సర్వం శ్రీసాయి
శ్రీ గోదావరి మాత చరిత్ర
పదిహేడవ అధ్యాయం

శ్రీ గోదావరిమాతాజీది వెలుతురు వెదజల్లే వ్యక్తిత్వం. వారు ఎక్కడికి వెళ్ళినా శాంత్యానందములు విరజిమ్ముతారు. ప్రేమ దివ్యత్వములు రూపుగొన్న అవతారం వారిది. ఆయమ్మ శాంతి స్వచ్ఛతల నిధానం.

మానవాళికి శ్రీ గోదావరి మాతాజీ సందేశమేమిటి? ఆమె ప్రబోధలెట్టివి? వేదికలు ఎక్కి వట్టి ఉపన్యాసాలు చేసే ఈ యుగంలో, ప్రచారంపైన సమస్తం నడుస్తున్న ఈ కాలంలో, శ్రీ గోదావరి మాతాజీ వాటిని అంటకుండా సుదూరంగా కాలానికి ఎదురీదుతున్నారు. నిరాడంబరంగా, మౌనంగా కర్తవ్యం నిర్వహించటమే వారికి ఇష్టం. వారు వాదోపవాదాల జోలికి పోరు. నిష్కామకర్మకే ప్రాధాన్యం ఇస్తూ, వట్టిమాటలు చెప్పేబదులు, స్వయంగా ఆచరించి చూపిస్తూ ప్రబోధిస్తుంటారు. వారిది అత్యంత గతిశీలమైన వ్యక్తిత్వం కనుక అలసట అన్నది ఎరుగు కుండా నిరంతరం పరిశ్రమిస్తుంటారు.

శ్రీ గోదావరిమాతాజీ మితభాషులైనా అప్పుడప్పుడు మార్గదర్శనం కోరి వచ్చేవారికి జ్ఞానోపదేశం చేస్తుంటారు; శంకలు తీరుస్తూ సరియైన మార్గం చూపిస్తుంటారు. శ్రీ గోదావరి మాతాజీ గొప్ప భక్తియోగ ప్రబోధకురాలు. భక్తియే వారికి ఊపిరి, "అందరినీ ప్రేమించు" అనేదే వారు ప్రపంచానికి ఇచ్చే సందేశం. భక్తితో సమస్తమూ సాధించవచ్చునంటారు శ్రీ గోదావరిమాతాజీ, భక్తి లేకపోతే ఏమీ సాధించలేరంటారు. భక్తి అనగా స్వచ్చమైన ప్రేమ అంటారు. నవవిధ భక్తులను ఉపాసించి సమస్తమూ సాధించవచ్చునంటారు. 'ఏం.ఏ. డిగ్రీ సంపాదించటానికై, ఇంటరు, బి.ఏ. ఉత్తీర్ణులు కావలసినట్లే భగవత్సాక్షాత్కారానికై భక్తిలోని వివిధ సోపానాలు అధిరోహించాలి. భక్తిలో చాలా భేదాలున్నవి. పూజ, నామస్మరణం, ధ్యానం ఏదైనా చేయండి. జీవితలక్ష్యం సాధించటానికి మీకిష్టమైనది అనుసరిం లచండి' అంటారు శ్రీ గోదావరిమాతాజీ.

శ్రీ గోదావరిమాతాజీ ప్రబోధల్లో విగ్రహారాధనకు విశిష్టస్థానం ఉన్నది. విగ్రహా రాధనలోని ప్రాముఖ్యాన్ని వివరిస్తూ శ్రీ గోదావరిమాతాజీ అన్నారు.

"కొందరు మూర్తి పూజను ఖండిస్తారు. అది జనులను తప్పుత్రోవ పట్టిస్తుంది. ప్రారంభదశలో విగ్రహారాధన తప్పనిసరి, అది లేకుండా హఠాత్తుగా పరా ఏకాగ్రత మీరు సాధించలేరు. అలసులు మాత్రమే విగ్రహారాధనను ప్రోత్సహించరు. మీరు సరియైన పద్దతిలో ఆరాధిస్తే తప్పక ఫలితం పొందగలరు. తుకారాం యోగివర్యుడు విగ్రహారాధన ద్వారానే ఆధ్యాత్మికానుభవాల పారం అందుకున్నారు. ప్రారంభంలో మూర్తిపూజా విధానం అవలంబించటమే అవసరం. తరువాత క్రమంగా నిరాకార నిశ్రేణికను అధిరోహించవచ్చు. లేక పోతే నిరాకారాన్ని చేరుకోలేవు. శాశ్వతానందప్రాప్తికై సాకారపూజ అవసరం. కొందరు విగ్రహారాధనను నిరసిస్తూ మాట్లాడటంచేత జనులకు దానిలో నమ్మకం పోతుంది. సామాన్య మానవులు జ్ఞానమార్గం అనుసరించలేరు. ఈ విధంగా వారు ఈ రెండింటిలో దేనివలనా లాభం పొందక ఉదయభ్రష్టులై విగ్రహారాధన ఫలితాన్ని కూడ పోందలేకపోతారు.

( నేను పూజకు కూర్చున్నపుడల్లా నా మనస్సు సంపూర్ణంగా తల్లీనమై పోతుంది. నా పరిసరాలు నా మనసుకు ఎక్కవు సృష్టికర్త తన మూర్తిని పూజించటానికే పువ్వులు మొదలైన వాటిని సృష్టించినాడు. నీవే స్వయంగా పూజ చేయనంతవరకు దానిలోని ప్రాముఖ్యం నీవు అర్థం చేసుకోలేవు. శ్రీ రామకృష్ణ పరమహంస జగజ్జనిని ఆమె విగ్రహంలోనే దర్శించినారు. ప్రాచీనకాలపు భక్తులు కూడ తాము ఆర్చించిన విగ్రహాలలోనే భగవంతుని దర్శించినారు. అందు వలననే అత్యంత ప్రాచీనకాలంనుండి మూర్తిపూజా సంప్రదాయం వస్తున్నది. దానికి గొప్ప ప్రాముఖ్యం ఉంది. నా మట్టుకు నేను జ్ఞానమార్గానికి వలెనే విగ్రహారాధనకు గొప్ప ప్రాధాన్యం ఇస్తాను.విగ్రహారాధన శాశ్వతమూ అవ్యయమూ ఐన ఆనందజగత్తుల్లోకి దారితీస్తుంది".

శ్రీ గోదావరిమాతాజీ ఉదయా సమయములు స్వయంగా శ్రీకృష్ణ పూజ చేస్తారు. శ్రీ సద్గురు ఉపాసనీ మహారాజులు వారికి చిన్న పాలరాతి గోపాలకృష్ణ విగ్రహం ప్రసాదించినారు. ఆ కృష్ణ విగ్రహాన్ని ఆభరణాలతో పూలమాలలతో అలంకరిస్తారు. కన్యకలు తాళమృదంగాలు వాయిస్తూ సుమధురంగా స్తోత్రం చేస్తుండగా గోదావరి మాతాజీ పూజిస్తుంటారు. శ్రీ గోదావరి మాతాజీ తదేకధ్యానంతో పూజిస్తుంటే చుట్టున్న భక్తులు మైమరచి ఆనందసాగరంలో మునిగిపోతారు.

భగవత్సాక్షాత్కారమే మానవజీవిత ధ్యేయం. మన సాధనకు లక్ష్యం అదే. లక్ష్యాన్ని సాధించేదెట్లా? శ్రీ గోదావరి మాతాజీ అంటారు. "మనం ఆరతి ఎందుకిస్తాము భజన ఎందుకు చేస్తాము: భగవంతునిలో ఐక్యం చెందటానికి, ఆరతి ఇచ్చేటప్పుడు తాళం కంబం ఎందుకు మ్రోగిస్తాము? మాటలు ధ్వని అందులో ఒకటై చేరిపోవటానికి, మనస్సు తల్లీనమైపోవటానికి.

మీరు ఏది చేసినా సంపూర్ణ ఏకాగ్రతతో చేయాలె. ఏకాగ్రత లేనిదే సక్రమంగా మీరు ఏమీ చేయలేరు. శ్రద్ధ లేకుండా మీరేదైనా అల్లికపని చేస్తే అది వ్యర్థమైపోతుంది. అట్లాగే ఏకాగ్రత లేకుండా మీరు సాధన చేస్తే అది వ్యర్థమై పోతుంది"

శ్రీ గోదావరి మాతాజీ ప్రబోధల్లో భక్తియోగము, కర్మమార్గముల సమ్యక సమ్మేళనం గోచరిస్తుంది. వారు నిష్కామ కర్మయోగానికి ప్రాధాన్యం ఇస్తారు.నిస్స్వార్థ కర్మ అనే పునాదులపైనే వారి తత్వవిచారపు ఉపరినిర్మాణం ఆధార పడి ఉన్నది అని వారంటారు:

"సత్కర్మ అంటే మంచి లేదా ధార్మికకర్మ. అది మిమ్ముల ఉద్దరించి మహోన్నత దశకు తీసుకపోతుంది. అది మిమ్ముల పవిత్రులను చేస్తుంది. సత్కర్మ చేస్తూ పోతుంటే మీరు కర్తృత్వ భావనను మరచిపోతారు. మనం పాఠశాలలు, ఔషధాలయములు అవి లేనిచోట ప్రారంభించండని హితోపదేశం చేస్తాము. అట్లాగే జనులు సత్కర్మలు చేయరు కాబట్టే సత్కర్మలు చేయవల సిందని చెప్పుతాము.

సాధన చేస్తుంటే ఆంతరికమైన మార్పు రావాలి. మీజీవితంలో పరిణామం రావాలి. చెడ్డ అలవాట్లు మానుకోవాలి. లెక్కలేనన్ని సత్కర్మలు చేస్తూ అసహ్యపు పనులు చేసేవాళ్లు కూడ ఉన్నారు. అటువంటి కర్మలు చేసి ప్రయో జనం ఏమిటి? అవి వృధా ఐపోతాయి. ఇది కేవలం కపటం. ఆశ్రమాలలో ఉండే చాలామంది సాధన ఏ విధంగా చేయవలెనో, తమ గమ్యం ఎట్లా చేరుకోవలెనో తెలిసికోవటానికి ప్రయత్నించరు.మనం అజ్ఞానాన్ని పారద్రోలాలి అప్పుడే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. జ్ఞానం ఉన్న చోటనే శక్తి ఉంటుంది. జ్ఞానమే మీకు బలాన్ని ఇస్తుంది. మంచి సంస్కారాలు అలవరచుకోవటం ద్వారా, పరమాత్మను ధ్యానిస్తూ మనవాళ్ళ శక్తిని పెంపొందించుకోవచ్చు. భగవంతునిలో మనసు సంపూర్ణంగా లీనం చేస్తే మీకు జ్ఞానం ప్రాప్తిస్తుంది".

శాశ్వతానందాన్వేషణ చేసే యాత్రికులకు చీకటిలో కొట్టుమిట్టాడే పథికులకు శ్రీ గోదావరిమాతాజీ బోధించే తత్త్వం వెలుగుదివిటీగా ఉపకరిస్తుంది. వారిమాటలు మీలో నూతన శక్తిని నింపి భగవత్సాక్షాత్కార మార్గాన్ని మీకు ప్రకాశింప చేస్తాయి. అవి మీ సమస్త భవరోగాలను నిర్మూలించే అమృత గుళికలు.

ఓం శాంతి శాంతి శ్శాంతి


పదిహేడవఅధ్యాయం సంపూర్ణం.