సర్వం శ్రీసాయి
శ్రీ గోదావరి మాత చరిత్ర
పదవ అధ్యాయం


1960వ సంవత్సరం సంయుక్తమహారాష్ట్రకోసం ఆందోళన జరుపుతూ మహారాష్ట్రమంతట పర్యటిస్తున్న ప్రసిద్ధ నాటకరచయిత ఆచార్య ఆత్రే ఒక రోజు సాకోరి ఆశ్రమంలో బస చేసారు. కొన్ని సంవత్సరాలకు పూర్వం 1933.34 ప్రాంతంలో ఉపాసనీబాబాను కఠినంగా విమర్శించిన పత్రికారచ యితలలో ఆచార్య ఆత్రే కూడ ఒకరు. ఐతే ఇప్పుడు ఆశ్రమాన్ని దర్శించి అక్కడి పవిత్ర వాతావరణం చూసిన తరువాత ఆచార్య ఆత్రే తన తోటికార్య కర్తలతో "ఒకప్పుడు నేనీ ఆశ్రమం చూడకుండానే చెప్పుడు మాటలు విని విమర్శించినాను. ఈ సంస్థ నిజంగా సాంస్కృతిక జాగృతికోసం గొప్ప కృషి చేస్తున్నది" అని మెచ్చుకున్నారు. ఆచార్య ఆత్రే మరోసారి కూడ సాకోరి ఆశ్రమం దర్శించారు. ఆయన వెంట ఆయన భార్య సుధాతాయి. నాసిక్ చిత్ర మందిర యజమాని శ్యాంలాల్ భోలే కూడా ఉన్నారు. సంయుక్త మహారాష్ట్రకోసం తాము కంటున్న కలలు ఫలించటానికై వారు సాధు సంతుల ఆశీస్సులు యాచిస్తూ తిరుగుతున్నారు. ఆయన గోదావరి మాతాజీని దర్శించి "నేనొక రాజకీయ ప్రయోజనం. ఆశించి మీ ఆశీస్సుల కోసం వచ్చినాను. మా ఉద్యమం జయప్రదం కావటానికై మమ్ముల ఆశీర్వదించండి" అని ప్రార్థించాడు. శ్రీ గోదావరిమాతా శ్రీ ఉపాసని బాబావారి అను గ్రహం మీకున్నది", అంటూ సమాధానం చెప్పితే ఆయన "నాకు మీ ఆశీర్వాదం కూడా కావాలి" అని ప్రార్ధించాడు. శ్రీ గోదావరి మాతాజీ అంగీకార సూచకంగా తల ఊపి స్వహస్తాలతో ప్రసాదంగా అక్కడ ఉన్న పండ్లను ఇచ్చారు.

ఆచార్య ఆత్రే ఒకరోజు సాకోరీ ఆశ్రమంలోనే ఉండి మరుసటిరోజు వెళ్ళి పోయారు. ఆయన అటుతరువాత కూడ ఆశ్రమానికి రావలాననుకున్నా రాలేక పోయినాడు. కాని ఆయన హృదయంలో సాకోరి ఆశ్రమంపట్ల శ్రద్ధా భక్తులు పెరిగాయి. ఒక లేఖలో "నా మనసులో సాకోరి ఆశ్రమంపట్ల ఆదర భావం ఉన్నది. అది వైదిక ధర్మాన్ని రక్షిస్తున్న గొప్ప సాంస్కృతిక కేంద్రం" అంటూ తన భావాలు ప్రకటించినాడు.ఆశ్రమానికి మరల వచ్చే అవకాశం కలుగక పోయినా ఆయనకు సాకోరి కన్యకలను దర్శించే అనుకోని సందర్భం ఒకటి ఏర్పడింది. వేదమూర్తి వండిత సార్వలేకర్ గారికి పూనా విశ్వ విద్యాలయం డి. లీట్,పట్ట ప్రదానం చేసి సన్మానించినప్పుడు ఆచార్య ఆత్రేగారి 'శివశక్తి' కార్యక్రమం గూడ ఏర్పాటు చేసారు. ఆది దేవీనవరాత్రుల సమయం కనుక సాకోరినుండి దేవితాయి మొదలైన నలుగురు కన్యకలను మాత్రమే సన్మానోత్సవానికి పంపించే వీలు కలిగింది. ఎప్పటివలె కన్యకల వెంట పండిత వసంతశాస్త్రి దేశముఖ్ వెల్లారు. ముంబయి మొదలైన ప్రాంతాల నుండి ఎందరో ప్రముఖులు వచ్చి అసన్మానసభలో పాల్గొన్నారు. ఆ శుభ సమయాన సాకోరి కన్యకలు సుశ్రావ్యంగా వేదమంత్రలు చదువుతున్నారు. వారి మంత్రోచ్ఛరణకు అక్కడున్న శ్రోతలందరూ ముగ్ధులైనారు. వేదమూర్తి పండిత సార్వలేకర్ "అతీవ సుందరం అతీవ సుందరం" అంటూ మెచ్చుకున్నారు. ఆచార్య ఆత్రే ఉప్పొంగిపోయి మరికొన్ని వేదమంత్రాలు చదవవలసిందిగా అక్కడున్న కన్యలను కోరారు. కన్యలు వేదమంత్రాలను చదివారు. శ్రోత అందరూ మెచ్చుకున్నారు. ఆచార్య ఆత్రే తమ ప్రసంగంలో గద్దర కంఠంతో "ఈనాడి ఈ నలుగురు కన్యకల రూపంలో నాలుగు వేదాలను దర్శించే భాగ్యం కలిగింది" అన్నారు.

ఆ సంవత్సరమే మదరాసు వాస్తవ్యులు యోగి శుద్ధానందభారతి సాకోరి ఆశ్రమం దర్శించారు. మదరాసులో వారు ఒక యోగ విద్యాసంస్థను ఏర్పాటు చేశారు. యోగవిద్య గురించి వారు చాల సులభసుందర శైలిలో అనేక పుస్తకాలు రాశారు. వారు గొప్ప పండితకవులు కూడ ఆయన ఈ విధంగా "సాకోరిలో ఆయనకు కలిగిన ఆనందానుభూతిని వర్ణించటానికి మాటలు చాలవు. ఒకప్పుడు ఇది శ్మశానభూమి: నక్కలు తిరిగేచోటు. ఇప్పుడిది భక్తుల పాలిటి స్వర్గధామం. ఇదంతా శ్రీ ఉపాసనీబాబావారి ఆధ్యాత్మికశక్తి చేసిన ఇంద్ర జాలం. వారిని చాలా యేండ్లక్రింద నేను దర్శించినాను. ఈ కన్యాకుమారీ సంస్థానం రెండవ బృందావనం. రేయింబవళ్ళు ఇక్కడి వాతావరణమంతా భక్తుల ఆధ్యాత్మికానుభూతులతో స్పందిస్తుంటుంది. సర్వత్రా, స్వచ్ఛత, ప్రేమ, సంతృప్తి తాండవిస్తుంటాయి. ఈ సాకోరి ఆశ్రమంలో కాషాయాలు ధరించని నిజమైన సన్యాసిను లుంటారు. వాళ్ళ ఉనికి, కదలికలు, అస్తిత్వం అంతా అమ్మ లోనే. వారు తన్మయులై చేసే పనులన్నీ సేవలే. నేను అనేకాశ్రమాలలో పెకు యోగినులను చూచినాను. కాని ఇట్టి భారతీయ సాంస్కృతిక దేవకన్యకలను, ఇట్టి భక్తులను, ఇట్టి ఆధ్యాత్మికశక్తి సంపలితులను ఎక్కడా చూడలేదు. ఉపనిషత్తులు, భగవద్గీతలు ప్రపంచించే సనాతన ధర్మానికి వారు ప్రతీకలు. ఉషోభి ముఖంగా పయనించే తారకలవలె ప్రతిదీ ఇక్కడ క్రమబద్ధంగా సమరసంగా జరుగుతుంటుంది. సచ్చిదానందముల అద్భుత సంగమమైన గురుమూర్తి శ్రీ ఉపాసనీ బాబావారి ప్రేమచేత ఇక్కడి ప్రతి అంగుళమూ పునీతమైనది.

శ్రీ ఉపాసని బాబావారి బోధలు నా జీవితాన్ని నా భావాలను మార్చివేసాయి.శ్రీ ఉపాసని బాబా ఒక ఆధ్యాత్మిక విప్లపజ్యోతి. వారి జీవితమంతా అంతరికమైన అద్భుతాల పరంపర. ఈ రోజున వారి కీర్తిమూర్తిని మనం దర్శిస్తున్నాము. ఆయన ఇక్కడ కన్యకల స్వర్గం నెలకొల్పారు. ఈ చేతనుల్లోనే వారు ఉజ్జీవిస్తున్నారు. వాళ్ళు ఈ సంస్థను సజీవవిశ్వాసంతో ప్రేమైకహృదయంతో ముందుకు తీసుకుని వెళుతున్నారు.

శ్రీ మాతాజీ వజ్రోత్సవాల సందర్భంగా శ్రీ శుద్ధానందభారతి భక్తిభరితమైన హృదయ స్పర్శియైన ఒక చక్కని పాట వ్రాసి పంపించారు.

“జయము జయము గోదావరి మాతా మహారాజ్ఞి శ్రీ రాజరాజేశ్వరి జయము జయము ఓ భారతాత్మా జయము జయము ఓం తత్సత్,
నీ చిరునవ్వుల వెలుగు వాకలో మా జీవితాలు చిన్నారి బుడగలు సూర్యునిలో కిరణంబులవలెనే మేమందరమూ నీలో ఏకం, శాంత్యానందపు వెలుగు వెల్లువలో ఆడుతు పాడుతు అంజలి పట్టి
నీ యగానం చేస్తామమ్మా
మాత మహేశ్వరి మంగళ గోదావరి.”

1960లో శ్రీ మాతాజీ జబల్పురంలో ఒక యజ్ఞం చేసారు. ఇది ఎవరో ఒక వ్యక్తి చేయించినది కాదు,ఒక సమితి పక్షాన జరిగినటువంటిది. ఆ సమితిలో సేఠ్ రాంకుమార్, సేఠ్ మణిభాయిపటేల్, సేఠ్ హరిహరవ్యాస్, సేఠ్ అంబా దాస్ తల్వార్, ధర్మచంద్ భామోరే మొదలైనవారున్నారు. శ్రీ పరమానంద బాయిపటేల్ పత్ని శ్రీమతి జ్యోత్స్నా భెన్ పటేల్ కూడ అందులో సభ్యులు. శ్రీ పరమానందభాయి పటేల్ కోటిశ్వరుడు. ఆయన మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ఒకప్పుడు విద్యాశాఖమంత్రి. శ్రీమతి జ్యోత్స్నాదేవి పరమ ధార్మికురాలు. పేదలకు ఆర్తులకు ఆమె ఆధికంగా దానధర్మాలు చేస్తుంటుంది. ఉన్నత కుటుంబాలకు అలవాటున్న గోషా పద్దతి ఆమెకూడ పాటిస్తుంది. కనుక బహిరంగ సభలకు కార్యక్రమాలకు వెల్లదు. కాని ఒక యోగిని నిర్వహిస్తున్న యజ్ఞం కనుక ఆమె ఈ యజ్ఞం చూడటానికి వచ్చింది.శ్రీ గోదావరి మాతాజీని దర్శించటం ఆమెకు ఇదే మొదటిసారి. శ్రీ గోదావరిమాతాజీ దివ్య శ్రీ ప్రభాభాసురమైన రూపం చూచి ఆమె ముగ్గురాలైనది. కాని శ్రీగోదావరి మాతాజీ మాహుత్మ్యం ఎటువంటిదో ఆమెకు తెలియదు. ఒకరోజు శ్రీ గోదావరిమాతాజీ యజ్ఞమండవంలో ఒక ధార్మికగ్రంథం పారాయణం చేస్తున్నారు. అప్పుడు జోత్స్నా బెన్ యజ్ఞమండపానికి ప్రదక్షిణ చేస్తున్నది. ప్రదక్షిణం చేస్తుండగా ఆమె మనసులో ఒకతలంపు మెరిసింది. తదేకధ్యానంగా పారాయణం చేస్తున్న గోదావరిమాతాజీ కనుక తనవైపు తిరిగి చూచినట్లైతే ఆమె మాహాత్మ్యం ఒప్పుకుంటానని మనసులో అనుకున్నది. ఆమె ఇట్లా అనుకున్న తత్ క్షణమే శ్రీగోదావరిమాతాకీ వెనుదిరిగి జ్యోత్స్నాబెన్ ముఖంలోనికి చూసారు. జ్యోత్స్నాబెన్ ఆశ్చర్య చకితురాలై ఆనందపారవశ్యంతో శ్రీగోదావరిమాతాజీ పాదపద్మాలకు మ్రొక్కి శరణార్థి చేసింది. ఇన్నాళ్ళకు తాను అన్వేషిస్తున్న తన పాలిటి పరమగురువు ఆమెకు లభించారు. శ్రీ గోదావరి మాతాజీ యందు ఆమెకు సంపూర్ణమైన దృఢవిశ్వాసము భక్తి దినదినం శుక్లపక్ష చంద్రునివలె వృద్ధి చెందుతూ వచ్చాయి.

ఈ యజ్ఞం శ్రీ నాథతలైయా అనేచోట నిర్వహించారు. ఇందుకోసమై ప్రత్యేకంగా ఒక యజ్ఞమండపం అక్కడ నిర్మించినారు. యజ్ఞం దర్శించిన వారంతా చాలా సంతోషించారు. జబల్పురం విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీకుంజిలాల్ ధూభే, ఆచార్య రజనీశ్, గొప్ప ఉపన్యాసాలు చేసారు.

1961వ సంవత్సరంలో శ్రీ గోదావరిమాతాజీ మహాబళేశ్వరంలో ఒక యజ్ఞం చేసారు. అది ఏర్పాటు చేసినవారు జూపిటర్ మిల్లు యజమాని సేఠ్ చందూలాల్ పారెఖ్ ప్రకృతి సౌందర్యం ఉట్టిపడే ఆస్థలంలో వేదఘోషలు మారుమ్రోగుతుంటే. బంగారానికి తావి అబ్బినట్లైనది. శ్రీపారెఖ్ గారు సాకోరి ఆశ్రమానికి ఆకర్షింప బడి భక్తులైన కథకూడ విచిత్రమైనది. సేత్ చందూలాల్ పారెఖ్ శ్రీ గోదావరి మాతాజీని 1960వ సంవత్సరంలోనే మొదటిసారి దర్శించారు. ఆయన ప్రతి సంవత్సరం వేసవిలో మహా బళేశ్వరంలో గడుపుతాడు. అక్కడ ఆయనకు రెండు బంగ్లాలు ఉన్నాయి.ఒక బంగ్లాలో తానుంటాడు; మరొకటి బాడుగకిస్తాడు. 1960వ సం|| వేసవిలో శ్రీ గోదావరి మాతాజీ మహాబళేశ్వరంలో ఉన్నారు. భక్తులు గోదావరి మాతాజీ నివాసం కోసం చందూలాల్ బంగ్లా తాత్కాలికంగా అద్దెకు తీసుకున్నారు. శ్రీ గోదావరి మాతాజీ ప్రతిరోజు ఉదయం 10 గంటలకు భక్తులకు దర్శనమిస్తుంటారని ఫారెఖ్ గారికి చెప్పారు.ఆయనది ధార్మికవవృత్తి కానందు వలన ఆ విషయం పట్టించుకోలేదు. దేవుడంటేనే పట్టింపులేనివాడు సాధుసంతుల దర్శనం చేసుకుంటాడా? కాని ఆయన భార్య మాత్రం పుణ్యశీల కనుక ఒకరోజు శ్రీ గోదావరి మాతాజీని దర్శించటానికి వెళ్ళింది. అంతే. ఆరోజు నుండి ప్రతిరోజు ఆమె శ్రీ గోదావరి మాతాజీని దర్శించేది. అంతటి దివ్యసౌందర్యం ఉన్న వ్యక్తిని తానింతవరకు చూడలేదని ఆమె తన భర్తకు చెప్పింది. అతడు అంతగా పట్టించుకోలేదు.శ్రీ గోదావరిమాతాజీ తాము ఎక్కడున్నా వైశాఖశుద్ధ విదియనాడు శ్రీఉపాసనీ బాబా జన్మదినోత్సవం జరుపుతారు. ఆ సందర్భంలో సత్యనారాయణవ్రతం ఆచరిస్తారు. స్థానికులైన అనేకులు ఆ ఉత్సవం చూడటానికి వచ్చారు. పారెఖ్ గారిని కూడ ఆహ్వానించారు. పారెఖ్ గారు ఈసారి ఆహ్వానం తిరస్కరించలేదు. భార్యాసమేతంగా వెళ్లారు. శ్రీ గోదావరి మాతాజీని ఓం ప్రథమంగా దర్శించాడు. శ్రీ గోదావరిమాతాజీ దివ్యగంభీరమూర్తి ఆయన హృదయంపైన చెరగని ముద్ర వేసింది. వేసవి తరువాత శ్రీ గోదావరి మాతాజీ సాకోరికి వెళ్ళిపోయారు.వెళ్లేముందు పారెఖ్ ని సాకోరికి రావలసిందని ఆహ్వానించినారు. ఆయన సంతోషంగా చిరునవ్వుతో "ఎప్పుడో ఒకప్పుడు సాకోరికి తప్పక వస్తాను" అన్నాడు. శ్రీ గోదావరి మాతాజీ వెళ్ళిపోక ముందే ఆమె భక్తులు బంగ్లా ఆద్దె చెల్లించటానికి పారెఖ్ వద్దకు వెళ్లగా " గోదావరి మాతాజీ వద్ద అద్దె తీసుకోవటమా?" అంటూ ఆయన నిరాకరించినాడు.

అటు తరువాత కొంతకాలానికి ఆయన పుణ్యం పండి ఒకసారి సాకోరికి వెళ్ళడు. అక్కడి దివ్యమైన వాతావరణం ఎడతెరపిలేని పుణ్యకార్యక్రమాలు చూచి ప్రభావితుడైయ్యాడు. అప్పటినుండి సాకోరికి రాకపోకలు ప్రారంభించాడు. కాలక్రమాన ఆయనలో భక్తివిశ్వాసాలు కూడ ప్రబలాయి. అలాంటి దృఢ విశ్వాసంతోనే ఆయన ఒకరోజు యజ్ఞం చేయాలి అనుకున్నాడు. అనుకున్నట్లే 1961లో యజ్ఞం ఏర్పాటు చేసాడు. యజ్ఞం మే 6తేదీ రోజున నాడు ప్రారంభమైంది. 10వ రోజు నాడు పూర్ణాహుతి జరిగింది. కన్యకల వేదమంత్ర పఠనం శ్రోతలను ముగ్ధులను చేసింది. సేఠ్ డహాణుకర్, సేఠ్ అంబాలాల్ సారాభాయి, శ్రీమతి ఠాకర్సీ, గగన్ బిహారీ మెహ్తా, నవీన ఖాండ్వాలా వంటి ప్రముఖులతోపాటు వేలకొలది భక్తులు ఆ యజ్ఞం దర్శించి పునీతులైయ్యారు.

ఆ సంవత్సరమే డాక్టర్ జహాంగీర్ పటేల్ గారికి ఒక చిత్రమైన అనుభవం జరిగింది. డా. పటేలు శ్రీ ఉపాసనీ బాబావారికి సాకోరి ఆశ్రమానికి పాత భక్తులు. ఆయన ఒకప్పుడు ముంబాయ్ లోని పార్సీ మెసినా ఆసుపత్రిలో సివిల్ సర్జన్ గా పనిచేసినవారు. ఆయన మొదటిసారి 1934వ సంవత్సరంలో సాకోరి ఆక్రమం దర్శించి శాశ్వతంగా అక్కడే ఉండిపోయాడు. ఆశ్రమవాసులకు చికిత్స చేయటం, ఆశ్రమ పూజావిధుల్లో శ్రద్ధగా పాల్గొనటం, ఆయన నిత్యవిధి భజన ఆయన ప్రీతిపాత్రమైన కార్యక్రమం. 1961వ సంవత్సరంలో ఆయనకు కంటిపొర అపరేషన్ జరిగింది. ఆపరేషన్ చేయించుకోవటానికి వెళ్లేముందు ఆయన శ్రీ గోదావరి మాతజీ ఆశీస్సులకోసం వెళ్ళి దర్శించాడు.ఆపరేషన్ ఎక్కడ చేయించుకుంటావని అడిగినారు శ్రీ గోదావరి మాతాజీ.. 'ముంబాయిలో' అని డాక్టర్ సమాధానం. "ముంబైకి వెళ్లవద్దు. పూనాలో చేయించుకో" అని శ్రీ గోదావరి మాతాజీ సలహా ఇచ్చారు. "తగినంత డబ్బుందా" అని గోదావరిమాతాజీ మరల యాధాలాపంగా అడిగారు. "ఔను 500 రూపాయలున్నా "యని పటేలు సమాధానం. "ఏమిటి? ఐదా?" అని గోదావరి మాతాజీ ప్రశ్న.

శ్రీ గోదావరి మాతాజీ తనమాట సరిగా వినిపించుకోలేదేమో అనుకొని వదేలు మరల "నావద్ద 500 రూపాయలు ఉన్నాయి" అన్నాడు. శ్రీ గోదావరిమాతాజీ ఎప్పటి వలె తల ఊపారు.

కొన్ని రోజులు తర్వాత డా. పటేలు అనుకున్న ప్రకారం పూనా వెళ్లారు. అసలైతే పటేలు ముందుగా ముంబైలోనే ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటుందనుకున్నాడు, ఎందుకంటే అక్కడ ఆయన తొలిత జీవితం గడిపారు.అక్కడ తనకు తెలిసిన మిత్రులు బంధువులు కూడా ఉన్నారు. కాని శ్రీగోదావరి మాతాజీ యందున్న సంపూర్ణ విశ్వాసంతో ఆయమ్మ ఆజ్ఞ ప్రకారం పూనా లోనే ఆపరేషన్ చేయించుకోవటానికి నిశ్చయించుకొని ముంబై ప్రయాణం మానుకున్నాడు. డాక్టరు పటేలు పూనాలో తన మిత్రుడు B.F. బోడే ఇంజనీరింట్లో ఉన్నాడు. డాక్టర్ సాఠే అనే ప్రఖ్యాత నేత్రవైద్యుడు కంటిపొర ఆపరేషన్ చేసారు. పటేలు తన వృద్ధాప్యం కారణంగా ఆపరేషన్ చేయించుకోవటానికి జంకినా శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహంతో ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. అసుపత్రిలోనే కొన్ని రోజులు ఉండవలసి వచ్చింది. అలా జరిగిన తరువాత డాక్టరు అనుమతి తీసుకొని ఆసుపత్రి విడిచినా, ఆసుపత్రి విడిచేముందు డాక్టరు బిల్లు చెల్లించి అనుమతి తీసుకుందామని వెళ్ళినప్పుడు, బిల్లు ఎంత చెల్లించాలే అని అడిగాడు.


'ఏ బిల్లు' అని డాక్టరు సాఠేగారు ప్రశ్న వేసారు "నేనూ డాక్టరును, మీరూ డాక్టరు, మీవద్ద నేను డబ్బెట్లా తీసుకుంటాను" అన్నారు.

బిల్లు చెల్లించటానికి సిద్ధపడి వచ్చిన పటేలకు డా॥ సాఠే మాటలు ఆశ్చర్యం కలిగించాయి. 'ఆపరేషన్ చేసినందుకైనా మీరు తీసుకోవాలె' అని పటేలు బతిమాలినా డా॥ సాఠే వినలేదు. పటేలుకు ఎటూ తోడ లేదు. "మీ. అసుపత్రిలో ఉన్నందుకైనా మీరు కొంతైనా డబ్బు తీసుకోవాలె" అని మరల బతిమాలాడు. కాని డా॥ సాఠే తన నిశ్చయం మార్చుకోలేదు. ఆయన ఒక చిల్లిగవ్వ కూడ తీసుకోలేదు. గత్యంతరం లేక డా॥ పటేలు తనకు సపర్యలు చేసిన ఆసుపత్రి పరిచారకులకు పురుషునికి మూడు రూపాయలు స్త్రీలకు రెండు రూపాయలు ఇచ్చరు.

డా॥ సాఠేగారి అనుమతి పొంది పటేలు తన మిత్రుని యింటికి తిరిగి వచ్చి శ్రీ గోదావరిమాతాజీకి ఉత్తరం వ్రాస్తుండగా అతనికి హఠాత్తుగా "ఐదు రూపాయ లున్నాయా?" అని అరోజున శ్రీ గోదావరి మాతాజీ అన్నమాటలు గుర్తుకు వచ్చయి. శ్రీ గోదావరి మాతాజీ మాటల్లోని ఆంతర్యం ఆయనకు అప్పుడు అర్థమైంది. గోదావరి శ్రీమాతాజీకి వ్రాస్తున్న ఉత్తరం కన్నీటితో తడిసింది. శ్రీ గోదావరిమాతాజీ మాటలు చేతలు అగాధములు ఆప్రమేయములు.


పదవ అధ్యాయం సంపూర్ణం