శ్రీ గజనన విజయం

మొదటి అధ్యాయం click for pdf


శ్రీ గణేశాయ నమః. జయ జయ జయహే గణపతీ ! గౌరపుత్రా! మయూరేశ్వరా! ఏ పని ప్రారంభించుటకైననూ ముందు పెద్ద పెద్ద విద్వాంసులూ, సాధువులూ, యోగులూ, సత్పురుసులూ, నిన్ను స్మరించక ముందుకు పోలేరు. నీ కృప కలిగినప్పుడు అన్ని బాధలూ, ఆపదలూ అగ్ని స్పర్శచేత దూది ఎలా భస్మమౌతుందోఅలా ఇట్టే మాయమౌతాయి! అందుచేత నేను (దానగణూ- గజానన విజయ గ్రంథరచయిత) నీ ఆశీర్వచనము. కృపా కటాక్షముల వలన ఈ గద్య రచన రసనిష్యందిగా సాగిపోవాలని నిన్ను ప్రార్ధిస్తున్నాను. నేను అజ్ఞానుడను, మందబుద్ధిని, నాలో కవితాశక్తి ఏ మాత్రమూ లేదు. కానీ నీకృప కలిగినచో నా యీ కార్యము సఫల మవగలదు. ఇక, బ్రహ్మ యొక్క ప్రకృతియైనట్టియు, కవివరులు ధ్యేయమూర్తి యైనట్టియు, వారిలో కవితా స్ఫూర్తిని కలిగించు నట్టియు సరస్వతీ దేవికి, బ్రహ్మకుమారి శారదాదేవికి సాష్టాంగ ప్రణామము చేస్తున్నాను. నేను నీ బిడ్డలాంటి వాడిని, నా గౌరవ మర్యాదలు కాపాడటం నీ చేతిలోనే వుంది. నీ కృపాకటాక్షము వలన కుంటి, గ్రుడ్డి వారు పర్వతాలు కూడా ఎక్కేస్తారు. మూగవాడు అనర్గళంగా మాట్లాడ గలుగుతాడు. అటువంటి నీ అవ్యాజమైన మహిమకు నా వలన ఎట్టి కళంకం రాకూడదు. అందువలన ఈ గ్రంధరచన చేయటానికి యీ 'దాసగణునికి సాయపడు. ఇంకనూ ఓ పురాణ పురుషా! పండరిపురాధీశ | ఓ పాండురంగా సచ్చిదానంద రమేశా! దీనబంధో ! పాహి మాం!" నీవు జగదాధారుడవు, చరాచర వ్యాప్తుడవు, కర్తా ధర్మా నీవే. ఇంతెల, సర్వమూ నీవే, జగమునకు, జనమునకు జనార్ధనుడవు, నీ వొక్కడవే పరిపూర్ణుడవు, సగుణ నిర్గుణరూప అభిన్నుడవు.అట్టి నీ అగాధ మహిమను పెద్దలే తెలియగలేరు. ఇక ఈ దాసగణుడు ఎంతటివాడు? కాని రాముని కృపా విశేషమున కపిగణములూ, కృష్ణ కృపారసమున గోపబాలురూ బలవంతులు అవలేదా? అట్టి నీ కృపావిశేషములను పొందటానికి ధనసంపదలతో పని యేమున్నది? అనన్య భక్తి ప్రపత్తులే నీ కృపా విశేషమును పొందుటకు చాలు కదా అని యోగులూ, మహాత్ములూ విశదపరిచారు కదా ! అదే నమ్మకంతో నేను నీ శరణుజొచ్చాను. ఓ రమాపరా నాపై కొంత నీ కృపారసమును వెదజల్లుము. నీ గడప తొక్కిన వాడికి ఏమీ ఇవ్వకుండా ఒట్టి చేతులతో వెనక్కి వంపకు! హే పండరిరాయా నాపై దయతో ఈ యోగిపుంగవుని చరిత్రను | రచించుటలో సాయపడి నిర్విఘ్నంగా పూర్తిచేయించు. హే భవభయాన్తకా | భవానీశ్వరా! శ్రీకంఠ ! గంగారదా! ఓంకారరూప! త్ర్యంబకేశ్వరా!

నీ అభయపాస్తాన్ని నామస్తకము పై నుంచి నన్నాశీర్వదించు ! నీ ఆభయ ప్రధానం వలన కాలుని భయంకూడా కలుగదు కదా! పరుసవేది స్పర్శవలన లోహము కూడా బంగార మౌతుంది కదా ! నీకృపయే ఒక పరుసవేది కదా ! నేనే ఇక ఆ లోహమునౌదును కదా. కాబట్టి నావంటి అబోదబాలకునిపై ఇంచుక దయ జూపవే, నన్ను నీకృపాపాత్రుణ్ణి చేయక వెనుకకు పంపకు.సర్వశక్తి మంతుడవు నీవే అగుటవలన నన్ను కృప జూచుటేమంత కష్టమైన పని కాదు! కాబట్టి ఈ గ్రంధరచన సుగమమవటానికి, పరిపూర్ణమవటానికి నాకు సాయపడుము. కోల్హాపురవాసిని జగన్మాత జగదంబ నా కులదేవత కావున, నా యీ చేపట్టిన కార్యము సఫల నువటానికై ఆమె చరణారవిందాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. శ్రీ దుర్గా ! ఓ భవానీ! ఓ ఆవర్ణా! ఓ అంబా ఓమృడానీ, మీరందరూ. యీ దాసగణుని ఆశీర్వదించండి! ఇక యీ గజానన చరిత్రను గానం చేయటానికి తగిన స్ఫూర్తి నిమ్మని త్రిమూర్తి స్వరూపుడైన ఆ దత్తాత్రేయునకు నమస్కరిస్తున్నాను. శాండిల్యాది ఋషీశ్వరులకును, వసిష్ఠ గౌతమ పరాశరులకును, జ్ఞాన సూర్యుదారిశంకరులకును, వందనము చేయుచున్నాను. ఇక యీ దాసగణునిచే యీ చరిత్ర వ్రాయించటానికై యోగిపురుషులను, మహాత్ములను సవినయంగా ప్రార్ధిస్తున్నాను, గహనీ వాధులు, నివృత్తి నాధులు, జ్ఞానేశ్వరులూ, తుకారాము వీరందరూ భవ బంధనాన్ని ఛేదించి ముక్తిని ప్రసాదింప చేసేవారు. శ్రీ సమర్ధ రామదాసులకు గూడా నా నమస్సులు ఓ షిరిడీ సాయి బాబా! పుణ్య పురుషుడైన వామనశాస్త్రి ! యీ 'దాసగణ నకు అభయమియండి మీ పెద్దలందరి ఆశీర్వచనం వల్లనే నా యీ కార్యము సఫలమౌతుంది! ఈ దాసగణుడు మీ చిన్ని పాపడు. నానుండి ముఖం త్రిప్పుకోకండి! అసలైన మమకారమే బిడ్డలో మాటలు పలికిస్తుంది. మీకూ నాకూ గల యీ సంబంధం, తల్లి బిడ్డల బాంధవ్యం వంటిది. కలం అక్షరాలెన్నో వ్రాస్తుంది. కానీ కావ్యాలు వ్రాయలేదు కదా? కావ్యాలు వ్రాయటాని కొక సూత్రధారుడు కావాలి. అందుచేత ఓ ఋషిపుంగవులారా! ఓ మహాత్ములారా! మీరంతా నా కలానికి సూత్రధారులు కండి అని యీ దాసగణుడు వేడుకుంటున్నారు. ఓ శ్రోతలారా, జాగరూకులై, స్థిరమనస్సు కలవారై యీ యోగి పుంగవుని కథ నాలకించి మీ జీవితాలు ధన్యం చేసుకోండి. భూలోకంలో భ్రమించే యీ యోగి పుంగవులు సాక్షాత్తూ పరమేశ్వరుని స్వరూపాలు. వైరాగ్య సాగరులు ఈ సశ్వర ప్రపంచంనుండి కాపాడి ముక్తిని ప్రసాదింపచేసే మహాత్ములు ! ఈ మహాత్ముల పాదరూళిని స్వీకరించినా, వారి....

శరణుజొచ్చినా, శరణాగతుని జీవితం ధన్యమౌతుంది. అట్టి యీ మహాత్ముని చరిత్రను ఏకాగ్రచిత్తులై ఆలకించండి. ఇట్టి మహాత్ము లెవ్వరూ.. నేటివరకు ఎవ్వరిని మోసగించలేదు. ఈ మహాత్ములు పారమార్ధిక మార్గంలో పయనించే నిజమైన సాధకులకు సరియైన మార్గదర్శనం చేస్తారు. అట్టి మార్గదర్శనం లభించిన సాధకుని మానవజీవితం ధన్యమౌతుంది. ఎవరైతే యోగులూ, మహాత్ముల పై అచంచల భక్తి విశ్వాసాలు కలిగి వుంటూరో వారికి రుక్మిణీ వల్లభుడు ఎప్పుడూ ఋణపడే వుంటాడు. అందుచేత ఓ శ్రోతలారా ! సావధానులై యీ గజానన చరిత్రను, ఆలకించండి. ఈ పుణ్య భారతావనిలో ఎందరో మహాత్ములు జన్మించారు. ఇట్టి అదృష్టం మరే దేశానికి కలగలేదేమో. అందుచేతనే ఒకప్పుడు యీ భారతదేశంలో బంగారం పండేదట ! దీనికి కారణం అనాది కాలంగా ఎందరో మహానుభావుల ధరణారవిందాలు యీ భూమిని పావనం చేయటము కావచ్చు. నారదుడు,ధ్రువుడు, కయాధకుమారుడు, ఉద్ధవుడు, కుచేలుడు, సుభద్రా వరుకు, మహాబలి అంజనీకుమారుడు, అజాతశత్రువు ధర్మరాజాదులు.సాధకులకు కల్పతరువు. ఆధ్యాత్మిక విద్యలో మేరువును బోలిన ఆ జగద్గురు శంకరాచార్యులు మొదలైనవారి పుణ్యభూమిపై జన్మించటమే.మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, రామానుజాచార్యులు మొదలైన ఆచార్యులెందరో ఆధ్యాత్మిక క్షేత్రంలో యీ భారతావని యొక్క గౌరవాన్ని యినుమడింపచేశారు. నరసీ మెహతా,తులసీదాసు, కబీరు, కమాల్, సూరదాసు, గౌరాంగప్రభు మొదలైనవారు యీ పవిత్ర భారతంలో జన్మించి చేసి చూపించిన లీలలను ఎవరైనా ఎంతని వర్ణించగలరు? రాజకన్యయైన మీరాబాయి యొక్క ప్రభుభక్తిని వర్ణించటం సాధారణ మానవునికి ఆశక్యం, శేషశాయి యైన విష్ణుభగవానుడు ఆమెకిచ్చిన విషాన్ని త్రాగి ఆమెను రక్షించాడు. గోరఖ్ నాధులు, మత్స్యంద్ర నాధులు, జలంధరనాథ యోగీశ్వరులు ఎంతో మహత్తు కలిగినవారు. వీరు కావించిన 'మానవలీలలు' నవనాథ భక్తిసార' మనే గ్రంథంలో వర్ణించబడినాయి. దుర్గమమైన సాధన మార్గాన్ని వదలి కేవలం భగవద్భక్తినే సాధన చేసి భగవత్ప్రప్తిని పొందినవారిలో నామదేవులు, నరహరి, కంసాలి, జనాబాయి, కానోపాత్ర, సతీ సక్కుబాయి, చోగామాలవాడు, సావతామాలి, కూర్మదాసు, దామజీవంతు మొదలైన వారు ప్రముఖులు. దామోజీపంత్ కోసం భగవంతుడు మాలవాడై 'బీదర్' రాజాస్థానానికి పోయి అతడివ్వవలసిన పైకం చెల్లించి రక్షించాడు. ముకుందరాజు, జనార్ధనుడు, బోధలుడు, నిఫట నిరంజనుడు......

మొదలైన మహాత్ముల చరిత్రలను మహిపతి గానం చేయనే చేశారు. వీరిని గురించి ఇంకా తెలియటానికి భక్తి విజయము, భక్తిమాల, అనే గ్రంథాలు చదవండి, తరువాత యోగులైన వారిని గూర్చి నేను మూడు గ్రంథాల్లో సంక్షిప్తం చేశాను. పైన పేర్కొన్న వారి కోవకు చెందినవారే 'గజానన మహరాజులూ'ను. వీరి ప్రభావం ప్రజలపైన ఎప్పుడూ వుంటూనే వచ్చింది. నా సుకృతం వలన 'గజానన చరిత్ర'ను గానం చేసే అదృష్టం నాకు కలిగింది. వారి తొలి దర్శనభాగ్యం నాకు ఆకోటో గ్రామంలో లభించింది. దారానికి ముందు మణుల నెక్కించి చివరగా మేరుమణిని కూర్చినట్లుగా యీ చరిత్ర గానం చేయటంలో నా స్థితి ఏర్పడింది. విదర్భదేశంలోని వర్హడ ప్రాంతంలో ఖాంగాంవ్ తహసీలులో "శేగాంవ్" అనే ఒక చిన్న గ్రామం వుంది. ఆ గ్రామం చిన్న దైనప్పటికి ఒక విశిష్టమైన వ్యక్తి వుండటంవలన దాని పేరు ప్రఖ్యాతులు నలుదిశలా వ్యాపించినై.ఆ శేగాంవ్ అనే సరొవరంలో 'గజానన' రూపమైన కమలం వికసించి దాని సౌరభం నలుదిశలా వ్యాపించింది. ఆ గజాననుల లీలలు నా స్వల్ప బుద్దితో చెప్పదలిచాను. అట్టి గజాననుల పాదపద్మముల యందు భక్తి శ్రద్ధలుంచి యీ చరిత్రను వినండి. మీరు ఉద్ధరింపబడుతారు. 'గజాననుల చరిత్ర' మేఘమువంటిదైతే శ్రోతలు నెమల్లు కావాలి. చరిత్ర రూపమైన మేఘం వర్షించినట్లైతే శ్రోతృరూపులైన నెమళ్ళు ఆనందంతో పులకించి గంతులు. వేస్తాయి. నాట్యం చేస్తాయి. శేగాంవ్ నివాసులులెంత అదృష్టవంతులో! అందుకే వారికి 'గజాననులు' లభించారు. ఎంతో పుణ్యంచేసుకుంటేగానీ -ఆ స్థలం మహాత్ముల పాదధూళిచేత పవిత్రంవ చేయబడదు అని అంటారు. భగవంతునికంటే కూడా భక్తుడే శ్రేష్ఠుడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కార్తీకమాసంలో పండరీపురానికి రామచంద్రపాటిల్ వచ్చి శ్రీ గజాననుల చరిత్రను వ్రాయమని కోరాడు. గజాననుల చరిత్రను గానంచేయాలనే కోరిక నా కెన్నాళ్ళుగానో వుంది. కానీ ఎవరి చరిత్రను వ్రాయదలిచామో వారి సహవాసం నితాంతమూ వుండాలి. కానీ నాదుర్భాగ్యవశాన ఆది నాకు లభించలేదు. ఐనా సదవకాశం కలిగినప్పుడు భగవత్కృప ఏదోవిధంగా లభిస్తుంది. ఇప్పుడు 'గజానన మహరాజులు' రామచంద్రపాటిల్ ని నా దగ్గరకు పంపి నా కోరికను నెరవేర్చారు. 'గజాననులు' వర్తమానంలోని మహాత్ములలో చూడామణి వంటివారు. మహారాజులు ఎక్కడ జన్మించారు? వారెక్కడ నుండి వచ్చారు? వారే జాతి వారు? వీటిని గురించి ఎవరికీ తెలియదు. నిజానికి యిలాంటి విషయాలు ఎలా తెలుస్తాయి? బ్రహ్మ నెవరైనా.....

యినాటి వరకు తెలుసుకో గలిగారా? అసలు సిసలైన రత్నం దొరికినప్పుడు అన్నీమఱచి దాని కాంతిపైనే తమదృష్టిని కేంద్రీకరిస్తారు. గజాననుల విషయంలో కూడా సరిగ్గా అదే అయింది. వారెవరు? ఎక్కడ నుండి వచ్చారు? అనే విషయాలు ఎవ్వరికీ తెలియవు. గజాననులు యువకులుగా శక సంవత్సరం 1800 మాఘ పద్య సప్తమి (23-2-1878) తిథినాడు అకస్మాత్తుగా శేగాంవ్ లో ప్రత్యక్షమయ్యారు. గజాననులు స్వామి సమర్థ రామదాసుగారి మూల నివాసస్థానమైన 'సజ్జనగడ్' నుండి వచ్చారని అంటూ వుంటారు. వీటికి ఆధార మేమీ లేదు. కానీ యీ జనశ్రుతిలో కొంత సత్యం ఉండవచ్చు. ఆ సమయంలో ప్రజలు పథభ్రష్టులై వివేక హీనులయ్యారు. అనేక రకాలవైన ఆపదలనూ, కష్టములనూ ఎదుర్కోవలసి వచ్చేది. ప్రజల యీదుస్థితి చూసి దేవుడే గజాననుల రూపంలో అవతరించారేమో లోకోద్ధారణకై భగవంతుడు ఏదో ఒక రూపంలో యీ భూమిపై అవతరిస్తాడు. గోరఖ్ నాథుడు బయట పారవేసిన పెంటలో జన్మించాడు. కానీఫనాథుడు చెవినుండి జన్మిస్తే చాంగదేవుడు నీటితూములో జన్మించాడు. గజాననులు అవతారమెత్తటానికి కూడా అలాటిదే ఏదో రహస్యం వుండవచ్చు. సిద్దయోగులలో వుండే లక్షణాలన్నీ గజానసులలో కానవచ్చేవి. దీని అనుభవాన్ని పాఠకులు ముందు ముందు వీరి లీలల వలన తెలుసుకుంటారు. మాఘవద్య సప్తమినాడు శేగాంవ్ లో ప్రవేశించి గజాననులు చూపిన లీలలను నేనిప్పుడు చెపుతాను. 'పాతూర్కర్' వంశంలో 'దేవదాసు' అనే ఒక సజ్జన మఠాధిపతి వుండేవాడు. ఆయన గొప్ప ధార్మిక ప్రవృత్తి కలవాడు. కుమారుని గ్రహశాంతి కోసం బ్రాహ్మణులకు అన్న దాన కార్యక్రమం ఏర్పాటుచేశాడు. భోజనానంతరం ఎంగిలివిస్తళ్ళు బయట పారేశారు. ఆ ఎంగిలి విస్తళ్ల దగ్గరే సిద్ధుడైన యోగి గజానన మహరాజ్ కూర్చొని ఉన్నారు. ఉపాధిరహితుడవటం వలన ఆయన దగ్గర ఏ వస్తువు లేదు. నీరు త్రాగటానికి మాత్రం ఒక కమండలం వుంది. చేతిలో సొంతంగా మట్టితో తయారుచేసి కాల్చిన హుక్కా గొట్టం తప్ప యింకేమీ లేదు. కానీ ముఖమండలం శాంత గంభీరంగాను దృష్టి నాసికాగ్రభాగాన నిలిపిన వారి తపోబలం అంగప్రత్యంగాల ద్వారా బహిర్గతమౌతూ, ప్రాతఃకాల బాలభాసుని ప్రకాశకిరణం వలె వెలిగిపోతోంది. విదేహుడవటం వలన (దేహజ్ఞానం లేకపోవటం) ఆయన దిగంబరులుగా తిరిగేవారు. నేను, నీవు అనేభేదభావం లేక పోవటం వలన వారివృత్తి అభిన్నమైంది. నిరాసక్తులవటం వలన నోటికి రుచే లేకుండా పోయింది. అట్టి నిర్మోహి ఎంగిలి ఆకుల


దగ్గర చేరి వాటిలో ఏదో వెతుకుతున్నారు. ఎంగిలి ఆకులలోని వెంగిలి మెతుకులు ఏవైనా దొరికితే అమాంతం నోట వేసుకునేవారు. అన్నం - పరబ్రహ్మస్వరూపం" అని ఎలుగెత్తి చెప్పటానికే యీ లీల చేశారేమో? అన్నం బ్రహ్మ స్వరూపమ"నే విషయాన్ని శ్రుతులు ఎలుగెత్తి చాటుతున్నాయి. ఉపశిపత్రులలో కూడా అన్నం బ్రహ్మేతి అని చెప్పబడింది. జీవితంలో 'అన్నం యొక్క మహత్తు చాలా వుందని లోకులకు చెప్పటానికే గజాననులు ఎంగిలి మెతుకులు తింటూవుండటం కానీ, మూఢమతులకు యిది తెలిస్తే కధ. బంకట్లాల్ అగర్వాల్, అతని మిత్రుడైన దామోదర్ పంత్ కులకర్ణితో అసమయాన అటుగా వచ్చాడు. (మహారాజు) గజాననుల యీ కర్తృత్వాన్ని చూసి ఇద్దరూ ఆశ్చర్యచకితులై స్తబ్దులయ్యారు. వారు ఒక్కరితో ఒకరు ఇలా అనుకోసాగారు. ఈయన వెర్రివాని పనులు చేస్తున్నారు. అన్ఫార్తియైతే ఏదైనా అడగవచ్చును కదా? దేవదాసు సజ్జనుడు తప్పకుండా ఏదో ఒకటి యిచ్చివుండే నాడు గుమ్మంచగ్గర కొచ్చిన యాచకుడు యజమాని ఇంటినుండి విముఖుడై ఎప్పటికీ తిరిగిపోదు. ఇట్టి స్థితిలో యీయనచేసే పనిలో ఏదో రహస్యం వుండి వుంటుంది గజాననులు యీ పనిని చూస్తూ వారిద్దరూ కొంతసేపు నిలబడిపోయారు. వ్యాసమహర్షి భాగవతంలో విరక్తుడైన సాధువు అప్పుడప్పుడూ పిచ్చివానిలా వ్యవహరిస్తాడు అని అన్నాడు. ఈయన చేసేపని పిచ్చివాని పనిలా కనపడినా, వీరెవరో సిద్ధుడైన సాధువుగా గోచరిస్తున్నాడు. అటువైపు చాలామంది వస్తుండే వారు, వెడుతూవుండేవారు. కానీ వీరిద్దరు తప్ప మరెవ్వరూ గజాననుల వైపుగానీ, వారి పనులవైపుగానీ తమ దృష్టిని సారించలేదు. సామాన్యుల దృష్టిలో గాజుకి రత్నానికి భేదంవుండదు కదా. అమూల్య రత్నాన్ని రత్నాలవ్యాపారియే గుర్తించగలడు. కొంతసేపైన తరువాత బంకటాల్ అగర్వాల్ ఆ మహాత్మునివైపు వెళ్ళాడు. వినమ్రుడై "స్వామీ! ఈ ఎంగిలి ఆకుల్లోని ఎంగిలి మెతుకు లేందుకుతింటున్నారు? మీకు ఆకలిగా వున్నట్లైతే అన్నం సిద్ధం చేయిస్తాను" అన్నారు. స్వామి కావాలని కానీ వద్దని కానీ ఏమీ అనక వారిద్దరి పై తమ దృష్టిని సారించారు. వారిద్దరూ స్వామి శరీరం దివ్యమైన కాంతిపుంజంతో వెలిగిపోతూండటం గమనించారు. సుందరమైన కేంఠము, దృఢశరీర సౌష్టవము, విశాల వక్షస్థలము, భ్రుకుటిమధ్యమున స్థిరమై నిలిచిన దృష్టిని తిలకించారు. నిజమైన ఆనందంలో మునిగివున్న ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూసి వారిద్దరూ మనస్సులోనే నమస్కరించారు. తరువాత వారు దేవదాసుని పిలిచి విషయాన్ని సవిస్తరంగా చెప్పి


భోజనపాత్ర తెమ్మని కోరారు. దేవదాసు ఒక పళ్ళెరంలో భోజన పదార్థాలన్నింటిని వర్ణించి స్వామిముందుంచాడు.భోజన పళ్ళెరాన్ని చూసి స్వామి భోజనం చేయటం ప్రారంభించారు. వారికి భోజన పదార్ధాలేవీ రుచించలేదు. బ్రహ్మరసాస్వాదాన్ని గ్రోలినవారికి యీ పదార్ధాలెందుకు రుచిస్తాయి? సార్వభౌముడైన రాజుకు కొద్దిపాటి బహుముతుల వలన సంతోషం కలుగుతుందా? స్వామి అన్ని పదార్థాలని కలిపివేసి నిరాసక్తతతో భుజించి మాధ్యాహ్నిక జఠరాగ్నిని శాంత పరిచారు. ఇదంతా చూసిన బంకట్ లాల్ మనం స్వామీజీని పిచ్చివాడనుకొని మహాపరాధం చేశాం. శ్రీకృష్ణద సుభద్రకై కృష్ణుని చెలికాడైన అర్జునుడు వెఱ్ఱివాడై ఏవేవో ప్రగల్భాలు పలికాడు కదా! అలానే యీ యోగి పుంగవుడు ముక్తి రూపమైన సుభద్రకోసమే యీలా వెఱ్ఱివాడయాడేమో ! స్వామి పాదధూళిచేత మన శేగాంవ్ ఎంతో ధన్యమైంది. సూర్యుడు నడినెత్తిపైకి వచ్చిన కారణంగా వాయుమండలం తప్తమైంది. అందుచేత గగనంలో విహరించే పక్షిగణాలు నీడకోసం వృక్షాల నాశ్రయించాయి. అలాటి మండుటెండలో స్వామి బ్రహ్మానందంలో లీనమై కూర్చొని వున్నారు. నిజంగా 'వారు బ్రహ్మయేనేమో' అని అనిపిస్తుంది. స్వామి భోజనం చేశారు. కానీ నీటికమండలం ఖాళీగా వుండటం వారిద్దరూ గ్రహించారు. అందుచేత దామోదరుడు స్వామిని 'కమండలంలో నీరు లేదు. మీరు కోరినట్లయితే యీ దాసుడు నీరు తెచ్చివ్వగలడు' అన్నాడు. ఇది విని స్వామి మందహాసం చేసి ఏమన్నారో వినండి మీ కవసరమైతే తీసుకొనిరండి. ఒకే బ్రహ్మ యీ జగత్తులో అనేక రూపాల్లో నిండి వున్నాడు. నేను, నీవు అనే తేడా అక్కడ లేదు. కానీ భౌతిక ప్రపంచంలో దేహధారణ కోసం కొన్ని వస్తువులు కావలసివుంటై. ఇప్పుడు అన్నం తిన్నాను. కాబట్టి నీరు కూడా త్రాగటం తప్పదు. అందుచేత మీరు కావాలనుకుంటే నీటి ఏర్పాటు కూడా చెయ్యండి అన్నారు. ఇది వింటూనే కించిత్ సేవచేయటానికి తగిన సమయం దొరికిందని ఇద్దరూ సంతోషించారు. ఎంతో ఉత్సాహంతో దామోదరపంత్ నీరు తేవటానికై దేవదాసు ఇంటివైపు పరిగెత్తాడు. ఇక్కడ స్వామి నూతిదగ్గర పశువులకై వుంచిన నీటిని త్రాగి తృప్తిగా 'బ్రేవ్' మని తేల్చారు. ఇంతలో పంత్ పవిత్రజలాన్ని తెచ్చి స్వామీ! మీరు త్రాగే నీరు మురికినీరు.. అవి పశువులకోసం వుపయోగించేవి. వాటిని త్రాగకండి అన్నాడు. అది విని స్వామి మందహాసం చేసి 'అలాంటి లౌకికమైన మాటలు నాతో అనకండి. -బ్రహ్మ సమస్త చరాచర వస్తువులలోను, యీ బ్రహ్మాండంలోను నిండి వున్నాడు. అక్కడ పవిత్రం - అపవిత్రం, మంచి - చెడూ అనే తేడాలుండవు. నీరు కూడా ఈశ్వరుడే. అంతే కాదు దాన్ని త్రాగేవాడు కూడా ఈశ్వరుడే కదా. కానీ భగవంతుని లీలలు ఆతర్క్యమైనవి. వీటిని సామాన్య స్త్రీ పురుషులు తెలుసుకోలేరు. అందుచేత భగంతుడు సర్వ వ్యాపి అని తెలుసుకొనటానికి ప్రయత్నం చెయ్యి" అన్నారు. స్వామి యొక్క ఆ అమృతవాక్కులు విని, వారి విదేహవృత్తిని చూసి, ఇద్దరూ మనస్సులోనే అత్యంతప్రసన్నులయ్యారు. ఇక నతమపస్తకులై ప్రణామం చేయబోతుండగా స్వామి వాయువేగంతో అక్కడి నుండి పరిగెత్తి పోయారు. వారి వాయువేగాన్నెవరాపగలరు? ద్వితీయాధ్యాయంలోని ముందుకథను సావధానులై ఆలకించండి. ఈ గజానన విజయమనే గ్రంధము శ్రోతలను ప్రసన్నులుగా నుంచుగాక అని 'దాసగణూ' భగవంతుని ప్రార్ధిస్తున్నాడు.

... శ్రీ హరిహరార్పణ మస్తు .. || ఇతి ప్రథమోధ్యాయః సమాప్తః....

॥ శుభం భవతు ॥

మొదటి అధ్యాయం సంపూర్ణం.

 రెండవ అద్యయం 

యే మనుష్యః మాం ఆశ్రతః!
తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!