సర్వం శ్రీసాయి
శ్రీ గోదావరి మాత చరిత్ర
7వ అధ్యాయం

1955వ సంవత్సరం ఫిబ్రవరిలో నెలలో శ్రీగోదావరిమాతాజీ ముంబయిలో చండీయాగం చేసారు. యజ్ఞ నిర్వహణకోసం ఒక సమితి ఏర్పాటైనది. సర్వ శ్రీ రణచోడ్ దాస్ నారాయణదాస్, సాలిసిటర్ , డాక్టర్ అమృతలాల్ పటేల్, మనహర్ లాల్ మటుభాయి, రావుబహద్దరు K.D. కోత్వాల్, మాణిక్ పావరీ వంటి పెద్ద లంతా అందులో సభ్యులు. యజ్ఞం విలేపార్లేలో ఫిబ్రవరి 10వ ప్రారంభమైనది. పూనా, నాగపురం, సూరతు, హైదరాబాదు ఇంకా ఇతర ప్రదేశాలనుండి పెద్ద సంఖ్యలో యజ్ఞ సందర్శనార్థమై భక్తులు వచ్చారు. వేదమంత్ర ఘోషలతో ప్రకృతి అంతా పులకించిపోయింది. నామసప్తాహము, ప్రవచనాలు, హరికథలు, సంకీర్తనలు, పారాయణం వంటి వివిధ కార్యక్రమాలు ఏర్పాటైనాయి. జలారామ సత్సంగ మండలి కాందేవాడి భజనమండలి, పునీత భజనమండలి, సత్యనారాయణ భజనమండలి, రామనామ భజనమండలివారి బృందాలు వచ్చి గొప్ప భజనకార్యక్రమాలు జరిపారు వాతావరణమంతా దివ్యనామ సంకీర్తనంతో మారుమ్రోగసాగింది.

శ్రీమత్ పరమహంస పరి వ్రాజకాచార్య స్వామి మహేశ్వరానందులు, స్వామి వాసుదేవానందులు, శ్రీ మధ్వతీర్థులు ,శ్రీ మహాదేవానందులు, శ్రీ అమరగిరి, శ్రీ విజ్ఞానానందస్వాములు, శ్రీ స్వతంత్రానందులు ఇంకా శ్రీ జయగంగా బెన్ వంటి ప్రముఖులు భక్తివేదాంత విషయాలపై సారగర్భితమైన ప్రపదనాలు చేసారు, మైసూరు, గోండల్, రొట్టా, ఉదయపూర్ రాజమాతలు దర్శనానికి వచ్చారు. 20 ఫిబ్రవరి రోజున పూర్ణాహుతి జరిగింది.ఆరోజున దాదాపు 30 వేలమంది ఈ భవ్యదృశ్యాన్ని చూసారు.మరుసటి రోజు యధాప్రకారం సత్యనారాయణపూజ, అన్నదానము జరిగిగాయి.యజ్ఞపర్తిసమాప్తి తరువాత స్వామి మహేశ్వరానందులు మహోత్సాహకర సంక్షిప్తభాషణం చేసారు. అందులో వారు శ్రీగోదావరిమాతాజీ దివ్యత్వాన్ని మహాజ్జ్వలంగా అభివర్ణిస్తూ ఇలా అభినందించారు.

"ముంబయి(బొంబాయి) అసలు పేరు ముంబాపురి, ముంబాదేవి మూలంగా ఈ నగరానికి ముంబాపురి అని పేరు రావడం జరిగింది. అమ్మవారి నగరంలో అమ్మ వారిద్వారా యజ్ఞం జరగటమే సముచితం. ఇంత వైభవంగా విశిష్టంగా జరిగిన యజ్ఞం చూడటం నా జీవితంలో ఇదే మొదటిసారి".

యజ్ఞం ముగిసిన మరుసటి రోజు అనగా 21 ఫిబ్రవరినాడు శ్రీ గోదావరి మాతాజీకి స్వామి మహేశ్వరానందులకు గొప్ప ఊరేగింపు జరిపించారు. ఈ శోభాయాత్ర సన్యాసాశ్రమం నుండి బయలు దేరి ఉపాసనీ మందిరం చేరుకున్నది. మార్గానికి ఇరువైపులా చేరిన జనసందోహం 'శ్రీ గోదావరీ మాతా కి జయ, స్వామి మహేశ్వరానందకూ జయ' అంటూ భక్త్యుద్రేకాలతో జయజయధ్వానాలు చేసారు. వాతావరణమంతా ఆనందకోలాహలంతో నిండిపోయింది. ముత్తైదువులు హారతులిచ్చి పుష్పమాలలు. సమర్పించి స్వాగతించారు. నయనాభిరామమైన ఆరోజు హృదయస్పర్శి దృశ్యం. భక్తుల స్మృతుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

కార్యనిర్వహణం మూలంగా శ్రీగోదావరిమాతాజీ బాగా అలసిపోవటం వలన వారికి కొంత విశ్రాంతి అవసర మైనది. అందువలన శ్రీ. వి.జి. గర్డే కోరిక మేరకు వారి యింటికి జోధ్పూరు వెళ్ళరు. శ్రీ గర్డేగారు జోధ్ ప్పూరు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాలు. వారి పర్యవేక్షణలోనే ఆ మహావిద్యాలయం నూతన భవనాల నిర్మాణం జరుగుతుండింది. శ్రీ గర్దే దంపతులకు సాకోరి ఆశ్రమంతో చాలా కాలంగా ప్రగాఢ సంబంధం ఉంది. వారిద్దరు శ్రీ గోదావరిమాతాజీకి అనన్యభక్తులు. వారి బంగ్లా కూడ విశాలమైనది కనుక శ్రీ గోదావరి మాతాజీ వారింటనే బసు చేసారు. శ్రీమతి గర్దే శ్రీగోదావరిమాతాజీకి భక్తి శ్రద్ధలతో పరిచర్యలు చేసింది. శ్రీ గోదావరి మాతాజీని ఈ విధంగా సేవించే అపూర్వమైన అవకాశం చిక్కి నందుకు ఆమె ఆనందానికి అవధులు లేవు.

గర్దే దంపతులకు ఇద్దరే కొడుకులు, పెద్దవాడు అరవింద్ చిన్నవాడు ఆనంద్. అరవింద్ ఖర్గపురంలో చదువుకుంటున్నాడు. ఆనంద్ మాత్రం జోధ్ పూర్లోనే చదువుతూ తలిదండ్రులవద్ద ఉంటున్నాడు. కుటుంబములో అందరి కంటె చిన్నవాడు కావటం మూలంగా ఆనందును అందరూ గారాబంగా చూచే వారు. శ్రీగోదావరి మాతాజీ ప్రేమసముద్రులు కావటంచేత ఆమె అతని యందు చూపిన గారానికి అవధి లేదు. ఒకరోజు శ్రీ గోదావరి మాతాజీ విపణివీథికి వెళ్లి విమానం ఆట బొమ్మ కొని తెచ్చారు. ఆ బొమ్మను ఆనంద్ కు ప్రేమతో బహూకరించి "నీవు బాగా చదువుకోవాలె. ఇంజనీరువు కావాలి. విదేశాలకు పోవాలె అప్పుడు ఇది ఉపయోగపడుతుంది" అన్నారు. ప్రతినిత్యం వలె శ్రీ గోదావరిమాతాజీ ఆనంద్ నవ్వు అన్నా లాటలాడుతున్నారు అనుకున్నారేగాని ఆ మాటల్లోని ఆంతర్యం ఎవరికీ అంతు పట్టలేదు. కాని కొంతకాలము తరువాత ఆనంద్ ఇంజనీరై అమెరికాకు ప్రయాణ మైనారు. ముందుగా సముద్రంపై నౌకాయాన మనుకున్నారు కాని హఠాత్తుగా ప్రయాణంలో మార్పువచ్చింది. అమెరికాకు వాయువిమానంలో వెళ్ళవలసి వచ్చింది. ఈ విధంగా శ్రీ గోదావరి మాతాజీ చెప్పిన భవిష్యవాణి అక్షరాల సత్యమైంది.

శ్రీ గోదావరి మాతాజీని ఏదైనా చల్లని పర్వతనివాసానికి విశ్రాంతికి తీసుకొని వెళ్లాలని శ్రీమతి లీలాబాయి గర్దేగారి చిరకాల కోరిక. ఆమె కోరికను మన్నించి శ్రీ గోదావరి మాతాజీ జోధ్ పూర్ నుండి మసూరికి వెళ్ళరు. ఎప్పటి లాగానే కొంతమంది కన్యకలూ భక్తులూ వారికి తోడుగా వెళ్ళరూ. మసూరీని ప్రకృతిరాజ్ఞిగా అభి వర్ణిస్తారు. నైసర్గికసౌందర్యానికి అది ఆటపట్టు. పర్వత ప్రదేశాలు, రాగి రంగు మట్టి, చక్కని ఆకుపచ్చ రంగు చట్టమైన అడవులు, అల్లంత దూరాన బాల భానుని స్వర్ణకిరణాలతో మెరసిపోయే మంచు శిఖరాలు, చూపరుల మనస్సు లను ఆనంద సాగరంలో ఓలలాడిస్తాయి. అక్కడి వాతావరణం చల్లగా ఉత్తేజ కరంగా ఉంటుంది. కూలరీ బజారు దగ్గరగా ఉన్న శివవిలాస కుటీరంలో శ్రీ గోదావరిమాతాజీ బన చేసారు. వారెక్కడికి వెళ్ళినా వారి నిత్యనైమిత్తిక కార్యక్రమాలు, విధులు, నీడవలె వెన్నంటి ఉంటాయి. ఆరతి, భజన, ధ్యానం, పారాయణం, అనుష్ఠానం మొదలైనవన్నీ నియమం తప్పకుండా జరుగుతునే ఉంటాయి. అప్పుడప్పుడు గోదావరి మాతాజీని దర్శించటానికి భక్తులూ ఆగంతుకులూ వస్తుంటారు.

ఒక రోజు సంధ్యాకాలం మీరట్ వాస్తవ్యులూ భారతసైన్యంలో ఆకౌంటు కంట్రోలర్ గా ఉద్యోగం చేస్తున్న శ్రీ హజ్రోవర్ గారు దర్శన సమయంలో శ్రీ గోదావరిమాతాజీని "సూర్యగ్రహణముప్పుడు చాలా మంది కురుక్షేత్రం చేరుకుంటారు. గదా! దానికి స్థానమహిమ ఏమైనా ఉన్నదా" అని అడిగారు. వెంటనే గోదావరి మాతాజీ "ఔను. స్థానమాహాత్మ్యం ఎలాగూ ఉంటుంది. ఈ ముసోరికి కూడ స్దానమాహాత్మ్యం ఉన్నది. జనం ఇక్కడికి వాతావరణం మార్పుకోసం వస్తారు. గదా!" అన్నారు.

మరుసటి రోజు సాయంకాలం ఒక అపరిచిత వ్యక్తి శ్రీ గోదావరి మాతాకి దర్శనార్థం వచ్చారు, శ్రీ గోదావరి మాతాజీకి ఆయనకు మధ్య ప్రశ్నోత్తర రూపంగా మంచి వార్తాలాపం జరిగింది.

ప్రశ్న:నేనొకప్పుడు ఆర్యసమాజీయుడను. ఇతరమరాలు గురించి కూడ నాకు బాగా తెలుసు. నేను బాగా చదువుకున్న వాణ్ణి కూడ కాని మనస్సుకు శాంతి లేదు. మనశ్శాంతి కోసం నన్నేమిచేయ మంటారు?

సమాధానం: భగవన్నానం చేయండి. నామస్మరణం మూలంగా మనసుకు శాంతి లభిస్తుంది.

ప్రశ్న : గురుదీక్షకూ గురూపదేశానికి తేడా ఏమిటి?

సమాధానం :- గురూపదేశం పొందినవారు సంసారంలో ఉంటూ గురువును అనుసరించవచ్చు. కాని దీక్షగ్రహణం చేసినవాళ్లు మాత్రం పాటించవలసిన కట్టుబాట్లు అనేకం ఉంటాయి. గురువుగారి అజ్ఞానుసారమే కార్యవ్యవహారాలు చేయవలసి ఉంటుంది. ఆయన గనుక ఇల్లు విడిచి పెట్టమని చెపితే కచ్చితంగా విడిచి పెట్ట వలసిందే....

ప్రశ్న: గురువు అవసరమేమిటి.

సమాధానం :- గురువే కదా మార్గదర్శనం చేసేది.


ప్రశ్న: ఆత్మదర్శనం కోసం చేసే ప్రయత్నంలో గురువు సహాయ పడుతాడా?

సమాధానం :- అవశ్యంగా, ఐతే అది మనకున్న భక్తిభావాలపైన ఆధారపడి ఉంటుంది. యద్భావం తద్భవతి.

ప్రశ్న: శివుడూ విష్ణుపూ నిజంగా ఉన్నారా? లేక మనం కల్పించి నిలబెట్టామా?

సమాధానం :- నిజంగానే ఉన్నారు. రాముడూ, కృష్ణుడూ, మొన్న మొన్నటి శ్రీ షిర్డీ సాయిబాబా వలె వాళ్ళుకూడ ఇంతకు పూర్వం ఉన్నవారే.


ప్రశ్న: ఐతే వాళ్ళను దర్శించవచ్చునా?

సమాధానం : తప్పక. గాఢమైన ప్రేమ, తీవ్రమైన భక్తి ఉన్నవారికి తప్పక సాక్షాత్కరిస్తారు. నిజానుభూతి కలిగిస్తారు.

ముసోరిలో సనాతనధర్మమందిరం ఉన్నది. ఆ మందిరం పాలక మండలివారి ఆహ్వానం అందుకొని శ్రీ గోదావరి మాతాజీ మందిరం దర్శించారు. అక్కడ శ్రీ గోదావరి మాతాజీకి భవ్యమైన స్వాగత సత్కారం జరిగింది. కన్యకల భజన కార్యక్రమం కూడ జరిగింది.

శ్రీ గోదావరిమాతాజీ ముసోరిలో ఉన్నారని తెలిసి ఒకరోజు రామకృష్ణ మిషన్ కు చెందిన స్వామి కైవల్యానందులు చూడటానికి వచ్చినారు. స్వామివారి నివాసం కనఖల్. వేసవి గడపటానికి ముసోరికి వచ్చారు. ఆయన బెంగాలీ. విశ్వ విఖ్యాతులైన స్వామి వివేకానందులకు వారు ప్రత్యక్ష శిష్యులు. వారి వయస్సు 80 సంవత్సరాలు.నిర్ణయించుకున్న ప్రకారం స్వామి అపరాహ్ణం వచ్చారు. ఆయన వెంట సెంట్ జార్జి కళాశాల ప్రాధ్యాపకులు ఆచార్య డే, మునిసిపల్ కమీషనరు, ఒక హోమియో డాక్టరు కూడా ఉన్నారు. స్వామీజీ హిందీలోనే మాట్లాడారు. శ్రీ గోదావరిమాతాజీని దర్శించినందుకు ఆయన ఆనందం ప్రకటించారు. మాటల సందర్భంలో స్వామి గోదావరిమాతాజీ గురించి అన్న మాటలు గుర్తుంచుకోవలసినవి. "ముసోరి వాస్తవ్యులు శ్రీ గోదావరిమాతాజీ దర్శనం కోసం అంతదూరం సాకోరికి పోలేరు కనుక వారిని ఉద్ద రించటానికై గోదావరిమాతాజీయే అనుగ్రహంతో స్వయంగా ఇక్కడికి వచ్చి ఆశీర్వ దించారు. శ్రీ గోదావరిమాతాజీ సాక్షాత్తు భగవతి".

ఒక రోజున నలుగురైదుగురు సాధువులు శ్రీగోదావరిమాతాజీని దర్శించటా వచ్చారు.వారు అఘోరీ పంథీయులు. వారు చూడటానికి భయంకరంగా వున్నారు. వాళ్ళను చూస్తేచాలు గుండె దడదడలాడుతుంది.వారు రావడం తోనే ఇక్కడేవరైనా మహాత్ములున్నారా? అని ప్రశ్నించినారు. అందులో ఒకరు, ఇక్కడ -ఎవరో మహాత్ములున్నట్లు నా అంతఃకరణానికి అనుభూతి కలుగుతున్నది. అందుకే దివ్యాత్మలను వెదుక్కుంటూ వచ్చాము" అన్నారు.

చాలాకాలంనుండి స్వామి శివానందులవారు ఆహ్వానిస్తున్నారు. కనుక శ్రీ గోదావరిమాతాజీ ముసోరి నుండి ఋషీకేశం వెళ్లారు. స్వామి శివానందులు డిజైన్ లైఫ్ సొసైటీ (దివ్యజీవన సమాజం) స్థాపకులు. ఆనంద కుటీరమనే వారి ఆశ్రమం గంగాతీరాన ఉన్నది.ఋషీకేశం వాతావరణమంతా ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటుంది. శ్రీ గోదావరిమాతాజీ రాక కారణంగా స్వామివారు చాలా సంతోషించారు. ఆశ్రమంలో శ్రీ గోదావరిమాతాజీ వారంరోజులున్నారు. సత్సంగము, నామ సంకీర్తనము, భజన కార్యక్రమాలు ఎడతెరపి లేకుండా జరిగాయి. అందరికీ పరమానందపు విందు లభించినది. మధుర గానాలతో భక్తి వెల్లువతో వాతావరణమంతా పులకించిపోయింది.

శ్రీ గోదావరిమాతాజీకి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా స్వామివారు శ్రద్ధ వహించారు. సమాజం కార్యదర్శి స్వామి చిదానంద స్వయంగా వచ్చి తెలుసు కొనేవారు. అవసరమైన సేవలకోసం ముత్తుస్వామి అనే సన్యాసిని యోగిని నియమించారు. ఇక్కడ ముత్తుస్వామి అనుభవం చెప్పుకో వలసింది ఒకటుంది.

ముత్తుస్వామి కేరళదేశీయుడు. అతని వయస్సు 18.19 ఏండ్లుంటుంది. శ్రీ గోదావరిమాతాజీ ప్రథమదర్శనంతోనే అతడు ఆకృష్టుడైనాడు. శ్రీ గోదావరి మాతాజీ యందు అపారమైన ప్రేమ, భక్తి పెంచుకున్నాడు. శ్రీ గోదావరి మాతాజీ సంతకం పెట్టిన చిత్రపటం ఒకటి కావలెనని ఒకనాడు నన్ను కోరినాడు. అతని కోరికను నేను శ్రీ గోదావరి మాతాజీకి తెలియజేసినాను. కాసేపైన తరువాత శ్రీ గోదావరిమాతాజీ తమ ఫోటో ఒకటి పట్టుకొనివచ్చి ముత్తుస్వామి ఎక్కడున్నాడు అని నన్నడిగినారు. అది విరామసమయం గనుక అతడు ఎటో వెళ్ళి ఉంటాడని సమాధానం చెప్పాను. తామే అతనికి స్వయంగా ఇస్తామని చెప్పి శ్రీ గోదావరి మాతాజీ ఆ చిత్రపటం తమవద్దన పెట్టుకున్నారు.విరామసమయం గడిచింది. ఎవరి పనుల్లో వారు చేరుకున్నారు. ఐనా ముత్తుస్వామి మాత్రం కనబడలేదు. కొద్దిసేపు గడచిన తరువాత జనులలో కల కలం వినబడింది. ఏమి జరిగిందో చుద్దామని నేనాచోటికి పరుగెత్తినాను. తమ తమ పనులన్నీ పక్కన పెట్టి సన్యాసుల వారూ గంగ ఒడ్డున గుమిగూడి వున్నారు. ఏమి జరిగిందని అడిగితే ముత్తుస్వామి గంగపాలైనాడరన్నారు. పగలు విరామ సమయంలో ముత్తుస్వామి గంగకు ఆర్ధినున్న స్వర్ణాశ్రమానికి వెళ్ళాడు. తిరిగి వచ్చే సమయానికి పడవలు లేవు. ఇంకా కొంత సేపటి తరువాత పడవలు నడపరు. తాను తన పనిలో చేరపోవలసిన సమయం సమీపిస్తున్నందున ముత్తుస్వామి వెనుకాముందూ ఆలోచించకుండా ఈది రావటానికై గంగలో దూకాడు. ఈవలి ఒడ్డుకు ఈదిరావటాకి అంతను చేసిన ప్రయత్నం ఫలించలేదు. ప్రవాహ వేగానికి కొట్టుకపోయాడు. అతడు ప్రవాహవేగంతో పోరాడుతూ ఈదుతుండటం చాలామంది గమనిస్తున్నారు. కాని అందరూ చూస్తుండగా క్షణంలో మటుమాయమైపోయాడు ఆ శ్రమవాసు లందరూ హాహాకారాలు చేసారు.

ఐనా అక్రమవ్యవస్థ సక్రమంగానే నడచింది. ముత్తుస్వామి మరణవార్త నోటీసు బోర్డుపై ప్రకటించి, అతడిస్థానంలో వెంటనే మరొక సన్యాసిని నియుక్తి చేసారు. ఇదంతా చూస్తుండగానే జరిగిపోయింది. ఈ సంఘటన ఒక దృశ్యంగా తోచింది. ఈ దుఃఖవార్తను శ్రీ గోదావరి మాతాజీకి చెప్పే బాధ్యత నాకప్పగించారు. నా తల తిరిగిపోయింది. గత్యంతరం లేనందున నేనే ఆ ఆప్రియమైన పనికి పూనుకున్నాను నేను గోదావరి మాతాజీ సన్నిధికి వెళ్ళేవరకు వారు నాకోసమే ఎదురు చూస్తున్నట్లున్నారు.

"ముత్తుస్వామి గంగలో మునిగిపోయినా "డని నేనంటుండగా శ్రీ గోదావరి మాతాజీ కల్పించుకొని "మునిగిపోలేదు. వస్తాడు" అన్నారు. వారి మాటలు విని నేను విస్తుపోయినాను. వారేమంటున్నారో నేను గ్రహించలేక పోయాను. అందరూ చూస్తుండగా గంగలో మునిగిపోయిన ముత్తుస్వామి ఎట్లా తిరిగివస్తాడు? నామనస్సు ఒప్పుకోలేదు; గంగలో మునిగిపోయిన వాడెవ్వడూ ఇంతవరకు తిరిగిరాలేదు కనుక.

ఈ విషాద సంఘటన తరువాత కొన్ని గంటలు గడచిపోయాయి. సూర్యుడస్తమించాడు. చీకటి పడింది. చీకటి పెరిగినకొలదీ మనసు మరింత విషాదఘూర్ణితమై పోయింది. ఆక్రమం నిత్యకార్యక్రమాలు ఎప్పటివలె జరిగి పోతున్నయి. కాని నామనస్సు బాగా వికలమైపోవటంచేత నాకు ఏ కార్యక్రమమూ రుచించలేదు. ఇంతలో ఎవరో "ముత్తుస్వామి వచ్చాడు" అన్న అరుపు నా చెవిలో పడింది. ముత్తుస్వామి శ్రీ గోదావరిమాతాజీ కుటీరంవైపు పరుగెత్తుతున్నాడు. అతని ఒళ్ళంతా తడిసి ఉంది. ఆతణ్ణి సజీవంగా చూచినవారందరూ ఆశ్చర్య చకితులౌతున్నారు. వారి కండ్లను వారే నమ్మలేక పోయారు. మృత్యువు నోటి నుండి తానెట్లు బ్రతికి బయటపడ్డాడో ముత్తుస్వామి ఆకథంతా వర్ణించి చెప్పు తుంటే శరీరాలు గగుర్పొడిచాయి. అది కల్పితకథకంటే అద్భుతం అనిపించినది. అందరూ శ్రీ గోదావరి మాతాజీ కుటీరానికి పరుగెత్తరు. చాలమంది సన్యాసులు శ్రీ గోదావరిమాతాజీ చుట్టు చేరారు. శ్రీ గోదావరి మాతాజీ అందరికీ పరాదేవతవలె అని పించింది. శ్రీ గోదావరి మాతాజీకి జై అనే నినాదాలతో ఆప్రదేశం మారుమ్రోగింది. శ్రీ గోదావరిమాతాజీ ముత్తుస్వామిని ఆశీర్వదించి ప్రసాదంతోపాటు చిత్రపటం కూడా ఇచ్చరు. ఆగమ్యగోచరములైన శ్రీ గోదావరిమాతాజీ లీలలు అందరూ కొనియాడారు. శ్రీ గోదావరిమాతాజీ భవ్య జీవితచరిత్రలో ఆనాటి దివ్యలీల స్వర్ణాక్షరాలతో వ్రాసిన ఒక అమరగాథ.

ఒక వారం గడిపిన తరువాత శ్రీ గోదావరి మాతాజీ శివానందాశ్రమం నుండి ప్రయాణమయ్యే ముందు వారికి ఆశ్రమవాసులంతా ఈ సన్మానపత్రం సమర్పించారు.


యోగిరాజు సద్గురు శ్రీ ఉపాసనీ మహారాజకి జై

పరమపూజ్య మాతాజీ।

మీ దివ్యపాదారవిందములకు భక్తిపూర్వక సాష్టాంగదండ ప్రణామ ములు. భగవతి పరాశక్తికి అపరావతారమైన మీకు సన్మానం చేసే భాగ్యం కలిగినందుకు మమ్ముమేము ధన్యులుగా భావిస్తున్నాము. మీ రాక వలన ఈ వారము దినములు అత్యంతానంద ప్రదాయకములైనవి. సరస్వతీ లక్ష్మీ పార్వతీ.ముగ్గురమ్మలు మూర్తీభవించిన మీ దివ్యతేజస్సులు ఈ ఆశ్రమాన్ని పునీతం చేసినవి. మీ పవిత్రమూర్తిలో భారతీయ ఆధ్యాత్మికశక్తి పునర్జాగృతమై ప్రబోధితమై లోకహితము విశ్వకల్యాణము కూర్చుతున్నది. మైత్రేయి గార్గి చూడాల వంటి పుణ్యాత్మలు తీర్చిదిద్దిన మహోన్నతమైన ఆధ్యాత్మిక స్త్రీత్వపరం పరను విశిష్ట మైన కన్యాకుమారి సంప్రదాయంతో మీరు పునరుజ్జీవింప జేస్తున్నారు. వేదకాలంనాటి మహిళామతల్లుల మహో జ్జ్వలాదర్శాలు, త్యాగమూ, ధర్మనిరతీ మీ చరణరాజీవాల కంకితమైన ఈ కన్యాకుమారికల్లో ధగద్ధగాయమానంగా వెలుగుతున్నాయి. జగత్ప్రసిద్ధులైన మీ సద్గురువులు మహాపురుషులు శ్రీ యోగి రాజు ఉపాసనీబాబా మహారాజులు మీలో నిక్షేపించిన యోగా శక్తిని కేవలం మీ కటాక్ష వీక్షణంతో ఆ ధన్యాత్మలలో ప్రవేశింపజేస్తున్నారు. మీ పవిత్రమూర్తియందు కేవలం భారతీయమేకాదు యావత్ప్రపంచ స్త్రీత్వం ఆదర్శప్రతీకంగా పునరుజ్జీవి తమైన రమణీయ దృశ్యాన్ని మేము చూస్తున్నాము. మీవంటి మహోజ్జ్వల పరమేశ్వరవిభూతి గల సంతుల నివాసం మూలంగా భరతవర్షం ధన్యమైనది. శ్రీ గోదావరి మాతను గన్న భారతమాత ధన్య ధన్య.

వైరాగ్యము, త్యాగము, భక్తి, ఆత్మానుభవములకు నిలయమైన ఓ మాతా! మీరు చిరకాలం వర్దిల్లవలెననీ మీదివ్యానుగ్రహంతో అసంఖ్యాకజీవులను ఆశీర్వదించి ఉద్దరించవలెననీ మీ బిడ్డలందరం హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము.

ఋషీ కేళము
హిమాలయాలు
22.06.1955


శ్రీ సద్గురు శివానంద మహారాజుల విధేయ శిష్యులు మరియు దివ్యజీవనసమాజ సాధక సేవకులు

----/////////-------/


ఒకనాటి సత్సంగ సమావేశంలో స్వామి శివానందులు సంగ్రహ భాషణం చేస్తూ ఇలా అన్నారు.

"శ్రీసాయిబాబా వారి సంత శిష్యులు శ్రీ ఉపాసనీబాబా మహారాజుగారు లోక కల్యాణం ఆకాక్షించి సాకోరిలో ఒక ఆశ్రమం స్థాపించినారు. అక్కడ ఆత్మసాక్షాత్కారానికి కావలసిన మానసిక ఏకాగ్రత, ఆత్మశుద్ధి, ఇంద్రియ నిరోధము, నిస్స్వార్థ సేవ బోధిస్తారు. ఉపాసన, వేదవిజ్ఞానము, మన జీవితగమ్యం చేరుకోవటానికి తోడ్పడుతాయి. సాకోరి ఆశ్రమంలో ఇవన్నీ చక్కగా నేర్పు తారు.

కొందరు జ్ఞానులు అంతర్ముఖులై మనస్సును ఆత్మతో ఏకాగ్ర సంధానం చేస్తారు. ఇట్టి వ్యక్తులు ఇల్లాబాదు ఆక్స్ ఫర్డు విశ్వవిద్యాలయాలలో తయారు కారు. యోగవేదాంత ఆరణ్యక విశ్వవిద్యాలయములైన సాకోరి ఆశ్రమం, ఆరవిందా శ్రమం, రమణాశ్రమం వంటి కేంద్రాలలో మాత్రమే తయారౌతారు.

వైరాగ్యమనేది అంగడిలో సులభంగా కొనుక్కునే వస్తువు కాదు. అది గురువు అనుగ్రహం. అది గోదావరిమాత అనుగ్రహంవల్ల లభిస్తుంది. అది అరవిందుల కృపాప్రసాదంగా, రమణ మహర్షి అనుగ్రహప్రసాదంగా లభిస్తుంది. ఈ మహాత్ములు మహానుభావులు తమ జీవితాలు పరమాత్మధ్యానానికే అంకితం చేసినవారు. వారిలో అహంకారము తృష్ణ అణుమాత్రం కూడా లేవు. అట్టి మహాపురుషులే లోకానికి మోక్షసుఖము, కైవల్యరామము, పరమానందము పొందే మార్గము చూపుతారు. సమస్తమానవాళి ముక్తికి శాంతికి వెలుగుభాటలు. చూపించటానికే సాకోరి ఆశ్రమం దీప స్తంభంపలె ప్రకాశిస్తున్నది."


ఏడవ అధ్యాయం సంపూర్ణం