో 'రాజారాం కబర్' అనే ఒక బ్రాహ్మణుడు వుండేవాడు. అతడు షరాబు వర్తకం చేస్తూ వుండేవాడు. అంటే బంగారం, వెండి కొనటం అమ్మటం చేస్తూ వుండేవాడు. ఈ రాజారాం అంటే శ్రీస్వామీజీ ఎంతో యిష్టపడేవారు. అందుచేత ఆ రాజారాం పిల్లలకు కూడా స్వామి అంటే ఎంతో భక్తి శ్రద్ధావుండేవి. ఇతనికి 'గోపాల్, త్ర్యంబక్ అనే యిద్దరు కొడుకులు. వారిద్దరూ లవకుశుల్లాగా వుండేవారు. కనిష్టుడిని (త్ర్యంబకిని) 'భావూ' అని పిలిచేవారు. డాక్టర్ చదువు చదవటానికి హైదరాబాదు అతడు వెళ్ళివున్నాడు. చిన్నప్పటినుంచీ భగవంతుడంటే అమితమైన భక్తిభావం వుండేదతనికి, ఏదైనా ఆపద వచ్చినపుడు భాగ్యనగరంలోని 'మూసీ' నది ఒడ్డున కూర్చొని స్వామిని ధ్యానించేవాడు. చిన్నప్పటినుండీ అతనిలో భక్తిభావం వుండటంవలన శేగాంవ్ గజననులనే తన దైవంగా భావించాడు. ఒకసారి అతడు సెలవులలో ఇంటికి వచ్చాడు. అప్పుడొక కోరిక కలిగింది. శేగాంవ్ వెళ్ళి స్వామికి భోజనం ఎందుకు చేయించకూడదు? వారికిష్టమైన పదార్థాలన్నింటిని ఎందుకు సమర్పించకూడదు? కానీ నా కోరిక ఎలా తీరుతుంది?' అనే చింతతో అతడు వ్యాకులుడయ్యాడు. అందుచేత 'భావు' తన మనస్సులోనే స్వామితో యిలా అన్నాడు "స్వామీ! నా కోరిక తీరేదెలా? నా తల్లి నా చిన్నతనంలోనే పోయింది. ఇంట్లో నన్ను కావాలనుకునే వారెవరూ లేరు! ఇంట్లో వదిన వుంది. ఆమె పేరు 'నానీ' (అమ్మమ్మ) ఆమె చాలా చెరువ్వభావం కలది. హే! గురురాయ! మీకు యిష్టమైన పదార్థాలన్నింటిని మీచే తినిపించాలని నా కోరిక. కానీ యీ వస్తువులన్నీ తయారు చేసి పెట్టమని ఆ చెడు స్వభావం కలిగిన వదిన వెలా అడుగగలను? తల్లిదగ్గరే పిల్లవాడు మొండికేసుకోని కూర్చుంటాడు .కానీ మరోచోట కాదుగా"? అనుకుంటూ తన వాంఛితం ఎల తీరుతుందా అని వ్యాకులుడై వుండగా ఏదో పనిమీద నాని (వదిన) అక్కడికి వచ్చింది. మరిది వాడిపోయిన ముఖాన్ని చూసి ఏమయ్యా ఏ కారణుగా నీ ముఖం వాడిపోయింది" అంది. "భావు' దీనినదనుడై "వదినా! మనసులో నొచ్చుకుంటున్న మాటలు నీ కెలా చెప్పను? చేత కొంత అధికరం వుంటేనే, మనసులోని కోరిక తీరుతుంది కదా! అందుచేత నా మనోవాంఛితాన్ని నీకు చెప్పలేదు?" అన్నాడు. దానిమీదట కానీ "అసలు నీ మనసులోని మాటేమిటో తెలుసుకోనీ? నువ్వు నా మరిదివికదా దానుంచి దాపరికం ఎందుకు? అరే! పెద్దన్న తండ్రితో సమానమూ, వదిన తల్లితో సమనమూ కదా? ఇది నీకు తెలీదూ? అంది. ఉత్సాహన్నికలిగించే నానీ మాటలు విని భావూ నవ్వాడు. "నానీ ! నా మనసులోని మాట యిది. శ్రీ గజాసులకు యిష్టమైన పదార్థాలన్నింటినీ వండి వడ్డించాలని కొరిక.నువ్వు తయారుచేసినట్లైతే నీకు పుణ్యమూ వస్తుంది. నా కోరికా తీరుతుంది. ఒకే పని రెండు లాభాలు!" అన్నాడు భావు. మరిది యీ చిన్న కొరికను విని వదిన పగలబడి నవ్వింది, అంతే! అంతదానికి నువ్వు ముఖం ఇంత చేసుకు కూర్చున్నావా? ఇక సంకోచించకుండా చెప్పు ఏమేమి చెయ్యాలో! స్వామీజీ దయ వలన మనింట్లో అన్నీ వుండనే వున్నాయి? అనటంతోనే భాపులో కోరికను చెప్పేశాడు. నాని సంతోషంగా వంట హడావుడిలో పడింది. కొంచెం సేపట్లో వదినగారు మరిదికి ఎదురుగా కూర, జొన్నరొట్టెలు, పచ్చిమ్ని వుంచింది. వెన్న రాసిన మూడు రాష్టాలూ, మూడు ఉల్లిపాయలూ.....

సెనగపిండి కూర మరిదిముందుంచింది. శేగాంవ్ వెళ్ళే రైలుబండి వేలైంది. త్వరపడు ఒక ఈ బండి దాటిపోతే యిక చేసేదేమీ వుండదు. స్వామి భోజన సమయానికి అక్కడికి చేరుకుంటేనే యివి పనికివస్తాయి!' అంది నానీ,ఆమె మటలు విని భావూ అన్న ఆజ్ఞను తీసుకొని స్టేషనుకెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళే సమయానికే పన్నెండు గంటల బండి వెళ్లిపోయింది. ఇది చూసి భావూ అశాంతితో శోకాకులుడయ్యాడు. ముఖాన్ని నిరాశ కప్పేసింది. కళ్ళవెంట అశ్రువులు రాలుతున్నాయి. స్వామీజీ మూర్తిని కన్నుల ఎదుటకు తెచ్చుకొని "స్వామీ! నన్నెందుకు హతాశుణ్ణి చేస్తున్నారు? నేను హీనుణ్ణి, దీనుణ్ణి నాచేత పుణ్యకార్యం ఎందుకవుతుంది. మాలాటి కాకులకు మానస సరోవర లాభం ఎలా కలుగుతుంది? హే గురురాయా! నావల్ల జరిగిన పొరపాటేమిటి? యీ రైలు తప్పిపోయింది. హయ్ ! హతవిదీ! నా ప్రాణం తీసేశావు కదా! నన్ను గురు సేవ చేయనీయలేదు. నా దగ్గరున్న పదార్థాలన్నీ యిలానే వుండిపోయి నట్లైతే నేను అన్నం ముట్టను! ఇది ముమ్మాటికీ నిజమని నమ్మండి. హే! గురురాయా! కృపాసాగరా! నన్ను అవహేళన చేయకండి! నా దగ్గరున్న పదార్థాలను భుజించటానికి సత్వరమే రండి! దయచేయండి! మీ మహత్తు ఎట్టిదంటే ఒక్క క్షణంలోనే కేదారేశ్వరం దర్శించవచ్చు. మరి ఇక్కడికి రావటానికెందుకా విలంబనం? నేను మిమ్మల్ని ఆజ్ఞాపించటంలేదు, మనస్ఫూర్తిగా, ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దీనిని అవమానంగా మాత్రం తలచకండి. మరో బండి రావటానికి 3 గంటల వ్యవధి వుంది. అప్పటిలోగా మీరు భుజించేస్తారు!' 'అని అనుకుంటూ వ్యాకులుడై అన్నం తినకుండా అక్కడే కూర్చున్నాడు. సుమారుగా నాల్గవఝాముకి శేగాంవ్ చేరాడు భావూ. రాగానే భావూ స్వామి దర్శనానికి వెళ్ళాడు. స్వామి ఆసనంపై కూర్చొనివున్నారు. కానీ యింకా భోజనం చేయలేదు. నైవేద్యం పెట్టిన, పక్వాన్నాలతో నిండిన పళ్ళాలు ఎన్నో మఠంలో పడివున్నాయి! అవి ఎన్నో ఎలా వర్ణించటం? ఎవరివో జిలేబీలూ, ఎవరివో నేతి మిఠాయిలూ, మరెవరివో లడ్డూలూ, ఇంకెవరిదో పాయసం, మరెవరిదో శ్రీఖండ- పూరీలు-ఎన్నో! ఐనా ఒక్క పళ్ళాన్ని కూడా స్వామి ముట్టుకోలేదు. బాల భావూ ఒక దాని తరువాత మరొక పళ్ళెం పెడుతునే వున్నాడు వరుసగా! స్వామిని స్వీకరించమని ప్రార్ధిస్తున్నాడు. ఇలా మధ్యాహ్నం ఒంటిగంటైపోయింది. తరువాత 'స్వామీ! మీరు స్వీకరించకుండా భక్తులెలా ప్రసాదాన్ని పొందుతారు? పళ్ళాలు తెచ్చినవారంతా తమకు ప్రసాదం ఎప్పుడు లభిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వారికైతే మిమ్మడిగే ధైర్యంలేదు అందుకే నేను వారి తరపున ప్రార్ధిస్తున్నాను" అన్నాడు. దాని మీదట స్వామి "కొంచెం ఆగండి! నా నేటి భోజనం నాలుగోఝాములో ఆవుతుంది! వారు ఆగలేకపోయినట్లైతే వారివారి పళ్ళాలు తీసుకొని వెళ్ళవచ్చు! నాకేమీ ఫర్వాలేదు!" అన్నారు. ఇది జరుగుతూండగానే భావూ అక్కడికి వచ్చాడు. స్వామిని ఎదురుగా చూసి మనస్సులో ఎంతో సంబరపడ్డాడు! తప్పిపోయిన ఆవుదూడ ఆవును కలుసుకున్నపుడెట్టి అనుభూతి కలుగుతుందో అలాటిదే స్వామిని ఎదుట చూసిన భావుకు కూడా అలాటి అనుభూతే కలిగింది! స్వామి దగ్గరకు వెళ్ళి సాష్టాంగపడి, స్వామి ఆజ్ఞకోసం ఎదురు చూడసాగాడు. భావూని చూసి నవ్వుతూ 'భోజనం సమర్పించే నీ విధి బలే విచిత్రంగా వుంది! భోజనం చేసే సమయమా యిది? ఇప్పటివరకూ నీకోసం ఎదురుచూస్తూ ఏమీ తినకుండా ఆకలితో కూర్చున్నాను. ఇంకా త్వరగా నీ భోజనం తీసుకొనిరా!" అన్నారు. స్వామి మాటలు విన్న 'భావుకబర్' మనస్సులో ఎంతో ఆనందించాడు. సిగ్గుపడుతూ స్వామీ! ఏంచేయను? పన్నెండుగంటలు దాటిపోయింది!" అన్నాడు. దానిమీదట బాలాభావూ 'ఇక విచారించకు ఎంతెచ్చావో చూపించు. తెచ్చింది స్వామిచేత తినిపిద్దాం!' అన్నాడు. ఇది విని భావూ వుల్లిపాయల కూర, జొన్నరొట్టెలూ స్వామి ముందుంచాడు. అందులోని రెండు రొట్టెల్ని స్వామి ఆరగించి మిగిలిన రొట్టెను ప్రసాదరూపంగా అందరికీ పంచారు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు! దీనితో శ్రీస్వామీజీ భక్తవత్సలతను అందరూ చక్కగా తెలుసుకున్నారు. హస్తినాపురంలోని రాజలాంఛనాలు, సత్కారాలూ రుచించని శ్రీకృష్ణునికి విదురునింటిలోని నూకలతో వండిన పదార్థమే పక్వాన్నాలకంటే రుచించింది కదా! అలానే యిక్కడా జరిగింది! “మన పక్వాన్నాలకంటే భావూ తెచ్చిన ఎండిపోయిన రొట్టెలే రుచించాయి స్వామికి! వారి చిత్తమంతా అందులోనే నిండివుంది!" అనుకున్నారు భక్తులంతా. శేగాంవ్ లో భావూ ప్రసాదాన్ని స్వీకరించాడు. తమ యిష్టదైవాన్ని నమ్ముకున్నవారి కోరికలు తప్పక తీరతాయి! ఉచితసమయాన స్వామీజీ 'భావూని'' ఆశీర్వదించి 'ఇక నువ్వు అకోలా వెళ్ళు ! పైయేడు నువ్వు డాక్టరు పరీక్షలో ఉత్తీర్ణుడవౌతావు!" అన్నాడు. వెళ్ళేటప్పుడు భావూ స్వామితో "స్వామీ! ఒక వేళ ఏ కారణంచేతనైనా యిక్కడికి రాలేకపోతే మీ కృప ఆశీర్వాదాలు ఎప్పుడూ యిలానే దయచేయండి. మీ దివ్యచరణాలే నాకు సర్వస్వమూ! మీ ధ్యాసే నాకెప్పుడూ వుండేలా ఆశీర్వదించండి. ఇదే నా ప్రార్ధన!" అని భావూ స్వామినుంచి సెలవు తీసుకొని అకోలా తిరిగి వెళ్ళి పోయాడు. స్వామి తన భక్తుల నెవరినీ ఉపేక్షించరు! ఇది నిజమే మరి! 'తుకారాం షేగోంకార్' శేగాంవ్ నివాసి, అతడు వ్యవసాయదారుడవటంవలన పొలంలో పనిచేసేవాడు. అంతే కాకుండా స్వామి అంటే భక్తిశ్రద్ధలు కలవాడు. అతని యింటిస్థితి చక్కనైంది కాదు. దినమంతా పాలంలో పనిచేసి సాయంత్రం నియమం తప్పకుండా స్వామి దర్శనానికి, మఠానికొచ్చేవాడు. అక్కడ 'చిలం' నింపి యిచ్చేవాడు. స్వామి దర్శనం చేసుకునేవాడు! కొద్దిసేపు వారి సేవచేసి యింటికి వెళ్ళేవాడు. ఇలా అతని కార్యక్రమం చాలా రోజుల వరకూ గడుస్తూ వచ్చింది. విధినెవరూ తప్పించలేరు కదా! విధిలిఖితం జరిగే తీరుతుంది! తుకారాం తన పొలం పనిలో నిమగ్నుడై వుండేవాడు. ఒకనాటి మాట. ఒక వేటగాడు వేటాడటానికి వచ్చాడు. వాని వెనుక ఒక తుపాకీ వుంది దాంతో ఒక కుందేలుకి గురిపెట్టాడు. అది ప్రభాతసమయం. అరుణోదయం ఔతోంది. తుకారాం తన పాలంలో కూర్చొని వున్నాడు. అతని వెనుక కుందేలు వచ్చి కూర్చుంది. అది వేటగాడు చూశాడు, వేటగాడు వీపుపైనుంచి తుపాకీతో దాన్ని కొట్టాడు. గుండు తగిలి కుందేలు చచ్చింది. కానీ దాంతోపాటుగా ఆ గుండు తుకారాం చెవి వెనకనుండి దూసుకొనిపోయి అతని తలలో దూరింది. తలలో దూరిన గుండు డాక్టర్లవల్ల కూడా బయటకు తీయటం కుదరలేదు. గుండు రాకపోవటంవలన తుకారాం బాధతో కొట్టుకుంటున్నాడు. తలలో నొప్పి ప్రారంభమైంది. నిద్రవచ్చేది కాదు. దీనికెన్నో మొక్కులు మొక్కాడు. ఐనా నొప్పి తగ్గలేదు. ఆ స్థితిలో ఎవరో భక్తుడు తుకారాం, మఠంలో స్వామిని దర్శిస్తే కొంత ఉపశమనం కలుగుతుందన్నాడు. ఇక డాక్టర్ల వైద్యం విడిచి పెట్టండి. యోగి చరణలకు సమర్పించండి. యోగి చరణసేవయే అసలైన ఉపాయం దీనికి! స్వామికి దయకలిగినట్లైతే యితడు చక్కబడతాడు. ఊడ్చి, మఠాన్ని శుభ్రంచేసే పని యితని చేత చేయించాలి. కానీ తన తండ్రిలాగా డాంభికుడై యీ పని చేయరాదు. ఈ పని శుద్ధ అంతఃకరణతో నిరాసక్తుడై చేయాలి!" అన్నాడు. తుకారాంకి యీ మాటలు నచ్చాయి. అప్పటినుంచీ మఠంలో ఊడవటం ప్రారంభించాడు. మఠాన్ని అద్దంలా శుభ్రంగా వుంచేవాడు. ఇలా యీ పనినే పధ్నాలుగు సంవత్సరాలు చేశాడు. తుకారాం చేసిన సేవకు ఫలితం దక్కింది. ఒకరోజున ఒక చమత్కారం జరిగింది. తుకారాం మఠాన్ని ఊడుస్తూనే వున్నాడు. ఆకస్మాత్తుగా అతని చెవిలోంచి ఆ గుండు ఊడి బయట పడింది. పండిన పండు చితిపితే గింజ బయటపడ్డట్టు చెవినుంచి గుండు బయట పడగానే తలలోని నొప్పి తగ్గిపోయింది. ఇది అనాసక్త సేవాఫలమే

మరి! ఇక తుకారాం బ్రతికి వున్నంతకాలం మఠాన్ని శుభ్రంచేస్తూనే వున్నాడు. అనుభూతి లేకుండా కేవలం పరమార్ధం వలన శ్రద్ధా భక్తులురావు. ఒకసారి శ్రద్ధాభక్తులు కలిగినట్లైతే ఇక అవెప్పటికీ పోవు. స్థాయీరూపంగా వుండిపోతాయి! 'యోగుల సేవచేయటమే అన్నిటిని మించిన సాధన' అవబడుతుంది. "స్వస్తిశ్రీ దాసగణూ విరచితమైన యీ శ్రీ గజానన విజయమను గ్రంథము భక్తులను భవసింధువునుంచి తరింపచేయుగాక!

॥ శుభం భవతు ॥

|| శ్రీ హరిహరార్పణమస్తు ॥

॥ ఇది షోడశాధ్యాయము సమాప్తము||


యే మనుష్యః మాం ఆశ్రతః!
తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!