శ్రీసాయిసచ్చరిత్రము
మొదటిరోజు పారాయణము
ఉపోద్ఘాతము


మహారాష్ట్ర రాష్ట్రములోని వారందరికీ శ్రీగురుచరిత్ర సుప్రసిద్ధము. ఆ రాష్ట్రమంతటా దత్తాత్రేయభక్తులు దీనిని చదివిరి. కొందరు దీనిని నిత్యపారాయనము చేసెదరు. దీనిని రచించినవారు సరస్వతీ గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీవల్లభస్వామి యొక్కయు, శ్రీ నరసింహసరస్వతిస్వామి యొక్కయు లీలలను విచిత్రచర్యలను వర్ణింపబడినాయి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్యావతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్త శ్రీ ఎల్.ఆర్. పాంగార్ కర అభిప్రాయము ప్రకారము ఈ రెండు అవతారములు 14, 15 శతాబ్దాలలో వెలెసెను. దాత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి నిజాము ప్రాంతంలో శ్రీమాణిక్యప్రభువును, షోలాపూరు జిల్లాలో శ్రీ అక్కల్ కోట్ కర్ మహారాజ్ గారు, చివరికి ఆహ్మదునగరు జిల్లాలోని షిరిడీలో శ్రీసాయిబాబా. బాబా 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందారు. శ్రీ అక్కల్ కోట్ కర్ మహారాజ్ అవతార పరంపరయే శ్రీసాయిబాబా అని కొందరు భక్తుల నమ్మకము. అయిదవ అధ్యాయములో వేపచెట్టు క్రింద పాదుకలు ప్రతిష్టించిన కథ, ఇరువది ఆరవ అధ్యాయములో చెప్పబడిన హరిశ్చంద్రపితళే అనుభవమును ఈ నమ్మకాన్ని ధృవపరుస్తుంది.

పైన వివరించిన రెండు అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్ర గ్రంథములో 53 అధ్యాయములలో సరస్వతీ గంగాధరు ఎట్లు వర్ణించెనో, అటులనే శ్రీ గోవిందరఘునాథ్ ఉరఫ్ అన్నాసాహేబు దాభోల్కరు (హేమడ్ పంతు) అనువారు శ్రీ సాయిలీలలను 53 అధ్యాయములలో శ్రీసాయిసచ్చరిత్రము ను గ్రంథమున వర్ణించారు. కనుక ఈ శ్రీసాయిసచ్చరిత్రము ఈనాటి గురుచరిత్ర యని చెప్పవచ్చును. పై చేరిత్రాల గురించి ఈ దిగువ వివరించిన అంశములు గమనార్హములు :

1 శ్రీగురుచరిత్రను వ్రాసినవారు కన్నడమువారు కాబట్టి వారికి మరాఠీ బాష బాగా తెలియదు. అయినప్పటికీ వారి ఇష్టదైవము యొక్క ఆశీర్వాదము వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగారు. శ్రీసాయిసచ్చరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీవారు. వారు మహారాష్ట్ర రాష్ట్రంలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు. ప్రసిద్ధిచెందిన ఏకనాథ భాగవతము వారి నిత్యపారాయణ గ్రంధము. శ్రీసాయిసచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో, ఏకనాథ భాగవతములోని ఎక్కువ విషయములు శ్రీసాయిసచ్చరిత్రములో పొందుపరచబడి ఉండటం గమనార్హం. 2 శ్రీగురుచరిత్ర ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉండుటచే దానిని బోధపరచుకొనుట కష్టము. దాని ఆచరణలో పెట్టుట మరింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్యశిష్యులు కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోయారు. శ్రీసాయిసచ్చరిత్ర చరిత్ర అలా వుండదు. అందులోని విషయాలు తేటతెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వాటిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు.

3 శ్రీగురుచరిత్రలో వర్ణించిన విషయాలు అవి జరిగిపోయిన వంద సంవత్సరాలకు వ్రాయబడింది. కాని శ్రీసాయిసచ్చరిత్రములోని కొన్ని లీలలను రచయిత స్వయంగా చూసాడు. శ్రీసాయిబాబా యొక్క అనుమతి పొంది, వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించారు. వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయాలు, లీలలు టూకీగా వ్రాసి ఉంచుకొనేను. 1918వ సంవత్సరంలో సాయిబాబా సమాధిచెందిన తరువాత, శ్రీసాయిలీల మాసపత్రికలో శ్రీసాయిచరిత్రమును కొంచెం కొంచెంగా ప్రకటించారు. శ్రీసాయిసచ్చరిత్ర ఈ విధముగా 1923 నుండి 1929 వరకు శ్రీసాయిలీలలో ధారావాహికంగా ప్రచురించబడి, 1930లో పూర్తిగ్రంథంగా ముద్రింపబడింది. కనుక శ్రీసాయిసచ్చరిత్రమును ప్రస్తుత గ్రంథము అధికారిక మైనది. షిరిడీలో శ్రీసాయిబాబా నశరీరులుగా ఉండగా దర్శించుకోను భాగ్యము లభించని సాయిభాక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము.

శ్రీసాయిసచ్చరిత్రమును అన్నాసాహెబు దాభోల్కర్ కూర్చారు. కాని, ప్రతి అధ్యాయము చివరన శ్రీసాయి ప్రేరణచే 'హేమాడ్ పంతు' చే వ్రాయబడినట్లు ఉన్నది. ఈ హేమాడ్ పంతు ఎవరని పాఠకులు అడగవచ్చు. అన్నాసాహెబు దాభోల్కరు మొట్టమొదటిసారి శ్రీసాయిబాబాను సందర్శించినప్పుడు వారీ బిరుదును దాభోల్కరుకు కరుణించారు. ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదు అతనికి ఇచ్చారో అన్న విషయము రెండవ అధ్యాయములో రచయితే చెప్పారు. అన్నాసాహెబు జీవితచరిత్ర క్లుప్తంగా ఈ విధంగా చెప్పబడింది. గ్రంథరచయిత దాభోల్కరు 1859వ సంవత్సరంలో ఠాణాజిల్లాలోని కేల్వేమాహిము అందు ఒక పేద ఆర్యగౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారి తాతతండ్రులు దైవభక్తి కలవారు. దాభోల్కరు తమ ప్రాథమికవిద్యనూ స్వగ్రామమునందే పూర్తిచేసి, పూణేలో ఐదవ స్టాండర్డ్ వరకు ఆంగ్లవిద్యను అభ్యసించారు. కుటుంబ ఆర్థికపరిస్థితులంట బాగా లేకపోవడంతో వారు పై చదువులు చదవలేకపోయారు. అప్పట్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగం పరీక్షల్లో ఉత్తీర్ణులై సొంత ఊరిలోనే బడిపంతులు ఉద్యోగములో చేరారు. ఆ సమయంలోనే సాబాజీజిల్లాలో మామల్తదారుగా ఉన్న సాబాజీ చింతామణి చిట్ ణీస్ అనువారు వీరి సచ్చీలతను, బుద్ధికుశలతను, సేవానిరతిని చూసి మెచ్చుకొని తలాఠీ అను గ్రామోద్యోగిగా నియమించారు. తరువాత ఇంగ్లీషు గుమస్తాగా వేసారు. తరువాత మామల్తదారు కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించారు. కొంతకాలము అయిన తరువాత అటవీశాఖలో ఉద్యోగిగా నియమించారు. కొన్నాళ్ళకు కరువుకు సంబంధించిన పనులలో ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్ లోని బ్రోచ్ లో నియమితులయ్యారు.ఆయా ఉద్యోగాములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చుట వలన 1901వ సంవత్సరంలో ఠాణాజిల్లాలోని శాహోపూర్ లో మామల్తదారుగా నియమించబడ్డారు. 1903వ సంవత్సరంలో ఫస్టుక్లాసు రెసిడెంటు మెజిస్ట్రేటుగా బాంద్రాలో నియమించబడ్డారు. వారు అక్కడే 1907 వరకు ఉద్యోగం చేశారు. తరువాత ఆయన ముర్బాడు, ఆనంద్, బోర్సదులలో పనిచేసి 1910వ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేటుగా నియమించబడ్డారు. ఈ సంవత్సరంలోనే షిరిడీకి వెళ్ళి శ్రీసాయినాథుని దర్శన భాగ్యము కలిగింది. 1916 వ సంవత్సరంలో వారు ఉద్యోగవిరమణ చేసిన తరువాత కొన్ని నెలలవరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేశారు. అది కూడా విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి అయ్యేవరకు శ్రీసాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులయ్యారు. బాబా మహాసమాధి అయిన తరువాత షిరిడీ శ్రీసాయిబాబా సంస్థానమును,1929వ సంవత్సరలో తాను మరణించేవరకు ఎంతో చాకచక్యంగా నడిపారు. ఆయనకీ భార్య, అయిదుగురు కుమార్తెలు. బిడ్డలకు తగిన సంబంధములు దొరికాయి. అందరూ క్షేమముగా ఉన్నారు.

సాయిబాబా ఎవరు?

సాయిబాబా ఎవరు? అన్న ప్రశ్నకు మూడు విధాలుగా సమాధానము చెప్పవచ్చును.

1 దీర్ఘాలోచన చేయకుండా, విషయముల గురించి గాని, మనుష్యులను గురించి గాని అభిప్రాయము అభ్యసించినవారు సాయిబాబా ఒక పిచ్చి ఫకీరని, వారు షిరిడీలో శిథిలమై పాడుబడిన మసీదులో అనేక సంవత్సరములు నివశించారని, ఇష్టము వచ్చినట్లు మాట్లాడుతూ, తనను దర్శింప వచ్చినవారి నుంచి దక్షిణ రూపంలో ధనము వసూలు చేస్తున్నారని చెప్పేవారు. ఈ అభిప్రాయము తప్పు! ఆర్.ఏ.తర్ఖడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనం తరువాత బాబా వద్ద శెలవు తీసుకుని బొంబాయి తిరిగి వెళ్ళేటప్పుడు కంటతడిపెట్టుకున్నారు. అప్పుడు బాబా అతనితో ఇట్లు చెప్పెను పిచ్చివానివలె ప్రవర్తించుచున్నావేమీ? నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా?'' దానికి తర్ఖడ్ గారి మిత్రుడు ఇలా జవాబిచ్చాడు నాకా విషయము తెలియదు. ఎందుకంటే, మీరు బొంబాయిలో నాతొ ఉన్నట్లు నాకు అనుభవము లేదుకదా?'' దానికి బాడా ఇలా చెప్ప్పారు ఎవరయితే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుంటారో వారు బాబాను నిజంగా గ్రహింపలేరు తెలుసుకో''

2 కొందరు సాయిబాబాను మహాసిద్ధపురుషుడని అన్నారు. మహమ్మదీయులు బాబాబు తమ పీరులలో ఒకరిగా భావించారు. హిందువులు బాబాబు తమ మహాత్ములలో ఒకరిగా గ్రహించారు. ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను 'సంతచూడామణి'గా పేర్కొంటారు. ఈ అభిప్రాయము కూడా సరైనది కాదు.

3 శ్రీసాయిబాబాను సన్నిహితముగాను, వాస్తవముగానూ సేవించిన వారు మాత్రము బాబాను భగవదవతారముగా ఇప్పటికీ భావించుచున్నారు. దీనికి నిదర్శనాలు ... 1బి.వి. నరసింహస్వామిగారు రచించిన 'బాబా సూత్రములు-పలుకులు' అను గ్రంథమునాకు పీఠికలో ఇండోరు హైకోర్టు జడ్జిగారు యమ్.బి.రేగేగారు ఇలా రాసారు బాబా నాశరీరులుగ ఉన్నప్పుడు, వారొక రూపుదాల్చిన భాగాత్స్వరూపముగా తమ భక్తులకు భాసిల్లుతూ, తమ లీలాప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింప చేయుచుండెడివారు. వారి నశ్వరమైన దేహము మాయమైపోయినది గాని, దానిలో అప్పుడుండిన 'బాబా'మాత్రము ఇప్పటికీ అనంతశక్తివలె నిలిచి, వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు'' 2 శ్రీ బి.వి. నరసింహస్వామిగారు రచించిన 'భక్తుల అనుభవాలు'' అన్న పుస్తకములోని మొదటి పేజీలో ఉత్తరభారతదేశంలో ఉన్న ఒక హైకోర్టు జడ్జి గారు ఇలా వ్రాసారు ... నేను సాయిబాబాను సృష్టిస్థితిలయకారుడుగా భావిస్తాను. 1918వ సంవత్సరంలో వారు సమాధి చెందకముండు నేను అలా భావించాను. ఇప్పటికీ నేను అలాగే భావిస్తున్నాను. నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవశరీరము మా కనులముందు సంచరిస్తూ ఉండేది. ఒక్కొక్కప్పుడది మా దృష్టిని విశేషంగా ఆకర్షించేది. కాని ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రము వారి అనంతతత్వమే. శాశ్వతము - అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబమువలె వారు మాకు దర్శనమిచ్చేవారు. అశాశ్వతమైన తమ మానవదేహము ఒక్కొక్కప్పుడు మా ముందర తళుక్కుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై 'సాయిబాబా' అను శాశ్వతమైన అనంతశక్తి మాత్రము నిలిచి ఉన్నది.''

3 బి.వి. నరసింహస్వామిగారు రచించిన 'భక్తుల అనుభవాలు' గ్రంథములో 19-20 పుటలలో ఆచార్య జి.జి.నార్కే, (యం.ఏ.య,.ఎస్.సి., పూనా ఇంజనీరింగ్ కాలేజీ) ఇలా చెప్పారు ... ఇంటివద్ద నిత్యమూ నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబాను ఒకరిగా ఉంచాను. సాయిబాబా భగవంతుడు ఆయన సామాన్య సత్పురుషుడు కాదు. మా మామగారైన శ్రీమాన్ బూటీ, నా భార్య, నా తల్లి గొప్ప సాయిభక్తులు. వారు సాయిబాబాను భగవంతునిలా పూజించేవారు. నేను కొత్తగా షిరిడీకి వెళ్ళినప్పుడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోద్రిక్తుడై ఉన్నారు. ఆకారణముగా వారు కోపగించుచు, శపించుచు, భయపెడుతూ ఉండేవారు. ఆయన పిచ్చివాడా అని అనుమానము నా మనస్సులో కదిలింది. మామూలుగానే హారతి పూర్తి అయ్యింది. ఆరోజు సాయంకాలం నేను బాబా పాదములను నొక్కుతున్నాను. అప్పుడు బాబా ప్రేమగా నా తల నిమురుతూ 'నేను పిచ్చివాడిని కాదు' అని అన్నారు. ఎంత ఆశ్చర్యం! నేను హృదయంలో అనుకున్నది బాబా గ్రహించారు. వారికి తెలియకుండా మనము ఏ రహస్యాలను దాచలేము. వారు సత్వంతర్యామి, నా ఆత్మయొక్క అంతరాత్మని నేను అనుకున్నాను. వారు నాతొ మాట్లాడుతున్నప్పుడు నా హృదయంలో కూర్చుంది, మాట్లాడేవాడిలా మాట్లాడారు. నా హృదయములోగల ఆలోచనలను, కోరికలను గ్రహించుచుండెడివారు. వారు నాలో ఉన్న భగవంతుడు. వారే భగవంతుండని నిర్ణయించుకోవడంలో నాకు ఎలాంటి సంకోచము లేదు. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించే వాడిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులని, వారి ఇష్టమొచ్చిన తీరులో సర్వాన్ని సదిపించే వారని నాకు నమ్మకము కలిగేది''

4 రావు బహద్దూర్ యమ్.డబ్య్లు. ప్రధాన్ వ్రాసిన 'షిరిడీ సాయిబాబా అను గ్రంథమునకు ఉపోద్ఖాతములో గౌరవనీయులైన, అమరావతిలో ప్రసిద్ధ వకీలు అయిన దాదా సాహేబు ఖాపర్డే ఇలా చెప్పారు ... శ్రీసాయిబాబా ప్రతి అంతరంగమందు మొదలు ఆలోచనలన్నీ తెలిసిన వారివలె వుండి, వారి కోరికలు తీర్చుచూ సుఖసంతోషములు కలుగజేసేవారు. ఆయన భూమిపై నడయాడు దైవమనే భావన కలుగుచుండెను'' 5 దాసగణు మహారాజు తమ 'స్తవన మంజరి' అను స్తోత్రములో సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను, నిర్మలమైన అంతరాత్మగానూ నిత్యశాంతమూర్తిగానూ వర్ణించారు. 6 హేమాడ్ పంతు శ్రీసాయిసచ్చరిత్రము యొక్క మొదటి అధ్యాయములో సాయిబాబాను గోధుమలు విసిరే ఒక వింత యోగిగా వర్ణించారు. కాని రాను రాను బాబాతో సంబంధము పెరిగిన కొలదీ, బాబాబు భగవంతుడని, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడని చెప్పారు. 7 షిరిడీ భక్తులందరూ, ముఖ్యముగా మాధవరావు దేశపాండే వురఫ్ శ్యామా అనువారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులన్దరితో కలిసిమెలిసి తిరిగేవాడు, ఆయనెప్పుడూ బాబాను 'దేవా' అని సంబోధించేవారు. ఈ భక్తులందరి అభిప్రాయాలను తెలుసుకొని, వారు చెప్పినదానిలోని యదార్థము గ్రహించి శ్రీసాయి అవతారపురుషుడని భావించెదను గాక! ఉపనిషత్ ద్రష్టలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అను సత్యమును దర్శించిరి. బృహదారణ్యక, ఛాందోగ్య, కఠ, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వవస్తు సముదాయమైన ప్రకృతి అంతయూ భగవంతుని రచన అనియు, అది అంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించెడి భగవంతునిచే, వ్యాపింపబడి ఉన్నదనియు వక్కానించుచున్నాయి. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీసాయియే! ఈ శ్రీసాయిసచ్చరిత్రమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివినవారు తప్పక ఈ సత్యమును గ్రహించి యదార్థమయిన శ్రీసాయిని దర్శించగలరు!

శ్రీ సాయినాథాయ నమః

ఉపోద్ఘాతము సంపోర్ణము