సర్వం శ్రీసాయి......

షిర్డీకి ఐదు కిలోమీటర్ల దూరాన సాకోరలో శ్రీ ఉపాసనీ బాబావారి ఆశ్రమం కన్యాకుమారిస్థానం ఉన్నది. శిరిడి సాయిబాబా తన ఆధ్యాత్మిక శిష్యు లను తనంతవారుగా చేస్తారనటానికి శ్రీ ఉపాసనీబాబా చరిత్రం తార్కాణం. శ్రీ ఉపాసనీబాబా సాకోరిలో కన్యాకుమారి స్థానం నెలకొల్పి ఈ శతాబ్దం పూర్వ భాగంలో గొప్ప ఆధ్యాత్మిక విప్లవం సాధించినారు. శ్రీ ఉపాసనీ మహారాజులు తమ శిష్యాగ్రణి శ్రీ గోదావరి మాతను తమంతవారిని చేసి ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు అప్పగించిపోయినారు. శ్రీ గోదావరిమాత నేతృత్వంలో సాకోం కన్యా కుమారి స్థానం ఆర్ధసంస్కృతికి, వైదిక ధర్మానికి, భారతీయ స్త్రీత్వపావిత్యా నికి ఆదర్శసంస్థగా అభివృద్ధి పొందినది. ఆశ్రమంలో ఉండే బ్రహ్మవాదిను లైన కన్యకలు చేసే సాధన అమోఘం. వారు త్యాగానికి ప్రేమకూ భక్తికీ ప్రతీకలు.

సర్వం శ్రీసాయి
శ్రీ గోదావరి మాత చరిత్ర
మొదటి భాగం

మహారాష్ట్ర ప్రాంతంలో ఆహ్మదునగర్ జిల్లాలో సాకోరి అనే ఒక చిన్న గ్రామం ఉంది. శ్రీ సాయిబాబా వారి మూలంగా షిర్డీకి పేరు, ప్రఖ్యాతి వచ్చినట్లే శ్రీ ఉపాసనీ బాబా మూలంగా సాకోరికి పేరు,ప్రఖ్యాతులు వచ్చయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీ ఉపాసనీ బాబా వంటి సిద్ధపురుషులు పాదాలు సోకటంచేత ఆ నేల భాగ్యం పండింది.

శ్రీ ఉపాసనీ బాబా నాసిక్ జిల్లా సటానా గ్రామంలో 15.5.1870 లో జన్మించారు.వారు పుట్టిన ఆ ఉపాసనీవంశంలో ఆచారపరాయణులు, ధర్మనిష్ఠాగరిష్ఠులు, సంస్కృతీ సంపన్నులు, పుణ్యాత్ములు, తాపసులు అనేక మంది జన్మించారు. శ్రీ ఉపాసనీ బాబాకు చిన్నప్పటినుండే ఆధ్యాత్మిక చింతన అంటే ఎక్కువ ఇష్టం. ఆయన సదా ఆత్మధ్యానంలో నిమగ్నులై ఉండేవారు. ఆత్మ సాక్షాత్కారం కోసం బాగా తపనపడి వారు చిన్నప్పుడే ఇల్లు వాకిలి విడిచి పెట్టి తపస్సుకోసం వెళ్లిపోయారు. సద్గురువును వెదుకుతూ తిరుగు తుండగా ఆయనకు షిర్డీలో సాయిబాబా తారసపడ్డారు. ఉపాసనీ బాబా షిర్డీలో దాదాపు నాలుగు సంవత్సరాలుండి సాయిబాబాను సేవించారు.షిర్డీ లో ఆయన అనేకబాధలు కష్టాలు పడ్డారు. అగ్నిలో కాలినప్పుడేకదా బంగారం మెరుగు ఎక్కువతుంది. సాయిబాబా అనుగ్రహం వలన సిద్ధావస్థ ప్రాప్తించిన తరువాత ఉపాసనీబాబా శిరిడీ విడిచి పెట్టి ఖర్గపురానికి పోయి అక్కడినుండి నాగ పురం, మీరజ్ పూర్ ప్రాంతాలు తిరిగి చివరికి సాకోరికి చేరారు.సాకోరి గ్రామం బయటి శ్మశానంలోనే వారు ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ మహా పురుషుని ప్రభావంచేతనే ఆశ్మశానం వైకుంఠంగా మారిపోయింది. ఒకప్పుడు దుఃఖితుల ఆర్తనాదాలు ఏడ్పులు ప్రతిధ్వనించిన ఆచోట ఇప్పుడు పరమేశ్వర సంకీర్తనల మంగళరాగాలు వినిపిస్తున్నాయి. అక్కడి వాతావరణమంతా భగవన్నామంతో నిండిపోయింది.

ఆ పల్లెప్రజలు ఉపాసనీ బాబాకోసం ఒక పూరిల్లు నిర్మించినారు. జీవిత మంతా ఆయన గోనెసంచితోనే తమ శరీరాన్ని ఆచ్ఛాదించుకున్నారు. ఉపాసనీ
బాబా అలౌకిక తేజస్సుకు, అద్భుతాకర్షణ శక్తికి, సుగంధానికి తుమ్మెదలు మూగినట్లు, సూదంటురాయికి ఇనుపరజం చేరినట్లు, అన్ని జాతుల, అన్ని ధర్మాల ప్రజానీకం వేలకొలది అకృష్టులైనారు. భారతదేశం నలుమూలలనుండి. ఇట్లా వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ధర్మశాలలు, భవనాలు, మందిరాలు నిర్మాణమైనవి. క్రమంగా శూన్య ప్రదేశంలో ఒక మహా ధార్మిక సాంస్కృతిక కేంద్రం ఆవిర్భవించింది.

అది 1924వ సంవత్సరం, మహాశివరాత్రి పర్వదినకాలం. వివిధ ప్రాంతాల నుండి ఉపాసనీ బాబా దర్శనం కోసం చాలామంది సాకోరికి చేరుకున్నారు. గోదావరి అనే ఒక చిన్నారి కూడ తన తల్లివెంట దర్శనార్థమై వచ్చింది. ఉపాసానిబాబా దర్శనానికి వచ్చేవారు పూలు దూర్వాదళాలు సమర్పించటం పరిపాటి. అందువలన గోదావరి కూడ దూర్వాంకురాలు కోనే ప్రయత్నంలో ఉన్నది. అప్పుడే "ఓ పిల్లా! చెట్టు దగ్గర ఏంచేస్తున్నావు? ఉపసాని బాబా దర్శనానికి పో" అంటూ ఒక మహిళ హెచ్చరించింది. ఆ మహిళ పేరు దుర్గాబాయి కర్మార్కర్. ఆశ్రమం బరువుబాధ్యతలు వ్యవహారాలు ఆమె పర్యవేక్షించేది. ఆమె ఆజ్ఞలేనిదే అక్కడి ఆకైనా కదిలేది కాదు.

చిన్నారి గోదావరి అట్లాగే ఉపసానిబాబా దర్శనంకోసం గుడిసెలోనికి వెళ్ళింది. ఉపాసనీ బాబా ఒక్కరే స్తంభానికి ఒరిగి కూర్చున్నారు. ఆయనచుట్టు పండ్లు, పూలు, కొబ్బరికాయలు పోగులుపడి ఉన్నయి.ఉపాసని బాబావారి తేజస్వంతమైన వ్యక్తిత్వాన్ని చూసి చిన్నారి గోదావరి అయస్కాంతంవలె ఆకృష్టురాలై పరమానందంతో పరవశించింది. ఆయన పాదపద్మాలపై మౌనంగా తన శిరస్సును ఉంచింది. వెంటనే ఉపాసనిబాబా ఒక పూలదండ ఆమె మెడలో వేసి ప్రక్కన కూర్చుండబెట్టుకొని అందరివైపు వేలెత్తి చూపుతూ “ఈ సమస్తమూ నీది. మునుముందు నీవే దీని భారం వహించాలె" అన్నారు.

క్షణం సేపటి తరువాత ఆ పాప ఆనందపారవశ్యంతో గంతులు వేస్తూ తన తల్లి ఉన్న గదికి పరుగెత్తి జరిగినదంతా తల్లికి చెప్పింది.సంతోషంతో ఆనందబాష్పాలు చెక్కిళ్ళ వెంట జారుతుండగా ఆ తల్లి, "సాధు సంతుల మాటల అర్థాలు మనం తెలుసుకోలేము. వారి లీలలు అగమ్యగోచరం" అన్నది.

గోదావరి జరిగినదంతా తన తల్లికి వినిపించగానే ఆమెకు గత జీవితం లోని కొన్ని సంఘటనలు, జ్ఞాపకాలు గుర్తుకు వచ్చయి. గోదావరి చంటి
పిల్లగా ఉన్నప్పుడు ఆమె తాజుద్దీన్ బాబాను దర్శించింది. తాజార్డిన్ బాబా ఆపాప నెత్తిని తట్టి ఆమె ఆధ్యాత్మికొన్నత్యాన్ని గొప్పగా చెప్పరు. సాయిబాబా వలెనే తాజుద్దీన్ బాబా కూడా గొప్ప సిద్దపురుషుడు, ఆయన నాగపురం(నేడు నాగపూర్) శక్కర దర్వాజా వద్ద ఉండేవారు. రఘుజీరావు బోన్ల్సే లే వంటి పెద్దలు ఆ మహానుభావుని సేవించే వారు, సాయి మౌలా అనే యోగి పుంగపుడు కూడ ఆ ప్రాంతంలో ఉండే వారు. ఆయన చిన్నారి గోదావరిని చూచినప్పుడు " ఈ పాపపై భగవత్కటాక్షం సంపూర్ణంగా ఉంది" అని చెప్పారు. గోదావరి పుట్టకముందే శేగాంవ్ గజానన మహారాజు ఆమెను గురించిన భవిష్యద్వాణిని వినిపించినారు. గోదావరి తాత భాస్కరరావు హాతివలేకర్ గజానన మహారాజుగారి యందు సంపూర్ణ విశ్వాసమున్న మహాభక్తుడు. ఒకనాడు సంతోష సమయాన గజానన మహారాజ్ భాస్కరరావుతో "ఒరే నీకు ఇంకొక యోగి ఇచ్చేదేముందిరా : నేనే నీ వంశంలో జన్మించి ఉద్దరిస్తానురా!" అన్నారు. ఇటువంటి తియ్యని జ్ఞాపకాలతో ఆ తల్లి గుండెలు నిండిపోయాయి,ఆమె కన్నులు మున్నీటి కుప్పల సముద్రం అయింది.

సాకోరిలో శాశ్వతంగా ఉండిపోవటానికే వచ్చిందేమో అన్నట్లు గోదావరి మరల తిరిగి వెళ్ళలేదు. రెండు మూడేండ్ల తరువాత పన్నెండేండ్లు నిండగనే పవిత్ర గురుపూర్ణిమ పండుగు నాడు శ్రీ ఉపాసనీ మహారాజు గోదావరికి దీక్ష ఇచ్చి శిష్యురాలుగా తీసుకున్నారు. హారతి పూర్తి అయిన తరువాత శ్రీ ఉపాసనీ బాబా, చుట్టున్న భక్తులతో "రానున్న కొలది సంవత్సరాల్లో ఈ గోదావరి మహిమలు బహిర్గతమై లోకులు ఈమెను ఆదిశక్తిగా గుర్తించారు.సాక్షాత్తు గంగా గోదావరులు ఈ రూపంగా అవతరించినందుకు గాను ఈమె దర్శనమాత్రం చేతనే వేలకొలది మానవులు పునీతులౌతారు. వారి అనేక జన్మల పాపాలు నాశనం ఔతాయి. భూమండలం పైన అవతరించిన సాక్షాద్భగవతి ఈమె" అన్నారు.

మొదటి భాగం సంపూర్ణం.

యే మనుష్యః మాం ఆశ్రతః!
తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!