సర్వం శ్రీసాయి
శ్రీ గోదావరి మాత చరిత్ర
9వ అధ్యాయం

 

శ్రీ గోదావరిమాతాజీ 1958వ సంవత్సరం దిక్షిణ భారతం పర్యటనకి వచ్చారు . వారు శ్రీ హంసదేవ మహారాజుగారి ఆహ్వానాన్ని పురస్రరించుకొని వేసవిలో ముందుగా ఉదకమండలం వెళ్లారు. హంస దేవమహారాజుగారి ఆశ్రమశాఖ ఒకటి ఉదక మండలంలో కూడ ఉన్నది. ఉదకమండలం ప్రకృతి సౌందర్యానికి పట్టుకొమ్మ. అక్కడి కొబ్బరి తోటలు, అరటి తోటలు, పచ్చని పొలాలు, యూకలిప్టస్ చెట్లు, నీలగిరి శిఖరాలు మనలను ముగ్ధులను తన్మయులను చేస్తాయి. శ్రీ గోదావరిమాతాజీ వెంట ప్రభా, మంగళా, సులోచనా, దేశీతాయి మొదలైన కన్యకలతోపాటు శ్రీ మామా సాహెబ్ ఖాండేకర్, రణచోడ్ భాయి చౌకలస్, డాక్టర్ జయసుఖభాయి మార్చేంట్ ప్రభృతులు వెళ్ళరు. శ్రీ గోదావరి మాతాజీ ముందుగా బెంగుళూరు వెళ్ళారు. బెంగుళూరు త్రోవలో హుబ్లీలోని సిద్ధారూఢ స్వామి ఆశ్రమం దర్శించారు. బెంగుళూరులో, విమానాలు, రైలు ఇంజన్లు, టెలిఫోన్లు తయారుచేసే కర్మాగారాలు చూసారు. ఒక రోజున బెంగుళూరులోని ఖేడ్ గాంవ్ నారాయణ మహారాజు సమాదీని దర్శించారు. శ్రీ నారాయణ మహారాజు తమ దేహయాత్ర చాలించేముందు బెంగుళూరులో గొప్ప రుద్రయాగం చేసారు. యాగం ఐపోయిన తరువాత బ్రాహ్మణులకు  భోజన సంతర్పణం చేసారు. అయిన  తరువాత అందరికీ సంభావన ఇచ్చారు. అప్పుడు సమీపపర్తి అనుచరునితో "కార్యమంతా  ఐపోయినట్లేనా? అని అడిగినారు. అతడు 'ఐపోయినట్లే' అని సమాధానం చెప్పిన  అప్పటికప్పుడు శ్రీ నారాయణ మహారాజు తాము తలపెట్టిన కార్యములన్నీ ముగిసాయనట్లుగా వెంటనే దేహం చాలించారు. అటువంటి మహనీయులు వారు, భక్తులైన సర్దార్ గంగోజీరావు బెంగుళూరులోనే గురువులకు సమాధి మందిరం నిర్మించినారు. బెంగుళూరు నుండి శ్రీగోదావరి మాతాజీ ఉదకమండలం వెళ్ళి హంస దేవ మహారాజుగారి ఆశ్రమంలో నాలుగైదు దినాలున్నారు. ఆశ్రమం ప్రకృతి ఒడిలో పోదగినట్లుంటుంది. ఆశ్రమం పచ్చటి పొలాలు పూలతోటలు పండ్లతోటల మధ్య చూడముచ్చటగా ఉంది. శ్రీగోదావరిమాతాజీ రాకతో హంసదేవి మహారాజు చాలా సంతోషించారు ఉదకమండలంలోనే గోటి అనే ప్రాంతంలో శ్రీనారాయణ గురువుల ఆశ్రమం కూడ ఉన్నది. శ్రీ నారాయణ గురువుల ఆశ్రమాలు దక్షిణభారతంలో చాలచోట్ల వెలసి ఉన్నయి. వారు ఈశ్వరీయకోటికి చెందిన సత్పురుషులు: గొప్ప అద్వైత ప్రవర్తకులు. ఆశ్రమానికి ప్రస్తుతాధికారి డాక్టర్ నటరాజన్ ఇంకా జాన్ స్పియర్స్ శ్రీ గోదావరి మాతాజీని దర్శించి ఆశ్రమానికి ఆహ్వానించారు.

తిరుగు ప్రయాణంలో శ్రీ గోదావరిమాతాజీ మైసూరులో సిల్కు, శ్రీ చందనం కర్మాగారాలు చూచినారు. ఒక రోజు మహిషాసురమర్దనిని దర్శించారు. శ్రీరంగ పట్ణంలో శ్రీరంగనాథస్వామిని సేవించి, ఇరావతీ తీరాన టిప్పు సుల్తాన్ సమాధి చూచి, శ్రవణబెళగోళలోని జైనమందిరం దర్శించి శివమొగ్గ మీదుగా బెంగుళూరుకు తిరిగి వచ్చినారు. బెంగుళూరులో శ్రీ గోదావరిమాతాజీ కాప్టెన్ మొదలియారు ఇంట బసచేసారు. కాప్టెన్ మొదలియారు కొడుకు ముస్లిం యువతిని పెండ్లిచేసుకున్నాడు. సనాతనధర్మ పరాయణురాలైన శ్రీ గోదావరి మాతాజీ తమ ఇంటికి వస్తారో రారో అని ఆందోళన చెందిన కాప్టెన్, వారి కుటుంబసభ్యులు శ్రీ గోదావరిమాతాజీ తమ అతిథి కావటంతో ఉబ్బి తబ్బిబ్బై పోయారు. కులంవారంతా మొదలియార్ కుటుంబాన్ని వెలి వేసారు. కాని శ్రీ గోదావరిమాతాజీ దర్శనం నిమిత్తంగా కులంవారు తదితరులూ మరల కాప్టెన్ మొదలియార్ యింటికి వచ్చరు. ఈ విధంగా శ్రీ గోదావరిమాతాజీ నిరాడంబరంగా సామాజికపరివర్తనం కూడ తెస్తుంటారు. అక్కడ నాలుగైదు రోజులున్న తరువాత శ్రీ గోదావరిమాతాజీ పూనా చేరుకొని శ్రీ ప్రధాన్ గారింట అతిథులుగా ఉన్నారు. ప్రధాన్ గారి తోబుట్టువులు సాకోరి ఆశ్రమంలో ఉంటారు. అందులో ఒకామె గీతా తీవ్రంగా జబ్బుపడినవార్త తెలిసి శ్రీ గోదావరి మాతాజీ వెంటనే సాకోరికి ప్రయాణమైనారు. శ్రీ గోదావరి మాతాజీ సాకోరి చేరే సమయానికి గీతాతాయి విచిత్రమైన అనుభవం కల్గింది. తీవ్రమైన జబ్బుతో ఆమె 36 గంటలు స్మృతి కోల్పోయింది. డాక్టర్లు ఆశ వదలుకున్నారు. ఏ క్షణాననైనా ఆమె చనిపోతుందనుకున్నారు. ఆశ్రమవాసు లందరూ నిరాశతో ఆమెకు ఆరోగ్యం ప్రసాదించవలసిందని కరుణామయుడైన భగవంతుని ప్రార్థించారు.

 

ఒడలు తెలివి తప్పిన ఇట్టి పరిస్థితిలో గీతకు ఒక విచిత్రానుభవం కలిగింది. ఆమె ఒక దృశ్యం చూచింది. దివ్యప్రభామండలం మధ్యలో శ్రీ గోదావరి మాతాజీ దర్శనమిచ్చారు. క్రమంగా ఆ వెలుతురు గదంతా నిండిపోయింది. శ్రీ గోదావరి మాతాజీ గీతా సమీపాన కూర్చుండి ప్రేమార్ద్రంగా "గీతాః నీవు చాలా బల హీనమై పోయావు పాపం. నాకు ఎప్పుడూ నీ జ్ఞాపకమే. నీవు ఎడతెగకుండా నన్ను స్మరించటంచేత నేను ఊరుకోలేక పోయాను. అందరినీ విడిచి పెట్టి ఒక్కదాన్నే ముందుగా పరుగు పరుగున నీకోసం వచ్చినాను" అన్నారు. "ఎలా వచ్చారు? రైలుబండిలోనా?" అని గీత ప్రశ్నించింది. "ఇటువంటి సమయంలో రైలుకోసం మోటరుకోసం ఎదురు చూస్తారా? వాటిమీద ఆధారపడితే నీపని ఐపోయేది. సరే ఇక నీవు త్వరగా తేరుకో" అని శ్రీ గోదావరి మాతాజీ సమాసాసనం చేశారు.గీత అలవోకగా నవ్వింది. ఇవి తన జీవితపు తుదిగడియలని ఆమెకు తెలుసు కాని గోదావరిమాతాజీ దర్శనంతో ఆమెలో దైర్యం పుంజుకున్నది.

 

 ఈ విధమైన దుఃఖసాగరంలో మునిగి చింతిస్తున్న గీత చెవిలో శ్రీ గోదావరి మాతాజీ మాటలు "గీతా! నీ కెందుకు చింత? ఎందుకు భయపడుతున్నావు? ఆహారం ఏమీ తీసుకోలేదు కనుక బాగా బలహీనమైనావు" అని అమృతం కురిపించింది. "ఈనాటి బాబావారి ప్రవచనం విన్నావా?" అని శ్రీ గోదావరి మాతాజీ ప్రశ్న.లేదు అన్నట్లు గీత తల ఊపింది. "ఐతే విను" అంటూ శ్రీ గోదావరిమాతాజీ ఆ ప్రవచనం సారాంశం వినిపించారు.

 

శ్రీ సాయి వాక్సుధ రెండవ భాగం బుధవారం 18 జూన్ 1924. "అవ్యక్తా పాసూన్ పోషణ" శీర్షిక.

 

"భోజనం ఆవశ్యకత, వ్యక్తి అవ్యక్త పోషణ, సద్గురువు ద్వారం చెంత అవ్యక్తశక్తి, వ్యక్తి అవ్యక్త శరీరం, సత్పురుషుని సన్నిధిలో మృత్యువు, అధి వ్యాధిరూపదేవత, పరమేశ్వరుని దూతగా వ్యాధి, సద్గురువు కృప" ఈ విధంగా శ్రీ గోదావరి మాతాజీ ఇంకా కొనసాగించారు. "సరె నీవు ఆహారం ఏమి తీసుకోకున్నా బాబా వాక్కు ప్రకారం అవ్యక్త పోషణం నీకు జరుగుతునే ఉన్నది. నీవు రోజూ ఈ ప్రపచనం కొద్దికొద్దిగా చదువుతూ పో; బాగౌతావు. నేనిప్పుడే వస్తాను" అంటూ మరల ఒక సారి గీత వీపు నిమిరి ఆమె అదృశ్యురాలైనారు.

 

వెంటనే గీతకు హఠాత్తుగా స్పృహ వచ్చింది.శ్రీ  గోదావరి మాతాజీని పిలువ సాగింది. గీతకు స్పృహ రావటంతో అందరికీ ఊరట కలిగింది. చెంతనున్న ఒక కన్యక "గీతా!ఏమిటి విశేషం. శ్రీగోదావరి మాతాజీ దర్శనమైనదా?" అని ప్రశ్నింనించింది. గీత క్రమంగా తనకు కలిగిన అనుభవమంతా వివరించింది. ప్రవచనం విషయం వివరించి అరోజు బాబా సమాధివద్ద అదే ప్రవచనం చదివారా అని అడిగింది. ఆరోజు ఈ ప్రవచనమే పారాయణం చేయటం అందరినీ ఆశ్చసర్యంలో ముంచి వేసింది. మహానుభావుల పనితీరు దురూహ్యం కదా! ఆ రోజు నుండి గీత వ్యాధి క్రమంగా తగ్గడం జరిగింది. ఇదంతా శ్రీ గోదావరిమాతాజీ అనుగ్రహం కాక మరేమిటి ? గీత దాదాపు 14 సంవత్సరాలు మంచంపట్టి క్రమంగా తేరుకొని ఆశ్రమంలో మెల్లమెల్లగా నడువసాగింది; ఆశ్రమం పనుల్లో పాల్గొనసాగింది. ఇంత దీర్ఘ కాలం మంచంపట్టి చాలా బాధపడిన గీత పూలమాలలు అల్లుతూ, భ వేదమంత్రాలు చదువుతూ ఆశ్రమ కార్యభారం పంచుకుంటూ తిరగటం చూచిన భా వారి కనులలో ఆనందాశ్రువు లుప్పొంగిపోయాయి.

 

 

తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం.