సర్వం శ్రీసాయి
శ్రీ గోదావరి మాత చరిత్ర
పదిహేనవ అధ్యాయం

1974వ సంవత్సరం జనవరిలో గుజరాతు రాష్ట్రం పరివహనమంత్రి శ్రీ V. V. బడౌ దియా సకుటుంబంగా సాకోరికి వచ్చరు. ఆయన సాకోరికి పాతభక్తుడే. ఆయన సాకోరి చేరుకోగానే గుజరాతు ముఖ్యమంత్రిగారి టెలిఫోన్ వార్త వచ్చింది. అక్కడేదో అత్యవసరమైన పని ముంచుకు వచ్చిందనీ శ్రీ బడేదియాగారిని వెంటనే బయలుదేరి తిరిగి రావలసిందనీ ఆ వార్తా సారాంశం. శ్రీ గోదావరిమాతాజీని దర్శించటంగాని అనుమతి పొందటంగాని జరుగలేదు కనుక బడౌడియాగారు. గమ్మున ఊరుకున్నారు.

నిర్ణీత సమయానికి శ్రీ బడౌదియా శ్రీ గోదావరి మాతాజీ దర్శనానికి వెళ్ళరు. ఆయన సకుటుంబంగా వచ్చినందుకు శ్రీ గోదావరి మాతాజీ చాలా సంతోషించినారు. ప్రేమాదరాలతో అత్యంత వాత్సల్యంతో శ్రీ గోదావరిమాతాజీ ఆకుటుంబ సభ్యులందరితోను చాలా అపాయ్యంగా మాట్లాడారు. ఇట్లా కొంతసేపు గడచిన తరువాత శ్రీ గోదావరి మాతాజీ సన్నిధి నుండి లేచేముందు బడౌదియాగారు తనకు వచ్చిన ముఖ్యమంత్రి గారి టెలిఫోన్ వార్త సంగతి చెప్పి తిరిగి వెళ్ళటానికి అనుజ్ఞ వేడారు. కాని వెంటనే శ్రీ గోదావరి మాతాజీ "ఈ రోజు పోవద్దు. రేపు వేళ్ళు" అన్నారు. శ్రీ గోదావరి మాతాజీ సన్నిధినుండి బడౌదియాగారు బయటికి రాగానే ఆయన పి.ఏ. వచ్చి "ముఖ్య మంత్రిగారు అత్యవసరంగా రమ్మని మరల ఫోన్ చేయించారు.ఈరోజు రాత్రి బయలుదేరి పోదామా? అక్కడ మన ప్రాంతంలో పరిస్థితి చాలా ఆందోళన కరంగా ఉందట" అన్నాడు. శ్రీ బడౌదియా "శ్రీ గోదావరి మాతాజీ రేపు బయలుదేరి. పొమ్మన్నారు. వారి మాటలు నేను జవదాటలేను. భగవంతునికి గోదావరి మాతాజీకి తేడా లేదు" అని ప్రశాంతంగా సమాధానం చెప్పరు. ముఖ్యమంత్రిగారికి యరోచిత మైన సమాధానం పంపించి ఆరాత్రి సాకోరలో ఉండి మరునాడుదయం బడౌదియా గారు అహ్మదాబాదుకు ప్రయాణమై పోయినారు.

ఒకానొక ఉత్తరంలో వారు ఈ విధంగా వ్రాసారు. "నేను 1956లో సాకోరి ఆశ్రమాన్ని మొదటిసారి దర్శించాను. ఆరోజు నుండి ప్రతి సంవత్సరం. దర్శిస్తునే ఉన్నాను. భారతదేశమంతటా నేను వివిధప్రాంతాలు పర్యటించినాను, వివిధ ధార్మిక కేంద్రాలు దర్శించినాను. కాని సాకోరివంటి సువ్యవస్థిత మైన; క్రమశిక్షణం గల క్షేత్రం మరెక్కడా నేను చూడలేదు"..

ఆ సంవత్సరం జరిగినదే మరొక సంఘటన. మాజీ విత్తమంత్రి డా. చింతా మణిరావు దేశముఖ్ గారు తన భార్య శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ తీవ్రంగా జబ్బుపడినందున శ్రీ గోదావరిమాతాజీ ఆశీస్సులు కోరుతూ సాకోరికి ఉత్తరం వ్రాసారు. అప్పుడు శ్రీ గోదావరి మాతాజీ సాకోరిలో లేనందున ఆ ఉత్తరాన్ని శ్రీ గోదావరి మాతాజీ ఉంటున్న ముంబై చిరునామాకు త్రిప్పి పంపటం జరిగింది. ఉత్తరం అందుకోగానే గోదావరి మాతాజీ సత్కర్మ ప్రారంభించి తమ ఆశీస్సులతో విభూతిని పంపించారు. శ్రీ చింతామణిరావు దేశముఖ్ గారు ప్రత్యుత్తరంలో నాకు ఈ విధంగా వ్రాసారు. "మీ జాబుతోపాటు విభూతి అందినది. శ్రీ గోదావరి మాతాజీకి దుర్గాబాయి ఎంతో ఋణ పడి ఉన్నది. 'ప్రసాద చిహ్నాని పురః ఫలాసి' అన్నట్లుగా విభూతి ప్రసాదం అందకముందే దుర్గాబాయి కోలుకోవటం ప్రారంభించింది. శ్రీ గోదావరిమాతాజీకి మా ఉభయుల నమస్కారములు అందించగోరెదను".

ఇటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ గోదావరి మాతాజీ అన్నారు. "జనులు ఇక్కడికి వచ్చి ఆరోగ్యం నిమిత్తమై తులాదానాది సత్కర్మలు చేస్తుం టారు. ఈ ఆధ్యాత్మిక చికిత్స వేరు; ఆ వైద్య చికిత్స వేరు. మందులు తీసుకో నవసరంలేదని నేననను. ఈ రెండూ అవసరమే. రాష్ట్రపతి శ్రీ రాజేంద్ర ప్రసాదు అస్వస్థులైనప్పుడు నెహ్రూగారు దేశవాసులందరినీ వారి ఆరోగ్యం నిమితమై ప్రార్థనలు చేయవలసిందని కోరలేదా, కనుక భగవదనుగ్రహం యాచించటం తప్పనిసరి".

1975వ సంవత్సరం గోదావరి మాతాజీ జీవితంలో మహత్తరమూ ముఖ్యమూ ఐన సంవత్సరం. ఆ సంవత్సరం శ్రీ గోదావరి మాతాజీ పత్రోత్సవాలు పెద్దయెత్తున వైభవోపేతంగా జరిగాయి. ఉత్సవాలు జనవరి 14వ రోజు ప్రారంభమై 21 దాక ఒకవారం రోజులు సాగాయి. భారతదేశం వివిధ ప్రాంతాలనుండి సాధు సంతులు సన్యాసులు చాలమంది వచ్చరు. బిరారునుండి గులాబ్ బాబా నాగపురంనుండి విజయబాబా విచ్చేసినారు. ఖామ్ గంవ్ నుండి పాంచలేగాంవ్కర్ మహారాజు, కన్హగన్డ నుండి శ్రీకృష్ణ మాతాజీగారు శ్రీ గోదావరి మాతాజీకి దీర్ఘాయురారోగ్యాలు ఆకాంక్షిస్తూ సందేశాలు పంపించారు. గోదావరి మాతాజీ విత్తమంత్రి శ్రీ చింతామణిరావు దేశముఖ్ కూడా సందేశం పంపిచారు.

సాకోరి ఆశ్రమంలో శ్రీ గోదావరిమాతాజీ దీర్ఘాయురారోగ్యముల నిమిత్తమై తీరు తీరు సత్కర్మలు జరిగినవి. సప్తశతి, గురు చరిత్ర, పారాయణలు చాల పర్యాయాలు జరిగినవి. సత్యనారాయణ పూజలు, లఘురుద్రములు జరిగినవి. మహా మృత్యుంజయ జపము, కుమారికా పూజనములు జరిగినవి. అన్నదానం చాలా పెద్ద యెత్తున జరిగింది. యథాప్రకారం సంక్రాంతి పండుగు ఆనందోత్సాహా లతో జరిగింది. కన్యకలు సూర్యయజ్ఞం చేసినారు. వివిధవస్తు సంభారాలతో తులాదానములు జరిగినవి. కొబ్బరికాయల రాసులు బెల్లం అచ్చులు ప్రోగులు పడినవి. ఇంకా శ్రీ గోదావరి మాతాజీ తల్లి జీజీగారికి వయోవృద్ధులైన వాఘేగారికి కూడ తులాభారములు జరిగినవి. తులాభారం దృశ్యాలు నయనాభిరామంగా ఉండినవి. ఒకనాడు వేద సదస్సు జరిగింది. వివిధ ప్రాంతాలనుండి వేదపండితులు వచ్చి వారు నాల్గు వేదాలనుండి మంత్రాలు పఠించినారు. వేదగోష్ఠి తరువాత ఆ పండితులు శ్రీ గోదావరి మాతాజీకి దీర్ఘాయురారోగ్యములకై వైదిక మంగళాచరణం చేసినారు. శ్రీ గోదావరి మాతాజీ వేదపండితులకు ధనము నూతన వస్త్రాలు నారికేళములు పంచారు.

వేదమూర్తి శ్రీ గర్గేశాస్త్రిగారు తమ అభిప్రాయాలు ఒక ఉత్తరంలో ఈ విధంగా తెలిపారు.

'మేము ఉపాసనీ మహారాజులవారికి నాసిక్ క్షేత్రంలో ఉపాధ్యాయులం. కాని ఈనాడు పరిస్థితి తారుమారైనది. మేమే శ్రీ ఉపాసనీ మహారాజులకు శిష్యులమైనాము. పరంపరయా శ్రీ గోదావరిమాతకు కూడ శిష్యులమైనాము.ఆశ్రమంలో పూజారి నిత్యకార్యక్రమాలు నియమం ప్రకారం ప్రారంభరమై సక్రమంగా శాస్త్రోక్తంగా నిర్ణీతకాలానికే ముగుస్తున్నవి. యజ్ఞాదులు శాస్త్రవిధిని అనుసరించి చక్కగా జరుగుతున్నవి. వేదమంత్ర పఠనం సుస్వరంగా సాగుతున్నది. వేదాలకు వేదపండితులకు ఇక్కడ ఘనమైన ఆదర గౌరవాలు ఉన్నవి. కన్యకలు తదేకచిత్తంతో హృదయపూర్వకంగా యజ్ఞులు చేస్తున్నారు. కన్యకల సహకారం మాటలకందనిది. యజ్ఞం చేస్తున్నప్పుడు ఒకరితో ఒకరు ఒక్క మాటైనా వల్కరు. ఇక్కడ వేదపండితులకు జరిగే మర్యాద వేరేచోట్ల ధనసమృద్ధిగల సంస్థలవారు కూడ చేయలేరు. బ్రహ్మవాదినులైన సంతుల మహత్వం భగవంతునికంటె గొప్పదనీ, వారి పావిత్ర్యమూ తపసు జగములను ఉద్దరిస్తాయనీ వేదశాస్త్రాలలో ప్రమాణం ఉంది. శ్రీ ఉపానసీ మహా రాజుల యొక్క యూ, శ్రీ గోదావరిమాత యొక్క యూ అనుగ్రహమూ ఆశీస్సులూ మేము ఎల్లప్పుడూ కాంక్షిస్తుంటాము.

నాసిక్

22.1.1975

ఇట్లు

ఘనాపాఠి ఏకనాథ రంగనాక గర్గేశాస్త్రి.

ఒకనాడు సంస్కృత సమ్మేళనం కూడ జగింది. పూనా వాస్తవ్యులు పండిత వసంతరావు గాడ్గీల్ దీనికి సంయోజకులు, ఐరోడా వాస్తవ్యులు పండిత బదరీనాథశాస్త్రి అధ్యక్షులు. పూనావాస్తవ్యులు పండిత వెంకటేశశాస్త్రి జోషీ, సుభద్రా తాయి మొదలైన ఆశ్రమం కన్యకలు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఇదికాక భజనసంకీర్తనలు, హరికథాగానములు జరిగినవి. శ్రీమతి స్టోన్ (సౌరాష్ట్ర), శ్రీ జస్వంత కులకర్ణి (ముంబాయి) కార్యక్రమాలు చాలా ఆనందదాయకంగా ఉన్నాయి.శ్రీమతి రాజకుమారి ప్రభావతి రాజేగారి వంశోధనాత్మకము ఆలోచనాత్మకములైన ఉపన్యాసాలు పండితుల తలలూపించినవి. భిన్న మతాలకు చెందిన చలనచిత్రప్రదర్శనలు కూడ జరిగినవి.

ఈ సందర్భంలో ఉచిత దంతచికిత్సాశిబిరం కూడ ఏర్పాటు చేసారు. రాజకోట వాస్తవ్యులు డా. లాభశంకర శుక్లాగారు దీని నేతృత్వం వహించారు. జనవరి 14.17 మధ్య ఈ శిబిరంలో దాదాపు 500 మందికి ఉచిత దంత చికిత్స జరిగింది. అదే సమయంలో ఒక నేత్రచికిత్సా శిబిరం కూడ నిర్వహించారు. బాలాసాహెబ్ విఖేగారు దీనిని ప్రారంభించినారు. దాదాపు 100 మందికి కంటి శుక్లాల శస్త్రచికిత్స జరిగింది. డా తాంబే, డా. కవిగార్లు శస్త్ర చికిత్సలు చేసారు. అడ్వొకేటు భమోరే, డా. గంగాధర సహస్రబుద్దే, డా. దేశపాండే మొదలైనవారు, ఈ శిబిరం విజయవంతం కావటానికి తోడ్పడినారు. శిరిడి సంస్థానం కోర్టు రిసీవర్ శ్రీ పాఠక్, గణేశ సహకార శర్కర కర్మాగారం సంచాలక మండలివారు దీనికి సహాయం చేసారు. నేత్రశిబిరం ముగిసిన తరువాత శ్రీ మాతాజీ ఈ శిబిర నిర్వహణంలో తోడ్పడినవారందరికీ సన్మానం చేసారు. సందర్భోచితంగా పెద్దలు ఉపన్యసించారు శిరిడి సంస్థానం కోర్టు రిసీవరు శ్రీ పాఠక్ గారు "సాకోరి సంస్థానంవారు. నా చెంతకు వచ్చి నేత్రచికిత్సా శిబిరానికి వీలైనంత సహాయం చేయవలసిందని నన్ను కోరారు. ఐతే ఆనాడే నా యిష్ట దైవం సాయిబాబా కలలో కనపడి ఇది నా మనుమరాలి కార్యం కనుక నీవు చేయవలసినదంతా తప్పక చెయ్యాలె అని ఆదేశించినారు" అని గద్గదకంఠంతో అశ్రుపూరిత నేత్రాలతో ఉపన్యసిస్తుంటే శ్రోతలకు గగుర్పాటు కలిగింది; కనులు చెమ్మగిల్లినవి.

ఈ వత్రోత్సవాలను పురస్కరించుకొని ఆశ్రమం పక్షమున ఇంగ్లీషు, హిందీ, మరాఠీ భాషల్లో స్మారికలు వెలువడినవి. 'మహారాష్ట్ర' పత్రిక ప్రత్యేక సంచికను ప్రకటించినది. 'రుద్రవాణి' పత్రికా సంపాదకులు శ్రీ కిర్లోస్కర్ గొప్ప సంపాదకీయం వ్రాసినారు. ఈ విధంగా శ్రీ గోదావరి మాతాజీ వత్రోత్సవాలు మహావైభ వోపేతంగా అశ్రుతపూర్వంగా జరిగినవి. ఆనాటి పవిత్ర స్మృతులు అసంఖ్యాక భక్తజనుల హృదయఫలకాలపై చెరగని ముద్రలుగా నిలిచిపోయినవి.

కరవీరం, సంకేశ్వరమఠం పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ మచ్ఛంకరా చార్యులవారు శ్రీ మాతాజీని 'జగజ్జనని' గా అభివర్ణిస్తూ సమర్పించిన సన్మాన పత్రంలో ఈ విధంగా ఉల్లేఖించినారు.

"మాతాజీ: మీరు గురుభ క్తితత్పరలు; శ్రీ ఉపాసనీ మహారాజుల శిష్యాగ్ర గణ్యలు, కన్యా ఆశ్రమానికే ఆభరణంవంటి వారు. నిరంతరం తపోధ్యాన నిరతలైన మీరు ప్రాచీన వైదిక ధర్మనిష్ఠాగరిష్టలు, నిస్స్వార్థ మానవ సేవా పరాయణలు. మీరు సదా సమస్త మానవ శ్రేయస్సునే కోరుతుంటారు. అందు వలన మీకు జగజ్జనని బిరుదం ఇవ్వటానికి మేమెంతో సంతోషిస్తున్నాము".

పదిహేనవ అధ్యాయం సంపూర్ణం.