సర్వం శ్రీసాయి
గోదావరి మాత చరిత్ర
పదమూడవ అధ్యాయం

సాకోరి చరిత్రలో 1970వ సంవత్సరం సువర్ణాక్షరాంకితమైనటువంటిది. ఇది శ్రీ ఉపాసనీ బాబావారి జన్మశతాబ్ది సంవత్సరం. ఈ సంవత్సరం పొడుగునా ఎడతెరపిలేని కార్యక్రమాలు జరిగాయి. ఫిబ్రవరి నెలలో శ్రీ గోదావరి మాతాజీ పూనాలో గణేశయజ్ఞం జరిపారు, మహారాష్ట్ర దేశపు గొప్ప పారిశ్రామిక వేత్త శ్రీబాబు రావు పారెఖ్' ఈ యజ్ఞం ఏర్పాటు చేసారు. దీనికోసం వారి గృహావరణంలోనే ఒక చక్కని యజ్ఞ మండవం నిర్మించారు. ఫిబ్రవరి రినాడు ప్రారంభమైన ఈ యజ్ఞం 12 ఫిబ్రవరి తేదీన ముగిసింది. వేలకొలది జనం ఈ యజ్ఞం దర్శించి చారు. డాక్టర్. ఆర్.ఎన్. దాండేకర్, డాక్టర్, సిద్ధేశ్వరశాస్త్రి చిత్రావ్, డాక్టర్ ఎన్.బి. పరులేకర్ వంటి ప్రముఖ పండితులు వచ్చరు. యజ్ఞ పరిసమాప్తి
తరువాత పూనా పౌరులు శ్రీ గోదావరిమాతాజీకి, కన్యకలకు, ఘనమైన సత్కారం చేసారు ఈ సన్మానసభ ఉద్యాన ప్రాసాదంలో, పూనా విశ్వవిద్యాలయం కులవతి డాక్టర్ పాటస్కర్ గారి అధ్యక్ష్యంలో జరిగింది. డా. పాటస్కర్ తమ అధ్యక్షోప న్యాసంలో ఇలా అన్నారు.

"శ్రీ ఉపాసనీ మహారాజులది విచిత్రమైన విభూతి; విశిష్టమైన వ్యక్తిత్వం. నేను వారి ఆశ్రమం దర్శించాను. చాలా కాలంగా నాకు ఆ ఆక్రమంతో సంబంధం ఉన్నది. శ్రీ ఉపాసనీ బాబా గొప్ప క్రాంతికారుడు. శతాబ్దాలుగా వంచితలైన స్త్రీలకు ఆయన వేదాధికారం ఇప్పించి వారిని ఉద్దరించారు. ఆయన తరువాత వారి శిష్యాగ్రగణ్య శ్రీ గోదావరిమాతగారు ఆ కార్యమును ఇంకా విజయవంతంగా కుశలంగా నడిపిస్తున్నారు."

యజ్ఞం సందర్భంగా శ్రీ గోదావరిమాతాజీ యిచ్చిన సందేశసారం:

'ప్రతి వ్యక్తి హృదయంలో ప్రేమజ్యోతి వెలుగుతుండాలి.అది ఆరి పోకుండా చిరస్థాయిగా వెలుగుతుండాలి. ఆ ప్రేమజ్యోతి ప్రకాశంలో ఈర్ష్య, ద్వేషం, స్వార్థం అనే తమోగుణాలు నశించిపోతాయి. ప్రేమ మీకు క్షమా గుణాన్ని, సమత్వ దృష్టిని ప్రసాదిస్తుంది. ఈ ప్రేమజ్యోతిని సర్వదా ప్రకాశఈ మానంగా ఉంచుకోండి. అది జీవితమార్గాన్ని వెలిగించి కాంతివంతం చేస్తుంది. కష్టపు తుఫానుల్లో అది చలించవచ్చు: మిణుకు మిణుకు మనవచ్చు. కాని అది ఆరిపోకుండా మీరు జాగ్రత్త పడాలి. నిరంతరం వెలుగుతుండేటట్లు చూడాలె. అప్పుడది శాశ్వతానందశాంతిలోకాలకు దారి చూపుతుంది'.

శ్రీ ఉపాసనీ మహారాజుల జన్మశతాబ్ది ఉత్సవాలు మే 15 నుండి 23 దాకా మహావైభవంగా ఆ భూతపూర్వంగా జరిగాయి. యజ్ఞాలు, సత్యనారాయణ వ్రతాలు, నామసప్తాహాలు, భజనలు, హరికథలు, ఇంకా అనేక పుణ్యకార్యాలు ఈ సందర్భంగా జరిగాయి. శ్రీ గోదావరి మాతాజీ కన్యకలు కలిసి యజుస్సంహితా స్వాహా కారం చేసారు. అది 16నాడు ప్రారంభమై 22 నాడు ముగిసింది. దీని ప్రేరకులు సాకోరి పాత భక్తులు పూనా దక్కన్ కాలేజి సంచాలకులైన పద్మభూషణ డాక్టర్. HD. సాంకాలియాగారు ఈ ఉత్సవాలలో అనేక సత్యనారాయణ పూజలు నామసప్తాహాలు జరిగినవి. వీటికోసం ఒక ప్రత్యేక మండపం నిర్మించారు. వీటిని నిర్వహించినవారు సుప్రసిద్ధ వార్కరీ సంప్రదాయ నాయకులు.
శ్రీ నారాయణగిరి మహారాజుగారు. అభంగ, భగవన్నామ సంకీర్తనలతో వాతావరణమంతా ప్రతిధ్వనింపచేశారు. అంజన వాటికర్, వాలావల్కర్, బీడ్కర్ వంటి ప్రసిద్ధ కీర్తనకారుల హరికథా కార్యక్రమాలు, కృష్ణశంకరశాస్త్రి, డాక్టర్ భిడే వంటి విద్వాంసుల ప్రసంగాలు, పండిత భీమసేనకోషి వంటి గాయకులు భక్తి సంగీతం శ్రోతలందరికీ హృదయసంతర్పణంగా ఉన్నది. ఒకనాడు. నాసిక్ మొదలైన చోట్లనుండి వచ్చిన వేదపండితుల వేదగోష్ఠి కూడ జరిగింది. ఒకనాడు సంస్కృత సదస్సు జరిగింది. అందులో పండిత వసంతరావు గాడ్డిల్, శ్రీ కవీశ్వర్, శ్రీ చక్రదేవ్ ప్రభృతులు పాల్గొన్నారు. ప్రతిరోజు అన్నదానం జరిగేది. వందలు వేలసంఖ్యలో ప్రతిరోజు భోజనాలు చేసేవారు. దాదాపు 50వేల మందికి ప్రసాదవితరణం జరిగింది.

ఆ సంవత్సరమే నవంబరులో శ్రీ గోదావరి మాతాజీ సూరతు వెళ్ళరు. అక్కడి నుండి నాగపురం వెళ్ళరు. నాగపురంలో సాకోరి ఆశ్రమశాఖ 'ఉపాసనీ ''గార్డెన్'లో శ్రీ గోదావరి మాతాజీ బసచేసారు. ఒక రోజు హఠాత్తుగా శ్రీ గోదావరి మాతాజీ దర్శనం కొరకు ఒక వృద్ధుడు వచ్చడు. అతడు సౌరాష్ట్ర వాసులందరికీ సింహస్వప్నమైన బందిపోటు దొంగ. అతని పేరు ధన్నా. రన్నా పేరు చెప్పితే పసి పాపలు పాలు త్రాగరు. అనేక హత్యలు దోపిళ్ళు గృహదహనాలు చేసిన ధన్నా ముఖంలో ఈనాడు రామభక్తుడైన వాల్మీకి గోచరిస్తున్నాడు.

ధన్నా గజదొంగగా మారిన చరిత్ర కల్పితకథకంటే అద్భుతంగా ఉంటుంది. అర్ధశతాబ్దికి పూర్వం చిన్నా 18ఏండ్ల కొత్త పెండ్లికొడుకు. అప్పుడు తన ప్రాంతపు జాగిర్దారు, ఇద్దరు కన్యకలను చెరచటంతో ధన్నాలో ప్రతీకార దావానలం రగుల్కొన్నది. భావనగర్ సంస్థానంలో లాఖ్యాని అనే చిన్న పల్లెటూరులో ధన్నా తండ్రి కాపురం ఉంటూ రాజుగారి కొలువు చేసేవాడు. లాఖ్యాని జాగీర్దారు కన్యకలను చెరచిన వార్త విని ధన్నా భరించలేక జాగీర్దారును మందలించటానికి వెళ్ళినాడు. "మమ్ముల రక్షించవలసిన బాధ్యత విడిచి పెట్టి స్త్రీలను చెరచి భయబ్రాంతులను చేసే నీతిమాలిన పనులు మానుకో వలసింది" అని హితబోధ చేసినాడు. జాగీర్దారు ధన్నా మాటలు పెడచెవిని పెట్టటమేకాక అతణ్ణి అవమానించి కొట్టడు; కాల్చివేస్తానని బెదరించినాడు. "నీవు నన్ను కాల్చకముందే నిన్ను కాల్చి చంపి వేస్తాను" అని ధన్నా శపథం చేసి వెళ్ళిపోయాడు. ఇంతకు ముందెన్నడూ తుపాకి చేతబట్టి ఎరుగని ధన్నా.
కానా ఠాకుర్ తో స్నేహం చేసి తుపాకి సంపాదించుకున్నాడు. దానిని ఎలా ఉయోగించాలో కూడా నేర్చుకొని మూడు రోజుల్లో ఆ జాగీర్దారును కాల్చి చంపేశాడు. ధన్నా సాహసకార్యమైతే చేసాడు కాని ప్రాణభయంతో బందిపోటు దొంగల గుంపులో చేరిపోయాడు. అతని ఊడవారు చుట్టుపక్కలవారు భావనగర్ మహారాజు సన్నిధికిపోయి అతనికి ప్రాణభిక్ష పెట్టవలసిందిగా ప్రార్థిస్తే మహారాజు అంగీకరించిన సంగతికూడ తెలియని ధన్నా అడవుల్లో తలదాచు కుంటూ తిరుగుతూ తానూ ఒక గజదొంగగా మారి చివరికి 135 మంది దొంగల ముఠాకు నాయకుడై నాడు. ఆకాలంలో ధన్నా చేసిన హత్యలకు దోపిళ్ళకు లెక్కలేదు.

ధన్నాను పట్టి యిచ్చిన వారికి గొప్ప బహుమతి యిస్తామని ప్రకటించిన చెడ్డరోజుల్లో కూడ ధన్నా స్త్రీలను చెరపట్టటం చెరచటం అనుమతించలేదు. అతడు దోచి తెచ్చిన ధనంలో చాలాభాగం పేదసాదలకు పంచిపెట్టేవాడు. ఆనియాలి గ్రామంలో ఉండే పునీత మహారాజు అనే గొప్పయోగి దర్శనం ఐన తరువాత ధన్నాలో గొప్ప మార్పువచ్చింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినపుడు జునాగడ్ నవాబు తన రాజ్యం పాకిస్తానులో చేర్చటానికి కుట్ర పన్నినాడు ఆ కుట్రను విఫలం చేసిన వారిలో ధన్నా ప్రముఖుడు కనుక భారత ప్రభుత్వం అతనికి క్షమాభిక్షకూడ పెట్టింది. పునీత మహారాజు ఆదేశానుసారం ధన్నా లఖియానిలో ఒక ఆశ్రమం నిర్మించుకొని ప్రశాంతజీవితం గడుపుతున్నాడు. నిరంతరం రామనామం స్మరిస్తుంటాడు కనుక అతణ్ణి ఆధునిక వాల్మీకి అంటారు.

ఆటువంటి ధన్నా శ్రీ గోదావరిమాతాజీని సూరతులో ప్రథమ పర్యాయం 1970లో దర్శించాడు. ఆ వెనువెంటనే గుజరాతులో విపరీతమైన వరదలు వచ్చి అపార ప్రాణనష్టం జరిగింది. గ్రామ పంచాయతివారి లెక్కల ప్రకారం భక్త ధన్నా, అతని అనుచరులు కలిసి ఆరోజు వచ్చిన నీటి వరదల్లో చిక్కుకున్న 400 మంది ప్రాణాలు కాపాడారు. బాగా శ్రమించి అలసిపోయి ఉన్న ధన్నాకు శ్రీ గోదావరి మాతాజీ సాక్షాత్కరించి చింతించ నక్కరలేదనీ తాను సహాయ పడటానికే వచ్చమని చెప్పారట. అతడు లేచి గోదావరిమాతాజీ కోసం ఆశ్రమమంతటా వెదికాడు. తనకు గోచరించింది దృశ్యమని తెలిసికొన్న తరువాత ధన్నా సూరతుకు బయలుదేరి పోయాడు.శ్రీ గోదావరి మాతాజీ నాగపురంలో ఉన్నట్లు అక్కడ తెలుసుకొని ధన్నా నాగపురం బయలు దేరాడు.
ధన్నా ఒడ్డూ పొడవూ ఉన్న భారీ మనిషి, మహాబలిష్ఠుడు. ఇంత వయసు పైబడినా అతనిది ఉక్కు శరీరం. ధన్నా కాషాయ వస్త్రాలు ధరిస్తాడు. ఇప్పటికి క్రౌర్యపు ఛాయలు గోచరిస్తుంటాయి. శ్రీ గోదావరి మాతాజీ నాగపురంలో "ఉపాసనీ గార్డెన్" ఆశ్రమంలో ఉండగా ధన్నా అక్కడికి చేరు కున్నాడు. ప్రేక్షకులు అతణ్ణి చూచి గడగడలాడి పోయారు. కాని గోదావరి మాతాజీ మాత్రం ఎప్పటివలె నిశ్చలనీరధిగా ప్రశాంతంగా ఉన్నారు. "తల్లీ మీదివ్య సన్నిధిలో నాలుగు రోజులు ఉందామని వచ్చరు" అని ధన్నా ప్రార్థించాడు. "మంచిది ఉండు"మని కారుణ్యమూర్తియైన జగజ్జనని శ్రీ గోదావరి మాతాజీ సమాధానం. ధన్నాకు అటువంటి ప్రేమానుభవం దయార్ద్రమైన లాలన తన జీవితంలో ఇంతకు పూర్వం ఎన్నడు లభించలేదు. అతని కన్నులు నీటికుప్పలై చెక్కిళ్లు తడిసిపోయాయి. ఇంతకు ముందెన్నడూ తలవంచని ధన్నా మోకరిల్లి గోదావరి మాతాజీ పవిత్ర పాదారవిందములకు సాష్టాంగ పడ్డాడు.

ధన్నా వచ్చినాడనే సమాచారం నాగపురం పట్టణంలో వార్తాపత్రికల ద్వారా వ్యాపించినది. పెద్ద పెద్ద పోలీసు అధికారులు ధన్నాను చూడవచ్చి శ్రీ గోదావరి మాతాజీకి మోకరిల్లి వెళ్లి పోయారు. ఈ విధంగా గోదావరి మాతాజీ దివ్యసన్నిధిలో కొన్ని రోజులుండి ధన్నా తన స్థలానికి తిరిగి వెళ్లి పోయాడు. సాకోరికి రా!" అంటూ గోదావరి మాతాజీ కరుణార్ద్రంగా ధన్నాను ఆహ్వానించినారు. గద్గద స్వరంతో "తప్పక వస్తాను తల్లీ" అని ధన్నా సెలవు తీసుకున్నాడు. జీవితంలో మొదటిసారి ధన్నాకు స్వచ్ఛమైన దివ్య ప్రేమానుభవం కలిగింది. హృదయం ద్రవించి కన్నీరుగా ప్రవహించింది. అటు తరువాత ధన్నా అప్పుడప్పుడు సాకోరికి వచ్చి శ్రీ గోదావరి మాతాజీని దర్శించి ఆమె ప్రేమామృతం అనుభవించి వెళుతుండే వాడు. ఇప్పుడు బాగా పండిపోయినాడు. నామస్మరణంతో శేషజీవితం గడుపుతున్నాడు.

13వ అధ్యాయం సంపూర్ణం