శ్రీ గజనన విజయం

రెండవ అధ్యాయం  click for pdf

శ్రీగణేశాయ నమః. హే సర్వేశ్వరా ! చంద్రభాగాతటీవిహారా! పూర్ణబ్రహ్మా ! రుక్మిణీవరా! దీనబంధా పాహిమాం. మీరు లేకుంటే యీ జగత్తు చైతన్యహీనమే కదా. ఈ శరీరంలో ప్రాణం లేనప్పుడీ కట్టె గొడవెవరికి కావాలి? నీటితో సమృద్ధంగా నిండిన సరోచరమే చూడటానికి అందంగా వుంటుంది. పండులోని మధురరసం కారణంగానే పైనున్న చెక్కుకు కూడా శోభ చేకూరుతుంది. శరణాగతుని పై మీకు దయగలిగినపుడే వాడు తగిన సమర్గుడౌతాడు. అందుచేత మాలోని పాపాలను, దుర్భలత్వాన్ని దహనం చేయమని ప్రార్ధిస్తున్నాను. స్వామి వాయువేగంతో ఎలా పరిగెత్తాలో మొదటి అధ్యాయంలో వర్ణించాను. స్వామి అలా వెళ్ళిపోవటంతో తన సుఖ శాంతులన్నీ వారు పట్టుకు పోయినట్టుగా బంకట్ లాల్ వ్యధితుడయ్యారు. స్వామి స్వరూపమే అతనికి గోచరించసాగింది. ఒక్క రోజులోనే అతని భోజనాదులు తగ్గిపోయాయి. జల స్థల కాష్ఠములలో తన ఇష్టదేవతా సాక్షాత్కారం కలగటాన్నే ధ్యాన మంటారు. అతనికి స్వామి ధ్యాస తప్ప మరొకటి లేదన్నట్లుగా వుంది. స్వామి అలా వెళ్ళిపోవటంతో బిడ్డను పొగొట్టుకున్న గోవుస్థితి. ఎలా వుంటుందో సరిగ్గా అదే స్థితిలో బంకట్ లాల్ పడ్డాడు. తన మనః స్థితిని చెప్పుకునేటంత మిత్రులు కూడా అతని కెవరూ లేక పోయిరి! ఇలాటివి తన తండ్రితో ఎలా చెప్పుకోగలడు? ఆ స్థితిలో బంకట్ లాల్ శేగాంవ్ ని పూర్తిగా స్వామికోసం వెతికాడు కాని, స్వామి ఎక్కడా కనపడలేదు. ఇంటికి విషణ్ణ వదనుడై తిరిగి వచ్చిన తన కుమారుణ్ణి చూసి తండ్రి భవానీరాం "నాయనా! ఎందుకలా నీముఖం వాడిపోయి వుంది? నీ ఆరోగ్యం సరిగా వుందికదా? నీవేదో బాధపడుతున్నట్లు కనిపిస్తున్నావు. అలా వుండటానికి కారణమేమిటి? నువ్వు యువకుడివి భగవంతుని దయవలన నీకే విషయానికి లోటు లేదు. ఐనా నీవలా చింతాక్రాంతుడ ఎందుకయ్యావో చెప్పు. నీ శరీరంలో ఎటువంటి బాధా లేదు కదా? పుత్రునికి తండ్రి దగ్గర దాచవలసినదేమీ వుండకూడదు." అన్నాడు. ఇంత అడిగినా కూడా బంకట్ లాల్ తన బాధని తండ్రితో చెప్పలేదు. నాలుగు మామూలు మాటలేవో చెప్పి తండ్రి నుండి తప్పించుకున్నాడు. ఐనా స్వామికోసం శేగాంవ్ అంతా గాలిస్తూనే వున్నాడు. బంకటాల్ ఇంటి ప్రక్కన ఒక వృద్ధ జమీందారుండేవాడు. ఆయన సదాచార సంపన్నుడు. అతని ఉన్నత స్థితికి అతడెప్పుడూ గర్వించేవాడు కాదు. ఆయనే రాంజీపంత్ దేశముఖ్. చివరికి బంకట్ బాల్ రాంజీపంత్తో స్వామిని గురించిన దంతా చెప్పాడు. ఆయన అంతా విని "నువ్వు ఏయోగి గురించైతే చెపుతున్నావో వారు తప్పకుండా మహాసిద్ధులైవుంటారు.
అట్టి సిద్ధులైన వారిలోనే అటువంటి గుణాలన్నీ కనిపిస్తాయి. అదృష్ట జాతకులైన వ్యక్తులకే అట్టి వారి దర్శన భాగ్యం కలిగేది!. " అని తన అంతరిక భావాలను ఇలా చెప్పారు. "అరే బంకట్ ! నీకు ఆ మహా యోగి దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. నీ మానవజీవితం ధన్యమైంది. ఎప్పుడైనా అటువంటి అవకాశం లభించినప్పుడు నన్ను కూడా వారిదగ్గరకు తీసుకొని వెళ్ళు" అన్నారు. ఈ స్థితిలో నాలుగు రోజులు గడిచి పోయాయి. కానీ బంకట్ లాల్ స్వామి దర్శనభాగ్యం కోసం తపించటం ఏమాత్రం తగ్గలేదు. గోవిందబువా టాకరీకర్ అనే పేరుగల ఒక సంకీర్తనాచార్యుడుండేవాడు. హరి సంకీర్తనకు ముగ్ధులై 'శారఙ్గధర' దేవుడు ప్రసన్నులయ్యేవారట! వర్హాడ ప్రాంతంలో వారి కీర్తనల కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఆ సమయంలో వారు శేగాంవ్ లో సంకీర్తన చేయటానికి వచ్చారు. శంకర భగవానుని మందిరంలో సంకీర్తన కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామంలోని స్త్రీ పురుషుబందరు సంకీర్తన వివటానికి పోగవుతున్నారు. బంకట్ లాల్ కూడా అక్కడికి వెళ్ళాడు.మార్గమధ్యంలో అతనికి పీతాంబరుడనే బట్టలు కుట్టే మిత్రుడు కలిశాడు. పీతాంబరుడు భావుకుడూ, సజ్జన గృహస్థుడూను.వెడుతూ వెడుతూ బంకట్ లాల్ స్వామిని గురించి పీతాంబరునితో చెప్పేశాడు. ఇద్దరూ మాట్లాడు కుంటూ వెడుతున్న సమయంలో మందిరానికి వెనుక భాగంలో స్వామి కూర్చున్నట్లుగా కనిపించింది. స్వామిని చూడగానే ఇద్దరూ నిర్దనునికి ధనం దొరికినంత సంతోషంతో పరిగెత్తారు. చంద్రుని చూచిన చకోర పక్షివలెనూ, మేఘాలను చూచిన నెమలివలెనూ వారిద్దరూ ఎంతో ఆనందించారు. స్వామిని చేరి ఇద్దరూ వినమ్రులై "స్వామీ తినటానికేమైనా తెమ్మందురా? " అన్నారు. స్వామి, "నీకు కావాలనుకుంటే మాలిన్ ఇంటినుండి జొన్నరొట్టె, సెనగపిండి కూర (బేసిన్) తీసుకొనిరా!" అన్నారు బంకట్ లాల్ వెంటనే పరుగున పోయి ఆనతికాలంలోనే సగం జొన్న రొట్టె, సెనగపిండికూర తెచ్చి స్వామి చేతిలో వుంచాడు. రొట్టె తింటూ స్వామి పీతాంబరునితో "కొంచెం కమండలంతో నీరు నింపి తీసుకురా! ఆ ఎదురుగా వున్న ఆచిన్న కాలవలోంచే నీరు తీసుకురా !" అన్నారు. అది వింటూనే పీతాంబరుడు "స్వామీ అనీరు చాలా అపరిశుభ్రమైంది. అందునా ఈ కమండలంమునిగే నీరేలేదు. అంతేకాదు పశువులు అనీటిని పాడుచేశాయి. అవి త్రాగటానికి అసలే యోగ్యమైనవి. కావు, తమ ఆజ్ఞ అయితే మరెక్కడి నుండైనా పవిత్రజలాన్ని తెచ్చిస్తాను" అన్నాడు. మరెక్కడినిళ్ళో నాక్కురలేదు. నేనేంచెపితే అదే చెయ్యి.కాని చేతితో కమండలంలో నీరు నింపకూడదు. కమండలాన్ని తిన్నగా నీటిలోనింపి నిండా నీరు తీసుకురా !" అన్నారు స్వామి. కమండలం తీసుకుని పీతాంబరుడు ఆ మురికి కాలువదగ్గర కొచ్చాడు. కానీ కమండలం మునిగే నీరు మాత్రం ఎక్కడా కనపడలేదు. కాలువలోని నీళ్ళు పాదాలు మునిగేటన్ని మాత్రమే వున్నాయి. మరి కమండలంలోకి నీరెట్లా నింపటం? పీతాంబరుడు సందిగ్ధావస్థలో పడ్డాడు. చివరికి స్వామి ఆజ్ఞను పాటించాలి కదా అని కమండలాన్ని నీటి పైన వుంచాడు. ఏమాశ్చర్యం! ఎక్కడెక్కడ కమండలం వుంచుతున్నాడో అక్కడల్లా అది మునిగి పోతోంది ! అంతెందుకు! | కాలువలో మురికినీరు కనిపించింది ! కాని కమండలంలో స్పటికజలం వంటి స్వచ్ఛమైన జలం నిండుతోంది! బట్టలు కుట్టే పీతాంబరుడు ఔరా! అని ముక్కు మీద వేలేసుకున్నాడు. ఇట్టి అతీతమైన పనులు సిద్ధులైన యోగుల వల్లనే కాని మరొకరివల్ల జరగటం అసంభవం అనుకున్నాడు. పీతాంబరుడు కమండలం నిండా నీరు తెచ్చి స్వామి సన్నిధిని వుంచాడు. స్వామి భోజనం చేసి కమండలంలోని నీరు త్రాగారు. తరువాత బంకట్ లాల్ ని చూసి "ఏమోయ్ ! మాలిన్ ఇంటినుండి భోజనం తెచ్చి పెట్టే నాకు సేవచేద్దామనుకుంటున్నావా? జేబులోంచి పోకచెక్క తీసి, చితక్కొట్టి దాన్ని నాకియ్యి ! అన్నారు. ఇది విన్న బంకట్ లాల్ హర్షితుడయ్యాడు. అతడు పోకచెక్కతో గూడా ఆనాడు విదర్భ ప్రాతంలో ఉపయోగించే రెండు పైసలు కూడా కలిపి స్వామి చేతిలో వుంచాడు. ఆ పైసలు చూసి మందహాసం చేస్తూ "ఏం? నేనేమైనా వ్యాపారినను కున్నావా? నువ్వు నాకీ ఖడకూ' (పైసలు) యిచ్చావు? అరే! ఇవి నాకెందుకు? నేనైతే భక్తుడూ, అతనిలో వుండే భక్తిభావనకే సంతోషిస్తాను. నీలో అభక్తిభావం వుండటం వలననే నేడు. మళ్ళీ కలుసుకోవటం జరిగింది. ఇక మీరిద్దరూ పోయి ఆ సంకీర్తన వినండి ! నేనీ వేప చెట్టు క్రింద కూర్చునే కీర్తన వింటాను" అని అన్నారు. ఇద్దరూ లేచి వెళ్ళారు. స్వామి ఆచెట్టు క్రిందనే కూర్చుండి పోయారు. హరికీర్తన ప్రారంభమైంది. గోవింద బువాగారు భాగవతంలోని పదకొండవ స్కంధంలోని ఒక శ్లోకం (హంసగీత) తో తమ హరికీర్తన ప్రారంభించారు. కథకుడు పూర్వార్ధం పూర్తి చెయ్యగానే, దాని ఉత్తరార్ధాన్ని స్వామి విశదీకరించారు. అది వినిన గోవిందబువా ఉత్తరార్ధాన్ని అంత చక్కగా చెప్పగలిగే వారెవరో నిశ్చయంగా అధికార పురుషుడే కానీ సామాన్యుడు కాడని తనలో తాను అనుకున్నాడు. అందుచేత ఆయన స్వామిని మందిరంలోనికి తీసుకొని రావాలనుకున్నాడు. పీతాంబరుడూ బంకట్ లాల్ మరి ఇంకెవరో సజ్జనుడూ స్వామిని చేరి మందిరం లోనికి రావలసిందిగా ప్రార్ధించారు. కానీ స్వామి మందిరంలోనికి రావటానికి నిరాకరించారు. చివరికి గోవిందబువా స్వయంగా అక్కడికి వచ్చి స్వామిని మందిరంలోనికి దయచేయుడని వినమ్రుడై ప్రార్ధించి, "స్వామీ ! తమరు సాక్షాత్తూ శివశంకరులే | మందరం బయట మీరుండటం శోభాయమానం కాదు. యజమాని లేకుంటే ఇల్లంతా శూన్యంగా వుంటుంది. నా ఆహొభాగ్యం వలన నేడు శ్రీచరణాలను దర్శించే భాగ్యం కలిగింది. నేటివరకు సంకీర్తన చేస్తూ నాకు వచ్చిన రీతిని సేవచేశాను. దాని ఫలితమే నాకు ఈనాడు లభించింది. కాబట్టి ఓ గురుదేవా! తమరు మందిరంలోనికి దయచేసి నన్ను కృతార్ధుణ్ణి చేయండి" అన్నాడు. అప్పుడు స్వామి "హరిదాసు తన కథనంలో కూడా ఒక నియమాన్ని ఉంచుకోవాలి. ఇప్పటి వరకూ మీరు ఈశ్వరుడు సర్వవ్యాప్త అన్నారు కదా! ఇంటా బయటా అతడే వ్యాపించి వున్నాడంటిరి కదా! అట్టి, స్థితిలో నన్ను మందిరంలోనికి రమ్మని బలవంతం చేస్తున్నారెందుకు? నోటినుండి వచ్చే మాటల ననుసరించే వ్యక్తి యొక్క నడవడి కూడా వుండాలి మరి. సాధకునికి యీ నియమపాలన ఎంతైనా అవసరం. భాగవత శ్లోకానికి అర్ధం చెప్పిన మీ నడవడి దానికి భిన్నంగా వుంది. కీర్తనకారుని ఉక్తి, కృతి కూడా ఒక్కలానే వుండాలి సుమా! కేవలం ఉదర పోషణార్ధమే హరికథ చెప్పుకుంటూ తిరగకండి! ఇక మందిరంలోనికి వెళ్ళి కీర్తన సమాప్తం చెయ్యండి. నేనిక్కడినుండే మీ సంకీర్తనం వింటాను" అన్నారు. స్వామి పలికిన యీ పలుకులు విని కీర్తనకారుడు చాలా ప్రభావితుడయ్యాడు. ఇక అక్కడున్న ఉపస్థిత సజ్జనులతో "శేగాంవ్ కు ఒక అమూల్యరత్నం దొరికింది. నలుగురిలో నడయాడే పాండురంగడే దొరికాడు. అచంచల భక్తిశ్రద్ధలతో వారి సేవ చెయ్యండి. వారి నోటివాక్కు వేద వాక్కుని తెలుసు కోండి. ఇలా చేసినట్లైతే మీకందరకు ఎల్లప్పుడూ శుభం కలుగుతుంది. దొరికిన ఈరత్నాన్ని చేయిజార నివ్వద్దు" అన్నాడు. స్వామి సాన్నిధ్యంలో జరిగిన సంకీర్తన జయ జయ నినాదాలతో సమాప్తమయింది. స్త్రీ పురుషులందరూ ప్రపుల్లిత మనస్కులై తమ తమ ఇళ్ళు చేరుకొన్నారు. అమితానంద భరితుడైన బంకట్ లాల్ తన గృహానికి చేరుకొన్నాడు. ఆనందాతిరేకంతో నిండిన మనస్సుతో విషయాన్ని తన తండ్రి భవానీరాంతో చెప్పి స్వామిని తన ఇంటికి తీసుకొని రావటానికై అనుజ్ఞ నిమ్మన్నాడు. పుత్రునిద్వారా విషయాన్ని తెలుసుకొన్న తండ్రి సంతోషాంతరంగుడై స్వామిని తమ గృహానికి తీసుకొని రావటానికి మనస్ఫూర్తిగా అనుజ్ఞనిచ్చాడు తండ్రి అనుమతిని పొందిన బంకట్ లాల్ హర్షితుడయ్యాడు. స్వామి దర్శన భాగ్యం తిరిగి ఎప్పుడు లభిస్తుందో? తానెప్పుడు వారిని తన ఇంటికి తీసుకొని వస్తానో? అని ఆలోచించసాగాడు. నాలుగు రోజుల తరువాత సాయం సమయంలో మాణిక్ చౌక్ లో సద్గురుదర్శనం ఆకస్మాత్తుగా లభించింది. ఆసమయం కూడా చాలా సుందరమైనది. ఒక వైపు సూర్యుడస్తమిస్తూవుంటే మరోవైపు 'బోధ సూర్యుడు' (స్వామి) బంకట్ లాల్ అదృష్టం కొద్దీ మాణిక్ చౌక్ లో దర్శనమిచ్చారు. ఆసాయం సమయంలో గోపబాలురు గోవుల్ని తోలుకొని ఇంటికి వస్తున్నారు. స్వామిని చూడగానే గోవులన్నీ వారిని శ్రీకృష్ణుడని యెరిగి వారి చుట్టూ చేరసాగాయి. వృక్షాలపైన పక్షిగణాలు కల కల కోలాహలం చేస్తున్నాయి. సాయంత్రం అవటం వలన దుకాణదారులు దీపాలు వెలిగించే ఏర్పాట్లు చేస్తున్నారు. అటువంటి మంగళప్రదమైన సమయంలో బంకట్ లాల్ స్వామిని తన ఇంటికి తీసుకొని వచ్చాడు. తండ్రి స్వామిని దర్శించి ఆనంద ప్రఫుల్లితుడయ్యాడు. అటు తరువాత స్వామికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. సాదరంగా వారిని సుఖాసీనులను చేసి నేడు మాయింట ప్రసాదం స్వీకరించమని వేడుకున్నాడు. ఆయన, ప్రదోషకాలపు శుభసమయంలో వెంచేసిన తమరు సాక్షాత్తూ పార్వతీ కాంతులే అన్నాడు. ప్రదోష సమయంలో శివుని సేవ చేయువాడు ఎంతో భాగ్యశాలి అని స్కందపురాణంలో వ్రాయబడి ఉందన్నాడు. అలా అంటూనే లోనికి వెళ్ళి బిల్వపత్రాలను తెచ్చి స్వామి చరణారవించాలపై ఉంచాడు. స్వామిని నేడు ప్రసాదం స్వీకరించమని వేడుకున్నాడు. కానీ భోజనం సిద్ధం కావటానికి కొంత వ్యవధి పట్టవచ్చు. అప్పటి వరకు స్వామి వుండక వెళ్ళిపోతే? ప్రదోష సమయంలో పార్వతీ! కాంతునకు ఉపవాసం చేయించిన పాపం నాకు తగలదేమి? అని భవానీరాం చింతా క్రాంతుడయ్యాడు. స్వామి బంకట్ లాల్ గృహానికి వేంచేశారన్న వార్త నాలుగుదిశలా వ్యాపించింది. ఇక స్వామి దర్శనార్ధం భక్తులు గుంపులు గుంపులుగా వచ్చారు. భోజనం సిద్దం చెయ్యటానికి కొంత వ్యవధి పడుతుంది. కాని స్వామి ప్రసాదం స్వీకరించక వెళ్ళిపోకూడదు. అందుకని భవానీరాం ఒక ఉపాయం ఆలోచించాడు. మధ్యాహ్నం వండిన పూరీలు వున్నాయి. వాటిని స్వామికి నివేదిస్తే? ఇలా చేయటంలో నామనస్సులో ఏపాపభావమూ లేదు కదా! ఎంతైనా ఉమాపతి భక్తుని అంతర్గత భావాలకూ, భక్తికేకదా ప్రసన్నుడయ్యేది! ఐనా చద్ది భోజనం నేను వారికి నివేదించటం లేదుగా! పక్వాన్న మెప్పుడూ చది కాదు కదా! మనస్సులో ఈ విధంగా యోచించుకొని ఒక పళ్ళెరంనిండా భోజనం వడ్డించుకొని స్వామి ముందుంచాడు. అందులో పూరీలు, బాదంపప్పులూ, అరటిపళ్ళు, నారింజపండ్లు మొదలైనవెన్నో ఉన్నాయి ఆయన స్వామికి కుంకుమతో బొట్టు పెట్టి, మెడలో పూలహారం వేసాడు. స్వామి ప్రసన్న పదనులై వడ్డించినదంతా భుజించటం ప్రారంభించారు. స్వామి మూడు సేర్ల భోజనాన్ని తమ పొట్టలో వేసుకున్నారు. ఆ రాత్రికి అక్కడనే వుండిపోయారు. బంకట్ లాల్ ఆ మరునాడు స్వామికి అవర్ణనీయమైనంత చక్కగా మంగళ స్నానం చేయించాడు. మొదట స్వామికి నూనెతో ఒంటికి 'మాలిష్' చేశాడు. కేసరి కస్తూరీల మిశ్రమంతో ఒళ్ళంతా నలుగు పెట్టారు. కొందరు ప్రేమ పూర్వకంగా స్వామి చరణ కమలాలపై తమ చేతులతో ఒత్తేరు. ఈ విధంగా నూరు కలశాల వేడినీటితో స్త్రీ పురుషులంతా స్నానం చేయించారు. ఆస్నానవిధి అవర్షనీయమైనది. ఎందుకంటే బంకటాల్ ఇంటిలోదేనికీ కొదువలేదు మరి! స్నానానంతరం స్వామికి పీతాంబరం కట్టబెట్టాడు. సాదరంగా ఆయోగిరాజును సుఖాసనం మీద కూర్చుండ బెట్టాడు. ఫాలభాగాన కేసరి మిశ్రణంతో తిలకం దిద్దాడు. మెడలో అనేక రకాల పూలమాలలు వేశాడు. పలురకాల నైవేద్యం వుంచాడు. అంతా బంకట్ లాల్ యొక్క అదృష్టమే అనేక రూపాలలో వారి ముందుంచినట్లుంది! అది శివునికి ప్రీతికరమైన పవిత్రసోమవారం! ఆ రోజు శ్రీ కృష్ణుని ద్వారకయే బంకట్ లాల్ ఇంటికి వచ్చిందా అన్నట్లు వుంది. కానీ 'ఇచ్చారం' అనే బంకట్ లాల్ పినతండ్రి కొడుకుకు అనాడు ఉపవాసం అవటం వలన అతడు ప్రసాదం తీసుకోలేక పోయాడు అయితే యీనాడు ఉపవాసం చేసి సాయంత్రం స్వామికి సాక్షాత్తూ శంకర భగవానునికి యధాతధంగా పూజ సలిపి ప్రసాదం తీసుకుంటాను అని అనుకున్నాడు. నాటి సాయంత్రం ఇచ్చారాం స్నానమాచరించి, పూజా సామాగ్రిని తెచ్చి స్వామికి యధా విధిని పూజచేసి ఇలా అన్నాడు. "స్వామీ! తమరు మధ్యాహ్నం ప్రసాదం తీసుకున్నారుకదా! ఐనా ఈపూటకూడ ఏదో కొంచెం స్వీకరించాలి. నాకీరోజు ఉపవాసం, మీరేమీ తీసుకోకుండా నేను భోజనం చేయను. తమరు అందరి కోరికలనూ తీర్చారు. అందరిలోనూ నేనొక్కడనే అభాగ్యుడిగా మిగిలి పోయాను. నా కోరిక మన్నించండి" అని వేడుకున్నాడు. ఇప్పుడు స్వామి ఇక ఎట్టి లీలను చూపించనున్నాడో అని అనిమిషనేత్రులై అక్కడున్న సజ్జనులంతా ఉత్సుకతతో చూడసాగారు. ఇచ్చారాం ఒక పళ్ళెరం నిండుగా ప్రసాదాన్నుంచి స్వామి ముందుంచాడు. అన్న శాకాలతో బాటు అతడు అనేక రకాలైన పక్వాన్నాలు వండాడు.జిలేబి, రాఘవదాసు (ఒక మిఠాయి), బూంధి లడ్డూలు, అపూపములూ మొదలైన పక్వాన్నాలెన్నో వర్ణించలేనన్ని తయారు చేశాడు. వాటి వర్ణన ఎవరు చేయగలరు? రక రకాల భోజ్య పదార్థాలతో నిండిన పళ్ళెరాన్ని చూసి తిందాం తిందాం అంటావు కదా ఎప్పుడూ? ఇప్పుడవన్నీ తినేసేయి, అనిస్వగతం చెప్పుకొని పళ్ళెంలో వడ్డించిన పదార్ధాలన్నీ చివరికి ఉప్పు, నిమ్మకాయముక్కా కూడా విడవకుండా తినేశారు. కొసరి కొసరి వడ్డించి తినిపిస్తే ఎలా వుంటుందో అనే సారాన్ని ఉపస్థిత సజ్జనులకు ఉపదేశించారు స్వామి. స్వామి వాంతి చేసుకొని తిన్నదంతా కక్కేశారు.ఇలాంటిదే సజ్జనగఢ్ లోని రామదాస స్వామి కూడా చమత్కారం చూపించారు. వారికొకసారి పాయసం తినటానికి మనసైంది. సాధకునికి ఏదైనా వస్తువు మీద తన దృష్టిని లగ్నం చేయటం హానికారక మౌతుంది. అందుచేత స్వామి రామదాసు పాయసాన్ని ఎంత అధికంగా భుజించారంటే చివరికి వాంతులయ్యాయి. వాంతులయిన తరువాత కూడా పాయసాన్ని భుజించసాగారు. తినగా తినగా చివరికి పాయసం అంటే వారికి అసహ్యం కలిగింది. తిని జీర్ణించుకునే శక్తి కలిగివున్నా, వాంతుల ద్వారా తిన్నది బయటికి కక్కి ఎక్కువ తినటం వలన ఆరోగ్య హాని కలుగుతుందని తెలియ జెప్పారు. ప్రకృతిధర్మాన్ని సత్పురుషులు పాలిస్తూ దాని ద్వారా ఇతరులకు గుణపాఠాన్ని నేర్చుతారు. వాంతులవటం వలన పాడైన ఆ ప్రాంతాన్ని శుభ్రంచేసి స్వామిని స్నానం చేయించి తిరిగి యధాస్థలంలోనే ఆసీనులను చేశారు. స్వామి ఆత్మానందంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రెండు భజనమండళ్ళు. అక్కడికి వచ్చి చేరాయి. భజనలు పాడేవారి కంఠ స్వరం బాగుంది. వారు ఆనందంతో 'విఠలదేవుని' నామాన్ని గానం చేస్తున్నారు. సంకీర్తనంవిని స్వామి ఆనందంతో పులకించి గణ గణ గణాంత బోతే" అనే తమ భజన పాడటం ప్రారంభించారు. ఇలా ఆరాత్రంతా ఆనంద సాగరంతో నిండి పోయింది. 'గణ గణ' అనే వారి భజన ఎప్పుడూ పాడటం వలన వారికి 'గజానను'లని అక్కడున్న వారు పేరుపెట్టారు. స్వయం బ్రహ్మయైన వానికి పేరూ, రూపాలు ఎందుకు? నామరూపాలు ప్రకృతిపై ఆధారపడే వారికే కావాలి. యోగీశ్వరులు ఎల్లప్పుడూ ఆత్మానందంలో మునిగి వుంటారు. ఆషాడమాసంలో పండరి పురంలోను, సింహస్థశుభవేళలో గోదావరి తీరంలోను, కుంభమేళ సమయంలో హరిద్వార్ లోను భక్తగణాల మహాసముద్రం నెలకొని వుంటుంది. అలాగే స్వామీగజాననులు శేగాంవ్ లో పదార్పణం చేయగానే బంకట్ లాల్ యొక్క గృహము ఒక తీర్ధస్థానంగా మారిపోయింది.
అక్కడ ఎల్లప్పుడూ భక్తులు గుంపులు గుంపులుగా వుండేవారు. శ్రీ స్వామి సమర్ధరామదాసు, శ్రీ గజానములు పండరిపురంలో నడుముపై చేతులుంచి
వెలసిన విట్ఠలుడూ, పాండురంగని అభిన్నరూపాలని నమ్ముతారు. బంకట్ లాల్ ఇల్లే ఇప్పుడు 'విట్ఠల్ మందిరంగా మారిపోయింది. ప్రతిరోజూ
ఎక్కడెక్కడి నుండో భక్తులు గజాననుల దర్శనార్ధం వచ్చేవారు. నైవేద్యం సమర్పించేవారు. వీటిని వర్ణించటంలో ఆదిశేషుడే అలసి పోతాడు. మరి
నాబోటి మూఢుని కెలాసాధ్యం? నేనొక మామూలు కీటకం వంటి వాడిని. నేచెప్పేదంతా గజాననులే నాచే చెప్పిస్తున్నారు. నేను స్వామి దినచర్య
ఏమిటో చెప్పటానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నాలో వారి చరిత్రను గానంచేసే సామర్ధ్యం ఎక్కరిది? ఒకప్పుడు మంగళస్నానం చేస్తారు..
మరొకప్పుడు ఎక్కడో ఏకాంత వాతావరణంలో కూర్చుంటారు. ఇంకోకప్పుడు మురికి నీళ్ళు త్రాగే వారు. వాయుగతి నేవిధంగా లెక్కవేయలేమో
అలానే వారి దినచర్యను కూడా అంచనావేయలేము. ఎందుకంటే దానికొక పద్దతి లేదుకదా! హుక్కా పీల్చటమంటే వారికి చాలా ఆనందం, లోకులకు
చూపటంకోసమే వారు దాన్నుపయోగించేవారు. కాని అది వారికి వ్యసనం కాదు. ఇక తరువాత అధ్యాయాన్ని ఏకాగ్రచిత్తులై వినండి. ఈ గజానన
చరిత్ర విను వారికి మంగళ మగుగాక! అని దాసగణూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నారు.

||శ్రీహరిహరార్పణమస్తు ॥

౹౹ శుభం భవతు ౹౹

ఆ ఇతి ద్వితీయోధ్యాయః సమాప్తః౹౹

2వ అధ్యాయము సంపూరణం.

యే మనుష్యః మాం ఆశ్రతః!
తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!

3 అధ్యాయం