సర్వం శ్రీసాయి

శ్రీ గజానన విజయం

పదిహేనవ అధ్యాయం

శ్రీ గణేశాయ నమః, హే! కశ్యపాత్మజ వామనా! హే వటురూపధారీ నారాయణా! నీవు బలిచక్రర్తి దానాన్ని స్వీకరించి అతణ్ణి కృతార్థుణ్ణి చేశావు! దానంలో అతనికి వచ్చే మృత్యులోక రాజ్యాన్ని నీవు గ్రహించి పాతాళంలో రాజ్యాన్ని ప్రసాదించావు! ఆ పుణ్యవంతుడైన బలి విషయంలో 'ఉసిరి. కాయంత నైవేద్యం పెట్టి, గుమ్మడి కాయంత ఫలం పొందు' అనే సామెతని సార్థకం చేసి చూపావు! అతడు చూపిన భక్తికి ప్రసన్నుడవై నీవు అతని ద్వారపాలుడవే ఐనావు! ఈ కలియుగం అంతం కాగానే ఆ బలి చక్రవర్తి దేవతై రాజరాజేశ్వరురు డౌతాడట కదా! హే! అనంతా! నీవు కొన్ని క్షణాల్లోనే నాలుగు వేద సంహితలనీ రచించావట! నీ అగాధమైన బుద్ధికుశలతను చూసి పండితులు కూడా ఆశ్చర్యచకితులౌతారు! నేటివరకూ నీవెత్తిన అవతారాలన్నింటిలోనూ యీ ఒక్క అవతారంలోనే ఎవరినీ నీవు వధించలేదు! శత్రువు మిత్రుడు అనే బేధ భావాన్ని చూపకుండ ప్రతియింటా దీపాన్ని పెట్టావు! దేవదానవులను అభిన్నులుగానే చూశావు! దేవతలకు శుభాన్ని చేకూరుస్తూ దానితో బాటు రాక్షసులనూ రక్షించావు. నీవు ఈశ్వరతత్వాన్ని యీ అవతారంలోనే సమతులంగా వుంచావు! నేను నీకు ప్రణామం చేస్తున్నాను. హే! వామనా! దాసగణూ మస్తకంమీద నీ అభయహస్తాన్నుంచి నిశ్చింతగా వుండమని దీవించు. అస్తు! బాలగంగాధర తిలక్ మహారాష్ట్రలోని ఒక కోహినూరు వజ్రం వంటివాడు. దూరదృష్టి సాగరుడూ! రాజనీతి కుశలుడూ! ఇలాంటి గుణాలతో నిండినవాడు. పారతంత్ర్యాన్ని తొలగించటానికీ, దేశాన్ని స్వతంత్రం చేయటానికి తన ప్రాణాలనే పణంగా పెట్టినవాడు. విదేశీశక్తుల నెదిరించటానికి ఆయన చూపిన ధైర్యసాహసాలు ఎంతని వర్ణించగలం? ఆయన భీష్ముని వంటి దృఢ ప్రతిజ్ఞ చేసినవాడు. పారతంత్య్రంలో వున్న భారత భూమి యొక్క స్థితిని కళ్ళారా చూసి అరచేత ప్రాణాన్నుంచి అసిధారావ్రతానికి పూనుకుంటానని ప్రతిజ్ఞ చేసినవాడు. అతడెవరికీ భయపడనివాడు. బృహస్పతివలె వాక్చాతుర్యం కలవాడు. ఆయన లేఖిని ఎటువంటిదంటే వీరు వ్రాసిన పత్రాన్ని చూసి ఆంగ్లేయుల ప్రభుత్వం గడగడలాడి పోయింది. ఆయన తన జీవితాన్నంతా చివరివరకూ ఏ ఆశా లేకుండా దేశంకోసం గడిపాడు. అందుకే ప్రజలు ఆయనను "లోకమాన్యుడ'ని పిలిచారు. ఆయన తన జీవితాన్నే దేశ సేవకంకితం చేసి ఆ బిరుదును సార్ధకం చేశాడు. ఒక సారి శివాజీ జయంత్యుత్సవానికి ప్రజలు ఉపన్యాసం యివ్వటానికి ఆహ్వానిస్తే ఆయన అకోలా గ్రామానికి వచ్చారు. ఉత్సవానికి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. లోకమాన్యుడొస్తున్నాడని

విద్వాంసులందరూ అనుకోసాగారు. 'దామ్ లేజీ': 'కోల్హాట్ కర్', 'ఖాపర్దేజీ' మొదలైన విద్వాంసులంతా అకోలా వచ్చి చేరారు. శివాజీ జయంతి ఉత్సవానికి అధ్యక్షులుగా తిలకేనే నిశ్చయించారు. తిలక్ జీ పేరు వింటూనే విదర్భ అంతా ఆనందంతో పులకించింది. శివాజీ జయంతి యీ ప్రాంతంలో ముందుగా జరగాల్సింది అనుకున్నారు ప్రజలు. దానికి కారణమేమంటే శివాజీ తల్లి జిజియాబాయి పుట్టింది వర్షాడ ప్రాంతంలోని 'సింధ్ ఖేడా' గ్రామమే! వీరమాత జిజియాశివాజీని కని వర్హాడ మహారాష్ట్రులను తన కర్తృత్వంతో ఒకటిగా చేసింది. తల్లి వర్హాడ ప్రాంతపుదైతే, తండ్రి మహారాష్ట్రపు శహాజీరాజా భోస్లే! వారిద్దరూ ఒకరికొకరు తగిన వారే! ఒక ప్రక్క శివజయంతి మహారాష్ట్రంలోని ముఖ్యపర్వం. మరోప్రక్క ఉత్సవ అధ్యక్షులు, లోకనేత బాలగంగాధర తిలక్ అవటంవలన బంగారానికే వన్నె తెచ్చినట్లయింది. ఉత్సవాని కేర్పాట్లు ఒక నెలముందునుంచే అవుతున్నాయి. ఇప్పుడు పరస్పరానుకూలయోగం రావటంవలన అంతా ఎంతో ఆనందించారు. ఉత్సవానికై అధ్యక్షులు, ఉపాధ్యక్షులూ ఎన్నుకోబడ్డారు. స్వయంసేవకుల సూచీ తయారైంది. కొందరిలా అన్నారు. ఈ శివ జయంత్యుత్సవ సందర్భంలో శేగాంవ్ లోని శ్రీ గజానన మహరాజ్. స్వామిని ఆహ్వానిస్తే బాగుంటుందన్నారు. అలాచేస్తే పాలలో చక్కెర వేసినట్లే మరి! శివాజీ దేశంకోసం చేసిన పనులన్నింటికినీ స్వామి సమర్ధ రామదాసుల ఆశీర్వాదం వుండేది. అందువల్ల అతనికి జయమే కలిగింది. తిలక్ జీ చేసే రాజనీతి కూడా శివాజీవలె దేశోద్ధరణకే కదా! కాబట్టి యిట్టి కార్యానికి కూడా శ్రీస్వామిజీ యొక్క ఆశీస్సులు లభించాలి. దీనికి కొందరు సమ్మతిస్తే, కొందరు అసమ్మతి తెలిపారు. అసమ్మతి వర్గీయులు యిలా అన్నారు " ఆ శేగాంవ్ పిచ్చివాణెందుకు యీ శుభసమయంలో పిలుస్తారు? అతడు ఇలాటి సమయంలో ఏదో ఒక విచిత్రం చేసి సభని పాడుచేస్తాడు. ఆయన సభలో దిగంబరుడుగా తిరుగుతాడు. 'గిణ గిణ గణాత్ బోతే!' అని భజన చేస్తూ బహుశా లోకమాన్యుణ్ణి కూడా కొట్టవచ్చు! అన్నారు. ఐతే కొందరు దీనికి అసమ్మతిని ప్రకటించి శ్రీగజాననుల శ్రీచరణాలు ఇలాటి స్థితిలో ఇక్కడి ధూళిని తాకాలి' అన్నారు. ఆయన పిచ్చి వాడెవరికి? సామాన్యుల దృష్టిలో! విద్వాంసులూ, సజ్జనులూ వారిని పిచ్చివాడనుకోరు. తిలక్ జీ నిజంగా దేశోద్ధారకులైతే తప్పకుండా శ్రీస్వామీజీ ఉత్సవ సమయంలో ఇక్కడే ఉపస్థితులౌతారు. నిజానిజాలేవో ఆ సమయంలోనే తేలిపోతాయి కదా! కాబట్టి స్వామీజీని ఆహ్వానించటానికి వెనుకా ముందూ....

అక్కర్లేదు' అన్నారు. ఇలా చర్చ జరిగిన తరువాత కొందరు శ్రీస్వామిని ఆహ్వానించటానికి శేగాంవ్ వచ్చారు. వచ్చినవారి నెదురుగా చూడగానే శ్రీస్వామీజీ 'దాదాసాహెబ్ ఖాపర్డే'తో 'శివజయంతి మహోత్సవానికి తప్పక ఉపస్థితుణ్ణౌతాను అక్కడ పిచ్చి వేషాలు వేయక మౌనంగానే కూర్చుంటాను. బాగుకోసం పాటుపడే వారి మనస్సెప్పుడూ నావల్ల చెడిపోదు! దేశాన్నుద్ధరించటానికి బాలగంగాధరుడు సుయోగ్యుడు. అధికారి! ఆయనలాటి దేశప్రేమి, దేశభక్తుడు బహుశా యిక దొరకరేమో! అణ్ణా పట్వర్ధన్ తిలక్ జీ మిత్రుడూ, ఆలంది నరసింహ సరస్వతి శిష్యుడు. కాబట్టి వీరిద్దరినీ కలియటానికి అకోలా తప్పక వస్తానన్నారు స్వామీజీ. ఇది వినిన 'ఖాపర్డే' ఎంతో సంబరపడ్డారు. ఆయన 'కోల్హాటికర్' తో యీ వరాడ ప్రాంతపు జ్ఞానవజ్రాన్ని చూశావా? అన్నారు. ఈయన అకోలాలో జరిగిన విషయాలన్నింటినీ ఇక్కడుండే తెలుసుకున్నారు. యోగులయొక్క అగాధజ్ఞానాన్ని చూడండి. దేశభక్తుల ఎడగల స్నేహాన్ని చూడండి. మనం మాట్లాడటానికి ముందే స్వామి వస్తానని మాటిచ్చారు. వారికేమీ చెప్పనక్కరలేకపోయింది. ఈ శుభకార్యానికి శకునం మంచిదే! పదండి. శ్రీస్వామి చరణాలకు ప్రణమిల్లి తిరిగి పోదాం! అన్నారు. ఖపర్దే, కోల్హాట్ కర్ తిరిగి అకోలా వెళ్ళిపోయారు. శివజయంత్యుత్సవానికి కేవలం ఎనిమిది రోజులే వున్నాయి. వర్షాడ ప్రాంతం అంతా ఆనందంగాను, ఉత్సాహంగాను వుంది. ప్రతి ఒక్కరూ అధీరుడై తిలక్ చరణాలు ఎప్పుడు అకోలాలో పడతాయో! మేం వారి దర్శనమెప్పుడు చేసుకుంటామో అని అనుకుంటూ వుండేవారు. శకసంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై వైశాఖమాసంలో అకోలాలో బ్రహ్మాండమైన మండపంలో శివజయంత్యుత్సవం జరిగింది. వరాడ ప్రాంతంలో అక్షయ తృతీయ పండుగను బ్రహ్మాండంగా జరుపుతారు. ఐనాగానీ సభామండపం పూర్తిగా నిండేవుంది. అక్షయ తృతీయ రోజే ఉత్సవానికి చివరిరోజు. అందుచేత 'లోకమాన్యుణ్ణి' చూడటానికోసం ఎంతో దూరం నుంచి అనేకమంది వచ్చారు. శ్రీస్వామీజీ కూడా యీ సందర్భంగా వస్తున్నారని జనాలకు తెలిసింది. అందుచేత సభామండపం పూర్తిగా క్రిక్కిరిసి పోయింది. ప్రతివారు స్వామి రాకకోసం నిరీక్షిస్తున్నారు. స్వామీజీ యింతవరకూ ఎందుకు రాలేదు? అని అనుకుంటున్నారు. కానీ స్వామీజీ మొదటినుంచీ మండపంలోనే కూర్చొని వున్నారు. సాధువన్న మాటలు అసత్యాలూ, మిథ్యా కావుకదా! జీవన్ముక్త సాధువు శ్రీగజాననులు సభామండపంలో ఉన్నతాసనం మీద ఉపవిష్ణులై వున్నారు.ఉచ్చాసనం మధ్య

లోకమాన్యుడు ఉపవిష్టుడయ్యాడు. ఆయన దగ్గర అణ్ణా సాహెబ్ , పట్వర్ధన్ వున్నారు. గణేష్ జీ ఖాపర్డే కులభూషణమైన శ్రీకృష్ణనందనుడు తిలక్ కి రెండవవైపు కూర్చున్నారు. దామరే, కోల్హాట్ కర్ భావే, వెంకటరావు దేశాయి. ఈ సభాముఖ్యులంతా ఉచ్చాసనం పైనే కూర్చున్నారు. ఇంకా ఉపన్యాసాలు చెప్పే సజ్జనులూ కూర్చున్నారు. దాన్ని వర్ణించటం యీ ఒక్కనోటితో కాదుమరి! కొల్హాట్ కర్ ఆ సభ యొక్క ఉద్దేశాన్ని వివరించారు. తరువాత 'భాషణసింహులు' లోకమాన్యతిలక్ నిలబడ్డారు. 'నేటిరోజు చాలా ధన్యమైనది. ఇక్కడి వీరుడొకరు దేశ స్వాతంత్ర్యానికి తన ప్రాణాల్ని పణంగా పెట్టాడు. ఆధనుర్ధరుడైన వీర శివాజీ యొక్క జన్మోత్సవాన్ని నేడు జరుపుకొనటానికి మనమంతా యిక్కడికి వచ్చాం. ఆ శూరవీరునికి, శివాజీకి సమర్ధ రామదాసుల కృప, ఆశీర్వాదం లభించాయి. అందుచేత ఇతని పేరు కేవలం మహారాష్ట్రంలోనేకాక యావద్భారతావనిలో మారుమ్రోగింది. అలానే ఆశీర్వాదం ప్రసాదించటానికి సాధువు శ్రీ గజాననులు నేడిక్కడ ఉపస్థితులయ్యారు! ఇవి మనకెంతో అవసరం. స్వాతంత్ర్యపు సూర్యుని అస్తమయంతో పరతంత్రపు ఘోర అంధకారం దేశం నలుమూలలా అలుముకుంది. స్వాతంత్య్ర హీనమైన దేశం ప్రేతంతో సమానంగా భావించబడుతుంది. కాబట్టి దేశప్రేమను వృద్ధి చేయటానికి మనమంతా ప్రజలకు శిక్షణనివ్వాలి. నేటినుంచీ పిల్లలకు కూడా దేశప్రేమను బోధించటం అత్యావశ్యకం! • ఇలాటి శిక్షణను మనకు పరరాజులే విధంగా యివ్వగలరు? అన్నారు తిలక్. ఈ మాటలు వినగానే స్వామిగజాననులు లేచి నిలబడి 'వద్దు! వద్దు!' వద్దు అని మూడుసార్లన్నారు. ఉపన్యాసం చెప్పే ఉద్వేగంలో తిలక్ జీ ప్రస్తుతం వున్న ప్రభుత్వాన్ని చాలా చెడుగా నిందించారు. వారి ఉపన్యాస ధోరణి ఎలాటిదో స్వామీజీ గమనించి, నవ్వుతూ నవ్వుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుటవల్లనే చేతులకు బేడీలు పడతాయి! అని స్వామి తన ప్రియమైన భజన 'గిణ గిణ గణాత్ బోతే!' అని పాడటం ప్రారంభించారు. సభ నిర్విఘ్నంగా సంపన్నమైంది. తరువాత ప్రజలంతా తిలక్ జీని ఎంతో ప్రశంసించారు. కాని స్వామియొక్క భవిష్యవాణి ఆ ఏడాదిలోనే రుజువయింది ప్రభుత్వం తిలక్ జీ పైన దావావేసి, 124 సెక్షను క్రింద బంధించారు. చేతులకు బేడీలు కూడా వేశారు 'రాజసత్తా బలీయసీ అనే న్యాయాన్ననుసరించి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించలేము. పెద్ద పెద్ద వకీళ్ళు తిలక్ జీ పక్షాన దావా వేయటానికి ప్రయత్నాలు చేయసాగారు. ఇదేకాక తిలక అంటే శ్రద్ధాభక్తులున్నవారు పారమార్థికంగా ఉపాయాలు...

చేయసాగారు. అందులో ఒకరు ఇలాంటి వారు 'దాదాసాహెబ్ కాపర్డే' తిలక్ మిత్రుడు, సహయోగి. ఆయన అమరావతినుంచి తిలక్ తరపున | న్యాయస్థానంలో వాదించటానికై బొంబాయి వెడుతున్నారు. అకోలా స్టేషన్లో కొల్హాట్ కర్జీతో ఇలా అన్నారు. మీరు వెంటనే శేగాంవ్ వెళ్ళి స్వామీజీని తిలకని రక్షించమని ప్రార్ధించండి అన్నారు. దేశం ఆపదలో వుంది. నేనే స్వయంగా శేగాంవ్ వెడదామనుకున్నాను. కానీ వెంటనే బొంబాయి వెళ్ళాల్సివుంది. అందుచేత మీరు శేగాంవ్ వెళ్ళి స్వామిని ప్రార్ధించండి అన్నారు. వెంటనే ఆ తిలక్ జీ భక్తుడు కోల్హట్ కర్ జీ బండిలో కూర్చుని శేగాంవ్ వెళ్ళి స్వామిని చేరారు. ఆ సమయంలో స్వామీజీ నిద్రిస్తున్నారు. మూడురోజులైనా లేవలేదు. అంతవరకూ కోల్హట్ కర్ జీ అక్కడే మఠంలో వుండిపోయారు. తిరిగి వెళ్ళకూడదనుకున్నారు. తిలక్ జీ మీదున్న అచంచల భక్తి విశ్వాసాలవల్ల ఆయన స్వామి నిద్రలేచేంతవరకూ కదల్లేదక్కడి నుంచి. మరాఠీ భాషలో 'నిప్పులేకుండా పొగ, మాయా మమతా లేకుండా కన్నీళ్ళరావు' అని. నాలుగవనాడు శ్రీస్వామి మేలుకొని ఈ విషయంలో మీరెంత ప్రయత్నించినా ఫలితం దక్కడు ఛత్రపతి శివాజీకి శ్రీ సమర్ధ రామదాస స్వామి అండదండలున్నా బాద్ షా అతణ్ణిఖైదు చేయలేదా?సజ్జనులు, వీరులకు కష్టాలు లేకుండా రాజ్యంలో క్రాంతి ఎలా వస్తుంది? ఈ సందర్భంలో కంసుని చరిత్ర గుర్తుచేసుకో! నేనొక జొన్న రొట్టె యిస్తాను. దాన్ని నిస్సంకోచంగా తిలక్ చేత తినిపించు. అది తిన్న తరువాత భవిష్యత్తులో ఒక గొప్పకార్యం ఆయనచేత కావల్సివుంది. ఆయన మనకు దూరంగా వెళ్లి పోతారు! కానీ. దీనికే ఉపాయంలేదు అన్నారు. స్వామీజీ యీ పలుకులు చిన్న కోల్హాట్ కర్ మనస్సులో శంకించారు. రొట్టెతీసుకొని స్వామికి వందనం చేశారు. తరువాత ఆయన బొంబాయి వెళ్ళి తిలక్ జీ‌ కి రొట్టెనిచ్చి శేగాంవ్ లో జరిగిన కథనాన్ని వినిపించారు. అదివిన్న తిలక్క అక్కడున్నవారితో నవ్వుతూ స్వామీజీ మాటలలో ఏదో ఆంతర్యం వుంది. వారు అంతర్థానులు! మన ప్రయత్నం బహుశా ఫలించకపోవచ్చు. ప్రభుత్వం తన్ను సమర్ధించుకొనటానికి మంచీ చెడూ అన్నీ చేస్తుంది. స్వార్ధం లేకున్నపుడే న్యాయం బయటకు వస్తుంది కదా! ఇదే లోకరీతి. నా చేత ఏదో ఘనకార్యం జరగబోతుంది. అనే స్వామి అమృతవాక్కులలో ఏదో సంకేతం వుంది! యోగులు భూత భవిష్యద్వర్తమానాలు తెలిసినవారు కదా! చూద్దాం! భవిష్యత్తులో ఏం జరగనున్నదో! అన్నారు. కోల్హాట్ కర్ యిచ్చిన ఆ రొట్టెను చక్కగా నమిలి తిన్నారు. తిలక్ జీ. వారికి పళ్ళు లేకపోయినా స్వామి ప్రసాదాన్ని అతిభక్తితో

గ్రహించారు. తిలక్ జీ కి ఆరుమాసాలు జైలుశిక్ష విధించి 'మాండలే' కారావాసానికి (బ్రహ్మదేశంలోని) పంపారు. అక్కడే భగవద్గీతపై సమీక్షాత్మక గ్రంథం 'గీతారహస్యం' ఆయనచే వ్రాయబడింది. ఇదే మహాకార్యంగా రుజువైంది. దీనివలన తిలక్ జీ కి జగద్గురు శంకరాచార్యుల వారితో సమానమైన గౌరవం లభించింది! ఈ గీతాశాస్త్రంమీద అనేక భాష్యాలు వచ్చాయి. వాటిని వర్ణించటం కానిపని, దాసగణూలో అంతటి సామర్ధ్యం ఎక్కడిది? సజ్జనులారా! కాలగతిననుసరించి ప్రతి ఆచార్యుడూ జగదుద్ధారణ కోసం భగవద్గీతకు అర్ధం చెప్పారు. ఒకే 'గీత'కు ఒకరు అద్వైత పరంగా అర్ధం చెపితే మరొకరు ద్వైతపరంగాను, ఇంకొకరు కర్మపరంగానూ అర్ధం చెప్పారు. తిలక్ జీ 'కర్మయోగ' మార్గమే శ్రేష్ఠమైనదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే వారిచేత కావించబడిన మహత్కార్యం! వీరి అభిప్రాయన్ననుసరించి 'కర్మయోగమే' సర్వశ్రేష్ఠమైనది. ఈ గ్రంధంవలననే అక్షరవాఙ్మయం యీ లోకంలో వున్నంతకాలము తిలక్ జీ అమరులై వుంటారు! వారి ప్రయత్నం వలన స్వాతంత్య్రం లభించటం సుగమమైంది. ఇది నిజమే! 'గీతారహస్యం" రచించటం వలన ఆయన అజేయుడు, అమరుడూ అయ్యాడు. స్వాతంత్ర్యం ఒకప్పుడు లభిస్తుంది. ఒకప్పుడు పోతుంది కూడా. ఇందులో గొప్ప విశేషమేమీ లేదు. గీతాశాస్త్ర విషయం వేరు మరి! దీనివలన మోక్షప్రాప్తి కలుగుతుంది. అంతేకాక అందులో చెప్పబడిన నిరంతర సత్యం (నిత్యసత్యం) సమాజం సరియైన మార్గంలో నడవటానికి సాయపడుతుంది! యావచ్చంద్ర దివాకరుడైన లోకమాన్య బాల గంగాధరుడు తన కీర్తిచేత నిరంతర చిరంజీవియే ఐనాడు. అన్తు! 'కరవీర్ కోల్హాపూర్ గ్రామంలో 'శ్రీధర గోవింద కాళే' అనే చిత్తపావన బ్రాహ్మణుడొకడుండేవాడు. అతని యింటి పరిస్థితి బాగులేకున్నా అతడు ఇంగ్లీషు స్కూల్లో చేరాడు. మెట్రిక్ పరీక్ష కూడా ప్యాసయ్యాడు. తరువాత కాలేజీలో చేరాడు. కానీ 'ఇంటర్ పరీక్షలో.. అనుత్తీర్ణుడైన కారణంగా కాలేజీ వదిలేయాల్సి వచ్చింది. పనీ పాటా ఏమీ లేనందున వార్తాపత్రికలు చూస్తూ వుండేవాడు. ఒకనాడు 'కేసరి' అనే పత్రికలో 'టోగోయామా'ల చరిత్ర చదివాడు. కొంచెం ఆలోచించి 'నేను భూమికి భారంగా వున్నాను. ఇంగ్లండు వెళ్ళి యంత్రవిద్య నెందుకు నేర్వరాదు? 'టోగో-యామా'లు జ్ఞానాన్ని సంపాదించి తమ మాతృభూమి జపాన్ అభ్యుదయానికి పాటుపడి సఫలులయ్యారు. అదే విధంగా యంత్ర విద్యాజ్ఞానాన్ని సంపాదించి మాతృభూమికి తిరిగివస్తాను అని ఎన్నో ఆలోచించాడు. ఆలోచన బాగానేవుంది. కానీ రావడానికి పోవటానికి ఖర్చు

ఎవరిస్తారు? అతని ఆర్థికస్థితి బాగులేదు. ఇచ్చే దాతలు కూడా కరువే! దీనితో నిరాశుడై మౌనంగా వుండిపోయాడు. ఒకనాడు భండారా. (విదర్బ) లో పని చేస్తున్న తన మిత్రుణ్ణి చూడటానికి వెళ్ళాడు. తన ఆలోచన మిత్రునితో చెప్పాడు. మిత్రునికి కూడా నచ్చింది ఆలోచన, కానీ ధనసాయం అతనివలన కూడా అయ్యేపని కాదు. అప్పుడు మిత్రుడు 'అరే! శ్రీధర్! ధనంలేనిది-అంతా వ్యర్ధమే! మనిషి అన్ని వేషాలు వెయ్యగలడు. కానీ ధనాన్ని సమకూర్చటం వాడి చేతగాని పనే! ధనహీనుడి కోరిక మనసులోనే వుండిపోతుంది. కాబట్టి మనం మన జన్మభూమి 'కరవీర్ - కోల్హాపూర్' వెడదాం! ఇక్కడ ఎండలు మండిపోతున్నాయి! అన్నాడు. ఇద్దరూ బండి ఎక్కారు స్వామిజీ యొక్క మహిమను వినివున్నారు. దాంతో నిజమైన సాధువులెలా వుంటారో చూడటానికి శేగాంవ్ లో దిగి మఠానికి వెళ్ళారు. మఠానికి రాగానే స్వామీజీకి సాష్టాంగపడి ఎదురుగా కూర్చున్నారు. వారిని చూడగానే శ్రీధరుని మనసులోని మాటను తెలుసుకున్నారు. 'అరే! పిచ్చివాడా! ఇతర దేశం వెళ్ళే ఆలోచనను విడిచి పెట్టు! అన్నీ ఇక్కడే వున్నాయి! అక్కడి భౌతికజ్ఞానంలో ఏమీ లేదు. ఇక్కడి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది నీజీవితాన్ని ధన్యం చేసుకో! అన్నారు స్వామి. స్వామి యొక్క అమృతతుల్యమైన ఆ వాక్కులు వీని శ్రీధరుని ఆలోచనలు మార్పు చెందసాగాయి. శ్రీధరునికి 'కుంభార్ గల్లీ' (కుమ్మరి వీధి) లోని స్వామి గుర్తుకొచ్చారు! వారుకూడా తన భక్తులతో ఇలాగే మాట్లాడేవారు. అలానే ఈ గురువులు కూడా భక్తులతో మాట్లాడుతారు. శ్రీధర్ సందిగ్ధంలో పడ్డాడు! అతనిలో ఆలోచనలు ముమ్మరంగా క్రమ్మసాగాయి. ఇంతలో హిందూదేశాన్ని వదలి ఇతర దేశాలకు వెళ్ళే కోరిక వదిలెయ్యి! ఎక్కువ పుణ్య సంచయనం జరిగినప్పుడే యీ భారతభూమిలో జన్మించే సౌభాగ్యం కలుగుతుంది. అక్కడి భౌతిక శాస్త్రాలకంటే, యిక్కడి యోగశాస్త్రాలు సంపూర్ణమైనవి. ఈ యోగశాస్త్రంలో ప్రవీణుడైన వాడు ఆ భౌతిక శాస్త్రాలకు ఏ మాత్రమూ విలువ యివ్వడు! యోగశాస్త్రం యొక్క ఆధ్యాత్మవిచారమే శ్రేష్ఠమైనదని చెప్పబడింది. ఇతర దేశం వెళ్ళే ప్రసక్తి నీ మనసునుంచి తొలగించు! ఆధ్యాత్మసాధన చేయటానికి ప్రయత్నించు! అని వుపదేశించారు. స్వామి యొక్క యీ వుపదేశాన్ని విన్న శ్రీధరునికి తనలోని సందేహాలన్నీ పటాపంచలై ఆనందభరితుడయ్యాడు. శ్రీధరునిలో పరివర్తనం తీసుకొనిరావటానికి అతని ఆలోచనలనన్నిటినీ పశ్చిమదిశనుండి పూర్వదిశకు స్వామియే త్రిప్పేశారు! యోగులే నిజాన్ని తెలుకో గలిగినవారు! దానివల్లనే మనిషిలోని ఆలోచనలను మార్చటంలో

వారు అతిసమరులౌతారు. శ్రీస్వామి కొంచెం అగి "నీ అభ్యుదయం ఇక్కడే జరుగుతుంది కోల్హాపూర్ లో నీ భార్యనీకై ఎదురు చూస్తోంది. ఇప్పుడు నీ మిత్రునితో కలిసి కోల్హాపూర్ లోని నీయింటికి వెళ్ళు!" అన్నారు. సమయంరాగానే శ్రీధరుని కోరిక తీరింది. అతడు బి.ఎ.యం, ఎ, లలో ఉత్తీర్ణుడై 'శివపురి' కళాశాలకు ప్రిన్సిపాలయ్యాడు! యోగులు లోకంలో భ్రమించే సాక్షాత్ ఈశ్వరులే! యోగుల కృపాశీస్సులు ఎవరికి లభ్యమౌతాయో వారు బాగ్యవంతులు ధన్యులు అవుతారు! 'శ్రీధరా కాలే'కి యోగి దర్శనభాగ్యం కలగటం వలననే అతని ఆలోచనా సరళి మార్పుచెంది ప్రవృత్తికూడా మారిపోయింది మరి! యోగులు యీ భూమి మీదనే జన్మిస్తూ వుంటారు! నిండిన వనంలోని వృక్షం ఇతరచోట్ల పుష్పించి ఫలించదు. ఇది ముమ్మాటికి సత్యం! స్వస్తి శ్రీదాసగణూదే విరచితమైన యీ శ్రీ గజానన విజయమనే గ్రంథము భావుక భక్తులకు ఎల్లప్పుడూ సత్పథాన్ని చూపించుగాక!

॥ శుభం భవతు ॥

|| శ్రీహరి హరార్పణమస్తు ॥

॥ ఇది పంచదశాధ్యాయము సమాప్తము ॥

యే మనుష్యః మాం ఆశ్రతః!
తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!