అవధూత చింతన గురుదేవా దత్త

ముస్లిం ఫకీర్ రూపంలో దర్శనమిచ్చిన దత్తాత్రేయులు.

        మహరాష్ట్ర, అనేకమంది సత్పురుషులు, సంత్ ల
అవధూతలు, మహాత్ములు అవతరించిన పుణ్యభూమిగా ప్రసిద్ధిచెందినది.
ముఖ్యముగా
దత్త సాంప్రదాయము, వార్కరీ సంప్రదాయం, నాధ సంప్రదాయము, సమర్థ రామదాస సంప్రదాయములు ఎంతో అభివృద్ధి చెందిన ఫలితంగా నిత్య పారాయణ గ్రంధాలుగా, శ్రీ గురుచరిత్ర, జ్ఞానేశ్వరీ, దాసబోధ, మనవనాధ సారం వంటి అనేక గ్రంథాలు ఆవిర్భవించాయి.
        దత్త సాంప్రదాయములో ప్రఖ్యాతి చెందిన మహాత్ములలో శ్రీ ఏకనాధ మహరాజ్ ఒకరు. మానవ జీవితములో సద్గురు కృప లేక పారమార్ధిక మార్గం దొరకదని, గమ్యం చేరలేమని‌ తెలుసుకొన్న ఏకనాధుడు తన లక్ష్యసాధనలో తనను దరిచేర్చగలిగిన సమర్ధుడైన గురువు కొరకు తపించగా దైవానుగ్రహంవలన సంత్ జనార్దనస్వామి సాన్నిధ్యం లభించింది.
జనార్దనస్వామి దత్తాత్రేయస్వామి దర్శనం పొందిన సిద్ధపురుషుడు. ఏకనాధునిలో సచ్చీలత భగవద్భక్తి చూసి జనార్దనస్వామి అయనను శిష్యునిగా స్వీకరించాడు.
        తన శిష్యుడైన ఏకనాధునికి దత్తాత్రేయ దర్శనం కలుగచేయాలని ఒకరోజు ఏకనాధుని దౌలతాబాద్ సమీపమున గల "సూర్యకుండ్ " అనే కొండపైగల తన తపోస్థలానికి తీసుకెళ్లాడు జనార్దనస్వామి ." ఈ పవిత్ర ప్రదేశంలో దత్తాత్రేయులువారు సంచరిస్తుంటారు. ఆయన ఏరూపంలోనైనా రావచ్చు. సకలజీవ స్వరూపుడైన ఆయన ఏ రూపంలో వచ్చినా సందేహించక ఆయనను సేవించుకో " అని బోధించాడు ఏకనాధునికి జనార్దన స్వామి ఆపై జనార్దనస్వామి అక్కడ కూర్చోని ధ్యానమగ్నులైనారు. కొద్దిసేపటికి మాసిన దుస్తులతో, మలిన దేహంతో నున్న ఒక ముస్లిం ఫకీర్, కూడా ఒక కుక్క నొకదానిని వెంటబెట్టుకుని అక్కడకు వచ్చారు. అప్పటివరకు ధ్యానములో ఉన్న జనార్దనస్వామి కనులుతెరచి, ఆ ఫకీరును చూసి, ఒక్కసారిగా లేచివెళ్ళి సాష్టాంగ నమస్కారము చేసుకొన్నాడు. ఆ ఫకీరు జనార్దనస్వామిని లేపి ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు.కొంతసేపైన తరువాత ఫకీరు తన చేతిలోని భిక్షాపాత్రను జనార్దనస్వామి చేతికిచ్ఛి, దానిలో తనవెంట వచ్చిన శునకం నుండి పాలు పిండుకు రమ్మన్నారు. జనార్దన స్వామి కుక్క పాలు తీసుకురాగా, ఫకీరు తన భుజానగల జోలె నుండి బాగా ఎండిపోయిన ఒక రొట్టెముక్కను తీసి తన భిక్షా పాత్రలో వేశారు. తరువాత వారిరువురూ ఒకే పాత్రనుండి ఆ పదార్ధాన్ని తినసాగారు. కాస్త దూరాన నిలుచుని జరగుతున్న సంఘటలన్నిటినీ, విభ్రాంతితో చూస్తున్న ఏకనాథుని వారు దగ్గరకి పిలచి తాము భుజించిన పాత్రను శుభ్రం చేసుకుని రమ్మన్నారు. ఏకనాధుడు ప్రక్కనే ఉన్న కొలను దగ్గరకి వెళ్ళి పాత్రకు అంటుకుని అడుగునఉన్న ఆహారపదార్ధంలో కొద్దిగా నీళ్ళుకలిపి ఆ ఉచ్చిష్ఠాన్ని సందేహించక ఒక్క గుటుక్కున తాగేశారు.
తరువాత భిక్షపాత్రను శుభ్రముగా కడిగితెచ్చి ఫకీరు ముందుంచి ఆయనపాదాలకు ప్రణమిల్లాడు.
అంతట ఫకీరు రూపంలోనున్న దత్తాత్రేయస్వామి‌ ప్రసన్నుడై తన తేజోమయ స్వస్వరూపంతో దర్శనమిచ్చారు.
ఆపైన స్వామికి గురుశిష్యులిద్దరూ సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. దత్తాత్రేయస్వామి వారివురి వంకా ప్రేమగా చూస్తూ "జనార్దనా ! నీ‌ ప్రియశిష్యుడైన ఏకనాధుడు భవిషత్తులో జనులను భక్తి మార్గాన్న నడిపించగల భాగవతోత్తముడవుతాడు. సదా ఇతనిపై నా కృపఉంటుంది " అని అశీర్వదించి అంతర్ధానమైయ్యారు.

దత్తభగవానుని లీలలు అనేకం,అనంతం. జనార్దనస్వామికి, ఏకనాథమహారాజ్ కు దర్శనమిచ్చిన పవిత్ర క్షేత్రం, " సూలి భంజన్ ".

ఈ దత్త క్షేత్రము ఔరంగాబాద్ సమీపాన గల ఖులతాబాద్ ప్రాంతంలో గలదు

దిగంబరా దిగంబరా
దత్తాత్రేయ దిగంబరా
దిగంబరా దిగంబరా
అవధూత చింతన దిగంబరా

🙏జై గురుదేవదత్త* 🙏