సర్వం శ్రీసాయి
శ్రీ గోదావరి మాత చరిత్ర
పదకొండవ అధ్యాయం

1961వ సంవత్సరంలో విదర్భ నుండి సుప్రసిద్ధసంత్ ధర్మభాస్కర శ్రీపాంచలేగాంవ్ కర్ మహారాజు సాకోరి ఆశ్రమానికి వచ్చేసారు. ఆయన అసలైతే మరాట్వాడా వారు కాని ఖామ్ గాంవెను తమ కార్యక్షేతంగా ఎంచుకొని అక్కడ ముక్తేశ్వర ఆశ్రమం నిర్మించుకొని ఉంటున్నారు. ఖామ్ గాంవ్ బుల్దనా జిల్లాలో శ్రీగజానన మహారాజుగారి శేగాంవ్ కు పదిమైళ్ళ దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు.పాం చలేగాంవ్ కర్ మహారాజును పాముల మహారాజు అన్నీ శివావతారమని అంటారు. ఆయనవద్ద ఎప్పుడూ తీరుతీరు విషపు పాములుంటాయి. వారు ఎక్కడికి వెళ్ళినా పాములను కూడా వెంట తీసుకొని వెళతారు. మెడలో నాగభూషణాలు ధరించే ఆదునిక చాంగదేవుడాయన. పాములకోసం తమ ఆశ్రమంలో వారొక సర్పశాలను కూడా నిర్మించారు.ఆయన గొప్ప సనాతనధర్మ నిష్టాగరిష్ఠుడు. శుద్ధీకరణం ద్వారా వేదధర్మాన్ని సంరక్షిస్తున్న మహానుభావుడాయన. సాకోరి ఆశ్రమంలో వైదికధర్మ సంరక్షణకై చేస్తున్న వివిధపుణ్యకర్మలు తీరుతీరు కార్యక్రమాలు చూచి వారు చాలా సంతోషించారు. ఒక వ్యాసంలో వారు ఈ విధంగా వ్రాసారు.

"పరమ పూజ్యులు శ్రీగోదావరి మాతాజీ మహత్వాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. పరమ పూజ్యులైన ఉపాసనీ బాబావారి సమస్త శక్తులూ వారికి సంక్రమించినవి. ఈశ్వరీయశక్తి పురుషుల ద్వారానే వ్యక్తమౌతుందని ఇన్నాళ్ళు అనుకునేవారు. కాని ఆ మహాశక్తి విశాల రూపంలో శ్రీ గోదావరి మాతాజీలో వ్యక్తం కావటం ఈనాడు మనం చూస్తున్నాము. మహిళలకు కూడ మోక్షానికి వేదాధ్యయనానికి అధికారమున్నట్లు శ్రీగోదావరిమాతాజీ నిరూపించారు. తమ గురువులు శ్రీ ఉపాసనీ మహారాజు అడుగుజాడల్లో నడుస్తూ, శతాబ్దాల తరబడి సమాజం చేత వేదాధికారానికి వెలివేయబడిన కన్యకలకు ఆమె నిర్భయంగా వైదిక విధులు. క్రియాకలాపాలలో చక్కని శిక్షణ ఇస్తున్నారు.

1961వ సంవత్సరమే ఢిల్లీ సుప్రీంకోర్టు న్యాయాధీశులు జస్టిస్ జె.ఆర్, ముధోల్కర్ సాకోరి ఆశ్రమం దర్శించారు. ఆనాటి నుండి వారు ప్రతి సంవత్సరం సాకోరి ఆశ్రమానికి వస్తున్నారు. ఆయనకు భారతీయ వేదాంతంపట్ల ప్రగాడాభిమానం; మేదావుల చర్చాగోష్టుల్లో అభిరుచి ఎక్కువ. ఆయన వ్రాసిన ఒక నోక ఉత్తరంలో తమ అభిప్రాయం ఈ విధంగా వ్రాసారు. "సాకోరి ఆశ్రమం విశిష్టమైనదని నా అభిప్రాయం. మహిళలకోసం మహిళలే నడుపుతున్న గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం అది. సంస్కృత మతగ్రంథాలతో పాటు సంస్కృతంలో మాట్లాడటం కూడ నేర్చే మహిళాసంస్థ బహుశః అదొక్కటే అనుకుంటాను. పురుషయాజ్ఞికుల సహాయం లేకుండా వైదికధర్మనిధులు క్రియాకలాపాలు బ్రహ్మవాదినులైన మహిళలు నిర్వహించే సంస్థ మన దేశంలో ఇక్కడ తప్ప మరెక్కడా లేదనుకుంటాను. అక్కడి కన్యకలు నిస్సంగలనీ,నిస్పృహలనీ గొప్ప ఆధ్యాత్మిక ప్రగతిని సాధించినవారనీ తెలిసి చాలా శ్రీ ఉపాసని బాబా ఆశించినట్లుగా శ్రీ గోదావరి మాతాజీ నేతృత్వంలో కన్యకలు కృతార్ధలు కావటం ముదావహము".
ఈ సందర్భంలోనే శ్రీ బిల్మోరియాగారి అనుభవం చెప్పుకోవటం సముచితంగా ఉంటుంది. దొరాభ్షా బిల్మోరియా అనే పారసీ పెద్దమనిషి ముంబయిలో ఐదారు నేలను నుండి జబ్బుపడి ఉన్నారు. గోదావరి మాతాజీ ఆసమయంలో ముంబైలో ఉన్నారు. బిల్మోరియా ఇంటి డాక్టరు రోగాన్ని తగ్గించడం గాని, చికిత్సగాని సరిగా చేయ లేకపోయాడు. బిల్మోరియా కూతురు శ్రీ గోదావరి మాతాజీని దర్శించి తన తండ్రి ఆనారోగ్యం గురించి చెప్పి నయం చేయవలసిందని ప్రార్థించింది. శ్రీ గోదావరిమాతాజీ ఆమెతో "మీ డాక్టరుకు మీ తండ్రిగారి కడుపు ఎక్స్ రే తీసి చూడుమని చెప్పు. ఆయనను ఆసుపత్రిలో చేర్చించండి. ఒకనెల రోజులలో అంతా నయం ఔతుంది. భయ పడవలసిందేమీ లేదు" అన్నారు. శ్రీగోదావరిమాతాజీ రెండు మూడు వాక్యాలే మాట్లాడినా దుఃఖితుల హృదయాలకు ఎంతో ఊరట కల్గిస్తాయి. బిల్మోరియా కూతురు డాక్టరుకు శ్రీగోదావరి మాతాజీ చెప్పిన సలహా చెపితే ఆయన ఎక్సరే తీయించవలసిన అవసరంగాని ఆసుపత్రిలో చేర్పించవలసిన అగత్యంగాని లేదన్నాడు. శ్రీగోదావరి మాతాజీ యందు పరిపూర్ణ విశ్వాసం పెంచుకున్న బిల్మోరియాగారి పట్టుదలతో ఎట్టకేలకు డాక్టరు ఆయన కడుపు ఎక్స్రే తీయించాడు. దానిమూలంగా ఆయన కడుపు లోని బ్లాడర్ మూడు రాళ్ళున్నట్లు తేలింది ఆసుపత్రిలో చేర్పించి ఆపరేషన్ చేసిన తరువాత సరిగ్గా నెల రోజుల్లో బిల్మోరియా గారికి సంపూర్ణ స్వాస్థ్యం లభించింది వారు ఇంటికి వచ్చారు. ఈ విధంగా శ్రీ గోదావరిమాతాజీ మాటలు అక్షరాల నిజమైనాయి.

శ్రీ గోదావరిమాతాజీ నోటివెంట వచ్చే ప్రతిమాట అర్థవంతంగా ఉంటుంది. వారి మాటలు పాటించేవారికి ఎప్పుడు మేలు జరుగుతుంది. సోదరి సునీతి అనుభవం ఈ విషయం ధ్రువపరుస్తుంది. సునీతి, డాక్టరు హనుమంతరావు టికలే కూతురు. హనుమంతరావు హైదరాబాదు వాస్తవ్యులు. ఉదోగ్యమునుండి రిటైరైన తరువాత వారు సాకోరిలో ఉంటున్నారు. సునీతి ఆశ్రమం పనులు శ్రద్ధా భక్తులతో చేస్తుండేది. ఝాపిడీ పనులు, తోట పనులు, పూజకోసం పుష్పమాలలు కట్టటం చేసేది. ఆమె తోటలో ఉండగా శ్రీ గోదావరిమాతాజీ వెనుక వైపునుండి వచ్చి "హనుమంతరావు ఆరోగ్యం బాగా లేకపోతే తినటానికి ఏమీ ఆహారం ఇవ్వవద్దు. నూనెతో వండిన పదార్థాలు పనికిరావు. పాలుమాత్రం త్రాగవచ్చు" అని హెచ్చ రించి వెంటనే తిరిగి వెళ్లిపోయారు. సునీతి విస్తుపోయి అవాక్కయింది. శ్రీ గోదావరిమాతాజీ ఎందుకు వచ్చినట్లు? ఎందుకు హెచ్చరించినట్లు? తన తండ్రిగారు బాగానే ఉన్నారే! వారికి పథ్యం ఎందుకు? సునీతికి ఏమీ అర్ధం కాలేదు.
కాని కొద్ది రోజులలలోనే డాక్టర్ హనుమంతరావు తీవ్రంగా జబ్బుపడ్డాడు. వారికి చెప్పారాని ఉదరవికారం ఏదో కలిగింది. కదుపులోనికి ఏమి తీసుకున్నా.. నీలువదు.అన్నం లేకపోవటంతో బాగా నీరసించిపోయారు.. ఎలాగైనా వీరూ కొంత ఆహారాన్ని కడపులోనికి పోవాలాని అందరూ తాపత్రయ పడ్డాడు. కానీ హనుమంతరావు పాలుతప్ప మరేమీ తీసుకోవటానికి నిరాకరించారు. అప్పుడు సునీతికి శ్రీ గోదావరి మాతాజీ అన్న మాటలు అనాటి హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది. ఆమె శ్రీ గోదావరిమాతాజీ చెప్పిన మాటలో అక్షరాలా పాటించి హనుమంతరావుకు పాలుమాత్రమే ఆహారంగా ఇచ్చేది. క్రమంగా ఆయన ఆరోగ్యం కుదుటపడి జబ్బు తగ్గిపోయింది. ఆ విధంగా సంతుల అజ్ఞను పాలించిన ఫలం ఆమెకు అనుభవంలోనికి వచ్చింది. సాధు సంతులు త్రికాలజ్ఞులు. వారిమాటలు మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయినా వారి అజ్ఞలు పాటించినట్లైతే మనకు మేలు కలుగుతుంది.

1962వ సంవత్సరంలో కలిగిన అనుభవం మరువరానిది. 1962 జులై 13వ తేదీ నా జీవితంలోనేకాదు. పూనా చరిత్రలో ఒక భయంకర అంధకారమైన రోజు.ఆరోజు పాన్ అనకట్ట తెగిపోయి పూనానగరం ఇంతకు పూర్వం ఎన్నడూ లేనటువంటి జల ప్రళయానికి గురైంది . ఆ సంఘటన జ్ఞాపకానికి వస్తే ఈనాటికీ గుండె దడదడలాడుతుంది. అప్పుడు పూనాలో ఉన్నాను. మా అన్న గానీ యిల్లు ముఠానది ఒడ్డున సంబజీపార్కుకు ఎదురుగా ఉంటుంది. నేను మా అన్నగారి ఇంట్లో ఉంటూ శ్రీ ఉపాసనీ బాబావారి కార్యములు ప్రబోధల గురించి పి.ఎస్.డి. సిద్ధాంతవ్యాసం రచించే ప్రయత్నంలో ఉన్నాను. ముఠా నదికి వరదలు వచ్చి ఉప్పొంగి ఆనకట్ట తెగిన సంగతి పోలీసులు ప్రకటిస్తూ హెచ్చరించేదాకా మాకు తెలియదు. నగరంలోనికి ఉత్తుంగ తరంగాలతో వరద నీరు ముంచుకు వస్తునే ఉన్నది. ఇండ్లు విడిచి పెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి పోవలసిందని పోలీసువాళ్ళు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమైన సామగ్రి తరలించండని చెప్పుతున్నారు. అది ఉదయం 11 గంటల సమయం. మా అన్న గారు. ఆఫీసుకు వెళ్ళిపోయిరారు. మా అన్నకొడుకు పెద్దవాడు కాలేజీకి వెళ్ళిపోయాడు. ఇంటిలో మిగిలింది మా వదిన ఆమె ముగ్గురు చిన్న పిల్లలు నేను మాత్రమే. ఈ మహావిపత్తు వార్త మేము వింటుండగానే వరదనీరు మా ప్రహరిలోనికి వచ్చింది. సురక్షిత ప్రాంతాలకు పారిపోవటానికై సామాను సర్దుకుంటుండగా, నా థీసిస్ జ్ఞాపకం వచ్చింది. ఏండ్లతరబడి రాత్రింబవళ్ళు కష్టపడి సిద్ధంచేసిన
వ్రాతప్రతి నీటిపాలై పోతే నాగతి ఏమికావాలి? కాగితాలన్నీ సర్ది తీసుకోవటానికి సమయం కూడ లేదు. దొరికిన కాగితాలన్నీ గబగబా మడత పెట్టుకుంటున్నాను. “ఇంట్లోనే చావదలుచుకున్నారా" అని బయటినుండి పోలీసులు అరుపులు విని పిస్తున్నాయి. చేతికి చిక్కిన కాగితాలు పుస్తకాలు పైఅంతస్తులో ఆల్మైరాలో భద్రపరచి క్రిందికి దిగినాను. అప్పటికే నీళ్ళు నడుములబంటి పారుతున్నవి. మమ్ములన్నీ వరదనీళ్ళు చుట్టుముట్టాయి. ఏక్షణాన్నైనా మేమంతా జల మృత్యువు పాతపడవలసిందే. మాకాళ్ళు వణకుతున్నాయి.అటువంటి విపత్కర పరిస్థితులనుండి మేము ఏవిధంగా బ్రతికి బయటపడి సురక్షిత ప్రదేశానికి చేరామో చెప్పలేను. కేవలం శ్రీ గోదావరిమాతాజీ అనుగ్రహమే మమ్ముల ఆపదనుండి రక్షించింది.

ఐనా నా మనసంతా నా థీసిస్ కాగితాలపైనే ఉన్నది బుసలు కొడుతూ ఉప్పొంగే ఆ ప్రవాహంలో ఆ కాగితాలన్నీ సర్వనాశనమై పోయుంటాయని నా ఆందోళన నా కండ్ల యెదుటే ఆ మహాప్రవాహంలో సుందర భవనాలు, ఎత్తైన మిద్దెలు ఒకటి తరువాత ఒకటి పేక మేడలవలె కూలిపోతుంటే అంతకంటే నా కేమి తోచడం లేదు. నా హృదయాంతరాళంలో శ్రీ గోదావరి మాతాజీ ఆశీర్వచనాలే నా థీసెస్ కు శ్రీరామరక్ష అనే చిన్న ఆశాకిరణం మాత్రం ప్రకాశిస్తున్నది. మాబంగ్లా సగంవరకు నీళ్ళలో మునిగిపోయింది. అప్పుడు ఈదుస్సంఘటన జరగటానికి వారం రోజులముందు శ్రీ గోదావరిమాతాజీ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఆపత్సమయం లో శ్రీ గోదావరిమాతాజీ మాటలపై నమ్మకం ఒక్కటే నాకు అనన్యశరణ్యం. నా కాగి తాలన్నీ సురక్షితంగా నా కంటబడేదాక ఆందోళనపడుతునే ఉన్నాను. వరద నీరు తగ్గుముఖం పట్టిన తరువాత రాత్రి ఎనిమిదిగంటల ప్రాంతంలో నేను పరిస్థితి ఎట్లున్నదో చూడటానికై మాయింటి దారిలో వెళ్ళాను. అది బహుళపక్షం కనుక అంతటా చీకటి అలముకొన్నది దానికితోడు వరద ఉదృతానికి దీపపు స్తంభాలన్నీ కూలిపోయాయి. అదొక కాళరాత్రివలె తోచింది. ఐనా తెగించి మా యింటికి దారితీసినాను. అవాంతరాలు కష్టాలు దాటుకుంటూ మాబంగ్లా చేరుకున్నాను. మా యిల్లు క్రిందిభాగం మాత్రం వరదలో మునిగినట్లు, పైభాగం వెంట్రుక వాసిగా ప్రమాదంనుండి బయటపడినట్లు నీటిగుర్తులు గమనించినాను. నా థీసిస్ కొట్టుకపోయినట్లైతే నా జీవితం విషాదంగా మారి ఉండేది. నా గుండె కృతజ్ఞతతో నాకన్నులు ఆశ్రువులతో నిండిపోయాయి. నా జీవితంలోని ఈ సంఘటన గుర్తుకు వచ్చినపుడల్లా నా కన్నులు చెమ్మగిల్లుతవి. నాతోటివాళ్ళు నా
తమ థీసిన్సులు వరదలపాలైన విషాదవార్తలు చెప్పుతుంటే నా కన్నులు కృత ఆరాశ్రువులతో పొంగిపొరలాయి.

1963వ సంవత్సరం డిసెంబర్ నెలలో శ్రీ గోదావరి మాతాజీ ముంబైలో ఉన్నారు. ఇంగ్లీషు తేది కారం 24 శ్రీ గోదావరిమాతాజీ జన్మదినం కనుక, భక్తులందరూ వారి జన్మ దినోత్సవం జరుపాలని తీర్మానించినారు. ఆ సమయంలో ముంబై వాస్తవ్యులు ఆరోల్కర్ అనే భక్తునికి శ్రీ గోదావరిమాతాజీని దర్శించాలని ప్రబలమైన కోరిక కలిగింది. ఆయన గొప్ప దేవీ ఉపాసకుడు; టైమ్స్ ఆఫ్ ఇండియాలో పెద ఉద్యోగి; దురదృష్టవశాత్తు ఏదో అవాంతరం ఏర్పడి ఉత్సవంలో పాల్గొనే అవకాశం కలుగలేదు. పాపం ఆ భక్తుడు నిరాశానిస్పృహలతో ఒంటరిగా కుర్చీనో శ్రీ గోదావరి మాతాజీ గూర్చి ఆలోచిస్తుండగా మహంతు అనే స్నేహితుడు అను కోకుండా ఆరోల్కరు ఇంటికి తన పిల్లలతో వచ్చాడు.మహంతు కల్యాణిలోని రెయాన్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి. కాసేపు ఉబుసుపోక ముచ్చట్లు చెప్పుకున్న తరువాత జుహూ ఉద్యానవనానికి వాహ్యాళికి పోదామా అని మహంతు ఆరోల్కరును అడిగినాడు. మహంతుపిల్లలు జుహూకు తప్పక పోదామన్నారు. గోదావరి మాతాజీ దర్శనం కోల్పోయిన ఆరోల్కరుకు ఎక్కడికి పోవటానికి మనస్కరించలేదు. అది గమనించిన మహంతు తన పిల్లలతో "ఆరోల్కరు మామ నేనూ మొన్ననే జుహూకు వెళ్లివచ్చాము. కనుక ఈరోజు మనం మరొక చోటికి వెళదాం" అన్నాడు. కాని పిల్లలు వినలేదు. జుహూ కే పోదామని వాళ్ళు పట్టు పట్టారు.వాహ్యాళికి పోవటం నాకంతగా ఇష్టం లేదుగాని పిల్లలు కోరుతున్నారు.కనుక జుహూకే పోదామని ఆరోల్కరు అన్నాడు. మహంతు కూడా పిల్లల ఇష్ట ప్రకారమే జుహూకు పోవటానికి అంగీకరించాడు. పిల్లలూ సంతోషించారు. కొద్ది సేపటిలో అందరూ మహంతుకారులోనే బయలుదేరి జుహూ చేరుకున్నారు. జహూపార్కులో కార్లు నిలిపేచోట తమ కారు ఆపారు. సమీపంలోనే శ్రీగోదావరి మాతాజీ కారు కూడా నిలిచిఉండటం గమనించిన ఆరోల్కరుకు అమితాశ్చర్యం కలిగింది. విచారించగా శ్రీ గోదావరిమాతాజీ కూడ వాహ్యాళికోసం జుహూపార్కుకే వచ్చి నట్లు తెలిసింది.ఆ మాట వినగానే ఆరోల్కరు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై నాడు. నాలుగు అడుగులు ముందుకు నడచే సరికి శ్రీ గోదావరిమాతాజీ తనకు ఎదురుగా వస్తున్నట్లు గమనించాడు. ఆనందపారవశ్యంతో దూళిబాటలోనే
అంతదూరంనుండే శ్రీ గోదావరి మాతానికి సాష్టాంగదండప్రణామం చేస్తూ సాగిల పడ్డాడు. శ్రీ గోదావరిమాతాజీ ఆరోల్కరును సమీపించి తమ చేతిలోని పుష్పగుచ్ఛాన్ని ఆయనకు ప్రసాదంగా ఇచ్చారు. ఆరోల్కరు కన్నులు చెమ్మగిలినవి. శ్రీ గోదావరి మాతాజీ సర్వజ్ఞురాలు; ఆమె లీలలు దురవగాహములు అనే సరికొత్త అనుభవం ఆరోల్కరుకు కలిగింది.

1964వ సంవత్సరం లో శ్రీ గోదావరిమాతాజీ రామేశ్వరం యాత్ర చేసినారు. వారివెంట సుభద్రాతాయి, ముక్తాతాయి. ఇంకా మరికొందరు కన్యకలు, సొలిసిటర్ గాంధీ, డాక్టర్ సుశీలాబెన్ శ్రాఫ్, దీనాబాయి పావరీ, యశ్వంతరావు బోరావకే, కె.టి.బజాన్ మొదలైనవారందరు వెళ్ళరు. శ్రీ గోదావరిమాతాజీ 21వ తేదీ అక్టోబరులో బయలుదేరి . నవంబరు 9వ తేదీ రోజున తిరిగివచ్చారు. శ్రీ గోదావరిమాతాజీ 22వ తేదీ మదరాసు చేరారు అక్కడ వారికి ఘనమైన స్వాగతం లభించింది. మదరాసులో శ్రీ గోదావరి మాతాజీ యన్.టి. పటేలు గారింట బస చేసారు. మదరాసులో ఉన్న వారం రోజులలో శ్రీ గోదావరిమాతాజీ చుట్టుప్రక్కల ఉన్న పవిత్రక్షేత్రాలు గుళ్ళు గోపురాలు సందర్శించారు. తిరుపతి, మహాబలిపురం, శివకంచి, విష్ణుకంచి, మొదలైన ప్రదేశాలన్నీ దర్శించారు. శ్రీ గోదావరి మాతాజీ, కన్యకలూ, భక్తులూ అందరూ కలసి ఒకే స్పెషల్ లక్జురీబస్సులో ప్రయాణం చేసారు. దారివెంట నయనాభిరా ఉన్న పచ్చని పొలాలు, ప్రకృతి సుందర దృశ్యాలు చూచి శ్రీ గోదావరిమాతాజీ "భగవంతుడు గుళ్ళలో మాత్రమే ఉండడు. ప్రకృతి అంతటా పరివ్యాప్తుడై ఉంటాడు" అన్నారు.

శ్రీ గోదావరిమాతాజీ అక్టోబరు 30వ తేదీన పాండిచ్చేరికి వెళ్ళరు. శ్రీ ఆరవిందులు తపస్సుచేసి భగవత్సాక్షాత్కారం పొందిన చోటు అది శ్రీ అరవిందులు మహత్వ పూర్ణమైన అనేక కృతులు రచించినారు. అందులో 'దివ్యజీవనం' అనేది విశ్వ వంద్యమైన రచన. స్వర్గసామ్రాజ్యాన్ని భూమికి అవతరింపజేసి ఈ ప్రపంచంలో దివ్యజీవనం నెలకొల్పటం ఆ మహాయోగి ప్రపందించిన యోగము యొక్క ధ్యేయం. అక్కడ ఒక చెట్టుక్రింద శ్రీ అరవిందుల సమాధి ఉన్నది. వారి శ్రీ పార్థివశరీరం అందులో చిరనిద్రపోతున్నది. శ్రీ ఆరవిందుల సమాధిని దర్శించిన శ్రీ గోదావరిమాతాజీ కన్నులు అశ్రుపూర్ణములైనాయి. వారు ఆరవిందాశ్రమంలో ఒక్కరోజు వున్నారు. అక్కడి పాఠశాలను, కుటీర పరిశ్రమలను చూసారు.
ఆశ్రమం సముద్రతీరంలో ఉండటంచేత అక్కడి వాతావరణం చాలా ఆహ్లాద కరంగాను మనోహరంగాను ఉంటుంది.

పాండిచ్చేరి నుండి బయలుదేరి చిదంబరం, కుంభకోణం, శ్రీరంగం క్షేత్రాలు దర్శించి శ్రీ గోదావరిమాతాజీ కొడైకెనాల్ వెళ్ళరు. అక్కడి ప్రకృతి సౌందర్యం చాలా మనోహరమైనది. కొడైకెనాల్ ప్రయాణంలో జరిగిన ఒక ఆనుభవం చెప్పుకోవలసింది.ఆ ప్రదేశానికి చేరుకోవటానికి సుమారు 80 మైళ్ళ పర్వత మార్గాన ప్రయాణం చేయాలె. దాదాపు 75 మైళ్లు గడచింది,ఇంకొక 5 మాత్రమే మిగిలింది. ఇంతలో చాలా ఇరుకైన మార్గం వచ్చింది. బస్సు చాలా కష్టంగా జాగ్రత్తగా నడుపుకపోతున్నాడు డ్రైవరు. వర్షం మూలంగా కొండ శిఖరాలనుండి రాళ్ళు ఊడి పడిపోతున్నాయి. దారిలో ఈరాళ్ళను తొలగిస్తూ ప్రయాణం సాగిస్తుండగా ఒకచోట బస్సును రివర్స్ చేయవలసి వచ్చింది. ఒక క్షణమైతే బస్సు ఆగాధమైన లోయలో పడిపోయి తునాతునకలయ్యేది. కాని శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహం మూలంగా డ్రైవరు అతి నైపుణ్యంగా కనురెప్పపాటులో ఆపి ముందుకు సాగాడు. గండం గడచింది. అందరూ బ్రతికి బయటపడ్డారు.

అక్కడ ఒకరోజు సుఖంగా గడపి శ్రీ గోదావరిమాతాజీ మదురకు సాగిపోయి అక్కడ మీనాక్షి దేవిని దర్శించి మదుర నుండి రామేశ్వరం వెళ్ళరు. భారత దేశంలోని నాలుగు ధామాలలో రామేశ్వరం మహత్వపూర్ణమైనది. మన ద్వాదశ జ్యోతిర్లింగాలలో రామేశ్వరం ఒకటి. శ్రీరామచంద్రుడు స్థాపించిన లింగం ఇది. అగస్త్యాశ్రమం దీనికి సమీపంలోనే ఉన్నది. రామేశ్వరంలో శ్రీ గోదావరిమాతాజీ కన్యకలు కలిసి లఘురుద్రము, మహాపూజ చేసి ధనుష్కోటి దర్శించి అక్కడి నుండి కన్యాకుమారికి వెళ్ళరు. అది అరేబియా సముద్రం బంగాళాఖాతం హిందూ మహాసముద్రం మూడు సంగమించే చోటు. అక్కడి దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది. అక్కడున్న గాంధీ మహాత్ముని స్మారకచిహ్నము. వివేకానందశిల దర్శించినారు.ఈ శిలపైన సమాధిస్టుడై కూర్చుండిన వివేకా నందునికి మన ప్రాచీన ఋషుల సందేశం, భారతీయ సంస్కృతిని పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేయవలసిందని శ్రీరామకృష్ణ పరమహంస ఆదేశించిన దృశ్యం గోచరించింది. ఇక్కడి సూర్యాస్తమయదృశ్యం చూడముచ్చటగా ఉంటుంది. కన్నులున్నందుకు చూడదగిన దృశ్యం అది సూర్యాస్తమయం చూచిన తరువాత కన్యాకుమారి దేవాళంలో ఆరతి ఇచ్చి ప్రసాదం తీసుకొని
బసకు చేరుకున్నారు. కన్యకలు శ్రీ గోదావరి మాతాజీని కన్యాకుమారిగా అర్చించి పూజించారు. మరుసటి రోజు సూర్యోదయం చూచి సముద్రస్నానం చేసి కన్యాకుమారిదేవికి పంచామృతాభిషేకస్నానం చేయించి హారతి తీసుకొని తిరుగు ప్రయాణమై శ్రీ గోదావరి మాతాజీ తమ పరివారంతో ఆదిశంకరుల జన్మస్థానం అయిన కాలడికి వెళ్ళినారు. అక్కడినుండి ఉదకమండలం సాగిపోయారు. అప్పుడు అక్కడ మార్గమంతటా దట్టమైన పొగమంచు వ్యాపించి ఉంది. కాని శ్రీ గోదావరిమాతాజీ రాకతో పొగ మంచు విచ్చుక పోయింది. అందువలన భక్తులందరు శ్రీ గోదావరిమాతాజీని Weather Controller వాతావరణ నియంత్రి అన్నారు. శ్రీ గోదావరిమాతాజీ కొందరు భక్తులను తీసుకోని శ్రీహంసదేవ మహారాజు ఆశ్రమానికి వెళ్ళి వచ్చరు. శ్రీ హంస దేవుల శిష్యులు శ్రీ ఆత్మదేవులు శ్రీ గోదావరిమాతాజీకి గొప్ప స్వాగత సత్కారాలు చేసారు.

ఉదకమండలంనుండి కోయంబత్తూరు మీదుగా శ్రీ గోదావరి మాతాజీ తిరువణ్ణా మలకు చేరారు. అక్కడి అరుణాచలం కొండ అంచుననే జగద్విఖ్యాతమైన శ్రీ రమణమహర్షి ఆశ్రమం ఉంటుంది. పాల్ బ్రంటన్ ఇంగ్లీషులో "శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్రము వారి సందేశము," "ఉపదేశసారము" 'నేనెవరు' మొదలైన గ్రంథాలు రచించారు. శ్రీ రమణమహర్షుల శిష్యురాలు శ్రీమతి తల్యారా ఖాన్ అనే పారసీ మహిళ శ్రీ గోదావరి మాతాజీకి ఘనమైన స్వాగతం ఏర్పాటు చేసారు. ఆమె శ్రీరమణ మహర్షిని చాలాకాలం సేవించిన భక్తురాలు. శ్రీ గోదావరిమాతాజీ శ్రీరమణ మహర్షి సమాధిని అటు తరువాత ఆశ్రమాన్ని దర్శించారు. అప్పుడు శ్రీమతి తల్యార్ ఖాన్ గద్గదకంఠంతో "శ్రీ గోదావరిమాతాజీ ఈ ఆశ్రమానికి రావటం మా పూర్వపుణ్య విశేషం. శ్రీ గోదావరిమాతాజీ రూపంలో శ్రీరమణ మహర్షులే వచ్చినట్లు మాకు అనుభూతి కలుగుతున్నది. ఆ మహర్షి సన్నిధిలో నాకు ఎటువంటి ఆనందానుభూతి కలిగేదో అటువంటి ఆనందానుభవమే ఇప్పుడు పొందుతున్నాను" అన్నది. మరుసటి రోజు అరుణాచలం చుట్టు ప్రదక్షిణం చేసి మరికొన్ని మందిరాలు దర్శించి శ్రీ గోదావరి మాతాజీ మదరాసు చేరుకొన్నారు. మదరాసునుండి ముంబయికి వెళ్ళి అక్కడినుండి సాకోరికి తిరిగివచ్చారు.

ఈ సంవత్సరమే కట్నీ వాస్తవ్యుడైన బజాన్ అనే పారసీ భక్తునికి కలిగిన ఆశ్చర్యకరమైన ఒక అనుభవం ఉల్లేఖనీయమైనది. శ్రీ గోదావరి మాతాజీ ఆదే శానుసారం సాకోరి ఆశ్రమంలో ప్రతిష్ఠించటానికి అందమైన వినాయకుని
విగ్రహం సిద్ధం చేయటం జరిగింది. ఆ విగ్రహాన్ని సభామండపంలో ప్రతిష్ఠించారు.గిర్ గాంవ్ ముంబయ్ వాస్తవ్యుడైన సుప్రసిద్ధ శిల్పి ఖాన విల్కర్ ఆ మూర్తిని సిద్ధం చేసాడు. దాని వెల సుమారు వేయిరూపాయలు తాను చెల్లించాలని బజాన్ కోరిక. ఆ విషయం ఆయన శ్రీ గోదావరిమాతాజీకి కూడా నివేదించాడు. విగ్రహం సిద్ధమై మూల్యం చెల్లించవలసిన సమయానికి బజాన్ తన సోదరుని కుమారుడు డాలీకి వెంటనే డబ్బు పంపించవలసిందని ఉత్తరం వ్రాసాడు. కాని ఆనుకోని చిక్కుల్లో తగుల్కొవటం చేత, డాలీ ముందుగా మాట యిచ్చిన ప్రకారం డబ్బు పంపలేకపోయాడు.దాని మూలంగా తన మాట నిలుపుకోలేక పోయినానే అని బజాన్ చాలా బాధపడ్డాడు.. ఈలోగా ఒక చిత్రం జరిగింది.ఎప్పుడో వేయిరూపాయలు అప్పు తీసుకున్న ఒకాయన వచ్చి డాలీకి తిరిగి యిచ్చిపోయాడు. డాలీ వెంటనే ఆమొత్తం తన పినతండ్రి బజాన్ కు పంపించాడు. బజాన్ ఆందోళన తొలగిపోయి మనసు కుదుట పడింది. సోదరుని కొడుకు వ్రాసిన ఉత్తరం చదువుకొని బజాన్ సంతోష పరవశుడైనాడు ఆపదలో ఉన్న తన భక్తులను శ్రీ గోదావరిమాతాజీ ఏతీరుగా ఆదుకుంటుందో గ్రహించిన బజాన్ కన్నుల్లో ఆనందాశ్రువులు ఊరాయి.తన పరువుదక్కించిన శ్రీ గోదావరి మాతకు చేతులు జోడించి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

శ్రీ గోదావరి మాతాజీ జీవితంలో 1965వ సంవత్సరం మహత్వ పూర్ణమైన సంవత్సరం. అది శ్రీ గోదావరిమాతాజీ తమ 59వ సంవత్సరం లో అడుగు పెట్టిన సంవత్సరం. ఆ సంవత్సరమే వారి స్వర్ణోత్సవాలు జరిగినవి. ఈ ఉత్సవాలు జనవరి 7నాడు ప్రారంభమై వారం రోజులు అనగా జనవరి 15 తేది వరకు జరిగాయి. తీరుతీరుల కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా సువ్యవస్థితంగా జరిగాయి. శ్రీ గోదావరిమాతాజీకి దీర్ఘాయురారోగ్యాలు కోరుతూ పండరి, గాణగాపురం, ఆళంది, కొల్లాపురం, తిరుపతి, శివానందా శ్రమం, ఆనందాశ్రమం, రమణాశ్రమం వంటి పుణ్యక్షేత్రాలలో ఆరాధనలు, ప్రార్థనలు జరిగినవి. జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు సందేశాలు ఎక్కువ ధార్మిక కేంద్రాల నుండి, మహాపురుషులు నుండి వచ్చయి. సందేశాలు పంపిన పురుషుల్లో నారేశ్వర వాస్తవ్యులు శ్రీరంగ అవధూత, మోఝరీ వాస్తవ్యులు శ్రీ తుక్డోజీ మహారాజు ముఖ్యులు.

కార్యక్రమాలు గురువులకు గురువైన శ్రీ షిర్డీ సాయిబాబా మందిరానికి కన్యకలు భక్తులు కలసిచేసిన డిండి యాత్రతో ప్రారంభమైనవి. ఈ డిండి
యాత్రలో లెక్కలేనంతమంది భక్తులు చేరారు. తాళమృదంగ వాద్యాలు తోడుగా సంకీర్తనం చేసుకుంటూ బయలుదేరిన ఈ యాత్ర కన్నుల పండుగగా హృదయరంజకంగా సాగింది. ఈ వారమంతా ప్రతిరోజు వివిధ దేవతలను, ఉద్దేశించి వారి ప్రీత్యర్థంగా హవనములు జరిగాయి. మందిరంలో శ్రీమద్భాగ వతం, జ్ఞానేశ్వరి, దాసబోధవంటి పవిత్రగ్రంథాల పారాయణాలు, నామసప్తాహాలు జరిగాయి. ఉత్సవాల సమయంలో అందరూ ఆనందవారదిలో ఓలలాడారు. వ్యాస భువ, లోహొనేర్కర్ బువ, పారఖి బువ వంటి గొప్ప హరిదాసుల కీర్తన కార్యక్రక్రమాలు జరిగాయి. శ్రీ పూజాంగారి భక్తి సంగీత కార్యక్రమం, పండిత భీమ సేనజోషిగారి గాంధర్వగానపు విందు జరిగింది. మహాపురుషుల జీవితాలకు సంబంధించిన సినిమాలు చూపించసారు. స్త్రీలు పురుషులు సామూహికంగా సత్యనారాయణ పూజను పెద్దయెత్తున చేసారు.

పుష్యశుద్ధ అష్టమి జనవరి 11వ తేదీ రోజున భక్తులందరూ కుతూహలంతో ఎదురుచూస్తున్న శ్రీ గోదావరి మాతాజీ పవిత్రజయంత్యుత్సవం ఆనందోత్సాహాలతో మహా వైభవంగా జరిగింది. శ్రీ గోదావరిమాతాజీకి దీర్ఘాయురారోగ్యాలు సంప్రాప్తించవలెనని కన్యకలు వేదమంత్రాలు పఠించిచారు. రజత పేటికలో అమర్చిన సన్మానపత్రం శ్రీ గోదావరిమాతాజీకి సమర్పించారు. దానిని ఆంగ్లం, హిందీ, మరాఠీ: గుజరాతీ భాష లలో చదివి వినిపించారు. తీపి పదార్థాలతో శ్రీ గోదావరిమాతాజీకి తులాభారం జరిపి వాటిని భక్తులకు పంచారు. ఆ ఉత్సవాలు దర్శించిన అశేషక సందోహం ఆనందవారిలో తేలియాడింది. ఆనాటి జ్ఞాపకాల పరిమళాలు ఇప్పటికీ భక్తుల హృదయాల్లో గుబాళిస్తునే ఉన్నవి.

స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని ప్రచురించిన Flowers at the Lotus Feet అనే స్మారికకు శ్రీ గోదావరిమాతాజీ ఇచ్చిన సందేశం గమనించదగినది.

"ఈనాడు ఏ మహోద్దేశంతో ఈ ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్నారో.... అది ఈనా పార్థివదేహపు గొప్పదనాన్ని కీర్తించేదిగా కాక శ్రీ ఉపాసనిబాబావారి నైషిక భక్తుల మహత్వాన్ని పరిచయం చేసేదిగా భావిస్తాను. ఈ మహాసంస్థను స్థాపించిన ఆ మహాపురుషుడే ఇదంతా జరుపుతున్నారు కనుక ఇది ఆ పరమ పూజ్యుడూ భక్తవత్సలుడూ ఐన ఉపాసని బాబావారి తపశ్చర్యనూ సమర్థ వైభవాన్ని సన్మానించటం గౌరవించటం ఔతుందే కాని నన్ను కాదు."

11వ అధ్యాయం సంపూర్ణం