సర్వం శ్రీసాయి
శ్రీ గోదావరి మాత చరిత్ర
పన్నెండవ అధ్యాయం

ఈ సంవత్సరమే శ్రీకౌలాస్కర్ కు కలిగిన అనుభవం కూడ చెప్పుకోదగి నది. 1965 బాద్రపదమాసంలో సాకోరి ఆశ్రమంలో గణేశోత్సవాలు వైభవంగా జరుగుతున్నయి. ఎడపితెరపి లేకుండా వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్య క్రమాలు జరుగుతున్నవి. భక్తజనులు ఆనందమగ్నులై ఉన్నారు. ఒకనాడు ప్రార్ధన జరుగుతుండగా కొలాస్కర్ కు ముంబై నుండి టెలిగ్రాం వచ్చింది. ముంబయిలో ఆయన కొడుకు పై దాడి జరిగిందనీ, అతని పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నదని వార్త. టెలిగ్రాం చదువుకున్న కొలాస్కర్ గుండెలు జారి పోయాయి. ఈ వార్త వినిపించటానికై ఆయన శ్రీ గోదావరి మాతాజీ వద్దకు పరుగెత్తరు. ప్రసన్నంగా "భయపడవలసిన పనిలేదు. శ్రీ ఉపాసని బాబా అతణ్ణి కాపాడుతారు" అంటూ. శ్రీగోదావరి మాతాజీ కొలాస్కర్ ను సమాధాన పరచారు. ధైర్యం చిక్కబట్టుకొని శ్రీ గోదావరి మాతాజీ ఆశీస్సులు అందుకొని కొలాస్కర్ ముంబయికి బయలుదేరాడు. కాని అతని మనస్సు అతలాకుతలంగా ఉన్నది.ఆయన బొంబాయికి చేరిన తరువాత, జరిగిన ప్రమాదం వివరాలు తెలిసాయి.ముంబయి గణేశోత్సవాల సందర్భంగా జరిగిన నగరాలంకరణం చూడ బోయిన ఆయన కొడుకు మంగేశ్ ను గుర్తుతెలియని వ్యక్తి ఎవరో పొరపాటున పొడిచారట. అతడు మరెవరినో పొడవబోయి పొరపాటున మంగేశ్ ను పొడిచి గుంపులో మాయమై పోయాడు. మంగేశ్ క్రిందపడిపోయాడు. రక్తస్రావం జరిగింది. వెంటనే సమీపంలో ఉన్న అసుపత్రికి తీసుకపోయి చికిత్స చేయించారు. ఐతే కత్తిగాయం పెద్దది కావటంచేత మంగేశ్ పరిస్థితి ఆందోనకరంగానే ఉంది, డాక్టర్లు కంటిలో వత్తి పెట్టుకొని నిరంతరం చేయ వలసినదంతా జాగ్రత్తగానే చేస్తున్నారు. శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహం మూలంగా మంగేశ్ కు స్పృహ వచ్చింది. కొద్ధి రోజుల తరువాత గాయాలు మానిపోయాయి. ఈ విధంగా శ్రీ గోదావరిమాతాజీ అనుగ్రహంతో మంగేశ్ జీవితంలో పెద్ద ఆపద గడచింది. కొలాస్కర్ ప్రాణాలు కుదుట పడ్డాయి.

ఇటువంటిదే మరొక సంఘటన గుర్తుకు వస్తున్నది. 1959వ సంవత్సర సంయుక్త మహారాష్ట్ర నిర్మాణంకోసం ముంబైలో పెద్దయెత్తున ఆందోళన జరిగింది. రాజకీయ నాయకులు రెచ్చగొట్టటంచేత ఇరుగుపొరుగున ఉండే
మహారాష్ట్ర గుజరాతీ కుటుంబాల మధ్య వైరము విద్వేషము పెరిగాయి. నిష్కారణంగా ఆమాయికులు బాధల పాలైనారు. అప్పుడు ముంబయి "వాస్తవ్యులైన మనహరబాయి మటుబాయి అనే భక్తుని కొడుకును ఎవరో కత్తితో పొడిచారు. ఆ సమయంలో మనహరబాయి దంపతులు సాకోరిలో ఉన్నారు. గుండెకు ఒక్క అంగుళం దూరంలో పెద్ద కత్తిపోటు గాయం ఐన విషాద వార్త ఆ తల్లి దండ్రులకు తెలియగానే వాళ్ళు విలవిలలాడిపోయారు. శ్రీ గోదావరిమాతాజీకి వారు ఈ వార్త చెప్పి ముంబయి వెళ్ళటానికి అనుజ్ఞ కోరుకున్నారు. "చింతించవలసిన పని లేదు. మీరు ఇక్కడే ఉండండి. ముంబయికి పోనవసరం లేదు" అని శ్రీ గోదావరిమాతాజీ ధైర్యం చెప్పి ఊరడించారు. శ్రీ గోదావరిమాతాజీ మాటల్లో వారికి విశ్వాసం ఎక్కువ. కనుక ఆ ధైర్యంతో వారు ముంబయికి వెళ్లకుండా సాకోరిలోనే ఉండిపోయారు. అక్కడ ఆయన కొడుకును వెంటనే ఆసుపత్రిలో చేర్పించి శల్యక్రియ చేయించారు. శ్రీ గోదావరిమాతాజీ అనుగ్రహంతో ఆకుర్రవాడు క్రమంగా కోలుకున్నాడు ఈ విధంగా కేవలం శ్రీగోదావరిమాతాజీ వాక్క ప్రభావం చేతనే అతని గండం తప్పిపోయింది.

సంయుక్త మహారాష్ట్రకోసం ఆందోళన జరిగినప్పుడే చందుబాయి దుబే అనే భక్తునికి కలిగిన అనుభవం కూడ ఇట్లాగే విలక్షణమైనది. అల్లరులు అలజడుల కాలం కనుక అతడు నిత్యంవలె తన బట్టలకొట్టు కొంచెం తొందరగానే మూసివేసి గృహోన్ముఖుడై ఇంటికి వెళుతున్నాడు. చర్నీ రోడ్డు స్టేషన్లో బండి ఎక్కాడు. ఎందుకోగాని ఇంటికి పోవటానికి అతనికి మనస్కరించటం లేదు. అందువలన గ్రాంట్ రోడ్డు స్టేషన్లో దిగిపోయి అక్కడే కూర్చున్నాడు. సిగరెట్ వెలిగించి దమ్ము మీద దమ్ము లాగుతున్నాడు. ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడో అతనికి కూడా అర్ధంకాలేదు.చాలా సేపైన తరువాత విలేపార్లేలో ఉండే తన యింటి నడక తోవపట్టడు.

అక్కడ అతని యింటిముందు మహారాష్ట్రుల అల్లరిమూకలు చేరాయి. గుజరాతీల యిండ్లపై దాడిచేయటానికి వారు సిద్ధం ఔతున్నారు. చందుబాయి రాక గమనించిన అతని భార్య ఇంటి లోపలినుండే హెచ్చరిస్తున్నది. కాని ఆమూకలు చేస్తున్న అల్లరిలో ఇతనికి ఏమీ వినిపించలేదు. ఇంతలో ఎదురుగా వున్నా బంగ్లా పెనుండి ఒక చిన్నకుర్రవాడు అక్కడ గుజరాతీలు ఎవరూ లేరనీ ఆ యిండ్లు మహారాష్ట్రులవే అని అరిచాడు. అది విన్న అల్లరిమూక చెదరి పోయింది. అప్పటికే బాగా చీకటి పడింది కనుక ఆమూక చందుబాయిని
గుర్తుంచలేదు. చందుబాయి ఇంటిలోనికి వెళ్ళాడు. అతడే కనుక దారిలో ఆలస్యం చేయకుండ వెలుతురుండగా ఇల్లు చేరినట్లు అయితే తన కుటుంబానికి ఏగతి పట్టి ఉండేదో ఊహించటం కూడ భయంకరమైన విషయం. శ్రీ గోదావరిమాతాజీ అనుగ్రహం వల్లనే పెద్ద గండం తప్పిపోయిందని చేతులెత్తి మ్రొక్కడు.

చందుబాయికి ఇది అనుభవం కలగటంతో ఆయనకు శ్రీ గోదావరిమాతాజీ యందు భక్తివిశ్వాసాలు బాగా పెరిగాయి. తన యింట తన జంట తన వెంట ఉంటూ శ్రీ గోదావరిమాతాజీ సదా రక్షిస్తున్నదనే దృఢవిశ్వాసం కలిగింది. 1967వ సంవత్సరం కోయనా భూకంపం సంభవించినప్పుడు దాని తాకిడి ముంబాయి నగరానికికూడ తగిలింది. నానగాంవ్ వాస్తవ్యుడైన ప్రహ్లాద సేఠ్ అనే మిత్రుడు ఏదో పని మీద ముంబైకి వచ్చి చందుబాయిని డాక్టర్. యమునాబాయి గోడ్బోలే వద్దకు తీసుకపోయి పరిచయం చేసాడు. మాటల సందర్భంలో చందుభాయి. చక్కగా భజనగీతాలు పాడుతాడనే సంగతి తెలిసింది. డాక్టర్. యమునాబాయి. చందుబాయిని భజన పాటలు పాడవలసిందని ప్రార్థించినది. ఆయన తన్మయుడై పాడుతుండగా భూకంపం తాకిడి వచ్చింది. వారున్న భవనం కపించ సాగింది. పైఅంతస్తునుండి ప్రాణాలు దక్కించుకోవటానికి అందరూ క్రిందికి దిగి పరుగెత్తుతున్నారు. భజన వింటున్న శ్రోతలు కూడ కంగారుపడ్డారు. భజన కీర్తనలు ఆపేసి అందరూ క్రిందికి పారిపోవాలె అనుకుంటుండగా చందుబాయి మాత్రం స్థిరచిత్తంతో "నేను మధ్యలో భజన ఆపలేను. సంరక్షించే గోదావరిమాతాజీ వెనువెంట ఉండగా భయమెందుకు? భజన చేస్తుండగా కూడ మనకు ఏదైనా. మంచిగానీ, చెడుగానీ జరిగితే చేసేదేముంది? ఆదీ మనమంచికే. కనుక భయ పడవలసిందేమీ లేదు" అంటూ భజనసంకీర్తనం కొనసాగించాడు. శ్రోతలు కూడ వింటూ కూర్చున్నారు. కాసేపటికి భూకంపనాలు నిలిచిపోయాయి. ఈ విదంగా ఒక భక్తుని భజనకార్యక్రమం ఆనందంతో సాగిపోయింది.

1965లో పాకిస్తాన్ భారతదేశంపై దురాక్రమణం జరిపింది. భీకర సంగ్రామం జరుగుతున్నది. మన సైనికులు కూడా చాలమంది చనిపోయినారు. ఆశ్రమంలో ఒకనాడు ఉన్నట్లుండి శ్రీ గోదావరి మాతాజీ "మనం కూడ యుద్ధరంగం దూకవలసిందే" ' అన్నారు. చుట్టు ఉన్న కన్యకలతో "మీరు యుద్ధం ఎట్లా చేస్తారు? అంటే వారు "త్రిశూలాలతో"అన్నారు.నిజంగా మాటలు సాభిప్రాయాములు అర్థవంతములు. ఎందుకంటే ఆమరునాడే భారతీయ సైన్యాలు
ముందుకు చొచ్చుకపోయి విజయం సాధించింది. భారత విజయంకోసం ఆశ్రమంలో వివిధ శాంతిక పౌష్టిక క్రియలు జరిగాయి. ఒకానొక భారతీయ సైనికుడు సమరాంగణానికి ప్రయాణమై పోయేముందు శ్రీ గోదావరి మాతాజీ ఆశీస్సులకోసం వచ్చి "ఆ దుర్మార్గులంతా సర్వనాశనమై పోవాలె" అంటే గోదావరి మాతాజీ "అట్లా అనవద్దు వాళ్ళు కూడ భగవంతుని సంతానమే కదా! వాళ్ళలోని దుష్టత్వం నశించాలి" అన్నారు.

ఇంతకు పూర్వం 1962లో చైనా భారతదేశంపై దురాక్రమణం జరిపింది. అప్పుడు బంగారం అవసరం బాగా పెరిగింది. మనదేశంలోని మహిళామతల్లులు తమతమ బంగారు నగలు దేశమాత కోసం అర్పించారు. శ్రీ గోదావరి మాతాజీ తమ బంగారు ఉంగరం ఆశీర్వాదాలతో ప్రధానమంత్రికి పంపించారు. చైనా దురహంకారంతో దండెత్తి వచ్చి మన భూభాగాలు చాలా ఆక్రమించుకున్నది. పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి పండిత నెహ్రూగారి కంఠధ్వనిలో కంపనం గోచరించింది. ఇక మనదేశంగతి ఏమిటి అని ఎవరో శ్రీ గోదావరి మాతాజీని అడిగితే వారు "చింతించకండి. శత్రువులు ఇంతవరకురారు. తొల రోజుల్లోనే యుద్ధం ఆగిపోతుంది. అన్నట్లే శ్రీ గోదావరి మాతాజీ మాటలు యధార్థమైనాయి.

“మనదేశం విజయంకోసం గోదావరిమాతాజీ స్వయంగా ఈప్రార్థన రచించినారు.

"భగవంతుడు మనల రక్షించుగాక భగవంతుడు భారతీయులందరికీ దీర్ఘాయురారోగ్యాలు, ధైర్యము, విజయము, శక్తి, శాంతి ప్రసాదించుగాక"

1966లో అనుకోకుండా సంత్ గులాబ్ బాబా సాకోరి ఆక్రమానికి విచ్చేసారు. వారి నివాసం కాటోల్ ఐనా వారు ఎప్పుడూ పర్యటిస్తునే ఉంటారు. మోకాళ్ళ వరకు దోవతి, చొక్కా ధరించి చూడటానికి వామనమూర్తి, ఐనా వారి కీర్తి బహుదొడ్డది. అన్నెంపున్నెం ఎరుగని పసిపాపవంటి మనస్సు, బ్రహ్మ తేజం ఒలికే ముఖమండలం, తిండి తీర్థాల పట్టింపుగాని, విశ్రాంతి ఊసుగాని లేకుండా రాత్రింబవళ్ళు, భజన చేస్తూ నామసంకీర్తనంలో లీనమైపోయే ఆ మహానుభావుడు ఉపన్యసించటం మొదలు పెడితే వేదవేదాంగాలు శాస్త్రాలు చది విన మహాపండితులు గూడ విస్తుపోతారు. వారు మాట్లాడుతుంటే సమస్తశాస్త్రాలు సహజంగానే దొరలుతుంటాయి వారిది సహజ ప్రజ్ఞ, సరస్వతి వారి జిహ్వాగ్రం
మీద నర్తిస్తుంది. ఆయన వేలకొలది చదువు సంధ్యలు రాని పల్లెటూరి అనాగరికలను, దీనులను, హీనులను తమ ఉపన్యాసాలతో ఉఱ్ఱూతలూపి ఆకర్షించి మంత్ర ముగ్ధులను చేసి భక్తిమార్గంలో నడిపిస్తారు. వారినందరినీ సన్మార్గగాములను చేస్తారు. గులాబ్ బాబాగారి దివ్యత్వంలోను యోగశక్తులలోను వేలకొలది జనాలకు ప్రగాఢమైన విశ్వాసం.

గులాబ్ బాబాగారు సాకోరికి రావటం ఇదే ప్రథమం ఐనా, శ్రీ గోదావరి మాతాజిని వారు కలుసుకోవటం కూడ ఇప్పుడే అ యినా, ఉభయులకు ఉన్న సంబంధం చాలా పాతది, నిగూఢమైనది. ఆయన తమ భక్తులకు శ్రీ గోదావరి మాతాజీని పరిచయం చేస్తూ "మాకు ప్రతినిత్యం గోదావరి మాతాజీ దర్శనం లభిస్తుంటుంది. మీరింతవరకు దర్శించలేదు కనుక మిమ్ములను ఇక్కడికి తీసుకువచ్చను. ఈనాడు ఆమెను దర్శించిన మీరు అదృష్టవంతులు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు తీరు తీరు వాళ్ళు అయిన సాధువులు ఎప్పుడూ తారసిస్తూ ఉంటారు కాని ఇటువంటి సంతులు సత్పురుషులు తరుచుగా కనపడరు. సంత్ జానాబాయిని, ముక్తాబాయిని మనం చూడలేదు. గదా! శ్రీ గోదావరిమాతాజీని చూస్తే చాలు. ఈతల్లి ఆదిశక్తి. ఆమె సంరక్షణలోనే మన మందరం సురక్షితంగా ఉంటాము. సూర్యుడు అందరిమీద వెలుగు ప్రసారం చేసినట్లే శ్రీ గోదావరి మాతాజీ మంచి, చెడ్డ, ధని, నిర్దని అనే భేదం పాటించకుండా నావంటి బిడ్డలపైన కూడ ప్రేమ కురిపిస్తారు. మనకు ఏదైనా దొరుకుతుందిగాని తల్లి దొరుకదు" అన్నారు.

అటు తరువాత శ్రీ గులాబ్ బాబా అనేక పర్యాయలు సాకోరి ఆశ్రమానికి వచ్చరు. శ్రీ గోదావరి మాతాజీ కూడ నాగపురం వెళ్ళినప్పుడల్లా వారిని దర్శిస్తుంటారు. శ్రీ గులాబా బాబా ఎప్పుడు వచ్చినా వారి వెంట అనేక భక్తగణం ఉంటారు.. అందరూ కలసి గంట రెండుగంట భజనగానంలో నామసంకీర్తనంలో అందరినీ ఓలలాడిస్తారు; భక్తిపరిమళాలు వెదజల్లుతారు. ఆనంద ఝంఝా మారుతంవలె ఒక్క ఊపు ఊపి మరెక్కడికో వెళ్ళిపోతారు. అది వారి దివ్యమైన వ్యక్తిత్వం.

యోగులు సిద్ద వాక్కులు అనటానికి శ్రీమతి పస్తాకియా అనుభవం కూడ ఈ సందర్భంలో గమనింపవలసింది. శ్రీమతి ఎమాయి పాస్తాకియా అనే ముంబయి వాస్తవ్యురాలు శ్రీ గోదావరి మాతాజీకి భక్తురాలు. ఆమెకు తీవ్రమైన కాలునొప్పి ఎన్ని తీరుల వైద్యాలు చేయించినా ప్రయోజనం కలుగలేదు. ఆరునెలలు చికిత్సచేసి చివరకు డాక్టర్లు ఆమెను ఆపరేషన్ చేయించుకొమ్మన్నారు. దీనితో ఆమె బెదిరి
పోయి క్రుంగసాగింది. అనుకోకుండా శ్రీ గోదావరిమాతాజీ ముంబైకి వచ్చరు. ఆది తెలిసి శ్రీమతి పస్తాకియా చెల్లెలు తన అక్కగారిని గోదావరి మాతాజీ చెంతకు తీసుకువెళ్లి. ఆశీస్సులు అభ్యర్థించినది. శ్రీ గోదావరి మాతాజీ ఆమెను ఆశీర్వదించి కాలుకు ఎటువంటి బాధలేదు అనే విశ్వాసం పెంచుకొని విశ్రాంతి తీసుకొమ్మని ఆదేశించారు. శ్రీమతి పస్తాకియా గోదావరిమాతాజీ ఆజ్ఞను పాలిస్తూ ఆపరేషన్ మానుకొని దాదాపు నెల రోజులు విశ్రాంతి తీసుకున్నది. శ్రీ గోదావరిమాతాజీ అనుగ్రహం మూలంగా ఆమె కాలు నొప్పి మటుమాయమైపోయి ఎప్పటివలె మామూలు స్థితికి వచ్చింది. యోగులక శక్తి నిజంగా అప్రమేయం.

ఆ సంవత్సరమే ఒక అమెరికా పురుషుడు ఒక ఫ్రెంచి మహిళ ఇద్దరు సాధకులు ఆశ్రమానికి వచ్చరు. ఆశ్రమవాతావరణం వాళ్ళకు బాగా నచ్చింది. వాళ్ళకు శ్రీ గోదావరిమాతాజీకి మధ్యన జరిగిన ఈ క్రింది వార్తాలాపం మనందరికీ కూడ మార్గదర్శకంగాను ఉత్తేజనకరంగాను ఉంటుంది.

సాధకుడు: నేను బుద్ధిజీవిని, హేతువాదిని. ఐనా ఎన్ని పుస్తకాలు చదినా,విన్నా నా మనస్సుకు శాంతిగాని సంతోషంగాని కలగటంలేదు.

మాతాజీ:- బుద్ధిని జ్ఞానాన్ని అనుసరించే వారికి దినదినం గర్వం పెరుగు తుంది. అందువలన సత్యజ్ఞానం ప్రాప్తించదు. పుస్తకాలు చదువటం మూలంగా పుస్తకజ్ఞానం కలుగవచ్చు కాని నిజమైన జ్ఞానం కలుగదు.వ్యక్తిగతమైన ఆత్మానుభవం కలుగదు ప్రేమ, భక్తి వినా శాంతి సంతోషాలు లభించవు.

సాధకుడు : గర్వాభిమానాలు తొలగేదెట్లు? అది తెలిసి కూడా వాటిని తగ్గించుకోలేకపోతున్నాను.

మాతాజీ :. అది ఒకేసారి తొలగిపోయేది కాదు. క్రమంగా తగ్గిపోతుంది. పరమేశ్వరునియెడ భక్తి పెంచుకుంటే అది తగ్గుతుంది. ఈ సమస్త ప్రపంచాన్ని, దీని నైసర్గిక సౌందర్యాన్ని సృష్టించిన ఆ దివ్యశక్తిని గుర్తించి అనుభవానికి తెచ్చుకుంటే గర్వం ఉండదు.

సాదకుడు: ప్రేమ అంటే ఏమిటి?

మాతాజీ: అది నిర్వచనానికి అందదు. ప్రేమ అంటే ఆనందం. నీకు. దేనిపై ప్రేమ కలుగుతుందో దానికోసం నీవు సమస్తం త్యాగం చేస్తావు.
సాధకుడు :- నా స్వభావగతమైన దోషాన్ని, నామనోవృత్తిని బట్టి నాలోని గర్వాహంకారాలు తొలగిపోయే ఉపాయం చెప్పండి.

మాతాజీ: ప్రతిరోజు 10.15 నిమిషాలు లేదా కనీసం 5 నిమిషాలు నీలోని గర్వం అహంకారం తొలగించుకునే శక్తిని ప్రసాదించుమని భగవంతుని ప్రార్థించు. అట్లా చేస్తే క్రమంగా అహంకారం తొలగిపోతుంది.

సాధకుడు:- ఈ సాధన చేయటానికి నేనేదైనా ఆశ్రమంలో ఉండనా? భారతదేశానికి ఎట్లాగూ వచ్చాను కనుక ఏవైనా స్థలాలు దర్శించనా?

మాతాజీ :- సాధనకోసం ఆశ్రమాల్లో ఉండనక్కరలేదు. దర్శనీయ స్థలాలు ఆశ్రమాలు చూస్తే మనసు ప్రసన్నం ఔతుంది. అంత మాత్రమే. కాని అహమును తొలగించే నిరంతరపరిశ్రమ చేయటమే ముఖ్యం. ఇది క్రమంగా సాధించే పని. దీనికి కొంతకాలం పడుతుంది. దీనికోసం ఎవరికి వారే ప్రయత్నం, సాధన చేస్తునే ఉండాలి. యోగులు సంతులు చేసేది మార్గదర్శనం మాత్రమే.

సాధకుడు:- నాలోని అహంకారం తొలగిపోయిందనటానికి గురేమిటి?

మాతాజీ:. నీవు సాధన చేస్తున్న కొలది నీకే అనుభవానికి వస్తుంది. ఆది నీకు తెలుస్తుంది గాని ఇతరులకెట్లా తెలుస్తుంది? నీవు జబ్బుపడితే వైద్యుడిచ్చిన మందు నీవు తిన్నట్లుగానే అది కూడ. ఆ మందు ఏ విధంగా పనిచేస్తు న్నదో నీకు మాత్రమే తెలుసు. అదేవిధంగా నీ ఆంతర్యంలో కలిగే మార్పు కూడ నీకే తెలుస్తుంది.

సాధకుడు: మీరు చెప్పేమాటలు నేను పుస్తకాలలో చదివినాను. ఐతే .. ఇప్పుడు మీరు చెప్పుతుంటే వాటిలో విలక్షణమైన అర్థాలు తళుక్కుమంటున్నాయి. నిజమైన భావార్థం నా కండ్లకు కట్టినట్లు ఉన్నది. మీకు కృతజ్ఞతలు.

మాతాజీ :- మితిమీరి చదివితే మతికి హాని.దాని మూలంగా అయోమయం. చదివిన గ్రంథాలలో ఏదో ఒక తత్వం ఏదో ఒక మార్గం ఎంచుకొని ఆ దిశలో నిష్ఠతో సాధనచేయి అలా చేసే ధ్యేయం సిద్ధిస్తుంది.

అమెరికా సాధకునికి శ్రీ గోదావరి మాతాజీకి ఈ వార్తాలావం జరిగిన తరువాత ఫ్రెంచి మహిళ శ్రీ మాతాజీని మరికొన్ని ప్రశ్నలడిగింది. ఈ విధంగా సాగింది. వారి సంభాషణం ఈ విధంగా సాగింది.
మహిళ. అప్పుడప్పుడు నాలో గొప్ప ఉత్సాహం కలుగుతుంది.క్షుద్ర మైన ప్రవృత్తులు మానుకోవలననీ సమస్త సృష్టినీ ప్రేమించాలెననీ ప్రగాఢమైన వాంఛ కలుగుతుంది. కాని అప్పుడే నా మనసులో ఒక అలజడి లేస్తుంది. క్షుద్ర వృత్తులే బలీయమైపోయాయి. నా మనశ్శాంతికి భంగం కలిగిస్తాయి. ఏమీ తోచదు. నేను వ్యాకుల పడుతుంటాను.ఏమి తోచదు.

మాతాజీ :- ప్రారంభదశలో ఈ రెండు తీరుల ధోరణులకు ఘర్షణ జరుగుతుంది. అందుమూలంగా భయపడవలసిందేమీ లేదు. నీ ధ్యేయాన్ని సాధించుకోవలెననే ప్రబలమైన వాంఛ నీకు ఉండటం శుభలక్షణం, నీవేమైనా సాధన చేస్తున్నావా?

మహిళ: ఔను. ఒక అమ్మ చెప్పినట్లు చేస్తున్నాను. సత్యానికి అసత్యానికి మధ్యన విచక్షణ చేసేదెట్లో ఆమె నేర్పినారు.

మాతాజీ:- విసుగు అనిపించినా అది విడిచిపెట్టకు. ఒకప్పుడు ఉత్సాహంగా మరొకప్పుడు నిరుత్సాహంగా ఉంటుంది. నిరాళా దుఃఖములు ఆవరిస్తాయి. ఐనా పట్టించుకోవద్దు.

మహిళ:- ఈ పోరాటం ఈ ద్వంద్వస్థితి ముగిసేది ఎప్పుడు? అటువంటి సమయాలో నేను ఏం చేయాలె?

మాతాజీ: ధైర్యము, ఓపిక తెచ్చుకో! ద్వంద్వాలనేవి వెంటనే తొలగి పోయేవి కావు. మనకు తీరుతీరు సంస్కారాలు ఉంటాయి. అందువలన కొంత సమయం పడుతుంది. ఇది ఒకే జన్మలో సాధించేది కూడ కాదు. బి.ఏ, ఎం. ఏ.లలో చేరటానికి ముందు మ్రిటిక్, ఇంటరు ఉత్తీర్ణులు కావలసినట్లే భగవదనుగ్రహం పొందే ముందు ఈ పరీక్షలన్నిటిలో ఉత్తీర్ణులు కావాలి.

ఈ సంభాషణ జరుగుతుండగా ఆ మహిళకు భావాతిరేకంచేత కంఠం
రుద్దమైపోయింది. కన్నుల వెంట ఆశ్రువులు రా సాగాయి. ఆది ఆమె తన బలహీనతగా భావించింది. వెంటనే అమెరికా సాధకుడు "ఇటువంటి భావావేగానికి లోబడటం బలహీనత. మానవులు భావావేగానికి బానిసలు కాకూడదని నేనను కుంటాను". అన్నాడు.

మాతాజీ అందుకొని "మానవుడను అనే అభిమానం మాత్రం నీ వెందుకు పెంచుకోవాలె? ఆ అభిమానం కూడ విడిచిపెట్టు. నీవు ఎటువంటి అభిమానమూ
పెట్టుకోవద్దు. అభిమానం తొలగిపోనంతవరకు జ్ఞానప్రాప్తి లేదు. కనుక అభిమానం" కూడదు" అన్నారు.

1967లో కొయనానగరంలో భూకంపం సంభవించినప్పుడు దాని పరిధి లోని చాలా ప్రదేశాలు దారుణమైన ప్రభావాలకు లోనైనాయి. అప్పుడనేకుల జీవితాలు నాశనమైనాయి.ఆ సమయంలో ఒక భక్తుడు ఎదుర్కొన్న ఆపద ఎటు వంటిదో ఇక్కడ చెప్పుతాను. శ్రీ గోదావరి మాతాజీ భక్తుడు డాక్టరు జున్నార్ కర్ రత్నగిరి జిల్లా జసవలీ అనే పల్లెటూరులో ఉండేవాడు. ఆయన ఒక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసరుగా పనిచేస్తుండేవాడు. అతనికి భార్య ఇద్దరు బిడ్డల ఉన్నారు. భూకంపం రాగానే అతడు మొదట గుర్తించలేదు. కాని తరువాత తెలియగానే వెంటనే భార్యతోగూడ ఇంటిబయటికి వచ్చడు. మరుక్షణాన పడకగదిలో నిద్రపోతున్న పిల్లలు జ్ఞాపకం వచ్చారు. పరుగు పరుగున లోనికి వెళ్లి పిల్లలను తీసుకొని బయటపడ్డారు. వారు బయటికి వచ్చిన వెంటనే ఇల్లు దభేలున కూలిపోయి ఇటుకల రాశిగా మారిపోయింది. ఒక్క క్షణం ఆలస్యం జరిగినా మహావిపత్తు సంభవించేది. కాని శ్రీ గోదావరిమాతాజీ అనుగ్రహం మూలంగా వారంతా బ్రతికిపోయారు.

1968లో, శ్రీ సాయిబాబా సమాధిస్థులై యాభై సంవత్సరాలు గడిచి నందున, చాలా చోట్ల గొప్ప కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా విజయభాయి కూడా ఆహ్వానం అందుకొని శ్రీ గోదావరి మాతాజీ నాగపురంలో యజ్ఞం చేసారు. విజయభాయి ధంతోలీలో సాయిబాబా మందిరం కట్టించారు. అక్కడ నిరంతరం పుణ్యకార్యాలు జరుగుతుంటాయి. నిర్ణీతదినం శ్రీ గోదావరి మాతాజీ నాగపురం చేరనారేకాని యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లు జరుగనేలేదు. అందరూ వ్యాకుల పడ్డారు. కాని శ్రీ గోదావరి మాతాజీ మాత్రం విజయభాయితో "విచారపడకు. అంతా సవ్యంగానే జరుగుతుంది" అన్నారు. శ్రీ గోదావరి మాతాజీ నాగపురంలో అడుగుపెట్టి నప్పటినుండి ద్రవ్యము, ధాన్యము ఇతరసామగ్రి మంత్రదండం మహిమతో వచ్చిపడ్డట్లుగా పోగుపడిపోయాయి. అన్ని ఏర్పాట్లు సక్రమంగా సరిగా జరిగాయి. 24 అక్టోబరు రోజున ప్రారంభమైన యజ్ఞం 4 నవంబరు రోజున పూర్ణాహుతితో ముగి సింది. వేలకొలది జనం యజ్ఞాన్ని దర్శించి పునీతులైయ్యారు. పౌరజనం శ్రీ గోదావరి మాతాజీకి సన్మానపత్రం సమర్పించారు.
అందులో "జగన్మాతా! నీవు ఆదిశక్తివి. మోక్షమంగళదాయినివి; చైతన్య స్వరూపిణివి. భక్తి కర్మ జ్ఞాన వైరాగ్యముల అద్వైతమును సాధించిన సాక్షాదేవీ అవతారమవు. భగవద్గీతలో చెప్పినట్లుగా ధర్మసంస్థాపనార్థమై అవతరించినావు. మమ్ముల దీవించి కృతార్థులను చేయుమమ్మా" అని ప్రార్థించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ రచయిత జి. టి. మాడ్ బోల్కర్ "తరుణ భారత" పత్రికలో ఒక వ్యాసం ప్రకటిస్తూ “సాకోరిలో కన్యాకుమారి సంస్థానం స్థాపించి శ్రీ ఉపాసనీబాబా ఒక గొప్పసామాజిక విప్లవం తీసుకవచ్చినారు. ప్రాచీనకాలంలో స్త్రీలకు, వేదాధ్యయనం చేయటానికి, యాగాలు చేయటానికి అధికారం ఉండేది. తరువాతి కాలంలో ఆది పోయింది. శ్రీ ఉపాసనీ బాబాగారు వారి అధికారాలు పునరుద్ధరించి వారి జీవితాలలో గొప్ప పరిణామం తెచ్చినారు" అని వ్రాసినారు.

ఆ సంవత్సరమే నవరాత్రులప్పుడు అమెరికాలోని ఎమొరీ విశ్వవిద్యాలయం అట్లాంటాలో హిందూ బౌద్ధ దర్శనాలు బోధించే డాక్టర్ మార్విన్ హార్పర్ అనే ఆచార్యుడు సాకోరికి వచ్చాడు. మతసంస్థల అధ్యయనం నిమిత్తమై ఆయన భారతదేశానికి విజిటింగ్ ప్రొఫెసరుగా వచ్చడు. సాకోరి ఆశ్రమం దర్శించి అక్కడి భక్తి వాతావరణము ధార్మిక కార్యకలాపాలు చూచి ముగ్ధుడైనాడు. వేదమంత్రాలు విని పులకించిపోయాడు. శ్రీ గోదావరిమాతాజీ దివ్య దర్శనంతో ఆనందపరవశుడైపోయాడు. శ్రీ గోదావరి మాతాజీ యజ్ఞమంటపానికి వెళ్ళే తొందరలో ఉండి కూడ ఆయన నమస్కారాలు అందుకొని, ప్రసాదం తీసుకొని వెళ్ళమని ఆశీర్వదించారు. ఆనాటి పర్యటన కార్యక్రమం ముందుగానే నిర్దరింప బడటంచేత ఆనాడు ప్రసాదం వేళదాకా ఉండలేనని, మరునాడు తప్పక వస్తా నని ఆయన వెళ్ళిపోయాడు. అలాగే మరునాడు సాకోరికి మరల వచ్చి ప్రసాదం తీసుకున్నాడు. మాతో కలిసి భోంచేసినాడు. భోజనం భారతీయ పద్ధతిలో ఉన్నా ఆ విదేశీయుడు ఆనందంగా తిన్నాడు.

వెళ్ళిపోయేముందు శ్రీ గోదావరిమాతాజీ దర్శనం చేయించటానికి ఆమ్రవల్లీ కుటీరానికి ఆయనను తీసుకొని వెళ్లారు. శ్రీ గోదావరి మాతాజీ సప్తశతి పారాయణం చేస్తున్నారు. వారికి తోడుగా నలుగురు కన్యకలుగూడ పారాయణం చేస్తున్నారు. అగరు వత్తుల మందసుగంధం ఆ కుటీరాన్ని పరిమళపూరం చేసింది. డాక్టర్ హార్పర్ వినమ్రుడై గోదావరిమాతాజీకి నమస్కరించినాడు. శ్రీ గోదావరిమాతాజీ మౌనవ్రతంలో ఉండటం
చేత నోటి మాటాడలేదు. కాని ఆనంద స్మేరపదనం కదలికతో ఆయనను ఆశీర్వదిస్తున్నట్లు సూచించారు.

కాన్ని రోజుల తరువాత డాక్టర్ హార్పర్ అమెరికాకు తిరిగి వెళుతూ భారతదేశంలో సమకాలీన ధార్మికోద్యమాల గురించి, తాను దర్శించిన ఆశ్రమాలు. సత్పురుషుల గురించి ఒక గ్రంథం వ్రాసిసాడు. "గురువులు, స్వాములు, అవతారాలు" పేరుతో ఆ పుస్తక ముద్రణ జరిగింది. అందులో ఒక ప్రకరణంలో శ్రీ ఉపాససీబాబా చరిత్ర వారి బోధలగురించి మరొక ప్రకరణంలో శ్రీగోదావరి మాతాజీ వ్యక్తిత్వాన్ని గురించి చాలా బాగా వ్రాసారు.

ఆ సంవత్సరమే ఆశ్రమంకన్యకలు కొందరు నాగపురం వెళుతూ మధ్యలో వినోబాగారి పవనార్ ఆశ్రమం దర్శించారు. స్త్రీల ఆధ్యాత్మికోన్నతికోసం శ్రీ వినోబాగారు 1959వ సంవత్సరంలో బ్రహ్మవిద్యామందిరం అనే సంస్థను నెలకొల్పిరు. ఆధ్యాత్మిక ప్రవృత్తి గల బ్రహ్మచారిణులకు ఆ ఆశ్రమం నివాసం. సాకోరి కన్యకలు వారి ఆక్రమంలో ఒక అరగంట సేపు వేదమంత్రాలు చదివారు. పూజ్యులైన వినోబాగారు అమితాశ్చర్యానందమగ్నులై “ఋగ్వేదంలోని కొన్ని మంత్రాలకు మహిళలే ద్రష్టలు. స్త్రీలకు వేదాధ్యయనం చేసే అధికారం లేదనటం వాళ్ళకు ఘోరమైన అన్యాయం చేయటమే" అన్నారు.

పన్నెండవ అధ్యాయం సంపూర్ణం.