పన్నెండవ అధ్యాయం

శ్రీ గణేశాయనమః హే గణాధిశ గణపతి! మయూరేశ్వర విమలకీర్తి! నా హృదయంలో నివసించి యీ గ్రంథరచనను పూర్తిచేయటానికి దోహదం చెయ్యి. నీవు జ్ఞానబుద్ధి ప్రధాతవు, భక్తుల కోరికలను తీర్చేవాడవు. హే గణరాయా! నీ దయచే విఘ్నాలన్నీ నాశనమౌతాయి. నీవు సాక్షాత్తూ చింతామణివే! భక్తుల మనోవాంఛలన్నింటిని తీర్చేవాడవని పురాణాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఓ ఏకదంతా? లంబోదరా! పార్వతీసూతా !బాలచంద్రా! సింధురారే! నన్ను దయజూచి యీ గ్రంధాన్ని పూర్తిచేయాలనే నా మనోవాంచితాన్ని తీర్చు! ఆస్తు! బచ్యూలాల్ అగ్రవాల్ అకోలా గ్రామంలో వుండేవాడు. అతడు ధనకనకాలతో గొప్పవాడైనప్పటికీ మంచి హృదయం కలవాడు. అతడు 'కారంజా'లోని లక్ష్మణుఘడే విషయాన్ని గురించి చెప్పుగా విన్నాడు. ఆ విషయంలో అతనికి అనుమానమే కలిగింది. ఇది నిజమా! అని మనసులో అనుకోసాగారు. ఇంతలో స్వామి అకోలా రానే వచ్చాడు. బచ్చులాల్ ఆయన భక్తుడే. ఆ కారణాన శ్రీ స్వామిజీ అతని యింటికి వచ్చి ఇంటి అరుగుమీద కూర్చున్నారు. స్వామిని చూసి అతడెంతో ఆనందించాడు. స్వామి! నేడు తమ పూజచేయాలనే కోరిక మనసులో వుంది?' అన్నారు. అది విని సరే అన్నట్లు స్వామీజీ తలపంకించారు. బచ్చులాబ్ అన్ని సిద్ధంచేసి షోడశోపచారాలు మొదలుపెట్టాడు. మొదట నలుగు పెట్టి మంగళ స్నానం చేయించాడు. తరువాత జరీపీతాంబరాన్ని కట్టబెట్టాడు. విలువైన కాశ్మీరు శాలువను కప్పాడు. జరీ రుమాలోకటి తలకు పాగాలాగా చుట్టారు. తన వద్దనున్న అమూల్యహారాన్ని మెడలో వేశాడు. బహుమూల్య అంగుళీయకాన్ని కూడా వేలికి పెట్టాడు. ఇవన్నీ అయిన తర్వాత వారిని ఒక చక్కని ఆసనం పై ఆసీనులను చేశాడు. జిలేబి మొదలైన రాఘవదాన్, పేడా మొదలైన మిఠాయిల నెన్నో పళ్ళెంలోవుంచి నైవేద్యంగా సమర్పించాడు. త్రయోదళ యుక్తమైన తాంబూలాన్ని బంగారు పొరలో చుట్టి పెట్టాడు. అష్టగందాల తిలకాన్ని దిద్ది మంచి సెంటును కూడా రాచి గులాబీ జలాన్ని వారిపై చల్లాడు. అంతేకాక ఒక సువర్ణపాత్రలో అసంఖ్యమైన రూపాయిలుంచి దక్షిణ రూపంలో సమర్పించాడు. దాని విలువ ఎంతో చెప్పరానిది. ఆ రూపాయలను లెక్కిస్తే పది వేలకు తక్కువ ఉండవు. అది అవర్ణనీయం! స్వామి ఎరుటనొక శ్రీఫలాన్నుంచి వినమ్రుడై 'స్వామీ! ఒక రామమందిరాన్ని నిర్మించాలనే కొరిక నామనసులోవుంది.ఈ అరుగుచాలా చిన్నది. ఇక్కడ చాలామంది కూర్చోలేరు. కాబట్టి రామమందిరం నిర్మించే నా కోరికను తమరు తీర్చాలి అని అనన్య భక్తితో స్వామికి సాష్టాంగ నమస్కారం సమర్పించాడు. అతని శ్రద్ధాభక్తులను చూచి స్వామి ప్రసన్నులయ్యారు. నీ కోరికను ఆ సీతావల్లభుడే తీరుస్తాడు అన్నారు. తరువాత "ఏమిటి? నేనేమైనా ఎద్దుననుకున్నావా? వీటన్నింటిని కట్టబెట్టావు. నేను ఆ 'పొలా' పండుగ ఎద్దునూ కాదు! ఉగాదినాటి గుఱ్ఱాన్ని కానుకదా! నాకీ అలంకారాలతో పనిఏమిటి. ఈ అవాంఛిత విషాన్ని నాకు దూరంగా వుంచు, నాకా బిరుదు నివ్వవద్దు. అని! బచ్చులాల్ నీ సంపదనంతా చూపటానికే యీ నాటకం ఆడటం లేదుకదా? ఎవరికేది యిష్టమో అదే వారికివ్వాలి. నే నొక పిచ్చిసన్యాసిని! ఊళ్ళో దిగంబరంగా తిరుగుతూ వుంటాను! కాబట్టి యివన్నీ నువే వుంచుకో అరె! యీ లోకాన్ని అంటిపెట్టుకున్నవారికే యివన్నీ అవసరమౌతాయి! నా స్వామి భీమాతటాన నడుము పైన చేతులుంచి నిలబడి వున్నాడు. ఆయన నాకివన్నీ యివ్వటానికి అసమర్ధు డనుకుంటున్నావా?" అని అంటూ చేసిన అలంకారా లన్నింటిని తీసి పారేయటం ప్రారంభించారు. కట్టుకున్న వస్త్రాన్ని కూడా తీసిపారేశారు. కేవలం రెండు (షేడా) మిఠాయిల్ని తిని అక్కడి నుంచి బయలు దేరారు. ఇదంతా చూసిన భక్తులు దుఃఖితులయ్యారు. అందులో కొందరు కారంజా గ్రామవాసులు కూడా వున్నారు. "మన లక్ష్మణుడు నిజంగానే దౌర్భాగ్యుడు. అతడూ బచ్చులాల్ చేసినట్లే స్వామికి పూజాదులు సమర్పించాడు కాని తోలి అవటంవలన మనసులో ఒకటుంచుకొని బయటకొకటి అన్నాడు. వాడి కపటాన్ని తెలుసుకోపోవటానికి స్వామి అసమర్థులామరి?" అనుకున్నారు. దాంభికులు పదాలతో పూజించి మహావస్త్రాన్ని అర్పించటానికి బదులుగా అక్షతలు వేస్తారు. నోటితో 'శర్కరాఖండఖాద్యాని' అని ఉచ్చరించి, దేవుని ఎదుట మాత్రం పురుగులు పట్టిన వేరుశనగపప్పులుంచుతారు. కర్మ ఎట్టిదో ఫలం కూడా అట్టిదే! అనే న్యాయాన్ని అనుసరించే దాంభికుడికి ఫలం దక్కుతుంది.(తన కర్మ నమసరించి). చివరికి లక్ష్మణుడు చెడిపోయింది కూడా యీ కపటత్వం వల్లనే! కానీ యీ బచ్చులాల్ ధమ్యుడు! స్వామికి శ్రద్ధాభక్తులతో పూజచేశాడు కాబట్టి దానికి తగిన ఫలమే లభించింది! దినదిన ప్రవర్ధమానంగా అతని రాబడి పెరిగింది. మహాత్ముల కృపాపాత్రులైనవారెప్పుడూ సుఖశాంతులతోనే వుంటారు. మరి! స్వామీజీ అకస్మాత్తుగా వెళ్ళిపోయిన కారణంగా బచ్చులాల్ అకోలా గ్రామమంతా గాలించాడు. కానీ లాభంలేక పోయింది. సరే! నిమ్నజాతివాడైన పీతాంబరుడు స్వామిభక్తుడు. శేగాంవ్ లో స్వామితోనే వుంటూ వుండే వాడు. స్వామికి మనస్ఫూర్తిగా సేవ చేసేవాడు. అతని తపస్సు ఫలించింది. ఒక నాడు మఠంలో ఒక సంఘటన జరిగింది. మరంలో చినిగిన పంచెకట్టుకొని వున్నారు పితాంబరుడు. అది చూసి స్వామి మందహాసం చేస్తూ అరే! పేరు పీతాంబరుడూ కట్టింది చినిగిన వస్త్రమూ! దానిలోంచి నీపార్వభాగం అంతా కనిపిస్తోంది. ఆ భాగాన్ని కనపడకుండా కప్పుకో పేరు: 'బంగారమ్మ' చేతులకు మట్టిగాజులూ! 'పేరు అడిగితే 'గంగమ్మ' అంటుంది కానీ నీటికోసం తపిస్తుంది. నీ స్థితి కూడా అలానే వుంది. ఈ చినిగిన ధోవతి పారేయాల్సిందే లేకపోతే నీ పార్వభాగాన్నందరికి చూపిస్తూ తిరుగుతుంటావు! ఇదిగో ఈ అంగవస్త్రం తీసుకొని కట్టుకో! ఎవరేమన్నా సరే దీన్ని ధరించే వుండాలి సుమా!' అన్నారు. స్వామి ఇచ్చిన అంగవస్త్రాన్ని ధరించాడు పీతాంబరుడు. దీన్ని తోటివారు సహించలేక పోయారు. స్వార్ధపరుడైన సొదరుడు కూడా మరో సోదరుడికి శత్రువై వాణ్ణి నాశనం చెయ్యటానికి కూడా వెనుకాడడు. వాళ్ల ఈర్ష్యపు మాటల్ని చెప్పటంవలన ప్రయోజన మేముంటుంది? మురికి కాలవని తెరిచినపుడు దుర్గంధమే కదా వచ్చేది! శ్రీ గజాననుల శిష్యులు అనేకులు అందులో యోగ్యులైనవారు. ఎంతమందో లెక్కించవచ్చు వేళ్ళపైన అరణ్యంలో వృక్షాలనేకం. కాని చందన వృక్షం ఒక్కటైనా కన్పిస్తుందా అని! స్వామికి చుట్టూ వున్న భక్తులలో కొందరు పీతాంబరుణ్ణి సూటి పోటీ మాటలనటం ప్రారంభించారు. ఇతడికేసి చూపించి చూడండి! స్వామివారి సీసలైన భక్తుడు! స్వామి వారిచేత కట్టబడిన వస్త్రాన్ని కట్టుకొని తిరుగుతున్నాడు! నీ భక్తి ఏమిటో మాకు తెలిసిందిలే నవ్వు "ఆనందరావు' (ఖుష్ హాల్ చంద్) వని తెలుసు | నువ్విక్కడుంటే నీ పనులవల్ల స్వామికి అవమానం జరిగేలా వుంది అన్నారు. సీతాంబరుడు వివమ్రుడై 'ఈ బట్టకట్టి నేను స్వామిని అవమానం చేయలేదు. వారిచ్చిన ప్రసాదాన్ని గౌరవించాను! ఈ వస్త్రం వారు నాకిచ్చిందే కట్టుకున్నాను. దీని వలన స్వామిని అవమానించినట్లూ, అజ్ఞోల్లంఘనం చేసినట్లూ ఎలా అవుతుంది? అన్నాగానీ ఇతరులకు యిది రుచించలేదు సరికదా రాత్రింబవళ్ళు అసూయతో కుమిలిపోయేవాళ్ళు వారంతా ఈ అసూయ పోవటానికి వాళ్ళందరి నోళ్ళూ మూతపడ్డానికి స్వామి ఒక పనిచేశారు. నువ్వెక్కడికైనా సుదూరానికి వెళ్ళిపో! కొడుకు పెద్దవాడైన తరువాత తల్లికి దూరంగా వుండాలికదా! పీతాంబర్! నీపై ఎప్పుడూ నా దయాదాక్షిణ్యాలు వుండనే వుంటాయి! ఇక ఇక్కడనుండి వెళ్లి పనతులకు (శక్తిహీనులకు) సాయపడు!" అన్నారు స్వామి పీతాంబరునితో స్వామి ఆజ్ఞను శిరసావహించి వారినుండి కన్నీళ్ళు నిండిన కళ్ళతో సెలవు తీసుకున్నాడు.పీతాంబరుడు, అడుగులు ముందుకు పడుతున్నాయి కానీ అతని ముఖం మఠం వైపూ, దృష్టి స్వామి పైనే వున్నాయి పీతాంబరుడు నడిచి నడిచి 'కొండోలీ' అనే గ్రామం చేరుకున్నారు. సాయంకాలం అవుతోంది. నోటితో స్వామి నామస్మరణం చేస్తూనే వున్నాడు. సాయంకాలం గ్రామంలోనికి వెళ్ళటం అనుచితం అనుకున్నాడు. అక్కడొక మామిడిచెట్టుక్రింద కూర్చున్నాడు. చెట్టు క్రింద చీమలు పుట్టలుగా వున్నాయి. అవన్నీ అతణ్ణి కుట్టాయి. అందుచే ఉదయం కాగానే చెట్టెక్కి కూర్చున్నాడు. అక్కడకూడా చీమల బాధ భరించలేక ఒక కొమ్మనుంచి మరోకొమ్మకి మారుతూ వచ్చాడు. ఐనా మంచి చోటు దొరకలేదు. కొమ్మలపైన గెంతుతున్న ఇతణ్ణి కొందరు పశువుల కాపర్లు చూశారు. కోతిచేష్టలెందుకు చేస్తున్నాడీ మనిషి? అర్ధం కాకుండా వుంది. నిర్భయంగా ఒక కొమ్మనుండి మరో కొమ్మపైకి వస్తున్నారు. కాని క్రిందమాత్రం పడటంలేదు! ఇదే విచిత్రమైన విషయం!" అనుకున్నారు. వాళ్ళు అందులో ఒకడు ఇదేమీ విచిత్రం కాదు, శ్రీ గజాననుల శిష్యులు యిలాంటి ఆశ్చర్యకరమైన లీలలెన్నో చూపిస్తూ వుంటారు. లీలలనుబట్టి తడు శ్రీగజానను శిష్యుడై వుండాలనిపిస్తోంది. పదండి గ్రామంలోకి వెళ్ళి యీ విషయం అందరికీ చెప్పుదాం!" అన్నాడు. పశువుల కాపరుల కధనాన్నివిని ఊరంతా శ్రీగజాసనుల శిష్యుని చూడటానికి మామిడి చెట్టుదగ్గరికి వచ్చింది! మొదట అతనిమీదెవరికి నమ్మకం కుదరలేదు. వీడెవడో పిచ్చివాడిలా అభినయిస్తూ గజాననుల శిష్యుడనుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా వుంది. గజానన స్వాముల అసలైన భక్తుడు బాష్కర పాటిల్ అనేవాడు. అతడు కొద్దికాలం క్రితం అడగంలో కాలంచేశాడు అని చెవులు కొరుక్కోసాగారు. 'ఆ' గజాననుల శిష్యుడు ఇక్కడి కెందుకొస్తాడు? అక్కడి మిఠాయిలు విడిచి యిక్కడ ఉపవాసం చేయటాని కొస్తాడా? ఐనా నిజమేమిటో తెలుసుకోవటానికి అతణ్ణి అడిగితే సరి అతడేం చెపుతాడో విందాం! వ్యర్ధతర్కంవల్ల ప్రయోజన మేముంది?' అన్నారెవరో అక్కడివాళ్ళలో ఒకరు. చివరికి అందులో ఒకరు ముందు కొచ్చి "ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నీగురు వెవరు" అని ప్రశ్నించాడు పీతాంబరుణ్ణి. 'నేను శేగాంవ్ నివాసిని (శింపీ) నిమ్నజాతివాడిని. నా పేరు పీతాంబరుడు. నేను శ్రీగజాననుల శిష్యుణ్ణి! వారి ఆజ్ఞవల్ల తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. ఈ చెట్టుక్రింద కూర్చున్నాను. చీమల బాధ భరించలేక చెట్టుపైకెక్కాను'అన్నాడు పీతాంబరుడు జవాబుగా. ఐనా వాళ్లకి అతని మాటల మీద నమ్మకం కుదరలేదు. వారు కోపంతో పెద్దల పేరు చెప్పుకొని యీ మర్కటలీల లెందుకు చేస్తున్నావు! భలే! రాజుగారి ముద్దుల పెళ్లాం పొట్టకూటికోసం కూలిపని కెళ్లిందన్నాడట ఎవడో, వెనకటికి అన్నారు. ఆ గ్రామవాసి శ్యామరావ్ దేశముఖ్ "ఒరేయ్! దొంగ వెధవా! ఇది విను. స్వామి గజాననులు సాక్షాత్తూ భగంతుడే! ఆయన పేరు చెప్పి వారి గొప్పతవానికి కళంకం ఆపాదించకు! ఒరేయ్ పిచ్చివాడా! వారొకసారేం చేశారో తెలుసా? తమ సామర్ధ్యంచేత ఋతువు కాకున్నా మామిడిచెట్టుకు మామిడి పళ్ళు. కాయించారు! వారు మామిడిపళ్ళు కాయించారు నువ్వాయన భక్తుడనంటున్నావు కదా! కనీసం కాయలు కాకుంటే ఆకులన్నా వచ్చేటట్లు చెయ్యి! అలా చేయలేకపోయినట్లయితే నిన్ను వదిలి పెట్టం! ఇదిగో మోడు వారిన చెట్టు. మా ఎదుటే దీనికి ఆకులు తెప్పించు! అలా చేయలేని పక్షంలో సద్గురుకృప వలన శిష్యుల్లో వారిశక్తి కూడా సంచారం చేస్తూవుంటుంది కదా! ఇక ఆలస్యం చేయకు. ఈ మామిడి చెట్టుకు ఆకులు తెప్పించి పచ్చగా చెయ్యి!" అన్నాడు. ప్రజల కోరిక విన్న పీతాంబరుడు భయపడిపోయాడు. అతడు వినయంగా యిలా అన్నారు. నన్ను ఊరికేసతాయించకండి! నా కథ నాలకించండి! రాళ్ళూ వజ్రాలూ కూడా ఒకే గనిలో నుంచి పుడతాయి కదా! శ్రీగజాననుల శిష్యులలో నేను గులకరాయి వంటివాడిని, నేచెప్పేది నిజమని నమ్మండి. గులకరాళ్ళవల్ల గని గొప్పతనం తగ్గిపోదుకదా! కాబట్టి నా సద్గురుల పేరు వుచ్చరించటానికి నేనెందుకు సిగ్గుపడతాను?" అన్నాడు. దానిమీదట శ్యామరావు 'వట్టి మాటలు మాట్లాడకు! శిష్యులు ఆపదలో పడినప్పుడు మనస్ఫూర్తిగా తమగురువుని తలుచుకుంటారు! ఆశిష్యుడు అంత యోగ్యుడు కాకపోయినా వారు సాయపడి రక్షిస్తారు!" అన్నాడు. ఇలా పీతాంబరునికి ముందు నుయ్యి వెనుక గొయ్యీ లాటి పరిస్థితి కలిగింది. పాపం! ఎంతో చింతాక్రాంతుడయ్యాడు. ఏంచెయ్యాలో పాలుపోలేదు! ఏమౌతుందో చూడటానికి చెట్టును చుట్టి అంతా నిలబడ్డారు. పాపం! వివశుడై చెట్టు దగ్గరకొచ్చాడు పీతాంబరుడు. గురుమూర్తిని ధ్యానించి వారిని స్తోత్రం చేయటం ప్రారంభించాడు. "హే స్వామి సమర్ధగజాననా! నారాయణా! పతితులను రక్షించేవాడా! నావలన మీకు కళంకం రాకూడదు। కాబట్టి ఈ మామిడిచెట్టుకు ఆగులు వచ్చేలా చేయండి! మీరే నాకు దిక్కు! వీరు కోరినట్లుగా జరగపోయినట్లయితే వీరు నా ప్రాణాలు తీసేస్తారు. భక్తుడైన ప్రహ్లాదుని కోసం మీరు స్తంభాన్నుంచి బయటకు వచ్చారు! జనాబాయిని శూలంమీద వేసినపుడు మీదయ వల్లనే అది నీరుకారిపోయింది.జనాభాయికున్నంత శ్రద్ధాభక్తులూ, విశ్వనమూ, నాకూ వున్నాయి స్వామి! దేవుడు, యోగి వీరిద్దరూ అభిన్నలే! దేవుడే యోగి, యోగులు భగవంతుని అవతారాలే కదా! ప్రజలంతా నన్న గజాననులు శిష్యుడంటారు. ఇందులో నాగొప్పతనం ఏమీలేదు. మీ కృపచేత నావంటి క్షుద్రుడు కూడా మహిమ కలవాడవుతాడు. దారానికి పూవులు గుచ్చినప్పుడే కదా ఆ దారానికి విలువ? తమరు పుష్పాలైతే నేను వట్టాదారాన్నే! తమరు కస్తూరి నేను మట్టిని!! నిజం చెప్పాలంటే మీ కారణంగానే నే నీ విపత్తులో పడ్డాను. స్వామి నన్ను పరీక్షించకండి! వెంటనే వచ్చి ఆకులులేని మోడును చిగురింపజేయండి! దయచేయండి అని అక్కడకు చేరినవారందరినీ స్వామి నామోచ్చారణ చేయనున్నాడు. "జయజయ స్వామి గజాననులకు' అని శేగాంవ్ రక్షణ మీకు జయమగు గాక" అన్నాడు. అక్కడి వారంతా కూడా శ్రీగజాననుల నామోచ్చారణ చేయటం ప్రారంభించగానే ఆమోడు వారిన మామిడి చెట్టు ఆకులు చిగురించి పచ్చపచ్చగా కళకళలాడసాగింది. ఇది చూసి ఆశ్చర్యచక్షితులయ్యారు! అరె ! ఇది కల కాదు కదా! నన్ను కొంచెం గిల్లు ! నిజమో కాదో చూద్దాం! 'అన్నారొకరు మరొకరితో! మరెవరో' ఇది 'ఇంద్రజాలంకాదు కదా! ఇంద్రజాలికుడు త్రాటిని పాము చేస్తాడు. జోలెలో నుంచి రూపాయిలూ తీస్తాడు. మరి! ఏమి మాయ యిది!" అనుకుంటూ ఆ చిగురించిన ఆకులను కోసి చూసి తామనుకున్నదంతా భ్రమఅనుకొని తెలుసుకున్నారు. వారి భ్రమ తొలగిపోయింది! కళ్ళతో చూసిన యీ విచిత్రం కేవలం శ్రీగజాననుల మహిమే కాని మరేమీ కాదని నిశ్చయించుకున్నారు. వారు నిజానికి పరమహంసలే! ఇందులో ఏమాత్రం సందేహం లేదు! ఇతడు నిజంగా శ్రీగజాననుల శిష్యుడే! ఇతణ్ణి శంకిస్తే స్వామికి అపచారం చేసినట్లవుతుంది! ఇక యితణ్ణి గౌరవ మర్యాదలతో ఊళ్ళోకి తీసుకొని వెడదాం! తమ శిష్యుని కోసం స్వామి యీ గ్రామానికి ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తారు. గోమాత తన లేగదూడ కోసం పరిగెత్తుతుంది కదా? ఇది అలాంటిదే" ఇలా అందరూ సమ్మతించుకొని పీతాంబరుణ్ణి ఊరేగిస్తూ ఊళ్ళోకి తీసుకొచ్చారు. లోకంలో చమత్కారం లేకుంటే నమస్కారం చెయ్యరెవరూ! సమర్థ రామదాసస్వామి తమ ప్రియశిష్యుడు 'కల్యాణుణ్ణి ప్రజలమంచి కోరే కదా డోంగాం పంపింది. అలానే గజాననులు యీ పీతాంబరుణ్ణి యీ 'కాండోలి' గ్రామానికి పంపారు! అప్పటినుంచి గ్రామవాసులందరిలోను అభివృద్ధి కనిపించసాగింది. శ్రోతలారా!ఆ అమ్రవృక్షం యిప్పటికీ 'కండోలి' గ్రామంలో వుంది. అన్నింటికంటే యా వృక్షానికే ఎక్కువ ఫలాలు కాస్తాయి! గ్రామవాసులందరికీ పీతాంబరుడు ప్రాతఃస్మరణీయ వ్యక్తి అయ్యాడు. ప్రజల్లో అతడంటే అమితమైన భక్తి శ్రద్ధలు కలిగినై! లేడీ (హరిణము) ఎక్కడి కెళ్ళినా దాని విలువ తగ్గదుగా! భక్తులంతా కలిసి పీతాంబరునికి ఒక మఠాన్ని నిర్మించారు. యధాసమయాన అతడి నిర్వాణం కూడా అక్కడే జరిగింది! ఇక్కడ శేగాంవ్ లో స్వామి వ్యాకులులై మఠంలో కూర్చొని వున్నారు. వినయంగా స్వామి భక్తులు దానికి కారణాన్ని తెలుసుకోగోరారు. దాని మీదట "మన కృష్ణాపాటిల్ ఇక లేడు! అతడు ప్రతిరోజూ నాకు చక్కని పక్క తెచ్చియిచ్చేవాడు! అది నాకు గుర్తుకొచ్చి వ్యాకులుణ్ణయ్యాను. అతని కుమారుడు రాముడు చాలా చిన్నవాడే! ఇక నాకు ఆవక్క ఎవరు తెచ్చిస్తారు? రాముడు పెద్దయిన తరువాత నాసేవ చేస్తాడు. కానీ ఇక నేనీ మఠంలో వుండను!" అన్నారు. స్వామి కథనాన్ని విన్న భక్తులు విచారగ్రస్తులయ్యారు. ఇక స్వామి యిక్కడ వుండరని వారంతా తెలుసుకున్నారు లోలోపలే! కాని వారంతా స్వామీజీని ఏమైనా సరే యిక్కడినుండి వెళ్ళనివ్వరాదని నిశ్చయించుకున్నారు. 'మన మంతా వారి చరణాలు పట్టి విడువవద్దు!' అనుకున్నారు. ఇలా అనుకొని శిష్యులందరూ స్వామిని చేరారు. అందులో శ్రీపతిరావు, బంకటాల్, తారాచంద్, మారుతీ ప్రముఖులు. అంతా వారి చరణాలపై బడి 'స్వామీ! మమ్మల్ని వదలి వేరే చోటుకు వెళ్ళే ఆలోచన చేయకండి! శేగాంవ్ లోనే మరే చోటైనా మీ యిష్టం వచ్చినచోట వుండండి! కానీ యీ గ్రామాన్ని మాత్రం వదలకండి!' అన్నారు ఒక్కుమ్మడిగా! దాని మీదట స్వామి "ఈ గ్రామంలో విభేదాలున్నాయి. ఒకటి దేశముఖ్ పక్షమైతే, రెండవది పాటిల్ పక్షం! కాబట్టి ఎవరిదీ కాని చోటు ఏదైతే వుంటుందో అలాటిచోటే వుంటాను! అప్పుడే నేనిక్కడ వుంటాను" అన్నారు. స్వామి కోరిక విచిత్రమైనది. అందుచేత అందరూ సందిగ్ధంలో పడ్డారు! స్వామి రెండు పక్షాల వారి మధ్యా వుండటానికి యిష్టపడటంలేదు. ఇక మిగిలింది ప్రభుత్వస్థలం! అదెందుకిస్తారు? మన యోగుల మహత్తు విదేశీప్రభుత్వానికెందుకు? స్వామీ! యీ విషయంపై మమ్మల్ని సంకటంలో పడేయవద్దు! మాలో ఎవరినుంచైనా సరే స్థలం అడగండి! మేం యివ్వటానికి సిద్ధంగా వున్నాం! విదేశీ ప్రభుత్వం మన ధర్మకార్యాలకోసం స్థలం యిస్తుందన్న నమ్మకం లేదు మాకు! అందుచేత మాలో ఎవరినుంచైనా సరే స్థలాన్ని స్వీకరించండి! మేం సిద్ధంగావున్నాం! అన్నాడు బంకట్ లాల్. "ఇదే నీ అజ్ఞానం! భూమికి యజమాని కేవలం ఆసచ్చిదానందుడే నేటి వరకు ఎందరో రాజా-మహారాజాలు వచ్చారు,పోయారు. కానీ ఆపాండురంగడే అమరుడు! అతడే యీ భూమికి యజమాని. లౌకికదృష్టిలో భూమి ఒకరినుంచి ఒకరికి మారుతూవుంటుంది. ఇదే లోకరీతి! కాబట్టి భూమి సంపాదించే ప్రయత్నం చేయండి!" అని నిర్ధారునితో ప్రయత్నించినట్లయితే భూమి తప్పకుండా లభిస్తుంది. దీన్ని గురించి ఇక మాట్లాడకండి. హరిపాటిల్ ప్రయత్నించినట్లయితే తప్పక యిందులో సఫలుడౌతాడు! అన్నారు. తరువాత అంతా హరిపాటిల్ దగ్గరకు వెళ్ళారు. అంతా ఆలోచించి భూమికోసం దరఖాస్తు చేశారు ప్రభుత్వానికి, 'బులాధానా' తహసిల్ యొక్క ప్రభుత్వ అధికారి పేరు 'కరీ'. అతడు గ్రామనివాసుల దరఖాస్తును పరిశీలించి, ఆలోచించి మఠంకోసం ఒక ఎకరం భూమిని యిప్పించాడు. దరఖాస్తు మంజూరు చేసేటప్పుడు "మీరు రెండెకరాలు అడిగారు. కానీ ఒక్క ఎకరమే యివ్వబడుతుంది. ఇచ్చిన భూమిని ఎలా వుపయోగిస్తారో చూచిన తరువాత మరో ఎకరం భూమిని యిస్తాను అన్నారు. అధికారి. ఈ ప్రభుత్వ ఆజ్ఞాపత్రం కార్యాలయంలో వుంది. ఈ విధంగా స్వామి యొక్క లోకోత్తర అమృతవాణి సత్యమే అయింది! తరువాత హరిపాటిల్, బంకట్ లాల్ మఠనిర్మాణానికి చందాలు వసూలు చేయటానికి బయలు దేరారు. ప్రజలను ప్రార్ధించారు. ద్రవ్య నిధి కొద్ది సమయంలోనే పొగైంది. పని ప్రారంభమైంది. దీని తరువాతి వృత్తాంతం ముందు అధ్యాయంలో వర్ణించబడుతుంది. సత్పురుషుల కోరికలను భగవంతుడే. స్వయంగా తీరుస్తాడు. 'డోంగర్ గాం నివాసి విరూపాటిల్, 'వాడేగాం నివాసి లక్ష్మణపాటిల్, శేగాంవ్ నివాసి జగుఆదా మొదలైనవారు చందాయిచ్చినవారిలో ప్రముఖులు! శ్రీదాసగణూ విరచితమైన శ్రీ గజానన విజయమనే యీ గ్రంథము ఆత్మ కల్యాణ సాధనకై సావధానచిత్తులై విందురుగాక!

|| శుభం భవతు ||
॥ శ్రీ హరి హరార్పణ మస్తు ॥
॥ ఇది ద్వాదశాధ్యాయము సంపూర్ణము ॥

యే మనుష్యః మాం ఆశ్రతః!
తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!