సర్వం శ్రీసాయి
శ్రీ గజనన విజయం
పదకొండవ అధ్యాయం pdf

గణేశాయనమః
హే ఓంకార స్వరూప పశుపతీ! భవాని వీర దక్షిణామూర్తి! బ్రహ్మాండంలో వున్న స్వరూపాలన్నీ నీ రూపాలే! నీ నిరాకార రూపమే వ్యాపక చరాచరాలన్నింటికీ ఆధారభూతమైనది. అదే ఆవిద్యారూపమైన మాయ, యీ ప్రకృతినంతా ఆవరించివుంటుంది. నీ నిరాకార స్వరూపాన్ని సామాన్యులు తెలుసుకోలేని కారణంగా నీవు సగుణరూపుడపై అవతరించాల్సి వచ్చింది. ఎవరికే రూపం యిష్టమైనదో అదే రూపానికి భక్తిశ్రద్ధలతో పూజాదులర్పిస్తున్నారు. ప్రజలు! నీకెన్నో పేర్లున్నా నీ అభిన్నత్వం అభిన్నమైనదే) శైవులు నిన్ను శివుడంటారు. వేదాంతలోకంలో నీవు బ్రహ్మగానే పరిచయమౌతావు! రామానుజులకు నీవు సీతాపతివి! వైష్ణవులకు నీవు విష్ణువు ! ఉపాసనా విధానాన్ననుసరించి నీకెన్నో పేర్లు పెట్టబడ్డాయి. కానీ సత్యమేమంటే నీవు అభిన్నరూపుడవై అందరి హృదయ కమలాలలోనూ పరమేశ్వరుడవై తిష్ఠవేసి కూర్చున్నావు. సోమనాధ్ లోని విశ్వేశ్వరుడవూ, హిమకేదారంలోని ఓంకారుడవూ, క్షిపాతటంలోని మహాకాలుడవూ యివన్నీ నీ అభిన్న స్వరూపాలే! వైద్యనాధ్ లో నీవు నాగరాజువు, వేళూరులో ఘృణేశ్వరుడవు. గోదావరీ తటాన నీవు త్ర్యంబకుడవనీ మొదలైన పేర్లతో అనేకచోట్ల అనేక రూపాలు నీకు. ఇక్కడి భీమా శంకరుడు, రామేశ్వరంలో మల్లికార్జునుడు, గోకర్ణరూప శంకరుడు, శింగణాపురంలోని మహాదేవుడు ఇలా ఎన్నో పేర్లతో నీవు పరిచితుడవు. అనేక పేర్లతో పిలువబడే శంకరుడవు, నీకు నా సాష్టాంగ నమస్కారం. హే! దీనబంధో! నాలోని త్రితాపాలను త్వరితగతిని నాశనం చెయ్యి. హే భగవాన్! నీవు కుబేరుణ్ణి క్షణకాలంలో ధనపతిని చేశావు. కానీ ఓ గిరిజాపతీ! నేనంటేనే నీకు సంకోచమెందుకు కలుగుతోంది? అస్తు!

బాలాపూర్ మరుసటి సంవత్సరం కూడా దాసనవమికి, స్వామి గజాననులు బాలకృష్ణుని ఇంటికి విచ్చేశారు. బాలకృష్ణుడూ, సుఖలాల్ వీరిద్దరూ స్వామికి అనన్య భక్తులు! భక్తి సాధనలో వీరితో సమానమైన వారెవరూ లేరు. ఒకసారి భాస్కర్ పాటిల్, బాలాభావు, పీతాంబర్, గణు, జగదేవ్, దిండోకార్ మొదలైన భక్తులు స్వామితో కూడా వున్నారు. దాసనవమి ఉత్సవం బ్రహ్మాండంగా ముగిసింది. కానీ భాస్కర్ పాటిల్ కు ఒక ఆపద వచ్చిపడింది. ఒక పిచ్చి కుక్క అతణ్ణి కరిచింది. అతడు పిచ్చివాడై పోతాడని భయపడ్డారు. లౌకిక ఉపాయాలన్నింటినీ చేశారు. ఎవరో డాక్టర్ని కూడా పిలువమన్నారు. భాస్కర్ పాటిల్ తనకు డాక్టర్లు వైద్యులూ అవసరంలేదన్నాడు. నాకు డాక్టరు ఒక్కరే! ఆయనే శ్రీగజానన స్వామి! వారి దగ్గరకే నన్ను తీసుకొని పొండి. వారికి జరిగినదంతా చెప్పండి. వారెలా.......

చెపితే అదే చేయండి. మీరు మీ యిష్టం వచ్చినట్టు చేయవద్దు అన్నాడు. భాస్కర్ పాటిల్ ని స్వామి దగ్గరకు తీసుకువచ్చారు. బాలాభావూ జరిగినదంతా విన్నవించాడు. ఇదంతా విన్న స్వామి నవ్వుతూ హత్య, వైదం, మృత్యువు వీటి నెవ్వరూ తప్పించలేరు. వీటి నుండి మొక్తికూడా వుండదు. సుఖఖాల్ దగ్గనున్న గోవు చెడు స్వభావాన్ని భాస్కరుడే శేగాంవ్ కి పంపాడు. దాని నిజస్వభావమే యిప్పుడు కుక్కరూపంలో వచ్చి బాష్కరుణ్ణి కరిచింది. గోవుని సాధువుగా చేయమని భాస్కరుడు నన్ను ప్రార్ధించాడు. ఎందుకో తెలుసా? దాని పాలు త్రాగటానికి, గోపు ఆశ్రయాన్ని ఆశించిన భాస్కరుడు స్వార్ధియే కదా! దాని పాలు త్రాగే సమయంలో ఎంతో సంతోషంగా వుండేదికదా! మరి ఆ స్వార్థానికి కలిగిన ఫలాన్ని అనుభవించటంలో వెనకా ముందాడటమెందుకు? అయివా నీ వయస్సును పెంచగలను. ఏమంటావు? వాస్తవానికి కుక్క కరవటం నిమిత్తమా! నిజానికి ఇతడి ఆయువు తీరిపోయింది. ఇక యీ ప్రపంచం వీడిపోవటమే మంచిది యిప్పుడు, అని స్వామి కొంచెం ముందుకొచ్చి భాస్కరునితో నీకిష్టమైతే నిన్ను రక్షిస్తాను. ఐనా అది ఆధారభూతమైన ఆయువే! ఈ ఆశాశ్వత ప్రపంచం అనే బజారులో జనన మరణాలను ఇచ్చిపుచ్చుకోవటం జరుగుతునే వుంటుంది. దీనికి భయపడటం ఎందుకు? నేటి పర్వంలాటిరోజు మళ్ళీ ఎప్పుడూ రాదు. మరి ఇప్పుడు నీ యిష్టాయిష్టాలు చెప్పు!" అన్నారు. భాస్కరుడు కొన్ని క్షణాలు మౌనం వహించాడు. 'స్వామీ! నేను అజ్ఞానిని నా మంచి చెడులేవో మీరెరుగుదురు కదా! కాబట్టి మీరేది సబబు అనుకుంటే అదే చేయండి. తుకారాముని ఒక పదంలో (ఆభంగ్) బాలుని మంచి చెడ్డలు తల్లికే తెలుసునన్నారు. స్వామీ! నేను మీ బిడ్డడినే! మరిక నే నేమని విన్నవించుకుంటాను? మీరు జ్ఞానసాగరులు సర్వజ్ఞులు అన్నాడు భాస్కరుడు. భాస్కరుని యీ సత్యవచనాలు వినిన స్వామి ఎంతో ఆనందించారు. సత్య నిష్టాగరిష్టులకు సత్యకథనం వంటి మహదానందం కాక మరేం కలుగుతుంది? స్వామికి దగ్గరలో నిలబడిన ఒక భక్తుడు 'స్వామీ! భాస్కరుడు మీ ప్రియభక్తుడు కదా! అతణ్ణి యీ ఆపదనుండి కాపాడండి!' అన్నారు "ఇలాటి మాటలు అనటమే అజ్ఞానం! అదే! పిచ్చివాళ్ళూ! జననమరణాలు మనం మనం కల్పించుకున్న భ్రాంతులే! ఎవరూ పుట్టేది లేదు గిట్టేదీ లేదు. శాస్త్రకారులు పరమార్థాన్ని తెలుసుకునే మార్గాన్ని చెప్పారే, దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించండి! దాన్ని గుర్తుంచుకొని మోహాన్ని విడిచి మారు మాట్లాడక ప్రారబ్దాన్ని అనుభవించాల్సిందే! సంచిత ప్రారబ్ధం,

కర్మఫలాన్ని అనుభవించకున్నట్లయితే యీ సంసారబంధంలో చిక్కుకున్న జీవులకు ముక్తి లభించటం అసంభవం! పూర్వజన్మలోని కర్మఫలాన్ని మరోజన్మలో అనుభవించక తప్పదు. ఇలాటి జనన మృత్యువులు మానవునికి ఎన్ని సార్లు కలుగుతాయో చెప్పటం అసంభవం! దానికి అంతంలేదు. భాస్కరుని పూర్వజన్మ సంచితం యిప్పటితో అంతమైపోయింది. ఇప్పుడితడు ముక్తుడై మోక్షాధికారి అయ్యాడు. అందుచే అతని ఆయువును పెంచమనే ప్రార్థన చేయకండి. ఇక భాస్కరుడు ముక్తుడవటంతో తిరిగి అతనికి జన్మవుండదు. పూర్వజన్మలోని వైరభావమే యీ కుక్కగా జన్మించింది. ఆది దాని పగ తీర్చుకుంది కూడా! ఇక పగ లేశమాత్రమైనా భాస్కరునిలో వున్నట్లయితే తిరిగి జన్మించాల్సి వస్తుంది. పూర్వజన్మ సంచితం పూర్తవటంతో ఇప్పుడు భాస్కరుడు ఉపాధి రహితుడయ్యాడు. సరే! ఇతనికి రెండునెలల ఆయువు పొడిగించి కుక్క విషాన్నుంచి ముక్తుణ్ణి చేస్తాను. శారీరక బాధలేకుండా వుంటాడు. రెండు నెలలు తరువాత భాస్కరుడు మోక్షాన్ని పొందుతాడు. ఇలా చేయనట్లయితే తిరిగి కేవలం రెండు నెలల కోసం తడు జన్మించాల్సి వస్తుంది అన్నారు స్వామీజీ. స్వామి మాటలెవరికీ రుచించలేదు. కానీ యీ హితబోధను విన్న బాలాభావు మాత్రం ఎంతో సంతోషించాడు. 'భాస్కర్! నీవు నిజంగా దేవుడవే! నీవు స్వామి సేవ చేయటంవలన నీకు జన్మ మరణాల నుంచి ముక్తి కలిగింది! నీ వెంతటి అదృష్ట వంతుడవో నేనెలా వర్ణించగలను? అన్నాడు.ఆనందంగా స్వామి తోడుగా వెళ్ళిన భక్తులూ తిరిగి శేగాంవ్ వచ్చేశారు. భాస్కరుడు అందరి భక్తులతోను మంచిగా మాట్లాడసాగాడు. బాలాపూర్ లో జరిగిన సంఘటనను శేగాంవ్ లో అందరికీ సవిస్తరంగా చెప్పసాగాడు. దానితో పాటుగా చేతులు జోడించి యిలా ప్రార్ధించేవాడు. స్వామి శేగాంవ్ విచ్చేయటం మనందరి అదృష్టం. ఈ విలువైన రత్నాన్ని చాలా జాగ్రత్తగానూ, ప్రాణప్రదంగాను కాపాడండి! వారెప్పుడూ తమ దివ్యరూపంతో ప్రజల సమ్ముఖంగా వుండేటట్లు వారి స్మృతి చిహ్నాన్ని (స్మారకం) నిర్మించండి! స్వామికి యిటువంటి చిహ్నం. అనవసరం. కానీ ముందు తరాల వారికి స్వామి యొక్క మహిములు తెలియటానికై ఇటువంటి స్మారకం చాలా అవసరం! ఆలంటి గ్రామంలో సంత్ జ్ఞానేశ్వరులకూ'. సజ్జనగర్ గ్రామంలో సమర్ధ రామదాసస్వామికి', దేహూ గ్రామంలో 'సంత్ తుకారాములకూ, పావన స్మారకమందిరాలు నెలకొల్పబడ్డాయి. వారి భక్తులంతా వారి గురుదేవుల సమాధులు నిర్మించి, స్మారక మందిరాలుగా ఏర్పాటు చేశారు. శేగాంవ్లోని ప్రజలు కూడా వారి...

ఆదర్శాన్ని అనుసరించాలి! అని ప్రతి భక్తునితోనూ యివే మాటలు పదే పదే చెపుతూ వుండేవాడు. కానీ ఒకరోజున చెప్పిన దానికి తలవూపటం, ఈ కొట్టటం లోకపురీతి. నే చెప్పేమాటల్ని కూడా వీరంతా అలాగే అంటూ చివరికి మరచిపోవచ్చు అనిపించింది. భాస్కరుడికి, అందుచేత భాస్కరుడు స్వామి మఠంలో లేనపుడు భక్తులందరినీ అక్కడ పోగుచేశాడు. అందులో బంకట్ లాల్, హరి పాటిల్, ఖండూజీ, దుకాణాన్ని నడిపించే అధికారి మారుతీ చంద్రభానుడు, శ్రీపతిరావు వావీకర్, తారాచంద్, సాహుకారు మొదలైన వారు చాలామంది వచ్చారు. వారందరిని చూసి భాస్కరుడు చేతులు జోడించి ఇక వారు యీ ప్రపంచంలో రెండే రెండు నెలలు వుండే అవకాశం కలిగింది. ఈ వర్హడ ప్రాంతంలోని శేగాంవ్ ని శ్రీస్వామి గజాననులకు ఒక దివ్యమైనది. భవ్యమైనది ఐన బ్రహ్మాండమైన స్మారకంగా తయారుచేయాలని కోరిక నా యీ కోరికను మన్నిస్తామని మాట యివ్వండి మీరంతా! నేను నిశ్చింతగా వైకుంఠానికి వెళ్ళిపోతాను. సిద్ధపురుషుల సేవ ఎన్నటికీ వృథా కాదు. భక్తుని కోరికలను తీర్చేది యీ మహాయోగులే! శ్రీ గజాననస్వామి యొక్క స్మారక మందిరం ఎలా వుండాలంటే చూచిన వారంతా మంత్రముగ్ధులూ, ఆశ్చర్య చకితులూ ఐపోవాలి! పాములవాని నాగస్వరాన్ని విన్న నాగరాజు ఎలా మంత్రముగ్ధుడౌతాడో, అలానే యీ గజాసన స్మారకమందిరాన్ని దర్శించిన వారు ఎట్టి నాస్తికులైనా భక్తిశ్రద్ధలతో మంత్రముగ్ధులైపోవాల్సిందే! అటువంటి బ్రహ్మాండమైన స్మారకాన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞ చెయ్యండి! ఇదే నా చివరి కోరిక మీరు మన్నించాల్సింది' అన్నాడు. అక్కడి కొచ్చినవారంతా సమ్మతించారు. ఇక బాస్కరుడు నిశ్చింతుడైపోయాడు. మనసులోని వ్యాకులం తొలగిపోయింది. మృత్యువంటే భయపడకుండా భాస్కరుడు రోజురోజుకీ ఉల్లాసంగా కనిపించసాగాడు. ముందు వచ్చే పండుగకోసం ఆరాటపడే పిల్లవాడిగా భాస్కరుడూ ఉల్లాసంగా వున్నాడు. మాఘపద్య త్రయోదశినాడు స్వామి భాస్కరుణ్ణి పిలిచి "శివరాత్రి పుణ్యదినానికి మనం త్ర్యంబకేశ్వరం వెడదాం. అది జాగృత జ్యోతిర్లింగం. ఆ త్ర్యంబకేశ్వరుడు భవభవాంతకుడు, భవానీ వరుడు గోదావరీతటాన వున్నాడు. ఆ జ్యోతిర్లింగం పాపాలను నాశనం. చేస్తుంది. ఆలస్యం చేయకక. గంగాస్నానానికి వెళ్ళివద్దాం. ఆరే! భాస్కర్ త్ర్యంబకేశ్వరంలో బ్రహ్మగిరి పర్వతమొకటుంది. అక్కడ అనేక ఔషధాలు. దొరుకుతాయి. ఆ బ్రహ్మగిరి పర్వతంపైనే గహనీనాధులు చిన్మయ రూపంలో వుంటున్నారు. వారు ఔషధాలన్నీ చక్కగా తెలిసినవారు. శ్వాస విషానికి

విరుగుడు ఔషధం అక్కడ లభిస్తుంది. కాబట్టి ఆ లాభాన్ని కూడా పొందుదాం" అన్నారు. దాని మీదట భాస్కరుడు విన్నమ్రుడై "స్వామీ! గురుదేవా! - ఔషధం దేనికి? మీ శక్తి అమోఘమైనది? దాని ముందు ఏ ఔషధి పనికొస్తుంది? మీ దయవలన ఆశ్వాన విషం ఆ బాలాపూర్ లోనే పోయింది. ఇక నాకు రెండునెలలే కదా వున్న సమయం? కాబట్టి నాకు శేగాంవ్ లోనే గడుపుదామని వుంది. మాకు మీరే త్ర్యంబకులు! మీ చరణాలే గోదావరినది. మీ చరణామృతమే మాకు గంగాస్నాన ఫలాన్నిస్తుంది. ఇక నాకు తీర్థక్షేత్రాల మహిమ ఎక్కడిది? అన్నాడు. అది వినిన స్వామిజీ స్మితవదనులై "బాస్కర్! నువ్వన్నది నిజమే! కానీ తీర్ధమహిమ చెప్పరానిది నీ యిష్టమేదైనా మనం తప్పకుండా త్ర్యంబకేశ్వరానికే వెడుతున్నాం. వెళ్ళటానికన్నీ సిద్ధంచెయ్యి, మనతో బాలాభావూ, పీతాంబరురూ కూడా వుంటారు' అన్నారు. వారంతా శేగాంవ్ నుంచి బయలు దేరి శివరాత్రికి త్ర్యంబకేశ్వరం చేరుకున్నారు. వారు కుశావర్తతీర్థంలో స్నానం చేసి శంకరుని దర్శించారు. గంగాద్వారానికి వెళ్ళి అక్కడ గౌతముని పూజించారు. నీలాంబికా మాతకు నమస్కరించి గహనీ నివృత్తి నాధుల సమాధులను దర్శించారు. తరువాత వారంతా 'గోపాల్ దాస స్వామిని' చూడటానికి 'నాసిక్ వెళ్ళారు. గోపాల్ దాసస్వామి పంచవటిలో కాలారాం' మందిరంలో సంకీర్తనం చేస్తున్నారు. 'కాలారాం' మందిరం ఎదురుగా ఒక రావిచెట్టు దానిక్రిందో అరుగూవున్నాయి. స్వామి తన భక్తులతో -సహా అక్కడ కూర్చున్నారు. స్వామి గజాననులు వచ్చారని విన్న గోపాల్ దాసస్వామి ఎంతో ఆనందభరితులయ్యారు. ప్రక్కనున్న భక్తులతో 'వర్హాడ' ప్రాంతం నుంచి నా బంధువు గజాననులు వచ్చారట! వారిని అనన్యభావంతో దర్శనం చేసుకొని నా తరపున యీ చక్కెర, నారికేళం సమర్పించండి. వారికి యీ హారాన్ని కూడా వేయండి. వారూ నేనూ ఒక్కటే. శరీరాలు వేరుగా వుండటం వలన వేరుగా కనిపిస్తున్నాము. కాబట్టి మమ్ములను వేరుగా జ
భావించకండి" అన్నారు. గోపాల్ దాసులు, వారెలా సెలవిచ్చారో అలానే భక్తులు చేశారు. వారు స్వామికి సాష్టాంగపడి, మెడలో హారంవేశారు. నారికేళం చక్కెర ప్రసాదం స్వామి ముందు వుంచారు. స్వామి భాస్కరుని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచమన్నారు. పంచే సమయంలో పొరపాటు జరగకుండా చూడమన్నారు. ఈ పంచవటిలో నా బంధువును కలుసుకున్నాను. ఇక్కడి పని పూర్తయింది. ఇక నాసిక్ లో ధూమల్ వకీలు యింటికి వెళ్ళాలి. శ్రీ గజాననులు నాసిక్ కి వచ్చారని తెలియగానే దర్శనార్దులు గుంపులు గుంపులుగా పొగయ్యారు. అక్కడ కొంతసేపు మాట్లాడారు. అవన్నీ

చెప్పటానికి గ్రంధవిస్తరణ భీతి చేత క్లుప్తంగానే చెప్పాను. దీనికై క్షమార్పుణ్ణి. నాసిక్ లో కొన్నాళ్ళు వుండి స్వామి తన భక్తులతో శేగాంవ్ తిరిగి వచ్చేశారు.స్వామీజీని 'అడ్ గాం' తీసుకొని వెళ్ళటానికై 'ఝ్యామాసింగ్' శేగాంవ్ కి వచ్చాడు. అతడు స్వామిని రమ్మని బహువిధాల ప్రార్ధించాడు. కాని స్వామి. రామనవమి తర్వాతే అక్కడికి వస్తామన్నారు. ఇప్పుడే తీసుకు వెళ్ళాలని పట్టుపట్టక వెళ్ళిపో. 'ఝ్యామాసింగ్' స్వామి యొక్క మహాభక్తుడు కాబట్టి ..స్వామి ఆజ్ఞను శిరసావహించి తిరిగి పోయాడు. తరువాత రామనవమి రోజున అతడు శేగాంవ్ కి వచ్చాడు. శేగాంవ్ లో జరిగిన ఆ వుత్సవాన్ని తిలకించాడు. తరువాత స్వామీజీని కొందరు శిష్యులతో బాటుగా హనుమజ్జయంతి వుత్సవం నాటికి ఝ్యామాసింగ్ అడగాం కి వచ్చి చేరాడు. స్వామీజీ అడగాంలో చాలా (చమత్కారాలు) విచిత్రాలు చూపారు. ఒకరోజు మధ్యాహ్నం స్వామీజీ భాస్కరుణ్ణి నేలపై ఎత్తి కుదేశారు. అతని ఛాతీమీద కూర్చొని పిడికిళ్ళతో కొట్టటం ప్రారంభించారు. అక్కడున్న వారంతా యీ తమాషాని చూస్తునే వున్నారు కానీ వారిని ఆపేధైర్యం ఎవరికీ లేకపోయింది. బాలాభావూ దగ్గరగానే వున్నాడు. అతడు వినయంతో సద్గురునాధా! ఇంక భాస్కరుణ్ణి విడిచి పెట్టండి. ఈ దెబ్బలకీ, యీ మండుటెండకీ అతడు బాగా విసిగిపోయాడు అన్నాడు. ఇది విన్న భాస్కరుడు "హే బంధూ! బాలాభావూ! నాకోసం స్వామిని ఆపవద్దు. స్వామి సాక్షాత్తు ఈశ్వరులే, వారు చేసేది చేయనీ! చూసే వారందరూ నన్ను కొడుతున్నా రనుకుంటున్నారు కదా! కానీ నాకు చక్కలిగింతలు పెట్టినట్లుంది" అన్నాడు. తరువాత. భాస్కరుణ్ణి తీసుకొని వారు విడిది చేసిన చోటికి వచ్చారు. స్వామి బాలాభావూతో భాస్కరునికి ఇక ఇహలోకాన్ని విడవటానికి రెండు రోజులు మాత్రమే మిగిలినాయి ఇతడు పంచమిరోజున వెళ్ళి పోతాడు అన్నారు. తన మనసులోని మర్మాన్ని ఇంకా ఇలాతెలిపారు. నేడు "భాస్కరుణ్ణి చితకకొట్టిన కారణం తెలుసా నీకు? శేగాంవ్ లో నిన్ను భాస్కరుడు గొడుగుతో నాచేత కొట్టించాడు. ఆవిషయం నీకు గుర్తుందా? భాస్కరుని ఆ పాపాన్నుంచి తప్పించటానికే నేను అతణ్ణి కొట్టాను. అతణ్ణి దండించటంలోని అంతర్యం మరేమీ కాదు" అన్నారు. హనుమజ్జయంతి వుత్సవం జరిగిన తరువాత ఆడగాంలో ఏం జరిగిందో ఆలకించండి! ఉత్సవం పూర్తయింది. వద్య పంచమినాడు స్వామి భాస్కరునితో "ఆరె! భాస్కర్ నేడు నీ ప్రయాణదినం! ఇక పూర్వాభిముఖుడవై పద్మాసనంవేసి కూర్చో! మనస్సును స్థిరంచేసి ఇష్టదైవాన్ని ధ్యానించుతూ వుండు, వెళ్ళవలసిన నిర్యాణ ఘడియలు

సమీపిస్తున్నాయి. ఇక చిత్రాన్ని ఏకాగ్రంచెయ్యి" అని మిగతా భక్తులతో మీరంతా "విఠల విఠల నారాయణ" అని పెద్దగా సంకీర్తనం చెయ్యండి. ఈ మీ సోదరుడు నేడు వైకుంఠానికి వెడుతున్నాడు. మీరు యితనికి హారం వేసి కుంకుమాదులు దిద్ది అతన్ని పూజించండి!" అన్నారు. భాస్కరుడు పద్మాసనం వేసి తన దృష్టిని నాసికాగ్రాన స్థిరంగా నిలిపారు. అలా చేయగానే అతనిలోని వృత్తులన్నీ అంతర్లీనమయ్యాయి. భక్తులంతా భాస్కరుని పూజించారు. మాలలు వేశారు. (ఆచీర్) భస్మాదుల తిలకం దిద్దారు. ఇదంతా స్వామీజీ దూరంనుంచే గమనిస్తున్నారు. స్వామి ఆజ్ఞామసారం భక్తులందరూ మధ్యాహ్నం వరకూ సంకీర్తనం చేస్తూనే వున్నారు. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. వెంటనే 'హరహర' అని నామోచ్చారణ పెద్దగా చేశారు. స్వామి. అదే సమయాన భాస్కరునిలోని 'ప్రాణపక్షి' ఎగిరిపోయింది. యోగులు ఎవరిని కనికరిస్తారో వారు హరికి అతిధులే అవుతారు కదా! భాస్కరుని అంత్య సంస్కారాలు చేయటానికి తరువాత సమాధి కట్టటానికి అతని శరీరాన్ని ఎక్కడ వుంచమంటారు అని స్వామిని అడిగారు భక్తులు. " ద్వారకేశ్వరంలో" పశుపతి సతీసమేతంగా వున్న చోటనే భాస్కరుని శరీరం వుంచాలన్నారు స్వామి. స్వామి ఆజ్ఞ అవగానే అరటిచెట్ల స్తంభాలు కట్టి విమానం తయారు చేశారు. అందులో బాస్కరుని కళేబరాన్నుంచారు. తరువాత భక్తులందరూ భజనలు చేస్తూ భాస్కరుని కళేబరాన్ని ద్వారకేశ్వరానికి తెచ్చారు. సమాధికోసం కావలసిన ధార్మిక విధి పూర్తయింది. "స్వామి ప్రియభక్తుడు మనల్ని వదలి వెళ్ళిపోయాడు" అన్నారు భక్తులు దుఃఖంతో రెండవనాడు సమాధి దగ్గర బీదలకు అన్న దానం జరిగింది. అడగారికి ఒక మైలు దూరంలోనే యీ 'ద్వారకేశ్వరం' వుంది. ఈ ప్రదేశం ఎంతో రమ్యంగా వుంటుంది. ముఖ్యంగా యిక్కడ చింతచెట్లు ఎక్కువగా వున్నాయి. వాటితో బాటుగా వేప, అశ్వత్థ, మందార, ఆమ్ర, వేట, ఔదుంబర (మేడిచెట్టు) వృక్షజాతులెన్నో వున్నాయి. ఇవిగాక కొన్ని పూలచెట్లూ, లతలూ మొదలైనవి కూడా వున్నాయి 'ద్వారకేశ్వరం' అడగాం అకోలాల మధ్యలో వుంది. ఇక్కడే భాస్కరుని సమాధి కట్టండి! పదిరోజులపాటు అన్నదానం జరుగుతూనే వుంది. దార్ణన వినండి. అన్నదానాన్ని 'సంత్ భండారా' (యోగి కూటమి) అంటారు. చింతచెట్ల క్రింద అంతా భోజనాలకు కూర్చునేవారు. అక్కడొక క్రొత్తసమస్య ఎదురైంది. అక్కడ ఎన్నో కాకులు కూడి అక్కడున్న వారిని సతాయించేవి! కాకి అరుపులతో విసుగెత్తి పోయారందరూ! ఒకప్పుడు పాత్రల్లోంచి ద్రోణుల నెత్తుకొనిపోయేవి. మరొకప్పుడు పైనుంచి క్రింద....

కూర్చున్నవారి మీద మలమూత్రాలు (రెట్టలు మొదలైనవి) విసర్జించేవి. అందుచేత భోజనం చేసేవారు విసిగిపోయి కాకుల్ని పారద్రోలటానికి ప్రయత్నించేవారు. భోజనం చేసేవాళ్ళలో కొందరు బిల్లులు కూడా వున్నారు. వాళ్ళు విల్లమ్ములు తెచ్చి వాటిని కొట్టడానికి బాణలు ఎక్కుపెట్టారు. ఇంతలోనే స్వామి వారిని అపుజేస్తూ "వీటిని కొట్టవద్దు ఇక్కడికి రావటంలో వాటి అపరాధమేమీ లేదు. ఈ భండారంలోని ప్రసాదం కొద్దిగా లభిస్తుందనే ఉద్దేశ్యంతోనే అవి వచ్చాయి. ఎందుచేతనంటే భాస్కరుడు తిన్నగా వైకుంఠలోకాన్నే చేరాడు. అతడు పితృలోకంలో ఆగలేదు !' పదిరోజుల వరకూ మృతిచెందినవాని. ఆత్మ అంతరాళంలో తిరుగుతూ వుంటుంది. పదకొండవనాడు 'బలిని' అర్పించిన తరువాత కాకులు ఆ పిండాన్ని ముట్టుకున్న తరువాతనే ఆత్మ ముందుకు వెడుతుంది. కానీ భాస్కరునికి పిండదానం అవసరం లేకపోయింది. తమ భాగం తమకు ముట్టనందుకు యీ కాకులన్నింటికీ కోపం కలిగింది! భాస్కరుని ఆత్మ ముక్తిని చెంది వైకుంఠలోకంలో అతిధి అయింది. కాబట్టి పితృలోకాలకుపిండడానం చేయనవసరం లేక పోయింది. తిన్న గా ముక్తిని పొందనివానికే పిండదానం చేయాల్సి వుంటుంది. దాని కోసం కాకులు ఎదురు చూస్తూవుంటాయి. భాస్కరుడు తిన్నగా వైకుంఠానికి వెళ్ళాడు. భండారాన్నుంచి కొద్ది ప్రసాదం లభిస్తుందనే వుద్దేశ్యంతో కాకులు యిక్కడికి వచ్చి వుంటాయి. మీరు వాటిని చంపకండి నేనే వాటికి నచ్చజెపుతాను అని "ఓ కాకుల్లారా! నా మాట నాలకించండి. రేపటి నుంచి యిటురాకండి) లేకుంటే భాస్కరుని కారణంగా నేను అప్రతిష్ఠపాలౌతాను. నేడు ప్రసాదం తిని తృప్తిపొందండి. కానీ రేపటినుంచీ రావద్దు' అన్నారు. భక్తులందరూ స్వామి వాక్కులమీద విశ్వాసముంచారు. కుత్సితులూ, దుష్టులూ విశ్వసించలేదు సరికదా నవ్వటం ప్రారంభించారు. "స్వామి మాటలన్నీ వట్టి బూటకాలు, వ్యర్ధమూను. పక్షులెప్పుడైనా మనుష్యుల మాటలు వింటాయా? దీని విషయం రేపు వచ్చి చూద్దాం: ఈ స్వామిలాంటి పిచ్చివాళ్ళు ఏదో ఒకటి వాగుతూ భక్తులందరినీ తమ వశం చేసుకుంటారు. మరి యీ భక్తులు కూడా వారి గుణగానం చేస్తూనే వుంటారు. పత్యమైనదేదో అదే చెప్పాలి. జీర్ణమయ్యేదే తినాలి. నిజంగా లేనిదాన్ని గురించి భ్రమ కలిగించటం వ్యర్ధం" అని ఒకరితో ఒకరు అనుకోసాగారు ప్రత్యక్ష ప్రమాణం కోసం మరునాడు యీ కుత్సతులంతా వచ్చారు చూడటానికి కానీ నామమాత్రానికైన ఒక్క కాకి కన్పిస్తే ఒట్టు! ఈ విచిత్రాన్ని చూసి వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్య పడటమే.......

కాకుండా తమ అవిశ్వాస ప్రవృత్తికి సిగ్గుపడ్డారు. పధ్నాలుగు రోజులూ పూర్తయిన తరువాత స్వామిజీ తమ శిష్యగణంతో సహా శేగాంవ్ కి తిరిగి వెళ్ళిపోయారు. ఓ శ్రోతలారా! షేగాంవ్ లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అది ఏకాగ్రచిత్తులై వినండి ఆ రోజుల్లో కరువొచ్చింది. అంతట కరువు బాధితులకోసం నూతులు త్రవ్వే పని జరుగుతుంది. బావుల్ని త్రవ్వి, త్రవ్వి, లోతు చేస్తున్నారు. ఒకచోట త్రవ్వినాగాని నీరు పడలేదు కానీ నల్ల -శానపురాయి పడింది. పలుగు పని ఆగిపోయింది. తరువాత పలుగుతో నాలుగుచోట్ల కన్నాలు చేసి అందులో తుపాకిమందు దట్టించబడింది. ఒత్తులుకూడా సరిగానే పెట్టబడ్డాయి. దానికి నిప్పుకూడా అంటించారు. కానీ ఎంతసేపైనా తుపాకిమందు పేలలేదు. క్రిందనున్న నీరు, రాయి అడ్డం రావటం వల్ల పైకి రాలేకపోతోంది. మందుకీ ఒత్తికీ మధ్య ఏదో అడ్డుపడింది. "లోపలికి దిగి ఆ వత్తుల్ని సరిచేయకపోతే మందుకునీరు తగిలి ఎందుకూ పనికిరాకుండా పోతుంది మరి! కానీ యీ ప్రమాదకరమైన పని నెవరు చేస్తారు? వత్తిని సరిచేయగానే మందు పేలితే, నీటిబుగ్గపైకి చిమ్మితే దిగినవాడు. బ్రతకటం ఆసంభవం!" అనుకున్నాడు మేస్త్రీ. కానీ 'గణూ జవర్యా' అనే ఒక బీదకూలీమీద దృష్టిపడింది. వాళ్ల ఆపని చేయమని ఆజ్ఞాపించాడు.మేస్త్రీ బీదవాడు కదా! చెప్పినపని చెయ్యక ఏంచేయగలడు? 'గణూ' మెల్లిమెల్లిగా నూతిలోనికి దిగి ఆ మందు పెట్టిన గొట్టాన్ని (సురంగ్) కదిపాడు. కదపటమే తడవుగా వెంటనే అది అంటుకుని మంట లోపలికి పోయి ఆ 'సురంగా పెద్దపెట్టున పేలిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన "గణూ" స్వామి! గజాననుల మహాభక్తుడవటం వలన వారిని మనసారా స్మరిస్తూ ప్రక్కనున్న కన్నంలో దూరాడు అవకాశం చూసుకుని ఆ సురంగం ప్రేలిన మోతనిని | రాళ్ళు రప్పలూ బయటికి ఎగిరివచ్చి పడినట్టుగా 'గణ' శవం కూడా ఎక్కడో వడి వుంటుందనుకున్నారు.మేస్త్రీ మరి ఇతరులూను. లోపలికి చూస్తేఏమీ కనపడనంత పొగ గణూ తప్పక మరణించి వుంటాడు. వాడి శవం ఇక్కడెక్కడో పడివుంటుంది వెతకండి అన్నాడు మేస్త్రీ. మేస్త్రీ మాటలు విన్నగణూ 'మేస్త్రీ ! గణూ మరణించలేదు. నూతిలో బ్రతికే వున్నాడు. స్వామిజీ దయ వలన నేను రక్షించబడ్డాను. గుహలోపల సురక్షితంగా వున్నాను. ఈ గుహ ఒక రాయిచేత కప్పబడి పోయింది. అందుచేత నేను బయటికి రాజాలను" అన్నాడు. గణూ అన్న మాటలు విని అంతా ఎంతో ఆనందించారు. కొందరు లోపలికి దిగి అడ్డుపడిన రాతిని తొలగించి గణూని పైకి తీశారు. బయటకు వస్తూనే, గణూ స్వామి దర్శనానికై పరిగెత్తిపోయాడు. గణూని

చూస్తూనే స్వామి గణ్యా! కందకంలో కూర్చొని ఎన్ని రాళ్లు పేల్చావు? అందులోని ఆ పెద్దరాయి కందకానికి అడ్డుకుంటలవల్లనే నువ్వు బయటపడ్డావు. కానీ యిలాంటి పనులు ముందెప్పుడూ చేయకూడదని గుర్తుంచుకో నిప్పుతో చెలగాటం ప్రాణసంకటం కదా? అనే విషయాన్ని మరచిపోకు, ఇక వెళ్ళు! నీకొచ్చిన పీడ తొలగిపోయింది" అని మందలించారు. గణుని చూడటానికి గ్రామవాసులంతా అక్కడికి వచ్చారు.గణూ తన మనసులోని మాటని చెపుతూ "సురంగం ప్రేలినపుడు మీరేకదా నన్ను చేతబట్టి ఆ కందకంలో కూర్చోబెట్టింది? అందువల్లనే కదా నేను బ్రతికి బయటపడింది? లేకుంటే మీ చరణాలు దర్శించటానికి రాగలిగేవాడినా? హే! గురునాధా! మీ దయలేకపోయినట్లయితే నేనెప్పుడో ఆ నూతిలో పడిచచ్చిపోయేవాణ్ణి" అన్నాడు. ఈ విధంగా శ్రీ గజానన మహారాజుల యొక్క కృపామహిమ అతర్క్యమైనది. దీనిని చక్కగా సెలవీయటం నా తరం. కాదు మరి! శ్రీదాసగణూ విరచితమైన యీ శ్రీగజానన విజయమనే గ్రంధం పఠించే పాఠకులకు ఆహ్లాదాన్ని ప్రసాదించుగాక! అని దాసగణు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు..

౹౹శుభం భవతు౹౹

|| శ్రీ హరి హరార్పణమస్తు ॥

॥ ఇది ఏకాదశాధ్యాయము సమాప్తము౹౹


యే మనుష్యః మాం ఆశ్రతః!
తాన్ సర్వేస్యః కర్మ వినాశనః