సర్వం శ్రీసాయి

శ్రీ గజానన విజయం

పదనల్గవ అధ్యాయం

 

 శ్రీ గణేశాయ నమః హే! కౌసల్యాత్మజ రామరాయా! రఘుకుల భూషణా! కరుణాలయా! సీతాపతే! యీ బాలునిపై దయజూపుము. నీవు తాటక నుద్ధరించావు. శిలగా పడివున్న అహల్యకు ప్రాణం పోశావు. భక్తులను కాపాడటానికి రాజ్యసింహాసనం త్యాగంచేశావు. నీ కృపా దృష్టి వలన వానరులు బలవంతులయ్యారు. నీ నామమహిమ చేతనే శిలలు నీట తేలసాగాయి. నీ భక్తుడైన విభీషణుని రాజగద్దీ నెక్కించావు! ఆనందకందా! నీ శరణుజొచ్చిన వారెవరైనా వారి దైన్యాన్నీ, దుఃఖాన్నీ, ఆపదలనీ అన్నింటినీ హరించావు. ఇవన్నీ గుర్తుంచుకొని 'దాసగణూ'ని చింతాముక్తుణ్ణి చెయ్యి! బిడ్డకు తల్లిదగ్గర తప్ప మరెక్కడ అలాంటి సాయం లభిస్తుంది! నీవే నాకు తల్లివీ, తండ్రివీ, గురువూ! రామరాయా! నీవే భక్తుల కల్పతరువు! భవసాగరాన్నుంచి తరింపచేసే వాడివి నీవే! అస్తు! 'మెహకర్' తహసీలులోని ఒక గ్రామంలో 'బండూతాత్యా అనే బ్రాహ్మణుడు ఒకడున్నాడు. ఇతడు సదాచారుడు, సంపన్నుడు. మంచి మనసుతో తన గృహస్థ జీవితాన్ని నడుపు తున్నాడు. పాఠకులారా! ప్రపంచం (సంసారం) ఎన్నో ఆపదలతో నిండివుంది. ఐనా మానవుడు వాటినుండి తప్పుకోవాలని చూడడు. బండూ తాత్యా ఇంటికి ప్రతిరోజూ అతిథులు వస్తూవుండేవారు. సంసారి అవటంవలన వచ్చేవారికి ఆదరసత్కారాలు చేయాల్సి వచ్చేది. విధంగా చాలాకాలం వరకూ గడుస్తూ వచ్చింది. మిగిలిన ధనం అతిథి సత్కారాలకే ఖర్చయిపోయేది. చివరికి షావుకారు నుంచి అప్పు తేవాల్సివచ్చింది. దానికి బదులుగా ఇల్లూ-ఆస్తి తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఐనా అప్పులు చేయటం మానలేదు. దాంతో అతడు లోకులకు ముఖం చూపించలేకపోయేవాడు. ఇక తాకట్టు పెట్టడానికి కానీ, అమ్మటానికి గానీ ఏమీ మిగలేదు. ఇంట్లోని గిన్నెలూ మొదలైనవి కూడా ఇంట్లో కనపడటం మానేశాయి. స్థితిలోవున్న అతనిని వర్ణించటం చాలా కష్టం. అప్పు తీర్చమని పావుకారు తన మనుష్యులతో కబురంపేవాడు చాలాసార్లు. మధ్యాహ్నం పూట తినటానికి కూడా లేని స్థితికొచ్చాడు 'బందూ తాత్య భార్య నానా సూటీ పోటీ మాటలనేది. కొడుకులు కూడా తండ్రిని గౌరవించటం మానేశారు. అతడు గౌరవహీనుడవటం వలన ఎవ్వరూ ఏమీ యిచ్చేవారు కూడా కాదు. విధంగా బండూ తాత్యా అన్ని వైపులనుంచీ కష్టాలు వచ్చి వివశుడై పోయాడు. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. లోకంలోని మనిషి దరిద్రుడైనపుడు వానికి విలువేముంటుంది? ధనం వున్నపుడే అంతా బాగుండేది. నిర్ధనుడైనపుడు బేజారెత్తి ప్రపంచంతో విసిగిపోతాడు. ఇదే లోకరీతి.

 

దీని అసలు స్వరూపమూ! పరిస్థితులవల్ల వివశుడైన బండూ తాత్యా తానెలా ఆత్మహత్య చేసుకోవాలి అని ఆలోచించసాగాడు. "నల్లమందు తిని ఆత్మహత్య చేసుకుందా మనుకుంటే చేత చిల్లిగవ్యయినా లేదాయెదాన్ని కొనటానికి! నూతిలో పడదామంటే ఎవరైనా చూసి పైకి తీసేస్తే! నాకు చావురాదు సరికదా లోకం యింకా సతాయిస్తుంది. దాంతో ఆత్మహత్యా నేరాన్ని నాపై మోపి ప్రభుత్వం శిక్ష విధిస్తుంది. ఇంతకంటే హిమాలయాల్లోకి పాయి అక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. ఇలా ఐతే నా గొడవే ఎవరికీ పట్టదు. దీంతో హిమాలయాలు దర్శించాలనే నా కోరికా తీరుతుంది. నామీద దోషారోపణం కూడా వుండదు. ఇలా ఆలోచన చేసి ఇంటినుండి బయలుదేరాడు. వెళ్ళే సమయాన యీ సంసారానికి, ప్రపంచానికి చివరిసారిగా ప్రణామం చేశాడు. వెళ్ళేటప్పుడు ఎవరూ గుర్తుపట్టని విధంగా ఒక లంగోటి కట్టుకొని, వంటినిండా బూడిద పులుముకున్నాడు. లోకం ఒకరిని నిందించటానికి ముందూ వెనకా ఆడదు కదా! ఇది లోకానికి బాగా తెలిసిన విషయమే. బండూతాత్యా మనస్సులో భగవంతుణ్ని ప్రార్ధించటం మొదలు పెట్టాడు, "హే! చక్రపాణి! నాపై నీకెందుకింత కినుక హే! అధోక్షజా! నీ మీదే నాకు పూర్తి నమ్మకం వుండేది. నీ కృప కలిగితే బిచ్చగాడు కూడా మహారాజౌతాడు. అని పురాణాల్లో వ్రాయబడింది కదా! కానీ నా విషయంలో మాత్రం యిది అబద్ధమే అయింది. హే! నారాయణా! కవులు నీ మహిమను వర్ణించినదంతా పచ్చి అబద్ధం! నేనే దానికి నిదర్శనం! కాబట్టి యిక వివశుణ్ణయి నా ప్రాణాల్నే త్యాగం చేస్తున్నాను. హేశ్రీహరీ! నా పాఠ్యాపాతకం నీకు అంటకుండా వుండేట్టు చూసుకో. ఇలా మనస్సులోనే ప్రార్ధించి బండూతాత్యా టిక్కెట్టు కోసం బయలుదేరాడు. స్టేషనులో ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. హరిద్వార్ టిక్కెట్టు కొనకు, ముందు యోగి దర్శనం చేసుకొని 'హరిద్వారం' వెళ్లు. మన విదర్భ ప్రాంతంలో శ్రీ గజానన మహరాజ్ అనే మహా యోగులు అవతరించారు. వారి దర్శనానికి ముందు వెళ్ళు. సాధువుల దర్శనంవల్ల లాభం కలగదని నేటివరకూ ఎక్కడా. వినలేదు. అందువల్ల పరిస్థితికి వివశుడవై ప్రాణాలు పోగొట్టుకోకు" అన్నాడు. బ్రాహ్మణుని మాటలు విని సందిగ్ధంలో పడ్డాడు బండూ. ఈతడేవరు? ఈతడెందుకు కనిపించాడు నాకు? నా నిజస్వరూపాన్ని కనిపెట్టలేదు కదా! ఏమీ అర్ధం కాలేదు. చివరికి యీతడెవరో ఎలా అడగను? సరే! నిజమేమైనా శేగాంవ్ వెళ్ళి స్వామీ గజాననుల దర్శనం చేసుకొని తర్వాత విషయం చూద్దాం!" అని మనస్సులో ఆలోచించుకుని....

 

బండూతాత్యా శేగాంవ్ వచ్చాడు. స్వామి దర్శనానికై ఆయన సమ్ముఖానికి వచ్చాడు. అతణ్ణి ఎదురుగా చూసి స్వామీజీ ఏమయ్యా! హిమాలయాలకు పోయి ప్రాణత్యాగం చేద్దామని ఎందుకనుకున్నావు? అరె! ఆత్మహత్యకు ఎప్పుడూ ప్రయత్నించకూడదు. ఆపదలలో మానవుడెప్పుడూ నిరాశ చెందకూడదు మనసులోని కోరికను సాధించటానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే వుండాలి. లోకంనుంచి విసిగి ఆత్మహత్య చేసుకున్నట్లయితే మిగిలిపోయిన ప్రారబ్ధాన్ని అనుభవించటానికి తిరిగి జన్మించాల్సి వస్తుంది కదా! గంగలో పడి ప్రాణాలు తీసుకునేందుకు హిమాలయాలకు వెళ్లకు. అరె! పిచ్చివాడా! నీ యింటికి తిరిగి వెళ్ళు. స్టేషనులోటిక్కెట్టు తీసుకునే సమయంలో కనిపించిన వ్యక్తి ఎవరో గమనించావా? అతడెవరు? ఇంక యిక్కడ వుండవద్దు. నీ యింటికి తిరిగి వెళ్ళిపో! నీ పొలంలో 'మ్హసోబా' అనే గ్రామదేవత వుంది. దానికి పూర్వదిశగా ఒక తుమ్మచెట్టు వుంది. చెట్టు దగ్గర రాత్రికి రెండుఝాములప్పుడు త్రవ్వు. నువ్వే త్రవ్వాలి. 3 అడుగుల క్రింద నీకు ధనం లభిస్తుంది. ధనంతో నీవు షావుకారు బాకీ తీర్చి ఋణముక్తుడవవ్వు నీ దారా పుత్రుల్ని విడిచిపెట్టకు అన్నారు. శ్రీ స్వామి అమృతవాక్కులు విని బండూ తాత్యా ఆనందభరితుడయ్యాడు. వంటికి పూసుకున్న బూడిదను తుడిచి పారేసి, తన స్వంత గ్రామానికి 'ఖర్దే'కి తిరిగి వెళ్ళిపోయాడు. రాత్రి పొలంలోని 'మ్హాసోబా' దగ్గరున్న తుమ్మచెట్టు దగ్గర త్రవ్వటం ప్రారంభించాడు. 3 అడుగులు త్రవ్వగానే అతనికొక కలశం దొరికింది. దాని మూతి బంధించి వుంది. కలశంలో నాలుగువందల బంగారు మొహరీలు వున్నాయి. ఇది చూసి ఎంతో ఆనందించాడు. తరువాత కలశాన్ని తీసుకొని ఇంటికొచ్చాడు. ఇంటికి రాగానే అతడు ఆనందంతో "జయజయ గజానన గురురాయా!" అని పాడుకుంటూ నాట్యం చేయసాగాడు. లభించిన ధనంతో అప్పుతీర్చేసి ఋణముక్తుడయ్యాడు. తాకట్టు పెట్టిన పొలాన్ని కూడా విడిపించాడు. బండుతాత్యా కుటుంబం నాశనమైపోయి నది, శ్రీ గజానన స్వామి కృపచేత తిరిగి బాగుపడింది. అంతిమ క్షణాల్లో అమృతం లభించినట్లూ, సముద్రంలో కొట్టుకుపోయేవాడికి సాయం లభించినట్లూ, బండూతాత్యకి శ్రీ గజాననుల కృప ఆశీర్వాదం లభించటంతో కష్టాలనుంచి బయటపడ్డాడు. ఇక అతడికి మంచి రోజులొచ్చాయి. అతడు శేగాంవ్ రావటం ప్రారంభించాడు. దానధర్మాలు అమితోత్సాహంతో చేశాడు. శ్రీగజాననస్వామి పాదపద్మాలకు శరణుడయ్యాడు. ఇది చూసి శ్రీస్వామి 'నాకెందుకు నమస్కరిస్తున్నావు? నీకు..

 

ధనకలశాన్ని ప్రసాదించిన భగవంతునికి నమస్కరించు! ఇక ద్రవ్యాన్ని జాగ్రత్తగా వినియోగించు. అవసరానికి మించిన ఖర్చు చేయటం తగదు. ధనమున్నంత వరకే గౌరవ మర్యాదలుంటాయని గ్రహించావు కదా! ధనం లేకుంటే ఎవ్వరూ ఎవరికీ ఏమీ కారు. కానీ ఆపదలలో శియఃపతియే తోడుగా వుంటాడు. వాని నెప్పుడూ విస్మరించకు. అతడెప్పుడూ ఎవరినీ మరచిపోడు కదా!" అని హితబోధ చేశారు. స్వామీజీ అమృతవాణిని విన్న బండూతాత్యా స్వామి పాదాలకు ప్రణమిల్లి ఆనందంతో తన ఊరు తిరిగి వెళ్ళిపోయాడు. 'సోమవతీ అమావాస్య'ను ఒక పెద్ద పండుగగా తలుస్తారు. సోమవారంనాడు వచ్చే అమావాస్యనే 'సోమవతీ అమావాస్య' అంటారు. 'సోమవతి'నాడు నర్మదానదిలో స్నానం చేసిన వారికి ఎంతో పుణ్యం వస్తుందని పురాణాలు చెపుతున్నాయి. పుణ్యాన్ని సంపాదించటానికి శేగాంవ్ లోని కొందరు నర్మదానదీ స్నానానికి వెడుతున్నారు. మార్తాండ పాటిల్, బంకట్ లాల్, మారుతీచంద్రభాను, బజరంగ్ లాల్ మొదలైనవారు 'ఓంకారేశ్వర్' వెడదామనుకున్నారు. 'మనం నర్మదా స్నానానికి వెడుతున్నాం కదా? స్వామిని కూడా తీసుకువెడదాం అన్నాడు బంకట్ లాల్. నలుగురూ మఠానికి వెళ్లి స్వామితో 'స్వామీ! తమరు గూడా మాతో ఓంకారేశ్వరానికి వచ్చినట్లయితే మాకు యమధర్మరాజు యొక్క భయం వుండదు. మా 'ఓంకార్ మాంధాతా' యాత్ర జయప్రదం చేయండి. తన బిడ్డ కోరికను తల్లేకదా తీర్చేది! అధికారం మరెవరికీ వుండదు. నర్మదాస్నానానికి మమ్మల్ని తీసుకొని వెళ్లండని మా ప్రార్ధన. మీరు సరేననేంతవరకూ ఇక్కడే ధర్నాచేస్తాం! పిల్లల పట్టు తల్లే తీరుస్తుంది కదా మరి! అని స్వామిని ప్రార్ధించారు. దాని మీదట స్వామి "ఇదే నర్మద నేనిక్కడ వుండే నర్మదా స్నానం చేస్తాను. మీరు ఓంకారేశ్వరం వెళ్ళిరండి. అక్కడ పూర్వం భాగ్యశాలి మాంధాత రాజు మహాబలుడై తన కీర్తిని దిగ్దిగంతాల వ్యాపింపచేశాడు. జగద్గురువు శంకరాచార్యులవారు జగదుద్ధారానికై పరమహంసదీక్షని యిక్కడే గ్రహించారు. ఆనందంగా అక్కడికి వెళ్ళినా నర్మదానదిని దర్శించి రండి. కానీ నన్నూ తీసుకొని వెడదామని వ్యర్ధప్రయత్నం చెయ్యకండి. పవిత్రపర్వంయొక్క మహిమ నా యీ విరక్తావస్థలో ఏమాత్రం లేదు" అన్నారు. ఇది విన్న నలుగురూ స్వామి చరణాలు పట్టుకొని 'మీరన్నది ముమ్మాటికీ నిజమే! ఐనా తమరు మాతో రాక తప్పదు. మనం స్నానంచేసి వెంటనే వచ్చేద్దాం' అన్నారు. అప్పుడు స్వామి "మీరంతా డాంభికులుగా కనపడుతున్నారు. నర్మదా పవిత్రజలం యీ శేగాంవ్ లోని నూతుల్లో వుంది కదా! జలాన్ని ...

 

విడిచి నేను అక్కడికి వెళ్లి నట్టయితే నా నర్మదాతల్లికి కోపం వస్తుంది. కాబట్టి మీరు వెళ్లిరండి. నన్ను రమ్మనకండి. నా మాట వినటంలోనే మీ మంచి వుంది!" అన్నారు. కానీ మారుతి, చంద్రభానులు మిమ్మల్ని తోడు తీసుకొనకుండా వెళ్ళం అని మొండిపట్టు పట్టారు. 'నేనక్కడికి వచ్చినందువలన ఏదైనా విపరీతం కూడ జరగవచ్చు. మరి దానికి నన్ను 'దోషి' అనవద్దు అని అన్న తర్వాత మఠం నుంచి బయలుదేరి 'ఓంకారేశ్వర్ వెళ్ళారు. పర్వదినాన పుణ్యసంచయనం కోసం ఎంతోమంది వచ్చారు. నర్మదానది స్నానఘట్టం దగ్గర ఎంతోమంది స్త్రీలూ పురుషులూ గుంపులు గుంపులుగా వున్నారు. శంకర మందిరంలోనికి ప్రవేశించటానికి ఒక్క చీమకైనా అసాధ్యమే! కొందరు స్నానం చేస్తూంటే మరి కొందరు బ్రాహ్మణులచేత సంకల్పం'. చెప్పించుకొని శివునికి అర్ఘ్యం యిస్తున్నారు. కొందరు బిల్వ పత్రాలు, పుష్పాలూ తీసుకొని ఆలయంవైపు పరుగిడుతున్నారు. కొందరు మిఠాయిలు తినటంలో నిమగ్నులై వున్నారు. భజనమండళ్ళెన్నో అక్కడ భజన చేసే నిమిత్తం వచ్చాయి. ఇంకా వస్తూ వున్నాయి. పర్వం పూర్తయ్యేంత వరకు ఆలయంలో అభిషేకాలు జరుగుతునే వున్నాయి. అభిషేక మంత్రోచ్ఛారణ పెద్దగా వినపడటంవలన అక్కడ ఒకరిమాట మరొకరికి వినపడటమే లేదు. ఇంత హడావుడీ, గందరగోళంగా వున్నా శ్రీస్వామి నర్మదానది వొడ్డున పద్మాసనం వేసికొని ధ్యాననిమగ్నులై నిజానందంలో నిండిపోయారు. వారు నలుగురూ స్నానాలు పూర్తిచేసి, శంకరుని దర్శనం చేసుకొని వచ్చారు. వారు స్వామితో యీ దారివెంట బయటపడటం చాల కష్టం. వచ్చేపోయే వారు అసంఖ్యాకంగా వున్నారు. ఎడ్లబండ్లు విరిగిపోతాయి. ఎడ్లు బెదిరిపోతాయి. బండివాడు 'బేడీఘాట్ స్టేషన్ నుంచి రానూ పోనూ వస్తానని మాటిచ్చాడు. కానీ వచ్చేటప్పుడు ఎడ్లు బెదిరిన కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకు రావల్సివచ్చింది కదా! అందుచేత యిప్పుడు బండిమీద కాక నావమీద భేడీఘాట్ స్టేషను వరకూ వెడదాం. అంతా అలానే చేస్తున్నారు. అదుగో అటు చూడండి నావమీద వెడుతున్నారు!" అన్నారు. దాని మీదట స్వామి నన్నేమీ అడగకండి. నేను వచనబద్ధుణ్ణి మీరెక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చుంటాను. ఏది ఉచితమనుకుంటే మీరు అలానే చేయండి" అన్నారు. తరువాత అంతా నావ ఎక్కి 'భేడీఘాట్' స్టేషన్ వైపు ప్రయాణం చేయసాగారు. నది మధ్యకి రాగానే నావ ఒక గుట్టకు కొట్టుకొని చిల్లుపడింది. నావలోకి నీళ్ళు వచ్చి నావ మునగటం ప్రారంభించింది. ప్రాణభయంచేత నావ నడిపేవాళ్ళు నదిలో దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. కానీ...

 

స్వామి శాంతచిత్తులుగానే వున్నారు. "గిణ గిణ గణాంత్ బోతే" అనే కీర్తన పాడటం మొదలు పెట్టారు. మార్తాండ్, భజరంగ్, మారుతీ భయపడ్డారు. బంకటాలాల్ హృదయగతి హెచ్చింది. ఇదంతా చూసి వారు నలుగురూ స్వామితో 'మేము మీ అపరాధులం. శేగాంవ్ లో మీరు సెలవిచ్చింది మేము వినలేదు. మేం మా మాటనే నెగ్గించుకోవాలని చూశాం. దాని ఫలితం యిప్పుడు కళ్ళతో చూస్తూనే వున్నాము. పవిత్ర జలంలో స్నానంచేసి పుణ్యం సంపాదిద్దామని వచ్చామో, అదే పవిత్ర జలంలో యిప్పుడు మునిగిపోవటానికి సిద్ధంగా వున్నాం. హే! గురురాయా! మీ వాక్కులను వేదవాక్కులుగా విశ్వసిస్తాం. సారి మా తప్పు మన్నించండి. ఆపదనుంచి కాపాడండి. శేగాంవ్ ని చూడనివ్వండి. వారిలా ప్రార్ధన చేయసాగారు. ఇంతలోనే సుడిగుండంలోకి నావ వచ్చి మునిగిపోసాగింది. ఒడ్డునున్న వారంతా " నావలో కూర్చున్న ఐదుగురూ జలసమాధి ఐపోతారు! నర్మదానది చాలా లోతైంది" అని అరుస్తున్నారు. ఇదంత చూసి శ్రీస్వామీజీ "భయపడకండి నర్మదామాత మిమ్మల్ని తప్పక రక్షిస్తుంది" అని చేతులు జోడించి నర్మదాస్తవనం చేయటం మొదలు పెట్టారు.

 

"నర్మదా మంగళాదేవీ! మాతా అశుభనాశినీ

 

క్షమించు మీ అపరాధులను, దయాళూ! వరదాయినీ'

 

విధంగా నర్మదాస్తవనం జరుగుతోంది. ఒకేసారి అకస్మాత్తుగా నావలోని నీరంతా బయటకు పోయింది నర్మదామాత తన చేతితో నావకు పడిన రంధ్రాన్ని మూసేసింది. ఇలా అవగానే ఎప్పటిలాగా నావ నీటిపై తేలియాడసాగింది. శ్రోతలారా! నావతోపాటుగా నర్మదా దేవీమాత వుంది. నర్మదామాత జాలరి స్త్రీ వేషధారణం చేసింది. ఆమె సుందరమైన నల్లని ఉంగరాల జట్టుతో మోకాళ్ళ వరకూ తడిసిన వస్త్రాన్ని ధరించి వుంది. నావ ఒడ్డు చేరింది. ఆశ్చర్యచకితులై రంధ్రంపడిన నావనంతా పరిశీలించారు. భక్తులు 'ఈనాడు స్త్రీ వుండబట్టే మేమంతా బ్రతికి భయటపడ్డాం. దేవీ! నినెవరు? మీరెక్కడుంటారు? తడిసిన వస్త్రాన్ని వదలండి. మేం క్రొత్త వస్త్రాన్నిస్తాము అన్నారు. దాని మీదట "నేను ఓంకార జాలరి కూతుర్ని నా పేరు నర్మద తడిసిన వస్త్రాన్ని కట్టుకోవటం అలవాటే. నేనెప్పుడూ తడిసి వుంటాను. జలమే నా అసలైన నిజస్వరూపం' అని నర్మదామాత

 

శ్రీ గజానన స్వాములకు నమస్కరించి క్షణంలో నదిలో అదృశ్యమైపోయింది. ఇదంతా ఆకాశంలో మెరుపు మెరిసి మాయమైనట్టయింది. (చమత్కారాన్ని) విచిత్రాన్ని చూసిన నలుగురూ ఆశ్చర్యచకితులై పోయారు. శ్రీస్వామీజీ మహిమను ఇప్పుడు చక్కగా తెలిసిన వారయ్యారు. మరి నర్మదాదేవియే గజాననుల దర్శనం చేసుకొనటానికి వచ్చింది కదా! భయం తీరిన తర్వాత బంకట్ లాల్  స్వామిని స్త్రీ ఎవరు? అనీ, విషయాలన్నింటిలో నిజాన్ని చెప్పమనీ కోరాడు. దాని మీదట శ్రీస్వామీజీ ఇది అడగవలసిన విషయమా? జాలరి ఓంకారుడే యీ ఓంకారేశ్వరుడు! నిజస్వరూపం నీరని ఆమే స్వయంగా చెప్పింది కదా! అరె! మూర్ఖులారా స్త్రీ స్వయంగా నర్మదాదేవియే! ఇందులో సందేహమెందుకు? తన భక్తుల్ని ఎప్పుడూ ఆపదలనుంచి కాపాడుతూ వుంటుంది. కాబట్టి ఆమెకి జయజయధ్వానాలు చేయండి. హే! నర్మదా! నీకు జయము, నీకు జయము అని పెద్దగా అనండి. హే! అంబే! యిదేవిధంగా నీవెప్పుడూ మమ్మల్ని రక్షిస్తూ వుండు అనండి అన్నారు. ఇది వినిన బంకట్ లాల్, అతని మిత్రులూ శ్రీస్వామి చరణాలపై బడి నతమస్తకులయ్యారు. అనుకున్న సమయానికి వారంతా శేగాంవ్ తిరిగి వచ్చారు. వారికి కనిపించినవారందరికీ యిదే సంఘటన గురించి పూర్ణవిశ్వాసంతో చెప్పేవారు. 'సదాశివ రంగనాథ్ వానవళే' అనే పేరుగల ఒక గృహస్థు, ఒక సజ్జనునితో కలిసి స్వామి దర్శనానికి శేగాంవ్ వచ్చాడు. సదాశివునికి 'తాత్యా' అనే మరో పేరుంది. అతడు చిత్రకూటంలో వుంటున్న మాధవనాథుని శిష్యుడు. మాధవనాథులు యోగవిద్యలో ప్రసిద్ధులు. వీరి శిష్యులు 'మాలవా' ప్రాంతంలో (మాళ్వా) ఎక్కువగా వున్నారు. సదాశివుడు స్వామి దర్శనార్థియై వచ్చినపుడు మఠంలో స్వామి భోజనం చేస్తున్నారు. సదాశివుని చూడగానే స్వామికి మాధవనాథులు గుర్తుకు వచ్చారు. ఒక యోగి మరో యోగిని చక్కగా గుర్తిస్తారు కదా! మాధవనాథుల శిష్యుని నా దగ్గరకు తీసుకురండి! అన్నారు భక్తులతో స్వామి. అతని గురువు, స్వామీ మాధవనాథులు. యిప్పుడిప్పుడే భోజనం ముగించి. వెళ్ళిపోయారు. వారటు వెళ్ళారు. వీరిద్దరూ యిటు వచ్చారు! వీరిద్దరూ కొంచెం ముందు వచ్చినట్టయితే వారి గురువుని కలుసుకొనేవారే! వీరు రావటంలో కొంచెం అలస్యమైంది. వారి గురువు తాంబూలం వేసుకోకుండానే వెళ్ళిపోయారు. తాంబూలం యిచ్చేవారిని పంపుదాం! అన్నారు. గురుబంధువుల శిష్యులని తెలిసి వారిని అక్కున చేర్చుకున్నారు స్వామి. మఠంలోనికి వారికి యథోచితంగా స్వాగతంపలికారు. వారిని పంపేటప్పుడు

 

  స్వామి, మీరు తిన్నగా శ్రీమాధవనాథుల దగ్గరకు వెళ్ళి వారిని కలిసి, యీతాంబూలం యివ్వండి. ఇది ఇక్కడే మిగిలిపోయింది. నేచెప్పే సందేశాన్ని తుచ తప్పకుండా, మీ స్వంతం కొంత కల్పించ కుండా చెప్పాలిఅనికూడా భోజనం అయింది. నీ తాంబూలం యిక్కడే వుండిపోయింది. దాన్ని మేం తీసుకొని వచ్చాము స్వామీ మీకివ్వటానికి" అన్నారు. ఇదంతా సదాశివుడు విన్నాడు. తాంబూలం తీసుకొని తన గ్రామానికి వెళ్లి పోయాడు. మాధవనాధులకు విషయాలన్నీ చెప్పి "స్వామీ మీరు నిజంగా ఆనాడు శేగాంవ్ వెళ్ళారా?” అని అడిగాడు. “గజాననస్వామి సరిగ్గానే చెప్పారు. భోజన సమయంలో వారు నన్ను గుర్తుచేసుకున్నారు. గుర్తుచేసుకోవటంతోనే మేం ఒకరితో ఒకరు కలుస్తాం. ఇలాటి కలయిక ఎప్పుడూ జరుగుతూనే వుంటుంది. ఇది సందేహాస్పదం అనుకోవద్దు. మా శరీరాలు వేరైనా మా ప్రాణాలు ఒక్కటే! దీనిలోని నిజాన్ని నీవర్ధం చేసుకోలేవు. కారణం యీ జ్ఞానం అత్యంత రహస్యమైనది. నిగూఢమైనది. నేను మరచిన తాంబూలాన్ని నువ్వు తేవటం మంచిదే అయింది. అని మాధవనాథులు తాంబూలాన్ని సన్నికల్లులో వేసి దంచి, కొంచెం వారు తిని మిగతాది అందరికీ పంచారు. 'యోగుల కలయిక' ఎలా అవుతుందో దాని వర్ణన శ్రీజ్ఞానేశ్వరులు "చాంగ్దేవ్ పాంపష్ఠీ" అనే గ్రంథంలో వుంది. దాన్ని గనక గుర్తుకు తెచ్చుకున్నట్లయితే యీ మిథితార్ధం (మిథ్య అనేది) అంతా తెలుసుకోవచ్చును. అనుభవ పూర్వకమైన విషయాలన్నింటినీ అనుభవంతోనే తెలుసుకోవాల్సి వుంటుంది. తర్కం చేసి కాదుమరి! యోగులు తమ యోగబలంతో కూర్చున్నచోటునుండే అన్ని విషయాలూ తెలుసుకో గలుగుతారు! వున్న చోటునే వుండి ఒకరితో నొకరు కలుసుకుంటారు. షేక్ మహమ్మద్ శ్రీ గోందే లో వుంటే తుకారాం దేహూలో వుండేవారు. సంకీర్తన సమయంలో దేహూలోని మండపంలో నిప్పంటుకుంది. నిప్పును షేక్ మహమ్మద్ శ్రీగొందేలో వుండే ఆర్పేశారు. దీన్ని గురించినది మహిపతిజీ తన భక్తివిజయమనే గ్రంధంలో వివరించారు. మాణిక్ ప్రభువులు 'హళీ' అనే గ్రామానికి వెళ్ళి నూతిలో పడ్డ పాటిల్ సుతుణ్ణి రక్షించారు. నిజమైన సిద్ధయోగుల వల్లనే యిటువంటి విచిత్రాలు జరుగుతాయి కాని కపట యోగులవల్ల కాదు! కపటయోగులు కేవలం కబుర్లూ కాకర కాయలూ చెపుతూ కూర్చుంటారు. యోగసాధనే అన్ని ఆధ్యాత్మిక సాధనల్లోను బలవత్తరమైనది. రాష్ట్రాన్ని ఉద్ధరించాలనే కోరికకు యీ యోగవిద్యే అవలంబం కావాలి. శ్రీదాసగణూ విరచితమైన శ్రీ గజానన విజయమనే గ్రంథము శ్రద్ధా భక్తులతో 'భక్తులు విందురుగాక!

శుభం భవతు ||

| |శ్రీహరిహరార్పణమస్తు

|| ఇది చతుర్దశాధ్యాయము సమాప్తము

 

యే మనుష్యః మాం ఆశ్రతః!

తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!