శ్రీ సాయిబాబా వారి గుఱ్ఱం శ్యామ్ కర్ణ

మనం ద్వారకామాయిలోనికి ప్రవేశించగానే (రాయిపై వున్న) శ్రీ సాయి వారి ఫొటోకి ప్రక్కనే కుడివైపున బాబా గుఱ్ఱం శ్యామకర్ణ విగ్రహం కనపడుతుంది. సాయిబాబా అనుగ్రహం పొందిన ఈ గుఱ్ఱం బాబాకి ప్రీతిపాత్రమైనది. దానికి బాబా అంటే ఎంతో యిష్టం. అలాగే బాబా కూడా దానిని ఎంతో ప్రేమతో చూసుకునేవారు.వాయిసతారా గ్రామంలో సత్కార్(కసమ్) అనే అతడు ఉండేవాడు. అతడు గుఱ్ఱాల వ్యాపారి. అతని వద్దనున్న ఒక అశ్వానికి ఎంతోకాలంగా సంతానం లేదు. 1912వ సంవత్సరంలో అతడు తన గుఱ్ఱాన్ని తీసుకుని శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతడు బాబాతో, “బాబా! ఈ గుఱ్ఱానికి సంతానాన్ని అనుగ్రహించండి” అని అడిగాడు. అప్పుడు బాబా అతనితో,. “నీ గొడ్డు గుఱ్ఱానికి సంతానం కలిగితే నాకిస్తావా?” అని అన్నారు. దానికతడు, “మీ అనుగ్రహంవల్ల దానికి సంతానం కలిగితే, దానికి పుట్టిన మొదటి సంతానాన్ని మీకు బహుమతిగా సమర్పించుకుంటాన”ని విన్నవించుకున్నాడు. అప్పుడు శ్రీ సాయిమహరాజ్ ఆ గుఱ్ఱాన్ని ఆశీర్వదిస్తూ దాని నుదుటిపై ఊదీ రాసి, మరికొంత ఊదీ నీటిలో కలిపి దానితో త్రాగించారు. బాబా అనుగ్రహంతో సంవత్సరంలో ఆ గుఱ్ఱానికి సంతానం కలిగింది. మూడవనెలలో కసమ్ తను చేసిన వాగ్దానం ప్రకారం దానికి పుట్టిన మొదటి సంతానాన్ని శిరిడీ తీసుకునివచ్చి బాబాకు సమర్పించుకున్నాడు. దాని శరీరం గోధుమరంగులో ఉండి, చెవులు నల్లగా ఉండేవి. దాని చెవులు నల్లగా ఉన్న కారణంతో బాబా దానికి ‘శ్యామకర్ణ’ అని నామకరణం చేశారు. దీనిని ‘శ్యామసుందర్’ అని కూడా బాబా పిలిచేవారు. ఈ శ్యామకర్ణ లోగడ షామా నడిపిన పాఠశాల, ప్రస్తుతం ధునికి ఉపయోగించే సమిధలు ఉంచబడుతున్న గదిలో ఉండేది.బాబా శ్యామకర్ణ సంరక్షణ బాధ్యతను శిరిడీ నివాసియైన నానాసాహెబ్ ఖగ్‌జీవాలే(కొన్ని ఆర్టికల్స్‌లో 'తుకారాం' గా చెప్పబడి ఉంది)కి అప్పగించి, “దీనిని బిడ్డలా జాగ్రత్తగా చూసుకో!” అని చెప్పారు. అతను దానికి తర్ఫీదు ఇస్తుండేవాడు. బాబాకు నమస్కారం చేయడం కూడా నేర్పించాడు.ఒకసారి తుకారాం ఎంత బ్రతిమాలినా అది పచ్చగడ్డి మేయకుండా మొండికేసింది. దాంతో అతడు దాని వీపుపై కొట్టాడు. మసీదులో ఉన్న బాబా వెంటనే అతన్ని పిలిపించి, "నా వీపు మీద ఎందుకు కొట్టావ్?” అని అడిగారు. అందుకతడు, “బాబా! నేను మిమ్మల్ని కొట్టడమేమిటి?” అన్నాడు. అప్పుడు బాబా కఫ్నీని పైకెత్తి తమ వీపుమీద వున్న దెబ్బల గుర్తులను చూపించి, “ఆ శ్యామసుందర్‌ని కొడితే నన్ను కొట్టినట్లే” అని చెప్పారు. తుకారాం తన తప్పుకు ఖిన్నుడై బాబాను క్షమాపణ వేడుకున్నాడు. అప్పటినుండి భక్తులందరూ శ్యామకర్ణను ప్రేమతో చూడసాగారు.

సంతానంలేని ఔరంగాబాద్‌కర్ అనే భక్తునికి సాయి అనుగ్రహంతో సంతానం కలుగగా, అతడందుకు కృతజ్ఞతగా బాబాకు రూ.500/-లు దక్షిణ సమర్పించుకున్నాడు. బాబా ఆ డబ్బుతో శ్యామకర్ణకు శాల నిర్మింపచేశారు.

ఆరతి సమయానికి ముందే శ్యామకర్ణ ద్వారకామాయి సభామండపంలోకి వచ్చి (ప్రస్తుతం తాబేలుబొమ్మ ఉన్నచోట, మొదట్లో ఆ స్థలంలోనే బాబా కూర్చునే రాయి ఉండేది.) నిలుచునేది. ఆరతి జరుగుతున్నంతసేపు ఆరతిపాటకు అనుగుణంగా లయబద్ధంగా శిరస్సునూపుతూ, తన కాళ్ళకు కట్టిన గజ్జెలతో శబ్దం చేస్తూ వేడుకగా నాట్యం చేస్తూ ఉండేది. భక్తులు దానికి ఇరువైపులా నిలబడి ఆరతి పాడేవారు. చాలా అరుదుగా, ఆరతి సమయంలో శ్యామకర్ణ కదలకుండా నిశ్శబ్దంగా నిలబడివుండేది. ఆ సమయంలో మౌనంగా దేనినో ఉచ్ఛరిస్తున్నట్లుగా విచిత్రంగా దాని పెదవులు కదులుతూ ఉండేవి. ఆరతి పూర్తికాగానే అది తన ముందుకాళ్ళను ద్వారకామాయి మెట్లపై ఉంచి వంగి బాబాకు నమస్కారం చేసేది. బాబా ముందుగా దాని నుదుటిమీద ఊదీ వ్రాసి ఆశీర్వదించేవారు. తరువాత మిగిలిన భక్తులందరికీ ఊదీ ప్రసాదం ఇచ్చేవారు.

చావడి ఉత్సవానికి కూడా శ్యామకర్ణను పూసల దండలతోను, కాళ్ళకు గజ్జెలతోను, తోకకి అందమైన గుడ్డ కట్టి సుందరంగా అలంకరించేవారు. శ్యామకర్ణ ఉత్సవానికి ముందుగా నాట్యం చేస్తున్నట్లుగా భంగిమలు చేస్తూ చావడి వరకు వెళ్ళేది. బాబా చావడిలోకి ప్రవేశించగానే అది ఆరుబయట బాబావైపుకు తిరిగి ఆరతి అయ్యేవరకు నిలబడివుండేది. ఆరతి కాగానే చావడి ముందున్న ఒక రాతిపై తన కాళ్ళను ఉంచి బాబాకు నమస్కరించేది. ఆ దృశ్యం నిజంగా ఎంతో చూడదగిన దృశ్యం.

బాబా మహాసమాధి అనంతరం శ్యామకర్ణ ప్రతిరోజూ సమాధిమందిరానికి వెళ్లి, కనులవెంట కన్నీరు కారుస్తూ మౌనంగా కొంతసేపు నిలబడేది. అయినప్పటికీ అది ప్రతిరోజూ ఆరతికి వస్తూ చావడి ఉత్సవాలలో కూడా పాల్గొంటూ ఉండేది.

బాబాకు ప్రియమైన ఈ అశ్వం 1945లో మరణించింది. లెండీబాగ్‌లో దత్తాత్రేయుని విగ్రహానికి వెనుక శ్యామకర్ణ భౌతికదేహానికి సమాధి నిర్మించారు. ద్వారకామాయిలో ఉన్న శ్యామకర్ణ విగ్రహాన్ని శిరిడీవాసి శ్రీబాలాసాహెబ్ షుల్ ల్తే సమర్పించారు. శ్రీకె.ఎం. అనబడే అప్పాసాహెబ్ వార్తక్ అనే ఆయన బొంబాయి మరియు యితర ప్రాంతాలలోని పెద్ద పెద్ద కంపెనీలకు ఆడిటర్. ఆయన శ్రీసాయిబాబాకి ప్రీతిపాత్రమయిన శ్యామకర్ణ ఇత్తడి విగ్రహాన్ని సాయి సంస్థాన్ వారికి బహూకరించారు. దానిని లెండీబాగ్‌లో బావి ప్రక్కన అందమైన తిన్నెమీద ప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఈ విగ్రహం దత్త మందిరం వెనుక చిన్న మందిరం వంటి నిర్మాణంలో చిన్న దార్వజాలు ఏర్పాటు చేయండి వుంది.ఆ సుందరమైన విగ్రహం బొంబాయికి చెందిన ప్రఖ్యాత శిల్పి శ్రీకామత్ గారి కళాసృష్టి. గుఱ్ఱం విగ్రహం, దానికి నిర్మించిన తిన్నె కలిపి అయిన ఖర్చు రూ.2,000/-. ఈ ఖర్చునంతా శ్రీ వార్తక్ భరించారు”.

యే మనుష్యః మాం ఆశ్రతః!
తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!