సర్వం శ్రీసాయి
శ్రీ గోదావరి మాత చరిత్ర
8వ అధ్యాయం

1956వ సంవత్సరం మాఘమాసంలో శ్రీ గోదావరిమాతాజీ ఉమరేఠ్ లో గణేశయజ్ఞం చేసారు. యజమాని డా. జయశంకరపొండే ముగాలే అన్ని ఏర్పాట్లు చేసారు. పాండేయ గారు శ్రీ ఉపాసని మహారాజు గారి గొప్ప భక్తులు; సాకోరి ఆశ్రమం పైన అపారమైన గౌరవాభిమానములు కలవారు. శ్రీ ఉపాసనీ బాబావారు ప్రదర్శించిన చమత్కారలీలలు ఆయనకు అనుభవంలో ఉన్నయి. ఆయన కాలేజీ విద్యార్థిగా ఉన్న ప్పుడే క్షయగ్రస్తుడై బాబావారి ఆజ్ఞానుసారం కొన్ని మాసాలు సాకోరి ఆశ్రమంలో ఉండి కేవలం విభూతితీర్థములతోనే ఆరోగ్యవంతుడైనాడు.

ఒకసారి ఉపాసనీ మహారాజు తమ ప్రసంగంలో విభూతి మాహాత్మ్యాన్ని ఈ విధంగా వర్ణించినాడు.

""పండరీపురం విఠోబా ప్రసాదం బుక్కా, ఖండోబా ప్రసాదం బండారు, అమ్మవారి ప్రసాదం పసుపుకుంకుమలు, ఎటువంటివో సాధుసంతుల విభూతి కూడ అటువంటి మహిమ గలది. ఎవరైనా వ్యక్తి తన ఇష్టదైవాన్ని తలచుకొని విశ్వాసంతో తన నొసట విభూతి ధరిస్తాడో ఆ దైవం అతని హృదయంలో నిత్య నివాసం చేస్తాడనేది సిద్ధాంతం.

మత్స్యేంద్రనాథుడు, ఇతర యోగులు, ఇంకా సాయిబాబావంటి సత్పురుషులు ఆయాదేవతల అనుగ్రహాన్ని యాచిస్తూ ఒక పద్దతి ప్రకారం ఎట్లాగైతే ఊదీ (విభూతి) తమ స్వహస్తాలతో చేసేవారో, నేనుకూడ ఆ పద్దతి ప్రకారమే


నా చేతులతో ఊదీ తయారు చేస్తాను ఎవరికైనా, ఎటువంటి సంకటాలైనా, ఈ ఊదీ మూలంగా తొలగిపోటాయి. ఇది చాలామందికి అనుభవం కూడ. అందుకే వారు ఇక్కడినుండి ఊదీ తీసుకొనిపోతారు. మరికొందరు ఔషధానికి మారుగా ఊదీ సేవించి రోగాలు నయం చేసుకున్నారు. అక్కడికి వచ్చే డాక్టర్లు, వైద్యులు దీని తామిచ్చే మందులలో కలిపి రోగులకు ఇస్తుంటారు. అటువంటివారు రోగ విముక్తులైన అనేకోదాహరణ వున్నాయి."

డా. పాండేయగారు శ్రీ ఉపాసనీబాబాకు శ్రీ గోదావరి మాతాజీకి అభేదం పాటిస్తారు. ఆయనకు ఉపాసనీ మహారాజు మీద ఎంత విశ్వాసమో శ్రీగోదావరిమాతాజీమీద కూడ అంత పరిపూర్ణ విశ్వాసం కుదిరింది. కనుకనే 1955లో ఆయనకు వచ్చిన క్యాన్సర్ రోగం కేవలం శ్రీ గోదావరిమాతాజీ కృపాకటాక్షం మూలంగా మటుమాయమై పోయింది. అందువలన ఆయన మరికొంత కాలం బ్రతికారు.

డా. పాండేయగారికి గణపతి ఇష్టదైవం కనుక చాలాకాలంగా గణపతి యజ్ఞం చేయాలని అనుకుంటున్నారు. శ్రీ గోదావరిమాతాజీ అనుగ్రహంవలన ఆయన కోరిక నెరవేరింది. యజ్ఞం 14 ఫిబ్రవరినాడు ప్రారంభమైనది. కన్యకల పవిత్ర హస్తాలతో మోదకాలు (ఉండ్రాళ్ళు) మంత్ర పూర్వకంగా, యజ్ఞ పురుషునికి ఆహుతి చేసారు. హంసదేవ మహారాజువంటి మహానుభావులు యజ్ఞం దర్శించటానికి వచ్చారు. మంత్ర ఘోషలతో వాతావరణం నిండిపోయింది. 25 ఫిబ్రవరి నాడు పూర్ణాహుతి జరిగింది. వేలకొలది భక్తులు యజ్ఞం దర్శించినవారి మనసుల్లో దృశ్యం స్థాయిగా నిలిచిపోయింది.

ఆ సంవత్సరమే శ్రీ గోదావరిమాతాజీ వేసవి గడపటానికి కొందరు కన్యకలను తీసుకొని మహాబళేశ్వరం వెళ్ళిరు. శ్రీమతి చంపాబెన్ నవలాబీ శ్రీ గోదావరిమాతాజీ వసతి కోసం ఒక బంగ్లా అద్దెకు తీసుకొని తగిన ఏర్పాట్లు చేసినారు.అప్పుడే శ్రీ గోదావరి మాతాజీ మహాబళేశ్వర దేవాలయం, 17వ శతాబ్ది మహాయోగి శ్రీ రామదాస స్వామివారి నివాసం సజ్జనగడ్, శివాజీ మహారాజు చరిత్రతో సంబంధమున్న ప్రతాపగడ్, స్థానిక ప్రాధాన్యమున్న వాయీ వంటి ఇతర స్థలాలు చూచారు. ఈ సమయంలోనే శ్రీ చున్నీలాల్ మెహ్తాదంపతులు, కురుంద్వాడి రాణి, బోర్ సంస్థానపు రాజదంపతులు "సివిలిజేషన్ అండ్ కెయాస్" రచయిత్రి కుమారి ఐరీన్ మొదలైనవారు శ్రీగోదావరిమాతాజీ దర్శనార్థం వచ్చారు.

ఆ రోజులలో జరిగిన ఒక విచిత్రలీల చెప్పుకోదగినది ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం కుమారి ఉషా టిఫ్ణిస్ శ్రీ గోదావరి మాతాజీకి శ్రీ రామకృష్ణ పరమహంస జీవితచరిత్రం "హృత్పద్మ" గ్రంథం చదివి వినిపించేది. మూడు నాలుగు రోజులు ఇలా పారాయణం జరిగిన తరువాత ఉషకు శ్రీ గోదావరి మాతాజీ మాటలలోను శ్రీ రామకృష్ణ పరమహంస మాటలలోను సామ్యం ఉన్నట్లు స్ఫురించినది. శ్రీగోదావరి మాతాజీ ప్రతిరోజు ఉదయం దేనిగురించైనా ప్రసంగిస్తే అవే మాటలు మధ్యా హ్నం గ్రంథ పారాయణంలో శ్రీ రామకృష్ణ పరమహంస నోట వినిపించేవి. అటువంటివి రెండు ఉదాహరణలు.

శ్రీ గోదావరి మాతాజీకి తమ చేతులారా ఏదైనా తినుబండారం చేసి అందరికి తిని పించటం చాలా యిష్టం. సాయంకాలం చంపాబెన్ ఏదో వంటకం సిద్ధం చేస్తుంటే శ్రీ గోదావరి మాతాజీ సహాయం చేయబోయారు. కాని చంపాబెన్ తదితర కన్యకలు శ్రీ గోదావరి మాతాజీని పని చేయనీయలేదు. తామంతా ఉండగా శ్రీ గోదావరి మాతాజీకి ఆ కష్టం ఎందుకని వాళ్ళు అందుకంగీకరించలేదు. శ్రీ గోదావరిమాతాజి నిరాశచెంది, "ఏదైనా తినుబండారం నా చేతులతో చేసి అందరికీ తినిపించాలెనని అనుకున్నారు. కాని నన్నెవరూ చేయనీయరు, ఏం చేసేది?" అన్నారు. ఆనాడే శ్రీ రామకృష్ణ పరమ హంస జీవిత చరిత్ర భాగం పారాయణం చేస్తుంటే ఆ గ్రంథంలో శ్రీ రామకృష్ణ పరమహంస కాళీమాతతో ఇవే మాటలంటారు. "అమ్మా! మంచివంట చేసి, అందరికీ తినిపించాలెనని నా కోరిక, కాని నన్ను ఎవరూ ఏమీ చేయనీయరు.. ఏం చేయను?”. ఒకనాడు శ్రీ గోదావరిమాతాజీ ప్రసంగవశాత్తు "నేనేమీ చదువుకున్నదాన్ని కాదు ఇతరులకెలా బోధించను?" అన్నారు. ఆనాడు మధ్యాహ్నం గ్రంథ పారాయణం చేస్తుంటే రామకృష్ణ పరమహంస తమ శిష్యులతో "నేనేమీ చదువు కోలేదు. నేను ఏమి సంభాషించేది? ఏమి బోధించేది?" అన్న మాటలు వచ్చాయి.

ఒక రోజు ఉదయం శ్రీ గోదావరిమాతాజీ నిద్ర లేచి "ప్రతిరోజు చేసినపనే ఎందుకు చేయాలె? స్నానం, భోజనం, జనులతో మాట్లాడం, వాళ్ళకష్టాలు వినటం రోజూ చేసే పని.. విసుగు పుడుతున్నది" అంటూ మరల నిద్రపోయాడు. అ రోజు పారాయణంలో శ్రీ రామకృష్ణ పరమహంస కాళీమాతతో "రోజు చేసిన పనే ఎందుకు చేయాలి. స్నానం భోజనం స్నానం భోజనం రోజు ఇదే పని. నాకు విసుగ్గా ఉంది" అన్నమాటలు దొరలినవి. ఈ యిరువురు మహానుభావుల మాటలలోని పోలికల వెనుక ఉన్న రహస్యం పాఠకులు గ్రహించగలరు.

1956వ సంవత్సరమే జులై నెలలో సాకోరి ఆశ్రమంలో కన్యాకుమారి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. మందిరం చిన్నదైనా ఉత్తర దక్షిణ భారతీయ శిల్పరీతుల సుందరసమ్మేళనంగా ఉంటుంది శ్రీ ఉపాసనీ షహారాజుల వృద్ధభక్తుడైన శ్రీ రైసీమిస్త్రీ ఈ మందిరం నిర్మించినారు. ఉత్సవం 18 జులై నాడు ప్రారంభమై 20 నాడు ముగిసింది. జరుగవలసిన విధి విధానమంతా శ్రీగోదావరిమాతాజీ మార్గదర్శనంలోనే జరిగింది. 19నాడు జలాధివాసం జరిగింది. ఇందుకోసం గంగా యమునా నర్మదా తపతీ గోదావర్యాది పవిత్ర జలాలు తెచ్చినారు. ఆనాడే మంగళ ద్రవ్యవిధి కూడ జరిగింది. 19 నాడే గోపుర కలశాన్ని పవిత్రజలాలతో అభిషేకించినారు. 20నాడు విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. కుమారికుల పూజనం జరిపి వారికి భోజనాలు నూతన వస్త్రాలు పెట్టారు. 21 నాడు శ్రీగోదావరిమాతాజీ కన్యకలూ కలిసి సప్తశతి పారాయణం చేసినారు. కన్యాకుమారి విగ్రహం మేలరమయిన పాలరాతితో చాలా సుందరంగా నయ నాభిరామంగా చెక్కినారు శిల్పి జయపురం వాస్తవ్యుడు. ఈ మందిరం కన్య కలకు శాశ్వత స్మృతిచిహ్నం.

11 మందిర నిర్మాణం పూర్తి ఐనతరువాత యశోదాతాయి ఆస్థికలు ఇక్కడే భద్రపరచటం జరిగింది. శ్రీ ఉపాసనీ మహారాజులచేత దీక్ష పొందిన ఆ పరమ భక్తురాలు 1953లో గురువు పాదాలలో కలిసిపోయింది. దేహం చాలించేముందు భగవద్గీత 15 అధ్యాయం చదివి 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అంటూ ప్రాణాలు విడిచిన ధన్యాత్మ ఆమె. ఆమె పోవటంతో కన్యాకుమారి సంస్థానం నుండి ఒక దేదీప్యమానమైన నక్షత్రం రాలిపోయినట్లయింది. ఆమె తరువాత ముక్తాబాయి 1965లో దేహయాత్ర చాలించినది. ఆమెకూడ శ్రీ ఉపాసనీ మహా రాజులచేత దీక్ష పొందినవారే. స్నేహము త్యాగము మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆమెది. సంస్థాన కార్యకలాపాలు బాగా ప్రచారం కావటంకోసం అహరహమూ శ్రమించిన కష్టజీవి ఆమె. మొగ్గ బాగా వికసించి తన సుగంధాలు దశదిశలా వ్యాపించకుండానే రాలిపోయినట్లు ఆమె అకాలమృత్యువు పాలైనది. అటుతరువాత శ్రీ ఉపాసనీ మహారాజులచేత దీక్ష పొందిన మరొక కన్య తారాబాయి 1974లో తమ 70వ ఏట తనువు చాలించింది. దైహికంగా ఆమె పంగువైనా తన పని తానే చేసుకుంటూ, నిత్యం పూలు కోసి తెచ్చి దేవతార్చన చేస్తూ, ఉపాసనీ మహారాజుల ప్రవచనాలు శ్రద్దగా చదువుతూ, కష్టమయ జీవితాన్ని సంతృప్తిగా గడిపిన ధన్యాత్మ ఆమె.


రెయాన్ కార్పొరేషన్ ఆధిపతి జీవన్లాల్ సేఠ్ గారి ఆహ్వానం పురస్క రించుకొని శ్రీ గోదావరి మాతాజీ కల్యాణ్ లో 1957వ సంవత్సరంలో ఒక గొప్ప యాగం. చేసారు. ఆశ్రమం కన్యకలను తీసునిపోయి శ్రీ గోదావరి మాతాజీ అక్కడ అక్టోబరు 27వ తేదీ రోజున సహస్ర చండీయాగం ప్రారంభించి నవంబరు 11వ తేదీ రోజున పూర్ణాహుతి చేసారు. ఈ యాగం కర్మాగారం ఆవరణంలోనే జరిగింది. ఆవరణంలో సుందరమైన యజ్ఞమండపం నిర్మించి మండపం మధ్యలో యజ్ఞ కుండము నిర్మించి కుండానికి వెనుక పశ్చిమాభిముఖంగా చండికా ప్రతిష్టపానము చేసారు సూరతునుండి సుప్రసిద్ధయోగి శ్రీ హంసదేవ్ గారు విచ్చేసారు. యజ్ఞ మహత్వాన్ని వివరిస్తూ శ్రీ గంగేశ్వరానందులు శ్రీ సర్వానందులు గొప్ప ఉపన్యాసాలు చేసారు. ముంబయ్ థానా పరిసరప్రాంతాలనుండి యజ్ఞం దర్శించటానికి శతాధికంగా భక్తులు వచ్చారు.

ఇక్కడ జీవనలాల్ సేక్ మనుమరాలు సూర్యబాల అనుభవాలు చెప్పుకో దగినవి సూర్యబాల శ్రీ గోదావరిమాతాజీని దర్శించటం ఇదే మొదటిసారి. శ్రీ గోదావరి మాతాజీ దివ్యసౌందర్యం చూచి ఆమె మంత్రముగ్ధురాలై నట్లు మైమరచిపోయింది. శ్రీ గోదావరి మాతాజీ ఫోటోలు వివిధ భంగిమల్లో తీయటానికి ప్రయత్నించింది. శ్రీ గోదావరి మాతాజీ, తమ ఫోటోలు తీయటం ఇష్టపడరు కనుక సూర్యబాల ప్రయత్నానికి వైముఖ్యం కనబరి చారు. సూర్యబాల తాను తీసిన ఫోటో ఫిల్మ్ లు కడిగి చూస్తే ఒక్క ఫోటో కూడా సరిగా రాలేదు పాపం ఆమెకు నిరాశ కలిగింది. తాను చేసిన ప్రయత్నమంతా విఫలమై పోయినందుకు ఆమె బాధ పడింది. శ్రీ గోదావరి మాతాజీని తనకు మంచి చిత్రాలు రావలెనని దీనంగా ప్రార్థించింది. శ్రీ గోదావరిమాతాజీకీ ఎప్పటివలె సమ్మతినిస్తూ తల ఊపారు. సూర్యబాలకు సంతోషం కలిగింది అటు తరువాత ఆమె తీసిన ఫోటోలన్నీ చాలా బాగా వచ్చాయి.

ఇటువంటి అనుభవాలు భక్తులకు ఎన్నో కలిగాయి. 1955వ సంవత్సరంలో శ్రీగోదావరి మాతాజీ జోర్ పూర్ వెళ్ళినపుడు అక్కడి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వి.జి. గర్దే ఇంటిలో విడిది చేసారు. ఆ సమయంలోనే శ్రీ గోదావరిమాతాజీ, చుట్టు ప్రక్కల ఉన్న అనేక చారిత్రక ప్రదేశాలను, రాజపుత్రుల శౌర్యపరాక్రమాలకు, త్యాగాలకు ప్రతీకలైన అనేక వీర భూములను సందర్శించారు.

ఒక రోజున శ్రీ గోదావరిమాతాజీ అజ్మీరు వెళ్ళరు. ఆనగరంలో ఉంటున్న సాకోరీ భక్తుడు శ్రీ నాయుడు SDO గారింటికి శ్రీ గోదావరి మాతాజీ వెళ్ళారు. నాయడు గారి కుటుంబ సభ్యులందరూ పరమానందభరితులై శ్రీ గోదావరిమాతాజీకి ఘనమైన స్వాగతం ఏర్పాటు చేసారు. నిర్ణీత సమయానికి శ్రీ గోదావరిమాతాజీ నాయుడు గారింటికి వెళ్లారు. నాయుడు శ్రీ గోదావరిమాతాజీ పాదాలు కడిగి నీరాజనం ఇచ్చి పుష్పమాల సమర్పించారు. ఈ సన్నివేశం సదా గుర్తుండేటట్లు ఫోటో తీయించుకోవటా నీకై ఒక ప్రసిద్ధ ఫోటోగ్రాఫరును నాయుడుగారు రప్పించారు. కాని ఫోటో తీసే సమయానికి అతని కెమెరా పనిచేయలేదు. ఫోటోగ్రాఫరు చాలా ప్రయత్నించి విఫలుడై తెల్లమొగం వేసాడు. శ్రీ గోదావరిమాతాజీ ఆగమనకారణంగా ఆ కుటుంబంవారూ, అక్కడికి చేరినవారూ, ఆ ఫోటోగ్రాఫరు తప్ప, అందరూ పరమానందభరితులై వున్నారు. శ్రీ గోదావరిమాతాజీ పాదపూజ ప్రారంభమైనది, ఫోటోగ్రాఫరు శ్రీ మాతాజీని అనుమతి వేడుతూ ప్రార్థించాడు. వెంటనే కెమెరా పనిచేయటం ప్రారంభించింది. శ్రీ గోదావరి మాతాజీ పాదపూజ ఫోటో చాలా బాగా వచ్చింది. ఆ సుందరచిత్రం నాయుడుగారి పూజాగృహానికి శాశ్వతాలంకారంగా ఇప్పటికీ ఉన్నది.

ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం.