సర్వం శ్రీసాయి
శ్రీ గోదావరి మాత చరిత్ర
2వ భాగం

ఈ విధంగా ఈ ఆలౌకికకన్య బుల్తానాజిల్లా శేగాంవ్ పవిత్ర క్షేత్రంలో పుణ్యాత్ములైన హాతివలేకర్ వారి వంశంలో 24.12.1914 లో జన్మించింది. ఈమె తల్లిపేరు రమాబాయి. తండ్రి పేరు వాసుదేవరావు, వాసుదేవరావు రైల్వే ఉద్యోగి. అందువలన ఆయనకు తరుచుగా ఉద్యోగ రీత్యా బదిలీ జరుగుతుండేది. ఆయన శేగాంవ్ లో ఉద్యోగం చేస్తుండగా ఈ కన్యారత్నం జన్మించింది. గజానన మహారాజుగారి ఆదేశం ప్రకారమే ఆమెకు గోదావరి అని పేరు పెట్టరూ గోదావరి తాతగారు.

గోదావరి తల్లిదండ్రులు అత్యంత సాత్విక స్వభావులు. సాధుసంతుల సాంగత్యంలో, వారి సేవ చేస్తూ ఆనందం అనుభవించేవారు. ఉద్యోగంనుండి విర మించుకున్న తరువాత తండ్రిగారు సాకోరిలోనే స్థిరపడి పోదామని వచ్చరు. హృద్రోగంచేత అకస్మాత్తుగా సాకోరిలోనే కాలధర్మం చెందారు. తల్లి చాల కాలం బ్రతికి 1983 వ సంవత్సరం డిసెంబర్ లో పరమపదించారు. ఆమె ఎల్లప్పుడూ భగవత్ గ్రంథాలు చదువుతూ నిరంతరం ఆధ్యాత్మిక చింతనలో జీవితాన్ని గడిపిన మహోన్నతమైన పుణ్యాత్మురాలు. ఆ దంపతులకు గోదావరి తరువాత మరొక ముగ్గురు సంతానం కలిగారు. కమల ,కుసుమ అనే ఇద్దరు గోదావరి తోబుట్టువులకు ఉపాసనీబాబా దీక్ష ఇచ్చారు. వాళ్ళు ఆశ్రమంలోనే ఉంటూ సత్కర్మలు చేస్తుండేవారు. అందరి కంటే చిన్న వాడైన దత్తాత్రేయుడు 5 వ సంవత్సరంలో మరణించాడు. అతడొక యోగభ్రష్టుడు. అందుకే ఉపాసనీ మహారాజు ఆతణ్ణి ఆశ్రమంలోనే భూగర్భ సమాధి చేసారు. గోదావరి మామాగారైన శ్రీ వామనరావు ఉర్ఫ్ మామాసాహెబ్ ఖాండేకర్ నైష్ఠికబ్రహ్మచారి.గడిచిన 50 సంవత్సరాలకు పైగా వారు ఆశ్రమంలోనే ఉంటూ సేవలు చేస్తున్నారు.

దీక్ష తీసుకున్న తరువాత బాలికగా ఉన్న గోదావరి సాకోరిలో ఉండి హారతి భజన వంటి వివిధకార్యక్రమా లన్నింటిలోను పాల్గొంటూ తన చేతనైనంత సేవ చేస్తుండేది. ఐతే ఆమె ఇతర యోగులవలెనే ఆత్మసాక్షాత్కారం లభించేదాక అనేక బాధలు తీరుతీరు యాతనలు పడవలసి వచ్చింది. క్రమంగా ఆమె దివ్యతేజోరాశిగా రూపొందినది. జీవితధ్యేయాన్ని అందుకొనేలోగా ఆమె వివిధకష్టాలను ఏతీరుగా అధిగమించారో తమ ఆత్మకథ ప్రారంభంలో ఈ క్రింది విధంగా వివరించారు.

"అప్పుడు నా వయసు 13 లేదా 14 సంవత్సరాలు. శ్రీవారి సన్నిధిలో నేను చేయగలిగిన సేవ నిష్ఠతో చేసేదానిని. కాని నేను చేసే సేవ దురదృష్ట వలన దుర్గాబాయి కర్మాకర్ కు నచ్చలేదు. ప్రారంభంనుండి ఆమె నన్ను కష్ట పెడుతూ వుండేవారు. ఆమె నన్ను కొట్టేది, పస్తులుంచేది, నా ఒక్కదానిచేత వాకిలంతా చల్లించేది; నా చేతులకు గజ్జి లేచి మంట పుట్టినా కూడా ఆమె నాతో పాత్రలు తోమించేది,పట్టపగటి పూట ఎండ ఉన్న సమయంలో కూడ కూలివాళ్లతో పాటుగా నా చేత సున్నము. రాళ్ళు మోయించేది. ఆమె నన్నింత కష్ట పెట్టినా నేను ఓపికతో అన్ని భరించినాను. ఏకాగ్రమైన మనస్సుతో శ్రీఉపాసనిబాబా వారిని స్మరిస్తూ ఈ విధంగా నేను చాలాకాలం కష్టాలు భరించగలిగాను. ఇనుపగుగ్గిళ్ళు నమిలితేనే బ్రహ్మ పదవి లభిస్తుందనే సామెత ఉంది కదా!

దుర్గాబాయి నన్ను స్వయంగా తానై కష్ట పెట్టటమే కాక ఇతర కన్యకల చేత కూడ కష్టాలు పెట్టించేది. నన్నెవరూ మంచిగా చూడలేదు. పసిదాన్ని కావటంచేత అప్పుడప్పుడు ఏ కష్టమైనా కష్టమనిపించేదికాదు. ఎప్పుడైనా కష్ట మనిపిస్తే ఒంటరిగా కూర్చుండి ఏడ్చేదానిని. పరమేశ్వరునికి నాకూ ప్రగాఢ సంబంధం ఏర్పడటంచేత ఆయన కృపవల్ల వీటినన్నిటినీ ఓర్చుకోగలిగాను. నా స్వభావం శాంతము సాత్త్వికము కనుక నేను ఎవరితోను ఎక్కువ మాట్లాడే దాన్నికాదు. కేవలం బాబావారు మాత్రమే నాయెడ ప్రేమతో ప్రవర్తించేవారు. ఇతరులెవరు ఏ విధంగా ప్రవర్తించినా నేను బాధపడలేదు. సద్గురువే స్వయంగా సంరక్షకుడైనప్పుడు ఇతరులనెవరు లెక్క పెడుతారు? అనేది పరమసత్యం. ఈ మాటలను నమ్ముకొనే సద్గురువు పై పెంచుకున్న శ్రద్ధతో దుర్గాబాయి పెట్టిన బాధలు భరించినాను. వారాలతరబడి తిండి పెట్టేదికాదు. మంచినీటి చుక్కకూడా లభించకుండా చేసి యాతన పెట్టేది. ఇనుపచువ్వతో కొట్టేది. ఒకసారి చేతిలో పట్టుకొన్న చెట్లుకత్తిరించే క త్తెరతోనే కొట్టింది. ఈ విధమైన భయంకర యమ యాతన రెండు మూడేండ్లు అనుభవించినాను. తపశ్చర్యతో కూడ వ్రతోపవాసా దులు పాటించవలసి ఉంటుంది కదా! ఈ ప్రకారంగా కష్టాలు సహింపజేసి ఉపాసాని బాబా వారు నాచేత సాధన చేయించిరు."

గోదావరిని ఆదర్శంగా తీసుకొని అనేక మంది కన్యకలు ఉపాసనీబాబా వద్ద దీక్ష తీసుకున్నారు. భగవత్సాక్షాత్కారం కోసం తాపసవృత్తిని అవలంబించే బ్రహ్మ చారిణులతో కన్యాకుమారి స్థానం అనే సంస్థను నిర్మించాలని అనుకున్న ఉపాసానిబాబా వారి కల వారి జీవితకాలంలోనే క్రమంగా రూపు దాల్చింది.

శ్రీ ఉపాసనీ మహారాజు ఈ విధంగా ప్రబోధించారు. "స్త్రీ సత్త్వ గణాలు రూపుదాల్చిన మూర్తి. స్వభావతః ఆమె నడవడి శాంత, గంభీరము. ప్రవృత్తి కనుక ఆమెలో ఈశ్వరీయశ క్తి సుప్తావస్థలో ఉంటుంది.


ఆమెలోని ఈశ్వరీయశక్తిని ప్రకటితమయ్యేటట్లు చేస్తే అది ఆమెయొక్క ఆత్మో న్నతికేకాక ఆమె కుటుంబానికంతటికీ ఇంకా దానిద్వారా సమాజాభ్యుదయానికి మేలు కలిగిస్తుంది". ఇది ఉపాసనీ బాబావారి తాత్త్విక చింతనలోని ముఖ్యసూత్రం. ఈ సిద్ధాంతం పునాదిపైనే వారుస్థాపించిన సంస్థయొక్క ఉపాదనిర్మాణం ఆధార పడి ఉన్నది.

ఆశ్రమంలో దాదాపు 60 మంది కన్యకలున్నారు. భక్తిభావము ఆత్మార్పణ బుద్ధికి వారు ప్రతీకలు. వారు భారతదేశం వివిధ ప్రాంతాల నుండి వచ్చినవారు. తమ ఆత్మోన్నతికై సాధన చేయటం, భారతీయ స్త్రీత్వ ఆదర్శాన్ని కాపాడటం వారి ఆశయాలు, ఈ ఆదర్శాలతో మహిళాసమాజాన్ని మేల్కొల్పటం ఆశ్రమం ముఖ్యోద్దేశం.

అందుకు తగినట్లుగానే ఆశ్రమంలోని దైనందిన కార్యక్రమాలు నిర్ణ యించారు. కన్యకల ప్రార్ధన, ధ్యానము, సద్గ్రంధ పఠనము, నైష్ఠికజీవనం సాగిస్తుంటారు. వేదాధ్యయనము, సంస్కృత భాషాభ్యసనము చేస్తుంటారు. అప్పుడప్పుడు యజ్ఞయాగాదులు కూడా చేస్తారు. ఇది ఈ ఆశ్రమంలోని వైశిష్ట్యం. శ్రీమాతాజీ నేతృత్వంలో ఈ ఆశ్రమకన్యకలు భారతదేశంలోని ముఖ్య నగరా లన్నింటిలో- హైదరాబాదు, నాగపురం, పూనా, బొంబాయివంటి పట్టణాల్లో కూడ
వివిధయాగాలు నిర్వహించినారు. ఇందుమూలంగా ఆరిపోయే యజ్ఞాగ్ని జ్వాలలు ఈనాడు పునర్విజృంభిస్తున్నవి. స్త్రీల సాంస్కృతికోన్నతికై ఉపాసనీబాబా ప్రారంభించిన ఉద్యమాన్ని మాతాజీ ఇంకా ముందుకు నడిపించి దానికి క్రొత్త ఊపిరి పోసారు. స్త్రీ ధర్మంపై కమ్ముకున్న కాలుష్యాన్ని నాశనం చేసి శ్రీ మాతాజీ ధర్మం యొక్క గొప్పదనాన్ని దేశమంతటా స్థాపించారు. ఉపాసనీ బాబా ప్రారంభించిన భక్తి ఉద్యమానికి శ్రీమాతాజీ నూతనోత్తేజాన్ని, శక్తిని, వేగాన్ని సంతరింపజేసినారు.

2వ అధ్యాయం సంపూర్ణం