సర్వం శ్రీసాయి
శ్రీ గజానన విజయం
పదమూడవ అధ్యాయము

శ్రీ గణేశాయనమః. హే యోగివరదా శ్రీధరా! దయాసాగరా! హే! గోప గోపీ ప్రియకరా! మీ మానవరూపంలోని ఈశ్వర తత్వాన్ని పరీక్షించటానికే భాగ్యవిధాత యమునాతటానవున్న గోకుల ధేనువుల్ని వాటిదూడలను దొంగిలించాడు! ఆ సమయాన నీవే నీ నిజలీలాశక్తితో ధేనువులుగను, దూడలుగను కనిపించి నీలోని ఈశ్వరత్వాన్ని నిరూపించావు! గోకులవాసులను నిర్భయులను చేయటానికే దుష్టకాళీయుని యమునలో మదమణచి 'రమణద్వీపానికి' పంపావు! అదే విధంగా దుర్భాగ్యాన్ని నీ కాలరాచి, హే! వాసుదేవా! దాసగణూని చింతాముక్తుణ్ణి, నిర్భయుణ్ణి గావించు! హే! హరీ! నేను నీకు అజ్ఞానుడైన భక్తుణ్ణి! నాపై దయజూడుము! నీకృపాయోగ్యుణ్ణి కానని యెరుగుదును! ఐనా నా అంతం చూడక కృపాశీస్సులతో నన్ను చింతాముక్తుణ్ణి చేయి! ఓ శ్రోతలారా! ఏకాగ్రచిత్తులై ఇక ముందు కథ నాలకించండి. బంకట్ లాల్, హరి, లక్ష్మణ్, విఠ‌్ఠూ, జగదేవ్ ఆది భక్తులు చందా వసూలు చేయటానికి ఇంటింటికి వెళ్ళసాగారు. స్వామీజీ యెడల భక్తిశ్రద్ధలున్నవారంతా అడిగినంత చందా యిచ్చారు. నాస్తికులు మాత్రం సూటీపోటీ మాటలనటం మొదలుపెట్టారు. మీ సాధువుకు చందాలెందుకయ్యా? మీరంతా "గజాననులు మామూలు సాధువు కాదు. ఆయన మహాయోగి' అంటూ వుంటారుకదా! వారు తమలీలలతో అసాధ్యమైనదికూడా సాధ్యపడేట్లు చేస్తారటకదా! మరి వారి మఠంకోసం ప్రజలనుంచి చందాలెందుకు? కుబేరుడే ఆయన ఖజానాకి అధ్యక్షుడు కదా! మరి ఇంటింటికి బిచ్చమడగటం ఎందుకు? కుబేరునికి మీరు వుత్తరం వ్రాస్తే మీ పని నిమిషాల్లో పూర్తవుతుంది కదా!" అని వారు వేళాకోళం చేస్తూవుంటే జయదేవుడు నవ్వి "ఈ ఓం భక్తి మీ మంచికోసమే! స్వామీజీకి మఠం మందిరం దేనికి? ఈ జరిగేదంతా మన మంచికోసమే! స్వామీ గజాననులకు యీ త్రిలోకాలు మఠ మందిరాలే! ప్రపంచంలోవున్న వనాలన్నీ వారికి తోటలు సుమా! ఈ పృధ్వియే వారికి మంచం! అష్టసిద్ధులు వారి గడపలదగ్గర నిలిచే దాసీజనం. రాత్రింబవళ్ళు వారి ఆజ్ఞకై ఎదురుచూస్తూ వుంటాయి! వారి ఐశ్వర్యం అమూల్యమైనది. వారికి నీ ముఖం చూడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు! స్వామి సవితా సూర్యనారాయణులు! సామాన్య దీపం అంధకారాన్నెలా పొగొట్టగలదు! వారు స్వయం ప్రకాశకులు వారికి దీపాల అవసరం లేనే లేదు! ఇంటింటికీ తిరిగి ఉత్తరాలిచ్చే వాడు ఎప్పుడైనా సార్వభౌముడు కాగలడా? ప్రాపంచికుల ఐహిక ఇచ్ఛలు కోరికలు యిలాంటి పుణ్యకార్యాలవలన పూర్తవుతాయి. శారీరకరోగం పోవటానికే మందులిచ్చేది ఆత్మకు....

కాదు! రోగభయం శరీరానికి వుంటుంది కానీ ప్రాణానికి కాదు! ఎందుచేతనంటే అది జనన మరణాలనుంచి ముక్తిపొందినది. అలాగే మీరు సుసంపన్నులుగా వుండటానికీ యీ పుణ్యం అనే మందు యొక్క అవశ్యకత! సంపన్న శరీరం కుమార్గరూపమైన రోగంచేత పాడైపోతుంది! అందుచేతనే యీ 'పుణ్య' రూపమైన ఔషధంవలన ఆ రోగాన్ని నిర్మూలించటం, పుణ్యం సంపాదించటం మొదలైనవి తప్పకుండా జరగాలి! నా స్తికత్వాన్ని కూకటివ్రేళ్ళతో పీకి పారేయండి పుణ్యరూపమైన భూమిలో సంపద అనే చెట్లూ మొక్కలు నాటండి. రాళ్ళ గుట్టమీద గింజలు చల్లినట్లయితే అవి ఎప్పటికీ మొలవవు! అనాచారమూ, దుర్వాసన అనేవే మానవ జీవితంలోని రాళ్ళ గుట్టలు. వీటిపైన వేసే బీజాలను పక్షులు తినేస్తాయి! సాధువుల సేవను మించిన పుణ్యకర్మ మరొకటిలేదు. ప్రస్తుతకాలంలో శ్రీ గజాననస్వామి సాధువులందరిలోను మకుటమణివంటివారు! కాబట్టి సాధు కార్యానికి కొంతసాయం చేసినట్లయితే శుభం కలుగుతుంది. భూమిలో, ఒక గింజ పాతిపెడతాం! అది కంకిఅవుతుంది. దానితో ఎన్నో ధాన్యపుగింజలవుతాయి. ఒకే గింజ అనేక గింజలుగా మారిపోతుంది. పుణ్యకర్మలయొక్క ఫలితం కూడా అలాంటిదే! అనే తర్కంచేయలేని సమాధానాన్నివిని నాస్తికులు నోళ్ళు మూసుకున్నారు. చిరంతన సత్యంముందు తర్కం నిలవదుమరి! చందా వసూలు చేసేవాళ్ళు తమపనిపై అచంచల విశ్వాసం వుంచి పనిచేసినట్లయితే కావలసినంత చందా తప్పక పొగవుతుంది! మామూలు వాళ్ళతో యీ పనికాదు! అస్తు. స్థలం లభించిన తరువాత మఠ నిర్మాణం ప్రారంభమైంది! గ్రామప్రజలంతా ఇందులో మునిగిపోయారు. రాళ్ళూ, సున్నం, ఇసుక, వీటిని ఎడ్ల బళ్ళతో తీసుకొని వస్తున్నారు. ఆ సమయంలో శ్రీస్వామీజీ పాతమఠంలో కూర్చొని వున్నారు. వారి మనస్సులో ఇలాంటి విచార తరంగిణులు పొంగినాయి. 'నేనిలా యిక్కడ కూర్చొనివుంటే అక్కడ పని సరిగా జరగదు" అనుకొని ఒక ఇసుకబండిపైన ఎక్కి కూర్చున్నారు. స్వామీజీ బండిపై ఎక్కడం చూసిన బండివాడు తాను దిగిపోయాడు. తాను మాలవాడవటం వలన అది చూసిన స్వామి 'అరె! నీ వెందుకు దిగావు? మాలాటి పరమహంసలకు అంటూ ముట్టూ అంటూ వుండవు" అన్నారు. ఆ మాటలు విన్న బండివాడు "స్వామి ఇట్టిపని నావల్ల ఎప్పుడూ కాబోదు! మీతో బాటు బండిమీద కూర్చోవటం అనుచితం!" అన్నాడు. మారుతి రాముని ప్రియభక్తుడైనా స్వామి ఎదుట ఎప్పుడూ కూర్చునే వాడు కాదు. ఎప్పుడూ చేతులు జోడించే నిలబడేవాడు. బండివాడన్న మాటలకు "నీ...

యిష్టం వచ్చినట్లే కానీ!" అని ఎడ్ల నుద్దేశిస్తూ "బండివాని వెనకనే నడవండి!" అన్నారు. ఎడ్లు అలానే చేశాయి. మార్గమధ్యంలో ఎట్టి అవరోధమూ కలగలేదు. బండివాడు నడిపించకుండానే ఎడ్లు బండిని చేరవలసిన స్థలానికి చేర్చాయి. ఆ స్థలానికి మధ్యగా స్వామి ఉపవిష్టులయ్యారు. అదే స్థలాన్ని కేంద్రంగా తీసుకొని దానిపైన భవ్యమైన సమాధి నిర్మింపబడింది. ఈ స్థలం శేగాంవ్లోని రెండవ నెంబరులో ఏడు వందల సర్వేనంబరులో 43-45 నెంబర్లలో వుంది! స్వామి కూర్చున్న చోటును కేంద్రబిందువుగా తీసుకోవటం వల్ల కొద్దిగా మార్పు చేయాల్సివచ్చింది. అందుచే రెండవ నెంబరులోంచి కొంతభాగం తీసుకోవలసివచ్చింది. స్థలం ఒక్క ఎకరమేకదా లభించింది. సమాధిని మధ్యగా కట్టడానికై కొంచెం స్థలం తక్కువైంది. అందుచే పదకొండుకుంటల స్థలాన్ని రెండవ నంబరులోనుంచి తీసుకొని నిర్మాణ కార్యక్రమం ప్రారంభించారు. ప్రక్క నెంబరుగల ఎకరం తర్వాత వచ్చేదే! కానీ ప్రభుత్వాన్ని అడగకుండా కార్యం మొదలు పెట్టేశారు. ఇది కనిపెట్టిన కొందరు దుష్టులు ఫిర్యాదు చేశారు. దాంతో స్వామి భక్తులంతా భయపడిపోయారు. అందులో హరి పాటిల్ ముఖ్యుడు! అతడు స్వామితో "ఈ భూమిగోడలో స్థలాన్ని కొలవటానికి 'జోష్' అనే అధికారి వచ్చాడు.' " అన్నాడు. స్వామీజీ నవ్వుతూ 'ఈ సందర్భంలో నీకుపడిన జరిమానా క్షమించబడుతుంది' అన్నారు. స్వామి ఆ అధికారికి అంతః ప్రేరణ కలిగించారు. 'స్థలాన్ని గూర్చిన సందర్భంలో వేసిన జుల్మానా అక్రమంగా వేయబడింది కాబట్టి ఆస్థలాన్ని మఠానికే (సంస్థాన్) యిచ్చివేయాలి, అని తీర్పు వ్రాశాడు అధికారి. "ఈ సందర్భంలో నేను శేగాంవ్ స్వయంగా వెళ్ళి చూశాను. వేసిన దండనం అనుచితం'అని వ్రాశాడు. జరిమానా క్షమించబడింది అని ప్రభుత్వ వుత్తరువు రాగానే హరిపాటిల్ ఆనందానికి అంతులేక పోయింది! 'స్వామీజీ వాక్కు ఎప్పటికీ అసత్యంకాదు!" అన్నాడు హరిపాటిల్. 'ఆమాల దాని సంకటంకూడా కొద్దిరోజులముందు వచ్చిపడింది నామీద. అప్పుడే స్వామీజీ నీవేమీ భయపడకు. నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు అన్నారు. చివరికి అలానే జరిగింది కూడా! సరిగ్గా అలానే యివాళ కూడా నిజమయింది! స్వామి వచనాలు అసత్యాలయ్యాయి అన్నమాట ఇంతవరకూ వినలేదు! అన్నాడు. అస్తు! శేగాంవ్ లోని ప్రజలందరికీ స్వామిపైన అచంచలభక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి! ఇక క్రొత్తమఠంలోకి వచ్చినతరువాత స్వామిచూపిన లీలలేవో వినండి! 'మేహకర్'కి దగ్గరలో 'సవీడద్' అనే గ్రామంవుంది. అక్కడ 'గంగాభారతీ గుసాయీ' అనే సజ్జనుడుండేవాడు. అతనికి కుష్టురోగం.

అతనికీ' శరీరమంతా కుళ్ళిపోయింది! రెండుకాళ్ళకూ రంధ్రాలు పడిపోయినాయి. కొన్ని వేళ్ళుకూడ కుళ్ళిపోయాయి. శరీరం అంతా ఎఱ్ఱగా కనిపించసాగింది. చెవి తమ్మెలు ఎండిపోయాయి! శరీరం అంతా బరుకుతున్నాడు! గంగాభారతి యీ రోగంతో విసిగిపోయాడు. స్వామి మహిమ విని శేగాంవ్ కి వచ్చాడు. అతడు స్వామి దర్శనార్థం వెడుతూవుంటే అక్కడున్న వారంతా ఆపేశారు. నీకు కుష్ఠురోగం వచ్చింది. దీనితో నువ్వు స్వామి దర్శనానికి వారి దగ్గరకు పోవద్దు. దూరంనుంచి చూసి దర్శనం చేసుకో! దూరానే నిలబడు. స్వామి దగ్గరగా వెళ్ళి చరణాలు స్పృశించవద్దు. ఇది అంటురోగమని డాక్టర్లూ-వైద్యులూ అంటారు కాబట్టి మరచిపోవద్దు. ఐనా ఒక రోజున ఎవరికీ తెలియకుండా గంగా భారతి స్వామిని చేరుకుని ఆయన పాదాలమీద పడ్డాడు! స్వామి వాడినెత్తిమీద ఒక్కటి మోదాడు. గంగాభారతిలేచి స్వామివైపు చూడసాగాడు. స్వామి రెండుచెంపలూ నాలుగైదుసార్లు వాయించి కాలితో ఒక్కతన్ను తన్నారు! అంతే కాకుండా శ్లేష్మాన్ని వాడిమీద వుమ్మేశారు! గంగాభారతి అదే ప్రసాదం అనుకొని వంటినిండా పులుముకున్నాడు! ఇదంతా ఒక కుత్సితుడు చూశాడు. మొదటే నీ శరీరం రోగంచేత శిథిలం అయింది. ఈ శ్లేష్మాన్ని ప్రసాదం అనుకొని వంటినిండా పులుముకుంటావేం? ఇప్పుడు సబ్బుతో స్నానం చెయ్యి! స్వామివంటి వాళ్ళు లోకంలో ఎంతోమంది వున్నారు! వీరిపై శ్రద్ధాభక్తులున్న వారు వీరిని 'సాధూ' అంటారు. దీని పరిణామం ఏమిటో తెలుసా? సమాజాన్ని మట్టిపాలుచేసే అవిధికృత్యాలు పెరిగిపోతాయి! నువ్వు చేసినది మూర్ఖపుపని! రోగనివారణంకోసం మందు తీసుకొనటానికి బదులు యీ పిచ్చివాని దగ్గరకొచ్చావా?' అన్నాడు. ఇది విన్న గంగాభారతి నవ్వి "నీలాంటి శ్రద్ధవిహీనులు ఇక్కడ వుండకూడదు! సాధువుల దగ్గర అమంగళమైన వస్తువేదీ వుండనే వుండదు! కస్తూరినుండి దుర్వాసన వస్తుందా ఎప్పుడైనా? నీకు శ్లేష్మం అనిపించినది శ్లేష్మం కాదు. కస్తూరీ సువాసనిచ్చే అదొక దివ్య ఔషధం! నీ కేమైనా అనుమానంగా వుంటే నా శరీరం పైన చెయ్యివేసి చూడు! నిజం తెలుస్తుంది! ఇది శ్లేష్మంకాదు. దివ్యౌషధం! నేనేమీ పిచ్చివాణ్ణి కాను శ్లేష్మాన్ని దివ్యౌషధం అనుకొనటానికి, దాంతో నీకేమీ సంబంధంలేదు కాబట్టి అది నీకు శ్లేష్మంగా కనిపించింది! స్వామి యొక్క మహిమను నువ్వేమీ తెలుసుకోలేదు. నామాటలోని సత్యాసత్యాలను పరీక్షించటానికి స్వామి స్నానం చేసే చోటుకు యిద్దరం వెడదాం! అక్కడి తడిసిన మట్టిని నేను శరీరానికి పూసుకుంటాను" అన్నాడు. దీని తరువాత ఇద్దరూ స్వామి స్నానంచేసే.....

చోటుకు వెళ్ళారు. అక్కడ గంగా భారతికి కలిగిన అనుభూతే అతనికి కలిగింది. స్నానంచేసిన చోటనున్న మట్టిని యిద్దరూ చేతుల్లోకి తీసుకున్నారు. గంగాభారతి చేతిలోని మట్టి ఔషధమయింది. కుత్సితుని చేతిలోని మట్టి, మట్టిగానే మిగిలిపోయింది! అందులోంచి కొంచెంకూడా దుర్గంధం రాలేదు. ఇది చూసిన కుత్సితుని కళ్ళు తెరుచుకున్నాయి! అతడు స్వామి పాదం మీద పడ్డాడు! అస్తు! గంగాభారతిని ఎవరూ దగ్గరకు రానిచ్చేవారు కాదు. పాపం! దూరంగా కూర్చునే స్వామి సాన్నిధ్యంలో సంకీర్తనం చేసేవాడు. గంగాభారతి కంఠం గంభీరమైంది మధురమైనది! ఏకతార వాయించుకుంటూ కీర్తనలు పాడుతూవుంటే అందరూ ముగ్ధులయ్యేవారు! ఇలా పదిహేనురోజులు గడిచిపోయాయి! క్రమంగా అతని రోగచ్చాయలు మారసాగాయి! ఎఱుపురంగుకూడా క్రమంగా తగ్గసాగింది. చెవులు తమ్మెలు, కాళ్ళలో పడిన గాయాలు మానిపోవటం మొదలు పెట్టాయి! శరీరాన్నుంచి వచ్చేదుర్వాసన క్రమంగా తగ్గటం మొదలు పెట్టింది. గంగాభారతి భజనలు వింటూ వుంటే స్వామికి తృప్తిగా వుండేది! గానకళ అందరినీ అలంకరించేకళ! గంగాభారతి పత్ని అనసూయ! ఆమె తన పతిని తీసుకొని వెళ్ళేందుకు శేగాంవ్ వచ్చింది! ఆమెతో సంతోషభారతి అనే పుత్రుడు తోడుగా వచ్చాడు. ఆమె భర్త దగ్గరకు వచ్చి చేతులు జోడించి 'స్వామీ యిక యింటికి పదండి! మీరిక వ్యాధినుంచి ముక్తులయ్యారు. ఇది నేను స్వయంగా నా కళ్ళతోనే చూస్తున్నాను! స్వామీజీ నిజంగా చంద్రమౌళియే! ఇది ముమ్మాటికీ నిజం! అన్నది. కుమారుడు కూడా ఆమెతో వంతపాడాడు. "తండ్రీ! స్వామీజీ అనుజ్ఞపొంది యిక మనవూరికి వచ్చేయండి! ఇక యిక్కడ వుండటం చాలు" అన్నాడు కుమారుడు. అది విన్న మీదట గంగా భారతి "నాకు చేతులు జోడించకండి. ఇక మీకు నాకు ఏమాత్రం సంబంధ బాంధవ్యాలు లేవు! అనాధులకు తల్లియైన శ్రీ గజాననులు ఒకే ఒక చెంపదెబ్బతో నా నిషాని వదిలించేశారు! వంటికి విభూతినైతే రాసుకున్నా కానీ నా మనసంతా యీ సంసారానికే తల ఒగ్గింది! కాషాయవస్త్రాలకు నేచేసిన పనుల వలన అవమానం కలిగించాను! ఈ విషయాన్ని శ్రీస్వామీజీ ఒక్క చెంపదెబ్బకొట్టి నా కళ్ళు తెరిపించారు. ఇక యీ సంసారం నుంచి దూరంగా వుండగోరుతున్నాను. ఓ సంతోషభారతీ! కుమారా! ఇక నువ్వు నీ తల్లిని వెంటబెట్టుకొని ఇంటికి వెళ్ళిపో? ఇక్కడ వదిలేయకుండా కూడా తీసుకొని వెళ్ళు. నీ తల్లి వున్నంతవరకు మనస్ఫూర్తిగా సేవచెయ్యి. ఈమె నీ ప్రియమైన తల్లి. ఈమెనుండి దూరంగా వుండకెప్పుడూ. అరె! తల్లిని సేవించినవాడు...

వాసుదేవునికి (భగవంతునికి) అతి ప్రియమౌతాడు ! నువ్వు భక్తపుండరీకుణ్ణి ఆదర్శంగా వుంచుకో! నేనొకవేళ మీ దగ్గరకొస్తే యీ రోగం నన్ను తిరిగి బాధిస్తుంది. కాబట్టి నన్ను ఇంటికి రమ్మని పట్టుబట్టకండి. ఇప్పటివరకూ నేను మీ వాడినే! ఇకనుంచీ భగవంతుణ్ణి నా వానిగా భావించి యీ నరజన్మాన్ని సార్ధకం చేసుకొనటానికి ప్రయత్నిస్తాను. ఇప్పటి వరకూ నా ఆయుషంతా వృధాగా గడచిపోయింది! ఏదో అదృష్టం వలన లభించిన యీ మానవ జన్మను జాగ్రత్తగా వుపయోగించినట్లయితే యీ మానవుడు (చౌరాసీ) ఎనభైనాలుగు యోనుల జన్మమరణచక్రంనుంచి ముక్తుడౌతాడని శాస్త్రవచనం! శ్రీ గజాననుల కృపవలన నేను మేలు కొన్నాను. ఈ పరమార్ధక్షీరంలో మట్టిని కలపవద్దు" అని తల్లీ కొడుకులకు నచ్చజెప్పి వెంటనే వారిని పంపించి తానుమాత్రం శేగాంవ్ లోనే వుండిపోయాడు. అతడు మంచి గాయకుడైన కారణంగా స్వామిని అనేక గీతాల్లో (పదాలు) స్తుతించేవాడు. ప్రతిరోజూ 'ఏకతార'తో స్వామి సన్నిధిలో భజనలు పాడేవాడు. అతని భజనలు విని అక్కడ వున్న వారంతా ప్రసన్నులయ్యేవారు. గానకళ శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది మరి! కొంతకాలానికి గంగాభారతి రోగముక్తుడై ఆరోగ్యవంతుడయ్యాడు. స్వామీజీ ఆజ్ఞమేరకు అతడు "మలకాపూర్" వెళ్ళాడు. అస్తు! ఒకసారి పూర్ణిమనాడు 'ఝ్యామసింగ్' శేగాంవ్ కి వచ్చి స్వామిని తన గ్రామానికి విచ్చేయమని ప్రార్ధించాడు. హే స్వామీ! కొద్దిరోజులక్రితం 'అడ్ గాం' లోని నా మేనల్లుని యింటికి మిమ్ములను తీసుకొని వెడదామని వచ్చాను. అప్పుడు మీరు 'ఇప్పుడు కాదులే! తర్వాత చూద్దాం' అన్నారు. మీరు వస్తానని మాటిచ్చారు. కానీ చాలా కాలమైపోయింది! కాబట్టి 'అడ్ గాం' నాతో విచ్చేయండి! నేను మీ భక్తుణ్ణి నా కోరిక నెరవేర్చండి! 'ముండ్ గాం'లో కొన్నాళ్ళు నాయింటకూడా వుండండి. వుండటానికి ఏర్పాట్లన్నీ చేసి వచ్చాను" అన్నాడు. స్వామీజీ ఝ్యామసింగ్ తో 'ముండ్ గాం' వచ్చారు. ఈ వార్తవినగానే స్వామి దర్శనార్ధం ప్రజలు తండోపతండాలుగా రాసాగారు! అక్కడ ప్రారంభమైన ఆనందోత్సవాన్ని వర్ణించడం నాతరంకాదు! 'ఝ్యామసింగ్' 'భండారా' ఏర్పాటుచేసి ప్రజలకు అన్నదానం చేశాడు. ఇది చూడటానికి గోదావరీ తీరాన వున్న 'పైఠణ్' మేమో అనిపిస్తుంది! ఏకనాథస్వామి 'పైఠణ్' ఎలా వేంచేశారో అలానే శ్రీ గజాననులు 'ముండ్ గాం' లో వేంచేశారు! ఈ వుత్సవంలో పాల్గొనే నిమిత్తం అనేక భజన మండళ్ళు అక్కడికి వచ్చాయి. వంటశాలల్లో భోజనం తయారౌతోంది. సగం భోజనం సిద్ధమైంది కూడా! ఆ సమయాన స్వామీజీ ఝ్యామసింగిని....

పిలిచి "అరె! ఝ్యామసింగ్ నేడు చతుర్ధశి! దీన్ని శూన్యతిథి అంటారు. కాబట్టి భోజన కార్యక్రమం పూర్ణిమనాడు ఏర్పాటుచెయ్యి!" అన్నారు. "స్వామి! భోజనం తయారై సిద్ధంగావుంది! తమ ప్రసాదం తీసుకోవటానికి ఎంతో మంది భక్తులు బయట వేచియున్నారు"! అన్నాడు ఝ్యామసింగ్. నీవు చేసిన యీ ఏర్పాటు జగదీశ్వరునికి (భగవంతునికి) యిష్టంలేదు! అందుచేత యీ అన్నం పనికిరాదు! నీలాంటి సంసారికులు భగవదిచ్ఛను కాదు, తమ అభిష్టాన్నే పూర్తిచేసుకోవాలని చూస్తారు!" అన్నారు స్వామీజీ. భోజన సమయానికంతా వచ్చారు. పంక్తుల్లో కూర్చున్నారు. అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమైంది. మేఘాలు గర్జించినై. ఉరుములూ మెరుపులూ పెద్ద పెట్టున మొదలయ్యాయి. పెద్ద పెట్టున పెనుగాలులు వీచసాగాయి. అరణ్యంలోని చెట్లూ చేమలూ విరిగి పడిపోవటం మొదలు పెట్టాయి. మేఘాలు జోరుగా వర్షించటం వలన అంతా నీటిమయం అయిపోయింది! కూర్చున్నవారంతా అటూ యిటూ పరిగెత్తి పోయారు. వండిన భోజనం అంతా నాశనమైపోయింది. అదిచూసి ఝ్యామసింగ్ " స్వామీ! గురుదేవా! రేపు మాత్రం యిలాటి స్థితిని రానీయకండి అని ప్రార్ధించాడు. మీ ప్రసాదం లభించని కారణంగా ప్రజలంతా దుఃఖితులయ్యారు. ఇప్పుడు వర్షపురోజులు కూడా కావాయె! అనుకోకుండా యీ వర్షంవచ్చి మా ఆశలన్నీ అడియాశలు చేసింది. మరి యిలానే వర్షం కురుస్తూ వున్నట్లయితే. పాలాల్లోని పంటలన్నీ నాశనమైపోతాయి. దాంతో నన్ను ఝ్యామసింగ్ అన్న దానంచేసి తానైతే పుణ్యం సంపాదించుకున్నాడు కానీ మమ్మల్నందరీని దరిద్రుల్ని చేశాడని అందరూ తిట్టిపోస్తారు. 'వాడి పుణ్య ఫలం చూడండి ఎలా వుందో' అని కూడా సూటిపోటిమాటలతో వేధిస్తారు. ఇది విన్న మీదట స్వామీజీ "అరె! ఝ్యామసింగ్ ! ఇలా కోపం తెచ్చుకొని దుఃఖితుడవైతే ఎలా? రేపు వర్షం నిన్నేమీ చేయదు! నేనిప్పుడే దానిఏర్పాటు చేస్తానిక సరేనా?' 'అని వారొకసారి ఆకాశంవైపు దృష్టిని సారించారు. విచిత్రంగా ఆకాశంలోవున్న మేఘాలన్నీ అటూ యిటూ పోయి నిర్మలంగా తయారైంది. మేఘాలు విలీనమవటం తోనే సూర్యుడు కూడా కన్పించసాగాడు. ఈ విధంగా మహాపురుషులు మహిమలు చూపుతూవుంటారు! రెండవరోజు 'భండారా'' (అన్నదానం)కి ఏర్పాట్లు చేయబడ్డాయి. ప్రసాదాన్ని స్వీకరించి ప్రజలు ఎంతో ఆనందించారు. 'ముండ్ గాం'లో నాడు ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం నేటికీ జరుగుతూనే వుంటుంది. ఝ్యామసింగ్ తనకున్న ఆస్తినంతా 'ముండ్ గాం'లోనే శ్రీచరణాలకు ఆర్పించేశాడు. ఆ గ్రామంలోని...

నివాసులు అనేకమంది స్వామికి భక్తులయ్యారు. 'పుండరీక భోకరే' అనే యువకుడొకడు ఆ భక్తుల్లోనివాడు. ఇతడు 'ఉకీర్డా' అనే ఒక కూలివాని ఒక్కగానొక్క కొడుకు, ఈ 'ఉకీర్డా'తను యువావస్థలో వుండగా స్వామికి భక్తుడయ్యాడు. విదర్భ ప్రాంతంలో పుట్టగానే పోయే సంతానం కలిగినవాళ్ళు పిల్లవాడు బ్రతుకుతాడనే ఆశకొద్ది 'ఉకీర్డా' అని పెట్టుకుంటారు. తమ సంతానం ఆయుష్షుకోసం మొక్కుకునేవారు యీలాంటి పేరును పెట్టడం విదర్భ ప్రాంతంలోనే కాక దేశంలోని యితర ప్రాంతాల్లోకూడా యీ ఆచారంవుంది. తెలుగులో (ఆంధ్రలో) పెంటయ్య అనీ, మహారాష్ట్రంలో అని విదర్భలో ఉత్తీర్ణా అనీ పేర్లు పెట్టే ఆచారం వుంది. ఈ భక్తుడైన పుండలీకుడు వద్యపక్షంలో స్వామిదర్శనార్ధం, నియమం తప్పకుండా శేగాంవ్ వచ్చేవాడు. 'వారీకర్' వద్యపక్ష తిథుల్లో ఇంద్రాణి తటానవున్న 'దేహూ' అతందీలో వున్న 'వార' కోసం వచ్చేవాడు. అలానే వద్యపక్షంలో యీ పుండలీకుడు శేగాంవ్ లోని స్వామి దర్శనార్ధం వస్తూండేవాడు. ఒకసారి విదర్భ ప్రాంతంలో 'ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఈ వ్యాధి సంపర్క జన్యమైనది (అంటు) కాబట్టి గ్రామప్రజలంతా ఆరుబయట పొలాల్లో వుండేవారు. ఈ రోగలక్షణమేమిటంటే మొదట చలివేస్తుంది. జ్వరం బాగావస్తుంది. కళ్ళు ఎర్రబడతాయి ఆ తర్వాత ఏదో ఒక కీలు పైనగాని, ముడతలదగ్గర కాని నరాలు వాస్తాయి (ఉబ్బుతాయి). అలా వాయగానే గాలి తగిలి సంధి పుట్టుకొస్తుంది. జ్వరం ఎక్కువగా ఉండటంవలన ఒళ్ళంతా మంటపుడుతుంది. క్షణక్షణం తెలివి తప్పుతూ వుంటుంది. ఈ విచిత్రమైన రోగం మొదట భరతఖండంలో లేదట! ఇది యూరోపునుంచి వచ్చింది. విదేశీయులిక్కడికి వచ్చేటప్పుడు దీన్ని కూడా తెచ్చిపెట్టారు. అస్తు! ఈ రోగం విదర్భ ప్రాంతం అంతా వ్యాపించింది. రోగాన్నుంచి తప్పించుకొనటానికి జనం భయపడి యిళ్ళూ-వాకిళ్ళూ విడిచిపెట్టి పొలాల్లో వుండటం మొదలు పెట్టారు! ఆరోగం కొంతకాలానికి 'ముడ్ గాం'కి కూడా పాకింది. అదే సమయంలో పుండలీకుడు శేగాంవ్ కు ప్రయాణం కట్టాడు. శేగాంవ్ కి బయలు దేరినపుడే అతనికి జ్వరం తగులుతూవుంది. కానీ అతడెవరికీ చెప్పలేదు. తన తండ్రితోపాటు శేగాంవ్ కి బయలుదేరాడు. షుమారు ఐదుకోసులదూరం చేరేటప్పటికి జ్వరం బాగావచ్చేసి ముందుకువెళ్ళటం చాలా కష్టమైపోయింది! చంకలోని ఒక నరం కూడా వాచింది. కొడుకుస్థితిని గమనించి 'అరే పుండలీకా! ఏమిటలావున్నావు! అని అడిగాడు తండ్రి. 'నా జ్వరంతో పాటుగా చంకలోని నరంకూడా వాచింది'. ఈ జ్వరం తీవ్రతతో నా శక్తి అంతా.....

క్షీణించిపోయింది. నేనొక్క అడుగుకూడా ముందుకు వేయలేను! అయ్యో! ఇదినా దౌర్భాగ్యం! ఈ సారి నా మొక్కు తీర్చుకోలేనేమో ననిపిస్తోంది. హే! స్వామీ! దయాఘవా! నాదొక్కటే ప్రార్ధన. నానియమాన్ని పూర్తిచేయనీ! హే! భక్తవత్సలా! కృపానిధీ! మీపాదాలవరకూ నన్ను తీసుకొనిపొండి. మీదర్శనం చేసుకున్న తర్వాత జ్వరం యింకా ఎక్కువైనా సరే! లేక అందులో నేను మరణించినా సరే నాకేమీ భయంలేదు! ఈ నియమమే నేచేసే పుణ్యసంచయనం. దాన్ని కాపాడండి. శరీరంలో శక్తి వున్నంతకాలమే సాధకునివలన పరమార్ధం అయ్యేది!" అన్నాడు కొడుకు. పుత్రుని యీదీనావస్థను తండ్రి కూడా వ్యాకులుడయ్యాడు. అతడుకూడా ఏడువసాగాడు. ఇతడు ఒక్కగా నొక్కకొడుకు! అతనికి మనస్సులోనే 'నా వంశాంకురం ఆరకుండా చేయి స్వామీ! అని ప్రార్థించాడు భగీరథుణ్ణి! 'నేను ఒక బండి తెప్పిస్తాను' అన్నాడు తండ్రి. దాని మీదట 'నియమం నడకతోనే పూర్తిచేయాలికదా! పడుతూ లేస్తూ ఎలాగో ఒకలాగా శేగాంవ్ కి చేరగలమనుకుంటాను! మధ్యలో మృత్యువువస్తే విచారించకండి! నా శవాన్ని శేగాంవ్ కి తీసుకొని వెళ్ళి అక్కడే నా అంత్యక్రియలు చేయండి!" అన్నాడు. తండ్రితో తరువాత అతికష్టంతో శేగాంవ్ చేరి స్వామీజీ పాదాల మీద వాలిపోయాడు! అప్పుడు స్వామీజీ తనలీలను చూపాడు. ఒక చేతితో చంకలో వాచిన నరాన్ని గట్టిగా నొక్కారు తియ్యని మాటలతో అరే! పుండలీకా! నీ గండం గడిచిపోయింది! ఇక చింతించకు! అన్నారు. శ్రీస్వామీజీ అలా అనటంతోనే వాచిన నరం తగ్గిపోయింది. జ్వరమూ జారిపోయింది! శక్తి హీనుడవటంవలన వణికిపోసాగాడు. పుండలీకుని తల్లి ప్రసాదంవుంచిన పళ్ళాన్ని స్వామిముందుంచింది. అందులోని రెండు ముద్దలు స్వామినోట వేసుకోగానే పుండలీకుని వణకు తగ్గిపోయి, అతడు మామూలు మనిషి అయ్యాడు. కొంచెం అశక్తతగా వున్నాడు. ఇది గురుభక్తి వలన కలిగే ఫలితం! ఓ అంధులారా! కళ్ళు తెరిచి మీరే చూడండి! సద్గురువులకు చేసిన సేవ ఎన్నటికీ వృధా కాదు. కామధేనువున్నయింట అన్ని కోరికలూ సిద్ధిస్తాయి! పుండలీకుని యీ కథను మనస్ఫూర్తిగా చదివినవారికి గండాతరముక్తి తప్పక కలుగుగాక! సిద్ధయోగుల చరిత్ర మనోరంజనం కోసం చెప్పబడే కథకాదు! అది నిదర్శనాలగనిది! ఔను యోగుల మహత్తుపై ఎప్పుడూ అవిశ్వాసం వుండకూడదు. శ్రీ దాసగణూ విరచితమైన శ్రీ గజానన విజయమనే యీ గ్రంథము భావుకులకు సుఖశాంతులను ప్రసాదించుగాత! అని ఆసర్వేశ్వరుని ప్రార్ధించుచున్నారు.

॥ శుభం భవతు ॥

|| శ్రీ హరి హరార్పణమస్తు ॥

॥ ఇది త్రయోదశాధ్యాయము సంపూర్ణము ॥ .

యే మనుష్యః మాం ఆశ్రతః!
తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!