శ్రీ సాయి-అధ్బుత లీలలు

శ్రీసఖారాం తాత్యాజీ ఔరంగాబాద్‌కర్, అతని భార్య గంగూబాయిలకు బాబా సంతానాన్ని అనుగ్రహించిన
అద్భుత లీల

శ్రీసాయి సచ్చరిత్ర 36వ అధ్యాయంలో శ్రీసఖారాం తాత్యాజీ ఔరంగాబాద్‌కర్, అతని భార్య గంగూబాయిలకు బాబా సంతానాన్ని అనుగ్రహించిన అద్భుత లీల ఇవ్వబడింది. ఆ లీలకు సంబంధించిన పూర్వాపరాలు శ్రీసఖారాం తాత్యాజీ ఔరంగాబాద్‌కర్ మనవడైన దత్తాత్రేయ వాసుదేవ్ ఔరంగాబాద్‌కర్ తెలిపిన వివరాలు:

శ్రీసఖారాం తాత్యాజీ ఔరంగాబాద్‌కర్‌ది సంపన్న కుటుంబం. షోలాపూరులో అందరూ అతనిని ‘సఖ్య హరి’ (శ్రీహరి స్నేహితుడు) అని పిలిచేవారు. అతను పొడవుగా చక్కటి శరీర సౌష్టవాన్ని కలిగి ఉండేవాడు. అతను ధోతి కట్టుకొని, తలపాగా, కోటు ధరించి గంభీరంగా హుందాగా నడిచేవాడు. అతను ధర్మవర్తనుడు. చిన్నవయస్సునుండే విష్ణుసాహస్రనామ పారాయణ చేస్తుండేవాడు.

ఔరంగాబాద్‌కర్ పూర్వీకుల గృహం షోలాపూరులో ఉంది. వంశపారంపర్యంగా ఆ కుటుంబీకులు ఆ గృహమందే నివసిస్తుండేవారు. వాళ్ళు వృత్తిరీత్యా స్వర్ణకారులు. షోలాపూరులోని మంగళవారపేటలో సఖారాంకి ఒక నగల దుకాణం ఉండేది. అతను రెడీమేడ్ ఆభరణాలు తయారుచేయడంలో ప్రసిద్ధుడు. ఆ రోజుల్లో ఎవరికైనా తమకు కావలసిన ఆకృతిలో ఆభరణాలు కావాలంటే అందుబాటులో ఉండేవి కాదు. అందువల్ల వాళ్ళు సఖారాం వద్దకు వచ్చి, తమకు కావలసిన రీతిలో ఆభరణాలు తయారుచేసి ఇవ్వమని అడిగేవారు. అతను తనకున్న నైపుణ్యంతో ఆభరణాలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దేవాడు. ఆ రోజుల్లో బ్యాంకులు ఉండేవి కాదు. కాబట్టి నగలను కుదువ పెట్టుకొని డబ్బు ఇచ్చే వ్యాపారం కూడా చేస్తుండేవాడు సఖారాం. అతని గొప్ప వ్యక్తిత్వానికి, నీతి, నిజాయితీలకి తగిన గౌరవం లభించేది. సఖారాం ప్రతిరోజూ సాయంత్రం తన పనులు ముగించుకొని ఇంటికి వచ్చి ఒక ఊయలలో కూర్చొని భక్తిశ్రద్ధలతో విష్ణుసహస్రనామం పఠించేవాడు.

గంగూబాయికి సఖారాంతో వివాహమై ఇరవై ఏడు సంవత్సరాలైనా వారికి సంతానం కలగలేదు. ఆ రోజుల్లో భార్యకి పిల్లలు పుట్టకపోతే భర్త మరో వివాహం చేసుకోవడం సర్వసాధారణమైన విషయం. సఖారాం కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ బిడ్డకి విశ్వనాథ్ అని పేరు పెట్టారు. గంగూబాయి సంపన్నుల ఇంటి కోడలిగా విలువైన దుస్తులు, ఆభరణాలు ధరించినప్పటికీ తాను తల్లిని కాలేకపోతున్నందుకు లోలోపల చాలా బాధపడుతుండేది. ఆ కాలంలో సంతానం లేని స్త్రీలను సమాజానికి శాపమని భావించి, వారిని ‘గొడ్రాలు’ అని అవమానపరుస్తూ చాలా క్రూరంగా చూస్తూండేవాళ్లు. పర్యవసానంగా, సంపదలెన్ని ఉన్నప్పటికీ గంగూబాయి ఎప్పుడూ దిగులుగా ఉంటుండేది. చివరికి తన వ్యధ తీర్చమని ఆమె దైవాన్ని ఆశ్రయించింది. వారి ఇంటిముందు ఒక రామాలయం ఉండేది. గంగూబాయి ఎక్కువ సమయం రాముని ప్రార్థిస్తూ అక్కడే గడిపేది. పవిత్రమైన శ్రావణమాసంలో శివుడికి రుద్రాభిషేకం, శివలింగానికి బిల్వపత్రాలతో సహస్రనామార్చన చేసి, మాసాంతంలో భారీ ఎత్తున అన్నదానం చేయించేది. ప్రతి పౌర్ణమినాడు తన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసేది. ఆ కుటుంబీకుల కులదేవత రేణుకాదేవి. గంగూబాయి అర్థరాత్రి వేళ మాహుర్‌గడ్ శిఖరానికి వెళ్లి, ఆ చీకటిలో తన చేతికి తగిలిన తొలిరాయిని ఇంటికి తీసుకొచ్చి, దానికి కాషాయరంగు వేసి, బంగారంతో తయారుచేసిన కళ్ళు, చెవులు, ముక్కు అమర్చి, ఆభరణాలతో అలంకరించి దేవతోపాసన చేస్తుండేది. నేటికీ ఇవి ఔరంగాబాద్‌కర్ ఇంట సంప్రదాయంగా జరుగుతున్నాయి. ఇన్ని ఆచారాలతోపాటు ఉపవాసాలు, మ్రొక్కులు మొదలైనవన్నీ చేసిన తరువాత కూడా గంగూబాయికి సంతానం కలగలేదు. ఏ దేవతలూ తనపై కరుణ చూపి సహాయం చేయకపోవడంతో ఆమె సాధుసత్పురుషలను ఆశ్రయించసాగింది. ముందుగా హుమ్నాబాద్ సందర్శించనారభించి అక్కడి మాణిక్యప్రభు సంస్థాన్‌లో సేవ చేసింది. తరువాత షోలాపూరుకి సమీపంలో ఉన్న అక్కల్కోట వెళ్లి భక్తితో ఎంతో సేవ చేసింది. కానీ తన కోరిక నెరవేరలేదు.

ఇలా కాలం గడుస్తుండగా, ఒకసారి దాసగణు షోలాపూరులో కీర్తన చేశాడు. ఆ కీర్తన కార్యక్రమానికి గంగూబాయి, ఆమె కుటుంబం హాజరయ్యారు. బాబా యొక్క దైవత్వం గురించి, భక్తుల కోసం బాబా చేసిన అనేక లీలల గురించి, బాధితులపట్ల వారి కరుణ గురించి దాసగణు ఎంతో మనోరంజకంగా చేసిన కీర్తన ఆమెపై తీవ్రప్రభావాన్ని చూపి, ఆమె మనసు బాబాపట్ల విశ్వాసంతో నిండిపోయింది. కీర్తన ముగిసిన తర్వాత ఆమె దాసగణుని కలిసి బాబా గురించి వివరాలు అడిగింది. ఆమె గురించి తెలుసుకున్న దాసగణు, “శిరిడీ వెళ్లి బాబా పాదాల వద్ద సాష్టాంగపడు. నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది” అని భరోసా ఇచ్చాడు. ఆమె క్షణమైనా ఆలస్యం చేయకుండా శిరిడీ వెళ్ళడానికి భర్త నుండి అనుమతి తీసుకొని, తన సవతి కొడుకు విశ్వనాథ్‌ను తోడుగా వెంటబెట్టుకొని బాబా దర్శనానికి ప్రయాణమైంది

శిరిడీ చేరుకున్న గంగూబాయి మసీదులో బాబా ఒంటరిగా ఉన్నప్పుడు దర్శించుకుని తన మనసులోని కోరికను తెలుపుకోవడానికి ఎంతగానో ప్రయత్నించింది. కానీ బాబా వద్ద ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటుండటంతో తన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. దాంతో ఆమె, “బాబాతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం నాకెప్పుడు వస్తుంది? వారికి నా మనోగతాన్ని ఎలా తెలియజేయాలి?” అంటూ చింతించసాగింది. గంగూబాయి, విశ్వనాథ్‌లిద్దరూ బాబా సేవ చేసుకుంటూ శిరిడీలో రెండు నెలలున్నారు. చివరికి ఆమె షామా సహాయం కోరి అతనితో తన మనోగతాన్ని చెప్పి, “బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి సమయం చూచి మీరైనా నా మనసులోని కోరికను బాబాకు విన్నవించండి. అది కూడా బాబా చుట్టూ భక్తులు లేనప్పుడు, వారు ఒక్కరే ఉన్నప్పుడు ఎవరూ వినకుండా చెప్పాలి” అని వేడుకుంది. అప్పుడు షామా ఆమెతో, “ఈ మసీదు ఏ సమయంలోనూ ఖాళీగా ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు బాబా దర్శనానికి వస్తూనే ఉంటారు. ఈ సాయి దర్బారు ఎల్లప్పుడూ తెరచే ఉంటుంది. ఇక్కడ ఎవరికీ ఏ ఆటంకమూ లేదు. అయినా ఒక మాట చెప్తాను గుర్తుంచుకో! ప్రయత్నించటం నా పని, ఫలితాన్నిచ్చేది మాత్రం కీర్తిదాత, మంగళప్రదుడు అయిన బాబానే! చివరకు సుఖాన్ని కలిగించేది వారే. కనుక నీ చింత ఉపశమిస్తుంది. బాబా భోజనానికి కూర్చున్నప్పుడు, నీవు ఒక టెంకాయను, అగరువత్తులను చేతపట్టుకుని, సభామండపంలో రాతిమీద కూర్చో! బాబా భోజనమయ్యాక, వారు ఉల్లాసంగా ఉన్నప్పుడు చూసి నేను నీకు సైగ చేస్తాను. అప్పుడు నువ్వు పైకి రా!” అని చెప్పాడు. షామా చెప్పినట్లే గంగూబాయి వేచి ఉండగా శుభఘడియ రానే వచ్చింది.

ఒకరోజు బాబా భోజనం పూర్తిచేసి తమ చేతులు కడుక్కున్న తరువాత షామా వస్త్రంతో వారి చేతులు తుడవసాగాడు. అప్పుడు బాబా ప్రేమోల్లాసంతో షామా బుగ్గను గిల్లారు. అప్పుడు భగవంతునికి, భక్తునికి జరిగిన ప్రేమ సంవాదాన్ని వినండి! మాధవరావు వినయ సంపన్నుడైనప్పటికీ కోపాన్ని నటిస్తూ, బాబాతో సరదాగా, “ఇది మంచి లక్షణమేనా? ఇలా గట్టిగా బుగ్గ గిల్లే చిలిపి దేవుడు మాకవసరం లేదు. మేమేమన్నా మీపై ఆధారపడ్డామా? మన స్నేహానికి ఇదేనా ఫలితం?” అని అన్నాడు. బదులుగా బాబా, “డెబ్భైరెండు జన్మల నుండి నువ్వు నాతో ఉన్నప్పటికీ నేనెప్పుడైనా నీపై చేయి వేశానా? బాగా గుర్తు తెచ్చుకో!” అని అన్నారు. అప్పుడు షామా, “మాకు ఎప్పుడూ తినటానికి మంచి క్రొత్త క్రొత్త మిఠాయిలను ఇచ్చే దేవుడు కావాలి. మాకు మీ గౌరవమర్యాదలో లేదా స్వర్గలోక విమానాలో అవసరం లేదు. మీ చరణాలయందు ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉండేలా కరుణించండి. అంతే! ఇంత మాత్రం చాలు” అని అన్నాడు. అందుకు బాబా, “అందుకోసమేగా నేను ఇక్కడికి వచ్చింది. మీకు భోజనం పెట్టి పోషిస్తున్నాను. నాకు మీపై ప్రేమ కలిగింది” అని అన్నారు. తరువాత బాబా వెళ్ళి తమ ఆసనంపై కూర్చోగానే, షామా గంగూబాయికి సైగ చేశాడు. ఆ శుభసమయం కోసమే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న గంగూబాయి వెంటనే లేచి గబగబా మెట్లెక్కి బాబా ఎదుటికి వచ్చి వినమ్రంగా నిలుచుని, వారికి కొబ్బరికాయను అర్పించి, వారి పాదపద్మాలకు వందనం చేసింది. బాబా ఆ కొబ్బరికాయను తమ చేతులతో గట్టిగా కఠడాపై కొట్టి, “షామా! ఈ కొబ్బరికాయ బాగా చప్పుడు చేస్తుంది. ఇది ఏమంటోంది?” అని అన్నారు. షామా ఆ అవకాశాన్ని అందుకుని, “తన గర్భంలో కూడా ఇట్లే చప్పుడు అవ్వాలని ఈ స్త్రీ తన మనసులో కోరుకుంటోంది. ఆమె కోరిక తీరాలి. ఆమె మనసు మీ చరణాలయందు లగ్నమవ్వాలి, ఆమె సమస్య తీరుగాక! ఆమెననుగ్రహించి కొబ్బరికాయను ఆమె ఒడిలో వేయండి. మీ ఆశీర్వాదంతో ఆమె కడుపు పండి కొడుకులు, కూతుళ్లూ కలుగుతారు” అని అన్నాడు. అప్పుడు బాబా అతనితో, “కొబ్బరికాయలతో పిల్లలు కలుగుతారా? ఇలా వెఱ్ఱిగా ఎందుకనుకుంటారు? జనానికి పిచ్చిపట్టినట్లు అనిపిస్తోంది” అని అన్నారు. అందుకు షామా, “మాకు తెలుసు. మీ మాటల ప్రభావంతో పిల్లలు వరుసగా పుడతారు. మీ మాటలు అంత అమూల్యమైనవి. కానీ ఇప్పుడు మీరు భేదభావంతో ఆశీస్సులు ఇవ్వకుండా ఊరికే కూర్చుని వృథా మాటలు చెప్పుతున్నారు. ఆమెకు కొబ్బరికాయను ప్రసాదంగా ఇవ్వండి” అని అన్నాడు. తరువాత, “కొబ్బరికాయను పగులగొట్టు” అని బాబా అంటే, “కాదు, ఆమె ఒడిలో వేయండి” అని షామా.. ఇలా కొంతసేపు బాబా, షామాల మధ్య వాదులాట జరిగాక షామా ప్రేమకు లొంగిపోయిన బాబా, “సరే, ఆమెకు బిడ్డలు కలుగుతారు, వెళ్ళు” అని అన్నారు. “ఎప్పుడో చెప్పండి” అని బాబాను నిలదీసి అడిగాడు షామా. “పన్నెండు మాసాల అనంతరం” అని బాబా చెప్పారు. షామా కొబ్బరికాయను పగులకొట్టాడు. సగం కాయను ఇద్దరూ తిని మిగిలిన సగాన్ని గంగూబాయికి ఇచ్చారు. షామా ఆ స్త్రీతో, “నా మాటకు నీవే సాక్షివి. ఈరోజు నుండి పన్నెండు మాసాల లోపు నీ కడుపుపండి సంతానం కలగకపోతే నేనేం చేస్తానో విను. వీరి తలపై ఇలాగే కొబ్బరికాయను కొట్టి, ఈ దేవుణ్ణి మసీదు నుండి తరిమివేయకపోతే నా పేరు మాధవరావు కాదు. ఇటువంటి దేవుణ్ణి ఇక మసీదులో ఉండనివ్వనని ఖచ్చితంగా చెప్పుతున్నాను. నీకు తప్పక అనుభవం కలుగుతుందని తెలుసుకో” అని చెప్పాడు. అతని ధైర్యవచనాలను విన్న ఆ స్త్రీ ఎంతో సంతోషించి బాబా చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి నిశ్చింతగా తన గ్రామానికి వెళ్లిపోయింది.

పన్నెండు మాసాలు గడిచేసరికి బాబా నోటిమాట ఫలించింది. శిరిడీ నుండి తిరిగి వచ్చిన మూడు మాసాలకు గంగూబాయి గర్భం దాల్చి, 1911లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబా ఆశీర్వాదఫలంగా పుట్టిన ఆ బిడ్డ పూర్ణ ఆరోగ్యంతో, గులాబీ వర్ణంలో ఎంతో అందంగా ఉన్నాడు. బిడ్డను చూస్తూ, ‘ఎట్టకేలకు తాను తల్లినైనా’ననే ఆనందంలో మునిగిపోయింది గంగూబాయి. ఆమెతోపాటు చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందించారు. బాబా వరప్రసాదంగా జన్మించిన తమ బిడ్డకు బాబానే నామకరణం చేయాలని సఖారాం నిర్ణయించాడు. పిల్లాడికి 5 నెలలు వచ్చాక బిడ్డని తీసుకొని సఖారాం, గంగూబాయిలు బాబా దర్శనానికి శిరిడీ వెళ్లారు. బాబా ఆ బిడ్డను తమ ఒడిలోకి తీసుకొని, “రామకృష్ణ” అని పేరుపెట్టి ఆశీర్వదించారు. సఖారాం ఎంతో సంతోషంగా బాబాకు 500 రూపాయలు దక్షిణ సమర్పించాడు. బాబా దానిని స్వీకరించలేదు. తరువాత ఆ డబ్బును బాబాకు ప్రియమైన గుర్రం శ్యామకర్ణ కోసం ఒక శాల నిర్మించడంలో ఉపయోగించారు.

1915లో గంగూబాయి మరో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకి ‘వాసుదేవ్’ అని నామకరణం చేశారు. ఆ బిడ్డ పుట్టిన సంవత్సరం తరువాత గంగూబాయి కన్నుమూసింది. పిల్లలిద్దరూ చిన్నవయస్సులోనే తల్లిప్రేమకు దూరమయ్యారు. కానీ కుటుంబంలోని అందరూ పిల్లల్ని బాగా చూసుకున్నారు. ముఖ్యంగా విశ్వనాథ్ భార్య మధురబాయి పిల్లలిద్దరి విషయంలో ఎంతో జాగ్రత్త వహించింది.

సద్గురువు కోరికలు తీర్చే కల్పవృక్షం, కామధేనువుల కంటే అధికం. వారి మాట చాలా శక్తివంతమైనది.

 

© Copyright Sarvam Sree Sai Seva Trust