శ్రీ గజనన విజయం

* పదవ అధ్యాయం*

 

సర్వం శ్రీసాయి

శ్రీ గజనన విజయం

* పదవ అధ్యాయం*

గణేశాయనమః

 

నిరాకార అవ్యక్త పూర్ణబ్రహ్మవౌ పండరీరాయా! నిన్ను శరణుజొచ్చిన, నన్ను అనాదను చేయకు. భగవాన్ ! యీ దాసగణుని పరాయివానిగా ఎంచుకు! హే నారాయణా! నా పాపాలను నీ మనసునందుంచుకోకు నాచే ఎట్టి పుణ్య కార్యము కాలేదని నాకు బాగా తెలుసు. అంతేకాదు నా ముఖాన్ని నీకు చూపదగిన వాణ్ణి కూడా కాను, ఇంతైనా, హే నాథా! నన్ను దయ జూడుము. కాలవలోని నీరు మురికిదైనా గోదావరీ నది తనలోనే కలుపు కుంటుంది కదా! అలానే నన్ను మన్నించి నాపై దయజూపవే! నా పాపాలన్నిటినీ క్షాళనంచేసి నన్ను దుఃఖాన్నుంచి ముక్తుణ్ణి చేయవే! నీవు తలచితే కానిదేముంది? నీ దయ కలిగితే బిచ్చగాడు కూడా రాజు కాడే! ఆస్తు!

 

ఒకరోజు పుణ్యరాశియైన శ్రీస్వామీజీ అమరావతిలో ని ఆత్మారాం బికాజీ యింటిలో మకాం పెట్టారు. ఆత్మారాముడు అమరావతీ ప్రాంతానికి అధికారి! అధికారి కాబట్టి చేత సత్తా కూడా వుంది. ఇతడు కాయస్థ జాతికి చెందిన ప్రభువు. ఇతడు సదాచార సంపన్నుడూ, గృహస్థాశ్రమాన్ని స్వీకరించినప్పటికీ, సాధువులూ యోగులూ అంటే చాలా అభిమాన మర్యాదలు కలవాడు. శ్రీగజాననులు అతని యింటికి రాగానే యధోచితంగా స్వాగతం పలికి సత్కరించాడు. అతడు స్వామికి రకరకాల నలుగులు పెట్టి వేడినీటితో మంగళస్నానం చేయించాడు. యోగి సహ వాసము, సేవతో అతడెంతో మురిసిపోయాడు. పెద్ద అంచుల ధోవతిని కట్టబెట్టాడు. ఫాలభాగాన కేసరి తిలకం దిద్దాడు. మెడలో పుష్పమాల వేశాడు. రకరకాల నైవేద్యం ముందుంచి నూరు రూపాయల దక్షిణ కూడా వుంచాడు! ధూపదీపాల హారతులెత్తాడు. పుష్పాంజలి సమర్పించాడు. స్వామికి జరిగే యీ పూజోత్సవాన్ని తిలకించటానికి అమరావతిలోని నివాసులంతా వచ్చారు. స్వామి ప్రసన్న ముద్రను గమనించిన వారంతా, స్వామి మా యింటికి కూడా వస్తే యిలానే పూజాధికాలు చేద్దాం. అనుకున్నారు. అలాటి కోరికైతే అందరికీ మనస్సులో వుంది కానీ అందరి కోరికా తీరవచ్చూ? అదృష్టవంతుడెవడో వారింటనే మహాత్ముల పాదధూళి పడుతుంది! మహాయోగులు అంతర్జానులే కదా! స్వామి తమ యింటికి రావాలని ఎవరు ఎక్కువగా కోరుకుంటున్నారో వారింటికే వెళ్ళారు స్వామి! అమరావతిలో గణేశ్ శ్రీకృష్ణ ఖాపర్డే అనే ఒక సజ్జనుడున్నాడు. గృహస్ధుది న్యాయవాద వృత్తి, తన బుద్ధి చాతుర్యంతో బోలెడు ధనాన్ని సంపాదించాడు. వర్హడా ప్రాంతంలో అతడు 'దాదాసాహెబ్' అని ప్రఖ్యాతి గాంచాడు. సజ్జనుడూ భావుకుడూను. ఇతడు శుక్ల యజుర్వేద....

 

బ్రాహ్మణుడు. ఇతడు స్వామీజీవి తమ యింటికి రమ్మని ఆహ్వానించగా స్వామి దయచేశారు. ఇతని యింట కూడా స్వామికి షోడశోపచార పూజలు చేయబడ్డాయి. అమరావతిలోనే గణేశ్ అప్పా అనే ఒక లింగాయతు వుండేవాడు. అతని భార్య చంద్రాబాయి. ఆమె శ్రద్ధాభక్తులు కలిగిన అంతఃకరణ కలది. చంద్రాబాయి స్వామిని మన యింటికి తీసుకొని రండి అని తన భర్తతో అన్నది. మన యింటికి రమ్మని ప్రార్ధించండి. స్వామి భక్తులకు కల్పవృక్షం వంటివారు కాబట్టి వారి పాద ధూళి మనింట పడితే మనకు శుభమౌతుంది" అంది. స్వామిని మనింటికి తీసుకొనిరావటం అంత తేలికైనపనా? నువ్వో పిచ్చిదానివిలాగా వున్నావు? వారు రావటానికి తగిన సిఫారసు కావలసి వుంటుంది. దాదాసాహెబ్ గారి ఇంటికే అతి కష్టం మీద వచ్చారు స్వామి. కాబట్టి స్వామిని మన యింటికి తీసుకురమ్మని పట్టుపట్టకు!" గణేష్ అప్పా భార్యని మందలించాడు. అది విన్న చంద్రాబాయి మీ రన్నదానికి నేను సమ్మతించను! నా యిష్ట దేవత, స్వామి తప్పక వేంచేస్తారని చెబుతోంది. కాబట్టి వారిని తమ పాదధూళిని మన యింట విడువమని ప్రార్ధించండి! యతీశ్వరుల కృపాదృష్టి పేదలపైనే విశేషంగా వుంటుందట! అంది. అప్పా బయటికైతే వచ్చాడు కానీ స్వామిని తమ యింటికి పిలవటానికి ధైర్యం చేయలేకపోయాడు. స్వామి యెదుట అతడు మౌనంగా కూర్చుండి పోయాడు. స్వామి అతని మనసులోని మాట నెరిగి, అతని చెయ్యి పట్టుకొని 'అరె అప్పాజీ! ఇక్కడికి మీ యిల్లెంత దూరం? మీ యింటికొచ్చి కొంచెం తడవు వుందామని వుంది! మనసులో వున్నది స్పష్టంగా చెప్పేయాలి! మనసులోని మాటను మనలోనే దాచి పెట్టుకోవటం మంచిదికాదు అన్నారు. స్వామీజీ తన కోరిక తెలుసుకున్నారని, తెలుసుకున్న అప్పాజీ సంతోషానికి మేరలేకపోయింది. ఆనందాతిరేశంలో అతని నోటి నుంచి ఒక్క మాటకూడా పెగల్లేదు. అప్పాజీ శ్రీస్వామీజీని తోడుకొని -యింటికొచ్చాడు. పతి పత్నులిద్దరూ స్వామిని పూజించారు. దక్షిణ రూపంలో తమకున్న దంతా స్వామి చరణాలపై ధారపోశారు. మంచిదే! విధమైన ఆదర సత్కారాలు స్వామికి అమరావతిలో ఎన్నో చోట్ల జరిగాయి. ప్రతిచోట పూజాదికాలు జరిగే సమయాన ఒక సజ్జనుడు హాజరయ్యేవాడు. అతడు ఆత్మారాం బికాజీకి మేనల్లుడౌతాడు. అతడు బొంబాయిలో పనిచేస్తుండేవాడు. సెలవు పెట్టి తన మేనమామను చూడటానికి అమరావతి వచ్చాడు. అతని పేరు బాలాభావు, స్వామి గజాననుల ప్రభావం చూసి వారిపై అతని మనసు లగ్నమైనట్లుంది. వారి మహిమ చూసి యిలాటి సాధువు

 

చెంతవుండి వారి సేవ చేసుకుంటే బాగుణ్ణు అనుకున్నారు. ప్రపంచం అంతా అశాశ్వతమైనదే! దీన్ని పట్టుకొని వ్రేలాడటం వ్యర్ధం! నేటివరకూ యీ బరువు బాధ్యతలన్నీ మోస్తూ వచ్చాను. ఇంక యీ సంసారంనుంచి తప్పుకోవటమే మంచిదనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఐనదంతా బ్రహ్మార్పణంచేసి యిక స్వామి శ్రీచరణాలను వదలను. అమృతం చేతికొస్తే విషాన్నెవడు త్రాగుతాడు? అని నిశ్చయించుకొని ప్రతి పూజా కార్యక్రమానికి హాజరవుతూ వచ్చారు. స్వామీజీ కొన్నాళ్ళకు శేగాంవ్ తిరిగి వచ్చారు. ఈసారి తోటలో వుండకుండా 'మోటే మందిరం' (అంజనేయస్వామి (గుడిలో) లోకి వచ్చారు. గుడికి తూర్పుగా ఒక ఖాళీ స్థలం వుంది. శ్రీ గజాననులు అక్కడే వుండటానికి నిశ్చయించుకున్నారు. స్వామీజీ తోట విడిచి గుడిలో వుండటానికి వెళ్ళారని కృష్ణాజి పాటిల్ విన్నాడు వెంటనే అతడు అక్కడికి వచ్చాడు. స్వామి ముందు సాష్టాంగపడి తలవంచుకొని కూర్చున్నాడు. కన్నులవెంట ధారా ప్రవాహంగా కన్నీళ్ళు కారుతూ వుంటే అతని చొక్కా అంతా తడిసి ముద్దయింది. స్థితిని చూసి స్వామి "అరే! కృష్ణా ఎందుకు కన్నీళ్ళు" దీనికి కారణం ఏమిటీ? నాకు కొంచెమైనా చెప్పవయ్యా!" అని అన్నారు. పాటిల్ చేతులు జోడించి వినమ్రుడై "స్వామీ! మీరు తోటనెందుకు విడిచారు? నేనేం తప్పు చేశాను? నేను మీ బిడ్డనే కదా! స్థలం దేశముఖ్ వాళ్ళ మనిషిది. కాబట్టి మీరిక్కడ వుండటం ఉచితం కాదు. మీరు ఒక వేళ తోటలో వుండనంటే నా యిల్లే ఖాళీచేసి యిస్తాను స్వామీ! నా సర్వస్వం మీరే కదా!" అన్నారు. విషయం తెలిసిన పాటిల్ కుటుంబం వారందరూ అక్కడికే వచ్చేశారు. హరి నారాయణులు కూడా స్వామిని ఇంటికి విచ్చేయమని ప్రార్ధించారు. ఇదంతా వినిన స్వామి "నేనిక్కడ వుండటంలోనే మీ అందరి మంచి వుంది. ఇక్కడికి రావటంలోని అంతర్యం తర్వాత తెలుస్తుందిలే! దీన్ని గురించి విచారించకండి. స్థల ప్రభావం వలన మీ మధ్యనున్న అంతఃకలహాలు సమసిపోతాయి! లోకంలోని జమీందారులందరూ విషయాన్ని లోతుగా ఆలోచించరు. భవిష్యత్తును గురించి ఆలోచన చేయలేక పోవటమే వారిలోని లోపం! వెళ్ళండి! వెళ్ళి బంకట్ లాల్ ని వెంటనే యిక్కడికి తీసుకొనిరండి. నేనతని యింటిని విడిచినపుడు అతడు కోపగించలేదు. ఎందుకలా చేయలేదు! దీని కారణాన్ని అతన్నే అడగండి. నా దయా దాక్షిణ్యాలు మీ అందరి పైనా వున్నాయి! అవెప్పుడూ సన్నగిల్లవని నమ్మండి!' అన్నారు. ఇంతలోనే బంకటాల్ అక్కడికి రానే వచ్చాడు. "స్వామి కోరికకు విరుద్ధంగా వారిని తోటకు

 

తీసుకొని వెళ్ళకండి. మా యింటినుండి వెళ్ళిపోయినప్పుడూ నేనేమీ చేయలేకపోయాను వారిని వెళ్ళనిచ్చాను కదా! చివరికి అందరం వారి బిడ్డల కదా! అందరం వారికి సమానులమే!" అని వారందరికి హితవు చెప్పాడు బంకటాల్. సఖారాం అసోల్ కర్ ఒక మంచి సజ్జన గృహస్తు, స్వామికి యీ స్థలాన్నివ్వటానికి అతడు నిరాకరించలేదు. స్థలం అతడు ఇస్తాడు. మిగతా ఏర్పాట్లు మనం చేద్దాం. దీంతో దీనిలో సాయపడే అవకాశం లభిస్తుంది. అని సలహా యిచ్చాడు కూడా. చివరికి అంతా కలిసి మఠాన్ని నిర్మించారు. అందులో పరశురాం సావజీది ఎక్కువ పాలు, ఇప్పుడు స్వామితోబాటుగా భాస్కర్, బాలాభావూ, పీతాంబర్ మరి గణేశ్ అప్పా (అమరావతి) అనే నలుగురు భక్తులూ ఒకరికొకరు తీసిపోనివారుగా వుంటున్నారు. రామచంద్ర గురువ కూడా వీరితో వుండేవాడు. వీరంతా స్వామి యొక్క పంచపాండవులా అనిపించేవారు. స్వామి సాంగత్యంలో బాలాభావూ భౌతిక ప్రపంచం నుండి విరక్తి కలిగినవాడయ్యాడు. ఇంటికి రమ్మని అతనికి పిలుపులొచ్చేవి కానీ అతడు మాత్రం ధ్యాసకే పోయేవాడు కాడు. ఇతని యీ స్వభావం చూసి భాస్కరుడు 'స్వామీ! బాలాబావూ మిఠాయిలు రుచి మరిగాడు. అందుకే వాడు ఇంటికి పోనంటాడు. వీణ్ణి చితకబాదండి. అప్పుడే వాడు ఇంటికి వెడతాడు. వీడు నేతిని చూశాడు కానీ దండాన్ని చూడలేదు. కాబట్టే వాడిక్కడినుండి వెళ్ళదలచుకోలేదు. వజ్రపాతానికి పెద్ద పెద్ద పర్వతాలు కూడ కదిలిపోతాయి కదా!" అన్నాడు. స్వామికి తెలియకుండానే భాస్కరుడు బాలాబావుని మఠం బయటకు పంపేశాడు. కానీ బాలాభావు చేస్తున్న వుద్యోగానికి రాజీనామా చేసి మళ్ళీ వచ్చాడు. శేగాంవ్ లో తిరిగి బాలాబావూని చూసి భాస్కరుడు మండి పడుతూ "ఏరా! మాటిమాటికీ వచ్చి మమ్మల్ని సతాయిస్తున్నావు? ఎన్ని సార్లు దెబ్బలు తిన్నా పచ్చి గడ్డిని చూసి ఎద్దు మళ్ళీ మళ్ళీ అటే వస్తూ వస్తూ వుంటుంది. నీపరిస్థితి అలానే వుందే! సంసారంనుంచి పూర్తిగా విరక్తుడైనవాడికే యిక్కడ స్థానం తెలుసా? అని ధిక్కరించాడు. బాస్కరుని అహంకారపు మాటలు స్వామిని బాధించాయి. ఇతని అహంకారాన్ని పోగొట్టటానికి ఒక చమత్కారం చేశారు. ఒక సజ్జనుడి చేతిలోని గొడుగును తీసుకొని బాలాభావూని అదేపనిగా బాదటం మొదలు పెట్టారు. గట్టిగా బాదటంవల్ల గొడుగు కాస్తా విరిగిపోయింది. ఐనా వదలకుండా, ఒక గట్టి గడకర్రని తీసుకొని బాలాభాపూని చితక బాదటం ప్రారంభించారు.ఇది చూసిన భయస్తులు మఠంనుంచి దౌడుతీశారు. బాలాభావూ మాత్రం అవిచలుడుగా స్వామి ముందే పడివున్నాడు.

 

దెబ్బలకు వాడు చచ్చిపోయే వుంటాడన్నారెవరో! బాలాభావు స్థితిని చూసిన భాస్కరుడు కూడా చాలా విచారించాడు. కానీ అతదేమీ అనలేక పాయాడు. ఎందుకంటే తాను రగిల్చిన మంటేగా యిది? దేనితో కొడుతున్నారో కర్ర కూడా విరిగిపోయింది. అందుచేత స్వామీజీ బాలాబాపూని కాళ్ళతో తొక్కటం ప్రారంభించారు, కుమ్మరి మట్టిని తొక్కినట్టు దృశ్యాన్ని చూస్తున్న శిష్యులంతా అటూ ఇటూ పరిగెత్తసాగారు. కొందరు స్వామి ప్రియభక్తుల్ని పిలవటానికి పరిగెత్తారు. సమాచారం అందటంతోనే బంకటాల్ మఠానికొచ్చి చూశాడు. స్వామిని ఆపటానికి ఎవరికి ధైర్యం. లేకపోయింది. చివరికి బంకటాల్ 'స్వామీ! బాలాభావూ మీ భక్తుడే! ఇంక కొట్టటం ఆపేయండి స్వామీ!" అన్నాడు. బంకటాలాల్ మాటలు విని స్వామీజీ నవ్వటం మొదలు పెట్టి "అలాటి అసంగతమైన మాటలు మాట్లాడకండి. నేనేమీ బాలాభావుని కొట్టలేదు, త్రొక్కలేదు కొంచెం అతనివైపు జాగ్రత్తగా చూడు తెలుస్తుంది!" అని స్వామి బాలాభావూతో వత్సా! లే! లేచి నీ శరీరం చూపించు వీళ్ళకి!' అన్నారు. ఆజ్ఞ అవగానే బాలాభావా లేచి నిలబడి వాళ్ళ ముందుకి వెళ్ళి నిలబడ్డాడు. వారంతా అతని శరీరాన్ని పరికించారు. ఆశ్చర్యం! బాలాభావూ వంటిమీద దెబ్బలు తిన్నట్టుగా ఒక్క గుర్తుకూడా లేదు. అతడు నిజవృత్తి (అంతరవృత్తి)లో తదాకారంతో లీనమైవున్నాడు. బాలాభావూలో ఎంతటి విరక్తత వుందో, అతని స్తోమత. స్థితిగతులేమిటో భాస్కరుడు స్వయంగా చూసి తెలుసుకున్నాడు. అతడు సిగ్గుపడి పోయి నాటినుండే బాలాభావూని ఆటపట్టించటం మానేశాడు. సంఘటనని చూచిన వారంతా ఆశ్చర్యపడి ఔరా! అనుకున్నారు.

 

  బాలాపూర్లోని సుకలాల్ అగ్రవాల్ అనే ఒక సజ్జనుడుండేవాడు. అతనింటిలో ఒక చెడుస్వభావం కలిగిన ఆవు వుండేది. ఊరంతా యిష్టం వచ్చినట్లు తిరిగేది. గ్రామంలో పిల్లా పెద్దా అనే విచక్షణ లేకుండా అందర్నీ కాళ్ళతో తొక్కేసేది. బలవంతులైతే వాళ్ళని కొమ్ములతో పాడిచేది, ఏదో ఒక దుకాణంలోకి వెళ్ళి ధనియాలసంచిలో ముట్టే పెట్టి కడుపునిండా తినేది.. మిగిలినవన్నీ చిందరవందరగా చేసి పోతూండేది. నూనె నేతుల డబ్బాలన్నింటినీ కొమ్ములతో పడగొట్టేది, కుప్పలన్నింటినీ త్రొక్కెది త్రాటితో కట్టినట్లయితే దాన్ని తెంపుకునేది. చాలా గొలుసుల్ని కూడా త్రెంపి పారేసింది. గ్రామ ప్రజలందరికీ అది ఆవుగా కాక పెద్దపులే అనిపించేది! ప్రజలని యిలా సతాయించటం వలన వాళ్ళంతా దాంతో విసిగిపోయారు. అది యీనని కారణంగా పాలుకూడా యిచ్చేది కాదు. దాన్ని కట్టేసి వుంచటం ఒక

 

పెద్ద సమస్య యింది. ఊరివారంతా 'దీన్ని కసాయి వాడికన్నా యివ్వు లేదా నువ్వే తుపాకీతో కాల్చిపారెయ్యి' అని సలహా కూడా యిచ్చారు. 'మీరే దీన్ని ఏదో విధంగా చంపేయండి నాకేమి అభ్యంతరంలేదు అన్నాడు సుకులాల్. ఒక రోజు ఒక పఠాన్ దానిని తుపాకీతో కాల్చటానికి ప్రయత్నించాడు. గురి చూసి కాల్చబోతున్నారు. ఇంతలో దానికెలా తెల్సిందో అది తన కొమ్ములతో పఠానుని ఎత్తి క్రింద పారేసింది. మరో రోజు సుకలాల్ పొరుగూరిలో దాన్ని విడిచి వచ్చాడు. కానీ కొద్ది సేపట్లోనే అది బాలాపూర్ లో కనిపించింది. ఇలాటి స్థితిలో దాన్నేం చేయాలి? ఇవన్నీ విన్న వారెవరో ఒక సలహా యిచ్చారు. గోవిందబువా గారి గుఱ్ఱాన్ని స్వామి గజాననులు సరియైన మార్గంలో పెట్టారట! కాబట్టి నువుకూడా దీన్ని శేగాంవ్ తీసుకొని వెళ్ళి స్వామికి దానం చెయ్యి ఒకే ఉపాయానికి రెండు పన్లూ ఔతాయి. సాధువుకి గోవును దానంచేస్తే పుణ్యానికి పుణ్యమూ వస్తుంది. యీ ఆవు పీడా విరగడౌతుంది' అన్నారు. ఆలోచన అందరికి నచ్చింది. ఆవుని శేగాంవ్ కి తీసుకొని వెళ్ళటానికే నిశ్చయం జరిగింది, కానీ ఆవుని ఎలా పట్టుకోవాలి? అనేదే పెద్ద సమస్య అయింది. దాన్ని పట్టుకుంటానికెన్నో ప్రయత్నాలు జరిగినాయి. కానీ అన్ని వృథాయే అయినాయి. చివరికి పది పన్నెండుమంది బోలెడు దాణా చూపించి దాన్ని పురివేసి పట్టుకున్నారు. తాళ్ళతోటి గొలుసులతోటీ బంధించారు. దీనికోసం ఒక ఎద్దుబండి సిద్దంచేసి అందులో దీన్ని శేగాంవ్ తీసుకొని వెడుతున్నారు. శేగాంవ్ దగ్గరౌతున్న కొద్దీ దాని స్వభావంలో ఎంతో మార్పు రాసాగింది. శేగాంవ్ లో స్వామి ఎదుట దాన్ని నిలబెట్టినపుడు అది ఎంతో మంచిదిగా సాధువుగా కనిపించింది. దాని కళ్ళ వెంబడి నీరు కారటం ప్రారంభించింది. దాని దీన స్థితిని చూసిన స్వామీజీ "గోవులాంటి సాధువువా నానా బాధలూ పెట్టేది? ఇది మంచిదికాదు. దీన్నెంత దీనావస్థకు గురిచేశారు మీరు? నాలుగు కాళ్యూ కట్టేశారా! మెళ్ళో యినపగొలుసు వేశారా! కొమ్ములకు కూడా తాళ్ళు కట్టి నానా అవస్థా పెడుతున్నారా? ఇంత ఏర్పాటు ఏదైనా ఆడసింహానికి తగింది కానీ గోవులాటి సాధు జంతువునాయిలా కట్టి తీసుకురావటం? ఏమీ బాగుండలేదు. ! బంధువులారా! గోవు ప్రపంచానికే మాత అన్న విషయం తెలియదా? అటువంటి దాన్ని యిట్టి దుస్థితికి తేవటం సహించరాని విషయం. దాన్ని వెంటనే విడిపించండి! ఇప్పుడదేమీ ప్రమాదాన్ని తెచ్చి పెట్టదు' అని కోప్పడ్డారు. ఐనా భయంకొద్దీ దాన్ని విడిపించటాని కెవరికి ధైర్యం చాలలేదు! ప్రతివాడూ ఒకొక్క అడుగే వెనక్కి వేయటం ప్రారంభించాడు. ఇది

 

చూసిన స్వామీజీ తమ స్వహస్తాలతో గోమాతని బంధవిముక్తురాలిని చేశారు. గోవు బండిని దిగి క్రిందికి వచ్చింది. దిగగానే స్వామికి నమస్కరించటానికి తన రెండు కాళ్ళూ ముందుకు చాపింది. తరువాత శిరస్సు క్రిందకు వంచి స్వామికి మూడుసార్లు ప్రదక్షిణలు చేసి వారి పాదాలు నాకసాగింది. సంఘటనని గ్రామప్రజలంతా తమ కళ్ళతో చూశారు. దీనిని వర్ణించటం ఆది శేషునికి కూడా అసంభవమే! స్వామీజీ తరువాత గోమాతతో " గోమాతా! ఇక నుంచి ఎవరిని సతాయించవద్దు! మఠాన్ని విడిచి మరెక్కడికీ పోవద్దు" అన్నారు. చమత్కృతికి ప్రభావితులైన ప్రజలందరూ స్వామీజీకి జయజయకారాలు చేశారు. బాలాపూర్ ప్రజలు వారి వూరు చేరారు. గోవు శేగాంవ్ మఠంలో వుండిపోయింది. నాటినుండీ దానిని త్రాడుతో కట్టేపనే లేకపోయింది. మంచి గోవులకుండే సద్గుణాలన్నీ దానిలో వచ్చాయి. గొపుకు పుట్టిన సంతతి నేడు కూడా శేగాంవ్ లో వున్నాయి. శాస్త్రాల్లో స్వానుభవానికి సంబంధించిన విషయాలు వ్రాయబడినాయి. అవన్నీ ప్రత్యక్ష అనుభవాలుగా శేగాంవ్ లో అనుభవానికి వస్తాయి.

 

 'కారంజ్' లో అనే గ్రామంలో లక్ష్మణఘడే అనే ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతడు ధనికుడు, సజ్జనుడు. అతనికి కడుపునొప్పి రావటం ప్రారంభమైంది. అతడెన్నో వుపచారాలు చేశాడు. కానీ లాభం లేకపోయింది. కడుపు నొప్పి తగ్గటంకోసం ఎంతో ధనం కూడా వెచ్చించాడు. అతడు లోకులద్వారా స్వామిని గురించి విన్నాడు. చివరికి పత్నితో కలిసి శేగాంవ్ కి వచ్చాడు. రోగం వల్ల బలహీనుడై నడవలేకపోయేవాడు. అతణ్ణి ఇద్దరు ముగ్గురు పట్టి మఠంలోనికి తెచ్చారు. అతడెంత బలహీనుడయ్యాడంటే స్వామికి చేతులెత్తి నమస్కారం కూడా చేయలేకపోయాడు. భర్త బదులు భార్యయే స్వామికి సమస్కరించింది. "హే! దయాఘనా! ప్రభూ! నన్ను మీ పెంపుడు కూతురనుకొని నా పతి కడుపునొప్పి పోగొట్టి యీయనకు ప్రాణభిక్ష పెట్టండి! అమృతం యొక్క దర్శనం అయిన తరువాత మృత్యువెలా వస్తుంది? నన్ను అఖండ సౌభాగ్యవతిని కమ్మని ఆశీర్వదించండి. యిదే నా ప్రార్ధన " అని వేడుకుంది. సమయాన స్వామీజీ మామిడిపండు భుజిస్తున్నారు. దాన్నే లక్ష్మణకాంతవైపు విసిరేశారు. "దాన్ని అతనిచేత తినిపించు అంతా సర్దుకుంటుంది! నీవు నిజంగానే ఇతనికి అర్ధయుక్తమైన ధర్మపత్నివి నీ సేవలవలనే యితడు వ్యాధి ముక్తుడౌతాడు!" అని ఇంకేమీ మాట్లాడకుండా స్వామి 'గంజా' త్రాగటం ప్రారంభించారు. లక్ష్మణపత్ని స్వామి యింకేమైనా సెలవిస్తారేమోనని అక్కడ నిలబడే వుంది. అందుచే భాస్కర్ పాటిల్

 

ఆమెతో "సోదరీ! ఇక మీరిక్కడ వుండవద్దు. మీ పతిని తీసుకొని 'కారంజా' వెళ్ళిరండి.స్వామిచేత యివ్వబడిన మామిడిపండు ప్రసాదాన్నే వారిచేత తినిపించండి దాన్ని తినగానే లక్ష్మణుడు రోగముక్తుడౌతాడు!" అన్నాడు. ధర్మపత్ని తన పతితోసహా 'కారంజా' తిరిగి వచ్చేసింది. పతికి మామిడిపండు ప్రసాదాన్ని తినటానికి యిచ్చింది కూడా! ఇద్దరూ తిరిగి రావటం చూసిన వాళ్ళంతా శేగాంవ్ లో ఏమైంది? అని అడిగారు. పత్ని అక్కడి సమాచారం. అంతా పూస గుచ్చినట్లు చెప్పి, స్వామి వారిచ్చిన మామిడిపండును పతికి తినిటానికిచ్చానంది. అది విన్న వైద్యునికి ఇది సరిగా జరగలేదనిపించింది. ఆయన "సోదరీ! మీ రెంత పొరపాటు చేశారో తెలుసా! మామిడి పండు కడుపు రోగాలకు అపథ్యం! 'మాధవ నిదానం'లోను, 'సుశ్రుతం'లోనూ ఇదే చెప్పబడింది. 'నిగంటూ' మరి 'శారంగధరుడూ' కూడా ఇదే గట్టిగా వక్కాణించారు. స్వామి యిచ్చిన ప్రసాదాన్ని మీరు తిని వుండాల్సింది బాగుండేది. మీరు అర్ధాంగి కాబట్టి మీ వారికి తప్పకదాని ఫలితం కలిగేది" అన్నారు. వైద్యుని యీ మాటలు విని బంధువులంతా భయపడ్డారు. పత్ని వలన జరిగిన తప్పిదానికి బంధువులంతా ఆమెను నానా దుర్భాషలాడసాగారు. కానీ, ప్రభు కృపవలన మామిడిపండు తింటే అపథ్యం కాక రోగి ఆశ్చర్యజనకంగా కోలుకోవటం మొదలు పెట్టాడు. అకస్మాత్తుగా నీళ్ళ విరేచనాలవటం ప్రారంభమైంది. కొంత సేపటికి మలం అంతా బయటకు పోయి అతని కడుపు మెత్తబడి సహజంగా తయారైంది. విరేచనాలతో అతని జబ్బు అంతా పానే పోయింది. క్రమక్రమంగా లక్ష్మణుని ఆరోగ్యం అంతా కుదుటబడింది. మెల్లిగా ఆరోగ్యవంతుడయ్యాడు. మానవ ప్రయత్నం ప్రకృతికి లోబడే ఫలిస్తుంది, కాని అంతకు మించికాదు. కానీ భగవత్కృప, సిద్ధయోగుల కృష్ణ కలిగినట్లయితే కానిపనైనా సులభంగా అయిపోతుంది! ఇందులో ఏమాత్రం సంశయంలేదు! లక్ష్మణుడు ఆరోగ్యవంతుడైన వెంటనే శేగాంవ్ వచ్చాడు.. స్వామికి ప్రణామంచేసి "స్వామీ మీ పాదధూళిచేత నా గృహాన్ని పావనం చేయుడని ప్రార్ధన మిమ్మల్ని వెంట కొనిపోవటానికే వచ్చాను. కాదని నన్ను క్షుద్రుణ్ని చేయకండి" అంటూ లక్ష్మణుడు పరిపరివిధాల వేడుకున్నాడు స్వామిని, చివరికి స్వామీజీ శంకర్ 'భావూ' పీతాంబరులతో 'కారంజా' వెళ్ళారు. అక్కడ లక్ష్మణుడు యధాశక్తి స్వామికి పూజలుచేసి తన సంపదంతా మీదేనన్నాడు. అంతలోనే సర్దుకుని మీకు దానమివ్వటానికి నేనెవరిని? నౌకరెప్పుడైనా యజమానికి దానమివ్వగలడా?" అన్నాడు. కొద్దిసేపైన తరువాత ఒక పళ్ళెంలో కొన్ని రూపాయలుంచి స్వామి కెదుట వుంచాడు. పళ్ళెం

 

ముందుండటం గమనించి స్వామి "అరే! ఒకవైపు నాదేమీ లేదంటున్నావు? మరి యీ రూకలెక్కడివి? చెప్పేదొకటి చేసేదొకటినా? అలా ఎందుకు చేస్తున్నావు? తినే పళ్ళూ, చూపే పళ్ళూ వేరువేరా? ఇలాటి ప్రవర్తన ఏమీ నచ్చలేదు. మంచిదికాదు కూడా! నీకున్నదంత నాకర్పించావన్నావు కదా! తాళాలన్నీ తీసేసి రోడ్డున పారేయి! నీ ఖజానాకున్న తలుపులు తెరు. లక్ష్మణుడు ఏమీ మాట్లాడలేదు. మౌనంగా కూర్చున్నాడు. కానీ స్వామీజీ మాత్రం ఖజానా తలుపులు తెరిచేంతవరకూ ఊరుకోలేదు. చివరికి లక్ష్మణుడు వివశుడై తలుపులు తెరవాల్సి వచ్చింది. కానీ ఖజానా వున్న దర్వాజా దగ్గర తానే కూర్చున్నాడు. అక్కడ కూర్చొని "స్వామీ! రండీ! ఎంతైనా తీసుకెళ్లండి!" అన్నాడే కానీ మనస్సులో మాత్రం యివ్వాలని లేదు. ఇది స్వామీజీ వెంటనే గ్రహించారు. ఇది వట్టి అభినయం మాత్రమే! ఇవ్వాలని ఏమాత్రమూ లేదు. కపటనాటకం ఆడితే ఎన్నాళ్ళు దాగుతుంది? కాకరకాయ చూడటానికి చాలా అందంగా వుంటుంది కాని తింటే ఎంత చేదుగా వుంటుంది. లక్ష్మణుని యీ ప్రవర్తనకి స్వామిజీ చాలా కోపించారు. డాంభికుల ఇంట యోగులకు తృప్తి ఎలా కలుగుతుంది? నిజానికి స్వామీజీకి అతడి నుండి ఒక్క పైసా కూడా అక్కరలేదు ఆయనకు అవసరమే లేదు. వారు వైరాగ్య సాగరులే కదా! కానీ నోటి నుండి వచ్చిన మాటనే పరీక్షిస్తున్నారు? అతడు అబద్దం చెప్తున్నాడని. ఇక అక్కడినుండి బయలుదేరి కోపంతో వెళ్ళిపోయారు స్వామీజీ! వెడుతూ వెడుతూ "నాది నాది అంటున్నావు కదా! దాని ఫలితాన్ని అనుభవించు!. ఇక దీనికై నేనేమీ చేయను. నీపై దయతలచి నీ సంపత్తిని ద్విగుణీకృతం చేయడానికే వచ్చానిక్కడికి. కానీ నీ దౌర్భాగ్యం వలన నువ్వు కాలదన్నుకున్నావు" అన్నాడు. తరువాత స్వామీజీ అన్నట్లే జరిగింది. ఆరు నెలల్లోనే మొత్తం సంపదంతా వూడ్చి పెట్టుకుపోయింది. అతడు నిర్ధనుడైచివరికి రోజు కూటికోసం జోలె పట్టవలసిన స్థితికి వచ్చాడు. హే! శ్రోతలారా పరమార్ధం విషయంలో కవటం ఎప్పుడూ పనికిరాదని చెప్పటానికే యీ లీలని చూపించారు స్వామి శ్రీగజానన చింతామణికి చెకుముకి రాయివలన శోభ చేకూరుతుందా? లేక బంగారపు అలంకారాల బదులు సీపపు ఆభూషణాలతో వస్తుందా? స్వస్తిశ్రీ దాసాగణు విరచితమైన శ్రీగజానన విజయమును యీ గ్రంథము భక్తుల కల్యాణార్ధం పఠించబడుగాక!

 

శుభం భవతు || శ్రీ హరి హరార్పణమస్తు. ||

౹౹ఇది దశమోధ్యాయము. సమాప్తము౹౹

యే మనుష్యః మాం ఆశ్రతః!

తాన్ సర్వేస్యః కర్మ వినాశనః

 

 

© Copyright Sarvam Sree Sai Seva Trust