సర్వం శ్రీసాయి
శ్రీ గోదావరి మాత చరిత్ర
పదునాల్గవఅధ్యాయం

శ్రీ గోదావరి మాతాజీ జీవితంలో 1972వ సంవత్సరం చాలా మహత్వపూర్ణమై ఆ సంవత్సరం గోదావరి మాతాజీ యూరపు ఖండం పర్యటించి చాలా దేశాలు చూసారు. వారివెంట దేవీతాయి, యమునాతాయి, సులోచనాతాయి, ప్రభృతి కన్యకలు; N.D. శాహుకార్ దంపతులు: శ్రీమతి జ్యోత్స్నాదేవిపటేల్, శ్రీమతి దీనాబాయి పావరీ, అడ్వొకేట్ DC. భమోరే, సోలిసిటర్ రూసీగాంధీ మొదలైన భక్తులు ఇంకా నాగపురం యోగి విజయబాబా కూడి ఉన్నారు, ఈ పర్యటన 35 రోజులు సాగింది. కన్యకలను, భక్తులను తీసుకొని శ్రీ గోదావరి మాతాజీ భారతదేశం నుండి సెప్టెంబరు 2వ తేది బయలుదేరి అక్టోబరు 8వ తేదీ తిరిగి వచ్చరు. ఈ పర్యటనలో మాతాజీ రోమ్, జెనీవా, పారిస్, ప్రాంక్ఫర్ట్, జూరిచ్ మొదలైన ప్రముఖ నగరాలు చూసారు. పారిస్, లండన్, ఆంట్వెర్స్ నగరాలలో సత్సంగాలు కూడ జరిగాయి.శ్రీ గోదావరి మాతాజీ సాకోరి నుండి ముంబైకి కారులో వెళ్ళి అక్కడి నుండి విమాన ప్రయాణం చేసారు. వారికి వీడ్కోలు చెప్పటానికి అశేషభక్తజనం విమానాశ్రయంలో గుమిగూడారు. వారి ప్రయాణం సుఖంగా సాగటంకోసం చాలాచోట్ల ప్రార్థనలు జరిగాయి.

శ్రీ గోదావరిమాతాజీ భక్తుల సమేతంగా సెప్టెంబరు 11నాడు పారిస్ నగరం చేరారు. అక్కడ సూజన్ ఆంధ్ర అనే మహిళ తన ఇంటిలో సత్సంగం ఏర్పాటు చేసారు. తొలుత శ్రీమతి మణిబెన్ సాహుకార్ సాకోరి ఆశ్రమం చరిత్ర వినిపించి పర్యటక బృందంలోనివారిని పరిచయం చేసింది. కన్యకలు వేద గానం చేసారు. ప్రేక్షకులందరు శ్రీ గోదావరి మాతాజీని దర్శించి చాలా సంతోషించారు. సెప్టెంబరు 15వ నాడు గోదావరిమాతాజీ భక్తులతో లండన్ నగరం చేరుకున్నారు. అక్కడ శ్రీ గోదావరిమాతాజీ సోనీగారింట బసచేసారు. ఒకప్పుడు సూరత్ వాసియైన శ్రీ సోనీ ఇప్పుడు లండన్లోనే స్థిరపడి పోయారు. ఆ సాయంకాలం శ్రీ సాయి బాబా మందిరంలో కార్యక్రమం ఏర్పాటు చేసారు. శ్రీమతి బనారసీదేవి అనే భక్తురాలు సాయిమందిరం కట్టించి సాయిభక్తి ప్రచారం చేస్తున్నది.ఆ కేంద్రంలో ఆమె శ్రీ గోదావరి మాతాజీకి ఘనమైన స్వాగత సత్కారం జరిపింది.ఆ సభలో కాంటర్ బరీ ఆర్చిబిషప్ కూడ ఉపన్యసించాడు. శ్రీమతి బనారసీదేవి క్రొత్తగా నిర్మింపదలచిన సాయిబాబా మందిరానికై ప్రేక్షకులను విరాళాలు అడిగినపుడు శ్రీ గోదావరి మాతాజీ అప్పటికప్పుడు ఆ సత్కార్యానికై 11 పౌండ్ల విరాళం ఇచ్చరు. ఆ సందర్భంలో కాంటర్ బరీ అర్చిబిషప్ ఉపన్యసిస్తూ "నేను ముంబయికి వెళ్ళి నపుడు వీధులలో ఇరువైపుల జనులు క్రిక్కిరిసి బారులు తీరారు. వారందరూ నన్ను చూడటానికే ఇలా గుమికూడినారని తెలుసుకున్న తరువాత నాకు
ఆశ్చర్యం కలిగింది. హిందువులు విశాల హృదయులు. తమ ధర్మంతోపాటు ఇతర మతాలను వారిని కూడా గౌరవిస్తారు.క్రైస్తవ మతంలోను హిందూ మతంలోను చాలా పోలికలున్నవి" అన్నారు.

శ్రీ గోదావరి మాతాజీ భక్తులను వెంటబెట్టుకొని సెప్టెంబరు 27 నాడు అంట్వేర్స్ చేరారు. అక్కడ ఎడ్వర్డు, జేన్ అనే ఇద్దరు ఒక యోగ కేంద్రం నడుపుతున్నారు. కేంద్రంలో ఆసనాలు, ప్రాణాయామం ధ్యానం మొదలైనవి నేర్పుతారు. ఆ యిరువురూ శ్రీ గోదావరి మాతాజీకి ఒక స్వాగతసభ ఏర్పాటు చేసారు. శ్రీ ఎడ్వర్డ్ తన ఆశ్రమానికి వచ్చేవారికి యోగాసనాదులు నేర్పుతున్నానని, తన కేంద్రానికి దాదాపు 800 మంది విద్యార్థులు వస్తున్నారని, అందులో 90 శాతం ఆరోగ్యం నిమిత్తమై వస్తున్నారనీ, తక్కినవారు ఆధ్యాత్మిక ప్రవృత్తితో వస్తున్నారని చెప్పాడు. ఎవరైనా యోగులు వస్తే నివసించటానికి ఆ యోగ కేంద్రంలో అన్ని వసతులున్న ఒక ప్రత్యేకమైన గది కూడ ఉన్నది. ఆ యోగ కేంద్రాన్ని సందర్శించినవారు తమ ఆటోగ్రాపులు ఇస్తారు. ఎడ్వర్డ్, జేన్ ల ప్రార్థన మన్నించి శ్రీ గోదావరి మాతాజీ కూడ తమ ఆటోగ్రాపు ఇచ్చరు. ఆ యోగాశ్రమంలో రాత్రి జరిగింది. అడ్వొకేట్ D.C. భమోరే సభాసదులకు సాకోరి ఆశ్రమంలో జరిగే కార్యక్రమాల గూర్చి పరిచయం చేసారు. అటు తరువాత కన్యకల వేదగానం జరిగింది. ఆ పైన యోగాశ్రమం సభ్యులు భక్తి సంకీర్తనం సామూహిక ధ్యానం చేసారు. శ్రీ గోదావరి మాతాజీ చాలా సంతోషించి "మీ కృషి ప్రశంసనీయం. మీకు భాష రాకున్నా భక్తి కీర్తనలు చాలా నిర్దుష్టంగా పాడారు. మీరు చేసిన సామూహిక ధ్యానం నాకు బాగా నచ్చింది. మీరు భారతదేశానికి వచ్చినపుడు సాకోరి ఆశ్రమానికి తప్పక రండి. ఆశ్రమద్వారాలు మీకోసం సదా తెరచి ఉంటాయి" అని దీవించారు.ఈ విధంగా తమ సుదీర్ఘ యూరపుఖండ పర్యటన ముగించి శ్రీ గోదావరిమాతాజీ అక్టోబరు 8వ తేదీ రోజున భారతదేశానికి తిరిగి వచ్చింది. వారిని స్వాగతించటానికి అశేషభక్త సందోహం చేరుకున్నారు. భక్తుల ఆనందానికి అవధులు లేవు. తమ ఆరాధ్యదైవం శ్రీ గోదావరి మాతాజీని భక్తులు అభిమానులు పూలమాలలతో ముంచెత్తారు.

శ్రీ గోదావరి మాతాజీ యూరపు పర్యటనకు బయలుదేరేముందు లండన్ వాస్తవ్యురాలు మేరీ అనే ప్రాచ్యవిజ్ఞాన విదుషీమణి సాకోరి ఆశ్రమానికి వచ్చింది. ఆమె
ఉపనిషత్తులు అధ్యయనం చేయటానికి భారతదేశం పచ్చిందట, స్వదేశానికి తిరిగి పోయేముందు ఆమెకు సాకోరి ఆశ్రమం సంగతి తెలిస్తే శ్రీ గోదావరిమాతాజీని దర్శించటానికై ఆమె సాకోరికి వచ్చింది. ఆశ్రమ వాతావరణం ఆమెకు బాగా నచ్చటంతో ఆమె అక్కడ కొన్నిరోజులు ఉంది. శ్రీ గోదావరి మాతాజీ ఆమెకు ఏకాంతం కూడ ప్రసాదించారు. వారి సంభాషణలోని విషయాలు ఇక్కడ సంగ్రహంగా పొందుపరుస్తున్నాను.

మేరీ: ఉపనిషత్తులలో పరాత్పరుడు అనుగ్రహిస్తేనే ఆత్మజ్ఞానం కలుగు తుంది అని ఉన్నది. ఇదే నిజమైతే ఆధ్యాత్మిక జీవితంలో సాధనకున్న స్థానం ఏమిటి?

మాతాజీ:- ఆత్మసాక్షాత్కారం కోసం తప్పక సాధన చేయవలసిందే.. ఆత్మసాక్షాత్కారంకోసం తదేకలగ్నమైన మనస్సుతో దృఢమైన దీక్షతో నీవు కృషి చేస్తేనే భగవదనుగ్రహం కలుగుతుంది. నీవు నీ మనసును అందుకోసం సిద్ధంచేస్తే ఈశ్వరుడు నీలోనే ప్రకటమౌతాడు. నీ సాధన నీవు చేస్తూ పో భగవత్సాక్షాత్కారమయ్యే క్షణం ఎప్పుడో ఒకప్పుడు. కొన్ని యేండ్లకైనా వస్తుంది. నీ సాధన ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనైనా ఫలిస్తుంది. నీ జీవితంలో జరిగే ప్రతిదీ. అది మంచిదికాని చెడ్డదికాని. భగవంతుని ప్రసాదమే. భగవంతుడే నిన్ను నడుపుతున్నాడని, మంచిని ప్రసాదిస్తున్నాడని, చెడు ఆగును బలహీన తలను తొలగిస్తున్నాడని విశ్వాసం పెంచుకో,భగవంతుడు మార్గదర్శనం చేస్తాడు, కాని ప్రయత్నం మాత్రం నీవు చేయవలసిందే. అది నీ విధి.

మేరీ: నిందాస్తుతులబంధాలనుండి తప్పించుకునే మార్గం ఏమిటి?

మాతాజీ : ప్రార్ధనం ఒక్కటే. నిరంతర భగవన్నామ స్మరణం భగవద్ధ్యానం చేస్తూ పోతే నిందాస్తుతులవైపు మనసు పోదు. లోకులు నిన్ను పొగడినా తిట్టినా నీ మనసు భగవంతుని పైననే నిలుపు. నిందాస్తుతులను లెక్కించక నీమనసు నిశ్చలం ఔతుంది. "నేను ఆత్మను; శరీరం కాను" అని భావించు. నీవే భగవంతుడవు. భగవల్లగ్న చిత్తంతో నీవు ద్వంద్వాలకు నిందాస్తుతులకు అతీతురాలవు కాగలవు. నిజంగా అవి లేవు. ఇదే ద్వైతానికి అతీతమైన అద్వైతస్థితి.
మేరీ లండను చేరిన తరువాత నాకు ఈ విధంగా ఉత్తరం వ్రాసింది.

శ్రీ ఉపాసనీ బాబావారి ఆశ్రమం మందిరం చూపించి వాటి చరిత్ర వివరించినందుకు మీకు కృతజ్ఞతలు. అక్కడ నాకు ఆనందాభూతి కలిగింది. అది తానై నాకు ప్రకటితమైనది. అటువంటి స్వచ్ఛశాంతి వాతావరణంలో ఉంటున్న మీరు ధన్యులు,

శ్రీ గోదావరి మాతాజీతో నాకు లభించిన ఏకాంతం నా ఆశ్రమసందర్శనానికి పరాకాష్ట. మీకు మాట యిచ్చిన ప్రకారం దాని గురించి వ్రాసినాను. శ్రీ గోదావరిమాతాజీ లండను రాక గురించిన మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తుంటాను. ఆ సందర్భంగా నేనేమైనా సేవ చేయగలనని ఆశిస్తాను..

గౌరవాదరములతో

సోదరి మేరి

లండన్. 21.5.1972


1972 మార్చిలో ఢిల్లీనగరంలో అంతర్జాతీయ సంస్కృత సమ్మేళనం మొదటి సారిగా జరిగింది. ఇంగ్లాండు, ప్రాన్సు, ఇటలీ, జర్మనీ, ఈరాన్ మొదలైన దేశాలనుండి పండిత ప్రతినిధులు వచ్చరు. సాకోరి కన్యకలకు కూడ ఆహ్వానం వచ్చింది. సమ్మేళనం మార్చి 26నాడు ప్రారంభమై మార్చి 31 దాకా సాగింది. భారత రాష్ట్రపతి శ్రీ వి.వి. గిరిగారు ఉత్సవ ప్రారంభకులు పరిశోధనాత్మక పత్రాలు చదవటం, బౌద్ధికమైన చర్చలు సిద్దాంతరాద్ధాంతాలు చేయటం, వేదపఠనం మొదలైన కార్యక్రమాలు చాలా జరిగాయి. పూనా భాండార్కరు పరిశోధన సంస్థ మాజీ సంచాలకులు డాక్టరు R.N. దాండేకర్ గారి సహకారం మూలంగా సాకోరి కన్యకలకు ఈ సమ్మేళనంలో పాల్గొనే అవకాశం కలిగింది.

వేదపఠనం ఒక ప్రత్యేకమైన హాలులో జరిగింది. కాశ్మీరం నుండి కన్యాకుమారి దాక ఉన్న వివిధప్రాంతాల వేదపండితులు అక్కడ చేరినారు. చాల మంది వేదపండితులు ఉండటంచేత మొదటినాడు సాకోరి కన్యకలకు వేద పఠనావకాశం లభించలేదు. మరుసటిరోజు నిర్ణీతనమయానికి కార్యక్రమం ఆరంభ మైనది. ఐతే ఈనాడు కూడ కన్యకలను వేదపఠనానికై ఆహ్వానించనందుకు మా మనస్సు చివుక్కుమన్నది. ఇంతలో ఒక మాధ్యందిన శాఖా పండితుడు వేదం పఠిస్తూ సభాసదులను ఉద్దేశించి తనతోపాటు వేదం పఠించగల శుక్ల
మాధ్యందిన కాబీయులు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించినాడు. ఎవరూ ముందుకు రాలేదు. కాని మా సాకోరి కన్యకలకు వేదం చెప్పిన చంద్రకాంత బాయి శుక్లాగారు లేచి ఉచ్చైస్స్వరంతో మధురంగా వేదగానం చేయటం ప్రారంభించినారు. సభాసదులు మంత్రముగ్ధులైనట్లు నిశ్చేష్టులైనారు. ఆయనను తను పరిచయం చేసుకోవలసిందిగా సభవారు కోరగా శ్రీ చంద్రకాంతబాయి. శ్రీ ఉపాసనీ మహారాజులు స్థాపించిన సాకోరి కన్యాకుమారి స్థానంలో ఉండే కన్యకలకు తాను వేదం చెప్పుతున్నాననీ, వేదం చదువుకున్న కన్యకలు ఆ సభలో ఉన్నారనీ, అవకాశం ఇస్తే వారు వేదం పఠించగలరని అన్నారు. కన్యకలు వేదపఠనం చేయటానికి వెంటనే అంగీకారం లభించింది. దేవీతాయి, సుభద్రాతాయి, సవితతాయి చాలా మనోహరంగా వేదమంత్రాలు చదివినారు వారు కొన్ని వికృతులు గూడ వల్లించి చివరన సామగానం చేసినారు. దానితో సభాసదుల హర్షధ్వానాలు మిన్ను ముట్టాయి. ఈ విశ్వసంస్కృత సమ్మేళనం వేద పరిషత్తులో పాల్గొన్నవారు సాకోరి ఆశ్రమ కన్యకలు తప్ప మరెవ్వరూ మహిళలు లేరు. ఇందుమూలంగా సాకోరి కన్యాకుమారి స్థానం కీర్తిచంద్రికలు దేశం నాలుగు దిక్కులలో వ్యాపించింది. ఢిల్లీకి బయలుదేరేముందు కన్యకలను శ్రీ గోదావరి మాతాజీ "తిరిగి వచ్చేటప్పుడు యజ్ఞకలశం తప్పక తేవాలి సుమాః" అంటూ ఆశీర్వదించిన మాటలు ఈ విధంగా ఫలించాయి.

1973లో శ్రీ గోదావరి మాతాజీ పూనాలో శతచండీయాగం చేసారు. దీనిని ఉద్యానప్రాసాదం అధిపతులు శ్రీ శంకరరావు ధత్తే ఏర్పాటుచేసారు శ్రీదత్తే ఈయాగం శ్రీ గోదావరి మాతాజీచేత చేయించటానికి కారణం గమనార్హం. వారొక వ్యాసంలో ఈ విధంగా వ్రాసినారు.

"1961లో పాన్ షెట్ ఆనకట్ట తెగిపోయి పూనా నగరం జలప్లావితం ఐనప్పుడు నా జీవితము, నా ఆర్థిక పరిస్థితులు అల్లకల్లోలమైపోయాయి. అప్పుడు నేను శ్రీ చండీ ఉపాసనకు ఉపక్రమించినాను. దేవి అనుగ్రహం మూలంగా నా కష్టాలు తొలగిపోయి, నా పరిస్థితి చక్కబడి సొంత పరిశ్రమ పెట్టుకున్నాను భవ్యమైన ఉద్యాన ప్రాసాదం నిర్మించగలిగినాను. ఆనాటినుండి శతచండి యాగం చేయాలెననే కోరిక దినదినం నాలో ప్రబలం కాసాగింది.. ఐతే ఈ యజ్ఞయాగాలు చేయించే ఋత్విక్కుల్లో భక్తిశ్రద్ధలు కరువై డబ్బు కక్కుర్తితో వ్యాపారార్థంవలె చేస్తుండటంతో బ్రాహ్మణ పురోహితవర్గంతో ఈ యాగం
చేయించటం నాకు సమ్మతం కాలేదు 1970లో శ్రీ గోదావరిమాత నేతృత్వంలో సాకోరి ఆశ్రమ కన్యకలు పూనాలో చేసిన గణేశయజ్ఞం దర్శించే భాగ్యం కలిగింది. వారు తల్లీనమై ఎంతో శ్రద్ధతో చేసిన ఆ యజ్ఞం చాలా గొప్పగా ఉండటంచేత నేను ముగ్ధుడనైనాను. ఆనాడే ఈ కన్యకలచేత శతచండి యాగం చేయిస్తే బాగుంటుందని నిశ్చయించుకున్నాను. బ్రహ్మవాదినులైన అట్టి కన్యకలను సిద్దంచేసి సనాతన ధర్మోద్ధరణం ద్వారా మన సమాజానికి ఒక కొత్త మలుపునిచ్చిన శ్రీ ఉపాసనీ మహారాజులు ధన్యులు. ఈ బ్రహ్మ దారిణుల జీవితాలను సర్వోత్తమంగా దిద్ది తీర్చుతున్న శ్రీ గోదావరిమాత ధన్యులు. సమస్తము త్యాగం చేసి ఆదర్శజీవితం గడుపుతున్న ఈ కన్యకలు ధన్యలు."

ఈ యజ్ఞం అక్టోబరు 11నాడు ప్రారంభమై 19నాడు ముగిసింది. తొమ్మిది రోజులు వాతావరణమంతా వేద ఘోషలతో మారుమ్రోగింది. జనులు యజ్ఞం దర్శించి పునీతులై నారు. దశ గ్రంథి బ్రాహ్మణుడైన శ్రీమోఘే, వేదాచార్య శ్రీకరంబలేకర్, శ్రీ రుండి రాజశాస్త్రి లేలే వంటి సత్పురుషులు వేద పండిత ప్రకాండులు యజ్ఞానికి వచ్చి చూచి తమ సంతోషం ప్రకటించారు. యాగం పరిసమాప్తి ఐనతరువాత దాదాపు 55 సాంస్కృతిక సంస్థలవారు శ్రీ గోదావరి మాతాజీని కన్యకలను సన్మానించారు. పూనా డెప్యూటీ మేయరు శ్రీ వైద్య గారి ఆధ్యక్ష్యంలో ఈ సన్మానసభ జరిగింది. ముఖ్య అతిథి డాక్టర్ G.S. మహా జన్ గారు తమ ప్రసంగంలో "వేదకాలంలో మహిళలు విద్యాధార్మికరంగాలలో సక్రియంగా పాల్గొంటూ మన సంస్కృతిని పరిరక్షించారు. మైత్రేయి గారి వంటి మహానుభావురాండ్ర ఆ సత్సంప్రదాయాన్ని ఈనాడు మన గోదావరిమాత గారు పునరుద్ధరిస్తున్నారు". అన్నారు.

డిసెంబరు మాసంలో, అహ్మదాబాదుకు 10మైళ్ళ దూరంలో ఉన్న సోలా అనే గ్రామంలో శ్రీ గోదావరి మాతాజీ విష్ణుయాగం చేసారు. మహానుభావులు పండిత ప్రకాండులు ఐన శ్రీకృష్ణ శంకరశాస్త్రిగారు ఈ గ్రామంలో భాగవత విద్యా పీఠం అనే ఒక విశిష్ట సంస్థను స్థాపించారు. ఆయన ఒక తాపసివలె జీవిస్తూ అఖండ భాగవత సప్తాహం చేస్తుంటారు. శ్రీ గోదావరి మాతాజీ పట్ల సాకోరి ఆశ్రమంపట్ల తమకున్న భక్తిప్రేమలు కారణంగా ఆయన శ్రీ గోదావరి మాతాజీని తమ ఆశ్రమంలో విష్ణుయాగం చేయాటానికి ఆహ్వానించారు. యాగం డిసెంబరు 2వ తేదీ రోజున నాడు ప్రారంభమైనది.9వ నాడు పూర్ణాహుతి జరిగింది. వేద ఘోషలతో వాయుమండలం
ఘూర్ణిల్లింది.. ఆసందర్భంలోనే భాగవత సప్తాహం, గురుచరిత్ర పారాయణ సప్తాహం కూడ జరిగాయి. వేదశాస్త్ర సంపన్న శ్రీ చంద్రకాంతభాయి కుల్లాగారి మార్గదర్శనంలో బ్రాహ్మణులు దత్తయజ్ఞం కూడ చేసినారు.

విష్ణుయాగ సందర్శనార్థమై పలు ప్రాంతాలనుండి అసంఖ్యాక జనం వచ్చరు. శ్రీ మనోవీరయాణి మహారాజు (యోగాక్రమం), శ్రీ స్వామి నారాయణ సంప్రదాయం పీఠాధిపతులు శ్రీ నటవర గోపాల్, ప్రసిద్ధమైన జగన్నాథ మందిరం ముఖ్యమహంతు వంటి పెద్దలెందరో ఈ విష్ణుయాగానికి విచ్చేసారు. యజ్ఞం ముగిసిన తరువాత అహ్మదాబాదు పౌరులు శ్రీ నటవర గోపాల్ జీగారి నేతృత్వంలో శ్రీ గోదావరిమాతాజీకి సన్మానపత్రం సమర్పించారు.

అందులోని సారాంశం:-

పౌరులమైన మేము శ్రీ గోదావరి మాతాజీని గురువులను అతిథి గణములను శ్రుతివచనానుసారం హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. శ్రీ గోదావరి మాతాజీలో, విద్యమానమౌతున్న దివ్యగుణాలకు ముగ్ధులమైన మేము శ్రీ గోదావరి మాతాజీ పాదములకు ప్రేమపూర్వకంగా ఈ పూజాపుష్పాలు సమర్పిస్తున్నాము.

కొలది సంవత్సరాలకు పూర్వం తపోయోగ సదాచార సంయమనిష్ఠులు, జ్ఞానబలతేజస్సంపన్నులు ఐన శ్రీ ఉపాసనీ బాబావారు మహారాష్ట్రంలోని సాకోరి గ్రామం తమ కర్మక్షేత్రంగా ఎంచుకొని దానిని ఒక గొప్ప స్ఫూర్తి కేంద్రంగా రూపొందించారు. శ్రీ ఉపాసనీ మహారాజులు తమ కార్యభారాన్ని బాధ్యతలను తమకు అన్ని విధములా వారసురాలు యోగ్యురాలు ఐన శ్రీ గోదావరి మాతగారికి అప్పగించారు.

మా ఆహ్వానం మన్నించి మమ్ముల అనుగ్రహించి తమ భక్తులతో బ్రహ్మ వాదినులైన శిష్యురాండ్రతో శ్రీ గోదావరి మాతాజీ ఇక్కడికి వేంచేసి యాగం చేయించి నందుకు మేము ఎంతో ఋణపడి ఉన్నాము"...

ఈ సందర్భంలో శ్రీ గోదావరి మాతాజీ అక్కడివారిని ఉద్దేశించి చేసిన అను గ్రహభాషణంలో "పూజ్యులు శ్రీ కృష్ణ శంకరశాస్త్రిగారు ఆహ్వానించటంచేత మాకందరికీ విశిష్టమూ ఆదర్శవంతమూ ఐన ఈ భాగవత విద్యాపీఠం దర్శించే భాగ్యం కలిగింది. ఈ సంస్థ మహత్తరమైన కృషి చేస్తున్నది. చిన్న పిల్లలకు మంచి సంస్కారాలు అందిస్తూ వారి జీవితాలను సరియైన మార్గంలో
పెడుతున్నది. మన నైతికమూల్యాలను మన ప్రాచీనసంస్కృతిని పరిరక్షిస్తూ ప్రజానీకంలో ధార్మిక చైతన్యాన్ని జాగృతం చేస్తున్నది. మన ప్రాచీన సంప్రదాయాలను కాపాడే ఆదర్శవంతమైన సంస్థ భారతదేశంలో ఇదే. ఒక విచిత్రం గమనించదగింది ఇక్కడ సంఘటించింది. మనం భగవంతుని షోడశోప చారాలతో పూజిస్తాము. ఈ గ్రామం పేరు కూడా సోలా. సోలా గ్రామంలో భాగవత విద్యాపీఠం ఉండటంచేత షోడశగ్రామాల సహాయ సంపదలు అందుకొని షోడశోపచార విధులతో భగవదారాధన జరిపింది. వర్తమానకాలంలో భారతదేశంలో ప్రాచీన సంస్కృతి లోపిస్తున్నది. ఇటువంటి తరుణంలో లోకకల్యాణం కోసం మన నీతిని మన సంస్కృతిని కాపాడుతున్న ఈ విద్యాపీఠానికి మన దేశంలో విశిష్టమైన ఆదర్శస్థానం ఉన్నది".

పదునాల్గవ అధ్యాయం సంపూర్ణం.