శ్రీ గజనన విజయం

మూడవ అధ్యాయం click for pdf

శ్రీ గణేశాయనమః! జయజయ సచ్చిదానంద శ్రీహరీ, వెంటనే నాపై దయజూడుము. నీ శరణు జొచ్చిన వారిపై నీవు కినుక వహింపవు. నీవు కరుణాసాగరుడవు కదా ! నీవు హీసులకు, దీనులకు పుట్టిల్లు వంటి వాడవు కదా, భక్తులకు నీవు కల్పతరువు చింతామణిని. యోగులు, సజ్జనులూ, " నీ మహిమను గానం చేస్తూనే వుంటారు. అందుకే 'దాసగణూ' హే ప్రభూ! నాపై త్వరగా కృప జేయమంటున్నాడు. హీనులను ధీనులను రక్షించే శ్రీగజాననులు సాక్షాత్తూ బంకట్ లాల్ ఇంటిలో వుంటున్నారు. ఈ వార్త తెలియగానే ఎక్కడెక్కడి నుండో భక్తులు దర్శనాభిలాషులై రాసాగారు. తేనెపట్టు పట్టిన సంగతి తేనెటీగలకు తెలియజెప్పనక్కరలేదు కదా ! వాటంతట అవే వచ్చిచేరుతాయి. ఒకరోజు జరిగిన విషయం చెపుతాను. గజాననులు ఆత్మానందంలో మునిగివున్నారు. అది ప్రభాత సమయం, తూర్పున అరుణోదయం అవుతోంది. చెట్టు పైనున్న పక్షులు కలకలరవాలు చేస్తున్నాయి. పవనుడు మందమందంగా వీస్తున్నాడు. చల్లని అనుభూతి కలుగుతోంది! సూర్యోదయం కాగానే చీకటి తన ముఖం దాచేసుకుంది.గృహిణులు వాకటి శుభ్రంచేసి కళాపులు చల్లి చక్కని రంగవల్లులు తీరుస్తున్నారు. ఆవు దూడలు అవుల్ని చేరటానికి ఆతురతగా వున్నాయి. అలాంటి సమయంలో కాశీ నుంచి ఒక సన్యాసి గజాననుల దర్శనార్ధం శేగాంవ్ వచ్చాడు. అతడు సర్వసంగపరిత్యాగి. అట్టివానికి ధనంవలన సామాజిక కార్యాలవలన కీర్తి యశస్సులను సంపాదించే వారిలో స్థానం ఎక్కడిది? ఫాలభాగాన్న సింధూరపు తిలకం, చంకనొక జోలె, చిరిగిపోయిన ఒక లంగోటి, వీపుమీదనొక మృగచర్మం ఉన్న ఆ జోగి ఒక మూలగా కూర్చొన్నాడు. స్వామి దర్శనార్ధం ప్రజలు గుంపులుగా వేచివున్నారు. అలాంటి స్థితిలో పాపం యీ సన్యాసికి స్వామి దర్శనం ఎలా కలుగుతుంది? అతడలానే కూర్చుండి స్వామి చింతనలో మునిగిపోయాడు. నాకు స్వామి (సమర్థుల) దర్శనం ఎలా లభిస్తుంది? వీరి మహిమను కాశీలో విని శేగాంవ్ వెళ్ళి సమర్ధులకు 'గంజాయి' సమర్పిద్దామని మనస్సులోనే మ్రొక్కుకున్నాను. కానీ ఇక్కడి స్థితిని చూస్తూంటే నాకోరిక తీరదనిపిస్తోంది. ఇక్కడున్న సజ్జనుల ముందు నా కోరికను కూడా! ఎందుకంటే 'గంజాయి' పేరు వినగానే. వీళ్ళంతా తన్ని తగలేస్తారు. నా మొక్కు తీర్చుకోవటానికి శేగాంవైతే వచ్చాను. కానీ ఇక్కడున్న సజ్జనుల్లో 'శాంభవీ' భక్తులెవరూ లేనట్లున్నది. మరి నా మనసులోని మాట నెవరితో చెప్పుకోను? ఎవరికేది ప్రియాతి ప్రియమైందో అదే భగవంతునికి అర్పించకోర్తాడెవడైనా అని ఆలోచించసాగాడు ఇలా ఆలోచిస్తూ సమర్థులవారి దర్శనార్ధమై వ్యాకుల పడసాగాడు సన్యాసి కానీ స్వామి అంతర్జాని కాబట్టి సన్యాసి మనస్సును తెలుసుకున్నారు. వెంటనే అక్కడున్న సజ్జనులలో ఒకరితో బయటొక మూలగా కాశీనుంచి వచ్చిన ఒక సన్యాసి వున్నాడు. అతనిని నా దగ్గరకు తీసుకొనిరండి అన్నారు. స్వామి సందేశాన్ని వినిన సన్యాసి తన కోరిక తీరుతుందని ఆనందించారు. దీనితో యోగులు నిజంగా త్రికాలజ్ఞులనే అతని మనోధారణ బలపడింది. నామనసులోని కోరికను వారు తెలుసుకొన్నారు. సర్వేసర్వత్ర కాకుండా, స్వర్గలోకంలో జరిగే విషయాలు కూడా యోగులు తామున్నచోటునుండే తెలుసుకుంటారని "జ్ఞానేశ్వరి" అరవ అధ్యాయంలో వ్రాయబడింది. ఈ అనుభవాన్ని నేను స్వయంపొందాను. త్రికాలజ్ఞులైన మహాత్మునికి జయమగుగాకు నా మొక్కును ఆయనే స్వయంగా తెలుసుకుంటారు అనుకున్నాడు. సన్యాసి స్వామికెదురుగా నిలబడ్డాడు. స్వామి సంచిలో నున్న వస్తువును వెంటనే బయటికి తీయమన్నారు. గత మూడు నెలలుగా దాచివుంచిన గంజాయిని సంచీబయటికితీసి నాకర్పించి నీ మొక్కును చెల్లించుకో అన్నారు. స్వామి తన మనసులో దాగిన మాటను గ్రహించటం తెలుసుకొని సన్యాసి సాష్టాంగ పడ్డాడు. అతని కళ్ళ నుండి కన్నీళ్ళు ప్రవహించసాగాయి. అతడు వసివాడిలా నేలపై పొరలటం ప్రారంభించాడు. అది చూచిన స్వామిజీ ఇంక లేచి నీ సంచిలో దాచిన గంజాయిని బయటికితీయ్యి, మొక్కుకునే సమయంలో లేని సిగ్గూ బిడియం ఇచ్చేటప్పుడెందుకు? అన్నారు. సన్యాసి చాలా చతురుడు, అతడు చేతులు జోడించి భయభక్తులతో స్వామీ! మొక్కుబడి చెల్లించటానికై గంజాయిని బయటకుతీస్తాను. కానీ మీరెప్పుడూ 'గంజాయి' త్రాగుతానని మాటివ్వండి. ఇదే నా కొరక. దీన్ని పూర్తిచేయండి, ఇలాంటి వస్తువు మీ కనవసరమని నాకు తెలుసు. కానీ, పిల్లవాని కోరిక అలానే తల్లి తీరుస్తుంది కదా! నా కోరిక మన్నించండి. భక్తులు కోరే కోరికలు యోగిపుంగవుల ద్వారానో లేక భగవంతుని ద్వారానో తీరుతాయి కదా! అంజనీ వృత్తాంతం మననం చేసుకోండి! అంజని వానరజాతి స్త్రీ కదా! ఆమె శంకరుని తనింట పుత్రునిగా జన్మించమని ప్రార్ధించింది. త్రిపురారి ఆమెకోరికను మన్నించాడు కదా! వానర స్త్రీ కోరికను తీర్చటంలో శంకరుని కేవిధమైన కష్టమూ కలగలేదు. మరి నాది చాలా చిన్న కోరిక! మీరు అతిసులభంగా తీర్చవచ్చు. ఐనా మీరు కర్పూర గౌరశంకరులు కదా. నా "గంజాయిని' వేళాకోళం చేయకండి. శంకరులు దీనికి 'జ్ఞానవల్లి' అన్నారు. దీనిని ఉపయోగించడంలో ఇతరులకు హానికలగవచ్చు. కానీ మీకు శోభాయమానమైనదే కదా". అన్నాడు. సన్యాసి మాటలను విన్న స్వామీజీ ఒక్క క్షణం యోచించి వెంటనే తల్లి తన పిల్లవాని కోరికను మన్నించినట్లు అతని కోరికను మన్నించారు. సన్యాసి గంజాయిని బయటకు తీసి చేతిలో వేసుకొని శుభ్రంచేసి గంజాయి పాత్రలో వేసి స్వామికి త్రాగటానికిచ్చాడు. ఈ విధంగా గంజాయికథనైతే చెప్పేశాను. దీన్ని గురించి ప్రతివారు ఆలోచించవలసిందే. సన్యాసి తరువాత కొన్నాళ్ళు శేగాంవ్ లో వుండి మహాత్ముని కృపకు పాత్రుడైనతాను భాగ్యశాలిననుకొని ఇక రామేశ్వరం వెళ్ళటానికి బయలుదేరాడు. స్వామి అప్పటినుంది. గంజాయిని ఇతరులకు లీలగా చూపించటం కోసమే త్రాగటం ప్రారంభించారు. కానీ దానికి అలవాటు పడికాదు. వారైతే నీటిలోని తామరాకు వలె నిరాసక్తులై ఆత్మానందంలో మునిగిపోయేవారు. సిద్ధయోగులకు సామాన్యులకు సాపత్యమెక్కడ? శ్రీ గజాననులు వేదఋచలను శాస్త్రబద్ధంగా చదువుతూండేవారు. ఆవేదపఠనం విన్న ప్రసిద్ధ వేదపండితులు ఆశ్చర్యచకితులయ్యేవారు. దీనిని విన్న వారంతా స్వామి బ్రాహ్మణ జాతి వారే ననుకునేవారు. ఒకప్పుడు గాయకునిలా ఒకే పదాన్ని అనేక రాగాలలో పాడేవారు. ఒకప్పుడు తనకిష్టమైన 'గణ గణ గణాత్ బోతే' అనే తన భజన గీతం పాడేవారు. మరొకప్పుడు ఏమీ మాట్లాడకుండా కూర్చుండటమో లేక పక్కమీద పడుకునుండటమో చేసేవారు. ఆయన ఒకప్పుడు పిచ్చివానిలా మాట్లాడటం, ఒకప్పుడు ఏకాంతస్థానంలో కూర్చొనటం, ఒకప్పుడు అకస్మాత్తుగా ఎవరింటనో కనపడటం ఇలాంటివి చేసేవారు. ఇలా వీరి దినచర్య గడిచి పోయేది. శేగాంవ్ లో 'జానరావు దేశ్ ముఖ్' అనే ఒక సజ్జనుడుండేవాడు. అతడు రోగపీడితుడై చివరిక్షణాల్లో వున్నాడు. వ్యాధిగ్రస్తుడవటం వలన ఎంతో నీరసించి పోయాడు. వైద్యుడు అతణ్ణి బ్రతికించేందుకు తన శాయశక్తులా ప్రయత్నించి విఫలుడయ్యాడు. చివరికి రోగి అంతిమ శ్వాస తీసుకుంటున్నాడు. క్రిందకి దింపి పడుకోబెట్టండి అన్నాడు. వైద్యుని మాటలు విన్న రోగి ఆప్తులందరూ దుఖిఃతులై గుండెలమీద కొట్టుకుంటూ, అరే -జానరావు, మమ్మల్ని విడిచి పోకురా! నువ్వు తిరిగి మామూలు మనిషివ్వాలి. ఎందరో దేవుళ్ళకు మొక్కాం ఐనా ఏమీ లాభం లేక పోయిందిరోయ్. వైద్యుడు ఆశలేదన్నాక ఇకచివరి ప్రయత్నం చేస్తున్నాం. బంకట్ లాల్ ఇంటికి ఒకగొప్ప మహాత్ముడు వచ్చివున్నాడు. అతని నివాసంతో శేగాంవ్ పండరీ పురమే అయిపోయింది. సాక్షాత్తూ భగవత్స్వరూపుడైన ఆయోగి ఏది కావాలనుకున్నా చేయగలడు. తన యోగబలంతో మృతుడైన సచ్చిదానంద బాబాను జ్ఞానేశ్వరులు తిరిగి జీవితుణ్ణి చెయ్య లేదా జానరావు ఇంక కొద్దిక్షణాలు అతిథి మాత్రమే. అందుచేత స్వామి దగ్గర కెవరినన్నా పంపండి. జానరావుని బ్రతికించమని ప్రార్ధించండి అన్నారు. వెంటనే ఆప్తులలో ఒకరు బంకట్ లాల్ ఇంటికి పోయి జానరావు స్థితిని వివరించి స్వామివారి చరాణామృతాన్ని కోరాడు. బంకట్ లాల్ ఇందులో నే చేయగలిగిందేమీ లేదు. మీరు మా తండ్రిగారిని కలుసుకోండి అన్నాడు. ఆ అప్పుడే భవానీరాంని కలుసుకొని స్థితిని వివరించాడు. శ్రీవారి చరణామృతం ఇప్పించమని కోరాడు భవానీరాం సజ్జనుడు. ఇతరుల దుఃఖాన్ని తనదిగానే భావించేవాడు. జానరావు పరిస్థితి తెలుసుకున్న భవానీరాం ఒక చిన్న గిన్నెలో నీరు తీసుకొని స్వామి పాదాలకు తాకించి స్వామీ! ఈ తీర్థాన్ని జానరావుకు ఇస్తున్నాను" అన్నారు. స్వామి సమ్మతించారు. చరణామృతాన్ని జానరావు కిచ్చారు తీర్థ ప్రభావం వెంటనే కనబడసాగింది. గొంతులోని 'గుర గుర' శబ్దం ఆగిపోయింది. అతడు చెయ్యి కదపసాగాడు తర్వాత కళ్ళు తెరిచాడు. ఇదిచూచిన వారంతా ఎంతో ఆనందిచారు. సత్పురుషులు మహిమను జానరావు తన అనుభవం ద్వారా తెలుసుకున్నాడు. తరువాత మందులు మానేసి స్వామి తీర్ధాన్నే నమ్ముకున్నారు. స్వామి మహిమవలన జానరావు. ఆరోగ్యవంతుడయ్యాడు. ఒక వారం తర్వాత జానరావు స్వయంగా స్వామి దర్శనం కోసం భవానీరాం ఇంటికి వెళ్ళాడు. మహాయోగి చరాణామృతం జానరావుకి అమృతమే అయింది. ఇటువంటి యోగులు సాక్షాత్తూ కలియుగ పరమేశ్వరులే! ఇది ప్రత్యక్షంగా చూచిన వాళ్ళలో ఎవరైనా శ్రీ గజాననులు శేగాంవ్ వచ్చిన తరువాత ఇప్పటి వరకూ ఎవ్వరూ మరణించనేలేదా? అనే సంశయాన్ని వెలిబుచ్చవచ్చు. కాని ఇది శుద్ధ పొరపాటు... అబద్ధమూను...యోగులు ఎవరి మృత్యువునూ తప్పించలేరు. విధి విధానాన్ని తప్పించరు. ఆకస్మికంగా వచ్చిన ప్రమాదాన్ని కొంతకాలం వరకూ తప్పించగలరు. జ్ఞానేశ్వరులు సచ్చిదానందబాబాని 'నేవావాసా'లో బ్రతికించారు ఆయన వలన కొంత పని కావలసివుంది కాబట్టి, ఆ పని పూర్తవగానే జలందీ'లో ఆయన చనిపోయారు. సిద్ధులు, యోగులూ తాము చేయదలచితే తమ భక్తులకొచ్చిన గండాలన్నింటిని కొంత కాలం తప్పించగలరని దీని భావం. నిజానికి యీ మృత్యులోకంలో మూడు రకాల మృత్యువు లుంటాయి. అవి ఒకటి ఆధ్యాత్మికము, రెండవది ఆది భౌతికము, మూడవది ఆదిదైవికము అనేవి. ఈ మూడింటిలో ఆధ్యాత్మికమృత్యువే బలవత్తరమైనది. అపథ్యంమొదలైనవి చేసి మనంత మనమే అధిభౌతికమృత్యువుకు తయారవుతాము. శరీరంలో అనేక రోగాలు పుడతాయి. ఇలా వ్యాధిగ్రస్తమై జర్జరమైన దేహాన్ని విడిచి పెట్టాల్సి వస్తుంది.ఐనా సరైనకాలంలో సరైన వైద్యం చేయబడినట్లైతే దీనిని తప్పించుకోవచ్చు. కాని వైద్యంచేసే వైద్యుడు లేక డాక్టరు తన శాస్త్రకళలో స్వయంగా సిద్ధహస్తుడై వుండాలి. ఆకస్మాత్తుగా వచ్చిన అధిదైవిక మృత్యువును కూడా మ్రొక్కుబడులు మొదలైనవి మొక్కి తప్పించుకోవచ్చు. ఇది కూడా భౌతికము, దైవికము అని రెండురకాలు. ఇక మూడవది ఆధ్యాత్మిక మృత్యువు దీన్నెవరూ తప్పించలేదు. శ్రీకృష్ణభగవానుడు వున్నపుడే అర్జున కుమారుడు అభిమన్యుడు రణరంగంలో చనిపోయాడు మరి! జానరావు మృత్యువు అధిదైవికమైంది కాబట్టి సమర్ధ చరణామృతంతో తప్పిపోయింది.ఆధిభౌతిక మృత్యువైతే ఒక మంచి డాక్టరువల్ల తప్పించుకోవచ్చు. మరి ఆధిదైవిక మృత్యువైతే సిద్ధయోగుల దయవలనే కొంతకాలం ఆగవచ్చు. కానీ యీ రెంటికీ నితాంత శ్రద్ధాయుక్త అంతఃకరణే కావాలి. మరి ఆ యోగి కూడా అంతే స్తోమత కలిగినవాడై వుండాలి. సాధువులు, అసలు, నకిలీ అని రెండు రకాలు నకిలీ సాధువు దగ్గర ఏమాత్రం చమత్కారం మహిమా వుండవు, మట్టిలోంచి కస్తూరి పుట్టడు కదా మరి! సాధువు అరిషడ్వర్గాలను జయించిన వారైతేనే సామాన్యులు చేయలేని కార్యాలు చేయగలుగుతాడు.అందుచేత లోకులు అసలు నకిలీలను తెలుసుకోవలసి వుంటుంది. ఎందుకంటే ఇత్తడి బంగారమగునె ఇలలో? శ్రీ గజానన మహారాజులు అసలు సిసలైన వజ్రము. అందువల్లనే శ్రీవారి చరణామృతం సేవించగానే జానరావు. వ్యాధిముక్తుడయ్యాడు. శ్రీగజాననుల చరణామృతాన్ని సేవించిన జనారావు పూర్ణస్వస్థుడై, ఆ సంతోషంలో బంకట్ లాల్ ఇంట బ్రహ్మాండమైన అన్న దాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశాడు. శ్రీపాద తీర్ధసేవనం వలన జానరావు స్వస్థుడైతే అయ్యాడు కానీ స్వామికి ఆదొక సమస్యగా తయారైంది. ఇదే విధంగా ప్రజలను రోగముక్తులు సంకట ముక్తులను చేస్తూవుంటే లోకులు దీనివల్ల అనుచిత లాభాలను ఆశిస్తారు. కోరుకుంటారు. ఈ పని ఇలా జరుగుతూ పోయినట్లైతే ఇక్కడి కొచ్చేవారి కంఠే వుండదు. అందుకని కొంత కఠిన స్వభావన్ని చూపించాలి అనుకున్నారు స్వామి రెండవరోజునుంచీ స్వామి ఉగ్రరూపులై కనిపించసాగారు. వారి ఈ ఉగ్రస్వరూపం ఇతరులకు అసహ్యాన్ని కలిగించింది. కానీ వారి నిజభక్తులపై ఏమాత్రం ప్రభావం కలిగించలేదు. భగవంతుడు నారసింహుడై వచ్చినపుడు ఇతరులు భయపడ్డారు కానీ భక్తప్రహ్లాదుడు భయపడ్డాడా? సింహాన్ని చూస్తే ఇతరులకు భయంకాని రాత్రింబవళ్ళు దాని దగ్గరే పెరిగే దాని పిల్లకేం భయం. అది దాని దగ్గరే వుంటుంది. సరే! ఇక మరో కథ నాలకించండి.గందపుచెట్ల మధ్యలోనున్న పిచ్చి చెట్టుకు కూడా గంధం సువాసన సోకటం స్వాభావికం కదా! అందుచేత ఆ పిచ్చిచెట్టు తానే గంధపు చెట్టునని గర్వించినందున ప్రమాదమేగానీ ప్రమాదమేమీ వుండదు. చెఱకు పెరిగే చోటే అలాంటి మొక్కలు పెరుగుతాయి! మల్లెతోపాటు బిళ్ళగన్నేరులూ వుంటాయి. అలానే సాధుపురుషులుండే చోట అసాధువులు వుండటం తప్పదు. వజ్రాలు, గాజు ఒకే గనిలో దొరుకుతాయి. ఐనా గాజు గాజే కదా! దాన్ని పాదాలతో తొక్కి పారేస్తాం. కానీ వజ్రము రాజుల కిరీటాన్నలంకరిస్తుంది. శ్రీగజాననస్వాముల దగ్గరకూడా అటువంటి గర్వపాతూ, స్వార్థీ ఒకడుండేవారు. యోగి సేవచేస్తూ వాడు మహా గర్విష్టి ఆయ్యాడు. అతడు యోగిసేవ ఇతరులకు చూపించటానికే చేసేవాడు. మనసులోని భావన వేరు. మీఠాయిలన్నింటిని స్వామి పేరు చెప్పుకొని తినేసేవాడు. స్వామికి నిజమైన సేవకుడు తానేననీ, తాను లేకుంటే స్వామి పని ఏదీ కాదనీ అందరితోనూ చెప్పేవాడు. తాను తప్ప మరెవ్వరూ స్వామికి సేవ చేయలేరని డాంబికాలాడేవాడు. 'సమర్ధ రామదాసస్వామి దగ్గరుండే 'కళ్యాణుని' వంటివాడిని నేను. నేనేది చెప్పినా స్వామి వింటారు. నేనే స్వామికి గంజాయిత్రాగే సదుపాయం, భోజనాది సదుపాయాలు చేస్తాను. కొంచెం వ్యవధిలోనే నేను స్వామికి కావలసినవన్నీ చూస్తాను".అని చెప్పే గర్విష్టి పేరే మాలీ విఠ్ఠోభా ఘాటోల్.స్వామి శంకరులైతే తాను నందికేశ్వరునిగా తయారయ్యారు.నంది దర్శనం కానిది. శంకరుని దర్శనం అవదుకదా! అందుకని అక్కడికి వచ్చే పోయే వారిపైన కళ్ళెఱ్ఱజేసేవాడు.ఇతని టక్కులమారితనాన్ని స్వామి బాల రోజులుగా గమనిస్తూనే వున్నారు. ఒక రోజున స్వామి యీ గర్విష్టికి గుణపాఠం నేర్పాలనుకున్నారు. ఒక రోజు బయటి వూరునుండి కొందరు స్వామి దర్శనార్ధం షెగాంవ్ వచ్చారు. ఆ సమయంలో స్వామి పడకపై పడుకొని వున్నారు. స్వామివారిని లేపటాని కెవరికి ధైర్యం లేకపోయింది. బయటి నుండి వచ్చినవారు త్వరగా మరోవూరు వెళ్ళవల్సివుంది. ఏంచేయాలో తెలీక ఆలోచనలో పడ్డారు. తరువాత వారు విరోబాను ప్రార్ధించారు. "తాము తొందర పనిలో ముందుకు వెళ్ళవలసివుందనీ, స్వామి నిద్రిస్తున్న కారణంగా వారి దర్శనం చేసుకోకుండా ముందుకు సాగిపోవటానికి మనస్కరించటం లేదనీ, ఈ స్థితిలో మీరు తప్ప మాకెవ్వరూ సాయపడలేరనీ' వేడుకున్నారు. ఈ స్థితిపాఠం తో విరోబా ఎంతో పొంగిపోయాడు. అతడు లోపలికి పోయి ఏమీ ఆలోచించకుండా స్వామిని లేపాడు. దానితో భక్తుల కోరికైతే తీరింది కానీ, విఠోబా ఇరకాటంలో పడ్డాడు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ! | అన్నట్లయింది. అప్పుడు స్వామి చేతిలో ఒక పెద్ద కర్ర వుంది. దాంతో విఠోబాని బాదటం మొదలు పెట్టారు. "నాన్నా! గర్విష్టివై నీ అసలు స్థితిని మర్చిపోతావురా నాన్నా! వీడు వ్యాపారం సాగిస్తున్నాడు.మఠంలో నన్ను గంటలతరబడి ఒకే చోట కూర్చోబెడతాడు. అప్పుడప్పుడూ భూతం. ఆవరించినట్లు నటిస్తాడు. వీడి నీచత్వం హద్దులు మీరింది. దీని ఫలితాన్ని వీడు అనుభవించాల్సిందే!" అని ఒక వైపున నోటితో అంటూ రెండోవైపున చితకబాదటం మొదలు పెట్టారు. విషాన్నెప్పుడూ చక్కెరగా భావించకూడదు. దొంగనెప్పుడూ దగ్గరకు తీయకూడదు! స్వామి అతణ్ణెలా కొట్టారంటే వాడు సహించలేక ఆశ్రమం వీడి ఎటో పారిపోయాడు. మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. అసలైన యోగిపుంగవులు ఇలాటి కపట భక్తుల వలలో పడనే పడరు. కపట సన్యాసులు కపట భక్తుల మాటలకు వంతపాడి సామాన్య జనాలని మోసంచేసి, వారుమాత్రం ఆనందంగా వుంటారు. అలా చేయటం చివరికి ప్రమాదాన్ని కొనితెచ్చుకోవటం సామాన్య జనాన్నీ మట్టిలో కలవటమే ఔతుంది. నిజమైన మహాత్ములెప్పుడూ భగవంతునిపై అత్యంత శ్రద్ధ నుంచుతారు. వారికి భగవంతుడే అన్నిను. వారు లోకుల్ని మోసం చేయటం పాపమని భావిస్తారు. వారు ఇలాంటి బూటకపు సన్యాసులను దగ్గరకు కూడా రానివ్వరు. ఎందుకంటే పతీవ్రత స్త్రీలు, వేశ్యలు తమ దరిదాపుల్లో తిరుగాడటం సహించగలరా? ఇత్తడి భూషణాలు బంగారానికి సరిరావు.నిజమైన యోగిపుంగవులు ధూర్తులను తమ దగ్గరకు రానిస్తారు. కానీ వారి కపటబుద్ధిపైన విచారించరు. వారు పూర్వకర్మఫలాన్ననుభవించటానికి వచ్చారని వాటిని లక్ష్య పెట్టరు. మల్లెతీగ, నాగజెముడు మొదలైనవి అన్నీ ఒకే నెలనుండి పుడతాయి. ఐనా వాటి గుణాల్ని బట్టే వాటికి ధర పలుకుతుంది. మల్లెతీగని రక్షించటానికే నాగజెముడుని కాల్చివేస్తాం. మరి దోమకాటు నుంచి రక్షింపబడటానికై... (షేర్) గుమ్మానికి కట్టబడుతుంది. మహాత్ముల అవతారాలు జనకళ్యాణానికోసమే! వారి దగ్గర చేరినవారందరూ వారి ప్రకృతి ధర్మాన్ని బట్టి వారి విలువను తెలుసుకుంటారు. పాపం విరోబా అదృష్టహీనుడు! మహాత్ముని కృపాకటాక్షం లభ్యం అయినా తన కుకర్మ చేత దూరమయిపోయాడు. అతడు చక్కగా నడుచుకొన్నట్లయితే మహాత్ముని కృపవలన కృతార్ధుడయ్యేవాడు! అతడు కల్పవృక్షం క్రిందకూర్చుని చెకుముకి రాళ్ళను కోరుకున్న వాడు! లేక కామదేనువును కొబ్బరి చిప్పఇమ్మని కోరుకున్న భాగ్య హీనుడో! అందుచేత మహాత్ముల దగ్గర ఎప్పుడూ వుండాలంటే మన కోరికలు ఆలోచనలు ఎప్పుడూ జాగృతంగా వుండాలి. ఇది "దాసగణూ" విరచితమైన శ్రీ గజానన విజయం అనుగ్రంధము భవాబ్ధిని తరింపజేయుగాక!

॥ శ్రీ హరిహరార్పణ మస్తు ॥ శుభం భవతు ॥ ||

ఇతి తృతీయోధ్యాయః సమాప్తః ॥

యే మనుష్యః మాం ఆశ్రతః!
తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!

నాల్గవ అధ్యాయం